సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 588వ భాగం...


ఈ భాగంలో అనుభవాలు:
  • బాబా దయతో సుఖప్రసవం
  • అమెరికా ప్రయాణానికి బాబా సాయం
  • బాబా లీలలకు ప్రత్యక్ష నిదర్శనమైన అనుభవం

హైదరాబాదు నుండి N.సూర్యనారాయణమూర్తిగారు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

ఓం శ్రీ సాయిరామ్! ముందుగా ఈ బ్లాగును ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న  శ్రీ సమర్థ సద్గురు సాయిబాబాకు నా ప్రణామాలు అర్పిస్తున్నాను. ఇటీవల కాలంలో బాబా దయవలన నాకు కలిగిన అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను.

మొదటి అనుభవం - బాబా దయతో మా అమ్మాయికి సుఖప్రసవం:

బాబా నాకు ప్రసాదించిన అద్భుతఫలం - నా రెండవ కూతురు సాయిలీల. తను అమెరికాలోని చికాగోలో ఉంటోంది. ఆమెకు రెండవసారి డెలివరీ డేట్ 2020, మే నెలాఖరున ఇచ్చారు. మేము 2020, మార్చి నెలలో అమెరికా వెళదామని ప్లాన్ చేసుకున్నాము. కానీ కోవిడ్ కారణంగా మార్చి నెల నుంచి అంతర్జాతీయ విమానాలు రద్దు కావడంతో ఏం చేయాలో మాకు పాలుపోలేదు. నేను, నా భార్య అనేక సంవత్సరాలుగా ప్రతిదినమూ క్రమంతప్పకుండా శ్రీసాయిసచ్చరిత్ర పఠనము చేస్తున్నాము. అందువల్ల సాయిమీదే భారం వేసి రోజులు గడిపాము. మాకు తెలిసిన అనేకమంది స్నేహితులు, బంధువులు అమెరికాలో ఉన్నా ఎవరూ కూడా ఈ కరోనా సమయంలో మాకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. కానీ ఆశ్చర్యంగా మేము మా అమ్మాయి మొదటి డెలివరీకి అమెరికా వెళ్ళినప్పుడు మాకు పరిచయమై మంచి స్నేహితులైన ఇద్దరు పెద్దవారు బాబా దయతో మా అమ్మాయి రెండవ డెలివరీ సమయంలో తనను ఆదుకున్నారు. వారిలో ఒకరు శ్రీమతి పి.హైమగారు. ఆవిడని అందరూ ‘హేమ ఆంటీ’ అని పిలుస్తారు. ఆవిడ ఆ కమ్యూనిటీలో తలలో నాలుకలాంటివారు. రెండవవారు - ఆమె స్నేహితురాలైన శ్రీమతి స్వర్ణలతగారు. మా అమ్మాయికి మే 27న సుఖప్రసవం అయ్యాక హేమగారు మా అమ్మాయిని 10 రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉంచుకుని స్నానం చేయించి పంపారు. ఆ తరువాత 15 రోజులు శ్రీమతి స్వర్ణలతగారు మా అమ్మాయివాళ్ళ ఇంట్లో ఉండి తనను కంటికి రెప్పలా చూసుకున్నారు. ఇది కేవలం శ్రీసాయి వాళ్ళకు ఇచ్చిన ప్రేరణ, మాకు కలిగించిన ఓదార్పు.

రెండవ అనుభవం - అమెరికా ప్రయాణానికి బాబా సాయం:

పైన చెప్పినట్లు మా అమ్మాయికి ప్రసవం అయ్యాక జూన్, 2020 నుంచి అమెరికాకు విమాన సర్వీసులు ప్రారంభమైనప్పటికీ మాకు సెప్టెంబరు మొదటివారం దాకా బాబా ప్రయాణానికి అనుమతిని ఇవ్వలేదు. ఆయన అంతా మంచి చేస్తారని ఎంతో ఓర్పుతో ఎదురుచూశాక సెప్టెంబరులో సాయి సందేశం అందింది, ‘మీరు అమెరికా వెళ్ళవచ్చు’ అని. బాబా అనుమతితో ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుని, అందులో భాగంగా సెప్టెంబరు 23వ తేదీన కోవిడ్ పరీక్షలు చేయించుకున్నాము. ఎంతో ఆందోళన చెందిన మాకు సెప్టెంబరు 24, గురువారం మధ్యాహ్న ఆరతికి ముందు కోవిడ్ నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది. ఆనాడు మా శ్రీమతి, “మమ్మల్ని చేయిపట్టుకుని అమెరికా తీసుకువెళ్ళమ”ని బాబాను ప్రార్థించింది. తన ప్రార్థనకు మా ఇంట్లో పటములోని బాబా ‘అలాగే’ అని తల ఊపారు. మేము సెప్టెంబరు 27న ఎయిర్ ఇండియా విమానంలో హైదరాబాదు నుండి ఢిల్లీకి, ఆరోజు రాత్రి ఢిల్లీ నుండి చికాగోకి విమానాలలో సీట్లు బుక్ చేసుకున్నాము. అనేక అపోహలు పడిన మాకు విమానంలో చక్కటి ఏర్పాట్లుగా సీటు వదలి సీటు కేటాయించి, చక్కటి ఆహారం అందేలా బాబా చూసుకున్నారు. ఆ తరువాత అమెరికాలోనూ ఎటువంటి ఇబ్బందులు రాకుండా బాబా చూసుకున్నారు. మన కోరికలు తీర్చే కల్పవృక్షమైన శ్రీసాయి పాదాలకు సర్వస్యశరణాగతి చేస్తున్నాను. “బాబా! అందరినీ కాపాడండి. కరోనాను పారద్రోలండి”.

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి 


బాబా లీలలకు ప్రత్యక్ష నిదర్శనమైన అనుభవం

సాయిభక్తుడు వైద్య వెంకటేశ్వర్లు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

భగవాన్ శ్రీసాయి బంధువులకు నమస్కారం. నా పేరు వైద్య వెంకటేశ్వర్లు. మాది జగిత్యాల జిల్లా, వెల్గటూర్ మండలం, స్తంభంపల్లి గ్రామం. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. రెండున్నర నెలల క్రితం మా చిన్నాన్న చనిపోయారు. ఆనవాయితీ ప్రకారం మా చిన్నమ్మను, తన ఇద్దరు కొడుకులను (మా తమ్ముళ్ళను) అక్టోబరు 7వ తారీఖు, బుధవారంరోజు మా ఇంటికి నిద్రకు తీసుకువచ్చాము. మరుసటిరోజు గురువారం మంచిర్యాలలోని వాళ్ళింటికి సొంత కారులో వెళ్తుండగా మార్గమధ్యంలో వాళ్ళ కారు ప్రమాదానికి గురైంది. కారులో చిన్న జెండాలు పెట్టడానికి ఉంచిన ఒక లోహపుకడ్డీ పైనున్న బొడిపెతో సహా కారు ముందుభాగంలో కూర్చున్న మా తమ్ముడు వేణుమాధవ్ కంటి కొలికి దగ్గర గుచ్చుకొని వంకరపోయి లోపలి వరకు దిగిపోయింది. చిన్నమ్మకి ఎడమచేయి మోచేతి కీలు పూర్తిగా తొలగిపోయి వదులుగా వ్రేలాడింది. వారిద్దరినీ కరీంనగర్ ఆస్పత్రిలో చేర్పించాము. ఆరోజు నేను పూజగదిలోకి వెళ్ళి బాబాకు నమస్కరించి, “బాబా! మా చిన్నమ్మ, తమ్ముళ్ళు మా ఇంటికి వచ్చి వెళ్తుండగా వాళ్ళకు ప్రమాదం జరిగింది. వాళ్ళను ఎలాగైనా నువ్వే కాపాడాలి” అని ఆర్ద్రంగా బాబాను వేడుకున్నాను. ఆశ్చర్యకరంగా, ఎలాంటి అనస్థీషియా గానీ, ఆపరేషన్ గానీ లేకుండా బాబానే డాక్టర్ కిషోర్ రూపంలో వచ్చి మా తమ్ముడి కంటి దగ్గర గుచ్చుకున్న లోహపుకడ్డీని తొలగించారు. తన కంటిచూపుకు కూడా ఎలాంటి సమస్యా రాలేదు. తరువాత కంటి డాక్టర్ దగ్గరకు వెళ్ళగా మా తమ్ముడిని పరీక్షించి, “ఒక నేత్ర వైద్యనిపుణుడు లేకుండా ఆ లోహపుకడ్డీని ఎలా తొలగించారు?” అని ఆ డాక్టర్ ఆశ్చర్యపోయాడు. కారులో దొరికిన మరో జెండా కడ్డీని పరిశీలించగా దానికి ఉన్న పైన బొడిపె ఊడి వచ్చింది. అప్పుడు అనిపించింది, కంటిభాగంలో నుంచి కడ్డీని తొలగించే ప్రయత్నంలో ఆ లోహపు బొడిపె లోపలే ఊడిపోయివుంటే పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చేది. కానీ బాబా దయవల్ల ఇవేమీ జరగలేదు. మా తమ్ముడు సురక్షితంగా ఉన్నాడు. మా చిన్నమ్మ చేతికి కూడా ఎలాంటి ఆపరేషన్ లేకుండా కేవలం సిమెంట్ పట్టీ వేశారు. ‘ఒకవేళ సిమెంట్ పట్టీతో సెట్ కాకపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుంద’ని డాక్టర్ చెప్పారు. బాబా కరుణ వల్ల మా చిన్నమ్మ చెయ్యి కూడా త్వరలోనే సెట్ అవుతుందని ఆశిస్తున్నాను. నా మొర ఆలకించి మావాళ్ళను సురక్షితంగా ఉంచినందుకు బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. వాళ్ళు తొందరగా కోలుకోవాలని మరోసారి బాబాను వేడుకున్నాను. బాబా లీలలకు ఇది ప్రత్యక్ష నిదర్శనం.



15 comments:

  1. 🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏
    శరణాగతవత్సలా ధీనభాందవా,
    షిరిడీ నివాసా సాయినాధా శిరసా నమామి

    ReplyDelete
  2. Baba maku enduku ela jargutundhi nenne namukunnamu kada thandri maku e bhadala nichi vimukti cheyi sai baba mamulanu sarvada rakshinchu thandri

    ReplyDelete
  3. Raksha raksha sai raksha

    ReplyDelete
  4. ఓంసాయి శ్రీసాయి జయజయసాయి

    ReplyDelete
  5. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  6. ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  7. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🤗🌺😃🌼😀🌸🥰🌹💕

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo