సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

పదికోట్ల రూపాయలు ఆశించి బాబాను దర్శించిన ఒక భక్తుడు



శ్రీసాయి సచ్చరిత్ర 16, 17 అధ్యాయాల్లో బ్రహ్మజ్ఞానం కోరుకునే ఒక ధనవంతుడితో బాబా ఎలా వ్యవహరించారో చూశాము. ఇప్పుడు 10 కోట్ల రూపాయలను ఆశించిన ఒక పేదవాడి కోరికను బాబా వేరొక మహాత్ముని ద్వారా తీర్చే ప్రయత్నం ఎలా చేశారో చూద్దాం.

ఈ భూమిపై ఆశలేనివారంటూ ఉండరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో, ఏదో ఒక దానికోసం ఆశపడతారు. అందుకోసం తమ సాయిశక్తులా ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో వారు ప్రపంచమంతటినీ మోసగించినా సరే బాబా వారిని నిరాదరించరు. అటువంటివారు తమ దర్బారుకి వస్తే బాబా సాదరంగా ఆహ్వానిస్తారు. బాబా సాక్షాత్తూ దైవం, ఈ సృష్టికర్త బ్రహ్మ. వారికి ఆద్యంతాలు లేవు. కాబట్టి అంతటి మహాత్ముని దర్శించేముందు అహంకారాన్ని, అజ్ఞానాన్ని, మొండితనాన్ని, మూర్ఖత్వాన్ని విడిచిపెట్టడం ఎంతైనా శ్రేయోదాయకం.

ఒకసారి ఒక భక్తుడు (బాబా భక్తుడు కాదు. వేరే ఏ దేవుని భక్తుడనిగానీ, అతని పేరుగానీ దురదృష్టవశాత్తు ప్రస్తావించబడలేదు) ఎటువంటి కష్టం లేకుండా పదికోట్ల రూపాయలు పొందాలన్న ఏకైక కోరికతో బాబా దర్శనానికి వచ్చాడు. అతని మనస్సున ఉన్న అభిప్రాయం ఏమిటంటే, 'ఐశ్వర్యకారిణి అయిన లక్ష్మీదేవి నిజమైన సత్పురుషుల చెంత నివాసముంటుంది. లక్ష్మి లేకుంటే వారు నిజమైన సత్పురుషులు కాదు' అని. అటువంటి అతనితో ఎవరో ఒక వ్యక్తి, "సోదరా! అటువంటి సత్పురుషులు శిరిడీలో నీకు లభిస్తారు. శిరిడీలో ఉన్న సాయిబాబా గొప్ప కోటీశ్వరులు. అంతకంటే వారు గొప్ప దయార్ద్రహృదయులు" అని చెప్పాడు. దాంతో ఆ పెద్దమనిషి శిరిడీ వచ్చి మూడు, నాలుగు రోజులు అక్కడ ఉండి ప్రతిరోజూ బాబా లీలలను గమనించసాగాడు. కానీ అతను ఎక్కువగా బాబా ధరించే పొడవాటి కఫ్నీ జేబుపై ఆకర్షితుడయ్యాడు. తమ దర్శనానికి వచ్చేవారు ఎవరైనా సరే బాబా తమ కఫ్నీ జేబులో చేయిపెట్టి, చేతికొచ్చినంత డబ్బు వారికి ఇస్తుండేవారు. ఎవరూ ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళేవారు కాదు. ఇదంతా గమనించిన ఆ పెద్దమనిషి బాబా వద్ద ఖచ్చితంగా పదికోట్ల రూపాయలు ఉంటాయని నిర్ధారణకు వచ్చి, "బాబా! నేను ఎంతగానో తిరిగినప్పటికీ నిజమైన సత్పురుషులను కనుగొనలేకపోయాను. మీరు ప్రతిరోజూ ఎంతో డబ్బు దానం చేస్తారు. కాబట్టి మీరు మాత్రమే నిజమైన సత్పురుషులని నాకనిపిస్తుంది. మీ పాదాలలో లక్ష్మీదేవి నివసిస్తుందని నాకు స్పష్టమయింది. నేను మీ దగ్గరకు వచ్చాను. దయచేసి నాకు కేవలం పదికోట్ల రూపాయలు ఇవ్వండి. అంతకుమించి నేను మిమ్మల్ని ఏమీ అడగను" అని అన్నాడు. అప్పుడు బాబా ఎంతో మధురంగా, "ఓ పెద్దమనిషీ, నేను భిక్ష చేసుకునే ఫకీరును. నా దగ్గర పదికోట్ల రూపాయలు ఎలా ఉంటాయి? నువ్వు ఒక పని చేయి. గొండవలేలో ఉన్న గొండవలేకర్ వద్దకు వెళ్ళు" అని బదులిచ్చారు. తరువాత అతనిని దగ్గరికి రమ్మని పిలిచి అతని చెవిలో, "నీకు పదికోట్ల రూపాయలు లభిస్తే గనుక, అందులోనుండి ఒక కోటి రూపాయలు నాకివ్వు. దాంతో నేను కూడా ఈ ఫకీరు పదవి నుండి బయటపడతాను" అని అన్నారు. తరువాత అతను బాబా వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు.  

మొత్తానికి ఏదో ఒక విధంగా అతను గొండవలేకర్ మహరాజ్ వద్దకు వెళ్లి, తన కోరికను విన్నవించుకున్నాడు. అది విన్న ఆయన, "ఇదేమీ పెద్ద సమస్య కాదు. కానీ ఈరోజు నువ్వు ఆలస్యంగా వచ్చావు. కాబట్టి రేపు రా" అని చెప్పారు. మరుసటిరోజు అతను మళ్ళీ మహరాజ్ వద్దకి వెళ్లి వారి పాదాల చెంత కూర్చున్నాడు. గొండవలేకర్ మహారాజ్ అతనిని, "చెప్పు సోదరా, చాలాదూరం నుండి ఇక్కడికి ఎందుకు వచ్చావు?" అని అడిగారు. అందుకా పెద్దమనిషి, "నాకు కేవలం పదికోట్ల రూపాయలు కావాలని నిన్ననే నేను మీకు చెప్పాను" అని అమర్యాదగా చెప్పాడు. మహరాజ్, "ఓ, అవునవును, నేను మర్చిపోయాను. అయితే, నీకు కేవలం పదికోట్ల రూపాయలు కావాలి. ఇదేమంత పెద్ద విషయం కాదు. నేను నీకోసం ఆ డబ్బును ఏర్పాటు చేస్తాను. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు" అని అన్నారు. ఈవిధంగా మహరాజ్ మళ్ళీ మళ్ళీ వాగ్దానం చేస్తూ అతనిని వారం రోజులపాటు అక్కడే ఉండేలా చేశారు. దాంతో ఆ పెద్దమనిషి తాను కోరుకున్నది నెరవేరట్లేదని కలత చెంది ఏదీ తినకూడదని నిశ్చయించుకున్నాడు. అప్పుడు గొండవలేకర్ మహరాజ్ అతను భోజనం చేసేలా చేసి, "నేను డబ్బుకోసం అన్ని ఏర్పాట్లు చేసి వాటిని చిన్న సంచుల్లో పెట్టాను. ఇప్పుడు వాటిని నువ్వెలా తీసుకొనిపోతావు?" అని అడిగారు.

పెద్దమనిషి: "నేను వాటిని బండ్లలో తీసుకుపోతాను".
మహరాజ్: "పదికోట్ల రూపాయలు తీసుకుపోవడానికి ఎన్ని బండ్లు అవసరమవుతాయి?"
పెద్దమనిషి: "వంద బండ్లు అవసరమవుతాయి".
మహరాజ్: "సరే సోదరా! వెళ్లి వంద బండ్లను తొందరగా తీసుకొని రా. నేను నీకు పదికోట్ల రూపాయలు ఒకేసారి ఇస్తాను".

దాంతో ఆ పెద్దమనిషి, 'ఒకటా, రెండా, వంద బండ్లను నేను ఎక్కడినుండి తీసుకొస్తాన'ని ఆలోచనలో పడ్డాడు. చివరికి అది తనవల్ల సాధ్యం కాదని గ్రహించి, ఏ సత్పురుషుల నుండైనా పదికోట్ల రూపాయలు పొందాలనే తన మూర్ఖత్వాన్ని, మొండితనాన్ని విడిచిపెట్టి, భారమైన హృదయంతో ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయాడు.

Source: గుజరాతీ పుస్తకం "సాయి సరోవర్".

8 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. ఓం సాయిరామ్🙏💐🙏

    ReplyDelete
  3. 🙏🕉️✡️🙏సాయి నాథ మా అనారోగ్యాన్ని ఇప్పటికిప్పుడు రూపుమాపి నిర్మూలించు బాబా.. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు దేవా.. బాబా ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.. నీవే దిక్కు నీవే రక్ష నీవే కలవు దేవా.. అనేకసార్లు నా ప్రాణాలను రక్షించిన గొప్ప దేవా.. నాకు మంచి భవిష్యత్తును ప్రసాదించిన షిరిడి సాయి నాథ.. నాపై మా అందరి మీద నీ కరుణ కటాక్షం ఉంటే నే మేము బాగున్నాము శతకోటి వందనాలు హృదయపూర్వక కృతజ్ఞతలు శిరిడీ సాయినాధ.. 🙏🕉️✡️🙏

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo