సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 605వ భాగం.....



ఈ భాగంలో అనుభవం:
  • పెద్ద పట్టా పుచ్చుకున్న డాక్టర్ ఉండగా ఎందుకు భయపడాలి?

యు.ఎస్.ఏ నుండి ఒక సాయిభక్తురాలు తనకు ఇటీవల బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

అందరికీ సాయిరామ్! నేను బాబా కూతుళ్ళలో ఒకరిని. నేను ఆయన కుమార్తెనని చెప్పడం నాకెంతో సంతోషంగా ఉంది. బాబానే నాకన్నీ. గతనెల కోవిడ్ బారినపడ్డ నా తమ్ముడి చికిత్స సమయంలో ఎదురైన పరిస్థితులు, అంతిమదశకు చేరుకున్న తనను బాబా ఎలా రక్షించారో ఇప్పుడు నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. 

2020, అక్టోబరు నెల మా కుటుంబ సభ్యులందరికీ చాలా చెడ్డ కాలం. కానీ నాకు మాత్రం బాబాకు నన్ను మరింత దగ్గర చేసిన కాలం. ప్రస్తుతం కోవిడ్ యుద్ధాన్ని వైద్యులు ఎలా ఎదుర్కొంటున్నారో మనకి తెలుసు. అయితే విచారకరమైన విషయం ఏంటంటే, వైద్యుడైన నా తమ్ముడు గత నెలలో కోవిడ్ బారినపడ్డాడు. మొదట్లో జ్వరం కారణంగా తను మూడుసార్లు కోవిడ్ పరీక్షలు చేయించుకుంటే, ప్రతిసారీ నెగిటివ్ అనే వచ్చింది. అంతేకాక, అన్ని రకాల టెస్టుల ఫలితాలు సాధారణంగా రావడంతో అందరమూ తనకు వచ్చింది సాధారణ జ్వరమేనని అనుకున్నాము. కానీ రోజురోజుకు అతని పరిస్థితి మరింత దిగజారిపోసాగింది. దాంతో తమ్ముడు తాను పనిచేసే ఆసుపత్రిలో చేరాడు. అక్కడ అందరూ తన విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్లాస్మా థెరపీ, రిమిడ్వర్ ఇంజెక్షన్లు మొదలైన అన్ని చికిత్సలూ చేశారు. చికిత్స చేయడానికి ఇంకా ఏమీ మిగలలేదు. కానీ రోజులు గడిచేకొద్దీ తను శ్వాస తీసుకోవడంలో సమస్య చిన్నగా మొదలైంది. అందువల్ల తనకి ఆక్సిజన్ అందించడం మొదలుపెట్టారు. కానీ పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. దాంతో నా తల్లిదండ్రులు చాలా భయపడ్డారు. నేను విదేశాలలో ఉంటున్నందున కష్టకాలంలో వారికి అండగా ఉండలేక, ఇంకా వాళ్ళకు తోడుగా ఎవరూ లేనందున చాలా బాధపడ్డాను. కానీ నేను నా తరపున నా బాబాను పంపించాను. నేను నా మరదలితో, “తమ్ముడి తలగడ క్రింద సచ్చరిత్ర ఉంచమ”ని చెప్పాను. కానీ మా తమ్ముడు ఏమైనా అంటాడని తను భయపడింది. కారణం, నా కుటుంబంలో నేను తప్ప ఎవరూ బాబాకు అంతగా కనెక్ట్ కాలేదు. “నేను తనతో చెప్తాను, తను నా మాట వింటాడు. కాబట్టి నువ్వు భయపడకుండా నేను చెప్పినట్టు చేయి” అని మరదలితో చెప్పాను. అలా నా బాబాను అక్కడికి చేర్చి, నా భారాన్ని ఆయనకు అప్పగించి, నేను సంతోషంగా ఊపిరి పీల్చుకున్నాను. ఇక బాబా తన మహిమను చూపించడం ప్రారంభించారు.

గురువారం ఉదయం నేను వైద్యులతో మాట్లాడాను. వాళ్ళు, “మేము అన్నిరకాల చికిత్సలు చేసినప్పటికీ తను క్లిష్ట పరిస్థితిలోనే ఉన్నాడు, మీరు కావాలంటే మీకు నచ్చిన వేరే ఆసుపత్రికి తనను మార్చవచ్చ”ని చెప్పారు. అది వింటూనే నా తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. భయంతో ఒకటే ఏడుపు మొదలుపెట్టారు. అప్పుడు నాకు ఇక్కడ (యు.ఎస్.ఏ) రాత్రి సమయం. ఆ సమయంలో ఒకవైపు నా తల్లిదండ్రులను ఓదారుస్తూ, మరోవైపు వైద్యులతో మాట్లాడుతూ, మా తమ్ముడి విషయంలో తుది నిర్ణయం తీసుకోలేక నా పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించవచ్చు. అకస్మాత్తుగా నాకేమి అనిపించిందో తెలియదుగానీ, మా తమ్ముడిని వేరే హాస్పిటల్‌కి మార్చాలని నిర్ణయించుకున్నాను. నిజానికి ఆ స్థితిలో నా ఆలోచన సరైనది కాదు. కానీ ఆరోజు గురువారం కావడంతో నేను భయపడలేదు.

నా నిర్ణయం ప్రకారం మావాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసి, తమ్ముడిని అపోలో హాస్పిటల్‌కి తీసుకెళ్లడానికి బయలుదేరారు. అమ్మ ఏడుస్తూ నాతో మాట్లాడుతున్నప్పుడు, “తమ్ముడి కారు వెనుక భాగంలో పెద్ద బాబా ఫోటో చూశాన”ని చెప్పింది. దాంతో నేను, “బాబా మీతో వస్తున్నారు, ఇంక మీరెందుకు ఆందోళన చెందుతున్నారు?” అని అన్నాను. నా విశ్వాసాన్ని అనుసరించి అది నిజం. కొన్ని సినిమాలలో దెయ్యం పీడిస్తుంటే, దైవం వచ్చి పోరాడి రక్షణ కల్పించడాన్ని మనం చూస్తుంటాం. అది కేవలం సినిమా అని అనుకుంటాం. దాన్ని వాస్తవంగా చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు.

తమ్ముడిని అంబులెన్సులో వైజాగ్ అపోలోకి తరలిస్తుంటే, తనతో పనిచేసిన వైద్యులు ఒక కారులోనూ, మావాళ్ళు ఒక కారులోనూ వెనుక అనుసరించారు. ఇంతలో వైజాగ్ పొలిమేరల్లో ట్రాఫిక్ కారణంగా మావాళ్ల కారు ఆగాల్సి వచ్చింది. అంబులెన్స్, డాక్టర్ల కారు వెళ్లిపోయాయి. అంతలో వెనుకనుండి ఒక పెద్ద లారీ వచ్చి మావాళ్ళ కారును ఢీ కొట్టింది. కారు ఒకవిధంగా నుజ్జయినందున చుట్టుపక్కల ఉన్నవాళ్లంతా కారులో ఉన్న అందరూ చనిపోయి ఉంటారని అనుకున్నారు. సరిగ్గా అప్పుడే వాళ్ళెక్కడ ఉన్నారో తెలుసుకుందామని నేను మా మరదలికి ఫోన్ చేశాను. తామంతా పెద్ద ప్రమాదానికి గురయ్యామని చెప్పింది తను. జరిగిన విషయం విన్న నేను ఒక్కసారిగా నిర్ఘాంతపోయాను. ప్రమాదానికి గురైన కారు ఫోటో తీసి నాకు పంపింది మా మరదలు. బాబా చేసిన అద్భుతం! అంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ మా మరదలి తండ్రికి చిన్నగా గీరుకుపోవడం తప్ప ఇంకెవరికీ ఏమీ కాలేదు. అంతా బాబా కృప. మా మరదలు కూడా డాక్టర్ అయినందున తన తండ్రికి ప్రథమ చికిత్స చేసింది. 

ఇంత డ్రామా జరిగిన తరువాత చివరికి వాళ్ళు హాస్పిటల్‌కి చేరుకున్నారు. అక్కడి డాక్టర్లు, “పరిస్థితి చాలా విషమంగా ఉంది. కానీ మా ప్రయత్నం మేము చేస్తాం” అని చెప్పారు. అందువలన మావాళ్ళందరూ భయపడ్డారు. కానీ తన బెడ్ నెంబర్ 9 తో బాబా తన ఉనికిని మరోసారి చూపించారు. నా బాబా నా మాట వింటున్నారని నేను చాలా సంతోషించాను. సాయి ఉనికిని అనుభూతి చెందుతున్నందున నేను చాలా నమ్మకంగా, ధైర్యంగా ఉన్నాను. నేను నా పారాయణ కొనసాగిస్తూ, “బాబా తనతో ఉన్నారు, కాబట్టి మీరు ఆందోళన చెందవద్ద”ని మావాళ్ళకు చెప్తుండేదాన్ని. కానీ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉండటంతో మా తమ్ముడు కూడా తనకు ఏమవుతుందోనని భయపడసాగాడు. నేను రాత్రిపగలు వాళ్లతో నిరంతరాయంగా మాట్లాడుతూ ఉండేదాన్ని. నేను తన పరిస్థితి తెలుసుకోవడానికి అర్థరాత్రి వేళల్లో కూడా ఆసుపత్రి 24 గంటల సర్వీసుకు కాల్ చేస్తూ ఉండేదాన్ని.

బాబా దయతో కొన్నిరోజుల తరువాత మా తమ్ముడు కోలుకోవడం ప్రారంభించాడు. రెండు వారాల తరువాత తను ఐ.సి.యు నుండి సాధారణ గదికి మార్చబడ్డాడు. తరువాత తను నాకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. అది విని నేను ఆనందాశ్చర్యాలలో మునిగిపోయాను. తను ఏమి చెప్పాడంటే, “అక్కా! మొన్న ఎవరో ఒక వ్యక్తి నా మంచం ప్రక్కన నిలబడ్డారు. నేను ఆయన ముఖాన్ని సరిగ్గా చూడలేకపోయాను. ఆయన వృద్ధుడిలా ఉన్నారు. ఆయన నాతో, “చింతించకు! నేను దెయ్యాన్ని నాతో తీసుకుపోతున్నాను. నువ్వు సంతోషంగా నిద్రపో!” అని చెప్పారు. నేను ఆయన మాటలను చాలా స్పష్టంగా విన్నాను. ఎవరో ఐ.సి.యు లోపలికి వచ్చారని నేను అనుకున్నాను. కానీ అక్కడ ఎవరూ లేరు” అని చెప్పాడు. తను బాబాను అంతగా ఇష్టపడడని నేను మీకు ముందే చెప్పాను కదా! కానీ ఆ సంఘటన మంగళవారం జరిగితే తను నాకు గురువారంనాడు చెప్పాడు. నేను ప్రతి గంటకు ఒకసారి తనతో మాట్లాడుతున్నప్పటికీ తను అప్పటివరకు నాకు ఆ విషయం చెప్పలేదు. సరిగ్గా గురువారంనాడే ఆ విషయం తను నాకు చెప్పడంతో నేను మళ్ళీ బాబా ఉనికిని అనుభూతి చెందాను. ఆ వృద్ధుని రూపంలో వచ్చిన రక్షకుడు ఎవరో ఇప్పుడు మనందరికీ తెలుసు. అందుకే పెద్ద పట్టా పుచ్చుకున్న డాక్టర్ నాతో ఉండగా నేను ఎందుకు భయపడాలి?

నేను ఈ కష్టకాలాన్ని ఎలా దాటానో నాకే తెలియదు. క్షమించండి, నా బాబా నన్ను దాటించారు. “బాబా! మీకు వాగ్దానం చేసినట్లు నా అనుభవాన్ని పంచుకోవడంలో ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి. మీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా లెక్కలోకి రాదు. అందుకు మరో జన్మ కావాలి. ఆ జన్మ కూడా సరిపోదు. మీ దయవల్ల నా తల్లిదండ్రులు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. మేము ప్రతిరోజూ అనుభవిస్తున్న ఆనందాలన్నీ మీ భిక్షే సాయీ. దయచేసి నా కుటుంబాన్ని, మీ మనవళ్లను ఆశీర్వదించండి. మేము దూరంగా ఉన్నందున మీరు మాత్రమే మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నా బాధ్యత మీదే, వేరెవరిదీ కాదు. లవ్ యు సాయీ. దయచేసి త్వరలో మీరు ప్రసాదించిన మరో అనుభవాన్ని సాటి సాయిబంధువులతో పంచుకునేలా నన్ను ఆశీర్వదించండి. అందరిలా నేను మీకు పూజలు చేయనప్పటికీ మీరు ఎల్లప్పుడూ నా చిన్న అవసరాలకు కూడా ప్రతిస్పందిస్తూ నాపై కురిపించే ప్రేమను అందరితో పంచుకోవాలని నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. బాబా! ఈసారి నిజంగా నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే, ఇదివరకు ఎప్పుడైనా నాకు సమస్య వస్తే, ‘నాకెందుకు ఈ సమస్య వచ్చిందని మీతో అనేదాన్ని. కానీ ఇప్పుడు నాకు సమస్య వచ్చినప్పుడు మిమ్మల్ని ప్రశ్నించడానికి బదులు నమ్మకంగా మీ పాదాలు పట్టుకుంటాను బాబా. ఈ విధమైన నమ్మకంతో మిమ్మల్ని ప్రేమించేలా దయచేసి నన్ను సదా ఆశీర్వదించండి బాబా!”



10 comments:

  1. Om sai ram please bless my son. He is also dr. Give him long life. Be with him and bless him. I love you❤ I surrender to your feet

    ReplyDelete
  2. Em maatladalo teliyadam ledu.ellappudu baba manalni rakshistune vuntaru.manam aayaniki saranagati kaavadame

    ReplyDelete
  3. Om sai Sri Sai Jai Jai sai.. love so much baba..

    ReplyDelete
  4. Om sai Sri Sai Jai Jai sai.. love you so much baba annayya..

    ReplyDelete
  5. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  6. 🙏🙏🙏 Om srisairam Om srisairam Om srisairam thankyou sister.

    ReplyDelete
  7. Om sai ram baba ma mother ni kapadu thandri sainatha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo