సదాశివ్ త్రయంబక్ విధావ్‌కర్ థానా(మహారాష్ట్ర)లోని మహాగిరి నివాసి. అతను కాయస్థప్రభు కులానికి చెందినవాడు. అతను జి.ఐ.పి. రైల్వే గూడ్స్ క్లర్క్‌గా పనిచేసి పదవీవిరమణ చేశాడు. అతను శ్రీసాయిబాబాతో తనకున్న అనుభవాలను 1936, సెప్టెంబర్ 12న శ్రీ బి.వి.నరసింహస్వామికి ఈ క్రింది విధంగా వివరించాడు:
1909వ సంవత్సరంలో నేను దాదర్‌లో గూడ్స్ క్లర్క్‌గా పనిచేస్తుండేవాడిని. నా దూరపు బంధువైన శ్రీ తమానే సాయిబాబా భక్తుడు. అతను నాతో, "శిరిడీ వెళ్లి సాయిబాబా దర్శనం చేసుకోమ"ని చెప్పాడు. 1909 ప్రాంతంలో నేను తమానేతో కలిసి శిరిడీ ప్రయాణమయ్యాను. మేము కోపర్‌గాఁవ్‌లో దిగి శిరిడీకి రానూపోనూ ఒక టాంగా మాట్లాడుకుని ఆ టాంగాలో శిరిడీ చేరుకున్నాము. మాతో తీసుకుని వెళ్లిన మామిడిపండ్లలో రెండింటిని మా కోసమని టాంగాలోనే ఉంచి, మిగిలిన పండ్లను తీసుకుని మసీదు లోపలికి వెళ్ళాము. బాబా దర్శనం చేసుకుని మామిడిపండ్లను, కొంత పొగాకును, కొన్ని రాగినాణేలను వారికి సమర్పించాము. వెంటనే బాబా, “ఆ రెండు మామిడిపండ్లు ఎక్కడ? వాటినెందుకు అక్కడే ఉంచారు? వాటిని ఇక్కడికి తీసుకురండి!” అని అన్నారు. వారి సర్వజ్ఞతకు మేము ఆశ్చర్యపడి ఆ రెండు మామిడిపండ్లను కూడా తెచ్చి బాబాకు సమర్పించాము. "అన్ని పండ్లనూ కోసి, మసీదులో ఉన్న భక్తులందరికీ ప్రసాదంగా పంచమ"ని బాబా ఆదేశించారు. తరువాత ఆయన నేను సమర్పించిన చిలిం పీల్చారు.
అప్పుడు సమయం ఉదయం పదకొండు గంటలైంది. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకే భోంచేసే అలవాటున్న నాకు 11 గంటలైనా తినని కారణంగా చాలా ఆకలిగా ఉంది. కానీ నా ఆకలి విషయం ఎవరికీ చెప్పలేక మౌనంగా మసీదులో కూర్చుని ఉన్నాను. సరిగ్గా అదే సమయంలో ఒక భక్తుడు పేడా ప్యాకెట్టుతో వచ్చి, బాబాకు కానుకగా వారి ముందుంచాడు. సాధారణంగా బాబా ఏమీ తాకరు. కానీ ఆరోజు ఆ ప్యాకెట్టు ఇచ్చిన వెంటనే బాబా దాన్ని తెరిచారు. అందులో పెద్ద పెద్ద పేడాలున్నాయి. వాటిలో నుండి ఒక పేడాను బాబా తమ చేతిలోకి తీసుకుని దూరంగా కూర్చుని ఉన్న నా ఒడిలోకి విసిరారు. అది బాబా ప్రసాదమని, అమూల్యమైన వారి కానుకను ఇంటికి తీసుకుని వెళ్లాలని తలచి దానిని అక్కడే తినకూడదని అనుకున్నాను. దాన్ని నేను తినకుండా చేతిలోనే పట్టుకుని ఉండడం చూసిన బాబా, "అదిచ్చింది దాచుకోవడానికి కాదు!" అని అన్నారు. నేను ఆ పేడాను తిన్నాను. నా ఆకలి సగం తీరింది. బాబా మరో పేడాను తీసుకుని నా పైకి విసిరారు. కనీసం ఈ పేడానైనా బాబా ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్లాలని అనుకుని దాన్ని చేతిలో పట్టుకుని ఉన్నాను. కానీ బాబా మళ్ళీ, "అదిచ్చింది నీ చేతిలో పట్టుకోవడానికి కాదు!” అని అన్నారు. దాంతో నేను దానిని కూడా తిన్నాను. అప్పుడు నా ఆకలి పూర్తిగా తీరిపోయింది. ఇక బాబా పేడాలను విసరనూ లేదు, ఎవరికీ పంచనూ లేదు. నేను చెప్పకపోయినా నా ఆకలి గురించి, తరువాత నా అర్థాకలి గురించి, ఆ తరువాత నా ఆకలి పూర్తిగా తీరిపోయిన విషయం గురించి బాబా తెలుసుకున్నారు.
మధ్యాహ్న ఆరతి ముగిసిన తరువాత నాకు, తమానేకు భోజన విషయం సమస్య అయ్యింది. వంట చేసుకోవడానికి అప్పటికే సమయం మించిపోయింది. కానీ త్రికాలజ్ఞులైన బాబాకు అన్నీ తెలుసు. ఆరోజు ఉదయం రిటైర్డు మామలతదారు (బాలాసాహెబ్ భాటే కాబోలు) ఇంటికి ఆ మధ్యాహ్నం తాము భోజనానికి వస్తామని బాబా చెప్పారట. అందువల్ల అతను భోజన పదార్థాలు ఎక్కువగా వండించి తయారుగా ఉంచాడు. ఆరతి పూర్తయిన తరువాత బాబా అతనితో మా ఇద్దరిని, మూడవ వ్యక్తిగా మరో బ్రాహ్మణుని ఇంటికి తీసుకుని వెళ్లి భోజనం పెట్టమని ఆదేశించారు. అతను మమ్మల్ని బాబా ప్రతినిధులుగా భావించి మాకు ఎంతో సంతృప్తికరంగా భోజనం పెట్టాడు. మమ్మల్ని అతనింటికి పంపే ముందు బాబా నన్ను చూపించి, "ఇతను అనవసరంగా చింతపడుతున్నాడు. కానీ ఇతని పని ఎప్పుడో జరిగిపోయింది” అని అతనితో చెప్పారట. అతను నాతో ఈ విషయం చెప్పి, నేను ఏ పనికోసం వచ్చానో తెలుపమన్నాడు. నేను బాబా నుండి ఉపదేశం పొందడానికి వచ్చినట్లు అతనితో చెప్పాను.
రానూపోనూ టాంగాను మాట్లాడుకున్నందువలన మధ్యాహ్నమయ్యాక మమ్మల్ని తిరిగి కోపర్‌గాఁవ్ తీసుకెళ్లడానికి టాంగావాలా తొందరపెట్టసాగాడు. సాధారణంగా భక్తులు తమ దర్శనానికి వచ్చినరోజే తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతించరని కొంతమంది భక్తులు చెప్పారు. కానీ రెండు కారణాల వల్ల మేము ఆరోజే తప్పక వెళ్ళాల్సి ఉంది. మొదటిది, మేము కోపర్‌గాఁవ్ వెళ్ళకపోయినా టాంగావాడికి తిరుగు బాడుగ ఇచ్చి తీరాలి. రెండవది, నేను ఆఫీసులో అనారోగ్యంగా ఉందని చెప్పి రావడంతో, మరుసటి ఉదయం దాదర్‌లోని రైల్వే మెడికల్ ఆఫీసరు ఎదుట హాజరు కావలసి ఉంది. ఏదేమైనా మేము టాంగావాలాని కాసేపు వేచి ఉండమని చెప్పి, మసీదు లోపలికి వెళ్లి బాబా ముందు కూర్చున్నాము. ఈలోపు టాంగావాలా కూడా అక్కడికి వచ్చాడు. బాబా అతనివైపు చూసి, “తొందరెందుకు?” అని చెప్పి పంపించేశారు. నా రెండవ ఇబ్బంది కూడా బాబాకు తెలుసు గనుక మాకు సెలవు ప్రసాదించారు. బాబా నాతో, "ఊదీ తీసుకుని వెళ్ళు"అని అన్నారు. నేను ఊదీ తీసుకుని మసీదు నుండి బయటకు వస్తుండగా, "చింతపడకు, ఇదివరకే నీ పని పూర్తయింది!” అంటూ మాకు వీడ్కోలు చెప్పారు బాబా. నేను వచ్చింది బాబా నుండి ఉపదేశం పొందడానికి! కానీ వారు నాకు ఏ ఉపదేశమూ ఇవ్వలేదు. మరి పూర్తయిందని చెబుతున్న పనేమిటో నాకర్థం కాలేదు.
నేను దాదర్ తిరిగి వచ్చిన 7, 8 రోజుల తరువాత నాకొక కల వచ్చింది. ఆ కలలో, ఇండోరులో నివసిస్తున్న మా వంశగురువు నాకు ఉపదేశం ఇవ్వడానికి మా ఇంటికి వచ్చినట్లు కనిపించింది. వారు వస్తున్నట్లు ఏ ఉత్తరంగానీ, సందేశంగానీ లేదు. కానీ కొన్నిరోజులకి అకస్మాత్తుగా మా వంశగురువు మా ఆఫీసుకు వచ్చారు. నేను వారిని సాదరంగా ఆహ్వానించి ఇంటికి తీసుకెళ్ళాను. నాకు వచ్చిన కల విషయం ఆయనకు తెలిపాను. ఆ కల విషయం తనకు తెలుసునని, తాను వచ్చింది ఉపదేశమివ్వడానికేనని వారు చెప్పారు. కానీ ఆ విషయం అప్పటికే తనకెలా తెలుసో చెప్పలేదు. ఆ మరుసటిరోజు శాస్త్రోక్తంగా నాకు శివమంత్రాన్ని ఉపదేశించారు. నేను శైవుణ్ణి కాబట్టి నాకు శివమంత్రాన్ని ఉపదేశించారు. వారు మరో విషయం కూడా తెలిపారు. తాము చాలారోజుల క్రితమే నాకు ఉపదేశమివ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. నిజానికి అప్పటికే నా పని పూర్తయినట్లు బాబా చెప్పారు. బాబా మాటలు సత్యమైనవి. శక్తివంతమైన బాబా మాటలు నేను శిరిడీలో ఉన్నప్పుడే నాకు ఉపదేశమివ్వడానికి నా గురువుకి ప్రేరణనిచ్చాయి (శిరిడీకి ఎంతో దూరంలో ఉన్న ఇండోరులో నివసించే వీరు బాబాను ఎన్నడూ దర్శించలేదు).
(ఈ భక్తుని గురువు - హుబ్లీ సిద్ధారూఢస్వామి. అతడు 1909లో బాబా దర్శనం చేసుకున్న తర్వాత ఒక్కసారి మాత్రమే 1935 సంవత్సరంలో శిరిడీ వెళ్లి బాబాకు కృతజ్ఞతలు అర్పించి వచ్చాడు.)
సమాప్తం.....
Source: Devotees' Experiences of Sri Sai Baba Part III by Sri.B.V.Narasimha Swamiji)
Great leela
ReplyDeleteOm Sai
Sri Sai
Jaya Jaya Sai
🙏🙏🙏
🙏🌺🙏ఓం కాలాతీతాయ నమః🙏🌺🙏
ReplyDeleteబాబా వారి మాట నరసింహం..మనసు నవనీతం.
🙏త్రికాల స్వరూప.. త్రిగుణాతీత శిరసా నమామి🙏
Om Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
Om Sree Sachidananda Samardha Sadguru Sai Nadhaya Namaha ❤🙏🕉😊
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram, anta bagunde la chayandi tandri, andaru arogyam ga kshamam ga unde la chudandi tandri andari badyata meede tandri, naaku manchi arogyanni manashanti ni prasadinchandi tandri pls.
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi pl manchivarini rent ki pampandi
ReplyDelete