సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

మహల్సాపతి - మొదటి భాగం...



శ్రీసాయిబాబా సశరీరులుగా ఉండగా వారిని ప్రత్యక్షంగానూ, అత్యంత సన్నిహితంగానూ సేవించుకున్న భక్తులలో అత్యంత ముఖ్యుడు, మొదటగా పేర్కొనవలసిన భాగ్యశాలి మహల్సాపతి. బాబా ఇతనిని ప్రేమగా 'భగత్' అనీ, 'సోనార్‌డా' అనీ పిలిచేవారు. ఇతని పూర్తిపేరు మహల్సాపతి చిమ్నాజీ నాగరే. శిరిడీ గ్రామానికి చెందిన పేద విశ్వబ్రాహ్మణ కుటుంబంలో (సుమారు 1834లో) జన్మించాడు మహల్సాపతి. వీధిబడిలో ప్రాథమిక విద్యాభ్యాసం తప్ప పెద్దగా అక్షరజ్ఞానం లేనివాడు. తమ కులదైవమైన ఖండోబా (ఖండోబాకే  మహల్సాపతి అని మరో పేరు. ‘మహల్సా’ అంటే పార్వతీదేవి. మహల్సాపతి అంటే పార్వతీపతి, అంటే శివుడు అని అర్థం) పట్ల అత్యంత భక్తిప్రపత్తులు కలిగి ఉండేవాడు. వంశపారంపర్యంగా ఖండోబా మందిరంలో అర్చకత్వం చేస్తుండేవాడు. ఖండోబాకు సంబంధించిన ‘మహల్సా పురాణం’ అనే పవిత్ర గ్రంథాన్ని ప్రతినిత్యమూ పఠిస్తుండేవాడు. సాటి కులస్థుల ఇండ్లలో జరిగే మతపరమైన కార్యక్రమాలలో పౌరోహిత్యం చేసేవాడు. ఖండోబాపట్ల అతనికున్న భక్తి ఫలప్రదమై అప్పుడప్పుడు మానసికంగా ఖండోబాతో తాదాత్మ్యం చెందేవాడు. ఆ సమయంలో సమాధి స్థితిని, వివిధ దర్శనాలను పొందేవాడు. ఆ స్థితిలో అతను ఏవేవో మాట్లాడేవాడు. ప్రజలు ఖండోబా అతనిని ఆవహించి, అతని ద్వారా మాట్లాడుతున్నారని అనుకునేవారు.
మహల్సాపతి కుటుంబీకులు తరతరాలుగా శిరిడీలోనే నివసిస్తుండేవారు. ఆ గ్రామంలో వాళ్లకు ఉన్నది ఒక మట్టిఇల్లు, ఏడున్నర ఎకరాల మెట్టభూమి మాత్రమే. నీటి వసతుల కొరత కారణంగా ఆ భూమి ద్వారా అతనికి ఎటువంటి రాబడీ ఉండేది కాదు. గ్రామానికి వెలుపల మట్టితో నిర్మింపబడిన పురాతన ఖండోబా మందిరం కూడా వారిదే అయినప్పటికీ భక్తుల ద్వారా దక్షిణ రూపంలో వచ్చే మొత్తం అంతంతమాత్రమే ఉండేది. అది కూడా చాలావరకు మందిర నిర్వహణకే సరిపోయేది. అందువలన మందిరం ద్వారా కూడా మహల్సాపతి కుటుంబానికి పెద్దగా ఆదాయం ఉండేది కాదు. అందుచేత కుటుంబ పోషణకోసం అతను వంశపారంపర్యంగా వస్తున్న స్వర్ణకార(సోనార్) వృత్తి చేస్తుండేవాడు. కానీ శిరిడీ ఒక మారుమూల కుగ్రామం. అక్కడ చాలా తక్కువ ఇళ్ళు ఉండేవి. ఇతర గ్రామాల నుండి వచ్చి మహల్సాపతికి పని ఇచ్చేవాళ్ళు కూడా చాలా తక్కువగా ఉండేవారు. అందువలన స్వర్ణకారవృత్తి వలన వచ్చే ఆదాయం కూడా చాలా స్వల్పంగానే ఉండేది. ఆ కొద్దిపాటి ఆదాయంతోనే అతను తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఏ బాధాలేక నిశ్చింతగా ఆధ్యాత్మిక చింతనలో, ఆచారవ్యవహారాలలో నిమగ్నమైవుండేవాడు. చాలామంది సదాచార హిందువుల మాదిరిగానే మహల్సాపతి కూడా తాను ఖండోబా కృపతో జననమరణ చక్రం నుండి బయటపడాలనీ, మోక్షాన్ని పొందాలనీ లక్ష్యంగా కలిగివుండేవాడు. ఆ లక్ష్యసాధనకు అవసరమైన సాత్విక స్వభావాన్ని కలిగి ఉండటంతోపాటు సాధుసత్పురుషుల సాంగత్యం చేస్తుండేవాడు.

మహల్సాపతికి శిరిడీ గ్రామస్థులైన కాశీరాంషింపీ, అప్పాజోగ్లే(అప్పాభిల్)లతో మంచి స్నేహబంధముండేది. ముగ్గురూ ప్రేమ స్వభావులు, అతిథి సత్కారాలలో ఆసక్తిగలవారు. ఈ ముగ్గురూ శిరిడీ సందర్శించే సాధుసత్పురుషులను ఆదరించి అన్నం పెట్టడం, వారికి ఆశ్రయం కల్పించడం, వారి ఇతర అవసరాలను సమకూర్చడం, వారికి పరిచర్యలు చేయడం వంటి బాధ్యతలను సమిష్టిగా నిర్వర్తిస్తుండేవారు. వాళ్లలో కాశీరాంషింపీ అతిథులకు ఆహారపదార్థాలను, అప్పాజోగ్లే కట్టెలు, పాత్రలు వంటివి అందిస్తే, పేదవాడైన మహల్సాపతి మాత్రం అలసిపోయిన వారి కాళ్ళు పట్టి వారికి పాదసేవ చేసేవాడు. వాళ్ళ అతిథ్యంలో అతిథులు అత్యంత గౌరవాన్ని, ఆప్యాయతను పొందేవారు. వాళ్ళు హిందూమతానికి చెందిన సాధువులను మాత్రమే కాకుండా ముస్లిం ఫకీర్లను కూడా సాదరంగా ఆహ్వానించి ఆదరించేవారు. వాళ్ళు గోసావిలను 'నమో నారాయణా' అనీ, బైరాగులను 'జై రామ్' అనీ, ఫకీరులను 'జై సాయి' అని స్వాగతించేవారు.

దక్షిణాన ఉన్న పండరీపురం, రామేశ్వరం మొదలైన పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రధాన మార్గంలో శిరిడీ ఉన్నందున ఎంతోమంది సాధువులు ఆ గ్రామంలో బసచేస్తుండేవారు. సాయిబాబా శిరిడీ రావడానికి పన్నెండు సంవత్సరాల ముందు దేవీదాసు అనే సాధువు శిరిడీ వచ్చి అక్కడ నివాసమేర్పరుచుకున్నాడు. కొద్దిరోజుల్లోనే అతని కీర్తి శుక్లపక్ష చంద్రుడివలే దినదినాభివృద్ధి చెందింది. అతను జ్ఞాని. అతని తేజోవంతమైన కన్నులు, చక్కటి శరీరాకృతి చూసేవారిని ఇట్టే పాదాక్రాంతులను చేసుకొనేవి. వివిధ శాఖలకు చెందిన సాధువులు అతని దర్శనానికి వస్తుండేవారు. మహల్సాపతి, అప్పాభిల్, కాశీరాంషింపీ తదితరులు తరచూ దేవీదాసుని దర్శించేవారు. కాశీరాం అతనికి వస్త్రాలు, బియ్యం, జొన్నలు సమర్పించుకొనేవాడు. తన వద్దకు వచ్చే భక్తుల కోసం దేవీదాసు ఒక పలకపై శ్రీవేంకటేశస్తోత్రం వ్రాసిచ్చి, దానిని వారిచేత పఠింపజేశారు. కాశీరాంషింపీ వంటి కొందరు దేవీదాసుని తమ గురువుగా స్వీకరించారు. మహానుభావ పంథాకు చెందిన జానకీదాసు అనే పుణ్యాత్ముడు కూడా ఆ కాలంలో శిరిడీలో నివాసముంటుండేవాడు.

బాబా సుమారు పదహారేళ్ళ యువకుడిగా అకస్మాత్తుగా శిరిడీలో ప్రకటమై అదేవిధంగా హఠాత్తుగా అదృశ్యమయ్యారు. మూడేళ్ళ తరువాత (సుమారు 1872 ప్రాంతంలో) ధూప్‌ఖేడ్ గ్రామానికి చెందిన చాంద్‌భాయ్‌పాటిల్ పెళ్లిబృందంతో బాబా మళ్ళీ శిరిడీ వచ్చారు. శిరిడీ పొలిమేరల్లో ఉన్న ఖండోబా మందిర సమీపంలో ఆ పెళ్ళిబృందం నుండి విడివడి మందిర ప్రవేశద్వారం వద్దకు వెళ్లారు బాబా. మందిరం లోపల ఖండోబా ఆరాధనలో నిమగ్నమైవున్న మహల్సాపతి బాబా ఉనికిని గమనించి, ముస్లిం వేషధారణలో ఉన్న బాబాను తన సాధారణ అలవాటు ప్రకారం 'ఆవో(రండి) సాయి' అంటూ సాదరంగా ఆహ్వానించాడు. అంతకుముందు, ఆ తరువాత కూడా బాబా పేరుగానీ, ఇతర వివరాలుగానీ ఎవ్వరికీ తెలియవు. మహల్సాపతి ‘సాయి’ అని పిలిచినప్పటినుండి అదే ఆయన పేరుగా స్థిరపడింది. అంటే, ఒకవిధంగా బాబాకు నామకరణం చేసింది మహల్సాపతే! ఈనాడు ఎందరో భక్తులకు తారకమంత్రమైన శ్రీసాయి నామాన్ని మనకందించింది మహల్సాపతే!

కొంతసేపటి తరువాత బాబా మహల్సాపతితో, "ఈ ఖండోబా మందిరం ఏకాంతంగా, ఎంతో ప్రశాంతంగా ఉంది. ఫకీరు ఉండటానికి సరిగ్గా సరిపోతుంది" అని అన్నారు. వాస్తవానికి మహల్సాపతికి మతమౌఢ్యంగానీ, ముస్లింల పట్ల, వారి విశ్వాసాల పట్ల ద్వేషంగానీ లేకపోయినప్పటికీ, తమ సంప్రదాయం పట్ల ఉన్న మక్కువతోనూ, చాలామంది ముస్లింలు హిందూ దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తారన్న భయంతోనూ ఖండోబా మందిరంలో ప్రవేశానికి బాబాకు అభ్యంతరం చెప్పాడు మహల్సాపతి. మహల్సాపతి మనసెరిగిన బాబా అతనితో, "హిందువులకు, ముస్లింలకు దైవం ఒక్కడే. అయినప్పటికీ నువ్వు నా ప్రవేశానికి అభ్యంతరం చెప్తున్నావు గనక నేను వెళ్తాను" అని అక్కడినుండి వెళ్లిపోయారు. అలా వెళ్ళిన బాబా ఎక్కువగా వేపచెట్టు క్రింద నివసించేవారు. మహల్సాపతి తన స్నేహితులైన కాశీరాంషింపీ, అప్పాజోగ్లేలను బాబాకు పరిచయం చేశాడు. తరచూ వాళ్ళు ముగ్గురూ బాబాను వేపచెట్టు క్రింద దర్శిస్తుండేవారు.

తొలిరోజుల్లో బాబా వ్యవహారశైలి శిరిడీ గ్రామస్తులకు వింతగా తోచేది. అందువలన ఆయనొక పిచ్చి ఫకీరని జనం తలచేవారు. మహల్సాపతికి, అతని మిత్రులకు కూడా మొదట్లో అలాగే అనిపించేది. కానీ ఉన్మత్తావస్థలో ఉన్న సిద్ధపురుషుల ప్రవర్తన బాహ్యానికి వెర్రితనంగా ఉంటుందని తెలిసిన మహల్సాపతి బాబా వింత ప్రవర్తన మాటున దాగియున్న వారి దివ్యత్వాన్ని గుర్తించాడు. అందువలన ఇతరులు బాబాపట్ల గౌరవాన్ని కోల్పోయినప్పటికీ మహల్సాపతి మాత్రం బాబాపట్ల గౌరవభావాన్ని కలిగి ఉండేవాడు. అందుకు కారణమొక్కటే, బాబా యొక్క సాధారణ ప్రవర్తన ద్వారా మహల్సాపతి వంటి కొందరి దృష్టిలో బాబా పట్ల ఉద్భవించిన గొప్ప గౌరవభావాన్ని అప్పుడప్పుడు ఆయన ప్రదర్శించే పిచ్చి వైఖరి పెద్దగా నిరోధించలేకపోయింది. ఇతరులు బాబా నీటితో దీపాలు వెలిగించడం వంటి అలౌకిక లీలలను చూసిన తరువాతే వారి మహిమను గుర్తించి వారిని దైవంగా ఆరాధిస్తే, మహల్సాపతి మాత్రం బాబా యొక్క అతి నిర్మలము, పరిశుద్ధము అయిన సాధుజీవనాన్ని, సత్వగుణాన్ని, పూర్ణ వైరాగ్య ప్రవృత్తిని చూసి వారిపట్ల తొలిరోజుల్లోనే ఆకర్షితుడయ్యాడు. అదీగాక, బాబా తరచూ సాంగత్యం చేస్తుండే జానకీదాసు, దేవీదాసు తదితర సాధుసత్పురుషులతో పోల్చి చూసినప్పుడు బాబా ఎంతో జ్ఞానసూర్యుని వలె ప్రకాశించడాన్ని, ఆ సత్పురుషులు సైతం బాబాను అమితంగా గౌరవించడాన్ని మహల్సాపతి గమనించాడు. క్రమంగా  బాబా సాన్నిహిత్యంలో తన సమయాన్ని ఎక్కువగా గడుపుతుండేవాడు మహల్సాపతి. 

ఇలా ఉండగా, 1880-90 మధ్యకాలంలో తన ఒక్కగానొక్క కుమారుడు ఒక సంవత్సరం వయసులోపే మరణించడంతో మహల్సాపతి తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఆ కారణంగా, పెళ్ళికాని ముగ్గురు కుమార్తెల బాధ్యత తన నెత్తిపై ఉన్నప్పటికీ మహల్సాపతికి ప్రాపంచిక వ్యవహారాలపట్ల, జీవితంపట్ల ఆసక్తి సన్నగిల్లింది. ఆ సమయంలో ఖండోబా అతనికి రెండు స్వప్నదర్శనాలను అనుగ్రహించారు. మొదటి స్వప్నంలో, ‘మందిరంలో ఉన్న తమ విగ్రహాన్ని ఇంటికి తీసుకుపోయి, ఏకాగ్ర చిత్తంతో ఆరాధించమ’ని ఖండోబా మహల్సాపతిని ఆదేశించారు. రెండవ స్వప్నంలో ఖండోబా ఒక బ్రాహ్మణుని రూపంలో కనిపించి, "ఏం నాయనా! స్వర్ణకారవృత్తి చేయకుండా కడుపు నింపుకోలేవా?" అని అడిగారు. అందుకు మహల్సాపతి, "అలాగే, నేను ఆ వృత్తిని వదులుకుంటాను" అని అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, "నా పాదాలు తాకి, వాటిని గట్టిగా పట్టుకో! ఇకమీదట నీ జీవనం నా పాదాలను పట్టుకోవడం మీద ఆధారపడి ఉంటుంది గానీ, స్వర్ణకారవృత్తిపై కాదు" అని చెప్పి అదృశ్యమయ్యాడు. అప్పటినుండి మహల్సాపతి స్వర్ణకారవృత్తిని వదిలిపెట్టి పూర్తి శ్రద్ధ, నిష్ఠలతో భిక్షావృత్తిని చేపట్టాడు. భార్యాబిడ్డలున్నప్పటికీ, ఇంట్లో నిద్రించడం వలన ప్రాపంచిక సంబంధాలు బలపడతాయని, సంసారభారం, బాధ్యతలు మరింత అధికమవుతాయన్న నెపంతో ఇంట్లో నిద్రించడం మానుకొని బాబాతోపాటు మసీదులో నిద్రించనారంభించాడు. బాబా సన్నిధిలో ఉండటమే తన ప్రధాన కార్యాచరణగా మార్చుకొని ఒక్కరోజు కూడా ఆ నియమాన్ని తప్పేవాడు కాదు. మహల్సాపతి ప్రతిరోజూ రాత్రి భోజనానంతరం మసీదుకు వెళ్లి తన వస్త్రాన్ని నేలపై పరిచేవాడు. దానిపై ఒకవైపు బాబా, మరోవైపు మహల్సాపతి విశ్రమించేవారు.

మహల్సాపతికి బాబా కఠిన నియమాలు విధించి ఎన్నో సాధనలు చేయించేవారు. బాబా అతనితో, "భగత్! నువ్వు నిద్రపోవద్దు. స్థిరంగా కూర్చొని నీ చేతిని నా హృదయంపై ఉంచు. నేను అల్లాను స్మరిస్తూ సమాధి స్థితిలో ఉంటాను. నామస్మరణ జరుగుతున్నంతసేపూ నా హృదయస్పందన ఒక రకంగా ఉంటుంది. నేను నిద్రలోకి జారితే నా హృదయస్పందన మారుతుంది. అకస్మాత్తుగా నామస్మరణ ఆగితే నన్ను నిద్ర ఆవరించినట్లు. వెంటనే నన్ను నిద్రలేపు" అని చెప్పేవారు. అయితే, బాబా హృదయంలో నామస్మరణ ఆగినదీ లేదు; అతడాయనను నిద్రలేపినదీ లేదు. అలా ఆ ఇద్దరూ రాత్రంతా మెలకువగా ఉండేవారు. రాత్రి ఒకసారి మహల్సాపతి మసీదులో అడుగుపెట్టాక ఎట్టి పరిస్థితుల్లోనూ, కనీసం లఘుశంకకు వెళ్లాల్సి వచ్చినా సరే, బాబా అతనిని మసీదు మెట్లు దిగడానికి అనుమతించేవారు కాదు. "మసీదు మెట్లు దిగితే చచ్చిపోతావు, జాగ్రత్త" అని హెచ్చరించేవారు. ఆ విధంగా రాత్రిళ్ళు మహల్సాపతిని నిద్రపోనీయక, జాగరూకతతో తాము విధించిన సాధనలు చేయించారు బాబా. పగలూ రాత్రీ బాబా సాంగత్యాన్ని ఆస్వాదిస్తూ మహల్సాపతి ఎంతో ఆనందాన్ని, ప్రయోజనాన్ని పొందుతుండేవాడు. ఇలా ఎన్నో ఏళ్ళు ఆ సద్గురు సన్నిధిలో అతని తపస్సు సాగింది. సుమారు 40, 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో బాబా మహల్సాపతికి ఎన్నోవిధాల ఎంతో ప్రయోజనం చేకూర్చి ఉంటారు. ఆ వివరాలు అందుబాటులో లేకపోయినప్పటికీ, బాబా మహల్సాపతిని భక్తి, శరణాగతి, ఆత్మార్పణ విషయంలో ఉన్నత స్థానంలో ఉంచారు.
సోర్స్: శ్రీసాయిసచ్చరిత్ర,
శ్రీసాయిభక్త విజయం బై పూజ్యశ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ,
శ్రీసాయిబాబా బై శ్రీసాయిశరణానంద,
లైఫ్ ఆఫ్ శ్రీసాయిబాబా బై శ్రీబి.వి.నరసింహస్వామి,
సాయిలీల మ్యాగజైన్ జూలై-ఆగస్టు 2005 సంచిక.

  

 తరువాయి భాగం కోసం బాబా పాదాలు తాకండి.

5 comments:

  1. ఓం సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః జయ జయ సాయి నమో నమః సద్గురు సాయి నమో నమః

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🌸🌼😃🌹🥰🌺🌿

    ReplyDelete
  3. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo