సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

హరిభావూ కార్ణిక్


హరిభావూ కార్ణిక్ గురించి శ్రీసాయిసచ్చరిత్ర 33వ అధ్యాయంలో ప్రస్తావన :- 

దహనూ నివాసి హరిభావూ కార్ణిక్ 1917లో గురుపూర్ణిమనాడు శ్రీసాయిని దర్శించి సెలవు తీసుకొని మశీదు మెట్లు దిగుతూ, ఆయనకొక రూపాయి దక్షిణ ఇస్తే బాగుండునని తలచాడు. సెలవు  తీసుకొన్నాక ఆయనను తిరిగి దర్శించరాదని శ్యామా అతనిని పంపివేశాడు. అతడు నాసిక్‌లో దిగి ఆలయంలో ప్రవేశిస్తుండగా, ఆలయద్వారం వద్ద భక్తుల మధ్యనున్న నరసింగ్ మహరాజ్ హరిభావూ చేయిపట్టుకొని, 'నా రూపాయి నాకివ్వు' అన్నారు. ఆ రూపంలో శ్రీసాయియే తానివ్వదలచిన దక్షిణను స్వీకరిస్తున్నారని గుర్తించి సంతోషంగా సమర్పించాడు. శ్రీసాయి, నరసింగ్ మహరాజ్ ఒక్కరే.

ఈ సంఘటన జరగడానికి కొన్ని రోజుల ముందు కార్ణిక్ కష్టాలలో ఉన్నప్పుడు, అతనిని అన్యాయంగా అతని బంధువులు కోర్టుకు లాగారు. ఆ సమయంలో బాబా గురించి విని శిరిడీ వచ్చాడు కార్ణిక్.  బాబాను దర్శించి కొబ్బరికాయ, తాంబూలం, దక్షిణ సమర్పించాడు. బాబా అతనిని 'వాడాకి పోయి విశ్రాంతి తీసుకోమ'ని చెప్పారు. రెండు రోజుల తరువాత అతడు తన బంధువుల ప్రవర్తనకు బాధపడుతూ, వాళ్ళు తనను కోర్టుకు లాగిన విషయం ఆలోచిస్తూ బాబాను దర్శించుకున్నాడు. అతను ఏమీ చెప్పకముందే బాబా తమ సాధారణ ధోరణిలో అతనితో ఆ కేసు విషయం చెప్పారు. అక్కడున్న భక్తులు, "నీవు బాబాను ఇంతకుముందే కలిశావా?" అని కార్ణిక్‌ను అడిగారు. “లేదు, బాబాను నేను ఇంతకుముందు కలవలేదు. కానీ నా గురించి ఖచ్చితంగా బాబాకు అంతా తెలుసు” అన్నాడు కార్ణిక్. నాల్గవ రోజు అతను బాబాను దర్శించుకున్నప్పుడు బాబా అతనితో, “6 నెలలు వేచివుండు, అప్పుడు చూడు తప్పు చేసిన వారి పరిస్థితి” అన్నారు. 6 నెలల తర్వాత బాబా మాటలు నిజమయ్యాయి. కార్ణిక్ కోర్టు కేసు నుండి బయటపడ్డాడు. పైగా, అన్యాయంగా నడుచుకున్న అతని బంధువులు బాధలుపడ్డారు.

కార్ణిక్ బాబా దర్శనం చేసుకొన్న తరువాత బాబా అనుమతితో పండరిపురానికి ప్రయాణమయ్యాడు. కోపర్గాఁవ్ స్టేషన్లో ప్యాసింజరు రైలుకి టిక్కెట్ కొన్నాడు. దౌండ్ స్టేషనులో దిగి, తరువాత కురుద్వాడి, అక్కడినుండి పండరిపురం వెళ్ళే రైలు కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు. ఈలోగా అతనికి కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన అవసరం వచ్చింది. కానీ సామానంతా వదిలి వెళ్ళడం ఎలాగా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక కూలీ వచ్చి, "మీ సామనుకు నేను కాపలాగా ఉంటాను, మీరు బాత్‌రూమ్‌కి వెళ్ళి రండి" అని చెప్పి, "మీరు మీ ప్యాసింజర్ టిక్కెట్‌ను ఎక్స్‌ప్రెస్ రైలుకి మార్చుకోండి, కొద్దిసేపటిలో ఎక్స్‌ప్రెస్ రైలు వస్తుంది" అని కూడా చెప్పాడు. 

కార్ణిక్ బాత్‌రూముకి వెళ్లి వచ్చి, తన టిక్కెట్టును, ఎక్స్‌ప్రెస్ రైలుకు అదనంగా అయ్యే డబ్బును ఆ కూలీ చేతిలో పెట్టి టిక్కెట్ తీసుకురమ్మని చెప్పాడు. “కొద్దిసేపట్లో రైలు వచ్చేస్తుంది, మీరు వెళ్ళి రైలులో కూర్చోండి. నేను టిక్కెట్ తీసుకొని వస్తాను” అని ఆ కూలీ వెళ్ళిపోయాడు. ఇంతలో రైలు రాగానే కార్ణిక్ వెళ్ళి రైల్లో కూర్చున్నాడు. తోటి ప్రయాణీకులు అతని పరిస్థితినంతా గమనించి, “ఆ కూలీ రాకపోతే మీ పరిస్థితి ఏమిటి? అప్పుడు మీరేం చేస్తారు?” అని అడిగారు. “నాకు ఆ కూలీ మీద పూర్తి నమ్మకం ఉంది. అతను తప్పక వస్తాడు” అని సమాధానమిచ్చాడు కార్ణిక్. అప్పుడే రైలు బయలుదేరింది. ఇక రైలు స్టేషన్ వదలి వెళ్ళిపోతుండగా, కూలీ అతను పరిగెత్తుకుంటూ వచ్చి అతని చేతిలో టిక్కెట్ పెట్టాడు. బాబా అనుమతి తీసుకొని శిరిడీ వదలిపెట్టిన తరువాత ఎవరైనా ఎందుకు భయపడాలి?

హరిభావూ కార్ణిక్ కోడలికి ఒకసారి మతి భ్రమించింది. ఆమె అంధేరీ(బొంబాయి)లో నివసిస్తోంది. ఆ వార్త విన్న కార్ణిక్ బాధపడి, ఆమెను చూడటానికి వెంటనే బొంబాయికి బయలుదేరాడు. రైల్వేస్టేషనుకు చేరుకుని రైలులో బొంబాయికి బయలుదేరాడు. రైలు పాల్ఘర్‌కి చేరుకొంది. అకస్మాత్తుగా అతను తన వెనకాల కఫ్నీ ధరించిన ఒక ఫకీరు కూర్చుని ఉండటం గమనించాడు. అపుడా ఫకీరు, "ఈ సృష్టిలో పరమేశ్వరుడు ఎన్నో రకాల వృక్షజాతులను  మానవాళి ఉపయోగం కోసం సృష్టించాడు. కానీ ఈ మానవులకి వాటి ప్రాముఖ్యత,  ఉపయోగం చాలా కొద్దిగానే తెలుసు.  కానీ నాకు వాటి ఉపయోగాలు పూర్తిగా తెలుసు" అంటూ, ప్రత్యేకంగా ఒక చెట్టుని చూపించి, "ఆ చెట్టు ఆకులను బాగా మెత్తగా నూరి, వాటి రసాన్ని పిచ్చిపట్టినవానికి త్రాగిస్తే, వాని పిచ్చి నయమవుతుంది" అని అన్నారు.

కార్ణిక్ తన పరిసరాలను కూడా మర్చిపోయి దీర్ఘాలోచనలో పడ్డాడు.  రైలు బాంద్రా చేరుకొన్న తరువాత ఈ లోకంలోకి వచ్చాడు. చుట్టుప్రక్కల ఆ ఫకీరు కోసం చూశాడు, కానీ అతనెక్కడా కనపడలేదు. తన కుమారుడి ఇంటికి చేరుకొన్న వెంటనే ఆ ఫకీరు చెప్పిన చెట్టు ఆకులను తెప్పించాడు. రైలులో ఫకీరు చెప్పిన విధంగానే ఆకులను నూరి వాటి రసాన్ని తన కోడలి చేత త్రాగించాడు. అద్భుతం! ఆమె మతిభ్రమణం పూర్తిగా నయమై, ఆమె మామూలు మనిషయింది. రెండు సంవత్సరాల తరువాత ఆమెకు మరలా మతిభ్రమించింది. కార్ణిక్ మరలా అదే చెట్టు ఆకుల రసాన్ని ఆమె చేత త్రాగించాడు. ఆమెకు ఇక మరలా ఆ జబ్బు రాకుండా శాశ్వతంగా నివారణయింది.

ఒకప్పుడు హరిభావూ కార్ణిక్ మనుమడైన కేశవ్ 10 మైళ్ళ దూరంలో నదీ తీరాన ఉన్న మహాలక్ష్మి దేవత దర్శనానికి తీర్థయాత్రకు వెళ్లాడు. అక్కడ ఉన్నప్పుడు అతడు నదిలో ఈత కొట్టేవాడు. ఇంటికి తిరిగి వచ్చే ముందు కూడా కేశవ్ అలవాటుగా ఈతకొట్టి, స్నానం చేసి గుడిలో దేవిని దర్శించి ఇంటికి వస్తూ, మార్గమధ్యంలో తన చేతికి ఉండాల్సిన 1.5 తులాల బంగారు ఉంగరం లేకపోవడం గుర్తించాడు. ఈతకొట్టే సమయంలో నదిలో ఉంగరం పడిపోయి ఉంటుందని తలచి, ఎంతో విచారంగా ఇల్లు చేరాడు కేశవ్. ఈ సంఘటన జరిగిన 6 నెలల తర్వాత ఒక ఫకీరు వారి ఇంటికి వచ్చి కార్ణిక్‌తో, "మీ అబ్బాయి నదిలో ఉంగరం పోగొట్టుకున్నాడు కదా?" అని ఆ ఉంగరాన్ని చూపారు. ఆ ఉంగరం వారిదేనని కార్ణిక్ గుర్తించాక ఆ ఉంగరాన్ని అతనికి  ఇచ్చి ఆ ఫకీరు వెళ్ళిపోయారు.

3 comments:

  1. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌼😃🌸🥰🌺🤗🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo