సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1725వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శిరిడీకి తీసుకెళ్లి, మళ్ళీ ఇంటి దగ్గర దింపిన బాబా
2. ఆఫీస్ పనిలో వచ్చిన సమస్యని పరిష్కరించిన సాయి

శిరిడీకి తీసుకెళ్లి, మళ్ళీ ఇంటి దగ్గర దింపిన బాబా


నేను ఒక సాయిభక్తురాలిని. నేను ఉద్యోగం మానేసాక మేము శిరిడీ వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నాం. తర్వాత మరుసటిరోజు సాయంత్రం మేము శిరిడీ రైలు ఎక్కాల్సి ఉండగా ముందురోజు హఠాత్తుగా మా తమ్ముడు శిరిడీ చూడలేదని, తనని కూడా తీసుకెళదామని నేను, మావారు అనుకున్నాం. అప్పుడు 'మా తమ్ముడు శిరిడీకి రావచ్చా?' అని బాబాని చీటీలు వేసి అడిగాం. బాబా సమాధానం 'తీసుకొని రమ్మ'ని వచ్చింది. అయితే మేము ఉండేది హైదరాబాద్‌లో. మా తమ్ముడు ఉండేది వైజాగ్‌లో. అందువల్ల అప్పటికప్పుడు బస్ టికెట్ బుక్ చేసి, మా తమ్ముడిని హైదరాబాద్‌కి రప్పించాము. తర్వాత కరెంటు రిజర్వేషన్‌లో టిక్కెట్లు అందుబాటులో ఉండటంతో మా తమ్ముడికి రానూపోనూ టిక్కెట్లు బుక్ చేసాం. అయితే సాయంత్రం మేము ఎక్కాల్సిన శిరిడీ రైలు ఆలస్యమై రాత్రి 12 గంటలకి బయలుదేరుతుందని మెసేజ్ వచ్చింది. దాంతో మరో రైలుకి టిక్కెట్లు అందుబాటులో ఉండటం చూసి, బుక్ చేసుకొని అదేరోజు రాత్రి 8:30కి రైలు ఎక్కాము. నేను ముందు నుండి మనసులో బాబాని, "బాబా! ఈమద్య రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. అందువల్ల నాకు భయంగా ఉంది. మీరు దగ్గర ఉండి మమ్మల్ని క్షేమంగా శిరిడీకి తీసుకెళ్లి, మళ్ళీ క్షేమంగా ఇక్కడికి తీసుకొని రావాలి" అని అడుగుతూ ఉండేదాన్ని. బాబా దయవల్ల మేము క్షేమంగా మరుసటిరోజు గురువారం ఉదయం శిరిడీ చేరుకున్నాము. మా ఆర్థిక పరిస్థితి బాగా లేనందున వసతికి, ఫుడ్‌కి ఎలా అని టెన్షన్‌గా ఉన్నందున మావారు ముందుగానే 'సాయి ఆశ్రమంలో రూమ్ బుక్ చేసారు. 3 రోజులకి 750 రూపాయలు అయ్యింది. అయితే నేను రూమ్ ఎలా ఉంటుందోనని భయపడ్డాను. కానీ, రూమ్ చాలా చాలా బాగుంది. ముఖ్యంగా రూమ్‌లో బాబా ఫోటో ఉంది. బాబాని చూడగానే నాకు సంతోషంగా అనిపించింది. అక్కడినుండి బాబా లీలలు మొదలయ్యాయి. సాయంత్రం దర్శనానికి వెళితే చాలా తొందరగా అయిపొయింది. ఆశ్రమంలోనే భోజనాలు చేసాము. మరుసటిరోజు నాసిక్ వెళ్ళాము. అక్కడ కూడా బాబా మాకు పెద్ద ఖర్చు కానివ్వలేదు. ఆయన దయతో చాలా బాగా యాత్ర జరిగింది. తర్వాత శనివారంనాడు ఎలాగైనా హారతికి హాజరవ్వాలని ఉచిత దర్శన లైన్లోకి వెళితే, మా ముందున్న అందరినీ లోపలికి పంపేసి మమ్మల్ని మాత్రం ఆపేశారు. అప్పుడు నేను, "ప్లీజ్ బాబా! మమ్మల్ని కూడా హారతికి అనుమతించండి" అని బాబాను అడిగాను. వెంటనే మమ్మల్ని సమాధి మందిరంలోకి వెళ్ళండని పంపించారు. ఇక ఒకటే పరుగున వెళ్లి హారతిలో కూర్చున్నాము. చాలా చాలా బాగా అనిపించింది. కన్నీళ్లు వచ్చాయి. మా పరిష్టితికి తగ్గిట్లే మేము అక్కడున్న 3 రోజులూ బాబా మాకు ఎలాంటి అనవసర ఖర్చులు లేకుండా చూసుకున్నారు. మేము అనుకున్న బడ్జెట్‌లోనే అంతా జరిగింది. ఇకపోతే ఆదివారం మధ్యాహ్నం మేము రైలు ఎక్కాల్సి ఉండగా హఠాత్తుగా ఉదయం నా కడుపులో నొప్పి మొదలై నిల్చులేక, కూర్చోలేక, తినలేక నేను చాలా ఇబ్బందిపడ్డాను. మరో వైపు మేము రైలు అందుకోవడానికి నగర్సోల్ వెళ్లాల్సి ఉంది. ఆ స్థితిలో నాకు ఏమీ అర్దంకాక, "బాబా! ఇంటికి చేరేవారికి నాకు ఈ నొప్పిని తగ్గించు" అని బాబాని వేడుకున్నాను. బాబా దయ చూపి నేను అడిగినట్లు చేసారు. రైలు దిగేవరకు పడుకునే ఉన్నాను కానీ, నొప్పి లేదు. రైలు దిగాక ఆటోలో మా ఇంటికి వెళుతుంటే దారిలో ఒక కారు మీద బాబా దర్శనమిచ్చారు. ఆయన, 'నువ్వు అడిగినట్లు నేను నిన్ను శిరిడీకి తీసుకెళ్లి, మళ్ళీ ఇంటి దగ్గర దింపేసాను' అని చెప్పినట్లు నాకు అనిపించింది. "చాలా ధన్యవాదాలు బాబా".

ఆఫీస్ పనిలో వచ్చిన సమస్యని పరిష్కరించిన సాయి


సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు ఆశదీప్తి. 2023, నవంబర్ నెల చివరి వారంలో ఆఫీసులో నేను ఒక చిన్న ఇష్యూ మీద పని చేశాను. అంతా సరిగా చేసినప్పటికీ ఎందుకోగాని నేను ఆ ఇష్యూకి చేసిన ఫిక్స్ సరిగా పని చేయలేదు. ఎంత ఆలోచించినా కారణమేంటో నాకు అర్థం కాలేదు. అలా మూడు రోజులు ఇబ్బందిపడ్డాను. చివరికి నా సహోద్యోగిని సహాయం అడిగాను. అతను మొత్తం చూసి, "అంతా సరిగానే ఉంది. సమస్యేమీ లేదు" అని చెప్పాడు. కానీ అది సరిగా పని చేయడం లేదు. నాకు ఏం చేయాలో అర్థంకాక సాయిని తలుచుకొని, "బాబా! నేను ఆ ఇష్యూకి చేసిన ఫిక్స్ పని చేసినట్లైతే మీ అనుగ్రహం 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. ఆ తర్వాత నా సహోద్యోగి, "ఒకసారి ఫ్రెష్ కోడ్ తీసుకొని, సేమ్ ఫిక్స్ ప్రయత్నం చేయమ"ని చెప్పాడు. అలా చేయగానే ఆ ఫిక్స్ పని చేసింది. ఇది ఖచ్చితంగా బాబా అనుగ్రహమే. ఎందుకంటే, అంతకుముందు ఎంత ప్రయత్నించినా పనిచేయని ఫిక్స్ బాబాని కోరుకోగానే పని చేసింది. "ధన్యవాదాలు బాబా".


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1724వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అడిగినంతనే అన్నీ అనుగ్రహించే బాబా
2. బాబా ప్రసాదించిన అదృష్టం

అడిగినంతనే అన్నీ అనుగ్రహించే బాబా


నేను ఒక సాయి భక్తురాలిని. మాది మధ్య తరగతి కుటుంబం. నాకు తండ్రి లేడు. బాబానే నా తండ్రి. ఆయన అనుగ్రహంతో నాకు ఒక అందమైన పాప పుట్టింది. మావారు కువైట్‌లో ఉంటున్నందున పాపకి ఆరునెలల వచ్చేవరకు పేరు పెట్టలేకపోయాము. ఆరోనెల వచ్చాక 2023, ఆగష్టు 22న పాప నామకరణానికి ముహూర్తం పెట్టుకున్నాము. కానీ నేను చాలా టెన్షన్‌కి గురయ్యాను. ఎందుకంటే, నాకు సి-సెక్షన్ అయినప్పటి నుంచి నెలసరి రాలేదు. ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అందువల్ల, "బాబా! ఏ ఆటంకం లేకుండా కార్యక్రమం జరిగేలా చూడండి. అలా జరిగితే మీ అనుగ్రహం బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయ చూపారు. ఆగస్టు 14నే నాకు నెలసరి వచ్చింది. ఇక సంతోషంగా బాబా గుడిలో ఫంక్షన్ పెట్టుకొని పాపకి 'ధన్విక సాయి' అని నామకరణం చేసి, అందరికీ భోజనాలు పెట్టుకున్నాం. బాబా దయతో కార్యక్రమం చక్కగా పూర్తైంది. తర్వాత సెప్టెంబర్ 14న ఇండియా నుండి కువైట్ వెళ్లడానికి మావారు టికెట్ బుక్ చేసుకున్నారు. కానీ ఆరోజు మబ్బులు కమ్ముకొని వర్షం మొదలైంది. భారీ వర్షాలని వార్తలు వచ్చాయి. అందువల్ల నేను, "బాబా! మావారు క్షేమంగా వెళ్లాల"ని బాబాని కోరుకున్నాను. బాబా దయవల్ల మావారు క్షేమంగా కువైట్ చేరుకున్నారు. తర్వాత ఆయనకి ఆరోగ్యం అస్సలు బాగా లేకుండా పోయింది కానీ, బాబా దయవల్ల కుదుటపడింది.


అప్పుడప్పుడు మా అక్కకి తలనొప్పి వస్తూ ఉంటుంది. తను దానిని నార్మల్‌గా తీసుకోనేది. అయితే ఒకసారి తలనొప్పి బాగా ఎక్కువ అయి కళ్ళు తిరిగి కనిపించకుండా పోయింది. దాంతో తనని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లారు. డాక్టర్ టెస్ట్ చేసి, "తలలో గడ్డ ఉంది. దాన్ని తొలగించడానికి ఆపరేషన్ చేయాల"ని అన్నారు. నేను అక్కకి ఏమవుతుందోనని చాలా భయపడి టెన్షన్ పడ్డాను. అప్పుడు, "బాబా! అక్క ఆపరేషన్ విజయవంతమై తన ఆరోగ్యం బాగుంటే మీ అనుగ్రహం బ్లాగు ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల అక్క ఆపరేషన్ విజయవంతమైంది. ఇప్పుడు తనకి కొంచెం బాగానే ఉంది. ఇంకా బాగా కోలుకోవాలని బాబాని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. "ధన్యవాదాలు బాబా. ఇంకా కొన్ని కష్టాలు, ఇబ్బందులు ఉన్నాయి. మీ దయ దృష్టి నా మీద, నా కుటుంబం మీద, సాయి బంధువులందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను తండ్రీ. నా అనుభవాలను నేను సరిగా వ్రాయలేకపోతున్నాను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి బాబా".

బాబా ప్రసాదించిన అదృష్టం

సాయిబంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. 2023, సెప్టెంబర్ నెల మూడో వారంలో నా భర్తకి గవదబిళ్ళలు వచ్చాయి. ఆ కారణంగా రెండు దవడలు వాచిపోయి నమలటానికి, మింగటానికి కష్టమైంది. హాస్పిటల్‌‌‌కి వెళ్తే, ఆంటిబయోటిక్స్ ఇచ్చారు కానీ, మూడురోజుల తర్వాత వాడమన్నారు. అది కూడా వాపు, నొప్పి బాగా ఎక్కువగా ఉంటేనే. మావారు మూడు రోజులు ఉదయం, సాయంత్రం దవడలకు ఊదీ రాసుకొని, మరికొంత ఊదీ నోటిలో వేసుకున్నారు. ఆశ్చర్యంగా పెద్ద సమస్య ఏమీ లేకుండా మూడు రోజుల్లో తగ్గిపోయింది. మా చిన్నపాప  వయస్సు 2 సంవత్సరాలు. తనకి ఏమైనా వైరస్ సోకుతుందేమో అని చాలా భయపడ్డాను. బాబా దయవల్ల ఎవరికీ సోకలేదు. "చాలా చాలా ధన్యవాదాలు. చిన్నదైనా, పెద్దదైన అన్ని విషయాలలో మీరు మాకు తోడుగా ఉంటున్నారు తండ్రీ".

మేము ప్రస్తుతం ఉంటున్న ప్రాంతంలో హిందూ దేవాలయాలు లేవు. రెండు గంటల ప్రయాణ దూరంలో ఒక బాబా గుడి ఉంది. 2023, సెప్టెంబర్ 23, శనివారంనాడు ఆ గుడికి వెళదామనుకుని వెళ్లేముందు బాబాని, "బాబా! చాలా నెలల తర్వాత మేము మీ దర్శనానికి వస్తున్నాము తండ్రీ. ఏదైనా ఒక అద్భుతమైన అనుభవాన్ని మాకు ప్రసాదించండి. తద్వారా మీ మీద మాకు మరింత భక్తి పెరుగుతూ ఉండాలి" అని చెప్పుకొని బయలుదేరాము. మా పిల్లలు చిన్నవాళ్లు అయినందున రాత్రి 7.00 గంటల ట్రైన్‌కి తిరిగి ప్రయాణమవుదాం, 9 గంటలకల్లా ఇంటికి వచ్చేయొచ్చు అనుకున్నాము. అయితే మేము గుడికి వెళ్ళేసరికి సాయంత్రం 5.45 అయిపోయింది. 6.15కి జరగనున్న హారతి కోసం బాబా దర్శనాన్ని ఆపేసారు. హారతికి ఉంటే మేము ఎక్కాలనుకున్న ట్రైన్ తప్పిపోతోంది. అయినప్పటికీ నేను, నా భర్త, 'ఇంత దూరం వచ్చాము, హారతిలో పాల్గొనే వెళదాం' అని అనుకున్నాము. అంతలో హఠాత్తుగా పూజారి నా దగ్గరకి వచ్చి, "హారతి ఇచ్చే సమయంలో బాబాకి విసనకర్రతో విసరండమ్మా" అని అన్నారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, అక్కడ చాలామంది ఉన్నారు. మాకంటే చాలా ముందుగా వచ్చినవాళ్ళు కూడా ఉన్నారు. బాబాని వచ్చేముందు 'నాకు ఒక మంచి అనుభవం ఇవ్వండి' అని కోరుకున్నాను కదా! బాబా నా కోరిక విని నాకీ అదృష్టాన్ని ప్రసాదించారని నాకనిపించింది. దాదాపు 20 నిమిషాలపాటు విసనకర్రతో బాబాకి విసిరాను. అప్పుడు బాబాకి చాలా దగ్గరగా ఉన్నట్లుగా అనిపించింది. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. చాలా చాలా బాగా అనిపించింది. బాబా దయవల్ల అంతసేపూ మా పిల్లలు ఏడవలేదు. దర్శనం బాగా జరిగింది. బాబాకి కప్పిన శాలువా కూడా నాకు ఇచ్చారు. చాలా సంతోషంగా బయలుదేరి తర్వాత ట్రైన్ ఎక్కి రాత్రి 10.30కి క్షేమంగా ఇంటికి చేరుకున్నాము. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఎప్పుడూ మీ ఆశీస్సులు మా కుటుంబం మీద, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ మీద ఉండాలి తండ్రీ".


సాయిభక్తుల అనుభవమాలిక 1723వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాబా అనుగ్రహం

అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.


నా పేరు హాసిని. 2023, నవంబర్ నెల చివరి వారంలో నాకు అసిడిటీ ప్రాబ్లెమ్ వచ్చింది. నాకు అది అసిడిటీ అని తెలియక అలాగే నొప్పిని భరించాను. కానీ తర్వాత బాధను తట్టుకోవడం నావల్ల కాక అసిడిటీ ఏమోనని ENO తీసుకున్నాను. కానీ తగ్గలేదు. ఇక అప్పుడు బాబా ఊదీ తీసుకోవడం మొదలుపెట్టాను. బాధ కొంచెంకొంచెంగా తగ్గింది. కానీ, మంట మాత్రం అలానే వుండింది. అప్పుడు నేను ఊదీ తీసుకొని నా కడుపు మీద రాసుకోవడం మొదలుపెట్టి వరుసగా మూడురోజులు రాసుకున్నాను. అద్భుతం! మంట అస్సలు లేకుండా పోయింది. నా ఒంట్లో ఉన్న వేడిని కూడా ఊదీ తగ్గించింది. ఈ అనుభవం ద్వారా బాబా ఊదీకి అతంటి శక్తి ఉందని నాకు మరింత గట్టి నమ్మకం ఏర్పడింది.


ఒకసారి మా ఇంట్లో పవర్ బ్లింక్ అవుతూ ఉండేది. ఆ సమస్య మాకు మాత్రమే. అలా ఉండగా ఒకరోజు పవర్ పోయింది. ఇరుగుపొరుగు అందరికీ ఉంది. నేను, "బాబా! పవర్ వచ్చేలా చేయండి" అని బాబాని అడిగాను. కానీ రాలేదు. అప్పుడు నేను, 'బాబా మాత్రం ఏం చేస్తారులే!' అని అనుకున్నాను. కానీ నేను అనుకున్నది చాలా తప్పు. ఆయన తలుచుకుంటే ఏమైనా చేస్తారని నాకు తెలుసు. కానీ ఆ సమయంలో ఆ చెడు ఆలోచన ఎలా వచ్చిందో నాకే తెలీదు. సరే, 30 నిముషాల తర్వాత పవర్ వచ్చింది. మరుసటిరోజు కూడా మా ఇంటికి మాత్రమే పవర్ పోతే, "బాబా! పవర్ వచ్చేలా చేయండి" అని బాబాను అడిగాను. బాబా దయవల్ల పవర్ వచ్చింది. తర్వాత అదేరోజు రాత్రి 10 గంటలకి పవర్ పోయి మరుసటిరోజు ఉదయం 8 వరకు రాలేదు. అప్పుడు నేను "ఈరోజు అంతా ఇలానే ఉండాలా బాబా?" అని అనుకున్నాను. ఇక్కడొక విషయం చెప్పాలి. మా డాడీకి కరెంట్ సంబంధిత పని వచ్చు. కాని ఆయనకు, మాకు మధ్య మాటలు లేవు. ఆ కారణంగా ఫ్యూజ్ దగ్గర సమస్య ఉందని తెలిసి కూడా ఆయన బాగు చేయలేదు. ఇంకా నేను బాబా గుడికి వెళ్లి, "బాబా! మా డాడీ కరెంట్ సమస్యను బాగు చేసేలా చేయండి" అని బాబాను అడిగాను. ఇక బాబా అనుగ్రహాన్ని చూడండి. నేను గుడి నుండి ఇంటికి వెళ్లిన 5 నిముషాలకి డాడీ లేచి రిపేరు చేసారు, కరెంట్ వచ్చింది. "ధన్యవాదాలు సాయి నాన్నా".


2023, అక్టోబర్ 28న నేను సాయిబాబాకి సంబంధించిన ఒక పాత సినిమా చూసాను. అందులో బాబాని చూస్తుంటే, ఆయన మాటల్ని వింటుంటే నాడు శిరిడీలో జరిగింది జరిగినట్లు చూపించినట్టుగా అనిపించి మనసుకి చాలా ఆనందమేసింది. అంతే, నా గుండెల్లో బాధ మొదలైంది. ‘ఎలాగైనా బాబాని చూడాలి, ఆనాడు బాబా ఉన్నప్పుడు నేను జన్మించి ఉంటే బాబాని చూసి ఉండేదాన్ని కదా!’ ఇలా ఏవేవో ఆలోచనలతో నాకు చాలా బాధపడి బాబాను ఒక్కటే అడిగాను, "సాయినాన్నా! 'సాయీ' అంటే పలుకుతానన్నావు కదా! నాకు ఎందుకో మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. మీ లీలలు ఇంకా వినాలనిపిస్తుంది" అని. తర్వాత యూట్యూబ్‌లో 'మన సాయి అమృతం' అని ఒక ఛానల్ కనిపించింది. అందులో అన్ని సాయిబాబా లీలలే చెప్తున్నారు. అవి విన్నాక నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. అంతకుముందు నేను ఎన్నిసార్లు యూట్యూబ్‌లో సెర్చ్ చేసినా నాకు ఆ ఛానల్ కనిపించలేదు. అలాంటిది మనసులో బాధతో బాబాని మీ లీలలు వినాలని ఉందని అడిగినంతనే ఆ ఛానల్‌ని చూపించారు. ఇకపోతే బాబాని చూడాలన్న కోరిక విషయంలో బాబాని, "నాకు స్వప్న దర్శనం ఇవ్వండి బాబా. మిమ్మల్ని చూడాలని ఉంద"ని అడిగి, బాబా ఫోటోని పక్కన పెట్టుకొని పడుకున్నాను. అద్భుతం! బాబా స్వప్న దర్శనం ఇచ్చారు. ఆ కలలో ఒక బాబా ఫోటో, ఆ ఫొటోలో బాబా నిలుచుని తమ రెండు చేతులతో నన్ను ఆశీర్వదిస్తూ దర్శనమిచ్చారు. సత్చరిత్రలో బాబా, “నాకు, నా ఫోటోకి భేదం లేద”ని చెప్పారు కదా! అలానే ఆయన నాకు ఫోటో రూపంలో దర్శనం ఇచ్చారు. కల అంతా గుర్తులేదుగాని బాబా కనిపించరు. అది ఆయన అనుగ్రహమే కదా! నిద్రలేచాక నాకు చాలా ప్రశాంతంగా, సంతోషంగా అనిపించింది. పిలిస్తే పలికి మరీ దర్శనం ఇచ్చారు సాయినాన్న అనుకున్నాను. తర్వాత బ్లాగు ఓపెన్ చేయగానే కింది మెసేజ్ వచ్చింది. అది చూసి మరింత ఆశ్చర్యానందాలలో మునిగిపోయాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

2023, అక్టోబర్ 28, రాత్రి ఒంటిగంట, 2 మధ్యలో చంద్రగ్రహణం ఏర్పడింది. గ్రహణ సమయంలో ఎలాంటి మంత్రాలు చదివిన ఫలితం అధికంగా ఉంటుందని గ్లోబల్ మహాపారాయణ గ్రూపులో చెప్పారు. కానీ పడుకున్నాక మధ్యలో లేవడం ఆంటే చాలా కష్టం. అందుకని నేను, "బాబా! నేను ఒంటిగంటకు అలారం పెట్టుకున్నాను. ఆ అలారం మోగిన శబ్దానికి లేచేలా మీరే చేయండి. అలాగే మీ బిడ్డని మంత్రం జపించేలా చేయండి. ఇదంతా జరిగితే నేను మీ అనుగ్రహం గురించి బ్లాగు ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకుంటాను బాబా" అని బాబాకి మొక్కుకున్నాను. ఇక అద్భుతం చూడండి. నేను అలారం మోగగానే నిద్ర లేచాను. నిజానికి నేను ఎప్పుడూ అలారంకి లేవను. అందువల్ల అలారంకి బాబాయే నన్ను లేపారని నాకు అనిపిస్తుంది. ఇకపోతే, నేను అనుకున్నట్లే సంతోషంగా బాబా మంత్రం జపించి పడుకున్నాను. అడిగింది నెరవేర్చారు బాబా. ఇంతకంటే అదృష్టం ఏముంది? "ధన్యవాదాలు బాబా. మీ మిరకిల్స్‌ని అనుభవిస్తే వచ్చే ఆనందం అంతాఇంతా కాదు. ఇలానే నన్ను అనుగ్రహిస్తూ వుండండి బాబా"


నేను నవరాత్రులు నుండి అమ్మవారి గుడికి వెళ్లాలనుకుంటున్నా వెళ్ళలేకపోయాను. చివరికి నేను మా అక్కని గుడికి తీసుకెళ్లామని అడిగితే, "నాకు పని వుంది. నేను తీసుకెళ్ళను" అని అంది. అప్పుడు నేను, "బాబా! అక్క నన్ను గుడికి తీసుకెళ్లాలా మీరే చూడండి" అని బాబాను అడిగాను. మనం భక్తితో అడిగితే బాబా కాదనరు కదా!. అక్క నన్ను గుడికి తీసుకెళ్ళింది. ఇది బాబా దయవల్లే సాధ్యమైంది. ఎందుకంటే, మా అక్క ఒక్కసారి నో చెప్పిందంటే, ఇక ఆపని చేయద్దు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


2023, ఆగష్టు చివరిలో లేదా సెప్టెంబర్ నెల ఆరంభంలో నేను 2000 రూపాయలు ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఎక్కడ పెట్టానో చూద్దాం చూద్దాం అనుకుంటూనే నిర్లక్ష్యం చేశాను. ఇంకా ఒకరోజు మా అమ్మ ఆ డబ్బులు ఎక్కడున్నాయి అని అడిగింది. నాకు ఏం చేయాలో తెలియక సాయినాన్నని, "సహాయం చేయమ"ని అడిగి, "అవి కనిపిస్తే, మీ అనుగ్రహం బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. ఇక బాబా అనుగ్రహం చూడండి. నేను ఎప్పుడూ చూసే ఫైల్‌లోనే ఆ డబ్బులు కనిపించాయి. అవే కాకుండా మర్చిపోయిన మరో 500 రూపాయలు కూడా కనిపించాయి. తర్వాత అదేరోజు మా అమ్మ ఇంట్లో పెట్టిన వెండి పట్టీలు, బంగారు చెవి రింగులు పెట్టిన చోట కనిపించలేదు. అది ఎవరూ వెళ్లే చోటు కూడా కాకపోవడంతో అమ్మా బాగా ఏడ్చి నీరసించిపోయింది. అప్పుడు నేను, "బాబా! ఇవి కూడా దొరికితే, మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. అంతే, 'అంతా వెతకాలి' అని నాకు ఆలోచన వచ్చి వెతికితే కనిపించాయి. అంతా బాబా దయ. ఒకప్పుడు తోటి భక్తుల అనుభవాల చదువుతున్నప్పుడు వీళ్ళు బంగారం పొతే ఇలా స్పందిస్తున్నారేంటి? అవి ఎక్కడో ఓ చోట ఉంటాయి కదా! ఎక్కడికి పోతాయని అనుకునేదాన్ని. కానీ ఈరోజు అదే పరిస్థితి నాకు వచ్చేసరికి ఎదుటివాళ్ళ బాధ మనకి చిన్నదిగా ఉంటుందని అర్థమైంది. "చాలా ధన్యవాదాలు సాయినాన్న. నిజంగా బాబా నా జీవితంలో లేకపోతే ఈరోజు నా జీవితం కష్టాల కడలిలో ఉండేది. మీరు లేకపోతే నేను నిజంగా ఉండేదాన్ని కాదు".

సాయిభక్తుల అనుభవమాలిక 1722వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి కొత్తకారు అనుగ్రహించిన  బాబా
2. బాబా మాట ఎన్నటికీ అసత్యం కాదు
3. ఉన్న ఊరికే డిప్యూటేషన్ వచ్చేలా దయ చూపిన బాబా

అసాధ్యాన్ని సుసాధ్యం చేసి కొత్తకారు అనుగ్రహించిన  బాబా


సాయి మహారాజ్‌‌కి, సాయిబంధువులకి నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. బాబా అసాధ్యాన్ని సుసాధ్యమెలా చేశారో నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. నేను ఒక ప్రతిష్ఠాత్మక సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. నేను రోజూ ఆఫీసుకి మా ఇంటి నుండి 40 నిమిషాల ప్రయాణం చేయాల్సి ఉండగా మాకున్న పాత కారులో వెళ్లొస్తుంటాను. నా సహోద్యోగులు కొంతమంది చాలా మంచి కార్లలో ఆఫీసుకు వస్తుంటారు. ఆ విషయంలో నేనెప్పుడూ వాళ్లతో పోల్చుకుని బాధపడలేదు, అప్పుడప్పుడు సరదాగా ఎవరైనా నా కారు గురించి జోకులు వేసినా నేను ఏమీ ఫీల్ కాలేదు. ఎందుకంటే, మేము ఉన్న పరిస్థితిలో కారు మార్చడం కుదరదు. కాబట్టి నేను కారు మార్చే ఆలోచన కూడా చేయలేదు. ఇలా ఉండగా 2023, అక్టోబర్ నెలలో ఒకరోజు మా సీనియర్ ఆఫీసర్ ఒకరు వేరొకరితో నా కారు మీద కామెంట్ చేశారు. అంత పెద్ద వయసున్న సార్ చేసిన కామెంట్‌‌కి నాకు చాలా బాధేసింది. ఇంటికి వచ్చాక విషయం మా అమ్మతో చెప్తుంటే, నాకు తెలియకుండానే నా కళ్ళ నుండి నీళ్ళు వచ్చాయి. అప్పుడు కూడా నేను బాబాను ఏమీ అడగలేదు. కానీ 2023, అక్టోబర్ 23, దసరా రోజున కారు పూజకు వెళ్ళినప్పుడు నేను మా పిల్లలితో యధాలాపంగా, "వచ్చే దసరా నాటికల్లా బాబా మనకి కొత్త కారు ఇస్తారులే" అని అన్నాను. బాబా మాత్రం తన బిడ్డ కంట నీరు చూడలేకపోయారు కాబోలు! తమ పని తాము మొదలుపెట్టారు.

రెండు, మూడు రోజుల తర్వాత కారు ఏదో శబ్దం చేస్తుందని నేను, మావారు కారుని షోరూంలో చూపెట్టాలని వెళ్ళాము. వాళ్ళు కొద్దిగా ఖర్చు ఎక్కువవుతందని అన్నారు. వెంటనే మావారు, "దీనిని ఎక్స్చేంజ్ చేస్తే, ఎంత డబ్బులు వస్తాయ"ని అని అడిగారు. వాళ్ళు కొంత మొత్తం చెప్పారు. అది విని మావారు కొత్త కారు తీసుకోవడానికి నిర్ణయం చేశారు. మా ఆర్థిక పరిస్థితి వలన నేను ఇంకోసారి ఆలోచించమని అన్నాగానీ కొత్త కారు కొనడం మంచిదని అన్నారు. వెంటనే అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఆరోజు గురువారం. మేము తిరిగి వచ్చేటప్పుడు బాబా పల్లకి ఎదురైంది. నేను దండం పెట్టుకుంటే, వాళ్ళు నాకు ఊదీ, స్వీట్ ఇచ్చారు. నాకు శుభసూచకంగా అనిపించింది. మనం కారు కొనగానే ఆనందంతో స్వీట్ పంచుతాం కదా! అలా బాబా అడ్వాన్స్ ఇవ్వగానే కారు తప్పక వస్తుందని ఆశీర్వదించి స్వీట్ ఇచ్చారనిపించింది నాకు. పనులు అన్నీ చకచకా జరిగి సరిగ్గా నెలరోజులకు అంటే 2023, నవంబర్ 23, గురువారం మా కొత్తకారు వచ్చింది. నేను నమ్మలేకపోయాను. అదేరోజు రాత్రి బాబా గుడిలో పూజ చేయించాం. ఇదంతా బాబా కరుణ తప్ప మరేం కాదు. ఆయన అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. నేను బాబాను నా తండ్రి అనుకుంటాను. అలాగే ఆయన కూడా తండ్రీ స్థానంలో ఉండి నా బాధ్యత తీసుకున్నారు. చాలా తక్కువ సమయంలో నాకోసం ఎన్నో చేశారు. ఆయనకు నేను ఏమి ఇవ్వగలను? మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేయడం తప్ప! "సాయిదేవా! మీకు శతకోటి నమస్కారాలు. మీ పాదాలను నమ్ముకుని ఉండేలా మమ్మల్ని ఆశీర్వదించు సాయితండ్రీ".


సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై.


బాబా మాట ఎన్నటికీ అసత్యం కాదు

సాయి బంధువులందరికీ నమస్కారం. 2023, సెప్టెంబర్ 25, సోమవారం సాయంత్రం నేను కాలు జారి పడిపోయాను. ఎడమ కాలు పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయి వేళ్ళు, చీలమండ బెణికాయి. అసలే నేను బరువు మనిషిని. నేను పడ్డ వేగానికి ఇంకా పెద్ద దెబ్బలే తగలాలి. కానీ నేను పడుతూనే 'బాబా' అని గట్టిగా సహాయం కోసం అర్థిస్తూ, "నన్ను పైకి లేపమ"ని బాబాను అడిగాను. నిజంగా అద్భుతం. నేను లేవగలిగాను, నెమ్మదిగా నడవగలిగాను కూడా. రెండురోజుల తర్వాత ఎక్స్-రే తీయిస్తే వేలికి చిన్న ఎయిర్ క్రాక్ అయింది అన్నారు. అది కూడా అనుమానమే అని, "విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంద"ని డాక్టర్ చెప్పారు. చివరిగా ఒక ముఖ్య విషయం చెప్పాలి. నేను పడిపోయే ముందురోజు 'నీ రేపటి దినాన్ని నేను కాచుకుంటాను' అని సాయి సందేశం వచ్చింది. చెప్పినట్లుగానే కాచి కాపాడారు. బాబా మాట ఎన్నటికీ అసత్యం కాదు. "థాంక్యూ సో మచ్ బాబా. నువ్వున్నావు, రక్షించావు. ఏదో పెద్ద కర్మను చిన్నగా తీసేసావు".

ఓం సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.


ఉన్న ఊరికే డిప్యూటేషన్ వచ్చేలా దయ చూపిన బాబా


సాయిబంధువులందరికీ నమస్కారాలు. నా పేరు నాగలక్ష్మి. నేను టీచరుగా ఉద్యోగం చేస్తున్నాను. ఈ మధ్య జరిగిన బదిలీలలో నాకు మేము ఉంటున్న ఊరి నుండి చాలా దూరంలో ఉన్న ఊరికి బదిలీ అయింది. కానీ నేను ఆ ఊరు వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితిలో లేను. అందువల్ల నేను బాబాను తలుచుకొని డిప్యూటేషన్ కోసం ప్రయత్నించాను. బాబా దయవల్ల నాకు మా ఊరికే డిప్యూటేషన్ వచ్చింది. "చాలా కృతజ్ఞతలు బాబా. ఈ అనుభవం ఆలస్యంగా పంచుకున్నందుకు క్షమించండి సాయి. నాకున్న ఆరోగ్య సమస్యలను కూడా తగ్గించండి బాబా. వాటి వలన నేను రోజూ చాలా బాధపడుతున్నాను బాబా. మీరే నన్ను కాపాడాలి సాయి. ఇంకా కొన్ని సమస్యలున్నాయి. వాటిని కూడా తీర్చి మమ్మల్ని కాపాడండి సాయి".

సాయిభక్తుల అనుభవమాలిక 1721వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • సాయినాథుని అనుగ్రహం

ఓం శ్రీ సాయినాథాయ నమః!!! అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన సాయినాథునికి, తోటి సాయిబంధువులకు నమస్కారాలు. నా పేరు శ్వేత. నేను బెంగళూరు నివాసిని. సద్గురుని తోడులేక మనం ఒక్క క్షణం కూడా ఉండలేము. మన బాబా సహాయసహకారాలు లేకపోతే మనం అసలు జీవించి ఉండగలమా అని నాకనిపిస్తుంది. ఆయన మన అందరి జీవితాలలో ఎంత మార్పు తీసుకువస్తారో మనం ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఆయన నా జీవితంలో చాలా అద్భుతాలు చేశారు. ఇప్పుడు కొన్ని అనుభవాలు పంచుకుంటాను. మావారు, ఆయన స్నేహితుడు చాలా సన్నిహితంగా ఉంటారు. ఆ స్నేహితుడు ఆర్థికంగా, ఇంకా ఇతరత్రా చాలా విషయాలలో మాకు చాలా సహాయం చేశారు. అలాంటిది ఉన్నట్టుండి మావారికి, అతనికి మధ్య అపార్ధాలు చోటు చేసుకున్నాయి. వాళ్లిద్దరూ మునుపటిలా స్నేహంగా ఉండాలని మా అందరి కోరిక. అందువల్ల నేను, "బాబా! వాళ్ళిద్దరిని ముందులా ఉండేలా కరుణించు తండ్రీ. అలా జరిగితే, మీ అనుగ్రహం సాయిబంధువులతో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. అంతే, ఒక వారం రోజులలో మావారి స్నేహితుడు మా ఇంటికొచ్చి మావారిని వాళ్ళింటికి తీసుకెళ్లి మునుపటిలా మాట్లాడుకొని కలిసిపోయారు. "బాబా! మీ సహాయానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు".


ఒకసారి నేను ఒక చోటకు వెళ్లడానికి బస్సు ఎక్కాను. తర్వాత టికెట్ తీసుకోవడానికని చూసుకుంటే, నా పర్స్ కనిపించలేదు. వెంటనే నేను బస్సు దిగి ఏ మార్గంలో వచ్చానో ఆ దారంతా చూసుకుంటూ వెళ్లాను. కానీ నా పర్స్ ఎక్కడా కనపడలేదు. ఆ పర్సులో రెండు క్రెడిట్ కార్డులు, ఒక డెబిట్ కార్డు ఉన్నాయి. వాటిని ఎవరైనా చెడుగా ఉపయోగిస్తారేమోనన్న భయంతో నా సాయినాథుని తలుచుకుంటూ వాటిని తాత్కాలికంగా రద్దు చేయించడానికి బ్యాంకుకు బయలుదేరాను. బ్యాంకు గేటు దగ్గరకు వెళ్లేసరికి నాకు ఒక కాల్ వచ్చింది. చూస్తే, ఎవరో తెలియని వ్యక్తి ఫోన్ చేస్తున్నారు. కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడితే, అతను నా పేరు, నా పర్సులో ఉన్న నా కార్డుల వివరాల అడిగారు. నేను సరైన సమాధానాలు చెప్పడంతో, "ఫలానా చోటుకు రండి. మీ పర్సు మీకు ఇస్తాన"ని చెప్పారు. సంతోషంగా సాయినాథునికి ధన్యవాదాలు తెలుపుకొని అతని రమ్మన్న చోటుకి వెళ్లి నా పర్సు తీసుకున్నాను. నిజం చెప్పాలంటే, ఆ పర్సులో నా ఫోన్ నెంబర్ లేదు. కానీ అతను అందులో ఉన్న మెడికల్ స్టోర్ బిల్ చూసి, సదరు మెడికల్ స్టోరుకు వెళ్లి, ఆ బిల్ చూపించి, నా పర్సు పోయిన విషయం చెప్పి, వాళ్ళ వద్ద నుండి నా నెంబర్ తీసుకొని నాకు కాల్ చేశారు. ఆ వ్యక్తి రూపంలో నా సాయి దేవుడే నా పర్సు నాకు అందించి కార్డులు చెడుగా ఉపయోగింపబడకుండా కాపాడారు.


2023, అక్టోబర్ 19 అర్ధరాత్రి, ఉన్నట్టుండి నాకు వీజింగ్ ప్రాబ్లెమ్(శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది) వచ్చింది. నాకు నేను ఇంక బ్రతుకుతానా అన్నంతా భయమేసింది. బాబాను తలుచుకుంటూ నాలుగున్నర వరకు గడిపాను. అప్పుడు మా పెద్దమ్మ వాళ్ళింట్లో మెడిసిన్ ఉందని గుర్తు వచ్చింది. సమయానికి బాబానే గుర్తు చేసారు. దాంతో వెంటనే వెళ్లి నబిలైజర్స్ వేసుకున్నాను. కాస్త ఉపశమనంగా అనిపించింది. ఉదయం హాస్పిటల్‌కి వెళితే ఎంట్రన్సులో సాయినాథుని ఫోటో నా కంటపడింది. ఆయనని చూస్తూనే, 'బాబా నా వెంట ఉన్నారు. నాకు ఏమీ కాద'ని నాకు చాలా ధైర్యం వచ్చింది. హాస్పిటల్లో అన్ని రకాల టెస్టులు చేసి అంతా నార్మల్‌గా ఉందని చెప్పి మూడు రోజులకు టాబ్లెట్లు ఇచ్చి పంపారు. మర్నాటి రాత్రి వీజింగ్ ప్రాబ్లెమ్ కాదుగాని నా ఎదలో ఏదో ఒక రకంగా అనిపించింది. అప్పుడు నేను, "బాబా! నేను నవగురువార వ్రతం చేస్తాను. పూర్తిగా నాకు ఈ బాధ నుండి ఉపశమనం కలిగించండి" అని బాబాను ప్రార్థించాను. అలాగే బాబాకి చెప్పినట్లు నవగురువార వ్రతం ప్రారంభించి మరోసారి అంతా టెస్టు చేయించుకున్నాను. బాబా దయవల్ల అంతా నార్మల్ అని రిపోర్టు వచ్చి నేను ఆరోగ్యంగా ఉన్నాను.


నాకు ఇద్దరు పాపలు. చిన్నపాప ఒకటిన్నర నెల బిడ్డగా ఉన్నప్పుడు తనకి జలుబు చేసి దగ్గు చాలా ఎక్కువగా ఉండింది. పాప దగ్గుతుంటే తన కంట నీరు కారేది. అంతలా ఉండేది సమస్య. డాక్టర్ దగ్గర చూపించాము కానీ, వాళ్ళిచ్చిన మందులకు పాపకు ఏమాత్రమూ తగ్గలేదు సరికదా ఇంకా ఎక్కువ అయ్యింది. అటువంటి సమయంలో బాబా దయవల్ల నాకు ఒక ఉపాయం తట్టింది. అదేమిటంటే, నేను డస్ట్ ఎలర్జీకి వాడుతున్న మందు పాపకి వాడాలని. అయితే డాక్టర్ సలహా లేకుండా అంత చిన్నపాపకు ఆ మందు ఎలా ఇవ్వడమని అనిపించింది. ఏం చేయాలో అర్థంకాని స్థితిలో బాబా ముందు చీటీలు వేశాను. మందు వేయమన్న చీటీ బాబా అనుగ్రహించారు. దాంతో ఆ మందు పాపకి వేసాను. ఆరోజు నుండే కొద్దికొద్దిగా పాపకు దగ్గు, జలుబు తగ్గుతూ వచ్చి నాలుగైదు రోజులకు పూర్తిగా తగ్గిపోయింది.


పెద్దపాపకు ఆరు నెలల వయసున్నప్పుడు జ్వరం వచ్చింది. ఎన్ని హాస్పిటల్లో చూపించిన తగ్గలేదు. పాప కళ్ళు అదోలా అవ్వసాగాయి. దాంతో పాపను చూస్తే, తనకి ఏమవుతుందోనని మాకు భయమేసేది. ఆ సమయంలో నేను ఏదో విషయంగా మా పక్కింటికి వెళ్లాను. అప్పుడు వాళ్ళింటికి వాళ్ళ బంధువు ఒకాయన వచ్చారు. ఆయన నన్ను చూసి, "ఎందుకమ్మా, అలా దిగులుగా ఉన్నావు?" అని అడిగారు. నేను మా పాప విషయం చెపితే, ఆయన పాపను తీసుకురా అన్నారు. నేను సరేనని మా పాపని తీసుకొని వెళ్ళాను. ఆయన అక్కడున్న ఒక తమలపాకుపై పెన్నుతో ఏదో వ్రాసి, బట్టలు కుట్టే దారం తీసుకొని దాన్ని ఆకుకి కట్టారు. తర్వాత దాన్ని మా పాపకు కట్టారు. అంతే, పది నిమిషాల్లో మా పాప సాధారణ స్థితికి వచ్చింది. ఇది 2013లో, హిందూపూర్‌లో జరిగింది. మూడు సంవత్సరాల తర్వాత అంటే 2016లో మేము గుంతకల్ దగ్గర ఉన్న కసాపురం ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్ళాము. అక్కడ మూడేళ్ళ క్రితం మా పక్కింటిలో కనిపించిన ఆయన కనబడ్డారు. నేను ఆయనను బాగున్నారా అని అడిగాను. కానీ ఆయన నన్ను అస్సలు గుర్తు పట్టలేదు సరికదా నేను ఎవరో తెలియదన్నారు. నాకు చాలా ఆశ్చర్యమేసింది. నాకప్పుడు ఆరోజు ఈయన రూపంలో వచ్చి పాపకు తాయత్తు కట్టి కాపాడింది సాక్షాత్ ఆ బాబానే అనిపించింది. బాబా అనుగ్రహం ఎంతని వర్ణించను. ఆయన లేని ఈ జగత్తు జగత్తే కాదు. సాయి లేని జీవితం ఊహించుకోవడానికి కూడా సాధ్యం కాదు. "శతకోటి వందనాలు బాబా".


ఇక ఇప్పుడు చెప్పబోయే అనుభవాలన్నీ నేను రెండోసారి ఏడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు జరిగాయి. ఆ సమయంలో ఒకసారి మేము మా ఊరు వెళ్లడానికి రైల్వేస్టేషన్‌కు వెళ్ళాము. అప్పుడు నేను, పదేళ్ల మా పెద్దపాప పట్టాలు దాటుతున్నప్పుడు హఠాత్తుగా నేను పట్టాలపై పడిపోయాను. వెంటనే "సాయినాథా! కాపాడు బాబా" అని అనుకున్నాను. బాబా దయవల్ల నాకు పెద్దగా ఏ దెబ్బలు తగలలేదు. ముఖ్యంగా నా కడుపుకు ఏ దెబ్బలు తగలలేదు.


మరోసారి బాగా వర్షం పడి, నిలిచిన తర్వాత సరుకులు తీసుకురావడానికి నేను బయటకు వెళ్ళాను. దారికి ఒక పక్కగా నడుస్తున్న నేను హఠాత్తుగా జారీ బొక్కబోర్ల పడబోయాను. అప్పుడు కూడా నాకేమీ కాకుండా నేను నమ్ముకున్న నా సాయినాథుడు కాపాడారు. 

   

ఇంకోసారి కూడా వర్షం బాగా పడి నిలిచిన తర్వాత నేను, మావారు, మా పాప టూవీలర్ మీద ఫంక్షన్ నుండి ఇంటికి తిరిగి వస్తున్నాము. తీవ్రమైన వర్షం వల్ల చెట్ల ఆకులు, చిన్న చిన్న కొమ్మలతో రోడ్డు పూర్తిగా నిండిపోయి ఉంది. దారి అస్సలు కనిపించడం లేదు. రోడ్డు అంతా నిర్మానుష్యంగా ఉంది. మావారు బండి నెమ్మదిగా నడుపుతున్నప్పటికీ జారి మేము ముగ్గురం క్రింద పడిపోయాము. ఆ సమయంలో కూడా నా దేవుడు నన్ను రక్షించారు. బండి మీద నుండి క్రిందపడ్డప్పటికీ నాకుగానీ, నా కడుపులో ఉన్న బిడ్డకిగానీ ఏ దెబ్బ తగలలేదు. ఇలా నేను ఆపదలో ఉన్న ప్రతిసారీ నన్ను, నా కడుపులో ఉన్న బిడ్డను రక్షించారు బాబా. నా దేవుడు నా చేయి పట్టుకోకపోతే నా పాప బ్రతికే ఉండేది కాదు. ఇంకా ఎన్నో అనుభవాలున్నాయి. వాటిని తర్వాత పంచుకుంటాను. “చాలా చాలా ధన్యవాదాలు బాబా. కొన్ని విషయాలు మీ పాదాల దగ్గర విన్నవించుకున్నాను బాబా. వాటిని ఎంత తొందరగా అయితే అంత తొందరగా తీర్చామని కోరుకుంటున్నాను బాబా. ఆ విషయంలో మీరు ఎలా, ఎప్పుడు కరుణిస్తారో అని వేచి ఉన్నాను బాబా. అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు, అలాగే వారిని కష్టాల నుండి గట్టెక్కించు స్వామి. మనసా, వాచా నిన్నే పూజిస్తున్నాము స్వామి. నువ్వే మమ్మల్ని సదా కాపాడు తండ్రీ”.


సాయిభక్తుల అనుభవమాలిక 1720వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అబద్ధాలు చెప్తే శిక్ష తప్పదన్న గుణపాఠం నేర్పిన బాబా
2. బాబా బ్లెస్సింగ్స్
3. నార్మల్ రిపోర్టు వచ్చేలా అనుగ్రహించిన బాబా

అబద్ధాలు చెప్తే శిక్ష తప్పదన్న గుణపాఠం నేర్పిన బాబా


సాయిభక్తులకు నమస్కారం. నా పేరు నిరంజనరెడ్డి. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాను. ఒకసారి ఒక వారం రోజుల పాటు ఇద్దరు క్యాబ్ డ్రైవర్లు పనిగట్టుకొని పనివేళ్లలో నేను నిద్రపోతున్నట్లు ఫోటోలు తీసి మా సెక్యూరిటీ ఆఫీసరుకి పంపారు. నిజానికి నాకు నిద్ర రావడమే తక్కువ. అటువంటి నాపై అనవసరంగా అలాంటి పిర్యాదులు వస్తుంటే నాకు చాలా బాధేసింది. నేను ఎంత చెప్పినా నాతోపాటు విధులు నిర్వహించేవాళ్ళు కూడా నమ్మలేదు. మా సెక్యూరిటీ ఆఫీసర్, "నీపై పిర్యాదులు వస్తున్నాయి రెడ్డి. అడ్మిన్ టీమ్‌కి తెలిస్తే బాగుండదు" అని  సీరియస్‌గా అన్నాడు. నేను ప్రతి విషయంలో బాబా ముందు చెప్పుకుంటూ ఉంటాను, 'ఓంసాయి శ్రీసాయి జయజయసాయి' అని స్మరిస్తూ ఉంటాను. అలాగే ఈసారి కూడా దిగులుగా బాబాను స్మరిస్తూ ఉంటే, నాకు ఒక ఆలోచన వచ్చి, నేను చేసిన తప్పేమిటో నాకు అర్థమైంది. అదేమిటంటే, నేను ఈమధ్య అప్పుడప్పుడు కొన్ని విషయాలలో అబద్ధం చెప్పడం అలవాటు చేసుకున్నాను. నా క్లోజ్ ఫ్రెండ్‌తో కూడా కొన్ని విషయాలలో అబద్ధాలు చెప్పాను. నా ఫ్రెండ్ నన్ను నమ్మేవాడు, "నువ్వు సాయి భక్తుడవ"ని పొగిడేవాడు. అదంతా గుర్తొచ్చి అందువల్లే నేను చేయని తప్పుకి నాపై అనవసరంగా నిందలు వచ్చాయనిపించి వెంటనే మనసులోనే బాబాకు క్షమాపణలు చెప్పుకున్నాను. ఈ అనుభవం ద్వారా అబద్ధాలు చెప్తే శిక్ష తప్పదన్న గుణపాఠం నేర్చుకున్నాను. కాబట్టి 'అబద్ధాలు చెప్పి కష్టాలు తెచ్చుకోకండి. అసత్యం పలకడం, అనవసర విషయాలలో తలదూర్చడం సాయినాథునికి ఇష్టం ఉండదు. తప్పు చేస్తే ఏదో రకంగా ఆయన దాన్ని మనకి అర్థం అయ్యేటట్లు చేస్తారు. సాయి భక్తులు ఎవరైనా సరే మానవత్వంతో ఆలోచించి అడుగేస్తే బాబా మన వెంట ఉంటారు. ఇది అక్షర సత్యం. అందుకే నేను ఏ గుడికిపోయినా గుడి ముందుండే అనాధ బిక్షకులకు తోచినంత సహాయం చేస్తాను. తర్వాత దేవుడి దర్శనం చేసుకుంటాను. మనం భిక్షకులకు ఇచ్చింది దేవుని హుండీలో వేసినట్లే అవుతుంది. ముఖ్యంగా మనం చేసే మంచి పనికి బాబా సంతోషిస్తారు. బాబా స్మరణ చేస్తూ ఉండండి. ఆయన పిలిస్తే పలికే దైవం. ఏ కష్టమొచ్చినా మన వెంట ఉంటారు. ఆయన దయతో మనకు అన్ని అనుకూలంగా  ఉంటాయి.


బాబా బ్లెస్సింగ్స్


నా పేరు నాగవల్లి. ఈమధ్య వేరే ఊరిలో ఉన్న మా బంధువుల ఇంట్లో ఒక ఫంక్షన్ రెండు రోజులు జరిగింది. నేను ఆ ఫంక్షన్‌కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాను. అయితే ఆ నెల నాకు నెలసరి ఆలస్యమై సరిగ్గా ఫంక్షన్‌కి వెళ్లే ముందురోజు రాత్రి నెలసరి వచ్చే లక్షణాలు కనిపించాయి. నాకు చాలా భయమేసి, "బాబా! నాకు ఇప్పుడు నెలసరి రాకుండా చూడండి. ఫంక్షన్ నుండి తిరిగి వచ్చాక వచ్చేలా చేయండి తండ్రీ" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల నెలసరి రాకపోవడంతో మరుసటిరోజు సంతోషంగా ఫంక్షన్‌కి వెళ్ళాము. వెళ్లేటప్పుడు మా బంగారం అంతా ఒక బ్యాగులో పెట్టి తీసుకొని వెళ్ళాము. తీరా అక్కడికి వెళ్లాక బ్యాగు ఓపెన్ చేస్తే, గాజులు కనిపించలేదు. మా అత్తయ్య వాటిని బ్యాగులో పెట్టలేదేమోలే ఉన్నారు. ఆ బ్యాగు నేను సర్దలేదు కాబట్టి నాకు కూడా ఆ విషయం తెలీదు. కానీ భయమేసింది. ఎందుకంటే, వచ్చేటప్పుడు మధ్యలో ఒక చోట ఆగాము. అక్కడ ఏమైనా ఆ గాజుల బాక్స్ మిస్ అయ్యిందేమోనని నాకు టెన్షన్ వచ్చింది. అందుచేత, "బాబా! నా గాజులు ఇంట్లోనే ఉన్నట్లైతే నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. తర్వాత బ్లాగు ఓపెన్ చేస్తే, భక్తులెవరో తమ బంగారం కనిపించకపోతే, బాబాని ప్రార్థించాక బంగారం కనిపించిందని పంచుకున్నారు. అది చదివాక నాకు ధైర్యం వచ్చింది. ఆ తర్వాత రోజు మేము మా ఇంటికి వెళ్లి చూస్తే, గాజులు ఇంట్లోనే ఉన్నాయి. అంతేకాదు, నేను కోరుకున్నట్లు ఫంక్షన్ అయ్యాకనే నాకు నెలసరి వచ్చింది. "ధన్యవాదాలు బాబా".

నార్మల్ రిపోర్టు వచ్చేలా అనుగ్రహించిన బాబా


నా పేరు సుమ. నాకు పెళ్ళై తొమ్మిది సంవత్సరాలైంది. మాకు 8 సంవత్సరాల బాబు ఉన్నాడు. బాబా పుట్టిన ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను గర్భవతినయ్యాను. ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయినప్పటి నుంచి నాకు ఏడు స్కానింగ్లు అయ్యాయి. మాములుగా అందరికీ నాలుగు స్కాన్లే చేస్తారు. కానీ నాకు బీపీ ఉండడం వల్ల అదనంగా ఇంకో స్కాన్ వ్రాస్తూండేవారు డాక్టర్. నాకు ప్రతి విషయానికి చాలా భయం. అందువల్ల డాక్టర్ దగ్గరకి వెళ్ళినప్పుడు బీపీ ఎక్కువైపోతుండేది. నాకు బాబా మీద నమ్మకం. ఆయన తప్ప నాకు వేరే ఆలోచన ఉండదు. అందుచేత ఊదీ ప్యాకెట్‌తో హాస్పిటల్‌కి వెళ్తుండేదాన్ని. ఎందుకంటే, బాబా నాతో ఉన్నారన్న ఒక భరోసా. 2023, నవంబర్ 21న డాప్లర్, బ్లడ్ టెస్టులకి వెళ్ళేముందు, "బాబా! మీ దయవల్ల రిపోర్టులు నార్మల్ వస్తే, మీ అనుగ్రహం బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాను వేడుకొని వెళ్ళాను. బాబా దయవల్ల రిపోర్టులు నార్మల్ వచ్చాయి. "ధన్యవాదాలు బాబా. నా కాన్పుకి జనవరిలో డేట్ ఇచ్చారు. ఇప్పటివరకు ఎలా తోడుగా ఉన్నారో సిజేరియన్ జరిగే సమయంలో తోడుగా ఉండండి. నా బీపీ నార్మల్ ఉండేలా చేసి ఎటువంటి సమస్యలు లేకుండ ఆరోగ్యవంతమైన బిడ్డని ప్రసాదించండి. నన్ను, నా కుటుంబాన్ని సంరక్షించండి. ప్లీజ్ బాబా".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo