సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 761వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. కరోనా భయంనుండి బయటపెట్టిన బాబా
  2. బాబా దయతో తీరిన ఇంటి సమస్య - ఒంటి సమస్య  

కరోనా భయంనుండి బయటపెట్టిన బాబా


సాయి భక్తుడు సత్య తమకు ఇటివల బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

 

2021, ఫిబ్రవరి 8వ తేదీన మా అబ్బాయి ఆరోగ్య పరిస్థితి బాగలేక తనను ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. తనకు తోడుగా నేను కూడా హాస్పిటల్లోనే ఉన్నాను. ఇంతలో, మా అబ్బాయికి ట్రీట్‌మెంట్ జరుగుతున్న హాస్పిటల్లో కరోనా కేసులు రావడం మొదలైంది. సాధారణంగా ఏ పేషెంటునైనా అడ్మిట్ చేసుకునే సమయంలో పేషెంటుకి, తన అటెండరుకి ఇద్దరికీ కరోనా పరీక్షలు చేసి వాళ్ళకు నెగిటివ్ ఉంటేనే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటారు. అయినా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. మేమున్న హాస్పిటల్లో మొత్తం మూడు ఫ్లోర్లు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. మేము సెకండ్ ఫ్లోరులో ఉన్నాము. ముందుగా మా ఫ్లోరులో ఒక కరోనా పాజిటివ్ కేసు డిటెక్ట్ అయింది. దానితో ఆ పేషంటును, తన అటెండరును కరోనా సెంటరుకు షిఫ్ట్ చేశారు. మిగిలిన అందరినీ వాళ్ళ వాళ్ళ రూముల్లోనే క్వారంటైన్ చేశారు. నాకు చాలా భయంగా అనిపించింది. నా వయసు 65 సంవత్సరాలు. మా అబ్బాయి వయసు 32 సంవత్సరాలు. మా అబ్బాయి ఆరోగ్య సమస్య కంటే ఈ కరోనా సమస్యే ఎక్కువ అనిపించింది. నిజానికి అంతకుముందు, అంటే 2020, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో మా కుటుంబసభ్యులందరికీ (నేను, నా భార్య, మా ఇద్దరు పిల్లలు) కరోనా పాజిటివ్ వచ్చింది. కొద్దిరోజులు హాస్పిటల్లో ఉండి ట్రీట్‌మెంట్ తీసుకున్న తరువాత నలుగురం కరోనా బాధనుండి బయటపడ్డాము. కానీ ఇప్పుడు హాస్పిటల్ నుండి బ్రతికి బయటపడటం ఎలాగా అని ఆందోళనపడుతూ, మమ్మల్ని కాపాడమని బాబాను వేడుకుంటూ, ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో ‘ఓం శ్రీ సాయినాథాయ నమః’ అని 108 సార్లు సాయినామాన్ని మనస్సులో ధ్యానించుకుంటూ భారమంతా బాబాపై వేశాను.


హాస్పిటల్ రెండవ అంతస్థులో మొత్తం 6 రూములు ఉన్నాయి. కరోనా ఒక్కొక్క రూము నుండి ప్రక్కరూములోకి వ్యాపించడం మొదలుపెట్టింది. మొదట కార్నర్ రూము, తరువాత దానికి ఎదురుగా ఉన్న రూము, ఆ తర్వాత మరో కార్నర్ రూము, దాని ఎదురుగా ఉన్న రూము, ఆ తర్వాత మా రూముకి ఎదురుగా ఉన్న రూము కరోనాకి ఎఫెక్ట్ అయ్యాయి. చాలామందిని కరోనా సెంటరుకు తరలించారు. ఎవరికైతే నెగిటివ్ వచ్చిందో వాళ్ళను రూములు ఖాళీచేసి వాళ్ళ వాళ్ళ ఇళ్ళకు, ఊళ్ళకు వెళ్ళిపొమ్మని డాక్టర్లు ఆదేశించారు. అయితే, కరోనా భయంతో నేను ముందుగానే డాక్టర్లతో మాట్లాడి, “మా అబ్బాయికి ఇంకా పూర్తిగా ఆరోగ్యం బాగుపడలేదు, ట్రీట్‌మెంట్ మధ్యలో ఉన్నాడు. మా ఫ్యామిలీ కూడా ఊర్లో లేరు. వాళ్ళు వేసవి సెలవులు గడపడానికి ఊరికి వెళ్ళారు. ఇంటి తాళంచెవులు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. నేనిప్పుడు ఇంటికి వెళ్ళలేను” అని చెప్పాను. ఈలోపు, సెలవులకు ఊరికి వెళ్ళిన నా భార్య మా అమ్మాయికి ఆరోగ్యం బాగలేకపోవడంతో రోజూ నాకు ఫోన్ చేసి నన్ను బయలుదేరి ఊరికి రమ్మని చెప్పేది. కానీ నేను మా అబ్బాయిని ఒక్కడినీ హాస్పిటల్లో వదిలివెళ్ళలేని పరిస్థితి. అక్కడ మా అమ్మాయి ఆరోగ్యం అస్సలు బాగుండటం లేదని నా భార్య ఫోన్ చేసి ఎంతో బాధపడేది. కానీ నేను చేసేదేమీలేక, “అంతా బాబా కృప. ఎలా జరిగినా, ఏమి జరిగినా అంతా బాబా మీదనే భారం వెయ్యి” అని నా భార్యకు చెప్పి నేనూ బాబా పైనే భారమేసి కాస్త ధైర్యం తెచ్చుకున్నాను. 


ఈలోగా మా రూముకి ఎదురుగా ఉన్న రూములో ఉన్నవారికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో వాళ్ళను కూడా ఖాళీ చేయించారు. మరుసటిరోజు మా రూములో కూడా ఒక పాజిటివ్ కేస్ వచ్చింది. దాంతో అందరినీ రూము ఖాళీ చేయమని ఆదేశాలు వచ్చాయి. ఉన్నట్టుండి ఏప్రిల్ 8వ తేదీన డాక్టర్ వచ్చి మమ్మల్ని ఎమర్జన్సీ డిశ్చార్జ్ చేసి, ప్రతివారం OPD (Out Patient Department)కి వచ్చి చూపించుకోమని చెప్పి తన ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఒకవేళ సమస్య ఎక్కువగా ఉంటే ఎమర్జన్సీకి రమ్మన్నారు. డాక్టర్లు కూడా రూల్స్ పాటించాలి కదా. ఈలోపల నా భార్య ఫోన్ చేసి, “పాప ఆరోగ్యం మెరుగుపడింది, మేము ఏప్రిల్ 10వ తేదీన ఫ్లైట్లో వస్తున్నాము” అని చెప్పింది. ఆ మాట వినగానే ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. మేము ఏప్రిల్ 8వ తేదీన హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి, మా ఇంటి తాళంచెవులు మా వద్ద లేని కారణంగా మేముండే అపార్టుమెంటులోనే తెలిసినవారి ఇంటికి వెళ్ళి ఒక రూములో 2 రోజుల పాటు గడిపాము. బాబా దయవలన కరోనా బాధనుండి, హాస్పిటల్ బాధనుండి మాకు విముక్తి కలిగింది. ఏప్రిల్ 10వ తేదీన నా భార్య, మా అమ్మాయి రావటంతో మా కుటుంబమంతా కలుసుకొని ఎంతో ఆనందించాము. ప్రస్తుతానికి ఇంకా ఎవరూ పూర్తిగా కోలుకోలేదు. 75 శాతం మాత్రమే కోలుకున్నారు. బాబా దయవల్ల అందరి ఆరోగ్యం త్వరలోనే పూర్తిగా బాగవుతుందనే నమ్మకం నాకు ఉంది. ఏమైనా గానీ బాబాపై భారం వేసి పూర్తి నమ్మకంతో బాబాను స్మరించితే మబ్బులు విడిపోయినట్లుగా ఏ కష్టాలైనా తొలగిపోతాయి.


బాబా దయతో తీరిన ఇంటి సమస్య - ఒంటి సమస్య  


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో ఇలా పంచుకుంటున్నారు:


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి


ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. ప్రతిరోజూ ఈ బ్లాగులో ప్రచురించే సాయిభక్తుల అనుభవాలు చదువుతుంటే మనస్సుకు ఎంతో హాయిగా ఉంటుంది. ఇంతకుముందు నేనొక అనుభవాన్ని మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలను మీతో పంచుకోబోతున్నాను. 


కొన్నాళ్ళ క్రితం మా వంటింటి పైకప్పు నుండి నీళ్ళు కారుతుండేవి. అయితే అవి ఎక్కడనుండి వస్తున్నాయో తెలిసేది కాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సమస్య తీరలేదు. పైనుండి నీళ్ళు కారి క్రిందనున్న బండలు కూడా పాడయ్యాయి. ఈ సమస్య గురించి తెలిసినవారంతా దానిని రిపేర్ చేయడానికి ఎంతో ఖర్చవుతుందని చెప్పేవారు. నేను బాబాకు నమస్కరించుకుని, ‘నా సమస్య తీరిపోతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను’ అని విన్నవించుకున్నాను. తరువాత బాబా దయవల్ల ఆ సమస్య అతి సులువుగా పరిష్కారమైంది. బాబాకు కోటి కోటి ప్రణామాలు.


మరో అనుభవం:


ఇంతకుముందు పంచుకున్న అనుభవంలో నాకు ఆపరేషన్ జరిగిందని చెప్పాను. ఆ ఆపరేషన్‌కి ముందు ఎన్నో రోజులు నేను ఏమీ తినలేకపోయాను, త్రాగలేకపోయాను. అందువల్ల చాలా నీరసించిపోయాను. దాంతో నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. నొప్పులు చాలా తీవ్రంగా ఉండేవి. ఏ పని చేసుకోవాలన్నా కష్టంగా ఉండేది. నా మోకాళ్ళ నొప్పులను తగ్గించమని బాబాను ప్రార్థించి, ప్రతిరోజూ బాబా ఊదీని మోకాళ్ళకు రాసుకోవడం ప్రారంభించాను. బాబా దయవల్ల నా మోకాళ్ళ నొప్పులు త్వరలోనే తగ్గిపోయాయి. అందుకు బాబాకు నేనెంతో ఋణపడివున్నాను.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


8 comments:

  1. Om sai ram baba sloves all problems. No worry. He cures his devotees with love.if we trust him no problem.my daughter also cured from Corona. My son is doctor he cured her with baba blessings.we are happy now. I felt very sad when she is not well. ❤������❤

    ReplyDelete
  2. Om sri sai ram.
    Baba solves my problem also. He cures corona disease to my brother in law and to my sister. I prayed baba to cure them. He listened my prayer and gives utmost blessings to me and also to my sister family.
    Thank you Baba..
    Sri samardha sadguru sainath maharaj ki Jai

    ReplyDelete
  3. Kothakonda SrinivasMay 1, 2021 at 11:02 AM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  4. Om sai ram baba amma arogyam bagundali thandri please

    ReplyDelete
  5. ఓంసాయి శ్రీసాయి జయజయసాయి

    ReplyDelete
  6. Om Sai Sri Sai Jaya Jaya Sai.🔥🔥🔥🌻🌻🌻🌼🌼🌼🌹🌹🌹💐💐💐🙏🙏🙏

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo