సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

షిర్డీలో బాబా ధరించిన వస్త్రాలు కాలిఫోర్నియాలో బాబాకు చేరుకున్న లీల


ఓం సాయిరాం. నాపేరు మాధవి. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన గొప్ప అనుభవాన్ని సాయిబంధువులతో పంచుకుందామని వ్రాస్తున్నాను. మనం బాబా అష్టోత్తరంలో రోజూ "ఓం కాలాతీతాయ నమః" అని చదువుతాము. అంటే, కాలానికి అతీతమైనవాడు అని అర్థం. అదే అనుభవాన్ని నాకు కలిగించారు బాబా. 


నేను కాలిఫోర్నియాలో స్థాపించిన  'విశ్వసాయి ద్వారకమాయి' అనే సంస్థలో సభ్యురాలిని. వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక్కోచోట విశ్వసాయి సమ్మేళనం జరుపుకుంటూ ఉంటారు. అప్పుడు తెలుగు వాళ్ళందరూ కలిసి బాబా భజనలు, ఆరతులు, పారాయణలు ఇంకా ఎన్నో  వైభవంగా చేసుకుంటారు. ఆ సంస్థను హైదరాబాదుకు చెందిన లక్ష్మోజీ గారు స్థాపించారు. ఎప్పుడు విశ్వసాయి సమ్మేళనం జరిగినా, నేను షిర్డీ వెళ్లి మా విశ్వసాయి సమ్మేళనం ఆహ్వానపత్రిక బాబాకు సమర్పించి వస్తాను. గత 5 సంవత్సరాలుగా నేను ఈ పని చేస్తున్నాను. కాని ఈసారి కొన్ని కారణాల వలన నేను వెళ్ళను అనుకున్నాను. అదే విషయం మా లక్ష్మోజీ గారికి కూడా చెప్పాను. కానీ బాబా ప్రణాళిక వేరే విధంగా ఉంది. ఆయన ఈ సేవ ఎలాగైనా నాతోనే చేయించాలనుకున్నారు కాబోలు! సరిగ్గా సమయానికి బాబా నన్ను షిర్డీకి పిలిపించుకున్నారు. మా అక్క కూతురు కాలిఫోర్నియాలో ఉంటుంది. తను, "నేను షిర్డీ వస్తున్నాను, నువ్వు కూడా తప్పకుండా రావాలి" అని నాకు టికెట్ బుక్ చేసి పంపింది.



వాళ్ళు జులై 12వ తేది ఉదయాన షిర్డీ చేరుకుంటారనగా నేను జులై 11న చేరుకున్నాను. ఆరోజు నేను రెండుసార్లు బాబా దర్శనం చేసుకున్నాను. రెండుసార్లు కూడా బాబా నారింజ రంగు వస్త్రాలు ధరించి, ఆ వస్త్రాలలో ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు. అలా బాబాను చూస్తుంటే నాకు చాలా నచ్చింది. అస్సలు నా కళ్ళు తిప్పుకోలేకపోయాను. అప్పుడే, అక్కడే నా మనస్సులో, "ఈ డ్రెస్ బయట షాపులో దొరికితే కొని, మా విశ్వసాయి సమ్మేళనానికి పంపుతాన"ని ఒక సంకల్పం కలిగింది. కానీ అది నేను అనుకున్నంత సులభం కాదని తెలుసు నాకు. ఎందుకంటే షిర్డీలో బాబా కోసం డ్రెస్సులు ఎవరో భక్తులు, ఎక్కడెక్కడ నుంచో తెచ్చి ఇస్తారు. అది ఒకవేళ కొన్నా కానీ కాలిఫోర్నియా ఎలా చేరుతుంది? అందుకే ఆశ కూడా వదిలేసాను. కానీ బాబా నా ఆ సంకల్పాన్ని తీరుస్తారని నాకు అస్సలు తెలియదు.



జులై 12వ తేది ఉదయాన మా అక్క కూతురు వాళ్ళు వచ్చారు. అందరం కలిసి అన్నీ దర్శనాలు చేసుకున్నాము. విశ్వసాయి సమ్మేళనం ఆహ్వానపత్రికను నేను సమాధి మందిరంలో బాబా పాదాల వద్ద పెట్టి, ఎప్పటిలా, "బాబా, అందరికీ నీ ఆశీర్వాదమివ్వు" అని ప్రార్థన కూడా చేసుకున్నాను. మా అమ్మాయికి బాబా నారింజ రంగు డ్రెస్ గురించి చెప్పాను. "ఒకవేళ షాపులో ఆ డ్రెస్ దొరికితే, కొని పంపుతాను. నువ్వు కాలిఫోర్నియాలో లక్ష్మోజీ గారి ఇంట్లో ఇవ్వు" అని చెప్పాను. అందుకు తను సరేనని చెప్పి 13వ తేది ఉదయాన వెళ్ళిపోయింది. నేను 13న బాబా దర్శనం చేసుకొని, లెండీబాగ్ కి వెళ్ళాను. అక్కడ బాబాకు వాడిన బట్టల షాపు ఉంది. ఏదన్నా కొందామని అక్కడికి వెళ్ళాను. అక్కడ చూసి ఆశ్చర్యపోయాను. 11వ తేదీన బాబాకు వేసిన ఆ నారింజ రంగు డ్రెస్ అమ్మకానికి షాపులో ఉంది. ఇంకా రేటు కూడా వ్రాయలేదు. అప్పుడే వచ్చిందని చెప్పారు. ఇంకేముంది? వెంటనే కొనేసాను. నా ఆనందానికి హద్దులు లేవు. "బాబా డ్రెస్ నా చేతిలో - ఎంత అదృష్టం!" అనుకున్నాను. వెంటనే హైదరాబాదులో మా అక్కకూతురు ఉన్న ఇంటికి పోస్టులో పంపాను. సరిగ్గా వాళ్ళు కాలిఫోర్నియా వెళ్ళడానికి బయలుదేరుతున్న సమయంలో అది వాళ్ళకి చేరింది. ఆ బాబా డ్రెస్ ఒక మజిలీ చేరింది. కానీ మా అమ్మాయి కాలిఫోర్నియా(sanjose) చేరేసరికి లక్ష్మోజీ గారు వాళ్ళు విశ్వసాయి సమ్మేళనానికి కెనడా వెళ్లిపోతారేమో! వాళ్లకు చేరుతుందో, లేదో? అని మళ్ళీ నాకు టెన్షన్. అక్కడ మళ్ళీ బాబా లీల చేశారు.



మా అమ్మాయి వెళ్లే ఫ్లైట్ 20నిమిషాలు ముందుగా అక్కడికి చేరుకుంది. వెంటనే తను షిర్డీ నుంచి వచ్చిన బాబా డ్రెస్ ఇవ్వడానికి లక్ష్మోజీ గారి ఇంటికి పరుగుపెట్టింది. అక్కడ వాళ్ళు కెనడా వెళ్లడానికి సిద్ధం అవుతున్నారు. సామాన్లు కార్లలో పెట్టుకున్నారు. బాబా విగ్రహానికి మంగళస్నానం చేయించారు. బాబాకు ఏమి డ్రెస్ వెయ్యాలి? అని ఆలోచిస్తున్న తరుణంలో సరిగ్గా మా అమ్మాయి అక్కడికి చేరుకొని, "గురువుగారూ! షిర్డీ నుంచి బాబా డ్రెస్ తెచ్చాను" అని నేను పంపిన డ్రెస్ ఇచ్చింది. ఆయన, "షిర్డీ నుంచి ఎలా తెచ్చావు? మాధవి పంపిందా?" అని అడిగారు. తను అవునని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయింది. మా లక్ష్మోజీ గారికి ఆనందం పట్టలేక కళ్ళలో నీళ్ళు వచ్చాయి. "బాబా, విశ్వసాయి సమ్మేళనం కోసం షిర్డీ నుంచి నీకు వేసిన బట్టలు వస్తాయని నేను ఎప్పుడూ అనుకోలేదు, నీ కృప అనంతం" అనుకున్నారు. అక్కడున్న అందరూ బాబా కృపకు ఆశ్చర్యపోయారు. ఎలాగైనా నా చిన్న సంకల్పాన్ని నిజం చేయడానికి బాబా కాలాలకు అతీతంగా డ్రెస్సును విశ్వసాయి సమ్మేళనానికి చేర్చారు. ఇప్పుడు చెప్పండి, షిర్డీ ఎక్కడ? హైదరాబాదు ఎక్కడ? కాలిఫోర్నియా ఎక్కడ? కెనడా ఎక్కడ? ఇంత ప్రయాణం చేసి బాబా డ్రెస్ చివరి మజిలీ చేరుకుంది. అందుకే మన సాయినాథుడు కాలాతీతుడు అంటాను. జై సాయిరాం.


1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo