- అనుగ్రహంతో తనకి ఏ పట్టింపులు లేవని తెలియజేసిన బాబా
క్రోసూరు నుండి సాయిభక్తురాలు శ్రీలక్ష్మి తనకు బాబా ప్రసాదించిన మరికొన్ని అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
మైల సోకిన సమయంలో కూడా నేను అంతే ప్రేమతో, శ్రద్ధ-సబూరీలతో ఉంటానా, లేదా అని పరీక్ష పెట్టి మరీ బాబా నన్ను తమ దగ్గరకు తీసుకున్నారు. ఆ అనుభవం మీతో పంచుకుంటాను.
మా అక్క పుట్టినరోజు సందర్భంగా అందరమూ కలిసి శిరిడీ వెళదామని నేను అనుకున్నాను. ఆ ఆలోచనతో మా ఇంటి సభ్యులు నలుగురికి, ముగ్గురు స్నేహితులకి మరియు నలుగురు బంధువులకి టిక్కెట్లు బుక్ చేయాలని అనుకున్నాను. శిరిడీ సాయి దర్శనం అంటే ఎటువంటి అవాంతరాలు ఉండకూడదని అన్నీ చూసుకొనిమరీ 3 నెలల ముందు మా ప్రయాణానికి టికెట్లు బుక్ చేశాను. బాబా ఆశీస్సులను పుట్టినరోజు కానుకగా అక్కకి ఇప్పించాలని కాకడ ఆరతికి కూడా బుక్ చేశాను. 2020, మార్చి 6వ తేదీ సాయంత్రం మేము మా ప్రయాణాన్ని ప్రారంభించి 7వ తేదీ ఉదయం 11 గంటలకి శిరిడీ చేరుకున్నాము. మేము ఎప్పుడు శిరిడీ వెళ్ళినా మూడురోజులు ఖచ్చితంగా అక్కడ ఉండేలా చూసుకుంటాం. ఆ మూడురోజుల్లో ఎన్ని దర్శనాలు చేసుకుంటామనేది మాకే తెలియదు. బాబా ఊదీ ఎక్కువగా సంపాదించి అందరికీ పంచిపెడతాం. ఎందుకంటే అలా చేయమని సచ్చరిత్రలో చెప్పబడివుంది. అందుకని వీలైనన్నిసార్లు బాబా దర్శనానికి వెళ్లి, ఊదీ సేకరిస్తూ ఉంటాం. అలాగే ఈసారి కూడా ఎంతో చక్కగా ప్రణాళిక చేసుకున్నాము. కానీ అనూహ్యమైన పరిణామం ఎదురైంది.
రెండుసార్లు దర్శనం చేసుకున్నాక కాసేపు విశ్రాంతి తీసుకుందామని రూముకి వచ్చి నిద్రపోయాం. నిద్ర లేచేసరికి అనుకోకుండా నాకు నెలసరి వచ్చింది. నిజానికది నా నెలసరి సమయమే కాదు. నాతో వచ్చిన అందరూ బాబా దర్శనానికి సిద్ధమయ్యారు. నా పరిస్థితి చూస్తే ఇలా ఉంది. గుండెలోతుల్లో నుంచి తన్నుకొస్తున్న దుఃఖాన్ని నియంత్రించుకోలేక నా మొబైల్ స్క్రీన్‌పై ఉన్న బాబాను చూస్తూ పెద్దగా ఏడ్చేశాను. అందరూ నాకు సర్దిచెప్పి, 'తప్పేమీ లేదు, దర్శనానికి రమ్మ'ని చెప్పారు. సరేనని స్నానం చేసి తయారయ్యాను. అందరితో కలిసి క్యూ లైన్ వరకు వెళ్ళాను. కానీ నా మనసు సమాధానపడక వెనక్కి తిరిగి వచ్చేశాను. 'ఎంతో ఆరాటపడి బాబా దర్శనానికి వస్తే, బాబా నాకెందుకు ఇంత పరీక్ష పెట్టార'ని మనసులో కుమిలిపోతూ ఆ బాధలో, కోపంలో అన్నయ్యకి ఫోన్ చేసి, అర్జెంట్ మీటింగ్ ఉందని అబద్దం చెప్పి, "నాకు రిటర్న్ టికెట్ బుక్ చేయమ"ని చెప్పాను. నిజానికి, అర్జెంట్ మీటింగ్ ఉన్నా, నా అవసరం ఉన్నా మా అధికారులు నన్నెప్పుడూ తప్పుగా ఏమీ అనలేదు. పైగా అందరికోసం బాబా ఆశీస్సులను అర్థించమని చెప్పి నాకెంతో మద్దతునిచ్చేవారు. అదంతా నా సాయి దయేనని నాకు తెలుసు. అలాంటిది ఇప్పుడు ఎందుకిలా చేశారు నా సాయి? నెలసరి అంటే ఆడవాళ్లకు ఒక చేదు అనుభవం అంటారు, నిజానికి అలా ఏమీ కాదు. మన ఆరోగ్యం బాగాలేకపోతే, మన తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు మనల్ని వదిలిపోతున్నారా? అలా ఏమీ లేదు కదా! 'మరి సాయి నాకెందుకు ఈ పరీక్ష పెట్టి, నన్ను ఏడిపించి, కోపం వచ్చేలా చేస్తున్నారు?' అని ఆలోచిస్తూ లోలోపలే ఏడుస్తూ తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాను. ఇంతలో మా అమ్మ నన్ను దగ్గరకు తీసుకొని ఓదారుస్తూ, నేను సమాధానపడేలా కొన్ని మాటలు చెప్పింది. నా సాయిఅమ్మే(బాబా) నాకు జన్మనిచ్చిన అమ్మ రూపంలో వచ్చి, నన్ను తన గుండెలకు హత్తుకొని, "నువ్వు నా బిడ్డవి. నీకు మైల సోకినంత మాత్రాన నువ్వు నా బిడ్డవి కాకుండా పోవు, నేను నీ తల్లి/తండ్రిని కాకుండా పోను. నిన్ను దూరం పెట్టే ప్రశ్నే లేదు. అయినా నిన్ను ఒంటరిగా ఎలా పంపిస్తాను" అని చెప్తున్నట్లు దృఢంగా అనిపించింది. అంతేకాదు, మా అమ్మ రూపంలో ఉన్న నా సాయిఅమ్మ నాకు రిటర్న్ టికెట్ బుక్ చేయించకుండా ఆపుచేయించి, నన్ను తమ దర్శనానికి రప్పించుకున్నారు. నా బాధంతా తీసేశారు. ఆరోజు మొత్తం అయిదు దర్శనాలను ప్రసాదించి బాబా నన్నెంతగానో ఆశీర్వదించారు. నిజానికి సాయికి తెలియనిది ఏమీ లేదు. ఆయన ఆజ్ఞ మేరకే మనం నడుస్తున్నాము.
బాబా తన బిడ్డలని పొత్తిళ్ళలో పెట్టుకొని చూసుకుంటారని ఆరోజు దర్శనం అయ్యాకే నాకు తెలిసింది. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, మాతో హైదరాబాదు నుండి రావలసిన మా ఫ్రెండ్, వాళ్ళ అబ్బాయి, అమ్మగారు అప్పటికే కరోనా ప్రభావం మొదలైందని శిరిడీ ప్రయాణాన్ని మానుకున్నారు. కానీ నాకటువంటి పరిస్థితి రానుందని సర్వజ్ఞులైన సాయికి తెలిసి కూడా నన్ను శిరిడీకి రప్పించుకున్నారు. ఒకరకంగా నాకొక పరీక్ష పెట్టినా తల్లిలా ఆదరించి తనకు తన బిడ్డలకు మధ్య ఎటువంటి హద్దులూ ఉండవని బాబా తెలియజేశారు.
ఈ విషయానికి సంబంధించి బాబా ఇచ్చిన మరో అనుభవం:
మార్చి నెల 9వ తారీఖున నేను శిరిడీలో ఉన్నప్పుడు, “నీ సేవలో పాల్గొనాలని ఉంది సాయీ, నీ సేవాభాగ్యం నాకు కల్పించవా?” అని బాబాను అడిగాను. “గురుపూర్ణిమకి పారాయణ చేయించు” అని బాబా సందేశాన్నిచ్చారు. బాబా సందేశానుసారం గురుపూర్ణిమరోజు పారాయణ చేయించడానికి పూనుకున్నాను. కానీ, 'నా వల్ల అవుతుందా?' అని ఒక చిన్న సందేహం. కానీ బాబా ఆశీర్వాదంతో గురుపూర్ణిమరోజున ఒక పారాయణతో మొదలై, 5 పారాయణలతో ముగిసింది. బాబా తన బిడ్డలమీద ఆశీస్సుల వర్షాన్ని కురిపించారు. మొత్తం 250 మంది సాయిభక్తులు వివిధ ప్రదేశాల నుండి సాయి పారాయణను ఒక యజ్ఞంలా చేశారు.
ఇక నిత్య పారాయణ విషయానికి వస్తే, నాకు నిత్యపారాయణ చేయాలన్న ఆలోచన ఏ మాత్రమూ లేదు. కానీ ప్రతిరోజూ తమ చరిత్ర పారాయణను తమ బిడ్డలతో చేయించుకోవాలని బాబా అనుకున్నారేమో! ఒకరోజు 11 గంటల సమయంలో 'నిత్యపారాయణ గ్రూపు మొదలుపెట్టమ'ని బాబా సందేశమిచ్చారు. దాంతో నేను నిత్యపారాయణ మొదలుపెట్టడానికి నిర్ణయించుకొని నాకు పరిచయస్తురాలైన సుధ అమ్మగారికి ఫోన్ చేయాలని అనుకున్నాను. ఎందుకంటే, మహాపారాయణలో ఆమె చేసిన సహాయం మాటలలో చెప్పలేనిది. ఐదు పారాయణలు విజయవంతంగా పూర్తి చేయడంలో ఆమె మూలస్తంభం వంటివారు. అలాంటామె నిత్యపారాయణ మొదలుపెడదామని ఫోన్ చేస్తే, "ఎందుకో భారంగా ఉంది" అంటూ ఐదు నిముషాలపాటు కాస్త భారమైన మాటలు మాట్లాడారు. తరువాత, "ఇష్టంలేదని కాదు, సమయం లేదని కాదు, కానీ నేను గ్రూపులో ఉండన"ని చెప్పారు. నేను, "అయ్యో, అమ్మా! మీరు అలా అంటే ఎలా? నేను మీ పేరు వ్రాసుకున్నాను" అని చెప్పాను. కానీ ఆమె, "ఇప్పుడు కాదులే మరోసారి ఉంటాను. ఈసారికి వదిలేయ్!" అని అన్నారు. మళ్ళీ అంతలోనే, "సరే ఫ్రీ అయ్యానులే. ముందు నువ్వు మొదలుపెట్టు, చార్ట్ ప్రేపర్ చేయి" అని కేవలం ఐదు నిముషాలలో రకరకాలుగా మాట్లాడారు. సాయే స్వయంగా తనతో సరేనని చెప్పించారని నాకు అర్థమై అదే విషయాన్ని ఆమెతో చెప్పాను.
అక్కడితో అయిపోలేదు. లిస్ట్ తయారుచేస్తున్న సమయంలో నాకు నెలసరి వచ్చినట్లు గుర్తించాను. "ఇప్పుడేమి చేస్తావు? నన్ను వదిలి పెడతావా, నాతోనే ఉంటావా?" అన్నట్లు సమయం కాని సమయంలో సాయి నాకు పరీక్ష పెట్టాడు. కానీ నేను సాయి ఇచ్చిన కార్యాన్ని ఆపలేదు. నా ప్రాణమే ఆయన అయినప్పుడు అదెలా సాధ్యమవుతుంది? ఎటువంటి సందేహం లేకుండా నిత్యపారాయణ మొదలుపెట్టాను. అందుకోసం తీరకలేకుండా ఆనందంగా శ్రమించాను. ఆరు రోజులలో ఐదు మహాపారాయణలు, ఆరు నిత్యపారాయణలు, అంటే మొత్తం 11 పారాయణలు పూర్తి చేయించుకున్నారు బాబా. ఈరోజు 5 మహాపారాయణలు, 6 నిత్యపారాయణలతో అందరం ప్రతి నిత్యం బాబా నామాన్ని పలుకుతూనే ఉన్నాము.
నేను కావాలని హిందూ సంప్రదాయాన్ని కించపరించింది ఏమీ లేదు. నాకు ఆ ఉద్దేశ్యమూ లేదు. కానీ బాబాతో నేను పెంచుకున్న అనుబంధం అలాంటిది. దీనిని తప్పుపట్టే వాళ్ళకి నాదొక ప్రశ్న.. మన ఇంట్లో అమ్మకో, అమ్మాయికో ఇదే సమస్య వచ్చింది అనుకోండి, మీరు మీ బిడ్డని ఇంట్లోకి రానివ్వకుండా దూరం పెడతారా? ప్రకృతిలో మంచీ చెడూ ఉంటాయి. తల్లి తన బిడ్డలోని మంచిచెడులను కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది. అలాంటి నా సాయిఅమ్మ నన్ను తన పొత్తిళ్ళలో పెట్టుకొని చూసుకుంటున్నాడు. నేను నిత్యమూ ఊదీని నీళ్లలో వేసుకొని త్రాగుతాను. ఊదీ మహిమ ఏమిటో అందరికి తెలిసిందే. ఊదీ మహాశక్తిశాలి, పరమ పావనమైనది. ఎంతటి మాలిన్యమైనా ఊదీ స్పర్శతో పరమపావనమవుతుంది. ఇంకా నాకు మైలెక్కడిది? అయినా కేవలం ఆరు రోజులలో అది కూడా నేను ఆ స్థితిలో ఉన్నప్పుడు 11 పారాయణలు పూర్తి చేయించడంలోనే బాబా ఆశీర్వాదం, వారికీ ఇటువంటి పట్టింపులు లేవని అర్థమవుతుంది. నాకు ఆ సమస్య రాబోతుందని సర్వజ్ఞుడైన బాబాకు తెలియనిదా? తెలిసే నాకు నిత్యపారాయణ మొదలుపెట్టమని సందేశమిచ్చి ఇంతలా అనుగ్రహించారు. ఇదంతా చేయడం ద్వారా తమకు అటువంటి పట్టింపులు లేవని నాకు స్పష్టంగా అర్థమయ్యేలా చేశారు నా సాయిఅమ్మ.
ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రసాదించాలన్నది సాయి సంకల్పం. ఆయన బిడ్డలమైన మనం సదా ఆయన సేవలో భాగం కావాలి. “సాయీ! నిత్యం నీ సేవ కోసమే ఎదురుచూస్తూ, నీ ఆజ్ఞలు పాటించడానికి మేము సదా మీ స్మరణతో సిద్ధంగా ఉన్నాము. మమ్మల్ని సదా మీ సేవలో తరించేలా అనుగ్రహించండి బాబా!”
ఓం శ్రీ సాయి సమర్థ
ReplyDeleteom sai ram with baba blessings i my a member in 2 maha parayan blogs.with his grace i got this chance.i thank him
ReplyDeleteBaba pillustuna vachi kapadu thandri one week variki problem solve avali thandri saideva
ReplyDeleteOm Sai ram
ReplyDelete🙏🌺🙏సర్వే జనా సుఖినోభవంతు🙏🌺🙏
ReplyDelete🙏🌺🙏సర్వే సుజనా సుఖినోభవంతు🙏🌺🙏
🙏🌺🙏 ఓం సాయిరాం🙏🌺🙏
🙏🌺🌺OM SAIRAM 🌺🌺🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteThank you to u all .sais om sai ram
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
Om Sai ram I'm a small devotee of Baba today I want to post about my experience where Baba satisfied my wish regarding my laptop repair I prayed him about that if my laptop has only a small problem without spending much amount I post my experience in the blog Thanks Baba u listened to my prayer and helped me not to spend a little amount Once again Thanks Sairam Ur there no doubt I'm waiting for the day when my biggest wish which I placed near u lotus feet to be granted then I'm theost luckiest person Baba please Baba grant my wish and make me to be at Ur lotus feet forever and ever
ReplyDelete