సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

రామచంద్ర వామన్ మోదక్



సాయిభక్తుడు రామచంద్ర వామన్ మోదక్ పూణేలోని సదాశివపేట నివాసి. అతను మొట్టమొదటిసారిగా 1909వ సంవత్సరంలో శిరిడీ వెళ్లి సాయిబాబాను దర్శించాడు. స్వతహాగా అతనికి వేదాంతం, ఆధ్యాత్మిక గ్రంథ అధ్యయనం పట్ల మక్కువ. అయినప్పటికీ అతను ఇతర భక్తుల మాదిరి భక్తిశ్రద్ధలతో బాబా వద్దకు వెళ్ళలేదు. అప్పటికి అతని మనసున ప్రాపంచిక వాసనలు పోలేదు. అయితే తొలి దర్శనంలోనే అతను బాబాపట్ల ఎంతగానో ఆకర్షితుడై తరచూ శిరిడీ వెళ్ళడం ప్రారంభించాడు. 1912లో శిరిడీ వెళ్ళినపుడు అతనికి ఎప్పటికీ మరచిపోలేని గొప్ప అనుభూతి కలిగింది.

అప్పట్లో మోదక్ పశ్చిమ ఖాందేశ్ పురపాలక మరియు స్థానిక ఖాతాల విభాగంలో జమాఖర్చులు చూసే సీనియర్ ప్రభుత్వ అధికారిగా పనిచేస్తుండేవాడు. అతని ప్రధాన కార్యాలయం ముంబాయిలో ఉండేది. కానీ అతను తన భార్యాబిడ్డలను ధూళియాలో ఉంచాడు. 1912లో అతనికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. శాఖాపరమైన పరీక్షకు హాజరుకమ్మని అతనిపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయి. దాంతో అతనిని ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఒక ఉన్నతాధికారికి అతనిని సర్వీసులో కొనసాగడానికి అనర్హుడిగా ప్రకటించి ఉద్యోగం నుంచి తొలగించేందుకు గొప్ప అవకాశం లభించింది. అందువల్ల మోదక్, 'పరీక్ష వ్రాసి పదోన్నతిని, అధిక జీతాన్ని పొందడమా? లేక, వస్తున్న 120 రూపాయల జీతంతో భద్రంగా ఉన్న ఉద్యోగంలో ఉంటూ పరీక్షకు హాజరుకాకుండా ఉండటమా?' అన్న సందిగ్ధంలో పడ్డాడు. అటువంటి స్థితిలో బాబా సర్వజ్ఞత, దయ మరియు అన్నిటిపై నియంత్రణగల ఆయన శక్తి గురించి తెలిసిన అతను బాబా ఒక్కరే తనకు సరైన మార్గనిర్దేశం చేయగల సమర్థులనీ, కాబట్టి వారినే శరణుపొందాలనీ నిర్ణయించుకున్నాడు. దాంతో అతను ఎవరికీ చెప్పకుండా, త్వరగా వెళ్లి, త్వరగా తిరిగి వచ్చేద్దామన్న ఉద్దేశ్యంతో, సెలవు అవసరం లేదని తలచి సెలవు కూడా తీసుకోకుండా ముంబాయి నుండి శిరిడీకి ప్రయాణమయ్యాడు. నేరుగా శిరిడీ వెళ్ళి బాబాను దర్శించాడు. బాబా దర్శనంతో అతనికెంతో ఉపశమనంగా అనిపించింది. బాబా సన్నిధిలో చింతలన్నీ తొలగిపోయి ఆత్మానందంలో మునిగిపోయాడు(ఇది భక్తులందరి అనుభవం). మరుసటిరోజు ఉదయం 7 గంటలకు అతను తిరుగు ప్రయాణానికి అనుమతికోసం బాబా వద్దకు వెళ్ళాడు. కానీ బాబా అతనికి అనుమతినివ్వలేదు. అతను ఒకటే అనుకున్నాడు, 'నేను సెలవు పెట్టకుండా, అధికారుల అనుమతి తీసుకోకుండా అక్రమ పద్ధతిలో శిరిడీ వచ్చాననీ, కనీసం నా కుటుంబానికి కూడా చెప్పలేదనీ సర్వజ్ఞులైన బాబాకు తెలుసు. ఇప్పుడు ఏ తీవ్రపరిణామాలు వచ్చినా బాబానే బాధ్యత వహించాలి' అని. అయితే అతని ఇబ్బందులన్నీ తెలిసిన షామా అతని తరఫున బాబా వద్దకు వెళ్లి, "బాబా! ముంబాయి వెళ్ళడానికి అతనికి అనుమతి ఇవ్వండి" అని అడిగాడు. బాబా కోపంతో, "అతను నన్ను చూడటానికి వచ్చాడు, నిన్ను చూడటానికి కాదు" అని అంటూ, మోదక్ వైపు తిరిగి, "నువ్వు నన్ను చూడటానికి వచ్చావా? లేక మాధవరావునా?" అని అడిగారు. తరువాత బాబా అతనితో, "ఇతర విషయాలలో మాదిరిగానే ఉద్యోగ విషయంలో కూడా అంతా సవ్యంగా జరుగుతుంది" అని హామీ ఇచ్చారు.

శిరిడీ వచ్చిన ఐదవరోజు రాత్రి అతనికొక కల వచ్చింది. ఆ కలలో అతను తన ఇంటికి వెళ్ళినట్లు, తన చిన్నకూతురు తనను ఆహ్వానిస్తూ, "ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు?" అని అడుగుతున్నట్లు కనిపించింది. ఒక్కసారిగా అతనికి మెలకువ వచ్చి, తిరిగి వెళ్లేందుకు ఆరోజు ఖచ్చితంగా బాబా తనకు అనుమతిస్తారన్న భరోసా కలిగింది. దాంతో అతను బట్టలు మార్చుకొని, అన్నీ సర్దుకొని బయలుదేరటానికి సిద్ధమయ్యాడు. ఆరోజు కూడా బాబా అనుమతిస్తారని నమ్మకం లేదని స్నేహితులు అంటున్నప్పటికీ అతను వినకుండా మసీదుకు వెళ్ళాడు. అతను మసీదు గేటు వద్దకు వెళ్లేసరికి, బాబా తీవ్రమైన కోపంతో మండిపడుతూ చేతిలో ఒక రాయి పట్టుకుని మసీదులో అటు ఇటు తిరుగుతూ అరుస్తున్నారు. ఆ కోపంలోనే ఆయన గేటు వద్ద నిలబడి ఉన్న మోదక్‌ని గమనించారు. పది నిమిషాల తరువాత వారు శాంతించి, తమ గద్దె మీద కూర్చున్నారు. అప్పుడు మోదక్ మసీదు లోపలికి వెళ్ళి‌ బాబాకు నమస్కరించాడు. అప్పుడు బాబా తమంతట తామే, "ఈ ఊదీ తీసుకుని వెళ్ళు" అన్నారు. ఆ విధంగా అతనికి శిరిడీ విడిచి వెళ్ళడానికి అనుమతి లభించింది. కానీ అతను, 'బొంబాయి వెళ్లి పరీక్ష వ్రాయాలా? లేక, తన కుటుంబం ఉంటున్న ధుళియా వెళ్లాలా?' అన్న విషయంలో బాబా అభిప్రాయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలని తలచి, "బాబా! నన్ను ఎక్కడికి వెళ్ళమంటారో దయచేసి చెప్పండి" అని అడిగాడు. అందుకు బాబా, "ఇంటికి వెళ్ళు. పిల్లలు నీకోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు!" అని అన్నారు. ఆ మాటతో తనకొచ్చిన కల నిజమేనని అతనికి నిర్ధారణ అయింది. అంతేకాక, బొంబాయిలో శాఖాపరమైన పరీక్ష వ్రాయకపోవడమే తనకు మంచిదని బాబా నిర్ణయించినట్లుగా అతను గ్రహించాడు.

బాబా ఆజ్ఞానుసారం మోదక్ శిరిడీ నుండి బయలుదేరి ముందుగా ధూళియా వెళ్ళాడు. ఆ సమయమంతా అతను బొంబాయిలోని ఉన్నాడని అతని కుటుంబం భావించింది. కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపిన తరువాత అతను బొంబాయి వెళ్ళాడు. సాధారణంగా అయితే అనధికారికంగా విధులకు గైర్హాజరైనందుకు కొన్ని ఇబ్బందులు ఎదురుకావాలి. కానీ ఆశ్చర్యంగా అంతా సజావుగా సాగింది. బాబా దయవల్ల అనుమతి లేకుండా అతను విధులకు గైర్హాజరవడం అధికారికంగా గుర్తించకపోవడంతో వృత్తిపరంగా అతనికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదు. అతనెప్పుడు క్యాంపుకెళ్ళినా తనతోపాటు వెళ్లే సహోద్యోగులు మాత్రం తాము లేకుండా అతనెక్కడికి వెళ్లాడోనని ఆశ్చర్యపోయారు.

శిరిడీ నుండి బొంబాయి వెళ్ళేటప్పుడు మోదక్ మన్మాడు మీదుగానే వెళ్ళాలి. ఒకసారి తను పనిచేసే శాఖకు సంబంధించిన డిప్యూటీ కలెక్టర్ మన్మాడు క్యాంపులో ఉంటూ, తనను మన్మాడులో కలవమని మోదక్‌కు లేఖ పంపాడు. కానీ, బాబా మోదక్‌తో, "నువ్వు అక్కడికి వెళ్ళవద్దు. కలెక్టర్ అక్కడ లేడు" అని చెప్పారు. అయినప్పటికీ అతను మన్మాడు వెళ్ళాడు. అక్కడికి చేరాక, ‘ఏదో టెలిగ్రామ్ రావడంతో డిప్యూటీ కలెక్టర్ అక్కడ క్యాంపు రద్దు చేసుకొని వేరే ప్రదేశానికి వెళ్ళిపోయాడ’ని అతనికి తెలిసింది. ఎప్పటిలాగే బాబా చెప్పింది నిజమవుతుందని మరోసారి ఋజువైంది.

1912లో మోదక్ శిరిడీలో ఉన్న ఆరురోజులలో బాబా అతనికి ఆధ్యాత్మిక అనుభవాలను ప్రసాదించి ఎంతగానో ఆకట్టుకున్నారు. దాంతో బాబానే తన సర్వస్వమనీ, తన ఇహపర విషయాల గురించి తానింకేమీ ఆలోచించాల్సిన అవసరం లేదనీ అతనికి అనిపించింది. శిరిడీలో ఉన్న ఆ రోజులు తన జీవితంలోనే అత్యంత విలువైనవిగా అతను భావించాడు. అతను బాబా వద్ద పొందిన దానికి 1914లో అతనికి నిదర్శనం దొరికింది. గోవిందబువా అనే మరో సత్పురుషుడు, 'మార్గదర్శిగా సాయిబాబా విలువను, వారు ప్రసాదించిన అనుభవాలను' అతని మనసుకు హత్తుకునేలా తెలియపరిచాడు.

మోదక్ ధూళియాలో ఉన్న తన కుటుంబం వద్దకు వెళ్లే మార్గంలో సోన్‌గిర్ ఉంది. ఒకసారి ఒక స్త్రీ సోన్‌గిర్‌లో ఉన్న గోవిందబువాను దర్శించమని మోదక్‌కు చెప్పింది. అయినప్పటికీ అతను మధ్యలో ఆగడానికి వీలుపడని విధంగా కార్యక్రమాన్ని రూపొందించుకొని, నేరుగా ధూళియాకు టాంగా మాట్లాడుకున్నాడు. విధివిలాసం వల్ల అతను, అతని వంటవాడు కలిసి ప్రయాణిస్తున్న టాంగా మధ్యలో చెడిపోయి సరిగ్గా సోన్‌గిర్‌ వద్ద ఆగిపోయింది. టాంగా ఇనుపచక్రం ఊడి బయటకి వచ్చేయడంతో, అది సరిచేసి తిరిగి ప్రయాణం కొనసాగించడానికి కనీసం మూడు గంటల సమయం పడుతుందని తెలిసి వంటవాడు వెళ్ళి స్నానం చేసి గోవిందబువా దర్శనం చేసుకొని వారిని, "మా యజమాని వచ్చి మీ దర్శనం చేసుకోవచ్చా?" అని అడిగాడు. అందుకు గోవిందబువా తమ ఆమోదం తెలుపుతూ, "స్నానం చేసి రమ్మ"ని చెప్పారు. అందువల్ల మోదక్ స్నానం చేసి, టెంకాయ, ఒక రూపాయి తీసుకొని వారి దర్శనానికి వెళ్ళాడు. అతను నమస్కరించగానే ఆయన, "అరే దుష్టుడా! నీకు అమూల్యమైనది ప్రసాదించబడింది. నువ్వు దానిని కొంతకాలం రుచి చూసి కూడా వ్యర్థమైన వాటికోసం అక్కడికి, ఇక్కడికి పరుగులు తీస్తున్నావు" అని అన్నారు. ‘వారు చెపుతున్నది 1912లో తాను శిరిడీలో ఉన్న 6 రోజులలో బాబా తనకు ప్రసాదించిన అపూర్వ అనుభవం గురించి’ అని అతనికి అనిపించింది. అంతలో మళ్ళీ ఆయన, "ఎలాగైతేనేం? నీవు నీ స్వగృహానికే వచ్చావు!" అని చెప్పి తమకు, సాయిబాబాకు భేదంలేదని సూచించారు. ఆ తరువాత అతనిని భిక్ష ఏర్పాటు చేయమని శీరా, పూరీ చేయించమన్నారు. వారి మాటలను బట్టి ఆరోజు మఠంలో ప్రసాదానికి అయ్యే ఖర్చు తననే భరించమని చెప్పినట్టుగా అర్థమై అతనలాగే చేశాడు. వంటకాలు తయారైన తరువాత అతని అభ్యర్థన మేరకు గోవిందబువా భోజనానికి కూర్చున్నారు‌. మోదక్ ఒక లోటా నిండా నీళ్ళు నింపి వారి ముందుంచాడు. ఆయన ఆ లోటా నీళ్ళల్లో తన వేలు ముంచి అందులోనుంచి అద్భుతరీతిన ఒక పలుచని పూరీని బయటకు తీసి, "ఇక్కడ కూడా మేము పూరీ తయారుచేశాము" అంటూ దాన్ని తిన్నారు. భిక్షకోసం తయారుచేసిన పూరీ మందంగానూ, గరుకుగానూ ఉంటే, గోవిందబువా లోటాలో నుంచి తీసిన పూరీ మాత్రం చాలా పలుచగానూ, మృదువుగానూ ఉంది. నీటి నుండి పూరీని తీసిన వారి అపూర్వశక్తికి అతను, అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు. అంతటి శక్తిసంపన్నులైన గోవిందబువా అతనికి 1912లో తను సాయిబాబా ద్వారా పొందిన అనుభవం ఎంత విలువైనదో తెలియజేశారు.

‌మోదక్ భార్యకు బాబా పట్ల ఎంతో భక్తి శ్రద్ధలుండేవి. 1916లో తన భార్యతో కలిసి మోదక్ శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకొని, అదేరోజు తిరిగి వచ్చేశాడు. అదే అతను బాబాను చివరిసారిగా దర్శించడం. అతనికి బాబాను దర్శించే అవకాశం ఎక్కువసార్లు లభించలేదు. అతనిలా చెప్పాడు: "బాబా మరణించలేదు. ఆయన ఎప్పటికీ సజీవులై ఉంటారు. వారు సూక్ష్మ అదృశ్యరూపాన అసాధారణరీతిలో నాకు మార్గనిర్దేశం చేయడాన్ని, నా వ్యవహారాలన్నింటినీ నియంత్రించడాన్ని చాలా సందర్భాలలో నేను అనుభూతి చెందాను. ఉదాహరణకు, నేను 1919లో 81 రూపాయల, 8 అణాల పెన్షనుతో పదవీవిరమణ చేశాను. నేను పదవీవిరమణ చేయడం నాకు మంచిదైంది. ఎందుకంటే, వెంటనే నేను నా స్నేహితుని మిల్లులో ఉద్యోగంలో చేరి 1919 నుండి 1930 వరకు పనిచేశాను. నాకు నెలకు రూ.250/- ఆదాయం వచ్చేది. ఈ ఏర్పాటంతా బాబానే చేశారు.

నేను ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతుండేవాడిని. ముఖ్యంగా కంటికి సంబంధించిన సమస్యతో బాధపడేవాడిని. నాకు ఒక కంటికి చూపు పోయింది. నెమ్మదిగా రెండో కంటిలో శుక్లం వృద్ధి చెందసాగింది. కానీ నేను ప్రతి గురువారం పూజించి, నిత్యమూ స్మరించే సాయిబాబా నా అవసరాలన్నింటినీ చూసుకుంటున్నారు. నా ప్రాపంచిక, పారమార్థిక అవసరాల గురించి నాకు ఏ చింతా లేదు. అవి రెండూ బాబా చేతులలో ఉన్నాయి. నేను వారి సంరక్షణలో సురక్షితంగా ఉన్నాను.‌ నాపై వారికున్న కరుణను ఈ క్రింద సంఘటన తెలియజేస్తుంది.

“1916లో నాసిక్‌లో నేను తీవ్రమైన జ్వరంతో, దగ్గుతో మంచం పట్టాను. వైద్యవృత్తిలో ఉన్న నా పాత స్నేహితుడు నాకు వైద్యం చేస్తూ, నాకు వచ్చింది ఊపిరిత్తితుల నాళమునకు సంబంధించిన రోగమని నిర్ధారించి, 'క్లోరాల్ హైడ్రేట్' అను మందును వాడమని సూచించాడు. కానీ నా భార్య నాకు వచ్చిన జబ్బు సామాన్యమైనది కాదని భయపడి, బాబాను ప్రార్థించి డాక్టర్ కల్నల్ బక్లేకు కబురుపెట్టింది. ఆ కబురు అందిన వెంటనే డాక్టర్ బక్లే వచ్చి నన్ను పరీక్షించి, అక్కడున్న క్లోరాల్ హైడ్రేట్ సీసాను చూసి, ‘మొదటి డాక్టర్ చేసిన రోగ నిర్ధారణ సరిగా లేదనీ, ఆ మందు ప్రమాదకరమ’నీ చెప్పి దాన్ని అవతల పారేశాడు. తరువాత నా రోగాన్ని ‘డబుల్ న్యుమోనియా’గా నిర్ధారించాడు. అతని వైద్య పర్యవేక్షణలో బాబా దయవలన నేను కోలుకున్నాను. బాబా ఎంతో కరుణతో నా భార్యకు సరైన సమయంలో సమర్థుడైన వైద్యునికి కబురుపెట్టాలన్న ప్రేరణనిచ్చి, ప్రమాదకరమైన మందులు వాడేలోగా మంచి వైద్యం అందేలా ఏర్పాటు చేసి నన్ను కాపాడారు".

Source: Devotees' Experiences of Sri Sai Baba Part I, II and III by Sri.B.V.Narasimha Swamiji
http://saiamrithadhara.com/mahabhakthas/modak.html

9 comments:

  1. Om sai ram very nice story.sai saved that devotee. He is lucky man he saw baba and had darshan.who are his devotees are lucky. Om sai ram❤❤❤

    ReplyDelete
  2. Om sai ram very nice story.sai saved that devotee. He is lucky man he saw baba and had darshan.who are his devotees are lucky. Om sai ram❤❤❤

    ReplyDelete
  3. Om sai ram baba amma arogyam bagundali thandri please

    ReplyDelete
  4. Plz fulfill my ambitions, my career tandri

    ReplyDelete
  5. ఓం శ్రీ సాయిరాం🙏

    ReplyDelete
  6. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  7. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo