శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
సాయిబంధువులందరికీ సాయిరాం. నేను బాబా భక్తురాలిని. నేను ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాను. బాబా ఈమధ్యకాలంలోనే నేను కోరుకున్న ఒక కోరికను తీర్చారు. నా కోరిక కనుక తీర్చినట్టయితే నేను నా అనుభవాన్ని ఈ "సాయిమహారాజ్ సన్నిధి బ్లాగ్" ద్వారా సాయిబంధువులతో పంచుకుంటానని బాబాకు చెప్పుకున్నాను. అందుకే ఎంతో సంతోషంగా నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన బ్లాగ్ వారికి ధన్యవాదములు. బాబా నాపై చూపిన ప్రేమను, తన ఆశీర్వాదాన్ని మీ అందరికీ తెలియజేస్తాను.
అమెరికాలో ఒక్కరి సంపాదనతో ఇల్లు గడవడం అంటే చాలా కష్టం. ఎంత సంపాదన ఉంటుందో అంత ఖర్చూ ఉంటుంది. అందుకే నేను, మావారు నా జాబ్ కోసం చేయని ప్రయత్నాలు లేవు. కానీ ఫలితం మాత్రం లేదు. మావారి ఒక్కరి సంపాదన సరిపోవట్లేదు. జాబ్ కోసం ప్రయత్నాలు చేసి చేసి చాలా విసిగిపోయాం. కేవలం నమ్మకం మాత్రం ఉంది బాబా మీద. దేనికైనా సమయం రావాలి. బాబా అంటారుగా, "శ్రద్ధ, సబూరితో ఉండమని". కానీ నా విషయంలో కాస్త ఎక్కువ మోతాదులో శ్రద్ధ, సబూరీలను చూపించాల్సి వచ్చిందని అనిపిస్తుంది. జాబ్ కోసం వెతికి వెతికి, ఎంతకీ రావట్లేదని తీవ్ర మనస్తాపానికి గురయ్యేదాన్ని. ప్రతిసారీ నా కుటుంబం మాత్రం, "భారమంతా బాబా మీద వేసి నిశ్చింతగా ఉండు, ఆయన చూసుకుంటారు" అంటుండేవారు. కానీ ఏదో మాయ నన్ను బాబా మీద నమ్మకాన్ని కోల్పోయేలాగా చేస్తుండేది. "ఇంతగా బాబాను ప్రార్థిస్తున్నాగాని నాకు బాబా జాబ్ ఇవ్వట్లేదు" అన్న ఆవేదన నన్ను సహనం కోల్పోయేలాగా చేసేది.
మా ఇంటికి దగ్గరలో ఉన్న ఆఫీసులో జాబ్స్ ఉన్నాయని తెలిసి, హ్యాపీగా ఫీల్ అయ్యాను. "ఈ జాబు బాబా నాకు ఇస్తారేమో! అందుకే ఇన్నిరోజులు ఆలస్యం చేశారేమో!" అనుకొని జాబుకి దరఖాస్తు చేశాను. బాబా మీద చాలా నమ్మకం పెట్టుకున్నాను కానీ, ఆ జాబ్ కూడా రాలేదు. దీనితో నా మానసిక పరిస్థితి చాలా విషమంగానే తయారైందని చెప్పాలి. ఎందుకంటే, ఇంటర్వ్యూలకు వెళ్లడం, జాబ్ రాకపోవడంతో విసిగిపోయాను. నా స్నేహితులందరూ, "నువ్వు బాబా భక్తురాలివిగా, నీకు బాబా ఎందుకు జాబ్ ఇవ్వట్లేదు?" అని అడుగుతుంటే ఏమి చెప్పాలో అర్థమయ్యేది కాదు.
మావారు నన్ను ఓదార్చడానికి "ఏది జరగాలన్నా బాబా గారి దయ, కరుణ, ప్రేమ ఆశీర్వాదం మనపైన ఉండాలి, ఆయన ఆజ్ఞ లేనిదే ఆకైనా కదలదు. బాబా మీద నమ్మకం మాత్రం కోల్పోకు. నీ కర్మలు అన్నీ తొలగిపోలేదేమో! అందుకే ఆలస్యం చేస్తున్నారేమో! ఆలోచించు" అని అంటుండేవారు. తాను అన్న మాటలు నిజంగా నాకు కొండంత ధైర్యాన్నిచ్చాయి.
బాబా దగ్గరికి వెళ్లి మనస్ఫూర్తిగా, "బాబా! నా కోరికలో ఎలాంటి స్వార్థంలేదు. నా కర్మలన్నీ తొలగించు. మీకు ఎప్పుడు జాబ్ ఇవ్వాలని అనిపిస్తే అప్పుడు ఇవ్వండి. నేను ఎంతో సబూరితో ఉంటాను. నాకు ఏదైతే శ్రేయస్కరమో మీకన్నా ఎక్కువ ఎవరికి తెలుసు?" అని తనతో నా బాధంతా చెప్పుకున్నాను. నా జాబ్ విషయం బాబాకు వదిలేసి నిశ్చింతగా ఉన్నాను .
మరుసటిరోజు మావారు జాబ్ వేకెన్సీస్ ఉన్నాయని దరఖాస్తు చేసారు. గురువారం ఇంటర్వ్యూ ఉందని కాల్ వచ్చింది. కానీ లోపల ఏదో భయం. "ఇది కూడా రాకుంటే మునుపటిలాగా తట్టుకునే ధైర్యం లేదు బాబా" అని చెప్పుకుంటూ ఉన్నాను.
ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళగానే నా కాళ్లుచేతులు వణికిపోతున్నాయి, చెమటలు పట్టేస్తున్నాయి. అంత టెన్షన్ లో వాళ్ళకు సమాధానాలు చెప్పగలుగుతానన్న నమ్మకం కూడా లేదు. ఆ క్షణంలో బాబా ఒక్కరే నాకు దిక్కు. "బాబా, నువ్వే ఏదైనా చేయి" అని స్మరించుకున్నాను. వెంటనే ఏదో తెలియని ధైర్యం నాలో వచ్చింది. వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ చాలా సబూరితో నిదానంగా సమాధానం చెప్పాను. వాళ్లు, "మీకు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేస్తాము" అని చెప్పారు. నాకు ఈ జాబ్ వస్తుందని అంతగా నమ్మకం లేదు. సరే, బాబా చూసుకుంటారని వదిలేసాను. ఎందుకంటే ఈ జాబుకోసం నాకన్నా సీనియర్స్ ఉన్నారు, పైగా జీతం కూడా ఎక్కువే. నేను ఆ జాబుకి తగినదాన్నైతే కాదు. ఆశలు వదిలేసుకొని ఆ జాబ్ సంగతి మర్చిపోయాను కూడా.
మూడు రోజుల తర్వాత వాళ్ళ దగ్గర నుండి కాల్ వచ్చింది. "జాబులో జాయిన్ అవ్వండి, గురువారం నుండి రావాలి, అన్నీ మాట్లాడుకొని వెళ్ళండి" అని చెప్పారు. నేను షాకులోనే ఉన్నా, 'ఇది నిజామా!' అని. మావారు నా మెయిల్ చెక్ చేసి, "అవును! నీ అంచనాలకు మించిన జాబ్ నీకు బాబా ఇచ్చారు చూసావా!" అని అంటుంటే నా కళ్ళ నుండి కన్నీళ్లు ఆగడం లేదు.
బాబా నన్ను అందుకే సబూరితో ఉండమంటూ, ఇంత ఆలస్యం చేశారా! పిచ్చిదాన్ని ఆయనని అర్ధం చేసుకోలేక ఇంత మనోవ్యధని అనుభవించాను. ఆయన మీద ఎప్పుడైతే నమ్మకం ఉంచి మొత్తం భారం ఆయనపై వదిలేసి సబూరితో ఉన్నానో, అప్పుడు బాబా నాకు కావాల్సింది ఇచ్చారు. కాదు కాదు, నాకు శ్రేయస్కరమైంది ఇచ్చారు. ఆయన చర్యలు నిజంగా అగాధాలు, అర్థం చేసుకోవడం ఎవరివల్లా కాదు. కేవలం తన నిర్ణయం కోసం సహనంతో వేచి ఉండాలని బాబా నాకు నేర్పించారు. థాంక్యూ బాబా! లవ్ యూ బాబా!
🕉 sai Ram
ReplyDelete