సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 598వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. నిస్వార్థసేవకు బాబా అనుగ్రహం
  2. బాబా చేయించిన దానం

నిస్వార్థసేవకు బాబా అనుగ్రహం

బెంగళూరు నుండి శ్రీమతి నాగిని తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరాం! సాయిబంధువులందరికీ నా నమస్కారం. నా పేరు నాగిని. మేము బెంగళూరులో ఉంటున్నాము. బాబా అనుగ్రహంతో ఇటీవల నాకు కలిగిన అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనిపించి మీ ముందుకు వచ్చాను. ఒక నెలరోజుల క్రితం మా మరిది హైదరాబాదులో ఉన్న తన తల్లిదండ్రులను చూడటానికి వెళ్ళాడు. తిరిగి అక్కడి నుండి రెండు వారాల క్రితం బెంగళూరుకి వచ్చాడు. ఆరోజు శుక్రవారం. మూడు రోజుల తర్వాత (సోమవారంనాడు) తనకు జ్వరం వచ్చింది. కానీ, తను దానిని కోవిడ్ అని అనుమానించకుండా, ఆ జ్వరం ప్రయాణం వల్ల కలిగిన అలసటతో వచ్చుంటుందని తేలిగ్గా తీసుకుని, విడిగా గదిలో ఒంటరిగా ఉండకుండా ఇంట్లోవాళ్ళతో ఎప్పటిలానే సన్నిహితంగా మెలిగాడు. తనతో తన భార్య (మా చెల్లెలు), వాళ్ల పాప ఉంటారు. మేము కూడా అదే అపార్టుమెంటులో వాళ్ళ ఎదురు ఫ్లాట్ లోనే ఉంటాము. నా స్వంత చెల్లెలు కాబట్టి నేను తన క్షేమం చూస్తూ వాళ్ళింటికి వెళ్తూ వస్తూ ఉంటాను. నాలుగు రోజుల తరువాత శనివారం సాయంత్రం మా మరిదికి గొంతునొప్పి వచ్చింది. అప్పుడు కోవిడ్ వచ్చిందేమోననే అనుమానంతో మావారిని తీసుకుని మణిపాల్ ఆసుపత్రికి వెళ్ళి కరోనా ర్యాపిడ్ టెస్ట్ చేయిస్తే పాజిటివ్ అని వచ్చింది. అదేరోజు సాయంత్రం మా కమ్యూనిటీ సెక్రెటరీకి ఆ విషయం చెప్పాము. అతను మమ్మల్ని హోమ్ ఐసొలేషన్‌లో ఉండమన్నాడు. నేను మా చెల్లెలి కూతుర్ని మా ఇంటికి తీసుకొచ్చాను. ఆ పాపకు 5 సంవత్సరాల వయసు. నేను తనకు స్నానం చేయించడం, నా చేత్తో భోజనం తినిపించడం వంటి పనులు చేశాను. నేను, నా కూతురు కూడా తనతోనే పడుకున్నాము.

సోమవారం మా కమ్యూనిటీలో కరోనా టెస్ట్ క్యాంప్ ప్రారంభించారు. ప్రైమరీ కాంటాక్ట్స్ మేమే కాబట్టి, మావారికి, నాకు, మా పాపకి, మా అమ్మకి, మా చెల్లెలికి, తన కూతురికి మొదటగా కోవిడ్ పరీక్షలు చేశారు. మాకు ర్యాపిడ్ టెస్ట్, RTPCR టెస్ట్ రెండూ చేశారు. ర్యాపిడ్ టెస్ట్ రిజల్ట్స్ వెంటనే అప్పటికప్పుడే చెప్తారు. RTPCR టెస్ట్ రిజల్ట్స్ మాత్రం రెండు రోజుల తరువాత వస్తాయి. ర్యాపిడ్ టెస్టులో మా చెల్లెలి కూతురికి కరోనా పాజిటివ్ అని డిక్లేర్ అయింది. మిగాతా అందరికీ నెగెటివ్ అని వచ్చింది. ఇంక నాకు RTPCR టెస్ట్ ఫలితాల గురించే ఆందోళన. ఎందుకంటే, మా చెల్లెలి కూతురిని నేను మా ఇంట్లోనే ఉంచుకుని రెండు రోజులు తనతో చాలా సన్నిహితంగా మెలిగాను. తనకు పాజిటివ్ రావటం వల్ల ఇప్పుడు నా కుటుంబమంతా అపాయంలో పడ్డాము. ఒకప్రక్క మేము 31వ తేదీన హైదరాబాదులో గృహప్రవేశం చేసుకోవాలని సన్నాహాలు చేసుకుంటున్నాము. ఇప్పుడిలా జరగటంతో అందరం ఎంతో నిరాశచెందాము.

ఇక్కడే బాబా తన మహిమను చూపారు. నేను పూజామండపం వద్దకు వెళ్ళి బాబాకు నమస్కరించుకుని, “బాబా! అలనాడు మీరు మసీదులో ఉన్నా, అడవులలో ఉన్నా బాయిజామాయి ఎంతో ప్రేమతో మీకోసం భోజనం తీసుకొచ్చేది. ఆమె చేసిన నిస్వార్థసేవకు ప్రతిఫలంగా బాయిజామాయి కుటుంబాన్ని మీరే సర్వదా కాపాడారు. ఈనాడు నేను కూడా నిస్వార్థంగానే నా చెల్లెలి కూతురిని మా ఇంటికి తీసుకొచ్చి ప్రేమగా చూసుకున్నాను. కాబట్టి నన్ను, నా కుటుంబాన్ని కూడా కరోనా బారినుండి కాపాడండి బాబా! మీ అనుగ్రహంతో మా అందరికీ నెగిటివ్ వస్తే నవ గురువార వ్రతం చేస్తాము” అని వేడుకున్నాను.

ఆరోజు సెప్టెంబరు 22వ తేదీ, గురువారం. నేను మహాపారాయణ పూర్తి చేసి, బాబాకు పూజ చేసి, నైవేద్యం (భోజనం) పెట్టి నేనూ భోజనం చేశాను. మధ్యాహ్నం 2.30 గంటలకి వాట్సాప్‌లో మా కమ్యూనిటీ సెక్రటరీ ఒక మెసేజ్ పెట్టారు, “All those who got tested in our community got negative. Just now I spoke to doctor” (మన కమ్యూనిటీలో టెస్ట్ చేయించుకున్న అందరికీ నెగిటివ్ వచ్చింది, ఇప్పుడే డాక్టరుతో మాట్లాడాను) అని. ఆ మెసేజ్ చూస్తూనే నేను, మా కుటుంబమంతా ఎంతో ఆనందించాము. కరోనా సోకకుండా మమ్మల్ని రక్షించటం మాత్రమే కాకుండా, మాతో సన్నిహితంగా మెలిగిన మా స్నేహితులు మా వల్ల నష్టపోకుండా కాపాడినందుకు బాబాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాము. బాబాకు మ్రొక్కుకున్నట్లుగానే ఎంతో ఆనందంగా నవ గురువార వ్రతం మొదలుపెట్టాను. సదా సాయి నామస్మరణ సప్తసముద్రాలను దాటిస్తుంది. ఓం సాయిరాం!


బాబా చేయించిన దానం

విశాఖపట్నం నుండి సాయిభక్తురాలు వల్లి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం శ్రీ సాయిరాం! నా పేరు వల్లి. నేను విశాఖపట్నం నివాసిని. ముందుగా ఈ బ్లాగ్ నిర్వాహకులకు, నా తోటి సాయిబంధువులకు నా ప్రణామాలు. నేను ఇంతకుముందు ఈ బ్లాగ్ ద్వారా బాబా నాకు ప్రసాదించిన ఎన్నో అనుభవాలను పంచుకున్నాను. ఈరోజు నేను బాబా నాకు ప్రసాదించిన ఒక గొప్ప అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఇంతకుముందు పంచుకున్న అనుభవంలో బాబా నన్ను మహాపారాయణలో చేర్పించారని చెప్పాను కదా! 22-10-2020 తేదీన ఆ మహాపారాయణ గ్రూపునుండి నాకు ఒక మెసేజ్ వచ్చింది. అదేమిటంటే, “ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం చేస్తే బాబా చాలా సంతోషిస్తారు. కాబట్టి ఎవరికి తోచినంతలో వాళ్ళు శక్తికొలదీ చేసుకుంటే మంచిది” అని. అయితే నాకు ఈ అన్నదానం చేయాలని ఉన్నప్పటికీ నా చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా చేయలేని అసహాయత. అందువలన నేను, “ఈ విషయంలో నాకు సహాయం చేయండి తండ్రీ!” అని బాబాను మనసులోనే ప్రార్థించాను. ఆ రాత్రి నాకు ఒక గుడిలో డబ్బు దానం చేసినట్లు కల వచ్చింది. తెల్లవారిన తరువాత ఎప్పటిలాగానే పారాయణ పూర్తి చేసుకుని, “బాబా! అన్నదానం విషయంలో మీరే ఏదో ఒక రూపంలో సహాయం చేయండి” అని ప్రార్థించాను. బాబా ఎంతో అద్భుతం చేశారు. అదేమిటంటే, ఆరోజు ఉదయం 11 గంటల సమయంలో ఎవరో మా ఇంటి తలుపు తట్టారు. నేను వెళ్ళి చూస్తే ఒక వృద్ధ బ్రాహ్మణుడు! ఆయన నాతో, “అమ్మా, నేను మా అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నాను. మీకు తోచిన సాయం చేయండి” అని అడిగారు. నేను ఆయనకి ధనం, వస్త్రం రూపంలో చిన్న సాయం (దానం) చేశాను. ఆయన చాలా సంతోషించి నన్ను ఆశీర్వదించి వెళ్ళారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. నా ప్రార్థనను మన్నించిన బాబా నాకు కలలో దృశ్యం చూపించి, సాక్షాత్తూ తానే స్వయంగా ఆ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి నా కోరిక తీర్చారు. “థాంక్యూ బాబా! ఎప్పటికీ మీ ప్రేమ మాపై ఇలానే ఉండాలి తండ్రీ!” సాయిరాం!



7 comments:

  1. Baba pleaseeeeee ma mother health problem ni cure cheyandi baba nenne namukuna thandri nedhe bharam thandri om sai ram kapadu baba

    ReplyDelete
  2. ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  3. 🌺🌷OM SRI SAIRAM 🌷🌺

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo