సాయిబంధువులందరికీ నమస్కారం నేను భువనేశ్వర్ నుంచి మాధవిని. ఒక బాబా లీల మీతో పంచుకుందామని వ్రాస్తున్నాను. అసలు ఈ లీలలు ఎలా జరుగుతాయో, ఎందుకు జరుగుతాయో, ఎవరి కోరికలు తీర్చడానికి బాబా ఎవరిని ఉపకరణంగా చేసుకుంటారో, ఈ ఋణానుబంధం ఇద్దరు వ్యక్తులను ఎలా, ఎందుకు కలుపుతుందో చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు నేను చెప్పబోయే లీల అలాంటిదే. చదివి మీరూ ఆనందించండి.
నేను 2018, ఏప్రిల్ నెలలో షిరిడీ వెళ్ళినప్పుడు జరిగిన అనుభవమిది. గురువారం ఉదయాన కాకడ ఆరతి తరువాత ద్వారకామాయిలో బాబా దర్శనం చేసుకుందామని క్యూలో నిలుచున్నాను. ఒక చిన్న అబ్బాయి బాబా విగ్రహాలు అమ్ముతూ నా దగ్గరికి వచ్చి రెండు విగ్రహాలు తీసుకోమని ఒకటే గొడవపెట్టాడు. నేను, "వద్దు, నా దగ్గర ఉన్నాయి" అని చెప్పి తీసుకోలేదు. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాను. మళ్ళీ సాయంత్రం గురుస్థాన్ దగ్గర అదే అబ్బాయి కనపడ్డాడు. మళ్ళీ అదే గోల. "వద్దురా బాబూ!" అని చెప్పి వెళ్ళిపోయాను. మరునాడు శుక్రవారం మధ్యాహ్నం ఆరతికి వెళ్తుంటే మళ్ళీ అదే అబ్బాయి కనపడి, "రెండు విగ్రహాలు తీసుకో దీదీ" అంటూ మళ్ళీ అదే గోల. నాకు కోపం వచ్చి, "వద్దు, నా దగ్గర ఉన్నాయంటే నీకు అర్థం కాదా?" అని కొంచెం గట్టిగానే చెప్పాను. దానికి వాడు, "నీ దగ్గర ఉన్నాయిలే దీదీ, కానీ ఇంకెవరన్నా బాబాను 'మా ఇంటికి రా' అని వేడుకుంటున్నారేమో, నీ ద్వారా నీకు తెలిసిన వాళ్లకు బాబా ఇప్పిస్తున్నారేమో" అన్నాడు. అంతే! "ఇంత చిన్న పిల్లాడు, ఎంత సత్యాన్ని చెప్పాడు!" అనుకొని మారుమాట్లాడలేక ఆగిపోయాను. వెంటనే ఆ అబ్బాయి దగ్గర బాబా విగ్రహాలు కొనేసాను. ఎలాగూ దర్శనానికి వెళ్తున్నాను కాబట్టి సమాధి మందిరంలో బాబా సమాధికి, బాబాకు తాకించుకొని ఆ విగ్రహాలను తెచ్చుకున్నాను. "ఏ భక్తుల ఇంటికి ఈ బాబా వెళతారో చూద్దామ"ని అనుకున్నాను.
తరువాత ఆదివారానికి నేను ఉద్యోగం చేస్తున్న సంబల్పూర్ కి వచ్చేసి సోమవారంనాడు యథావిధిగా డ్యూటీకి వెళ్ళాను. మా ఆఫీసులో నాతోపాటు పనిచేసే ఒక అబ్బాయి వచ్చి, "మేడమ్, మీరు మా ఇంటికి ఒకసారి రావాలి, నా భార్య మిమ్మల్ని కలవాలని అనుకుంటుంది" అని ఆహ్వానించాడు. వాళ్ళు కూడా తెలుగువాళ్ళే. "సరే, గురువారం టైమ్ ఉంటుంది, వస్తాన"ని చెప్పాను. మొదటిసారి వెళ్తున్నాము కదా, ఏమైనా తీసుకెళ్దామని షిరిడీ నుండి తెచ్చిన బాబా విగ్రహం పట్టుకొని గురువారం సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అతని భార్య సౌజన్య చేతికి విగ్రహం ఉన్న బాక్స్ అందిస్తూ, "చిన్న గిఫ్ట్, తీసుకోండి" అన్నాను. తను "ఏమిటి మేడమ్?" అని తెరచి చూసి, ఆశ్చర్యపోయి, (ఆనందం పట్టలేక) కన్నీళ్లు పెట్టుకుంది. నేను, "ఎందుకు? ఏమైంది?" అని అడిగాను. దానికి తను చెప్పిన సమాధానం విని నేను ఆశ్చర్యపోయాను. ఇంతకీ విషయం ఏమిటంటే, తను కూడా మంచి బాబా భక్తురాలు. తన దగ్గర ఒక చిన్న బాబా విగ్రహం ఉంది. ఆ విగ్రహం చాలా పాతది. కాళ్ళ దగ్గర విరిగిపోయింది పాపం. ఆరోజే ఆమె బాబా ముందు కూర్చొని, "బాబా, ఇలా విరిగిన విగ్రహానికి పూజ చేయడానికి మనసు రావటం లేదు. నేనిది చాలాకాలం క్రిందట షిరిడీలో కొన్నాను, మళ్ళీ నాకు షిరిడీ నుంచి తెచ్చిన విగ్రహమే కావాలి. మరి నువ్వు ఎలా వస్తావో, ఏమో నీకే తెలియాలి, తొందరగా రా బాబా!" అని బాబా ముందర కూర్చొని బాబాను ప్రార్థించిందట. ఆరోజు గురువారం కావడం, నేను షిరిడీ నుంచి తెచ్చిన విగ్రహం తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్లడం అంతా బాబా లీల.
ఆమె గుండెలోతుల్లో నుంచి వచ్చే ధర్మసమ్మతమైన కోరిక బాబాకు వారం ముందే తెలుసు. నన్ను ఒక ఉపకరణంగా చేసుకొని ఆమె కోరిక ఎలా తీర్చారో చూడండి. ఆ చిన్న అబ్బాయి షిరిడీలో మూడుసార్లు నా వెంటపడి మరీ విగ్రహాలు కొనేలా చేయడమేమిటి? ఈమె, 'షిరిడీ నుంచే బాబా విగ్రహం కావాలి' అని వేదన పడటం ఏమిటి? నేను వీళ్ళ మధ్యలో ఒక ఉపకరణంగా మారడం ఏమిటి? అంతా విచిత్రం. అందుకే నేనెప్పుడూ మనం చేసే ప్రతి పని వెనకాల అంతరార్థం ఉంటుందని, బాబా హస్తం ఉంటుందని అనుకుంటాను.
సాయి లీలలు అద్భుతం. ఒకానొక సందర్భంలో బాబా వారు కూడా ఇలాగే చెబుతారు దైవం విరాట్ స్వరూపం.శక్తి స్వరూపం.సామాన్యులమైన మన మేధాశక్తికి అంత తేలికగా అవగతం కాదు. లీలా మయ సద్గురు సాయినాధ నీకు
ReplyDeleteనీవే సాటి తండ్రి.
🕉 sai Ram
ReplyDelete