సాకోరి నివాసి హంసరాజ్ రాత్రింబవళ్లు తీవ్రమైన ఉబ్బసం(ఆస్తమా) వ్యాధితో బాధపడుతుండేవాడు. అతనికి సంతానం కూడా లేదు. ఒకసారి అతను నాసిక్‌కు చెందిన నరసింగ మహారాజ్‌ను దర్శించాడు. అప్పుడు ఆయన అతనితో, “నీ దేహాన్ని ఒక దుష్టశక్తి ఆవహించింది. ఆ కారణంగా మీకు సంతానం కలగడం లేదు. శిరిడీ వెళ్లి సాయిబాబాను దర్శిస్తే, వారు రెండు చంప దెబ్బలు కొట్టి, ఆ దుష్టశక్తిని తరిమేస్తార”ని చెప్పారు. దాంతో హంసరాజ్, అతని భార్య కాశీబాయి 1916, డిసెంబర్ నెలలో(మార్గశిర మాసంలో), రాధాకృష్ణమాయి మరణించిన కొద్దిరోజులకి శిరీడీ వెళ్లి సాయిబాబాను దర్శించారు. బాబా అతని చెంప మీద రెండు దెబ్బలు కొట్టి, "దుష్టశక్తీ పో!" అని అన్నారు. బాబా అనుగ్రహంతో కొద్దికాలానికి ఆ దంపతులకి సంతానం కలిగింది.
హంసరాజ్ దంపతులు శిరిడీలో 6 నెలలు ఉన్నారు. బాబాను దర్శించినప్పటి నుండి హంసరాజ్ ఉబ్బస వ్యాధి తగ్గనారభించింది. అది పగటిపూట మాత్రమే వచ్చేది కానీ, రాత్రి వేళల్లో అతనిని అస్సలు ఇబ్బంది పెట్టేది కాదు. బాబా మాత్రం వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు రాత్రిపూట బాగా దగ్గుతూ ఉండేవారు. కాశీబాయి ప్రతిరోజూ తన భర్తకి ఉబ్బసం పూర్తిగా తగ్గడానికి మందు ఇస్తుండేది. అప్పుడు ఒకరోజు బాబా, “నాకూ ఉబ్బసం ఉంది. నువ్వు నీ భర్తకు మందు ఇస్తున్నట్లే, నాకు కూడా మందులు ఇవ్వడానికి వేలాది మంది స్త్రీలు ఉన్నారు. కానీ ప్రయోజనమేముంది? అల్లా మాలిక్ హై(భగవంతుడే యజమాని)" అని అన్నారు. దాంతో ఆమె తన భర్తకి మందులు ఇవ్వడం మానేసింది. ఒకరోజు బాబా, “ఆహార నియమాల విషయంలో చాలా కఠినంగా ఉండాలి. పెరుగు, ఇతర పుల్లని పదార్థాలు, ఘాటైన పదార్థాలు తినవద్ద”ని హంసరాజ్తో చెప్పారు. అయితే, అతనికి బాబా సలహాను పాటించడం చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే, అతనికి అత్యంత ఇష్టమైన పదార్థాలు అవే. ముఖ్యంగా పెరుగు లేనిదే అతనికి ముద్ద దిగేది కాదు. "చావనైనా చస్తాను గానీ, పెరుగు తినకుండా ఉండలేను” అనేవాడు.
ఆ రోజుల్లో శిరిడీ గ్రామంలో మధ్యాహ్నం పూట పెరుగు సులభంగా లభించేదికాదు. అందువల్ల హంసరాజ్ తన భార్య కాశీబాయిని పాలు తోడుపెట్టమని, ఆ విషయం బాబాకి చెప్పవద్దని చెప్పాడు. ఆమె తన భర్త మాట కాదనలేక ప్రతిరాత్రి పాలుకాచి, చల్లార్చి తోడుపెట్టి ఆ పాత్రను ఎత్తులో ఉట్టిపై పెట్టేది. వాళ్ళు ప్రతిదినం మసీదులో బాబా మధ్యాహ్న హారతికి హాజరై, తిరిగి ఇంటికి వచ్చి భోజనానికి కూర్చునేటప్పుడు చూస్తే, ఉట్టి మీద ఉన్న పాత్రలో పెరుగు ఉండేది కాదు. విషయమేమిటంటే, రోజూ వాళ్ళు లేని సమయంలో ఒక పిల్లి ఇంట్లోకి చొరబడి, ఉట్టి మీదకి ఎగిరి పెరుగునంతా తాగేసేది. అందువల్ల అతను తినడానికి పెరుగు ఉండేది కాదు. అలా దాదాపు 2 నెలలపాటు జరిగింది. అప్పుడొకరోజు అతను ఆ దొంగ పిల్లిని పట్టుకోవాలని నిశ్చయించుకుని, మధ్యాహ్న హారతికి వెళ్లకుండా ఇంటిలో కాపుకాశాడు. రోజూ వచ్చినట్లే ఆ పిల్లి ఆ రోజు కూడా వచ్చింది. వెంటనే అతను దాన్ని ఏమీ చేయక, అంత ఎత్తులో ఉట్టిపై ఉన్న పెరుగు కుండను అది ఎలా అందుకుంటుందో గమనించసాగాడు. ఆ పిల్లి ఎలాగోలా ఉట్టిపైకి ఎగిరి పెరుగులో మూతి పెట్టింది. అది మూతి పెట్టినందువల్ల ఆ పెరుగు వాడకానికి ఎలాగూ పనికిరాకుండా పోయింది కనుక అతను అది పెరుగు తాగడం పూర్తయ్యేవరకు నిశ్శబ్దంగా గమనించి, అది కిందకు దిగగానే, తన చేతిలో ఉన్న కర్రతో దాని వీపుపై బలంగా కొట్టి, అది చేసిన పనికి తగిన శాస్తి చేశాడు. తర్వాత భక్తులు మసీదులో బాబాను దర్శించుకొని, ఆయన చేతుల మీదుగా ఊదీ తీసుకుంటున్న సమయానికి హంసరాజ్, అతని భార్య అక్కడికి వెళ్లారు. అక్కడ బాపూసాహెబ్ జోగ్, మాధవరావు దేశ్‌పాండే(శ్యామా), కాకాసాహెబ్ దీక్షిత్, బూటీ మొదలైన వారున్నారు. బాబా వారి వైపు చూస్తూ, "ఇక్కడ ఒక మొండివాడు పుల్లని, ఘాటైన పదార్థాలు తిని చావాలనుకుంటున్నాడు. కానీ నేను వాడిని అలా చావనివ్వను. ఈరోజు నేను వాడి వద్దకు పిల్లి రూపంలో వెళ్లాను. అతను నా వీపుపై కర్రతో గట్టిగా కొట్టాడు. ఇదిగో చూడండి" అని అంటూ బాబా తన కఫ్నీ ఎత్తి తమ వీపు చూపించారు. వారి వీపుపై బెత్తంతో కొట్టిన వాత స్పష్టంగా కనిపించింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బాబా తననుద్దేశించే ఆ మాటలన్నారని గ్రహించిన హంసరాజ్ చలించిపోయాడు. మళ్ళీ ఎప్పుడూ తన భార్యని పెరుగు తోడు పెట్టమని అడగలేదు. అతను పుల్లని పదార్థాలు తినడం పూర్తిగా మానేసాడు. బహుశా అదే అతని ఆరోగ్యం త్వరగా కుదుటపడటానికి దోహదపడింది. 6 నెలలు గడిచేసరికి పగటిపూట కూడా అతనికి ఉబ్బసం రావడం తగ్గిపోయింది. ఎలాంటి మందులు వాడకుండానే బాబా హంసరాజ్ ఉబ్బస వ్యాధిని పూర్తిగా నయం చేశారు. ఒక సంవత్సరం పాటు అతనికి ఆ వ్యాధి రాలేదు. కానీ 1918 లేదా 1919లో ఉబ్బసం తిరగబెట్టింది. అప్పుడు సియోన్లో ఉన్న ఉపాసనీబాబా అతని వ్యాధిని నయం చేసారు.
శ్రీమతి హంసరాజ్ ఇలా చెప్పింది: ‘సాయిబాబా ఎన్నో విషయాలు చెబుతుండేవారు. వాటిలో కొన్ని నాకు గుర్తున్నాయి. ఆయన ఎప్పుడూ శిరిడీలోనే ఒంటరిగా నివసిస్తున్నప్పటికీ, అకస్మాత్తుగా ఇలా అనేవారు: "నేను కాశీకి వెళ్లి స్నానం చేసి ఇప్పుడే తిరిగి వచ్చాను. నాకిక్కడ స్నానం ఎందుకు?", "నేనిప్పుడే కొల్హాపూర్ వెళ్ళొచ్చాను”, “నేనిప్పుడే ఔదుంబర్వాడీ వెళ్ళొచ్చాను” అనేవారు. బాపూసాహెబ్ జోగ్ తన కోరిక మేరకు సాయిబాబా తనకు 'అక్కల్కోట మహారాజ్' రూపంలో దర్శనమిచ్చారని నాతో చెప్పారు’.
సోర్స్: సాయిలీల 1936, సంచిక 11,12,13
శ్రీసాయి లీలామృతం.

