- బాబా ఉండగా భయం ఎందుకు?
నా పేరు మహేష్ రెడ్డి. నేను సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాను. నేను నా ఉద్యోగ రీత్యా అక్టోబర్ 15, సాయంత్రం 6 గంటలకు ముఖ్యమైన IAM CAB (Identity and Access Management Change Advisory Board) మీటింగ్ నిర్వహించాల్సి వచ్చింది. సమయానికి మీటింగ్‌లో చేరి, దానిని సక్రమంగా నిర్వహించడం నా బాధ్యత. నేను ఆ భాద్యతను ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయవంతంగా పూర్తి చేయాలని అనుకున్నాను. అయితే, మీటింగ్ ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందు అనుకోకుండా నా ల్యాప్‌టాప్‌లో ఏదో సమస్య వచ్చి సరిగా పనిచేయలేదు. దాంతో నేను ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాను. ఎందుకంటే, అది సాధారణమైన మీటింగ్ కాదు. వృత్తిపరంగా నేను బాధ్యతగా నిర్వహించాల్సిన ముఖ్యమైన సమావేశం. అమెరికా(USA) నుంచి కూడా పలువురు పాల్గొంటారు. అందువల్ల నా మనసులో, 'ఇప్పుడు మీటింగ్ ప్రారంభించాలి. అమెరికా నుంచి కూడా సభ్యులు పాల్గొంటారు. ఇలాంటి సమయంలో నా సిస్టమ్ పనిచేయకపోతే మీటింగ్‌ను ఎలా నిర్వహించాలి? అందరూ సమయానికి జాయిన్ అవుతారు. నేను ఎలా పాల్గొనాలి?' అని ఎన్నో ఆలోచనలతో కొంత ఒత్తిడికి గురయ్యాను. అలాంటి స్థితిలో నాకు నా ప్రియమైన సాయిబాబా గుర్తుకొచ్చి, “బాబా! ఇంత ముఖ్యమైన సమయంలో ఈ సమస్య వచ్చింది. మీటింగ్‌ను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత నాపై ఉంది. దయచేసి నాకు ధైర్యాన్ని ప్రసాదించండి. ఈ సమస్యను పరిష్కరించుకునే మార్గం చూపించండి. నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేలా అనుగ్రహించండి” అని మనసులోనే ప్రార్థించాను. తర్వాత బాబాను స్మరించుకుంటూ, భయపడకుండా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాను. ఆ క్రమంలో నా ల్యాప్‌టాప్ రీస్టార్ట్ చేశాను. బాబా దయవల్ల రీస్టార్ట్ చేసిన తర్వాత సిస్టమ్‌లో ఏర్పడిన సమస్య పరిష్కారమై మునుపటిలా నా ల్యాప్‌టాప్ సక్రమంగా పని చేయసాగింది. నాకు ఎంతో ఉపశమనంగా అనిపించింది. వెంటనే మీటింగ్‌లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేశాను. అనుకున్న సమయం కంటే కొద్దిగా ఆలస్యమైనప్పటికీ, గం. 6:03 నిముషాలకి మీటింగ్‌లో జాయిన్ అయి నా బాధ్యతను నిర్వర్తించి విజయవంతంగా పూర్తి చేశాను. నాకు ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా అనిపించింది. ఆ క్షణంలో 'కష్ట సమయంలో బాబాను స్మరించుకుంటే ఎంతో దైర్యం వస్తుంద'ని నా మనసుకు అనిపించింది. ఉద్యోగపరమైన సమస్యలు, అనుకోని ఇబ్బందులు ఎప్పుడైనా ఎదురుకావచ్చు. ముఖ్యంగా మనపై ముఖ్యమైన బాధ్యత ఉన్నప్పుడు చివరి నిమిషంలో సమస్య వస్తే మనం ఆందోళన చెందుతాము. అలాంటి సమయంలో భయానికి లోనై ప్రయత్నాన్ని ఆపకూడదని, నమ్ముకున్న దైవాన్ని స్మరించుకుంటూ, ప్రశాంతంగా ఆలోచించి, సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించాలని ఈ అనుభవం ద్వారా నేను తెలుసుకున్నాను. "ధన్యవాదాలు బాబా! ప్రతి పరిస్థితిలోనూ ప్రశాంతంగా ఆలోచించే మనసును, నా బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించే శక్తిని నాకు ప్రసాదించండి. మీరు చెప్పిన 'శ్రద్ధ, సబూరీ'లను నా జీవితంలో పాటిస్తూ కష్ట సమయాల్లో ధైర్యంగా ముందుకు సాగేలా అనుగ్రహించండి".
2026, సెప్టెంబర్ 10న ఒక కోర్టు కేసు విషయంలో నేను కోర్టుకు వెళ్ళాను. అయితే ప్రత్యర్థి పార్టీ కారణంగా కేసు విచారణ ఆలస్యమైంది. నేనేమో ఆ రోజు ఆఫీసుకి వెళ్లాల్సిన అవసరం వుంది. అందువల్ల కాస్త ఆందోళనకు గురై, “బాబా! నేను ఆఫీసుకు వెళ్లాలి. ఏ సమస్య లేకుండా నేను ఇక్కడినుంచి బయటపడేలా చూడండి” అని బాబాను వేడుకున్నాను. అలా బాబాను ప్రార్థించిన కొద్దిసేపటికే నాకు ఒక మార్గం కనిపించింది. నేను నా అడ్వకేట్‌ను కలిసి, "నేను ఆఫీసుకి వెళ్లాల్సి ఉంది. కోర్టు నుంచి వెళ్లడానికి అనుమతి కావాల"ని వినయంగా అభ్యర్థించాను. ఆయన నా పరిస్థితి అర్థం చేసుకుని, "సరే, మీరు వెళ్ళండి. నేను మేనేజ్ చేస్తాను” అని చెప్పారు. ఆ మాటలు వింటూనే నా మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది. నాకు మరోసారి 'బాబా మన ప్రార్థనలను వింటారని, సరైన సమయంలో సరైన మార్గాన్ని చూపిస్తారని' అనిపించింది. మనం నిజమైన విశ్వాసంతో బాబాను ఆశ్రయిస్తే, ఆయనపై భారాన్ని ఉంచితే, మనకు ధైర్యం, మనశ్శాంతి కలుగుతాయి. బాబా ఉండగా భయం ఎందుకు? ఆయనను నమ్మి ముందుకు సాగుదాం.
2026, ఆగస్టు 29న నేను సాయిబాబా దర్శనానికి శిరిడీ వెళ్లాను. శిరిడీ వెళ్ళడానికి ముందు నా వేలు వాచినట్లుండి నొప్పి పెడుతుండటంతో నేను ఆందోళన చెంది డాక్టరుని సంప్రదించి, ఆయన సూచించిన మందులు వాడాను. కానీ సమస్య నుండి పూర్తిగా ఉపశమనం కలగలేదు. ఇలా ఉండగా నేను ఆగస్టు 29న శిరిడీ వెళ్లి సాయిబాబా దర్శనం చేసుకొని, సంస్థాన్వాళ్ళు ఇచ్చే ఊదీ తీసుకొని భక్తితో నా వేలికి రాసుకొని, "బాబా! మీ కృపతో నా వేలి నొప్పి, వాపు తగ్గాల"ని మనస్ఫూర్తిగా ప్రార్థించాను. బాబా పాదాలపై నమ్మకముంచి బాధ్యతను ఆయనకు అప్పగించిన కొంతసేపటి తర్వాత నా వేలి నొప్పి, అలాగే వాపు మెల్లగా తగ్గుతున్నట్లు నాకనిపించింది. బాబా కృప అని నా మనసుకి ప్రశాంతంగా అనిపించింది. నేను డాక్టర్ ఇచ్చిన మందులను నిర్లక్ష్యం చేయలేదు గానీ, బాబాపై ఉన్న విశ్వాసంతో శిరిడీ నుండి తిరిగొచ్చిన తర్వాత కూడా బాబాని స్మరిస్తూ, ఊదీ ఉపయోగిస్తూ ఉండగా కొంతకాలానికి నా వేలి నొప్పి, వాపు తగ్గాయి. బాబాని ప్రార్థించి ఊదీ వాడిన తర్వాత ఉపశమనం కనిపించడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ అనుభవం బాబా కృపపై నాకు మరింత విశ్వాసాన్ని కలిగించింది.
అలాగే కొంతకాలం క్రితం శరీరంలో నొప్పులు కారణంగా నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. అప్పుడు నేను డాక్టర్ని సంప్రదించకుండా, బాబాపై నమ్మకంతో 'ఓం సాయిరామ్' అని జపిస్తూ నా బాధను వారి పాదాల వద్ద ఉంచాను. కొంత సమయం గడిచిన తరువాత నా శరీర నొప్పులు క్రమంగా తగ్గడం ప్రారంభించి శరీరం తేలికగా అనిపించింది. నా బాధను బాబా తీసేసినందుకు నాకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది.
ఒకరోజు నా కింద ముందు పళ్ల చిగుళ్లు వాచి కొద్దిగా నొప్పి అనిపించింది. అప్పుడు నేను సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించి, ఊదీ పెట్టుకున్నాను. దాంతో చిగుళ్ల వాపు తగ్గి నాకు ఎంతో ఉపశమనం కలిగింది. బాబా ఆశీస్సులు నాపై ఉన్నాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. "బాబా! మీ కరుణకు కోటి వందనాలు. మీ కృప, ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపై ఉండాలి”.
శ్రీసాయినాథాయ నమః

