ముందుగా సాయిబంధువులందరికీ సాయిరామ్. నేను సంబల్పూర్ నుండి మీ సదాశివ. పోయిన గురువారంనాడు అంటే 2018, ఆగష్టు 2న నాకు బాబా చూపిన అద్భుతమైన లీలను ఇప్పుడు మీ అందరితో పంచుకుంటాను. నిజంగా మరుపురాని, మరచిపోలేని బాబా లీల అది. ఆయన భక్తవాత్సల్యం వర్ణించనలవి కానిది.
ప్రతి గురువారం మందిరానికి వెళ్లి బాబా దర్శనం చేసుకోవడం నాకలవాటు. ఆరోజు కూడా మా మాధవి మేడం, ఇంకొందరు సాయిభక్తులు కలిసి కట్టించిన సాయి మందిరానికి వెళ్ళాను. పోయినవారం బాగా వానలు పడ్డాయి. మీరంతా న్యూస్ ఛానెల్స్ లో చూసే వుంటారు, "ఒరిస్సాలో బాగా వానలు పడుతున్నాయ"ని. ఆరోజు నేను మందిరానికి వెళ్తూ ఉండగా, దారిలో దాదాపు డెబ్భై ఏళ్ల వయస్సుండే ఒక ముసలావిడ కష్టం మీద నడుచుకుంటూ అదే మందిరానికి వెళ్తూ కనపడింది. నేను, ఆవిడ బురదలో నడుచుకుంటూ వెళ్తున్నాము. ఆమె చేతిలో గులాబీ పువ్వులు, సంపెంగ పువ్వులు కలిపి కట్టిన పెద్ద పూలమాల ఉంది. "అమ్మా! వానల వలన షాపులన్నీ మూసి ఉన్నాయి కదా! మరి నువ్వు ఈ మాలను ఎక్కడ కొన్నావు?" అని ఆమెను అడిగాను. అప్పుడు ఆమె, "కొనలేదు బాబు, నేనే పువ్వులు కొని, బాబా కోసం పెద్ద మాల కట్టాను" అని చెప్పింది. అది విని నేను ఆశ్చర్యపోయి, "బాబా మీద ఎంత భక్తి ఈవిడకు!" అనుకున్నాను. పైగా ఆవిడ నాలాగే చాలా బీదరాలు. కానీ బాబాకు ఆరోజు మాల వేయాలని, పైసలు దాచుకొని, పువ్వులు కొని ఇంట్లో మాల అల్లిందంట. నాకు ఇంకా ఆశ్చర్యం వేసింది. "ఈ విశ్వాంతరాళాల్లో ఎంత గొప్ప భక్తులు వున్నారో!" అనుకున్నాను. అలా మాట్లాడుకుంటూ ఆ ముసలావిడ చేయి పట్టుకొని వెళ్తున్నాను. ఇంతలో హఠాత్తుగా ఆ పూలమాల ఆమె చేయిజారి క్రింద బురదలో పడిపోయింది పాపం. ఆమె పడే బాధ మాటల్లో చెప్పలేను, చాలా వేదనపడింది. తరువాత నాతో, "సదా, బాబాకు నా పూలమాల నచ్చలేదు కాబోలు! బురదలో పడిపోయింది. నేను ఇంటికి తిరిగి వెళతాను, నువ్వు మందిరానికి వెళ్ళు!" అంటూ వెనుతిరిగింది. నేను, "వద్దమ్మా, అలా వెళ్లిపోవద్దు, పూలమాల పోతే పోయింది. బాబా దర్శనం చేసుకొని వెళదాం, వానలో శ్రమపడుతూ ఇంతదూరం వచ్చావు కదా! రామ్మా, దర్శనానికి వెళదాం" అని నచ్చచెప్పి ఆమెను బాబా మందిరానికి తీసుకెళ్ళాను. మొత్తానికెలాగో మందిరం చేరాము. మందిరం లోపలికి వెళ్ళి మేము ఆశ్చర్యపోయాము. అక్కడ ఆమె అల్లిన పూలమాలనే బాబా మెడలో వేసుకొని రాజాధిరాజులా, యోగిరాజులా విరాజమానులై వున్నారు. అది చూసి ఆమె, "అరె సదా! ఇది నేను అల్లిన పూలమాలే, మరి అక్కడ బురదలో పడిపోయింది కదా! నేను అక్కడే వదిలేసాను కదా, ఇక్కడికి ఎలా వచ్చింది?" అని అంది. అప్పుడు నేను, "నీ భక్తికి పరీక్షపెట్టి, బాబా లీల చేశారు చూసావా! ఎక్కడా ఈరోజు పూల దుకాణాలు తెరచి లేవు, జనాలు లేరు, మరీ ఆ మాల ఇక్కడికి ఎలా వచ్చిందంటావు? ఆయన నీ భక్తికి మెచ్చి ఆ పూలమాలను తన మెడలోకి తెచ్చుకున్నాడు, నిన్ను అనుగ్రహించాడు" అన్నాను. అప్పుడు ఆమె ముఖంలో ఆనందం వర్ణింపనలవి కానిది. బాబా భక్తవత్సలుడు, దీనజనబాంధవుడు. నిజంగా నిర్మానుష్యంగా ఉన్న సమయంలో ఆమె అల్లిన పూలమాలనే బాబా ధరించి ఉండడం నిజంగా అద్భుతం. స్వచ్ఛమైన భక్తితో పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏది మీరు సమర్పించినా నేను స్వీకరిస్తానని చెప్పకనే చెప్పారు సాయినాథులు.
సేకరణ : శ్రీమతి మాధవి.
🕉 sai Ram
ReplyDelete