సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తి సాధన రహస్యం - సాయియోగంలో ఉపవాస నియమం




సాయియోగంలో ఉపవాస నియమం

శ్రీసాయిబాబా మనకందించినది మధ్యేమార్గం. ఇటు మితిమీరిన భోగలాలసతను, అటు అలవిమాలిన హఠయోగాన్ని బాబా ఆమోదించలేదు. కాలపరిణామంలో ఎన్నో మతాలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలు ఆవిర్భవించాయి. ఎందరో మహాత్ములు ప్రభవించి, వారివారి కాలపరిస్థితులకు ఆనాటి ఆధ్యాత్మికావసరాలకు అనుగుణంగా ఎన్నో ఆచారసంప్రదాయాలను పాదుకొల్పారు. కానీ, వ్యక్తి యొక్క సామాజిక ఆధ్యాత్మిక అవసరాలకనుగుణంగా ఆ ఆచారసంప్రదాయాలు కూడా కాలానుగుణంగా మారవలసిందిపోయి, అవన్నీ జనజీవనస్రవంతిలో అలాగే కలగాపులగంగా కలిసిపోయాయి. ఆ ఆచారసంప్రదాయాలు ఆయాకాలాలలో అర్థవంతమైనవే! అయితే, కాలగతిలో అవి ఏర్పడడానికి వెనుక వున్న లక్ష్యం అవసరం అర్థం అంతరించి – కరి మ్రింగిన వెలగపండులా – అర్థరహితమయిన మూఢవిశ్వాసాలుగా మిగిలాయి. ఎందరో మహాపురుషులు ఆయాకాలాలలో అటువంటి అర్థంలేని వ్యర్థాచారాలను ఖండించి నిరసించారు. కానీ, ‘పాత’ మీద పామరప్రజానీకానికి వుండే మోజు, మౌఢ్యం; ఈ రెంటినీ ఆధారం చేసుకొని బ్రతికే ఒక వర్గం ‘మేధావుల’ స్వార్థం మూలంగా ఈ ఆచారాలు ఇంకా మన మనస్సులనే గోడలకు బూజువలె పట్టుకొని వ్రేలాడుతున్నాయి. ‘జైసాదేశ్ వైసావేష్’ అన్నారు శ్రీసాయిబాబా! ఏ కాలానికి అనుగుణమైన ధర్మాన్ని ఆ కాలంలో పాటించడం వివేకం; ‘కాలధర్మం’ చెందిన ఆచారాలను పట్టుకొని వ్రేలాడడం అవివేకం! అయితే, మరి ఈ కాలానికి అనుగుణమైన ధర్మం, పురుషార్థసాధనం ఏమిటి? అదెలా తెలుసుకోవడం? – అనే సందేహం రావడం సహజం. దాన్ని తెలియజెప్పడానికే శ్రీసాయిబాబా వంటి మహాత్ములు ఇటీవల కాలంలో అవతరించారు! బాబా చూపిన బాట, ఆయన చెప్పిన మాట, తమ లీలల ద్వారా ఆయన సూచించిన బోధ – ఇవే యీ కాలానికి మన శ్రుతులు, స్మృతులు!

బాబా నిరసించిన వ్యర్థ ఆచారాలలో ఉపవాసం ఒకటి. ఉపవాసమంటే మనస్సు (అంతఃకరణము)ను వ్యర్థమయిన విషయాలతో నింపక, ఖాళీగా వుంచుకొని, అందులో మన ఉపాసనాదైవాన్ని ప్రతిష్టించుకొని, ఆయనకు అంతరంగంలో దగ్గరవడమన్నమాట! ఉప – దగ్గరగా/సమీపంలో, వాసము – ఉండటం, అని ‘ఉపవాస’మనే పదానికి అర్థం. కానీ, అసలైన యీ అర్థం పోయి, ఉపవాసమంటే నిరాహారంగా ఉండటంగా మారింది! ఆకలి కడుపుతో పూజాధ్యానాదులు చేసేటప్పుడు మన దేహంలోని ప్రాణచలనం అస్తవ్యస్తమై, శోష నిద్రలతో కూడిన ఒక విధమైన ‘తమస్సు’ మనస్సును ఆవరిస్తుంది. ఈ ‘అవస్థ’నే కొందరు ‘సమాధి’, ‘అమనస్కం’ అని పొరబడుతుండటం కూడా కద్దు! “బుభుక్షితం న ప్రతిభాతి కించిత్”– అంటే, 'ఆకలితో కడుపు కాలుతున్నవాడికి ఏమీ తోచకపోవడం సహజమే!' అయితే, ఆ ‘ఏమీ తోచకపోవడ’మనేది యోగసాధనలో చెప్పబడ్డ మనోలయము కాదు, అమనస్కము అంతకంటే కాదు!

ఓ అర్థశతాబ్దం క్రితం గుజరాత్ రాష్ట్రంలో శ్రీప్రకాశానందస్వామి శ్రీనిత్యానందస్వామి అనే ఇద్దరు మహాత్ములుండేవారు. వారిరువురూ మూర్తీభవించిన వివేక వైరాగ్యాలవలె జీవించారు. శ్రీప్రకాశానందస్వామివారి ప్రసంగాలను ఆ మహాత్ములిరువురి మధ్య జరిగిన సద్గోష్టుల రూపంలో ‘వార్తాలాపం’ అనే గ్రంథంగా భక్తులు ప్రచురించారు. ఒకసారి శ్రీనిత్యానందస్వామి శ్రీప్రకాశానందస్వామి వారినిలా అడిగారు, “ఎప్పుడైనా ఆకలితో నుండవలసిన అవసరము కలిగినప్పుడు ఆకలివల్ల నిధిధ్యాసనకు విఘ్నము కలుగలేదా?” దానికి శ్రీప్రకాశానందస్వామి, “ఆహారము లేనప్పుడు వృత్తి ఏకాగ్రత చెందేదానికి బదులు స్తబ్ధమై మూఢత్వం చెందేది!” అంటూ తమ స్వానుభవాన్ని వివరించారు. శ్రీప్రకాశానందుల వంటి ఆరూఢులైన యోగుల అనుభవమే అలా వుంటే, ఇక సామాన్యుల విషయం చెప్పాలా? అయితే, సుష్టుగా భోంచేసి, ధ్యానం చేసుకుందామని కూర్చున్నా ఈ ప్రమాదం తప్పదు. అందుకే మితమయిన ఆహారము విహారము ధ్యానానికి అవసరం.

ధ్యానయోగాన్ని బోధిస్తూ భగవద్గీత:

“నాత్యశ్నతస్తుయోగో స్తినచైకాంత మనశ్నతఃl
న చాతి స్వప్నశీలస్య జాగ్రతోనైవ చార్జునll”

అంటే, 'అతిగా తినేవాడికి, బొత్తిగా తిండి తినని వానికి యీ ధ్యానయోగము సిద్ధించదు!' అని చెబుతున్నది. మరి ఎటువంటివాడికి అది సిద్ధిస్తుంది? ఆ తరువాతి శ్లోకంలోనే, ‘యుక్తాహార విహారస్య’ (అంటే, ‘సరైన ఆహారము నడత గలిగిన వానికి’)* అని సమాధానమిచ్చాడు గీతాచార్యుడు. ‘యుక్త’ అనే పదానికి ‘విధించబడిన కొలతలో’ అని అర్థం చెప్పారు శ్రీఆదిశంకరులు తమ గీతాభాష్యంలో. అంతేకాదు! ‘విధించబడిన కొలత కంటే అధికంగా’ తినడం ‘అత్యశ్నతః’. గీతలోనే మరోచోట ‘లఘ్వాశీ’ అంటూ, ‘స్వల్పంగా భుజించేవానికి’ ధ్యానయోగ సిద్ధి కలుగుతుందని గీతాచార్యుడే చెప్పాడు. అంటే, యుక్తమైన ఆహారమంటే స్వల్పంగా భుజించడమనీ, ‘విధించబడిన కొలత కంటే అధికంగా’ భుజించకుండావుండటమనేది గీతార్థమనుకుంటే, ఇక్కడ మళ్ళీ ఓ ప్రశ్న తలెత్తుతోంది! ‘స్వల్పంగా’ అంటే ఎంత స్వల్పంగా? దానికి నిర్దిష్టమైన కొలతేమైనా వున్నదా? ఉంటే, మరి ఆ కొలతేమిటి? – అని. “ఆత్మసమ్మతమైన అన్నం కంటే అధికంగా తినడమే” కొలతకంటే ఎక్కువగా తినడమని శ్రీఆదిశంకరుల వివరణ. ఎంత ఆహారం తీసుకుంటే అజీర్ణం చేయకుండా వుంటుందో, (అనాయాసంగా) పనులు చేసుకొనేందుకు అనుకూలంగా వుంటుందో అదే ఆత్మసమ్మతమయిన అన్నం అని కూడా శ్రీశంకరులు వివరించారు. “ఏ అన్నము తన కొలతకు తగినదో ఆ అన్నము కాపాడుతున్నది; అది చెరుపు చేయుట లేదు. దానికంటే అధికమైనది చెరుపు చేయుచున్నది. దానికంటే తగ్గినది కాపాడుటలేదు” అన్న శతపథబ్రాహ్మణ మంత్రం శ్రీశంకరుల నిర్వచనానికి ప్రమాణం. ఈ నిర్వచనం కూడా ‘కొలత ఎంత?’ అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు. సరి! ధ్యానయోగాభ్యాసానికి సంబంధించిన యీ మితాహారమీమాంసకు యోగశాస్త్రగ్రంథాలేమైనా సమాధానం చెప్పాయా? చెప్పకేమి! ఘేరండసంహిత అనే ప్రామాణిక హఠయోగశాస్త్రగ్రంథం ఇలా చెబుతున్నది: “అన్నము కూర మొదలైనవాటికి సగం కడుపు; నీటికి పాతిక కడుపు; గాలి సంచరించేందుకు ఖాళీగా మిగిలిన పాతిక కడుపును వుంచాలి” అని. జాగ్రర్తగ చూస్తే యీ సమాధానమూ మనం ఆశించిన ‘కొలత’ను నిర్దిష్టంగా చెప్పడం లేదు!

ఇక ధర్మశాస్త్రగ్రంథాలను పరిశీలిద్దాం! “ఆహారాన్ని ఔషధంలా తీసుకో!” (“ఔషధవత్ ప్రాశ్నియాత్” బౌ.ధ.సూ.2.10.53) అని బౌధాయన మహర్షి బోధిస్తే, “సన్యాసి ఎనిమిది ముద్దలు, వానప్రస్థుడు పదహారు ముద్దలు, గృహస్థు ముప్పైరెండు ముద్దలు ఆహారం తీసుకోవాలి. బ్రహ్మచారికి పరిమితి లేదు!” అని ఆపస్తంబ మహర్షి ఆదేశం. ఇప్పటి వరకు మనం పేర్కొన్న ‘కొలత’లలో ఆపస్తంబనిర్దేశం నిర్దిష్టంగా కనిపించినా, అది సార్వజనీనకంగా ఎంతవరకు ఆచరణ యోగ్యం? ఏతావాతా తేలిందేమిటంటే, “ఎంత ఆహారము తీసుకోవాలి?” అన్న ప్రశ్నకు, ‘ఇంత’ అని తూనిక కొలతలలో చెప్పేందుకు వీలులేదు. ‘స్వల్పం’ అనేది సాపేక్షికమైన విషయం. అది వ్యక్తికి వ్యక్తికి మారుతుంది. ఒకే వ్యక్తి విషయంలో కూడా వయస్సు, చేసే పని, దేహారోగ్యం, మానసికస్థితి మొదలైన అంశాలను అనుసరించి మారుతుంది. తేలిగ్గా జీర్ణమయ్యేంత, భుక్తాయాసము, నిద్ర రానంత, తినగానే ఒళ్ళు బరువు లేకుండా పనిచేసుకొనేంత ‘లఘువు’గా ఉండే ఆహారమే ‘యుక్తాహారం’. ఈ విషయాన్నే శ్రీమద్భాగవతం ఇంకొంచెం ఖచ్చితంగా క్లుప్తంగా, “ప్రాణవృత్యైవ సంతుష్యే – న్మునిర్నైవేన్ద్రియప్రియైః!” అంటే “మనన స్వభావము గల ముని శరీర నిర్వహణకు చాలినంత ఆహారంతో సంతుష్టి చెందాలి! ఇంద్రియాలకు ప్రియములైన (అంటే, జిహ్వకు రుచికరములైన) పదార్థాలను చాపల్యంతో తినకూడదు” అని చెబుతున్నది. “స్వల్పంగా తిను! ఒకటి రెండు పదార్థాలతో తృప్తిపడు! రుచులకు పోవద్దు!” అన్న శ్రీ సాయిబాబా ఉపదేశాన్ని ‘పరిప్రశ్నాత్మకంగా’ యోచిస్తే, యోచించి ఆచరిస్తే, ఇంకా ఎన్నో విషయాలు అవగతమౌతాయి!

అంతేకానీ, ఉపవాసాలు ఒక్కపొద్దుల పేరుతో రకరకాల ఫలహారాలు, ‘టిఫెన్లు’ ఆరగించడం, పండుగ పబ్బాలలో దేవుడి పేరు చెప్పి నానారకాల నవకాయ పిండివంటలు వండుకొని, అటు దేవుడికి ‘చూపించి’, ఇటు మెక్కడం (- ఆ పిండివంటలకు ‘న్యాయం’ చేయటానికా అన్నట్లు నైవేద్యం పెట్టేదాకా ఏమీ తినకుండా ‘ఉపవాసం’ వుండి, కడుపు ఖాళీ చేసుకొని మరీ ఆయత్తమవడం -) ... ఇదీ మనం మామూలుగా చూస్తున్న చేస్తున్న తంతు! “జిహ్వరుచుల చేత జీవుండు చెడునయా” అన్నట్లు వీటివల్ల జిహ్వాచాపల్యం పెరిగి చెడిపోవడం తప్ప వేరే ఫలితం లేదు! అయితే, అప్పుడప్పుడు ఉపవాసం వుండడం ఆరోగ్యానికి మంచిదని, వైద్యశాస్త్ర రీత్యా ఈ ఉపవాస నియమాన్ని సమర్థింపచూస్తారు కొందరు. నిజమే! పైన చెప్పిన విధంగా ఉపవాసాలుండి, తర్వాత నానాగడ్డీ తిని అజీర్తి తెచ్చుకున్నవారికి, ‘లంఖణం పరమౌషధం’ కాక మరేమవుతుంది? నిజానికి “హితం భుంజాన్మితం భుంజ్యాత్, నభుంజ్యాద మితం హితం” - అంటే, 'హితమైన పదార్థాలనే తినాలి. అవైనా మితంగానే తినాలి. హితమైనవే అయినా అమితంగా తినరాదని' ఆయుర్వేదం ఘోషిస్తున్నది. అంతేకాదు! దీర్ఘకాల ఉపవాసాలుండటం వల్ల శరీరంలో ధాతువైషమ్యం కలిగి, దేహారోగ్యం దెబ్బతినడమే గాక, క్రమంగా ఎన్నో మనోవికారాలకు కూడా దారి తీస్తుందని కూడా వైద్యశాస్త్రం  హెచ్చరిస్తున్నది. ఎన్నో రకాల ‘క్యాన్సర్’లకు – ముఖ్యంగా ‘బ్లడ్ క్యాన్సర్’ (leukemia) కు దారితీసే ప్రధాన కారణాలలో ఆకలిని చంపుకోవడం (supression of hunger) ఒకటని ఆధునిక వైద్యశాస్త్రం వక్కాణిస్తున్నది.

ఈ ఉపవాసాలు జాగరణలు వ్రతాలు మొదలయిన తంతులకు, ఈనాటి ఆధ్యాత్మికతకు ఎంత బ్రహ్మముడి పడివున్నదంటే, వాటిని మరల్చడం, వదల్చుకోవడం ఒక బ్రహ్మయజ్ఞమే! అందుకే వేమనయోగి వంటి మహాత్ములు, “ఒక్క పొద్దులుండి వరము చెందెదమంచు l రెండిచత్తురు మాలబండ జనులు” అనీ, “ఒక్కపొద్దుచేత బ్రక్కలెండు గానీ చిత్తమెల్ల గురుని చేరబోదు” అనీ, నయాన చెప్పి చూచారు; “కూడు పెట్టకున్న గుక్షిలో జఠరాగ్ని l భక్షణంబు చేయు కుక్షిమలముl కూడు విడచి మలము కుడుచురా వుపవాసి” అని ఈసడించారు. అప్పటికీ నయాన విననివారికి, “ఒక్క పొద్దులున్న వూరపందిగ పుట్టు!” అంటూ భయాన చెప్పజూసారు – మనకర్థమయ్యే మన భాషలో! సరి! ఇక, శ్రీసాయిబాబా ఉపవాసదీక్షల గూర్చి యేం చెప్పారో చూద్దాం!

శ్రీమతి గోఖలే తన మిత్రురాలైన శ్రీమతి కాశీబాయి కానీత్కర్ ద్వారా శ్రీసాయిబాబా గురించి విని, బాబా దర్శనం కోసం శిరిడీ బయలుదేరింది. అక్కడ తన బస కోసం శిరిడీలో నివాసముండే దాదాకేల్కర్ అనే భక్తునికి తనను పరిచయంచేసే ఉత్తరాన్ని కూడా తన స్నేహితురాలి నుండి తీసుకుంది. బయలుదేరేముందు తాను శిరిడీ చేరగానే బాబా సన్నిధిలో మూడురోజులపాటు ఉపవాస దీక్ష చేయాలని నిర్ణయించుకుంది. శిరిడీలో సరిగ్గా అదే సమయానికి బాబా తన ప్రక్కనే వున్న దాదాకేల్కరుతో “నా బిడ్డల్ని నేను పస్తుండనిస్తానా? వాళ్ళు ఉపవాసం ఉంటామంటే నేను ఒప్పుకోను!” అన్నారు. హఠాత్తుగా బాబా తనతో అలా ఎందుకంటున్నారో దాదాకేల్కరుకు అర్థం కాలేదు. ఆ మరుసటిరోజే శ్రీమతి గోఖలే శిరిడీ చేరి, దాదాకేల్కర్ ఇంటికెళ్ళి తనను పరిచయం చేసుకొని, అక్కడే బస ఏర్పాటు చేసుకుంది. ఆ తర్వాత బాబా దర్శనం కోసం మసీదుకెళ్ళింది. బాబాకు నమస్కరించి కూర్చొనగానే బాబా తనంతట తానే ఆమెతో, “అమ్మా, ఈ ఉపస్సు (ఉపవాసం) తపస్సులతో అవసరం ఏమిటి? మనం దాదా ఇంటికి పోయి చక్కగా పూరన్ పోళీలు అవీ చేసుకొని,  దాదాకు దాదా పిల్లలకు పెట్టి, మనమూ తిందాం!” అన్నారు. శ్రీమతి గోఖలే మసీదు నుండి దాదాకేల్కర్ ఇంటికెళ్ళేసరికి, అప్పుడే దాదా భార్య ‘బయట చేరడం’తో సమయానికి వంటచేసేవారు లేక, ఎలాగా అని ఆలోచిస్తున్నారు. శ్రీమతి గోఖలే తాను వంట చేస్తానంటే, ఇంటికొచ్చిన అతిథి చేత వంట చేయించుకోవడం ఉచితం కాదని దాదా సంకోచించాడు. అప్పుడు శ్రీమతి గోఖలే తాను శిరిడీ బయలుదేరడానికి ముందు సంకల్పించుకున్న ఉపవాసదీక్ష, అంతకు కొద్దిసేపు ముందు బాబా తనకు చేసిన ఉపదేశం... అన్నీ కేల్కర్ కు వివరించింది. ఆ ముందు రోజు బాబా తనతో అన్న మాటల అర్థం అప్పుడుగానీ దాదాకేల్కర్ కు బోధపడలేదు. శ్రీమతి గోఖలే వంట చేసి, దాదా కుటుంబానికి వడ్డించి, తానూ తిన్నది. బాబా ఆదేశానుసారం తను సంకల్పించిన ఉపవాసదీక్షకు స్వస్తి చెప్పింది.

ప్రత్యేక ఆధ్యాత్మిక సాధన-దీక్ష లేని సామాన్య భక్తులకు ‘ఉపస్సు-తపస్సు’ బాబా వద్దన్నారేగానీ, తీవ్రసాధనలో వుండే సాధకులకు మాత్రం  ఉపవాసాది దీక్షలు తప్పనిసరేమో - అని భావించడానికి కూడా వీలులేదు! ఎందుకంటే, సంసారబంధాలు త్యజించి, శిరిడీలోనే నివాసముంటూ, ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమైవున్న కాకాసాహెబ్ దీక్షిత్ అనుభవమే తీసుకుందాం. ఏకభుక్తం వుంటూ, నియమంగా రాత్రుళ్ళు ఆహారం తీసుకోవడం మానాలని సంకల్పించుకున్నాడు శ్రీదీక్షిత్ ఒకసారి. అలా అనుకొని మసీదుకెళ్ళగానే బాబా, “కాకా, రాత్రికి మామూలుగా భోజనం తయారుచేసుకొని తిను!” అన్నారు. దాంతో, దీక్షిత్ తాను పెట్టుకున్న ఉపవాస నియమానికి తిలోదకాలిచ్చాడు. అంటే ఆధ్యాత్మిక సాధనలో భాగంగానైనా సరే ఉపవాసనియమాన్ని బాబా ససేమిరా ఆమోదించలేదని స్పష్టమవుతున్నది. శ్రీఉపాసనీ మహరాజ్ వృత్తాంతం ఈ అంశాన్ని ఇంకా స్పష్టం చేస్తుంది.

ప్రత్యక్ష సాయిభక్తులందరిలో తీవ్రతపస్విగా మహాసిద్ధపురుషునిగా ఓ సద్గురుమూర్తిగా వేలాదిమందిచే ఆరాధింపబడుతున్న మహనీయుడు శ్రీఉపాసనీ మహరాజ్. ఆయన 1911లో బాబాను దర్శించినప్పుడు, బాబా ఆయనను నాల్గుసంవత్సరాలు శిరిడీలో వుండమని ఆదేశించారుఅలా చేస్తే ఉపసానీకి పరిపూర్ణసిద్ధి లభిస్తుందని కూడా బాబా హామీ ఇచ్చారు. మరి ఆ నాలుగేళ్ళ కాలంలో తాను చేయవలసిన ఆధ్యాత్మికసాధనలు ఏమిటని అడిగాడు శ్రీఉపాసనీ. దానికి బాబా, “ఏమీ చెయ్యనక్కరలేదు! రొట్టెకూర తిని ఊరక కూర్చుంటే చాలు! మిగిలిందంతా నేను పూర్తి చేస్తాను” అని అన్నారు. బాబా కేవలం "ఊరకే కూర్చో!" అని చెప్పడంతో బాటు, “రొట్టెకూర తింటూ ఊరక కూర్చో!” అని ఆహారం విషయం ప్రత్యేకంగా నొక్కి చెప్పడం గమనార్హం. 

బాబా అలా ఆహారం విషయం నొక్కి చెప్పడానికి రెండు కారణాలను మనం ఊహించవచ్చు. ఉపవాసతపవాసాల పట్ల బాబాకున్న నిరసన భావం మొదటిది; రెండవది, బాబా అభిమతానికి వ్యతిరేకంగా ఆ తరువాత శ్రీఉపాసనీ చేసిన ‘నిరాహార దీక్షను', దానివల్ల ఆయనకు కలుగబోయే నష్టాన్ని బాబా తనదైన శైలిలో ముందుగానే సూచించి హెచ్చరించడం! శిరిడీలో కొందరు సాయిభక్తులు నిర్వహిస్తున్న భోజనశాలలో మొదట భోజనం చేసేవాడు శ్రీఉపాసనీ. కానీ కొంతకాలం గడిచాక ఆ భోజనశాల నిర్వాహకులకు శ్రీఉపాసనీకి మధ్య ఎవో మనఃస్పర్థలు కలిగాయి. భోజనశాల నిర్వాహకులు తనను అవమానం చేసారని వారిపై కినుకతో భోజనం మానేసి పస్తులుండటం ప్రారంభించాడు శ్రీఉపాసనీ. సాటి సాయిభక్తులు ఎంత నచ్చచెప్పజూసినా, స్వయంగా బాబానే ఎన్నోసార్లు చెప్పినప్పటికీ శ్రీఉపాసనీ తన ఉపవాసదీక్షను విరమించలేదు. ఆ నిరసన వ్రతాన్ని దైవం నిర్ణయించిన ఒక తపోదీక్షగా భావించి మొండిగా మూర్ఖంగా కొనసాగించాడు. శ్రీఉపాసనీ తనకై తాను విధించుకున్న కఠిన ఉపవాసదీక్షను చూచిన గ్రామస్తులు ఆయనను "ఉపవాసీ బాబా" అని పిలిచేవారు. దీర్ఘకాలం కఠిన ఉపవాసాలవల్ల శ్రీఉపాసనీ దేహారోగ్యమేగాక మానసిక స్వస్థత కూడా దెబ్బతిన్నది; 1913 ఏప్రిల్ లో చాలా ప్రమాదకరంగా పరిణమించింది కూడా. శ్రీసాయి అనుగ్రహవిశేషము మార్గదర్శకత్వము లేనట్లయితే శ్రీఉపాసనీ శాశ్వతంగా పిచ్చివాడై అలానే మరణించి వుండేవాడేమో! శ్రీఉపాసనీని ఆ ప్రమాదస్థితి నుండి తప్పించి, స్వస్థత చేకూర్చడానికి శ్రీసాయి తమ దివ్యశక్తితో ఏం చేసారో మనకు అగోచరం. శ్రీఉపాసనీ స్వస్థుడవడానికి బాహ్యంగా మాత్రం బాబా చేసిన చికిత్స, ఇచ్చిన ‘ఔషధం’ మాత్రం- ఆహారం!

శాశ్వతమైన ఆత్మానందాన్ని పొందేందుకు క్షణికమైన ఇంద్రియసుఖాలనన్నింటిని త్యజించి ‘అనిత్యమైన’ దేహాన్ని రకరకాల క్లేశాలకు గురిచేయడమే ‘తపస్స’ని చాలామందికున్న అవగాహన. శరీరాన్ని ఎంత ఘోరంగా కష్టపెడితే అది అంత ‘ఉగ్రతపస్సు’ క్రింద లెక్క! నిజానికి మొదట్లో ‘తపస్సు’ అనే పదానికి ఈనాటి మన వ్యవహారంలో మనకు స్ఫురిస్తున్న పైన చెప్పిన అర్థం లేదు! ‘తపస్సు’ అనే పదం ‘తప్’ అనే ధాతువు నుండి పుట్టింది. ‘తప్’ శబ్దానికి ‘కాల్చుట’, ‘వేడి’, ‘తపన’ అని అర్ధాలున్నాయి. “స తపో తస్యత”. ఆ వేడి ఎటువంటి వేడి? ఏదో ఒక కార్యాన్ని సాధించాలని ఆతురపడే వ్యక్తి అంతరంగంలో ఆలోచనల ఒరిపిడి నుండి పుట్టే వేడి; మంత్రోచ్ఛాటన చేస్తూ హోమాగ్ని ముందు కూర్చుని వున్న యజ్ఞదీక్షితుడు అనుభవించే వేడి; ఆత్మసాక్షాత్కారం కోసం తపించే సాధకుని తీవ్ర హృదయ సంవేగనం నుండి బయల్పడే వేడి; భగవత్సాక్షాత్కారం కోసం అనన్య ప్రేమ జ్వరంతో పరితంపించే భక్తుని విరహాగ్ని నుండి ఉద్భవించే వేడి; చిత్తవృత్తులను నిరోధించి తీవ్రధ్యానయోగ తత్పరుడైన యోగి యొక్క ప్రాణాగ్ని నుండి ప్రభవించే వేడి; ‘తపః’ శబ్దం తెలియజెప్పే వేడి – అటువంటి వేడి! అటువంటి వేడిని (ఉత్తేజాన్ని) సాధకునిలో పుట్టించేది, ఆ వేడితో వ్యక్తి హృదయంలోని దుఃఖకారకాలైన మలినవాసనలను మండించి మసిచేసే మార్గమే ఆధ్యాత్మిక మార్గం! అందుకే దానిని తప్తమార్గమన్నారు!

కానీ, కాలాంతరంలో యీ ‘తపస్సు’లోని ‘వేడి’ ‘వాడి’ అంతరించి, నానారకాల ఉపాయాలతో శరీరాన్ని బాధించి తపింపచేయటమే ‘తపస్సు’ అనే భావం పాదుగొల్పుకొన్నది. అలాంటి ఆత్మహింసాకరమైన సాధనాలలో శరీరాన్ని ఆకలితో అలమటింపచేయటం ఒక ప్రధాన ‘తపస్సు’గా తయారైంది. “వ్రతోపవాస నియమైః శరీరోత్తాపనం తపః”– అని కొన్ని గ్రంథాలు తపస్సును నిర్వచించాయి. మొదట్లో యీ ఉపవాసమనే ‘తపస్సు’ను ఏదైనా నేరంగానీ పాపంగానీ చేసిన వ్యక్తికి ప్రాయశ్చిత్తకర్మగా (-అంటే, శిక్షగా) ధర్మశాస్త్రగ్రంథాలు విధించాయి. ధర్మశాస్త్రగ్రంథ పరిభాషలో ‘తపస్సు’ అనేది ప్రాయశ్చిత్తానికి పర్యాయపదం. ఉదాహరణకు యాజ్ఞవల్క్యస్మృతి ఇటువంటి ప్రాయశ్చిత్త రూపమైన తపస్సును నిర్వచిస్తూ ఇలా అంటున్నది:

“విధినోక్తేన మార్గేణ కృచ్ఛచాన్ద్రాయ నాదిభిఃl
శరీర శోషణం ప్రాహుః తపసాం తపముత్తమంll”

- అంటే, 'శాస్త్ర ప్రతిపాదితమైన మార్గాన్ననుసరించి కృచ్ఛ చాంద్రాయణాదుల ద్వారా శరీరమును శోషింపజేయటము ఉత్తమమయిన తపము' అని అంతేకాదు! ‘ఉప’ అంటే ‘తిరిగి వెనక్కురావడమ’నీ, ‘వాస’మంటే జీవితం గడపడమ’నీ, ఉపవాసమంటే పాపం చేసినందువల్ల మలినమైన జీవితంనుండి వెనక్కు మరలి, పవిత్ర జీవతం గడపడమనీ - ‘ఉపవాస’ పదానికి పురాణోక్తమయిన నిర్వచనం.

((చాంద్రాయణ వ్రతమంటే చాంద్రమాసంలోని శుక్లపక్షంలో మొదటిరోజున ఒక్క ముద్ద (పిడికిలిలో పట్టేంత) మాత్రమే ఆహారం తీసుకొని, రెండవరోజు రెండు ముద్దలు, మూడవరోజు మూడు ముద్దలు, ... ఇలా పెంచుకుంటూ పోయి, పౌర్ణమి మరుసటిరోజునుండి, అంటే కృష్ణపక్షంలో రోజుకొక్క ముద్ద చొప్పున తగ్గిస్తూ, అమావాస్యనాడు పూర్తిగా నిరాహారంగా వుండటం. ఇటువంటివే కృచ్ఛము, పరాకము, సాంతపనము, ప్రాజాపత్యము మొదలయిన ఉపవాసవ్రతాలు. పాపపరిహార్థం చేసే ప్రాయశ్చిత్త విధులుగ ధర్మశాస్త్రగ్రంథాలలో ఇవి వివరింపబడివున్నాయి.))

ఆధ్యాత్మిక విద్యపై అగ్రవర్ణాల గుత్తాధిపత్యం, వర్ణవిభేదాలు, కులవైషమ్యాలు పెచ్చుమీరిన కాలంలో రచింపబడిన కొన్ని గ్రంథాలలో స్త్రీ శూద్రులకు వేదాధ్యయనము మొదలయిన ఆధ్యాత్మిక విద్యలు నిషేధింపబడ్డాయి. ఆ గ్రంథకర్తల దృష్టిలో స్త్రీ శూద్రులు ‘పాపయోనులు’, అపవిత్ర శరీరులు! పూర్వజన్మలో వారు చేసిన పాపాల ఫలితంగా అలా నీచజన్మలను పొందినవారు! కనుక వారు పవిత్రులవడానికి పాపపరిహారార్థం పాటించే ప్రాయశ్చిత్తవిధులే వారికి సరైన తరుణోపాయాలుగా నిర్ణయించి, ఆ ఉపవాసాది శిక్షలనే వ్రతాలపేర వారు చేయదగిన (అర్హమైన) ఆధ్యాత్మిక సాధనలుగా విధించారు. క్రమేణా ప్రజాబాహుళ్యంలో తాము పాపకర్ములమనే ‘పాపాత్మభావన’ పెరగడం వల్ల కాబోలు, యీ ఉపవాసం వంటి (ప్రాయశ్చిత్త) వ్రతాలకు అన్ని వర్గాలలోను ఆదరణ పెరిగి ఈనాడు సార్వజనీనంగా అవి ఉత్తమ ఆధ్యాత్మికసాధనాలుగ ప్రాచుర్యం పొందాయి. కానీ యీ విధమైన ఆత్మహింసాకర ప్రవృత్తులను ప్రక్రియలను మహాత్ములేకాదు, ఉత్తమ ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా ఎప్పటికప్పుడు నిరసించి ఖండిస్తూనే వచ్చాయి.

“జడాస్తమ పోభిః శయన్తిదేహం, బుధామనశ్చాపి వికారహేతుంl
శ్వాముక్త మస్త్రదళతీతి కోపాత్, క్షేప్తార ముద్దిశ్య హనస్తి సింహఃll”

-అంటే, 'జడబుద్ధులు (మూర్ఖులు) శారీరక తపస్సుచే (ఉపవాసాదులచే) తమ శరీరమును కృశింపచేసుకొంటారు. బుద్ధిమంతులు సర్వవికారములకు కారణభూతమైన మనస్సును శమింపచేస్తారు. కుక్కను కర్రతో కొడితే ఆ కుక్క కసి తీర్చుకోవడానికి ఆ కర్రను కరుస్తుంది; అదే సింహమైతే కోపంతో ఆయుధాన్ని ప్రయోగించిన వానిపై ఉరికి, వానినే చంపుతుంది'.

“అహింసా సత్యవచనం అన్యశంస్యం దమోఘృణాl
ఏతత్తపో విదుర్ధీరా న శరీరస్య శోషణమ్ll”

'అహింస, సత్యము పలకడము, ఇతరులకు దుఃఖము కలిగించే పనులు చేయకుండడము, దమము, దయ ఇవియే తపములని విజ్ఞులు చెప్తారు; శరీరాన్ని శోషింపచేడం తపస్సు కానేకాదు'.

“దేహ దండణ మాత్రేణ కాముక్తి రవివేకినామ్l
వల్మీక తడానాద్దేవి మృతః కిం సుమనోరగఃl
మాసపక్షోపవాసేన మన్యస్తేయే తపోజనాఃl
ఆత్మతన్తూప ఘాతాస్తే న తపస్స తతాం మతంll”

- అంటే, 'శరీరాన్ని కష్టపెట్టినంత మాత్రాన ఆ అవివేకికి ముక్తి లభిస్తుందా? పుట్టపైన కొట్టినంత మాత్రాన ఆ పుట్టలోని పాము చస్తుందా; ... మాసం పక్షము రోజులు ఉపవాసము ఉండటమే తపస్సు అని కొందరనుకుంటారు. (నిజానికి అలా చేయడం వల్ల) వారు తమ ఆత్మతంతువును నశింపచేసుకుంటున్నారు. సత్పురుషులు దానిని తపస్సుగా అంగీకరించరు'.

అందుకే సత్పురుష శ్రేష్టుడైన శ్రీసాయినాథుడు కూడా ఇలాంటి ‘ఉపవాస తపవాసాలను’ అంగీకరించలేదు. హఠంతో (-అంటే, మొండిగా) దేహాన్ని వివిధ క్లేశాలకు గురిచేసి చేసే సాధన హఠయోగాభ్యాసానికి చెందిందని సామాన్యంగా అనుకోవడం కద్దు. కానీ, అది కేవలం అవగాహనా లోపంవల్ల కలిగిన దురూహ మాత్రమే. ఉదాహరణకు ప్రామాణిక హఠయోగ శాస్త్రగ్రంథాలలో ఒకటైన ఘేరండ సంహిత ఆహారనియమాన్ని గూర్చి ఏం చెబుతున్నదో చూద్దాం.

“ఏకాహారం నిరాహారం యమాన్తేచ న కారయేత్ll”

- అంటే, 'ఒంటిప్రొద్దు భోజనం, మూడుగంటలకు మించి నిరాహారంగా ఉండడం (యోగాభ్యాసి) చేయరాదు' అని!

ఈ సందర్భంలో మరొక్క విషయం వివరించవలసిన అవసరం వుంది. పరిపూర్ణులయిన మహాత్ముల చరిత్రలను పరిశీలిస్తే, వారు తమ జీవితంలో ఏదో ఒక దశలో, దేహాన్ని కఠిన శ్రమలకు గురిచేసి, ఎంతోకాలం తీవ్ర ‘తపస్సు’లో నిమగ్నమైనవారనే విషయం గోచరిస్తుంది. ఎవరి మాటో ఎందుకు? ఉదాహరణకు శ్రీసాయిచరిత్రనే తీసుకొందాం. ఒకసారి ఒక సాధకుడు సమయానికి సరైన భోజనం లభించలేదని సతమతమౌతుంటే, అతనితో బాబా మందలింపుగా ఇలా అన్నారు: “ఒక్కపూట తిండి దొరకనందుకే అంత ఆరాటపడతావేం? నేను కొన్ని మాసాలపాటు భోజనం లేకుండా కేవలం 'కాలాటెక్కల్' ఆకులు, వేపాకు తిని గడిపాను. వీసమెత్తు కండన్నమాట లేకుండా దేహం మొత్తం ఎముకల ప్రోగులా తయారైంది. ఆ ఎముకలు కూడా ఎప్పుడు ఊడిపోయి రాలిపోతాయా అన్నట్లుండేవి. అయినా, నా శరీరం నుండి ప్రాణాలు మాత్రం పోలేదు. దయామయుడైన ఆ భగవంతుని సంకల్పం అలా వుంది!”

అయితే బాబా వర్ణించిన ‘స్థితి’ సామాన్య సాధకులు ప్రారంభంలోనే ‘అనుకరించ’దగిన ఆదర్శం కాదు. బాబావలె నెలల పర్యంతం కేవలం వేపాకులు తిని జీవించడం సామాన్యులకు అసలు అసాధ్యమైన కార్యం. ఆత్మజ్ఞానోదయమయిన వెంటనే, హృదయకుహర కవాటాలను బ్రద్దలుకొట్టుకొని పొంగిపొరలే ఆత్మానంద రసానుభూతిలో, దేహస్ఫురణ కూడా కొట్టుకొని పోయినప్పటి పరిస్థితి వారిది! ఆ స్థితిలో ఆహార సేకరణ వంటి దేహావసరాలను పట్టించుకోవడం అసాధ్యమవుతుంది. ఆ దశ వైరాగ్యంతో ఆ మహాత్ములు వారికై వారు స్వచ్ఛందంగా విధించుకొన్న నియమం కాదు. ఆ స్థితిలో సహజంగా కలిగే అనివార్య పరిణామం.

ఈ విషయాన్ని సందేహాలకు తావు లేకుండా ఇంకొంచెం వివరంగా తెలుపుతున్నది  భగవాన్ శ్రీరమణమహర్షి అనుభవం. అరుణాచలం చేరిన మొదటి రోజుల్లో ఎంతో కాలం దేహస్ఫురణను కూడా విస్మరించి ఆత్మానందంలో అంతర్ముఖుడై వుండిన మహర్షి అప్పటి తమ ‘స్థితి’ని గూర్చి తామే ఒకసారి స్వయంగా ఇలా చెప్పారు: “ఇక్కడకు (అరుణాచలం) వచ్చిన మొదటిరోజుల్లో కళ్ళుమూసుకుని ఒకే ధ్యానంలో ఉంటే, రాత్రేదో పగలేదో తెలిసేది కాదు. ఎప్పుడైనా కళ్ళు తెరిచి చూస్తే, అప్పుడే ప్రొద్దుకూకిందా? తెల్లవారిందా? అనిపించేది. ఆహారం లేదు, నిద్ర లేదు. విహారం వుంటే ఆహారం కావాలి. ఆహారం వుంటే నిద్ర వస్తుంది. విహారం లేకుంటే ఆహారం వద్దు. ఆహారం లేకుంటే నిద్రరాదు. ప్రాణాధారంగా ఏ స్వల్పాహారమో కుక్షిలో పడితే చాలు. నాకంతే అయ్యేది. కళ్ళు తెరచినప్పుడు ఎవరో ఒకరు ద్రవరూపంలో ఏదో ఒకటి ఒక గ్లాసు ఆహారమిచ్చేవారు. అంతే! అయితే ఒకటి. ఒకే నిర్వికల్ప నిష్ఠలో ఉన్నప్పుడే తప్ప, మనస్సు శరీరం వ్యవహారార్థం ఉపయోగించినపుడు ఆహారనిద్రలు విసర్జించుటకు వీలు కాదు అట్లాచేస్తే శరీరం తూలుతుంది. ... అందువల్ల మిత సాత్వికాహార విహార నియతి ఆత్మోన్నతికి అత్యంతావశ్యకమని చెప్పవలసి ఉన్నది. ... అంటే, ఆహారనిద్రలు అసలు మానడం మంచిది కాదు. అతిగానూ ఉండకూడదన్నమాట!”

హఠాత్తుగా ఆ మహాత్ములలో వరదలా పొంగిన దివ్యభావావేశపు ఉధృతి తగ్గి, ఆ ఆత్మానందస్థితి వారికి సహజము స్వాభావికము అయిన తరువాత, అటు శ్రీసాయిబాబా గానీ, ఇటు భగవాన్ శ్రీరమణమహర్షిగానీ, నిత్యం భిక్ష చేసి స్వల్పంగా భుజించేవారే తప్ప వారేనాడూ ఉపవాసం చెయ్యలేదు! అంతేకాదు! ఇక్కడ గమనించవలసిన విషయం మరొక్కటున్నది. అంతటి దేహవిస్మృతిని కల్గించే అంతర్ముఖావస్తలోనున్న మహాత్ములను కూడా జీవధర్మమైన ‘ఆకలి’ బహిర్ముఖులను చేసి, ప్రాణాధారంగా ఏ ఆకులో అలములో తినవలసిన అవసరాన్ని కలిగించింది. ఇక, సామాన్య సాధకుల విషయం చెప్పాలా? రుచిని పట్టించుకోకుండా ఏదో ఒకటి తిని సాధన చేసుకోవాలి తప్ప, నిరాహారం నిషిద్ధం, అనర్థం కూడా!

“అత్యాహార మనాహారం నిత్యం యోగీ వర్జయేత్” - (యోగి ఎల్లప్పుడూ అత్యాహారాన్ని, నిరాహారాన్ని త్యజించాలి!) అన్న శృతి ఆదేశంలోని అర్థం ఇదే. అదే, భోజనం దొరకలేదని బాధపడుతున్న సాధకునికి బాబా చేసిన హితవులోని అంతరార్థం.

శ్రీసాయిబాబా ఉపవాసాలనెంత మాత్రం ఆమోదించకున్నా, ఎందరో సాయిభక్తులు బాబా పేర గురువారాలు, లేదా వారు అనుకొన్న (ఎన్నుకొన్న) మరో రోజునో ఉపవాసాలుండటం పరిపాటి అయింది. శ్రీసాయిచరిత్ర-బోధనల పట్ల సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణం. గురువారాలు ఉపావాసాలుండటాన్ని గూర్చి బాబానే స్వయంగా ఏం చెప్పారో చూద్దాం!

శ్రీM.W.ప్రధాన్ అనే సాయిభక్తుడు ఒకసారి తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా శిరిడీలో షామా ఇంట్లో విందు ఏర్పాటుచేసి, సాటి సాయిభక్తులందరినీ ఆహ్వానించాడు. ఆ రోజు గురువారం కనుక తాను భోజనం చేయననీ అందువల్ల విందుకు హాజరు కాలేననీ ప్రధాన్ కు క్షమాపణ చెప్పి, బాబా వద్దకు వెళ్ళాడు బాలాభాటే. భాటేను చూడగానే శ్రీసాయిబాబా, “భావు (ప్రధాన్) యేర్పాటు చేసిన విందుకు వెళ్ళి భోంచేసావా?” అని అడిగారు.

భాటే: “బాబా ఈరోజు గురువారం!”

బాబా: “ఓహో! అయితే ఏమిటిట?”

భాటే: “నేను గురువారాలు భోజనం చెయ్యను. అది నా నియమం!”

బాబా: “ఎవరి ప్రీతి కోసం ఈ నియమం పెట్టుకున్నావు?”

భాటే: “మీ ప్రీతి కోసమే!”

బాబా: “అయితే నేనే చెబుతున్నాను. పో! పోయి భావుతో పాటు భోజనం చేయి!”

అప్పటికే సాయంత్రం నాలుగయింది. అయినప్పటికీ ప్రధాన్ ను కలుసుకొని, బాబా ఆజ్ఞ గురించి చెప్పి భోజనం చేసాడు శ్రీభాటే.

తన ప్రీతికోసమని గురువారం తదితర దినాలలో ఉపవాసముండటాన్ని బాబా అంగీకరించకపోయినా, కనీసం అనూచారంగా వస్తున్న ఏకాదశి, మహాశివరాత్రి వంటి పవిత్రదినాలలో ఉపవసించడం మాటేమిటి? ప్రజాసంస్కృతిలో భాగంగా పాదుకొనిపోయిన అలాంటి ఆచార వ్యవహారాల పట్ల మతసాంప్రదాయాల పట్ల గౌరవంతో (తమకిష్టం లేకపోయినా) బాబా ఉపేక్ష వహించి ఊరుకొన్నారా? లేక, వాటినీ నిష్కర్షగా త్రోసిపుచ్చారా? - సరి! ఇప్పుడిక ఈ అంశాన్ని పరిశీలిద్దాం!

శ్రీసాయిని ప్రత్యక్షంగా సేవించిన భక్తులందరిలో బాబాతో అత్యంత చనువు సాన్నిహిత్యం గల భక్తుడు శ్రీతాత్యాకోతేపాటిల్. బాబాతో సుమారు పదునాల్గు సంవత్సరాలపాటు రాత్రిళ్ళు మసీదులో నిదురించే మహదవకాశం పొందిన భాగ్యశాలి శ్రీతాత్యా. బాబా-తాత్యాల అనుబంధాన్ని చూచిన వారు తాత్యాను బాబా ప్రాణాధికంగా ప్రేమించేవారని అనుకొనేవారు. అటువంటి సన్నిహిత సాయిభక్తుడైన శ్రీతాత్యాకోతేపాటిల్ తన ‘స్మృతులలో’ ఇలా అంటారు:

“నేను ఏకాదశి, శ్రావణ సోమవారాలు, మహాశివరాత్రి మొదలైన పర్వదినాలలో తప్పక ఉపవసించేవాడిని. కానీ, ఉపవాసం వల్ల ఇటు ఐహికంగాగానీ, అటు ఆధ్యాత్మికంగాగానీ ఏమీ ప్రయోజనం లేదని బాబా అభిప్రాయం. ఆ పర్వదినాలలో నేనెంత ఉపవశించాలని యత్నించినా బాబా నాచేత ఏదో తినిపించి ఉపవాసాన్ని భంగం చేసేవారు. ఒక శివరాత్రినాడు నేను బాబాతో, 'బాబా, దయచేసి ఈ శివరాత్రి నాడైనా నా చేత ఏమి తినిపించకండి. నన్నీ రోజైనా ఉపవాసం చెయ్యనివ్వండి!' అని అన్నాను. 'తినరా! తిను! ఏం శివరాత్రి?' అన్నారు బాబా. ప్రక్కనే వున్న దాదాకేల్కర్ కూడా బాబా చెప్పినట్లే చెయ్యమని, ఆయన మాటను ఉల్లంఘించవద్దని హెచ్చరించాడు. నేనిక బాబా మాటకు అడ్డుచెప్పలేదు. ఆ నాటినుండి నేనే రోజునా ఉపవాసం చెయ్యలేదు”.

శ్రీసాయి వంటి అద్భుత అవతారపురుషునితో అంతటి సాన్నిహిత్యం సాంగత్యం గల తాత్యావంటి ధన్యజీవులకు సామాన్య ఆధ్యాత్మిక నియమాలతో ఇక అవసరం ఏముంటుంది? కానీ, తాత్యా అంతటి భాగ్యానికి నోచుకోని సామాన్యభక్తులకు ఏకాదశి ఉపవాసం వంటి ‘సదాచార’ విధులను పాటించడం ఉత్తమం కదా?- అనే సందేహం కొంతమందికి కలుగవచ్చు! అటు సన్నిహిత భక్తులకైనా, ఇటు కేవలం సందర్శకులవంటి సామాన్య భక్తులకైనా ఉపవాసాది ఆచారాల విషయంలో బాబా తమ వైఖరిని నిర్ద్వంద్వంగానే ప్రకటించారు. శ్రీమతి గోఖలే అనుభవాన్ని ముందు తెలుసుకొన్నాం. శ్రీ శాంతారాం నాచ్నే అనుభవం ఈ విషయాన్ని ఇంకా తేటతెల్లం చేస్తుంది. 


శాంతారాం బల్వంత్ నాచ్నే తన మిత్రులైన శంకర బాలకృష్ట వైద్య, అచ్యుత దాతేలతో కలిసి 1912 లో శిరిడీ సందర్శించారు. బాబా సన్నిధిలో మూడురోజులున్నారు. వారు శిరిడీ చేరిన మరుసటిరోజు ఏకాదశి. వైద్య, దాతే ఛాందసభావాలు కలిగినవారు. ఏకాదశిరోజున భోజనం చెయ్యరు. నాచ్నేకు ఉపవాస నియమం లేకపోయినా తోటి మిత్రులను విడచి ఒక్కడే భోజనం చేయడం బాగుండదని, ఏమీ తినకుండా మశీదు చేరాడు. మధ్యాహ్నఆరతికి సమయం అయ్యింది. భక్తులందరూ మశీదు చేరుకుంటున్నారు. బాబా అప్పుడు నాచ్నేను పిలిచి “భోజనం చేసావా?” అని అడిగారు. నాచ్నే 'లేదని' చెప్పాడు.

బాబా: "అయితే వెళ్ళి భోంచేసిరా!"

నాచ్నే: "బాబా! ఈరోజు ఏకాదశి!"

బాబా: (నాచ్నే మిత్రులిద్దరినీ చూపుతూ) "వీళ్ళు పిచ్చివాళ్ళు. నీవు సాఠేవాడాకు పోయి భోజనం చేసిరా!" అన్నారు.

బాబా ఆజ్ఞ ప్రకారం నాచ్నే సాఠేవాడాకు వెళ్ళి అక్కడ భోజనశాలను నిర్వహిస్తున్న బాలాభావ్ అనే భక్తుని భోజనం పెట్టమని అడిగాడు. ఏకాదశినాడు కూడా నాచ్నే తిండి కోసం కొట్టుకుంటున్నాడని విసుక్కొంటూ, ఆరతి అయిందాకా భోజనం పెట్టనని చెప్పి, బాలాభావ్ ఆరతికి మసీదుకు వెళ్ళాడు. అతని వెనుకనే నాచ్నే కూడా మసీదు చేరాడు. నాచ్నేను చూడగానే బాబా, “భోజనం చేసావా?” అని అడిగారు. నాచ్నే జరిగిందంతా చెప్పకుండా, “బాబా, ఆరతి వేళ అయింది కదా! ఆరతి అయిన తర్వాత భోజనం చేస్తాను” అని సర్ది చెప్పబోయాడు. కానీ బాబా పట్టుదలగా, “నీవు భోజనం చేసిన తర్వాతనే ఆరతి మొదలవుతుంది. అంతవరకు ఆరతి ఆగుతుందిలే! నీవు పోయి భోజనం చేసిరా!” అని అన్నారు. అక్కడే వున్న బాలాభావ్ కిక నాచ్నేకి భోజనం వడ్డించక తప్పలేదు. నాచ్నే భోజనం చేసి మసీదుకు వచ్చిన తర్వాతనే ఆరతి ప్రారంభమయ్యింది. అదే సమయానికి మౌసీ అనే వృద్ధభక్తురాలు బాబాకు తాంబూలం (బీడా) సమర్పించింది. బాబా ఆ తాంబూలం నాచ్నేకిచ్చి వేసుకోమన్నారు. ఏకాదశినాడు తాంబూల చర్వణం నిషిద్ధం. అందుకని నాచ్నే కొంచెం ముందువెనుకాడుతుంటే, “సందేహించకు, ఊఁ! వేసుకో!” అన్నారు బాబా. నాచ్నే బీడా వేసుకున్నాడు. ఆ విధంగా ఏకాదశినాడు భోజనమే కాకుండా, తాంబూలసేవనం కూడా చేయించి, అర్థంలేని ఆచారాలు వ్యర్థమని తమ ప్రత్యేక పంథాలో ఉపదేశించారు బాబా.

ఏకాదశి నియమం లేని నాచ్నేను భోజనం చేయమన్నారు కానీ, ఆ నియమం వున్న నాచ్నే మిత్రులను భోజనం చేయమని బాబా చెప్పలేదు. కనుక, ఈ నియమాలను బాబా గౌరవించినట్లేనని కొందరు బుద్ధిమంతులు వాదించవచ్చు. నాచ్నే మిత్రులిద్దరినీ బాబా భోజనం చెయ్యమని చెప్పకపోవడానికి కారణం – ఆ నియమాలపట్ల గౌరవం వుండి కాదని వారినుద్దేశించి, "వీరంతా పిచ్చివాళ్ళు" అని బాబా అనడంలోనే తేటతెల్లమవుతుంది. పూర్వాచారపరాయణత్వమనే ‘పిచ్చి’ తలకెక్కిన "పిచ్చివాళ్ళు" తాను భోజనం చేయమని చెప్పినా వినరని బహుశా వారిని వదిలిపెట్టి వుండవచ్చు! ఎందుకంటే ఆ వెంటనే జరిగిన సంఘటనే ఆ విషయాన్ని నిరూపిస్తుంది.

ఆరతి అయినవెంటనే ఒక మార్వాడీ బాలిక బాబా దగ్గరకొచ్చి ఏదైనా పండు వుంటే ఇవ్వమని అడిగింది. బాబా అప్పుడు నాచ్నే మిత్రుడైన దాతేతో, “వెళ్ళి నీవు దాచుకున్న నారింజపళ్ళను తీసుకురా!” అన్నారు. ఏకాదశి ఉపవాసం దృష్ట్యా మామూలు ఆహారానికి బదులుగా ‘ఫలహారం’ కోసమని కొన్ని నారింజ పండ్లు ప్రొద్దునే అట్టిపెట్టుకున్నాడు దాతే. కానీ బాబా ఆ పళ్ళు తెమ్మని అడిగితే, అవి తాను ఏకాదశి ఫలహారం కోసం వుంచుకున్నానని చెప్పి, ఆ పండ్లు ఇవ్వలేదు! బాబా కూడా అతణ్ణి మరి ఒత్తిడి చేయలేదు.

“గురువు సకల ధర్మాత్ము”డని నమ్మి, అలా ఆచరించిన నాచ్నేకు విశేషంగా సద్గురు ప్రసాదం లభిస్తే, కరడు కట్టిన సనాతన ఆచారాలు తలకెక్కిన ఛాందసునికి, ఒక పసిబిడ్డ కోసం శ్రీసాయియే స్వయంగా అడిగినా ఒక పండు కూడా సమర్పించుకోలేని ‘సంస్కారం’ మిగిలింది.

సద్గురు కృపకు శరణాగతికి మనను దూరం చేసే బూజు పట్టిన ఆచారాల బారినుండి మనను ఆ సాయినాథుడే కాపాడుగాక!

Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo