సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 529వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా నాపై కురిపిస్తున్న ఆశీస్సులు
  2. ఏ ఆపదా లేకుండా చూసుకుంటారు బాబా

బాబా నాపై కురిపిస్తున్న ఆశీస్సులు

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం శ్రీ సాయిరామ్! 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు, సాయిబంధువులు అందరికీ నా నమస్సులు. నేను ఒక గృహిణిని. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలలో కొన్నింటిని గతంలో మీతో పంచుకున్నాను. మరికొన్ని అనుభవాలను ఇప్పుడు పంచుకుంటాను.

మొదటి అనుభవం: 

నేను ఎన్ని ఇబ్బందుల మధ్య ఉన్నా బాబా నాపై చూపే ప్రేమ అనన్యం. రెండు నెలల క్రితం మా చిన్నపాప ముఖం మీద తెల్లమచ్చలు వచ్చాయి. ఈ కరోనా పరిస్థితుల్లో డాక్టర్ వద్దకు వెళ్ళాలంటే భయం. చివరికి స్కిన్ స్పెషలిస్ట్ అపాయింట్‌మెంట్ తీసుకుని హాస్పిటల్‌కి వెళ్ళాము. ‘ఇదేమీ పెద్ద సమస్య కాకూడద’ని నేను మనసులోనే బాబాను వేడుకున్నాను. ఎందుకంటే, మా ఇంట్లో ఒకరికి బొల్లిమచ్చలు ఉన్నాయి. “ఈ సమస్య తీరితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని బాబాకు నమస్కారం చేసుకున్నాను. అలా బాబాను ప్రార్థించిన పదినిమిషాల్లో, “అది కేవలం పొడిచర్మం వల్ల వచ్చిందే తప్ప వేరే పెద్ద సమస్య కాదు” అని డాక్టర్ చెప్పారు. బాబాకు కృతజ్ఞతలు చెప్పటానికి కొన్ని వేల నాలుకలు, నమస్కరించడానికి కొన్ని కోట్ల చేతులు చాలవు అనిపించింది.

మరో అనుభవం: 

గతంలో నా అనుభవం ఈ బ్లాగులో ప్రచురించినరోజే నాకు దేవుడిచ్చిన అన్నయ్య స్నేహితుని కూతురికి రక్తం అవసరం అయిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వారు గుంటూరులో ఉంటారు. నేను ఆ విషయం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగానే గుంటూరులో ఉంటున్న నా మిత్రురాలు ‘తన భర్త రక్తం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నార’ని నాకు ఫోన్ చేసింది. మొత్తానికి సమయానికి వారికి సహాయం అందింది. నాతో మాట్లాడటం మానేసిన మా అన్నయ్యకు మంచి చేసేలా బాబా నాకు చేసిన సహాయం నిజంగా అనూహ్యం. ఆ అన్నయ్య ఇప్పటికీ నాతో మాట్లాడటం లేదు, కేవలం మర్యాద కోసం సోషల్ మీడియాలో స్పందించారు, అంతే! ఈ చిన్న స్పందన అయినా బాబా కరుణే అని నా నమ్మకం.

మరో అనుభవం: 

ఈ కరోనా సమయంలో, మా బావగారి అమ్మాయికి వివాహం నిశ్చయమైంది. బాబా అనుగ్రహంతో రెండు వారాల్లో తన వివాహం ఎలాంటి ఇబ్బందీ లేకుండా జరిగింది

మరో అనుభవం: 

మా అన్నయ్య కొన్ని ఆరోగ్య, వ్యక్తిగత ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసింది. నేను తన కోసం బాబాను ప్రార్థించి, 2020, ఆగస్టు 17న బాబా చరిత్ర పారాయణ ప్రారంభించాను. కానీ మరుసటిరోజు తెల్లవారుతూనే నాకు నెలసరి వచ్చింది. దాంతో, ‘బాబాకు నాపైన కోపం’ అని నేను చాలా ఏడ్చాను. కానీ ఆరోజు (2020, ఆగస్టు 18) బాబా దక్షిణ రథం (చిన్నది) మా ఇంటి దగ్గర ఆగింది. ఆ రథం నిర్వహించేవారిలో ఒక అమ్మాయి మా ఇంటి గేట్ చప్పుడు చేసి మరీ నన్ను పిలిచి దక్షిణ అడిగింది. సాధారణంగా ఆ అమ్మాయి ఎవరైనా తనను పిలిచి దక్షిణ ఇస్తేనే తీసుకుంటుంది తప్ప ఇంటి గేట్ మూసివుంటే తలుపు కొట్టి పిలవదు. పైగా, వాళ్ళు సాధారణంగా సోమవారమే వస్తారు, కానీ ఆరోజు మంగళవారం! నేను 20 రూపాయలు దక్షిణగా ఇచ్చాను. ఆమె ఊదీ ఇవ్వబోతే, మా ఇంట్లో నెలసరి పట్టింపు వల్ల నేను ఆమె ఇచ్చే ఊదీ తీసుకోలేదు. ‘ఊదీ తీసుకోలేకపోయాన’ని బాధపడుతూ లోపలికి వచ్చి ఫోన్ తీసుకుని మన బ్లాగ్ ఓపెన్ చేశాను. అందులో, ‘ఒక భక్తురాలు కోరినట్టు దక్షిణ తీసుకున్న బాబా లీల’ ప్రచురణ కావటం చూశాను. ఆ లీల ద్వారా బాబా నన్ను అంత చక్కగా ఆశీర్వదించినప్పటికీ నా అహంతో, “ఇది బాబా ఆశీర్వాదమే అయితే బాబా నాకు పచ్చని దుస్తుల్లో దర్శనమివ్వాలి” అనుకున్నాను. అలా అనుకున్న గంటలోనే, ఒక సాయి గ్రూపులో ఛోటీ ఆరతి దర్శన్‌లో, మధ్యాహ్న ఆరతి దర్శన్‌లో బాబా రెండుసార్లు పచ్చని దుస్తుల్లో దర్శనమిచ్చారు.

“బాబా! మీరు నాపై కురిపిస్తున్న ఆశీస్సులకు శతకోటి ప్రణామాలు! నా అహాన్ని, అజ్ఞానాన్ని మన్నించండి బాబా!”

ఏ ఆపదా లేకుండా చూసుకుంటారు బాబా

సాయిభక్తురాలు శ్వేత తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరాం! ‘సాయి మహరాజ్ సన్నిధి’ బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదములు. నా పేరు శ్వేత. నేను ఇంతకుముందు బాబా ప్రసాదించిన అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన మరొక అనుభవాన్ని ఇప్పుడు పంచుకుంటున్నాను. 2020, ఆగస్టు 17వ తేదీన మేముండే ఊరిలో వర్షాలు పడుతున్నాయి. ఆరోజు సాయంత్రం 6 గంటలకు మా ఇన్వర్టర్ నుండి శబ్దం రావడం మొదలైంది. వర్షాలు పడుతుండటంతో కరెంట్ వస్తూ పోతూ ఉంది. మా చెల్లి ఇంటి నుండే ఆఫీసు పని(వర్క్ ఫ్రం హోమ్) చేసుకుంటోంది. ఇన్వర్టర్ లేకపోతే తన ఆఫీసు పని ఆగిపోతుంది. ఇన్వర్టర్ నుండి శబ్దం పెద్దగా వస్తోందని ఇన్వర్టర్ రిపేర్ చేసే అతనికి ఫోన్ చేసి విషయం చెప్పాము. “ఇన్వర్టర్ పాడైపోయిందేమో, షాపులో రిపేరుకు ఇవ్వండి” అన్నాడతను. కానీ మా ఊరిలో రిపేరు షాపులు లేవు. ప్రక్కఊర్లోనే రిపేరుకు ఇవ్వాలి. కానీ ఆ సమయంలో కరోనా కారణంగా ఆ ఊరివాళ్ళు 5 రోజులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పెట్టుకున్నారు. దాంతో మేము చాలా ఆందోళనపడ్డాము. కరెంట్ రిపేర్ చేసే అతనేమైనా ఇన్వర్టర్ రిపేరు చేయగలడేమోనని అతనికి ఫోన్ చేసి, ఇంటికి వచ్చి ఇన్వర్టర్ చెక్ చేయమని అడిగాము. కానీ, అప్పటికే సాయంత్రం అయిందని, మరుసటిరోజు ప్రొద్దున వస్తానని అన్నాడతను. నేను వెంటనే బాబాకు మ్రొక్కుకుని, “ఇన్వర్టర్ లేకపోతే చెల్లి ఆఫీసు పని ఆగిపోతుంది. ఎలాగైనా ఈ సమస్యను తీర్చండి బాబా!” అని బాబాను వేడుకున్నాను. ఇక బాబా లీల చూడండి. కాసేపట్లో ఆ కరెంట్ అతను మళ్ళీ ఫోన్ చేసి, ‘పదినిమిషాల్లో వస్తాను’ అన్నాడు. అలాగే కాసేపట్లో వచ్చి ఇన్వర్టర్ పరిశీలించి చూసి, “అంతా బాగానే ఉంది, కేవలం ఇన్వర్టర్ ప్లగ్ పోయింద”ని చెప్పి, క్రొత్త ప్లగ్ వేసి వెళ్ళాడు. ప్రార్థించగానే ఎంతో తేలికగా సమస్యను పరిష్కరించిన బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

మరొక అనుభవం: 

వర్షాల కారణంగా నేల జారుతుండటంతో ఒకరోజు మా అమ్మ క్రిందపడింది. రాత్రయ్యేసరికి నొప్పి పాదాల దగ్గర నుండి మెల్లిగా మోకాలి వరకు పెరిగింది. నేను వెంటనే బాబా ఊదీని మా అమ్మ నుదుటన పెట్టి, “తెల్లవారేసరికి నొప్పి తగ్గి మా అమ్మ కాలు బాగయ్యేలా చూడమ”ని బాబాకు మ్రొక్కుకున్నాను. బాబా అనుగ్రహంతో తెల్లవారేసరికి అమ్మ కాలు నొప్పి, వాపు తగ్గిపోయాయి. సంతోషంగా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. 

ఇలా నాకు ఏ చిన్న సమస్య వచ్చినా బాబాకు చెప్పుకుంటాను. మా కుటుంబాన్నంతటినీ బాబా ఏ ఆపదా లేకుండా చూసుకుంటున్నారు. ఎల్లప్పుడూ బాబా మాకు తోడు ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు.


6 comments:

  1. Baba ma pyna daya chupavaya ma mother arogyam bagu cheyi thandri

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  3. ఓం శ్రీ సాయిరామ్

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo