సౌదీ అరేబియా నుండి సాయిబంధువు మధుసూదన్ గారు వాట్సాప్ ద్వారా తన అనుభవాన్ని పంపించారు. వారికి, వారి కుటుంబానికి బాబా ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటూ వారి అనుభవాన్ని క్రింద ఇస్తున్నాను. చదివి ఆనందించండి.
నా పేరు మాడిశెట్టి మధుసూదన్. సాయిబంధువులందరికీ సాయిరామ్. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని "సాయి మహారాజ్ సన్నిధి బ్లాగు" ద్వారా మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను.
నాకు 2012వ సంవత్సరంలో బాబా పరిచయం అయ్యారు. అంటే, అంతకుమునుపు తెలియదా? అని మీరు అనుకోవచ్చు. కానీ మాములుగా అందరి దేవుళ్లలో బాబాను ఒక దేవుడిగా అనుకునేవాణ్ణి. 2012లో మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యం నిమిత్తం వాళ్ళు ఉన్న ఊరు మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా) వెళ్ళాము. అక్కడ మా వదిన వాళ్ళ ఇంట్లో బాబా మూర్తిని(విగ్రహం) పూజామందిరంలో చూసాను. చూడటం అంటే మాములుగా కాదు. చూపు తిప్పుకోకుండా ఆయన్నే చూస్తూ ఉండిపోయాను. తరువాత అదే ఊరిలో బాబా గుడిలో ద్వారకామాయి ఉంది. మా వాళ్ళు నన్ను అక్కడికి తీసుకెళ్లారు. ద్వారకామాయిలో అడుగుపెట్టగానే ఆసనం మీద కూర్చుని ఉన్న బాబా ఫోటోను చూసాను. మరలా అదే స్థితి కలిగింది. నా కళ్ళు బాబా వారిని తప్ప వేరే దానిని చూడాలని అనుకోవడం లేదు. ఆ అనుభూతితోనే ఇంటికి వచ్చాను. అక్కడ కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు తీసుకొని, అవి చదివి ధ్యానం చేయడం నేర్చుకున్నాను. అలా ప్రతిరోజూ 15 నిమిషాలైనా ధ్యానం చేస్తూ ఉండేవాడిని. ఒకరోజు ధ్యానంలో బాబా, "రెండు నెలల తరువాత ఇంట్లో పెద్ద ఆపద రాబోతోంది, అమ్మను విడిచి ఎటూ వెళ్లకు!" అని నాకు ఒక సందేశాన్ని ఇచ్చారు. అలా కొన్ని మంచి అనుభవాలు ఇచ్చారు బాబా. ఆయితే బాబా చెప్పినట్లుగానే మా నాన్నగారు రెండు నెలల సమయంలోనే సౌదీ అరేబియాలో గుండెపోటుతో చనిపోయారు. ఆ సమయంలో నేను ఏడుస్తూ బాబాను అడిగిన ప్రశ్నలకు నా గురుదేవుని రూపంలో వచ్చి సమాధానం చెప్పారు. "మీ నాన్నగారిని నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూపిస్తాను" అని చెప్పారు. ఆ తరువాత ఒకరోజు ఏడుస్తూ మా నాన్నను తలచుకుంటుంటే ఆశ్చర్యంగా ఆయన అశరీరవాణి నాకు వినపడటం మొదలైంది. తాను చనిపోవడానికి గల కారణాలు నాకు చెప్పి, "ఇంక ఏడవకు! 5 సంవత్సరాలలో మళ్ళీ నేను మన ఇంట్లోనే నీ అన్న కొడుకుగా పుడతాను" అని చెప్పారు. తను చెప్పినట్లుగానే సరిగ్గా 5 సంవత్సరాల 7 నెలలకు అన్నకి ఇద్దరు కవలలు పుట్టారు. అందులో ఒక బాబు పూర్తిగా నాన్నను పోలి ఉన్నాడు. మరో అనుభవంతో మళ్ళీ కలుస్తాను. బాబా ఆశీస్సులు అందరిపైనా ఉండాలని కోరుకుంటూ... అందరికీ సాయిరామ్.
🕉 sai Ram
ReplyDelete