సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

అమ్మ చావుచీటీని తీసేసిన -- మాతృసాయి


సాయిబంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. 20  సంవత్సరాల క్రితం హఠాత్తుగా మా అమ్మ కాన్సర్ మరియు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధులతో బాధపడుతుందని మాకు తెలిసింది. అలాంటి వ్యాధి ఒకటి ఉంటుందని కూడా మాకు అప్పటికి తెలియదు. మా అమ్మ ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తూ తను చావుతో పోరాడుతుందని మాకు అర్థం అవుతుంది. కానీ తన పరిస్థితిని చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోయాము. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఆవిరైపోయాయి. అమ్మ బాధను చూస్తూ ఊరికే ఉండలేక బాబాను ఒక్కటే కోరిక కోరుకున్నాను, "బాబా! ఎవరైనా ఇంత భయంకరమైన వ్యాధితో పోరాడుతూ, బాధని అనుభవిస్తూ ఆ వ్యాధిని జయిస్తున్నారా? ప్రపంచంలో ఎవరూ కూడా ఇలాంటి భయంకరమైన వ్యాధి బారిన పడకుండా చూడు తండ్రీ! బాబా, మా ఇంటి ఇలవేల్పువి నీవే. నిన్ను మ్రొక్కడం తప్ప మాకు ఇంకేమీ తెలియదు. అక్కడ డాక్టర్లు ఏవో ఆపరేషన్స్ అంటున్నారు. మా అమ్మ వ్యాధి గురించి తెలిసినప్పటి నుండి నిన్ను క్షణమైనా మరువకుండా స్మరిస్తున్నాను. 'నా భక్తులను అన్నివిధాలా ఆదుకోవడానికే నేను ఉన్నది' అన్నావు కదా! మరి మా అమ్మని రక్షించు. ఒకటి కాదు, రెండు వ్యాధులతో బాధపడుతోంది. నీవు కరుణాసాగరుడవు, కాస్త కరుణ ఈ భక్తురాలి మీద చూపించి ఆదుకో బాబా!" అని కన్నీళ్లు పెట్టుకున్నాను.

అమ్మను ICU లోపలకి తీసుకొని వెళ్తున్నప్పుడు మా అమ్మకు నేను చెప్పిన ఓదార్పు మాటలు, ధైర్యం చెప్పిన తీరు ఒక బిడ్డ తల్లికి చెప్పినట్టుగా లేదు. నేనే మా అమ్మకు తల్లినయ్యాను ఆ క్షణాన. తనలో ధైర్యం నింపిన ఆ మాటలు, అవి చెప్పిన తీరు అంతా బాబానే చేయించారేమో అనిపిస్తుంది నాకు. తలచుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. తరువాత అమ్మను ఆపరేషన్ కోసం లోపలకి తీసుకెళ్లారు. కొన్ని గంటల తర్వాత తనను ICU లోనికి మార్చారు. కానీ లోపలికి వస్తే రోగికి ఇన్ఫెక్షన్ అవుతుందని ఎవ్వరినీ లోపలికి రానివ్వలేదు. మా తమ్ముడే ICU బయట చాలా రోజులు ఉండి మా అమ్మని చూసుకున్నాడు. ఆపరేషన్ జరిగాక కూడా డాక్టర్స్, "ఆమె ఎక్కువ రోజులు బ్రతికే అవకాశం మాత్రం లేదు" అని చెప్పారు. "తను మందుల మీద బ్రతికుంది అంతే. చాలా జాగ్రత్తగా చూసుకోవాల"ని కూడా చెప్పారు. బాబా దయవలన మా అమ్మగారిని ఆపరేషన్ తరువాత మా ఇంటికి తీసుకొని వచ్చాము.

ఈ లీల జరిగి 20 సంవత్సరాలు అయిందని ముందుగా మీకు చెప్పాను కదా! బాబా ఆశీర్వాదం, ఆయన మా కుటుంబంపైన చూపిన ప్రేమలే అమ్మ ఇప్పటికీ బ్రతికి ఉండటానికి కారణం. డాక్టర్స్ కొన్నిరోజులు బ్రతుకుతుందన్న మాటలను కూడా తారుమారు చేసి మా అమ్మ చావుచీటీని బాబా చింపేసి ఇంత ఆయుష్షునిచ్చారు. కాన్సర్ వ్యాధి ఒక్కటి ఉంటేనే బ్రతకడం కష్టం, అలాంటిది మా అమ్మకి బ్రెయిన్ ట్యూమర్ కూడా... బాబా కృప వలన మాత్రమే మా అమ్మ ఈ భయంకరమైన రెండు వ్యాధులను జయించగలిగింది. "బాబా! 'మీరు చేసిన సహాయానికి ధన్యవాదములు' అని చెప్పే మాట చాలా చిన్నది. మాతృసాయి(తల్లి)లాగ  మమ్ములను ఆదుకున్నావు. ప్రతి కుటుంబంలో ఒక తల్లి పోషించే పాత్రకు సరిపోయేది ఈ లోకంలో ఏది లేదు. నా తల్లిని కాపాడి మా కుటుంబాన్ని రక్షించావు తండ్రీ!".


3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo