సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 770వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. ఎంతో గొప్పగా అనుగ్రహించిన బాబా
  2. ఎటువంటి సమస్యైనా బాబా దయతో తొలగును

ఎంతో గొప్పగా అనుగ్రహించిన బాబా


విశాఖపట్నం నుండి సాయిభక్తురాలు శ్రీమతి సునీత తనకు బాబా ఇటీవల ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు. 


నేను బాబా భక్తురాలిని. నా పేరు సునీత. మేము వైజాగ్‌లో నివసిస్తున్నాము. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నేను ఒక బ్యూటీషియన్‌ని. నేను సొంతంగా ఒక బ్యూటీపార్లర్ నడుపుతున్నాను. రెండు నెలల క్రితం మా పార్లర్ ఉన్న ఇంటిని తొందరలోనే ఖాళీ చేయాల్సిన అవసరం వచ్చింది. నేను ప్రతిదానికీ బాబా మీదనే ఆధారపడతాను. కాబట్టి బాబానే నాకు క్రొత్త షాపు చూపిస్తారని అనుకున్నాను. మొదట ఒకటి, రెండు షాపులు చూశానుగానీ, అవి నాకు అంతగా నచ్చలేదు. అయినా నేను ఆందోళన చెందక, సరైన సమయానికి పార్లర్ ఏర్పాటు బాబానే చేస్తారని నిశ్చింతగా ఉన్నాను. కొన్నిరోజులకి మా పార్లర్‌కి దగ్గర్లో ఒక ఇల్లు ఖాళీగా ఉందని తెలిసింది. అయితే ఆ సమయంలో నేను ఒక్కదాన్నే ఉన్నందున ఒంటరిగా వెళ్లడానికి కాస్త భయమేసి, "బాబా! ఒక్కదాన్నే వెళ్లడానికి భయంగా ఉంది. మీరు కూడా నాతో రండి" అని బాబాకు చెప్పుకొని ఆ ఇంటిని చూడటానికి బయలుదేరాను. మా పార్లర్ నుండి క్రిందకు వస్తూనే, "నేను ఉన్నాను పద!" అన్నట్లు ఒక పెద్ద టైల్ మీద ఫోటో రూపంలో బాబా నాకు దర్శనమిచ్చారు. 'ఇంకేంటి, బాబా నాకు తోడుగా ఉన్నార'ని సంతోషంగా ఆ ఇంటికి వెళ్లాను. ఇంటి యజమాని గేటు తీయకముందే ఇంటి లోపల గోడకు వ్రేలాడుతున్న ఫోటో రూపంలో మళ్ళీ బాబా దర్శనమిచ్చారు. బాబాను చూడగానే, ‘ఆ ఇంటినే నా పార్లర్ కోసం బాబా చూపిస్తున్నార’ని నాకు అనిపించింది. బాబా ప్రసాదం కదా! ఇల్లు చక్కగా ఉంది. నాకు ఎంతగానో నచ్చింది. వెంటనే ఇంటి యజమానితో మాట్లాడి ఓకే చేసుకున్నాను. ఇక నా ఆనందాన్ని ఏం చెప్పను? బాబా అదివరకు ఉన్న పార్లర్‌కి దగ్గర్లోనే క్రొత్త షాపుని చూపించి నాకు గానీ, నా కస్టమర్లకు గానీ ఏ ఇబ్బందీ లేకుండా చూశారు. దూరంగా ఎక్కడో క్రొత్త ప్రదేశంలో ఇల్లు దొరికుంటే నా కస్టమర్లకు ఇబ్బంది అయ్యేది. నేను కూడా క్రొత్త కస్టమర్లు కుదిరేవరకు ఇబ్బందిపడేదాన్ని. బాబాపై ఆధారపడటం వలన అంత గొప్పగా అనుగ్రహించారు. ఇకపోతే, ఈ క్రొత్త షాపు విషయంలోనే బాబా చూపించిన మరో అద్భుతాన్ని చెప్తాను.


షాపు ఓకే చేసుకున్నాక ప్లంబింగ్ వర్క్ చేయించడానికి నేనొక ప్లంబరుతో మాట్లాడాను. అప్పటికే నా వద్ద ఆ పనికి అవసరమయ్యే కొన్ని వస్తువులు ఉన్నప్పటికీ ఇంకా కొన్ని వస్తువులు కావాలని ప్లంబర్ చెబితే, వాటిని తెప్పించాను. ఆప్పటికీ అతను, "ఇంకా కొన్ని వస్తువులు కావాలి, రెండు మూడు వందలు ఖర్చవుతుంది. నేనే వెళ్ళి తెచ్చుకుంటాను" అని అన్నాడు. నేను, "ఇన్ని వస్తువులు ఉన్నాయి. ఇంకా చాలవా?" అని అన్నప్పటికీ అతను, "చాలవు మేడం. పని మధ్యలో ఉండిపోతుంది. మళ్ళీ ఎప్పుడో మీరు చేయించుకోవాల్సి వస్తుంది" అని అన్నాడు. పనిలో పని అయిపోతే పోతుందిలే, మరోసారి ఈ పనుల టెన్షన్ ఎందుకనిపించి నేను అతను చెప్పినదానికి అంగీకరించాను. అతను ఆ సామాను తేవడానికి వెళ్లి, షాపు వద్ద నుండి ఫోన్ చేసి, "మేడం, బిల్లు 600 రూపాయలు అవుతుంది. తీసుకోమంటే తీసుకుంటాను" అని అన్నాడు. నేను అతనితో తీసుకోమని చెప్పానేగానీ నా మనసంతా ఏదోలా ఉంది. దాంతో ఆ ఇంటి యజమానితో ప్లంబర్ ఇలా చేసున్నాడని చెప్పి, "మీకు తెలిసిన ప్లంబర్ ఎవరైనా ఉన్నారా?" అని అడిగాను. అందుకాయన, "ఉన్నడమ్మా, పిలిపించమంటే పిలిపిస్తాను. ఉదయం వచ్చి పని పూర్తిచేసేస్తాడు" అని అన్నారు. సరే, అతనిని పిలిపిద్దామని నా మనసుకి అనిపించింది. అప్పుడు సమయం రాత్రి 7.30 అయ్యింది. ఇంతలో సామాను తీసుకొని చెమటలు కార్చుకుంటూ ప్లంబర్ వచ్చి, ‘పని మొదలుపెడతాన’ని అన్నాడు. నేను వేరే ప్లంబరుతో పని చేయించుకుందామన్న ఉద్దేశ్యంతో, "నువ్వు సామాను పెట్టేసి వెళ్ళిపో. రేపు పిలుస్తాను" అన్నాను. అతను, "లేదు మేడం, ఇప్పుడే చేసేస్తాను" అన్నాడు. కానీ నేను ఒప్పుకోలేదు. దాంతో అతను వెళ్ళిపోయాడు. నేను కూడా ఇంటికి బయలుదేరాను. కానీ నా మనసంతా ఒకటే అలజడి. "శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉదారంగా ఇవ్వు. ఎవరి శ్రమను దోచుకోకు" అని బాబా అంటారు. 'మరి అతను అంత శ్రమపడి సామాన్లు తీసుకొని వస్తే, అతనిని కాదని నేను ఇంకొక ప్లంబరుతో పనిచేయించుకోవడం సబబేనా?' అని నాలో నేను చాలా మధనపడ్డాను. ఏ నిర్ణయానికీ రాలేక ఇంటికి వెళ్ళాక, "బాబా! నాకేమీ అర్థం కావడం లేదు. ఆ ప్లంబరుతో పని చేయించుకోనా, లేక వేరే ప్లంబరుని పిలిపించనా? నాకు మీరే దారి చూపండి. నాకు స్పష్టమైన సమాధానం కావాలి బాబా" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా మన పిలుపు కోసం ఎంత సిద్ధంగా ఉంటారంటే, అంతలోనే అద్భుతం చేశారు. ఆ ప్లంబర్ ఫోన్ చేసి, "మేడం, నేను తప్పు చేశాను. బిల్లు మూడు వందల రూపాయలే అయింది. కానీ నేను మీకు ఆరువందలని చెప్పాను" అని అన్నాడు. అది విని నేను ఆశ్చర్యపోతూనే, "నేను నిన్ను నమ్మాను. నువ్వు అలా చేయడం కరెక్టేనా?" అని అన్నాను. అందుకతను, "లేదు మేడం. నా తప్పును క్షమించండి. పని చేశాక నాకు ఇవ్వాల్సిన డబ్బుల్లో ఈ మూడు వందలు తగ్గించి ఇవ్వండి మేడం" అని అన్నాడు. నాకంతా ఒక షాక్‌లా ఉంది. బాబా అతని చేత నిజం చెప్పించి అద్భుతం చూపించారని నాకు అనిపించింది. అసలు అలా నిజం ఒప్పుకోవడం ఎంతో గొప్ప విషయం. ఎవరూ అలా ఒప్పుకోరు. కేవలం బాబా వల్లే అది సాధ్యమైంది. బాబానే అతని చేత నిజం చెప్పించారని నాకు అర్థం అయింది. దాంతో, 'అతని చేతనే పని చేయించమ'ని బాబా చెప్తున్నారనిపించి అతనితో, "సరే, నువ్వు రేపు ఉదయం రా. నీ చేతనే పని చేయిస్తాను. రేపు వచ్చి పని పూర్తిచేసి వెళ్ళు" అని చెప్పాను. అందుకతను, "ఉదయం 8 గంటలకి నేను వేరే పని చేయడానికి వెళ్ళాలి. కాబట్టి 6 గంటలకే వచ్చి మీ పని పూర్తిచేసి వెళ్లిపోతాన"ని చెప్పాడు. అందుకు నేను సరేనన్నాను.


మరుసటిరోజు నేను వేకువఝామునే లేచి, ఇంట్లో పనులు పూర్తిచేసుకొని 6 గంటలకల్లా షాపుకి వెళ్ళాను. కానీ అతను రాలేదు. సరేనని ఫోన్ చేస్తే, అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ తరువాత కూడా అతని ఫోన్ చాలా సమయం వరకు స్విచ్ ఆఫ్ లోనే ఉంది. మధ్యాహ్నానికి ఫోన్ లిఫ్ట్ చేసి, "సారీ మేడం, నేను మర్చిపోయాను. ఏమీ అనుకోవద్దు. రేపు ఉదయం వచ్చి పని చేసి పెడతాను" అని చెప్పాడు. నేను నా మనసులో, 'నాకెందుకు టెన్షన్? బాబా ఉన్నారు, ఆయనే చూసుకుంటారు' అనుకొని అతనికి "సరేన"ని చెప్పాను. మరుసటిరోజు నేను ఉదయాన్నే అతనికి ఫోన్ చేసి, "నువ్వు వస్తున్నావా?" అని అడిగితే, "వస్తున్నాన"ని చెప్పాడు. సరేనని, నేను 6 గంటలకల్లా షాపుకి చేరుకున్నాను. అయితే 7.30 అవుతున్నా అతను రాలేదు. నేను అతనికి ఫోన్ చేస్తే, "మేడం, టిఫిన్ చేసి వస్తాను" అని అన్నాడు. సరేనని చెప్పి నేను ఫోన్ పెట్టేశాను. కానీ 8 గంటలైనా అతను రాలేదు. దాంతో మళ్ళీ ఫోన్ చేస్తే, "మేడం, ఈరోజు నాకు సెలవు. మధ్యాహ్నం ఏదో ఒక సమయంలో వచ్చి మీ పని ఈరోజు పూర్తి చేస్తాను" అన్నాడు. నాకు చాలా బాధేసింది. చీకటిన 3 గంటలకే నిద్రలేచి పనులన్నీ పూర్తి చేసుకొని ఉదయం 6 గంటలకల్లా షాపుకి వస్తుంటే, ఇతనిలా చేస్తున్నాడని నా మనసుకి కష్టంగా అనిపించి, "ఏమనుకుంటున్నావు నువ్వు? ఉదయాన్నే లేచి రావడమంటే నాకెంత కష్టమో అర్థం చేసుకోకుండా నన్నిలా వేచివుండేలా చేస్తున్నావు. అసలు పాపం, పుణ్యం అంటే నీకేమైనా తెలుసా?" అంటూ అతన్ని కోప్పడి ఫోన్ పెట్టేశాను. తరువాత, "బాబా! మీరు ఎవరినీ కోప్పడవద్దనీ, తిట్టవద్దనీ చెప్పారు. కానీ ఇలాంటి పనులు చేస్తుంటే కోపం వస్తోంది. నన్ను క్షమించు బాబా. ఆ అబ్బాయిని చాలా మాటలు అనేశాను. మీరే ఎలాగైనా ఆ అబ్బాయిని రప్పించి, నా పని పూర్తి చేయించండి" అని బాబాతో చెప్పుకున్నాను. తరువాత నేను వెళ్లి టిఫిన్ తెచ్చుకొని తినడానికి కూర్చున్నాను. ఇంతలో హఠాత్తుగా అతను వచ్చి నా ముందు నిలుచున్నాడు. అతనిని చూడగానే, "నువ్వైతే మధ్యాహ్నం వస్తాను, సాయంత్రం వస్తాను అని చెప్తావు. కానీ నా బాబా నీ రెక్క పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చి నా ముందు నిలబెట్టారు" అని అనుకున్నాను. తరువాత అతనింకా టిఫిన్ చేయలేదని తెలుసుకొని, అతనికి, అతనితో వచ్చిన మరో అతనికి టిఫిన్ పెట్టించి, పని చేయించుకున్నాను. ఆ విధంగా బాబా నా పార్లర్ పనులు పూర్తి చేయించారు. బాబాపై ఆధారపడితే అన్ని అడ్డంకులను తొలగించి మనల్ని ఎంతగానో అనుగ్రహిస్తారు. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు".


ఎటువంటి సమస్యైనా బాబా దయతో తొలగును


సాయిభక్తురాలు శ్రీమతి శుభ తనకు ఇటీవల బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


నా పేరు శుభ. నేను సాయిభక్తురాలిని. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక స్వీయానుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. మాకు ఇద్దరు పిల్లలు. ఈ సంవత్సరం (2021) మార్చి చివరిలో మేము ఇండియా నుండి దుబాయి వచ్చాము. ఇక్కడికొచ్చాక పిల్లలిద్దరినీ స్కూల్లో చేర్పించే ప్రయత్నాలు మొదలుపెట్టాము. అయితే స్కూల్ యాజమాన్యం సీట్లు లేవని చెప్పారు. మేము ఎంతగానో బ్రతిమాలినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మాకు మరో దారి కనిపించక చాలా ఆందోళన చెందాము. అప్పుడు మేము సాయిబాబాను ప్రార్థించి, "పిల్లల్ని స్కూలులో చేర్పించడంలో మాకు సహాయం చేయమ"ని అర్థించాము. రోజూ బాబానే ప్రార్థిస్తూ, సహాయం కోసం మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉండేవాళ్ళము. ఏప్రిల్ 8వ తారీఖున మరోసారి ప్రయత్నించగా ఒక బాబుని స్కూల్లో చేర్చుకున్నారు. తరువాత కూడా బాబాను ప్రార్థిస్తూ మళ్ళీ ప్రయత్నించగా ఏప్రిల్ 18న రెండవ బాబుని కూడా స్కూలులో చేర్పించుకున్నారు. ఇదంతా బాబా దయవలనే జరిగిందని మా విశ్వాసం. ఎటువంటి సమస్యలైనా బాబా దయతో తొలగించుకోవచ్చునని మా నమ్మకం. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


- శివ&శుభ.


9 comments:

  1. Om sai ram if sai is with us why worry.that work will be done.he knows everything.he is antarami.om sai ram❤❤❤

    ReplyDelete
  2. Om sai ram baba amma ki covid report negative ravali thandri pleaseeee rakshinchu thandri kapadu thandri

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. షిరిడి సాయి నాథ నీవే కలవు.. నీవే తప్ప మాకు ఎవరున్నారు ఈ లోకంలో.. నా కుమారుడు సాయిచరణ్ఆ తేజ్ కి మంచి ఆరోగ్యం అనుగ్రహించి అన్ని బాధలను తొలగించి నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు సాయినాధ

    ReplyDelete
  5. షిరిడి సాయి నాథ నీవే కలవు.. నీవే తప్ప మాకు ఎవరున్నారు ఈ లోకంలో.. నా కుమారుడు.. నీ దివ్య అనుగ్రహ వర ప్రసాదం సాయిచరణ్ తేజ్ కి మంచి ఆరోగ్యం అనుగ్రహించి అన్ని బాధలను తొలగించి నందుకు, అష్టైశ్వర్యాలు కలిగి ఉన్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు సాయినాధ

    ReplyDelete
  6. సాయిరాం బాబా కోటి నమస్కారాలు.. కృతజ్ఞతలు ధన్యవాదములు.. నా కూతురు.. నీ వరాల ప్రసాదం.. బిడ్డ ఉషశ్రీ మీ దివ్యమైన చల్లని కృపా కటాక్షం ఆశీస్సులతో మంచి జి నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మంచిగా చదువుకుంటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు సాయినాథ

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo