సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

చిన్న స్మరణకే ఇంత సహాయమా బాబా!


ఈ సర్వజగత్తునంతటినీ తన ఆధీనంలో పెట్టుకున్న సాయిమహారాజుకి నా పాదాభివందనాలు. సాయిబంధువులందరికీ సాయిరాం. నా పేరు ప్రియాంక. నేను USAలో ఉంటున్నాను. నేను ఈరోజు అమెరికా నుండి ఈ అనుభవాన్ని తెలియజేయగలుగుతున్నానంటే అందుకు కారణం కేవలం ఆరోజు సాయిబాబా నాకు తోడుగా ఉండి నన్ను ఫ్లైట్ ఎక్కించారు కాబట్టే! నాకు జరిగిన ఈ సాయిలీలను, సాయి మహత్యాన్ని నేను సాయిబంధువులందరికీ తెలియచేయాలన్నది నా కోరిక మరియు బాబా ప్రేరణ. నా అనుభవాన్ని "సాయి మహారాజ్ సన్నిధి బ్లాగు" ద్వారా సాయిబంధువులతో పంచుకొనే అవకాశమిచ్చిన బాబాకు ధన్యవాదములు.
నాకు అంత భక్తి ఏమీ ఉండేది కాదు, నేను అసలు దేవుడిని మ్రొక్కేదాన్ని కూడా కాదు. కానీ మా రెండో అక్క బాబా భక్తురాలు. తను ఎప్పుడూ నాతో, "నీవు ఎల్లప్పుడూ సాయిబాబాను స్మరిస్తూ ఉండు! అలా వీలుకాకపోతే కనీసం నీకు కష్టం అనిపించినపుడైనా బాబాను స్మరించు. బాబా నిన్ను కాపాడటానికి సదా సంసిద్ధుడై ఉంటాడు, తన భక్తులనెల్లపుడూ కంటికి రెప్పలాగా కాపాడుతాడు" అని చెబుతూ ఉండేది. ఎందుకో, ఎలాగో తెలియదుగానీ తను చెప్పిన మాటలు, సాయిబాబా మీద తను చూపే ప్రేమ నన్ను కూడా మార్చేసాయి. నన్ను కూడా ఒక సాయిభక్తురాలిగా చేసాయి. నేను సాయిభక్తురాలినని మీకు పరిచయం చేసుకోవడంలో ఇంత సంతోషం, తృప్తి ఉన్నాయని నాకిప్పుడు తెలుస్తుంది. "నీవు ఎక్కడికైనా వెళ్ళు, నేను నీ వెంటనే ఉంటాను" అని బాబా చెప్పిన మాటలు నా విషయంలో నిజమయ్యాయి. నేను 2017 డిసెంబర్ లో ఇండియాకి వచ్చి, 2018 ఫిబ్రవరిలో USA తిరిగి వెళ్లే సందర్భంలో బాబా ఇచ్చిన అనుభవమిది. ఇంటర్నేషనల్ ఫ్లైట్ కి కనీసం మూడుగంటలు ముందుగా విమానాశ్రయానికి వెళ్లాల్సి ఉంటుంది. స్వంత వాహనమైతే మూడుగంటల సమయానికి పార్కింగ్ ఫీజు ఎక్కువ అవుతాయని నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా మా మామగారు నన్ను ఆలస్యంగా విమానాశ్రయానికి తీసుకెళ్లారు. ఏమి చేస్తాము? కొన్నిసార్లు పరిస్థితులే అలా వస్తాయో లేక మాయో అర్థం కాదు కానీ, అలాంటి సమయాన్ని ఎదుర్కోవలసివస్తుంది. USAకి వెళ్ళేది నేను, మా పాప యశ్విక ఇద్దరమే. ఒకవైపు నా వాళ్లందరినీ వదిలివెళుతున్నానని, ఇంకోవైపు ఇంత ఆలస్యం అయిందని టెన్షన్. అంతేగాక మా పాప US సిటిజన్, అందువలన లోపల ఎలాంటి ప్రశ్నలు వేస్తారో, టెన్షన్ లో ఏం చెప్తానో, ఏమిటో అని ఒకటే భయం. నా భర్త కూడా నాతోలేరు. తను మా ఇద్దరినే ఇండియాకి పంపించారు. మా పాప వయస్సు 3 సంవత్సరాలు. పిల్లల మనస్తత్వం ఎప్పుడు ఎలా ఉంటుందో వాళ్ళకే తెలియదు. అందులో తను చాలా అల్లరిపిల్ల. అందరినీ వదిలి వెళ్తున్నందుకు తను ఏడుస్తుంది కూడా. నేను బ్యాగేజ్ కౌంటరుకి వెళ్లి, నాది తొందరగా చేయండి, ఆలస్యం అయిందని చెప్పాను కానీ, వాళ్ళు నన్ను ఆపేసారు. ఎందుకంటే టికెట్ మీద నా పేరును తప్పుగా ఎంటర్ చేశారు. చాలాసేపు వాదించవలసి వచ్చింది ఆలస్యమైనందుకు. ఇమ్మిగ్రేషన్ దగ్గర కూడా తెలిసిన వాళ్ళు వస్తే వాళ్లనే మొదటగా పంపించేస్తున్నారు. ఆలస్యం అవుతుందని పర్సనల్ అసిస్టెంట్(PA)ను ఎరేంజ్ చేసుకున్న వాళ్ళు కూడా రాలేదు. ఏమీ అర్ధం కావడం లేదు నాకు. అన్ని దారులు మూసుకుపోయాయి. ఫ్లైట్ మిస్ అవడం ఖాయమని స్పష్టంగా అర్ధం అవుతుంది. అయినా మనం మనుషులం కదా! సంతోషంగా ఉన్నపుడు దేవుడు గుర్తురాడు కానీ కష్టకాలంలో ఖచ్చితంగా గుర్తుకువస్తాడు. వెంటనే మా రెండో అక్క చెప్పిన మాటలు గుర్తొచ్చి బాబాను "సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం" అని స్మరించుకుంటూ "కేవలం నిన్ను స్మరించడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయురాలిని తండ్రీ! నన్ను, నా కూతురిని అమెరికాకు క్షేమంగా పంపించు" అని 'సాయిరాం, సాయిరాం' అనుకుంటుంటే "మనలోని భక్తి భావం బలహీనంగా ఉన్నా సరే బాబా రూపమే మన భక్తి భావనకు బలం కల్గిస్తుంది" అని నాకు బాగా అర్థం అయింది. బాబా అన్న మాటలు అక్షర సత్యాలు అయ్యాయి.
ఎక్కడినుంచి వచ్చిందో తెలియదుగాని అకస్మాత్తుగా ఒక అమ్మాయి వచ్చి చాలా పెద్ద లైన్ ఉండగా సెక్యూరిటీ చెక్ లైన్ కూడా క్లియర్ చేసి త్వరత్వరగా నన్ను నేరుగా బోర్డింగ్ వరకు తీసుకెళ్లింది. వెంటనే ఫ్లైట్ ఎక్కాను. లోపలికి వెళ్లి చూస్తే చివరి వ్యక్తిని నేనే. లోపలికి వెళ్లి కూర్చున్న కొంతసేపటివరకు నా పరిస్థితి నాకు అర్ధం కాలేదు. కాసేపు అయిన తర్వాత నా మెదడు ఆలోచించండం మొదలుపెట్టింది. "ఆ అమ్మాయి ఎవరు? నేను పెట్టుకున్న PA కాదు, మరి ఎవరు? బోర్డింగ్ దాకా లైన్ క్లియర్ చేస్తూ తీసుకెళ్లింది. నేను తనని హెల్ప్ అసలు అడగనే అడగలేదు కదా!" అని. అప్పుడు నా మనస్సాక్షి చెప్పింది, "బాబానే ఆ అమ్మాయి రూపంలో వచ్చి నాకు సహాయం చేసార"ని. నేను ఫ్లైట్ మిస్ కాకుండా సరైన సమయానికే వెళ్లగలిగాను. "చిన్న స్మరణకే ఇంత సహాయం చేస్తావా బాబా!" అని అనుకున్నాను. "నీవు ఎక్కడికైనా వెళ్ళు, నేను నీ వెంట ఉంటాను" అన్న బాబా మాటలు నా విషయంలో నిజం అయ్యాయి.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo