ఈ భాగంలో అనుభవాలు:
1. ఊదీతో పంటినొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యల నుండి ఉపశమనం
2. బాబాకు తన బిడ్డలపై ఉండే మాతృప్రేమ
3. సురక్షితంగా గమ్యం చేర్చిన బాబా
ఊదీతో పంటినొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యల నుండి ఉపశమనం
సాయిబంధువులందరికీ నమస్తే. నా పేరు కృష్ణకుమారి. బాబా నాకు చాలా విషయాల్లో సహాయం చేసారు. 15 రోజుల్లో నా పెళ్లి అనగా పది రోజులపాటు నేను విపరీతమైన పన్ను నొప్పితో బాధపడ్డాను. అది పిప్పి పన్నో లేక ఇన్ఫెక్షనో అర్ధం కాలేదుగానీ నొప్పి మాత్రం నన్ను రాత్రుళ్లు నిద్ర కూడా పోనిచ్చేదికాదు. మరోవైపు గ్యాస్ట్రిక్ సమస్య వల్ల ఏది తిందామన్న వాంతి వచ్చేలా అనిపించేది. కడుపులో మంట కూడా ఉండేది. ఈ సమస్యలతో సరిగా తినడానికి సాధ్యపడక పెళ్లికి ముందు చాలా బాధపడ్డాను. నేను పడ్డ మానసిక వేదన బాబాకే తెలుసు. అటువంటి స్థితిలో నాకు ఈ బ్లాగు గుర్తొచ్చింది. ఇందులో చాలామంది భక్తులు చాలా నొప్పులకి ఊదీ ఉపయోగించాక నొప్పి నుండి ఉపశమనం లభించిందని పంచుకున్నారు. అవి చదివిన నేను, "బాబా! పంటి నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్య రెండూ తగ్గి నా పెళ్ళికి ఇబ్బంది లేకుండా చేయండి" అని బాబాని వేడుకున్నాను. తర్వాత డాక్టర్ దగ్గరకి వెళితే "జ్ఞాన దంతం దగ్గర కొంచం వాచింద"ని ఆంటిబయోటిక్స్ ఇచ్చారు. ఆ మందులు వాడటంతోపాటు ఊదీ నీళ్లలో కలుపుకొని తగి, నొప్పి ఉన్న ప్రాంతంలో కూడా ఊదీ రాసుకుంటూ ఉండేదాన్ని. బాబా దయవల్ల రెండు రోజులకి నొప్పి, ఇన్ఫెక్షన్ చాలావరకు తగ్గాయి. ఆరోజు నేను క్లినిక్‌కి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు బస్సుకోసం ఎదురుచూస్తూ నిల్చున్నప్పుడు 'ఈ సమస్య నుంచి బాబానే ఇంత తేలికగా బయటపడేసార'ని అనిపించి ఆనందంతో నాకు కన్నీళ్లు వచ్చాయి. మరుక్షణం ఎదురుగా ఉన్న ఒక షాపు గోడ మీద ఉన్న బాబా ఫోటో నా కంటపడింది. అక్కడ వేరే ఇంకే ఫొటోలూ లేవు. బస్సు వచ్చేలోపు నేను బాబాని చూసిన ప్రతిసారీ 'బాబా దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు' అనిపించి చాలా ఆనందమేసింది. ఇకపోతే, గ్యాస్ట్రిక్ సమస్య కూడా చాలావరకు తగ్గింది. ఒకవేళ పన్ను తీసేయాల్సి వచ్చుంటే నా పెళ్ళికి సమస్య అయ్యేది. కానీ అలాంటిదేమీ జరగకుండా బాబా నా సమస్యను చాలా సులభంగా తీర్చారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
బాబాకు తన బిడ్డలపై ఉండే మాతృప్రేమ
ఓం నమో సాయినాథాయ. నా పేరు అనురాధ. మేము హైదరాబాదులో ఉంటాము. మా బాబు బీటెక్ చదువుతున్నాడు. మేము తన కాలేజీకి దగ్గర్లో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఆ ఇంటికి మారం. ఆ క్రమంలో నేను బాబా ఊదీ కొంత భద్రపరచాను. కానీ తర్వాత ఇల్లు సర్దుకునేటప్పుడు ఆ ఊదీ కోసం చూస్తే, ఎంత వెతికినా కనిపించలేదు. నేను ఊదీని బాబా ప్రేమకు గుర్తుగా భావిస్తాను. ఎప్పుడైనా ‘ఊదీ నిండుకుంటుంది’ అని నేను మనసులో అనుకుంటే చాలు, కొన్ని దినాల్లో ఎవరో ఒకరి ద్వారా శిరిడీ నుంచి ఊదీ ప్రసాదం నాకు అందిస్తారు బాబా. మా ఇంట్లో అందరం స్నానం చేసిన తర్వాత ఊదీ నుదుటన పెట్టుకొంటాము. మా ఇంట్లో ఏ ఆరోగ్య సమస్య ఉన్నా బాబా ఊదీయే మాకు సంజీవిని. అటువంటి ఊదీ కనిపించకపోయేసరికి నాకు చాలా బాధేసి, "బాబా! నా మీద మీకు ప్రేమ ఉంటే ఊదీ కనిపించాలి" అని బాబాను ప్రార్థించాను. తర్వాత నేను దాచిన ఊదీ కనిపించిలేదుగానీ వేరే ఊదీ ప్యాకెట్ ఒకటి నా బ్యాగులో దొరికింది. నిజానికి అదొకటి ఉన్నదన్న విషయం కూడా నాకు తెలీదు. బాబాకి తన బిడ్డలపై ఎంత ప్రేమో చూసారా! అయితే నేను మనసులో ఊదీ దొరికినందుకు ఆనందపడినా 'ఒక్క ప్యాకెట్టే దొరికింది. నేను ఇంకా రెండు, మూడు ప్యాకెట్లు దాచాను. అవి కూడా దొరికితే బాబా నువ్వు నన్ను మరింత ప్రేమిస్తున్నట్లు' అనుకొంటూ వాటికోసం వెతుకుతూ ఉండేదాన్ని. అప్పుడొకరోజు ఊదీ దొరికినట్లు కల వచ్చింది. నేను, 'రోజూ అనుకోవడం వల్ల కల వచ్చి ఉంటుంది. అంతేగాని అవి ఎంత వెతికినా దొరకవ'ని వదిలేసి ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయాను. అప్పుడు ఒకరోజు పర్సు కనిపించక దానికోసం వెతుకుతుంటే ఒక కవరులో ఊదీ ప్యాకెట్లు కనిపించాయి. నేను అదివరకు ఆ కవరులో కూడా వెతికాను. కానీ అప్పుడు ఆ ఊదీ ప్యాకెట్లు కనిపించలేదు. బాబా నా మీద చూపించిన ప్రేమకు ఉప్పొంగిపోయాను, మనం బాబాని అడిగి మర్చిపోతాం కానీ, బాబా మనం అడిగే ప్రతి చిన్న విషయాన్ని గుర్తు పెట్టుకుంటారు. అది బాబాకు తన బిడ్డలపై ఉండే మాతృప్రేమ. "ధన్యవాదాలు బాబా. నీ మార్గంలో ఎప్పుడూ నడిచే సద్బుద్ధిని ప్రసాదించు తండ్రీ".
సురక్షితంగా గమ్యం చేర్చిన బాబా
సాయిభక్తులకు నమస్కారం. నా పేరు లోకేష్. నేను విజయవాడ నివాసిని. 2023, నవంబర్ 22, సాయంత్రం నేను బెంగళూరు నుంచి విజయవాడ రావడానికి ఒక బస్సుకి రిజర్వేషన్ చేసుకొని బస్సు ఎక్కాను. కొన్ని అనివార్య కారణాల వల్ల బస్సు దారి మధ్యలో ఆగిపోయింది. అప్పుడు నేను సాయిబాబాకి మనసులో దణ్ణం పెట్టుకొని, "బాబా! వెంటనే మళ్ళీ విజయవాడ వెళ్ళడానికి దారి చూపండి" అని వేడుకున్నాను. ఒక గంట తర్వాత బస్సు రిపేర్ అవ్వడంతో నేనే కాకుండా బస్సులోని అందరూ సురక్షితంగా విజయవాడ చేరుకున్నారు. “ధన్యవాదాలు బాబా.”
సాయినాథ్ మహారాజ్ కీ జై.

