సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

2018 అక్టోబర్ 3 నాటి నా శిరిడీ ప్రయాణంలో విశేషాలు -- మూడవ భాగం.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

నిన్నటి తరువాయి భాగం.....

మరుసటిరోజు అంటే 4వ తేది శుక్రవారం సాయంత్రం బాబాయిగారిని అన్న ప్రసాదాలయానికి ఒక ఫ్రెండ్ తీసుకుని వెళ్ళాడు. నేను, ఇంకో ఫ్రెండ్ నాకు తెలిసిన(కేవలం వాట్సాప్ లో అప్పుడప్పుడు పలకరింపు మాత్రమే) ఒక అతనిని కలవడానికి నందదీపం వద్దకు వెళ్ళాము. అక్కడ అతనిని కలిసి మాట్లాడుతూ ఉన్నాను. ఆ మాటలలో అతను ఎటువంటి సందర్భం లేకుండా అసంబద్ధంగా, "బాబా మీకోసం చాలా ఉన్నతమైనది ప్లాన్ చేసుకొని ఉంటారు. మీరు ఏదీ పదేపదే అడిగి ఆయనను బలవంతపెట్టవద్దు. అలా చేస్తే మీ బాధ చూడలేక ఆయన అది ఇస్తారు. అప్పుడు ఆయన ఇవ్వదలుచుకున్నది మీరు మిస్ అవుతారు, లేదా ఆలస్యం అవుతుంద"ని చెప్పారు. మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, ఆ మాటలు నేను బాబాను అడుగుతున్న ఒక విషయానికి సమాధానాలు. నిజానికి నా శిరిడీ ప్రయాణానికి నెల ముందునుండి నా జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యవిషయమై ప్రతిరోజూ నేను బాబాని అడుగుతూ, "నా ఈ శిరిడీ ప్రయాణంలో ఎలాగైనా నాకు మీరు సమాధానం చెప్పండి బాబా!" అని చాలా దృఢంగా బాబాని ప్రార్థిస్తూ ఉన్నాను. అతని నోట ఆ మాటలు వినగానే బాబా నా ప్రశ్నకు జవాబు ఇచ్చారని గ్రహించి వెంటనే, "బాబా! నన్ను క్షమించండి. ఇకపై మిమ్మల్ని పదేపదే అడగను. మీరు ఇవ్వదలుచుకున్నదే ఇవ్వండి" అని మనస్సులోనే బాబాకు చెప్పుకొని అప్పటినుండి ప్రశాంతంగా ఉన్నాను. నేనసలు అతనితో నా సమస్య గురించి మాట్లాడలేదు. అతను చెప్పే మాటలు నాకు సమాధానం అవుతాయని అతనికీ తెలీదు. అంతా బాబా లీల. సర్వాంతర్యామి అయినా బాబా ఏ రూపంలో అయినా మన ప్రశ్నకు సమాధానం ఇస్తారు.

తరువాత మా ఫ్రెండ్ ప్రసాదాలయం నుండి వచ్చాక బాబాయిని రూములో ఉండమని చెప్పి మేము టిఫిన్ చేయడానికి వెళ్ళాం. తీరా మేము వెళ్లేసరికి బ్రెడ్ బజ్జీ షాప్ మూసి ఉంది. సరే, ఇంకేం చేస్తాం? ఇప్పటికే పల్లకి ఉత్సవానికి సమయమైపోతుంది, ఏదో ఒకటి తిందామని వేరే హోటల్ కి వెళ్లి టిఫిన్ చేసాము. తరువాత చావడి వద్దకు చేరుకొని పల్లకీ ఉత్సవాన్ని చూశాము. పల్లకీ ఉత్సవానంతరం లస్సీ త్రాగుదామని ద్వారకామాయి మీదుగా వెళ్తున్నాము. ఆశ్చర్యం! అక్కడ బ్రెడ్ బజ్జీ ప్రసాదంగా ఎవరో పంచుతున్నారు. మా ముగ్గురికి ఒకటే ఆశ్చర్యంగా అనిపించింది. ఏదో మా మనస్సులో కలిగిన చిన్న కోరికకు బాబా ఆలా అనుగ్రహిస్తారని మేమసలు ఊహించలేదు. చిన్న విషయమే అయినా మాకు చాలా అద్భుతంగా అనిపించింది. బాబా మాపై చూపిన ప్రేమను మేము ముగ్గురం చాలా ఎంజాయ్ చేసాము. ఆయన కరుణను తలుచుకుంటే హృదయం ద్రవించిపోతుంది.


శుక్రవారంనాడు శేజారతికి క్యూలో వెళ్ళినపుడు సమాధిమందిరం హాలులో బాబాకి ఎదురుగా ముందు వరుసలలో చోటు దొరికేలా బాబా అనుగ్రహించారు. మొత్తం మూడున్నర రోజులలో బాబాను పదిసార్లు దర్శించుకున్నాను. అందులో ఎనిమిదిసార్లయితే 10 నుండి 15 నిముషాలు తగ్గకుండా తమని దర్శించుకొనే భాగ్యాన్నిచ్చారు బాబా. ఒకసారైతే దాదాపు 40 నిమిషాలపాటు దర్శించుకొనే మహద్భాగ్యాన్ని అనుగ్రహించారు బాబా. అంతటి భాగ్యాన్ని కల్పించిన మీకు శతకోటి ప్రణామాలు బాబా! వీలైనంత వరకు ద్వారకామాయి, చావడి, సమాధిమందిరం ఎక్కడ వీలయితే అక్కడ ప్రతి ఆరతికి హాజరు అయ్యాము. ఇలా చాలా హ్యాపీగా గడిచింది సమయం. 

ఇంకో ముఖ్య విషయం. నా శిరిడీ ప్రయాణం మొదలుపెట్టి శ్రీకాకుళం నుండి హైదరాబాదు చేరుకోనేసరికి బాబా నాకు సంతోసకరమైన వార్త అందించారు. అదేమిటంటే, "సద్గురులీల పత్రిక" ఎడిటర్ & పబ్లిషర్ మల్లిబాబు గారు ఫోన్ చేసి "నేను మీ 'సాయి మహారాజ్ సన్నిధి బ్లాగు' చూసాను, చాలా బాగుంది. మంచి మంచి అనుభావాలు ప్రచురిస్తున్నారు. మీరు అనుమతిస్తే వాటిని మా పత్రికలో ప్రచురించుకుంటామ"ని అడిగారు. ఆయన మాటలు మన బ్లాగుకి బాబా ఆశీస్సులుగా అనిపించి నాకు చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే నేను ఆయనతో "ఇది మన బాబా బ్లాగు. సంతోషంగా పత్రికలో ప్రచురించుకోండ"ని చెప్పాను. 

ఇంతలా అనుగ్రహించిన మీకివే నా హృదయపూర్వక నమస్కారములు బాబా!
సమాప్తం...

2018 అక్టోబర్ 3 నాటి నా శిరిడీ ప్రయాణంలో విశేషాలు -- రెండవ భాగం.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

ముందు భాగం కోసం ఈ అక్షరాలపై క్లిక్ చేయండి...

నిన్నటి తరువాయి భాగం.... 

తరువాత అదేరోజు అంటే 3వ తేదీ సాయంత్రం ద్వారకామాయి ఎదురుగా ఉన్న లైన్ లో టీ త్రాగుతున్నాము. దానికి ఎదురుగా బ్రెడ్ బజ్జీలు అమ్మే షాప్ ఉంది. అక్కడ బ్రెడ్ బజ్జీ చాలా బాగుంటుందని, మా ఫ్రెండ్ "రేపు రాత్రికి మనమంతా టిఫిన్ చేయాలి కదా! బ్రెడ్ బజ్జీ తీసుకుందాం" అన్నాడు. మేము కూడా సరే అనుకున్నాము. మాలో ఒక ఫ్రెండ్ అంతవరకూ ఎప్పుడూ పల్లకి ఉత్సవం చూడలేదు. మరుసటిరోజు గురువారం కావడంతో పల్లకి ఉత్సవం చూద్దామని కూడా అనుకున్నాము.

తరువాత మేము ఖండోబా ఆలయానికి వెళ్ళాము. అక్కడ జరిగిన ఒక విషయం మీరందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే అప్పుడే మీరందరూ కాస్త జాగ్రత్తగా ఉండగలుగుతారు. అక్కడ మేము, మాతోపాటు మరికొందరు సాయిభక్తులు ఖండోబా దర్శనం చేసుకుంటూ ఉండగా ఒకతను వచ్చి సాయిబాబా, మహల్సాపతి గురించి చెప్తానని మొదలుపెట్టాడు. సరే ఏమి చెప్తాడో చూద్దామనుకున్నాము. అతడు చాంద్ పాటిల్ పెళ్లిబృందంతో బాబా శిరిడీ వస్తే మహల్సాపతి బాబాకు 'సాయి' అని నామకరణం చేయడంతో మొదలుపెట్టాడు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఆ తరువాత చెప్పినది ఎంత అసంబద్ధమైన కథనమంటే, "బాబాకి శిరిడీ వచ్చేటప్పటికి ఏ శక్తులూ లేవని, అక్కడ ఖండోబాను మూడు సంవత్సరాలు సేవించి శక్తులు పొందార"ని కట్టుకథ అల్లుతూ పోయాడు. చివరకు సముద్రంలో దొరికిన మూలికలు, గవ్వలు, శంఖం లాంటివి ఒక చిన్న దండలా కట్టి వాటిని ఆ టెంపుల్ లో ఏదో పూజ చేసి ఇస్తామని, దానిని మీ ఇంటి ద్వారానికి కట్టుకుంటే మంచి జరుగుతుందని, దాని వెల 500 రూపాయలని చెప్పాడు. బాబా నుండి తన భక్తులకు లభించే రక్షణ ఎటువంటిందో తెలిసిన మనం ఇటువంటి ప్రలోభాలకు లోను కావడం ఎంత అవివేకం! ఇంతేకాదు, శిరిడీ నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక టెంపుల్ ఉంది. అక్కడి దేవుడు శిరిడీ క్షేత్రపాలకుడని, ముందు ఆయన్ని దర్శించుకోవాలని కథనాలు కూడా వినబడుతున్నాయి. పరిశీలిస్తే ఆ టెంపుల్ కట్టింది, అక్కడి దేవుడిని ప్రతిష్ఠించింది  2000 - 2010 మధ్యలో. ఈ చెప్పే కథలకి, బాబా చరిత్రకు ఎటువంటి పొంతన లేదు. సాయిచరిత్రపై ఏదో కొంత అవగాహన ఉన్నవాళ్లు ఇటువంటి వాటిని గ్రహిస్తారుగాని, తెలియని వాళ్ళ పరిస్థితి మీరే ఊహించండి. ఇటువంటి కట్టుకథలు నమ్మడమేల? మరికొందరు గురువులమని, శిరిడీలో అన్నదానం చేస్తున్నామని బోర్డు పెట్టి భక్తులను ఆకర్షిస్తున్నారు. తీరా అక్కడికి వెళ్ళాక ఆ పెద్దమనిషి ఆశీస్సులు తీసుకోమని, డొనేషన్స్ కట్టమని చెప్తున్నారు. బాబా వంటి మహాత్ముని ఆశ్రయించిన మనం వేరే వాళ్ళ ముందు ఆశీస్సులకోసం శిరస్సు వంచవలసిన అగత్యమేమిటి? అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉందా? శిరిడీ క్షేత్రంలో బాబా సమక్షంలో ఇటువంటివి జరగడం కడు శోచనీయం. నా మనసుకెంతో బాధ కలిగించిన పై వివరాలు చెప్పి ఎవరినీ నొప్పించాలన్నది నా ఉద్దేశ్యం కాదు. తెలియక ఎవరి భావాలనైనా నొప్పించి ఉంటే మన్నించండి. సాయిబంధువులు కాస్త వివేకంతో అలోచించి ఎవరికి వాళ్లే నిర్ణయించుకొని మాయలో పడకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో మాత్రమే ఇదంతా మీకు తెలియజేశాను.

బహుశా పైన చెప్పినటువంటి సంఘటనలనే ప్రస్తావిస్తూ సాయిభక్తులకు ప్రామాణికమైన 'శ్రీ సాయి సచ్చరిత్ర' గ్రంథంలో క్రింది విధంగా ఉంది.

ముంబాయి, పూణే, గుజరాత్, కలకత్తా, మద్రాసు మొదలగు శిరిడీ నుండి చాలా దూరంగా ఉన్న ప్రదేశాలలో శ్రీ సాయి మహారాజు యొక్క ఉత్సవాలను శోభాయమానంగా జరుపుతారు. అట్లే అనేక ప్రాంతాల నుండి అసంఖ్యాకంగా ప్రజలు సాయిబాబా సమాధిని దర్శించుకోవటానికి ప్రతిరోజు శిరిడీకి వస్తారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచన ఇవ్వాలనిపిస్తుంది. "నేను శ్రీవారి శిష్యుణ్ణి, బాబా నాతో ప్రత్యక్షంగా మాట్లాడుతారు, మీకోసం ఫలానా సందేశాన్నిచ్చారు, మీ మాటలు నేను బాబాతో చెప్తాను, మీ పని త్వరగా అవుతుంది" మొదలగు పెత్తనందారి(దాదాగిరి) మాటలు అక్కడక్కడా చెలరేగుతున్నట్లు కనిపిస్తుంది. అంతేకాదు, ప్రత్యక్షంగా శిరిడీలో కూడా అటువంటి వారున్నారు. - ఇటువంటి ప్రచారం శిరిడీకి మొదటిసారిగా వచ్చిన గృహస్థులకు శిరిడీ గురించి విశేషంగా తెలియక పోవటంవలన ఇటువంటి పెత్తనందారుల మాటలలో చిక్కుకోవటం సంభవిస్తుంది. శ్రీ సాయిబాబా ప్రత్యక్ష పరమేశ్వరులు కనుక మనసుతో ప్రార్థన చేస్తే అది వారికి అందుతుంది. దానికోసం మధ్యవర్తుల అవసరంలేదు. శ్రీ సాయిబాబా యొక్క వేలమంది భక్తులకు ఇది అనుభవం. వారి సమాధి దర్శనం, వారి స్మరణ, మననం, ధ్యానం వగైరా చేస్తే ఈ అనుభవం ఖచ్చితంగా కలుగుతుంది. శ్రీ సాయిబాబా కాలంలో కూడా ఇటువంటి మోసగాళ్లు అక్కడికి వచ్చి బాగా అవమానపడి వెనుతిరిగి వెళ్లేవారు. 

- శ్రీ సాయి స్చచరిత్ర(నాగేశ్ ఆత్మారాం సావంత్ గారు వ్రాసిన రెండు మాటలు).

తరువాయి భాగం కోసం ఈ అక్షరాలపై క్లిక్ చేయండి......

 

ముందు భాగం కోసం

బాబా పాదుకలు తాకండి...

 

తరువాయి భాగం కోసం

బాబా బంగారు పాదాలు తాకండి...

 


  

2018 అక్టోబర్ 3 నాటి నా శిరిడీ ప్రయాణంలో విశేషాలు -- మొదటి భాగం.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

ఈ శతాబ్ది ఉత్సవాల సమయంలో బాబా అనుగ్రహంతో నేను 2018 అక్టోబర్ 3న శిరిడీ సందర్శించి బాబాను దర్శించి ఆయన అశీస్సులు పొందాను. అప్పటి నా అనుభవాలను సాయిబంధువులతో పంచుకోవాలనుకుంటున్నాను.

బాబా అనుగ్రహంతో శిరిడీ దర్శించానని ఎందుకు అన్నానంటే, నిజంగా అక్టోబర్ లో నా శిరిడీ ప్రయాణం బాబా నిర్ణయమే. మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయి చాలా రోజులుగా శతాబ్ది ఉత్సవాల సమయంలో ఒక్కసారైనా శిరిడీ వెళ్లాలని పట్టుబడుతున్నారు. ఆయనకి ఆ కోరిక చాలా దృఢంగా ఉంది. కానీ నవంబర్ నెలలో వెళ్లాలన్నది నా కోరిక. అదే విషయం నేను చాలాసార్లు మా ఫ్రెండ్ తో చెప్పాను. వీలయితే వాళ్ళ బాబాయికి నచ్చజెప్పమని కూడా చెప్పాను. మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయికి చెపితే ఆయన 'సరే, మీ ఇష్టం' అనేశారు కూడా. కానీ రెండు నెలల క్రితం నేను, మా ఫ్రెండ్ ఏ తేదీలలో వెళ్లాలని డిస్కస్ చేసుకుంటుండగా అనుకోకుండా బాబాయి కోసం అక్టోబరులో వెళ్ళాలా? లేక నవంబరులో వెళ్లాలా? అన్న సందిగ్ధంలో మళ్ళీ పడ్డాం. అప్పుడు మా ఫ్రెండ్, "బాబాను అడుగు, ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళదామ"ని అన్నాడు. సరేనని నేను బాబాను అడిగాను. ఆయన సమాధానం అక్టోబర్ అని వచ్చింది. ఇక వేరేమీ ఆలోచించకుండా బాబా నిర్ణయానికి కట్టుబడి మేము అక్టోబరులో ప్రయాణానికి రిజర్వేషన్ చేసుకున్నాము. అలా మా శిరిడీ ట్రిప్ ని బాబాయే నిర్ణయించారు. బాబాయిగారికున్న దృఢమైన కోరికను తీర్చి ఆయన మనస్సుకు సంతోషాన్నిచ్చారు బాబా.

ఇక ఎప్పుడెప్పుడు అక్టోబర్ నెల వస్తుందా, శిరిడీలో ఎప్పుడు అడుగుపెడతామా, ఎప్పుడు బాబా దర్శనం చేసుకుంటామా, అన్న ఆరాటంతో కాలం సాగింది. అయినా ఆ ఎదురుచూపులో ఒక మధురానుభూతి మనసును పులకింపజేస్తుండేది. మొత్తానికి రెండు నెలలు గడిచి అక్టోబర్ నెల వచ్చింది. ప్రయాణంలో ఎక్కువ సమయం బాబా ధ్యాసతోనే సాగింది. 3వ తేదీ ఉదయం 4.30కి ఔరంగాబాదు చేరుకుంది మేము వెళ్తున్న ట్రైన్. అప్పటినుండి మరో మూడు గంటలలో శిరిడీలో ఉండబోతున్నామన్న ఆనందం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ట్రైన్ దిగి బస్సు ఎక్కి ఎదురుగా బాబాను చూస్తూ, ఆయన స్మరణ చేసుకుంటూ కూర్చున్నాను. ఆసమయంలో ఒక గురుబంధువు "ఈరోజు తన పుట్టినరోజని, బాబా గురువుగారి బ్లెస్సింగ్స్ తీసుకోమ"ని మెసేజ్ పెట్టారు. గం. 7.15 నిమిషాలకి  మన సాయి తండ్రి నడయాడిన పుణ్యభూమి శిరిడీ చేరుకున్నాము. బాబాను తలచుకుంటూనే శిరిడీలో అడుగుపెట్టి, బాబా పాదస్పర్శతో పునీతమైన ఆ నేలను తాకి నమస్కరించుకున్నాను. ఇంక నా ఆనందాన్ని పదాలలో వ్రాయలేను. ఆ ఆనందంతో నేరుగా వెళ్లి ముందుగా 'ధూళి దర్శనం' చేసుకున్నాము. అన్నాళ్ల ఎదురుచూపు ఫలించి చక్కటి బాబా దర్శనమైంది. తరువాత రూమ్ కి వెళ్లి నేను, మా ఫ్రెండ్ ఒకతను స్నానం చేసి, ఇంకో ఫ్రెండ్ తో, "నువ్వు, బాబాయి స్నానాలు చేసి రెడీ అవ్వండి. ఈలోగా మేము టైం వ్యర్ధపరచుకోవడం నాకిష్టం లేదు. అందుకే చావడిలో బాబా దర్శనం చేసుకొని, తరువాత 'సాయిపథానికి' వెళ్లి గురువుగారి దర్శనం కూడా చేసుకొని వస్తాం" అని చెప్పి మేము బయటకు వచ్చి ముందుగా చావడికి వెళ్లి బాబా దర్శనం చేసుకొని ఆ గురుబంధువుని బ్లెస్ చేయమని బాబాను ప్రార్థించాను. తరువాత సాయిపథానికి వెళ్లి గురువుగారి దర్శనం చేసుకున్నాను. బాబా, గురువుగారి దర్శనం కావడంతో సంతృప్తిగా అనిపించింది. తరువాత గురువుగారిని కూడా గురుబంధువుని బ్లెస్ చేయమని ప్రార్థించాను.

తరువాత రూమ్ కి వెళ్లి అందరం కలిసి మధ్యాహ్న ఆరతికని క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్ళాము. అప్పటికే 11.30 దాటడంతో ఆరతికి క్యూలోనే ఉండిపోతామని మేమంతా అనుకున్నాము. కానీ బాబా అనుగ్రహ వర్షాన్ని కురిపించారేమో! నేరుగా తీసుకొని వెళ్లి సమాధిమందిరంలో కూర్చోబెట్టారు. మేమంతా ఆనందాశ్చర్యాల్లో మునిగిపోయాము. ఆరతి తరువాత చక్కటి దర్శనం కూడా లభించింది. ఆ దర్శనంలోనే నాకప్పగించిన సాయిబంధువుల ప్రార్థనలన్నింటినీ బాబాకు సమర్పించుకున్నాను. ఆ ప్రార్థనలలోని ఒక సాయిబంధువుకు అక్టోబర్ 11న పెళ్లి ఉండగా, పాపం వాళ్ళు గత రెండు నెలల నుండి ఎంతగా ప్రయత్నిస్తున్నా డబ్బు సర్దుబాటు కాలేదు. అందువలన వాళ్ళు చాలా ఆందోళనపడుతూ ఉన్నారు. రెండవ తేదీన ఆ అమ్మాయి వాళ్ళ అక్క నాకు ఫోన్ లో శిరిడీలో బాబాని ప్రార్ధించమని చెప్పారు.  భక్తులకు శ్రేయస్కరమైనప్పుడు, వాళ్లకు అత్యవసరమైనప్పుడు  బాబా అనుగ్రహంలో ఆలస్యమనేదే ఉండదు. నేను బుధవారం నాడు బాబాని ప్రార్ధిస్తే శుక్రవారం నాటికి బాబా దయవలన వాళ్లకు డబ్బు సర్దుబాటు అయిపోయింది. ఇంక వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. బాబా అనుగ్రహంతో ఆమె పెళ్లి అనుకున్న తేదీలో బాగా జరిగింది.

నా స్నేహితులంతా సాయంత్రం నా పుట్టినరోజు పార్టీకి వస్తారు. మీరు కూడా రండి సాయిబాబా!


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి


సాయిభక్తురాలు ప్రియ కృష్ణ గారు సాయి తనకి ఇచ్చిన మరపురాని మధురానుభూతిని గురించి ఇలా చెప్తున్నారు.

మమ్మల్ని చాలా ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేసిన ఆ అద్భుత అనుభవం ఇంట్లో అందరం చూస్తుండగా మా కళ్ళ ముందు జరిగింది. మా బాబుకి సాయి గొప్ప బహుమానం ఇచ్చారు.

2011వ సంవత్సరం నా జీవితంలో చాలా సంతోషాలని తీసుకొని వచ్చింది. ఆ సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన మా బాబు బాల్ విశిష్ట్ (చింకు) పుట్టినరోజు. ఎప్పటిలానే ఆరోజు చింకుని సాయి మందిరానికి తీసుకొని వెళ్ళాను. పూజ జరుగుతుండగా మధ్యలో చింకు నన్ను, "మమ్మీ, నేను సాయిని కూడా నా పుట్టినరోజు పార్టీకి పిలవనా?" అని అడిగాడు. నాకు సరిగా వినపడక చింకుని వెనక్కి తీసుకొని వెళ్లి అడిగితే వాడు మళ్ళీ, "సాయిని పుట్టినరోజు పార్టీకి పిలవనా?" అని అడిగాడు. "సరే అయితే, సాయి విగ్రహం దగ్గరకి వెళ్లి సాయిని ఆహ్వానించు" అని చెప్పాను. వాడు మరలా సాయి దగ్గరికి వెళ్లి తన చిన్న గొంతుతో, (తమిళ్ లో "నీనో బర్త్ డే పార్టీ కి వాఁ, bye") "సాయిబాబా! ఈరోజు నా పుట్టినరోజు. నా స్నేహితులంతా సాయంత్రం పార్టీకి వస్తారు. మీరు కూడా రండి" అని ఆహ్వానించి, సాయికి 'bye' చెప్పి వచ్చేసాడు.

సాయంత్రం పార్టీ చాలా బాగా జరిగింది. పార్టీలో చింకుకి చాలా గిఫ్ట్స్ వచ్చాయి. ఫంక్షన్ అయిపోయాక రాత్రి గిఫ్ట్స్ ఓపెన్ చేస్తూ ఉన్నాము. అప్పుడు రెడ్ కలర్ లో ఉన్న ఒక చిన్న బాక్స్ కనిపించింది. దానిని ఓపెన్ చేశాను, నాకు నోట మాట రాలేదు. అందులో ఏముందో తెలుసా? అందులో అందమైన చిన్న సాయి విగ్రహం ఉంది. ఆశ్చర్యమేమిటంటే ఆ గిఫ్ట్ ప్యాక్ పైన ఎవరి పేరూ వ్రాసిలేదు. సరే దానిని ఎవరు ఇచ్చారో చూద్దామని వీడియో చూసాము. వీడియోలో ఎవరూ రెడ్ బాక్స్ ఇచ్చినట్లుగా లేదు. దానితో అర్థం అయిపోయింది, అది బాబా లీలని. ఎలా చెప్పను నా సంతోషాన్ని? ఆ సంతోషంతో వెంటనే చింకుని పిలిచి, "నువ్వు సాయిని పిలిచావు కదా, ఇదిగో సాయి మనతో ఎప్పటికీ ఉండడానికి వచ్చారు" అని చెప్పాను. సాయిని మా పూజామందిరంలో పెట్టుకున్నాము. "సాయీ! నువ్వు కూడా రావాలి" అని పిలిచిన వాడి చిన్ని కోరికని తీర్చడం కోసం ఆ సాయినాథుడే వచ్చి నా చింకుని ఆశీర్వదించడం నా జీవితంలో మరుపురాని మధురానుభూతి.

ఓం సాయిరాం!!!

భక్తికి అపరిమితమైన శక్తి ఉంది.....


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

నార్త్ ఇండియా నుండి సాయిభక్తురాలు సగుణ్ గారి 2018 విజయదశమి నాటి అనుభవం:

నేను నా రీసెంట్ అనుభవాన్ని సాయిబంధువులందరితో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ప్రతి గురువారం మాకు దగ్గరగా ఉన్న బాబా మందిరానికి వెళ్తూ ఉంటాను. ఆ మందిరంతో నాకు చాలా అనుబంధం ఉంది. ఆ మందిరమే నాకు శిరిడీ. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు మన భావాలు బాబాతో పంచుకోవడానికి శిరిడీ వెళ్లలేము కదా! నా సంతోషం, దుఃఖం అన్నీ ఇక్కడి బాబాతోనే పంచుకుంటూ ఉంటాను. అందుకే ఈ మందిరం నాకు శిరిడీ కంటే తక్కువ కాదు. నాకెటువంటి ఫీలింగ్ కలిగినా మొట్టమొదటగా గుర్తు వచ్చేది ఈ బాబానే. ఆయనతోనే అన్నీ పంచుకుంటాను. అంతలా ఆ మందిరంలోని బాబాతో నా అనుబంధం ముడి వేసుకొని ఉంది. అటువంటిది ఈ శతాబ్ది సంవత్సరంలో ఆ మందిరంలో బాబాకు ప్రత్యేకంగా ఏమీ చేయట్లేదని తెలిసి నేను చాలా బాధపడ్డాను. అంతటా ఉన్న చిన్న చిన్న మందిరాలలో సైతం శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటూ ఉంటే ఈ మందిరంలో మాత్రమే చేసుకోకపోవడం ఏమిటన్న ఆలోచనే నా మనస్సుని కుదిపేసింది. అన్ని మందిరాలూ జనంతో కిటకిటలాడుతూ ఉంటే ఇక్కడ మాత్రం ఏ ఉత్సవం లేక వెలవెలబోతుందని నా మనస్సులో విపరీతమైన బాధను అనుభవించాను. "ఇలా జరగడం ఏమైనా బాగుందా బాబా?" అనుకున్నాను. అంతే! బాబా నా మనసులో ఒక ఆలోచన కలిగించారు. ఆరోజు ప్రత్యేకమైనదిగా చేయడానికి నేనే ముందడుగు వేద్దామనుకున్నాను. కాని ఒకరు, "మీరు ఒక్కరు చెప్పడం వలన ఏమవుతుంది? ఎవరు వింటారు?" అన్నారు. ఆ మాట నాలో విద్యుత్ ప్రవాహాన్ని కలిగించింది. అంతే! వేగంగా సాయి మందిరానికి వెళ్లి అక్కడ డెకరేషన్ వర్క్స్ చేసే వ్యక్తిని కలిసి మాట్లాడాను. అతను 100వ సంవత్సర బ్యానర్, బాబాకు పుష్పాలంకరణకు అంగీకరించాడు. నేను అతనికి చాలా ధన్యవాదాలు చెప్పాను. తరువాత నేను ప్రతిరోజూ మందిరానికి వచ్చే భక్తులతో మాట్లాడాను. వాళ్లు కూడా 19న విజయదశమి రోజున  కీర్తనలు చేయాలని, ఖిచిడీ ప్రసాద వితరణ చేయాలనీ ఆలోచిస్తున్నామని చెప్పారు. అలా అన్నీ ఒక పద్ధతి ప్రకారం బాబా కృపతో అమరిపోయాయి. నేను అనుకున్నదానికంటే అద్భుతంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. అవన్నీ చూసి నా కళ్ళనుండి ఆనందభాష్పాలు ప్రవహించాయి. మరో ముఖ్య విషయం - ఈ వేడుకలలో మైకులో బాబా భజనలు పాడే అవకాశం మొదటిసారిగా బాబా ఇచ్చారు. అంతేకాకుండా నా భుజాలపై బాబా పల్లకీ మోసే అవకాశం వచ్చింది. భక్తికి అపరిమితమైన శక్తి ఉందని ఋజువైంది. మంచి ఆలోచనలను బాబా 100% ప్రోత్సహిస్తారు. భక్తులంతా కలిసి బాబా ముందు భక్తిపారవశ్యంతో నృత్యం చేసాము. అంత అద్భుతమైన వేడుకలు నేను ఎప్పుడూ చూడలేదు. అంత గొప్పగా చేయించారు బాబా. నా ఊహకు మించి అందరూ పనిచేశారు. అలంకరణలు, భజనలు గొప్పగా జరిగాయి. అమితమైన ఆనందోత్సాహాలతో భక్తులు బాబా ప్రేమలో తడిసి ముద్దైపోయారు. మనోహరమైన అనుభవాన్ని,  మరపురాని అద్భుతమైన రోజును ఇచ్చినందుకు మీకు నా కృతజ్ఞతలు బాబా! ఎక్కడైతే ప్రణాళిక, కనీసం ఆలోచన లేదో అక్కడ బాబా అద్భుతమైన వేడుకలు చేయించారు. నా అనుభవాన్ని చదివినందుకు ప్రేమపూర్వక ధన్యవాదాలు.

ఓం సాయిరాం!

శిరిడీ వెళ్లలేకపోయినందుకు భక్తురాలు పడిన బాధ - బాబా ఇచ్చిన అద్భుతమైన అనుభవం.....


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలికి 2018, అక్టోబర్ 18న బాబా ఇచ్చిన అద్భుతమైన అనుభవం:

నేను హైదరాబాద్ లో ఉండగా నా తల్లిదండ్రులు మా సొంత ఊరిలో ఉంటున్నారు. అక్టోబర్ 16 సాయంత్రం వాళ్ళు బయలుదేరి హైదరాబాద్ వస్తే 17వ తేదీన మేము శిరిడీకి వెళ్లాలని అనుకున్నాము. అందుకోసం నేను 17 నుండి 20 వరకు సెలవు పెట్టాను కూడా. కానీ 17వ తేదీకి టిక్కెట్లు దొరకలేదు. దానితో నేను చాలా నిరాశకు లోనయ్యాను. మనసంతా ఒకటే దుఃఖం. శిరిడీ వెళ్ళడానికి ఎలాగూ టికెట్స్ దొరకలేదు కాబట్టి సెలవులు వ్యర్థపరుచుకోవడం ఎందుకని 17వ తేదీ ఉదయం మా సొంత ఊరికి బయలుదేరాను. కానీ శిరిడీ వెళ్ళలేకపోతున్నందుకు మనసంతా ఒకటే బాధ. ఊరు వెళ్ళాక కనీసం మరుసటిరోజు సాయంత్రమైనా విజయవాడ నుండి శిరిడీ వెళదామని చాలా ప్రయత్నించాను. ఈసారి 18వ తేదికి తత్కాల్ వెయిటింగ్ లిస్ట్ 19 వచ్చింది. irctc డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న తెలిసిన వ్యక్తి ద్వారా టికెట్స్ కన్ఫర్మ్ చేయించేందుకు మా అంకుల్ చాలా ప్రయత్నించారు. కానీ, "నా అనుమతి లేనిదే శిరిడీలో ఎవరు అడుగుపెట్టలేర"ని బాబా చెప్పారు కదా! ఈసారి కూడా నా ప్రయత్నాలు ఫలించలేదు. దానితో నా గుండె బద్దలైపోయింది. నేను శిరిడీ రావడం బాబాకి ఇష్టం లేదని, నాపై ఆయనకు ప్రేమలేదని కుమిలిపోయాను. శిరిడీ వెళ్ళలేకపోయినందుకు రెండు రోజులు ఏడుస్తూనే ఉన్నాను. గుండెలనిండా ఈ బాధతోనే నేను నా తల్లిదండ్రుల వద్ద ఉన్నాను. నా తల్లిదండ్రులు నన్ను ఆ బాధ నుండి బయటకు తీసుకురావడానికి చాలా ప్రయత్నించారు, కానీ ప్రయోజనం లేకపోయింది. మా అమ్మ, "మనం తరువాత వెళదాం. ఇప్పుడు చాలా జనం ఉంటారు. అందువలన గంటల తరబడి దర్శనం కోసం క్యూలో నిలబడి ఉండాలి. పైగా నీవు ఆశించిన విధంగా ఎక్కువసేపు దర్శనం కూడా చేసుకోలేవు, అక్కడ సెక్యూరిటీ వాళ్ళు బయటకు తోస్తూ ఉంటారు" అని చెప్పి నన్ను ఓదార్చడానికి ప్రయత్నించింది. కానీ నాకు దుఃఖం ఆగలేదు. కానీ, బాబా నావద్దకు వచ్చారు. ఇక్కడే, ఉన్నచోటనే ద్వారకామాయిలో ఉన్న అనుభూతిని నాకు కలిగించారు. అదెలాగో చెప్తాను.

మా ఇంటికి దగ్గరలో ఒక బాబా మందిరం ఉంది. అక్కడ మాకంతా పరిచయమే. మా అమ్మ రోజూ 2 చపాతీలు చేసి ఆలయంలో బాబాకు ఇస్తూ ఉంటారు. అదికాక మా ఊరిలో ఇంకో బాబా మందిరం కూడా ఉంది. అక్కడ 50 అడుగుల పెద్ద బాబా విగ్రహం ఉంది. అది చాలా ప్రసిద్ధి చెందినది. అక్కడికి చాలామంది యాత్రికులు కూడా వస్తుంటారు. మా అమ్మ, "సాయంత్రం ఈ రెండు మందిరాలకు వెళ్దాం, పెద్ద బాబా టెంపుల్ లో ఈరోజు పల్లకి సేవ కూడా ఉంటుంద"ని చెప్పింది. ఆమెను నిరాశపరచడం ఎందుకని నేను సరేనని చెప్పాను. ముందుగా మేము ఎప్పుడూ వెళ్లే మందిరానికి వెళ్లొచ్చిన తరువాత పెద్ద మందిరానికి వెళ్ళాము. అప్పటికీ నేనింకా శిరిడీ వెళ్ళలేకపోయినందుకు విచారంగానే ఉన్నాను. ఆలయ సమీపానికి వెళ్లి చూసేసరికి ఆలయం అత్యంత సుందరంగా అలంకరించబడి ఉంది. బాబా కోసం ఎన్నో అలంకరణలు చేసారు. ప్రతి ఒక్కరూ బాబాను చాలా స్పెషల్ గా చూడటం, ఆయనని ప్రత్యేకంగా అనుభూతి చెందేలా చూడటానికి వాళ్ళు ఎలా ప్రయత్నిస్తారో చూశాక నా మూడ్ కొంచెం మారింది. మందిరం లోపలికి వెళ్లి చూస్తే బాబా ఎంతో అందంగా ఉన్నారు. దృష్టి మరల్చుకోలేక అలా బాబా ను చూస్తూ ఉండిపోయాను. దర్శనానంతరం మేము పల్లకీ సేవకోసం వేచి ఉన్నాము. కొద్దిసేపటికి పల్లకీ సేవ మొదలైంది. నేను కూడా పల్లకీతో పాటు వెళ్ళాను. పల్లకీ మోసే అవకాశం బాబా నాకు కూడా ఇచ్చారు. 5 నిమిషాలకన్నా ఎక్కువ సమయం నా భుజాలపై బాబా పల్లకీ మోసే భాగ్యం బాబా నాకిచ్చారు. 15 నిమిషాల పాటు రోడ్డు మీద బాబాని పల్లకీలో ఊరేగించి మళ్ళీ ఆలయంలోకి తీసుకొచ్చి బయట ఉన్న 50 అడుగుల బాబాకి ఆరతి ఇచ్చారు. ఆ తరువాత మేము లోపలికి వెళ్లి శేజ్ ఆరతికోసం వేచి ఉన్నాము. ఆరతి కోసం డ్రమ్స్ ఏర్పాటు చేసారు. ఆ డ్రమ్స్ మోగిస్తూ ఆరతి చేస్తూ ఉంటే నేను ఇక్కడ లేను, శిరిడీలో నాకిష్టమైన ద్వారకామాయిలో కూర్చొని ఆరతి పాడుతున్న అనుభూతి కలిగింది. మీరు నమ్మలేరు, పూర్తి 20 నిమిషాలు నేను ఎక్కడ ఉన్నానో నాకే తెలియట్లేదు. నేను ఆరతి పాడుతూ ఉన్నాను, నా కళ్ళకి ఏమీ కనపడటం లేదు. నా చెవులకు మ్రోగుతున్న డ్రమ్స్, భక్తులు పాడుతున్న ఆరతి పాట తప్ప వేరేమీ వినపడటం లేదు. నా కళ్ళు మూతబడ్డాయి. నా కళ్ళ ముందు ద్వారకామాయి, సమాధి మందిరంలో బాబా మూర్తి కనపడుతూ ఉన్నాయి. నా కళ్ళ నుండి కన్నీళ్లు ధారాపాతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. కాసేపటికి కళ్ళు తెరిస్తే నేను శిరిడీలో లేనని అనుభవమైంది. కానీ అంతకుముందున్న ఆ విచార భావన నాలో లేదని గ్రహించాను. బాబా నన్ను శిరిడీ తీసుకొనివెళ్లి తమ దర్శనం చేయించి రెండు నిమిషాలలో మళ్ళీ ఇక్కడికి తెచ్చారని అర్ధమైంది. తరువాత మేము ఒక చిన్న బాబా విగ్రహాన్ని ఊయలలో పడుకోబెట్టాము. నేను ఉయ్యాల ఊపుతూ బాబాని నిద్రపుచ్చాను. ఇది ఒక అందమైన అనుభవము, పదాలలో సరిగా వర్ణించలేను.

తరువాత మా అమ్మ, "నువ్వు శిరిడీలో ఉన్నట్లయితే కనీసం పల్లకీని తాకగలిగే దానివి కాదు, కానీ ఇక్కడ 5 నిమిషాల కన్నా ఎక్కువ సమయం నీ భుజాలపై పల్లకీని మోశావు. నీ స్వహస్తాలతో ఊయల ఊపుతూ బాబాని నిద్రపుచ్చావు. ఒకసారి ఆలోచించు ... ఇవన్నీ నువ్వు శిరిడీలో చేయగలవా? ఇప్పటికీ నీకు బాధగా ఉందా? నువ్వు ఆయనను దర్శించుకోవడం, ఆశీస్సులు పొందడం ఆయనకు ఇష్టం లేదని నీకు ఇప్పుడు కూడా అనిపిస్తుందా?" అని నన్ను ప్రశ్నించింది. నాకు నోట మాట రాలేదు. ఎందుకంటే వాటికి నా దగ్గర సమాధానం లేదు. పైగా నేనింకా బాబా ఇచ్చిన ఆ అద్భుతమైన ఆధ్యాత్మికానందంలో ఉన్నాను, అస్సలు మాట్లాడే స్థితిలో లేను.

"బాబా! అద్భుతమైన ఆనందాన్ని మీరు నాకు ఇచ్చారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు".

ఓం సాయిరామ్!

ఓం శ్రీ సాయిరామ్ గురుదేవదత్తా....

వినాయక్ సీతారాం ముల్హేర్కర్


సాయిభక్తుడు వినాయక్ సీతారాం ముల్హేర్కర్ గారు తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు.

బాంద్రాలో ఉన్న థానే ఫారెస్ట్ డివిజన్ ఆఫీసులో నేను హెడ్ క్లర్క్ గా పనిచేస్తున్నాను. ప్రతిరోజూ ఆఫీసుకు నేను ప్యాసెంజర్ రైలులో లోయర్ పరేల్ నుండి బాంద్రాకు వెళ్తుంటాను. బాంద్రాలోని నా స్నేహితులలో చాలామంది శిరిడీ వెళ్ళి సాయిబాబాను దర్శించుకుంటూ ఉండేవారు. శిరిడీ నుండి వచ్చేటప్పుడు వారు 'ఊదీ ప్రసాదం', ఇంకా ఇతర వస్తువులూ తెస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు నాకు ఊదీ, ప్రసాదం యిస్తూ ఉండేవారు. కొంతమంది నా నుదిటి మీద ఊదీ రాస్తూ ఉండేవారు. నేను దానికి అభ్యంతరం చెప్పకపోయినా, కొంత అజ్ఞానం వల్ల, నా ఉద్దేశ్యం ప్రకారం నాకు వాటిలో నమ్మకం లేదని చెప్పేవాడిని. బాబా నుంచి పిలుపు వస్తే తప్ప నేను శిరిడీ వెళ్లదలచుకోలేదు. ఈవిధంగా చాలారోజులు గడిచాయి. అనేకమంది భక్తులు శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకొని వర్ణించ శక్యంకాని ఆయన లీలలను చెప్పసాగారు. తత్ఫలితంగా ముంబై, బాంద్రా, వాషీ, విరార్, ఆగాషి, దహను, ఉంబర్గావ్ నుంచి కూడా ప్రజలు శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకోవడం ప్రారంభించారు. కాని నేను మాత్రం బాబా ప్రేరణ ఇస్తే తప్ప శిరిడీ వెళ్ళకూడదనే నా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను.

ఇలా కొద్దిరోజులు గడిచాయి. ఒకరోజు నా పనులన్నీ పూర్తయిన తరువాత నిద్రకు ఉపక్రమించాను. మరుసటిరోజు గురువారం. ఆరోజు వేకువఝామున నాకొక చెప్పనలవికాని దివ్యదర్శనం కలిగింది. బాబాను దర్శించుకోవాలనే భావం కలిగి నిద్ర నుండి మేలుకొన్నాను. ఉదయాన్నే టీ త్రాగి 8గంటలకల్లా ఆఫీసుకు బయలుదేరాను. కొన్ని ముఖ్యమైన కాగితాల మీద బాస్ సంతకాలు తీసుకొన్నాను. తరువాత నేనాయనని, శిరిడీ వెడుతున్నాననీ, సెలవు కావాలని అడిగాను. వెంటనే ఆయన అందుకు ఒప్పుకొని, "సరే! శిరిడీ వెళ్ళడానికి కాబట్టి నీకు 3,4 రోజులు సెలవు ఇస్తాను. నేను కూడా నాసిక్ లో ఉన్న మా బంధువుల ఇంటికి వెళ్ళాలి. మనిద్దరం ఒకే రైలులో వెళదాము" అన్నారు.

నేను 11 గంటలకల్లా ఇంటికి వచ్చి నా భార్యతో, "ఈరోజు బాబా నుంచి శిరిడీకి రమ్మనమని పిలుపు వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం రైలుకు బయలుదేరుతున్నాన"ని చెప్పాను. ఆమె వెంటనే ఒప్పుకొంది, కానీ కాస్త భయపడింది. కారణం శిరిడీ చాలా దూరం, పైగా అది కొత్త ప్రదేశం, తెలిసిన వాళ్ళెవరూ ఉండరు. అందుచేత ఎవరినైనా తోడు తీసుకొని వెళితే మంచిదని, పైగా చలికాలమని చెప్పింది. తను చెప్పిన కారణాలన్నీ సరైనవే. అయినప్పటికీ శిరిడీ వెళ్ళాలనే నా కోరికముందు ఈ విషయాలేమీ నేను పెద్దగా పట్టించుకోలేదు. గురువారం ఉపవాసం ఉండి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని, స్టేషనుకి బయలుదేరాను. ఉదయానికల్లా కోపర్గాఁవ్ చేరుకొన్నాను. రైలు దిగగానే శిరిడీ వెళ్ళడానికి టాంగా కోసం చూస్తూ ఉండగా నా చిన్ననాటి మిత్రుడు డా.ఆర్.ఆర్.చౌబాల్ కనిపించారు. ఆయన కూడా అదే రైలులో వచ్చారు. నాలాగే ఆయన కూడా బాబాని దర్శించుకుందామని శిరిడీ వస్తున్నారు. మా యిద్దరి కోరికలు ఒకటే అవడంతో మా యిద్దరికీ ఎంతో సంతోషం కలిగింది. మేమెక్కిన టాంగా గోదావరి ఒడ్డుకు చేరగానే, నా బాల్యమిత్రుడు శ్రీగజానన్ కనేకర్ కి మా రాక తెలిసి, మమ్మల్ని అతిథులుగా తీసుకొని రమ్మని తన సేవకుడిని పంపించాడు. టాంగా ఇంటికి చేరగానే ఎంతో సంతోషించి మా సామానంతా దింపించి తన యింటిలో ఉండమని మాకు ఆతిథ్యం ఇచ్చాడు. కాస్త ఫలహారాలు కానిచ్చి, టీ త్రాగి, ఇక ఎక్కువసేపు ఉండలేమనీ, హారతి సమయానికి బాబా దర్శనం చేసుకోవాలని చెప్పి బయలుదేరాము.

మేమిద్దరమూ కాకాసాహెబ్ దీక్షిత్ వాడాలో బస చేసి కాకాసాహెబ్ దీక్షిత్ గారిని కలుసుకొన్నాము. ఆయన మాకు అన్ని ఏర్పాట్లు చేశారు. తరువాత మేము హారతికి వెళ్ళాము. బాబా దర్శనమవ్వగానే నాకెంతో బ్రహ్మానందం కలిగింది. వర్ణించనలవికాని ఉద్వేగభరితమైన ఆనందమది. అటువంటి ఆనందం అంతకుముందెప్పుడూ నాకనుభవం కాలేదు. బాబా పాదాలను స్పృశించడానికి ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేశాను. "నువ్వు శిరిడీ రావడానికి నా ప్రేరణ కావలసి వచ్చింది, అవునా?" అని బాబా అనగానే నాకెంతో ఆశ్చర్యం కలిగింది. నా మనసులో అదే ఆలోచన తిరుగుతూ ఉంది. ఆయన సర్వాంతర్యామి. ఆయన సర్వశక్తిమత్వాన్ని తెలుసుకొని మరొకసారి బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాను. బాబా తన కన్నులతోనే నన్ను దీవించి దగ్గరకు తీసుకొని లాలనగా బుజ్జగించి నన్ను పైకి లెమ్మన్నారు. డా.చౌబాల్ కూడా అప్పుడే బాబా దర్శనం చేసుకొన్నారు.

తరువాత మేమిద్దరమూ ఇక పూనా వెళ్ళబోయే ముందు బాబా వద్ద సెలవు తీసుకోవడానికి ఆయన దర్శనానికి వెళ్ళాము. బాబా, "నా భక్తుడొకడు బాంద్రాలో నీ దగ్గర వైద్యం చేయించుకొంటున్నాడు. అతని జ్వరం తగ్గి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడా?" అని డాక్టర్ ని అడిగారు. బాబాకు చౌబాల్ గురించి తెలియదు. ఆయన డాక్టర్ అని గాని, ఆయన బాంద్రాలో ప్రాక్టీస్ చేస్తున్నారని గాని ఎవరూ పరిచయం చేయలేదు. అయినా గాని బాబా తన భక్తుడికెలా ఉందని ఆయనను అడిగారు. డా.చౌబాల్ చాలా ఆశ్చర్యపోయారు. ఈ సంఘటనతో బాబా భగవంతుని అవతారమేనని మా నమ్మకం ఇంకా బలపడింది.

బాబాతో మాకదే మొదటి పరిచయం. ఇది కేవలం బాబా తన భక్తుల క్షేమం కోసం ఎంతగా కనిపెట్టుకొని ఉంటారన్నదానికి ఋజువు. బాబా ఎదుటివారి మనసులలోని భావాలను చదువగలరు. వారి మనసులో ఉన్నది తాను గ్రహించగలననే సూచనలు కూడా చేసేవారు. నా శిరిడీ యాత్రకు నా భార్య వెలిబుచ్చిన సందేహాలు సహేతుకమే అయినప్పటికీ, బాబా దర్శనానికి నా యాత్రలో ఎటువంటి చిక్కులూ ఏర్పడలేదు.

రెండవ అనుభవం:

నేను శిరిడీ చాలాసార్లు వెళ్ళడం వల్ల, కుటుంబమంతా ఒక్కసారైనా శిరిడీ వెళదామని నా భార్య అనడం మొదలుపెట్టింది. ఒకసారి నా కుటుంబంతో సహా శిరిడీ వెళ్లి, మేమందరమూ బాబా దర్శనానికి వెళ్ళాము. భక్తులందరూ బాబా సమక్షంలో కూర్చొని ఉన్నారు. నా భార్య కూడా అక్కడ ఉన్న ఆడవారి మధ్యలో కూర్చుంది. కుటుంబ జీవితంలో జరిగే విషయాలన్నీ బాబా వివరించి చెపుతున్నప్పుడు, బాబా వివరించేదంతా తన జీవితం గురించేనన్న విషయం నా భార్యకు అర్ధమై చెప్పలేని ఆనందాన్ననుభవించింది. ప్రతీవారు ఎలా నడచుకోవాలో బాబా అందరికీ వివరించి చెప్పారు. తరువాత నా భార్య బాబాకు ఎంత భక్తురాలిగా మారిందంటే, "బాబాని అడగండి, ఆయన ఎలా చెపితే అలా చేయండి" అని అనడం ప్రారంభించింది. అందుచేత ఒకసారి నేను నా కుమార్తె వివాహం గురించి బాబాని అడిగాను. "నీ నిర్ణయం సరియైనదే. అనుకున్న ప్రకారమే వివాహం జరుగుతుంది. అమ్మాయి కలకాలం సుఖంగా ఉంటుంది" అన్నారు బాబా. అనుకున్న ప్రకారమే అమ్మాయి వివాహం అనుకున్న అబ్బాయితోనే జరిగి సుఖంగా సంసారం చేసుకొంటోంది. బాబా, నా భార్య శిరసుపై చేయి ఉంచి ఆశీర్వదించారు. నా భార్య ఆ సంఘటనని స్పష్టంగా ఎప్పుడూ గుర్తుచేసుకొంటూ ఉంటుంది.

మూడవ అనుభవం:

నేనొకసారి పండరీపూర్ లో పాండురంగని దర్శించుకొని అక్కడి నుండి శిరిడీ వెళ్ళాను. పండరీపూర్ లో మహాద్వారం వద్ద ఒక మిఠాయి దుకాణం ఉంది. "నేను శిరిడీ సాయి దర్శనానికి వెళుతున్నాను, నీ దగ్గర మంచిరకం పాలకోవా పావుసేరు ఇమ్మ"ని షాపతనిని అడిగాను. అతను నాకు మంచి పాలకోవా ప్యాక్ చేసి యిచ్చాడు. మరునాడు నేను శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకొన్నాను. అప్పుడు బాబా, "ఈ పేడాలు పండరీపూర్ నించి నాకోసం తెచ్చావు కదా?" అన్నారు. "అవును బాబా, ఈ పాలకోవా మీకోసమే తెచ్చాను. మీరు వీటిని స్వీకరించి నన్ను ధన్యుడిని చేయండ"ని ప్రార్థించాను. "మంచిది, వీటిని నాకోసం తెచ్చావు" అని అంటూ రెండు పేడాలు తీసుకొన్నారు. మిగిలినవి నాకు తిరిగి యిస్తూ "శ్రీపాండురంగని ప్రసాదం" అన్నారు. ఆ పేడాలు పండరీపూర్ నుండి తెచ్చానని బాబా చెప్పడంతో ఆయన సర్వాంతర్యామి అని, ఆయన భక్తుల మదిలోని కోరికలను తీరుస్తారని నాకనుభవమయింది. ఈ అనుభవంతో బాబా దివ్యస్వరూపం, ఆయన గురించిన ఆలోచనలు నాలో భక్తి భావాన్ని రోజురోజుకీ పెంచసాగాయి.

నాల్గవ అనుభవం:

బాబా దర్శనానికి శిరిడీ వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంది. 2-4 నెలలకు ఒకసారి నేను శిరిడీ వెడుతున్నా నా ప్రయాణంలో ఎప్పుడూ ఎటువంటి అడ్దంకులూ ఎదురవలేదు. ఒకసారి నేను కీ.శే. శ్రీ నానాసాహెబ్ చందోర్కర్ తో కలసి శిరిడీ వెళ్ళాను. కోపర్గాఁవ్ లో దిగి గోదావరి నదిలో స్నానాదికాలు కానిచ్చాము. అక్కడ మేము నానాసాహెబ్ గారి బ్రాహ్మణుడు తయారుచేసి యిచ్చిన టీ త్రాగాము. నానాసాహెబ్ తనతో 5 శేర్ల పాలు తీసుకొని వచ్చారు. అక్కడ ముంబాయి నుండి వచ్చిన యాత్రికులు చాలామంది ఉన్నారు. వారు కూడా గోదావరిలో స్నానాలు చేసి తమ వారందరికీ టీ యిప్పించే పనిలో మునిగిపోయారు. ఈలోగా నానాసాహెబ్ అక్కడ వున్న పిల్లలందరికీ పాలు ఇప్పించడం ప్రారంభించగానే అక్కడున్న స్త్రీలు, పిల్లలు అందరూ కలసి చేసే హడావిడితో అంతా ఒక రణరంగంగా తయారయింది. నేను నానాసాహెబ్ గారి టాంగాలో కూర్చొని, ఆయన కూడా వచ్చి కూర్చోగానే బయలుదేరడానికి వేచి చూస్తున్నాను. నేను అక్కడ ఉన్న వారితో, "ఆయనకు యిబ్బంది కలిగించకండి. ఆయన సామాన్యమయిన వ్యక్తి కాదు. ఆయన జిల్లా డిప్యూటీ కలెక్టర్ గారు. ఆయన శిరిడీ సాయిబాబాకు పక్కా భక్తుడు" అన్నాను.

తరువాత మేమిద్దరమూ ఆరతి సమయానికి టాంగాలో శిరిడీ చేరుకొన్నాము. ఆరతి పూర్తయిన తరువాత మేము బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాము. బాబా నావైపు చూసి, "అయితే నానాసాహెబ్ పక్కా భక్తుడన్నమాట. మరి నీ సంగతేమిటి? నువ్వు కచ్చా భక్తుడివా?" అన్నారు. గోదావరి నది ఒడ్దున అక్కడి యాత్రికులతో నేనన్న మాటలు గుర్తుకువచ్చి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ప్రతి విషయంలోనూ బాబా తాను సర్వాంతర్యామినని, అందరి హృదయాలలోనూ తాను నివసిస్తున్నాననే అనుభవాలను కలిగిస్తూ వుంటారు. బాబా సర్వవ్యాపకత్వాన్ని స్పష్టంగా తెలియచేసింది ఈ సంఘటన. తన భక్తులందరూ అహంకారరహితులుగా, ఎటువంటి దర్పం లేకుండా జీవితాన్ని గడిపేలా ఉండటంకోసం తనలోని అపారమయిన జ్ఞానాన్ని తన భక్తులకు పంచిపెట్టారు బాబా. సంత్ రామదేవ్ విష్ణుమూర్తిని ఆయన భక్తులందరూ అహంకారరహితులుగా ఉండేలా అనుగ్రహించమని ఏవిధంగా ప్రార్ధించాడో, అదేవిధంగా న్యాయబధ్ధమయిన జీవితం గడిపేలాగా బాబా తన భక్తులకు ప్రేమతో కథలను చెప్పేవారు.

ఈరోజు వరకు నేను శ్రీసాయిబాబా దీవెనలను అనుభవిస్తూ ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాను. సంత్ తుకారాం చెప్పినట్లు "సాధుపుంగవుల చరణాలను ఒక్కసారి తాకితే చాలు, అహంకారమనే బీజం మాడిమసయిపోతుంది. సాధువుల పాదాల వద్ద మనం నమ్మకముంచాలి". సంత్ తుకారాం రచించిన అభంగాలలో ఈవిధంగా చెప్పారు: "చేతులు, పాదాలు, గంధపుచెక్కతో తయారుకాబడినా శరీరంలోని ఏ భాగమూ కూడా వానికంటే తక్కువ కాదు. దీపానికి లోపల, బయట చీకటనేది ఉండదు. చక్కెరకు లోపల బయటా కూడా తియ్యదనమే ఉంటుంది. ఆవిధంగానే ఒక మంచివ్యక్తిలో ఎటువంటి లోపాలు ఉండవు" అని.

- వినాయక్ సీతారాం ముల్హేర్కర్,
8/A, కాకడ్ ఎస్టేట్,
106, సీ ఫేస్ రోడ్,
వర్లీ, ముంబాయి - 400018.

ఆంగ్లానువాదం : జ్యోతిరాజా రౌత్.

source: 'సాయిలీల' పత్రిక నవంబరు - డిసెంబరు 2007

వంశపారంపర్యంగా చిన్ననాటి నుండి వేధిస్తున్న సమస్య బాబా ఊదీతో మాయం ....


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

అద్భుతాలలోకే అద్భుతమైన సాయి లీల ఒకటి నా జీవితంలో ఇటీవల జరిగింది. మా కుటుంబంలో వంశపారంపర్యంగా ఎడమచేయి వణికే జబ్బు ఒకటి ఉంది. మా కుటుంబసభ్యులలో చాలామంది ఈ సమస్యతో బాధపడ్డారు. అందులో నేనూ ఒకదాన్ని. ఆ సమస్య వలన నా ఎడమచేయి ఎప్పుడూ కొద్దిగా వణుకుతూ ఉంటుంది. అందువల్ల నేను నా ఎడమచేతితో గ్లాసునిండా నీళ్లుగాని, కప్పునిండా కాఫీగాని పట్టుకోలేను. ఏది పట్టుకున్నా కూడా విపరీతమయిన వణుకు వచ్చి అది నా చేతినుండి జారిపోయి క్రింద ఒలికిపోతుంది. కనీసం నేను నా ఎడమచేతితో ఒక స్పూన్ చక్కెర లేదా ఉప్పు కూడా పట్టుకోలేను. ఈ సమస్య వల్ల ఆఫీసులో, ఆఫీసు వాళ్ళతో బయటకి లంచ్ కి వెళ్ళాల్సి వచ్చినా నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. అందరూ నాకు నెర్వస్ ప్రాబ్లమ్ వుంది అనుకునేవారు.

ప్రతిరోజు పారాయణ గ్రూపులో నాకు కేటాయించిన ఒక అధ్యాయం పారాయణ చేస్తూ ఉంటాను. ఒక గురువారం నాటికి సచ్చరిత్ర పారాయణ పూర్తి అవడంతో బాబాకు ఆరతి ఇచ్చి నైవేద్యం పెట్టాను. తరువాత అన్నదానం కూడా చేసాను. తరువాత పారాయణ గ్రూపులో మళ్ళీ పారాయణ మొదలుపెట్టాము. ఆరోజు నాకు రెండవ అధ్యాయం కేటాయించారు. నేను పారాయణ పూర్తి చేసేసరికి చాలా దాహంగా అనిపించి కుడిచేతితో పెద్ద గ్లాసునిండా నీటిని పట్టుకొని మా ఇంటిలో ఉన్న పెద్ద బాబా ఫోటో ముందు నిలబడి బాబాని చూస్తూ,  “చూడండి బాబా! నేను ఇది కుడిచేతితో పట్టుకున్నాను. నా చిన్నతనం నుండి ఎడమచేతితో ఏదీ పట్టుకోలేను. ఇది నా జీవితంలో చాలా అవమానకరమైన విషయం" అని బాబాతో చెప్పుకుంటూ చాలా బాధపడ్డాను. అప్పుడే బాబాతో మాట్లాడుతుండగా నా మదిలో ఒక ఆలోచన వచ్చింది, "ఊదీని నీళ్ళలో కలుపుకొని నా ఎడమచేతితో త్రాగితే?!" అని. ఆ ఆలోచన ప్రకారమే నా ఎడమచేతితో గ్లాసు పట్టుకొని నీళ్లు త్రాగాను. ఆశ్చర్యం! మునుపటిలా చేయి వణుకుతూ నీళ్లు క్రింద పడిపోలేదు, కనీసం ఒక బొట్టు నీరు కూడా క్రింద పడలేదు. మళ్ళీ నిర్ధారించుకోవడానికి మరలా ఇంకో గ్లాసు నీళ్లు కూడా త్రాగాను. అప్పుడు కూడా నీళ్లు తొణకలేదు. తరువాత ఒక స్పూన్ తో ఉప్పు పట్టుకున్నా కూడా ఎటువంటి సమస్య లేదు. మనం శ్రద్ధ - సబూరి కలిగి ఉంటే చాలు, ఎటువంటి సమస్యకైనా బాబాయే పరిష్కారం చూపుతారు. వంశపారంపర్యంగా చిన్ననాటి నుండి నన్ను వేధిస్తున్న ఇంతపెద్ద సమస్యని బాబా తన ఊదీతో ఇట్టే పరిష్కరించేసారు. నా ఆనందానికి అవధులు లేవు. బాబా మనపై చూపే ప్రేమ అద్భుతం, అమోఘం. నా ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలి అనిపించి నా ఈ అనుభవాన్ని వ్రాస్తున్నాను. ఇప్పుడు కూడా నేను బాబా ఫోటో ముందు కూర్చొని నా ఎడమచేతితో ఫోన్ పట్టుకొని కుడిచేతితో టైపు చేస్తున్నాను.

ఓం సాయిరామ్.

నవ గురువార వ్రత అనుభవాలు.....


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా తెలియజేస్తున్నారు.

ఇది నా రెండవ అనుభవం, బ్లాగు ద్వారా సాయిబంధువులతో పంచుకోవాలని వ్రాస్తున్నాను. ఇదివరకు గర్భధారణ సమయంలో బాబా నాకు ఎలా సహాయం చేశారో మీతో పంచుకున్నాను. ఇప్పుడు నేను 'నవ గురవార వ్రతం' ద్వారా ఒక పెద్ద సంక్షోభం నుండి ఎలా బయటపడ్డానో తెలియజేస్తాను.

ఆఫీసులో నాకు చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదురు కావడంతో పని మీద శ్రద్ధ పెట్టలేకపోయాను. ఆ ఒత్తిడి కారణంగా పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోలేకపోయాను. అలా నిద్రలేని రోజులు చాలా గడిపాను. ఇట్టి పరిస్థితులలో ఎన్నోసార్లు నేను నవ గురువార వ్రతం గురించి చదివినప్పటికీ, వ్రతం మొదలుపెట్టే ధైర్యం చేయలేకపోయాను. కానీ ధైర్యం కూడదీసుకుని వ్రతం చేయాలని నిర్ణయించుకొని వ్రతం మొదలుపెట్టాను. వ్రతం మొదలుపెట్టిన వెంటనే బాబా కృప చూపారు. మొదటి గురువారం పూజ అయినప్పటి నుంచి నిద్ర లేకపోవడమంటూ ఎప్పుడూ లేదు. నెమ్మదిగా మనస్సుకు శాంతి చేకూరింది. చివరకు ఆఫీసు పరిస్థితులలో కూడా మార్పు వచ్చింది. 7వ గురువారం పూజ చేసేసరికి బాబా నాకు సహాయం చేయడానికి ఒక వ్యక్తిని పంపారు. నేను అతన్ని మొదటిసారి కలిసాను. అతనితో మాట్లాడాక మీటింగ్ హాల్ నుండి నేను నవ్వుతూ బయటకు వచ్చాను. ఇదంతా బాబా చేసిన అద్భుతమే. ఆ మీటింగ్ నుండి ఇంటికి వచ్చిన వెంటనే నా ఈ అనుభవాన్ని టైప్ చేసాను. "బాబా! ఎప్పుడూ నాకు ఇలాగే తోడుగా ఉండండి. మిగిలిన వ్రతాన్ని కూడా పూర్తి చేసేలా నాకు సహాయం చేయండి. మేము శిరిడీ రావడానికి ప్లాన్ చేసుకుంటున్నాం. మేము అక్కడకు వచ్చి, మీ దర్శనభాగ్యం త్వరగా పొందేలా మమ్ము అనుగ్రహించండి. ధన్యవాదాలు బాబా!"

అమెరికా నుండి మరో అజ్ఞాత సాయిభక్తురాలు ఇలా చెప్తున్నారు.


అందరికీ సాయిరామ్. నేను, నా భర్త, 17 నెలల బాబుతో అమెరికాలో ఉంటున్నాము. పెద్దవాళ్లెవరూ లేకుండా, వాళ్ళ సహాయం లేకుండా ఇంటి పని అంతా చూసుకోవడం ఇక్కడ చాలా కష్టం. నేనిప్పుడు రెండు అనుభవాలను మీతో పంచుకుంటాను.

చెవి ఇన్ఫెక్షన్(అలెర్జీ)తో మొదలుపెట్టి మా బాబు రెండు వారాలపాటు ఏదో ఒక జబ్బుతో బాధపడ్డాడు. నేను డాక్టర్ ని కలవడానికి వెళ్లిన ప్రతిసారీ 'సాయిసచ్చరిత్ర' నాతో తీసుకుని వెళ్ళేదాన్ని. బాబా దయవలన ఎల్లప్పుడూ మాకు మంచి మార్గనిర్దేశం లభించింది. బాబా కృపవలన మా బాబు త్వరగా కోలుకున్నాడు.

నేను, నా భర్త ప్రతి గురువారం సాయి పూజ చేస్తాము. 9 వారాలు పూర్తైన తర్వాత ఆలయంలోని భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తాము. ప్రతి 9 వారాల పూజ తరువాత బాబా మమ్మల్ని శుభ పరిణామాలతో ఆశీర్వదించారు. ఒకసారి నా భర్త i140 (యు.ఎస్.ఏ లో వర్క్ చేయడానికి చాలా ముఖ్యమైనది)కి దాఖలు చేసి 8 నెలలు అయినా ఆమోదింపబడలేదు. 9 వారాల పూజ పూర్తైన తరువాత అది ఆమోదింపబడుతుందని నేను, నా భర్త అనుకున్నాం. కానీ మా అంచనా తప్పింది. ఎందుకంటే, మా పూజ ఎప్పుడూ బాబాపట్ల శ్రద్ధతో కాకుండా, లౌకిక పరమైనదిగా ఉండేది. నేను నా తప్పు తెలుసుకొని బాబాకు క్షమాపణ చెప్పుకొని మళ్ళీ తాజాగా 9 వారాల పూజను మొదలుపెట్టాను. ఈసారి లౌకికపరమైన ఆలోచనలేవీ మనసులో రానివ్వకుండా చాలా శ్రద్ధగా ప్రేమతో పూజ చేశాను. సరిగ్గా 9 వారాల తర్వాత మేము i140 ఆమోదం పొందాము. తన భక్తులకు ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో బాబాకు తెలుసు. మనం మాత్రం అన్ని పరిస్థితుల్లోనూ బాబా పట్ల శ్రద్ధ - సబూరీ కలిగి ఉండాలి.

ఓం సాయిరాం.

ఎంతటి కష్టమైనా సహనంతో సాయిపాదాలు విడవకు, ఆయన అశీస్సులు తప్పక లభిస్తాయి...


ప్రియమైన సాయి బంధువులందరికి నమస్కారం. నా పేరు కీర్తి. 2018, సెప్టెంబర్ నెలలో బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలని వ్రాస్తున్నాను. నేను మహాపారాయణ (MP  - 64 - అమ్రిత - సాయి) గ్రూపులో ఉన్నాను. మేము ఆగస్టు 11న శిరిడీ వెళ్లి ఆగస్టు 14న తిరిగివచ్చాము. మా ప్రయాణానికి ముందు నుండే బాబా "నీతోనే ఉన్నానని" నాకు అనేక సూచనలిచ్చారు. నేను ఇంటినుండి బయటకు వెళ్లినప్పుడల్లా సీతాకోకచిలుకలు, నాణేలు, శిరిడీ అభిషేక జలం ఇలా ఏదో ఒక రూపంలో నన్ను ఆశీర్వదించారు. శిరిడీ వెళ్ళడానికి రెండు రోజుల ముందు బాబా సీతాకోకచిలుక రూపంలో నా గదిలోకి ప్రవేశించారు. అవి మా పెరటిలో చుట్టూ తిరుగుతూ ఉంటాయిగాని, ఇప్పటివరకు ఎప్పుడూ కూడా నా గది లోపలకి ప్రవేశించలేదు.(నా గైడ్, అర్చనగారు ఒకసారి నాతో సీతాకోకచిలుకలు దేవుని ఉనికిని తెలియజేస్తాయని, దైవదూతలని చెప్పారు. తరువాత నాకు కూడా నమ్మకం కలిగింది. ఎందుకంటే ఆవిడ చెప్పినప్పటి నుండి నేనెప్పుడూ బాబాను ప్రార్ధించినా ఆ సమయంలో నేను బైక్ నడుపుతున్న కూడా అద్భుతంగా ఒక సీతాకోకచిలుక నాకు ముందుగా వెళ్ళేది.  నా బాబా నాకు తోడుగా ఉన్నారని నాకనిపించేది. అందువలన ఇప్పుడు నా గదిలో సీతాకోకచిలుక రూపంలో బాబాను చూసేసరికి నా మనస్సు ఆనందంతో ఉప్పొంగింది. నా 5 సంవత్సరాల కూతురు కూడా "అమ్మా చూసావా! నేను చెప్పినట్లుగానే బాబా మన ఇంటికి వచ్చారు" అంటూ తను కూడా చాలా సంతోషించింది. బాబా "నేను మీతోనే ఉన్నాన"ని హామీ ఇస్తున్నారన్న సంకేతంగా తీసుకున్నాను. ఈ సంకేతంతో మా శిరిడీ యాత్ర సంతోషదాయకంగా ఉంటుందని భావించి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. కానీ మనస్సులో ఏదో ఒక మూలన మా ఈ ట్రిప్ లో ఏదో దుష్పరిణామం జరగవచ్చని, అయినా మీరు ఆందోళన చెందవద్దని బాబా చెప్తున్నారని కూడా అనిపించింది.

తరువాత మా పర్యటనలో వాహనాలపై, రెస్టారెంట్లో ఇలా ప్రతిచోట బాబా మాకు దర్శనం ఇస్తూ ఉన్నారు. ఆయన మాపై చూపుతున్న ప్రేమకు కృతఙ్ఞతలు చెప్పుకున్నాను. శిరిడీలో బాబా చక్కటి దర్శనాలతో మమ్మల్ని అనుగ్రహించారు. ఆగస్టు 14 మేము తిరిగి వచ్చే రోజు మా 5 ఏళ్ళ పాప తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడింది. నా హ్యాండ్ బ్యాగ్ లో తీసుకొని వెళ్లిన మెడిసిన్స్ నుండి తనకి మెడిసిన్ ఇచ్చాను. కానీ జ్వరం కొంతసేపు తగ్గినట్లు తగ్గి మళ్ళీ వచ్చింది. ఆ రాత్రి ఆలస్యంగా మేము ఇంటికి చేరుకున్నాము. అప్పటికీ తనకి జ్వరం ఎక్కువగా ఉంది. చాలా ప్రయత్నించాను కానీ జ్వరం తగ్గలేదు. మరుసటిరోజు మేము పిల్లల డాక్టర్ని సంప్రదించాము. దానితో 4-5 రోజులలో బాబా దయవలన తను కోలుకుంది. బాబాకు ధన్యవాదాలు చెప్పుకున్నాను. కానీ తను కోలుకున్న తరువాత నేను, నా 9 సంవత్సరాల పెద్ద పాప కూడా అవే లక్షణాలతో బాధపడ్డాము. బాబా దయవలన నేను 4రోజుల్లో కోలుకున్నాను కానీ మళ్ళీ నా చిన్న కూతురు జబ్బునపడింది. ఆ స్థితిలో ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం చాలా కష్టమైంది. అంతలో పెద్ద పాపకి కడుపునొప్పి కూడా మొదలైంది. నిజానికి అది ఎపి-గ్యాస్ట్రిక్ నొప్పి. డాక్టర్ అది యాంటీబయాటిక్స్ వాడటం వలన సైడ్ అఫక్ట్ వల్ల వచ్చిందని నిర్ధారించి కొన్ని యాంటాసిడ్స్ ఇచ్చారు. దానితో జ్వరం, జలుబు తగ్గాయి కానీ కడుపునొప్పి ఇంకా ఎక్కువైంది. తను "మమ్మీ, నా కడుపు చాలా నొప్పిగా ఉంద"ని పదేపదే చెప్తుంది. మేము వేర్వేరు గ్యాస్ట్రోఎంటరాజిస్టుల్ని సంప్రదించాము, అల్ట్రాసౌండ్  మొదలైనవి కూడా చేయించాము కానీ తనకా బాధనుండి ఉపశమనం లభించలేదు. ఇలా వారాలు గడుస్తున్నాయి. నేను ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను. బాబాయే నా ఏకైక ఆశ్రయం. ఆయనను ప్రార్ధించి ఊదీ తన పొట్టకి రాసి, నీళ్లలో కొంచం కలిపి రోజులో అనేకసార్లు ఇచ్చాను, ఇలా ప్రతిరోజూ చేసినా కూడా ఉపశమనం లభించలేదు.

ఈలోపు మా నాన్నగారు ఇంకో గాస్ట్రోఎంటరాలజిస్ట్ ని సంప్రదించమని సలహా ఇచ్చారు. మేము అక్కడికి కూడా వెళ్ళాము. ఆ డాక్టర్ కొన్ని మందులిచ్చి, కొన్ని ఆహార మార్పులను కూడా చెప్పి, 2 వారాల తరువాత రమ్మని చెప్పాడు. అయినా ఉపశమనం లేదు. నా బిడ్డ బాధని చూడలేక, తనకి ఏమి చేయలేక బాబా ముందు కూర్చొని ఏడుస్తూ మొరపెట్టుకున్నాను. ఒక బుధవారం రాత్రి, నేను సాయిభక్తులు అనుభవాలు ఆమెకు చెప్తూ ఉన్నాను. తను నొప్పి కారణంగా నేను చెప్పే వాటి మీద దృష్టి పెట్టలేకపోతుంది. కానీ నేను తనని శ్రద్ధగా వినమని పట్టుబట్టాను. నేను "బాబా త్వరలోనే వచ్చి నీ నొప్పినంతా తన జోలిలో వేసుకుంటార"ని తనకి చెప్పాను. ఈమాట నేను చాలాసార్లు చెప్పాను కూడా. కొంతసేపటికి తను నిద్రలోకి జారుకుంది. నేను దీనంగా సాయిని ప్రార్ధించి మహామృత్యుంజయ మంత్రాన్ని జపం చేశాను.

మళ్ళీ డాక్టర్ ని సంప్రదిస్తే అతను కడుపులో అల్సర్స్(పుండ్లు) ఉన్నాయేమో ఎండోస్కోపీ చేద్దామని చెప్పారు. అది చాలా అసౌకర్యవంతమైన పరీక్ష. అసలే చిన్నపిల్ల ఎలా తట్టుకుంటుందని నేను మరింత భయపడిపోయాను. డాక్టర్ మత్తు ఇస్తామని చెప్పినప్పటికీ, అలా చేయటానికి నేను సిద్ధంగా లేను. నేను నా బిడ్డని అంతటి బాధకు గురి చేయదలుచుకోలేదు.

ఇంతలో నా సాయి స్నేహితురాలు మమత(గత కొద్ది నెలలుగా ఆమె నాకు తెలుసు) గురువారం ఉదయం, నాకు ఒక బాబా చిత్రాన్ని మరియు ఒక సందేశాన్ని పంపించింది. ఆ మెసేజ్ క్రింద ఇస్తున్నాను.

హ్యాపీ అండ్ బ్యూటిఫుల్ మార్నింగ్ సాయి మార్నింగ్..

సాయిమా says,
"నమ్మకం మరియు విశ్వాసంతో నన్ను అడగండి. సహనంతో వేచి ఉండండి. మీరు అడిగేది ఏమైనా మంజూరు చేయబడుతుంది. మీకేదైతే సమస్య వచ్చిందో అది పూర్తిగా సమసిపోతుంది. ఇప్పటికే నేను మీ గృహంలోకి ప్రవేశించి కొత్త ఆశలు తీసుకొచ్చాను. మీ వేదనలన్నీ ముగుస్తాయి. నా ఆశీర్వాదాలు నీతోనే ఉన్నాయి. బిడ్డా! ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. అందుకోసమే నేను ఈ కలియుగంలో అవతరించాను. ప్రతిరోజూ జీవితానికి ఒక కొత్త అవకాశం. సంతోషంగా ఉండండి."

బ్లెస్సెడ్ సాయిమా రోజు

జై శ్రీ కృష్ణ

ఓం సాయిరామ్

"నేను ఇప్పటికే మీ ఇంటిలో ప్రవేశించాను" అన్న లైన్స్ చదివి నా కళ్ళ నుండి వస్తున్న కన్నీళ్లను నియంత్రించలేకపోయాను. పై వాక్యంతో నా కూతురు త్వరలో కోలుకుంటుందని బాబా నాకు హామీ ఇచ్చారని భావించాను.

తరువాత నేను "నా బిడ్డకు తగ్గేవరకూ నాకిష్టమైన టీ త్రాగన"ని బాబా ముందు ప్రతిజ్ఞ చేసాను. గురువారంనాడు అనాథ పిల్లలకు ఆహారం పెడతానని కూడా బాబాకి చెప్పుకున్నాను. కానీ ఒక గంట తరువాత కూడా నా కూతురికి నొప్పి ఉంది. అంతలో మమత గారు మంచి ఆరోగ్యం కోసం "జన్మ్ జన్మో జన్మి, శ్రీ చరణ్ శ్రీ భాగ్య సాయి" అన్న మంత్రాన్ని పంపించి వీలైనన్నీసార్లు ఆ శ్లోకం జపించమని చెప్పారు. వెంటనే నేను జపించడం మొదలుపెట్టాను. నా కళ్ళ నిండి కన్నీళ్లు కమ్ముకుంటున్నాయి, వాటిని బయటకు కనపడకుండా దాచడానికి ప్రయత్నిస్తున్నాను. "ఓ సాయి! ... ఇది నాకు చాలా కఠినమైన సమయం" అని బాబాను తలుచుకున్నాను. 

కొద్ది నిమిషాలలో నా కూతురు "మమ్మీ, ఇప్పుడు నాకు కొంచం బాగుంది" అని చెప్పింది. ఆమాట విని నాకు చాలా సంతోషంగా అనిపించింది. నా హృదయం సంతోషంతో నృత్యం చేసింది, సమయానికి విలువైన మంత్రాన్ని నాకు పంపించి దారి చూపిన మమత గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నిజంగా ఆ మంత్రం ప్రభావాన్ని చూపింది. అప్పటి నుండి నా కుమార్తె నొప్పి తగ్గిపోయింది. కానీ అప్పుడప్పుడు కొద్దిగా నొప్పిగా ఉంది అంటూ తను చెప్తుండేది. అది కూడా బాబా తీసేస్తారు అని గట్టి నమ్మకంతో ఉండసాగాను. 3, 4 వారాల పాటు బాధించిన  అనారోగ్యం చివరికి బాబా దయతో సమసిపోయింది. సాయినాథ్ మహారాజ్ కి జై!!


నేను సాయికి వాగ్దానం చేసినట్లుగా, గురువారంనాడు పూరీ, కూర ఆర్డర్ ఇచ్చి ఆరోజు సాయంత్రం అనాధ పిల్లలకు పంపిణి చేశాను. వాళ్ళంతా చాలా సంతోషంగా సంతుష్టిగా తిన్నారు.

ఇప్పుడు నొప్పంతా తగ్గిపోయి క్షేమంగా ఉంది నా బిడ్డ. కాబట్టి నేను సాయి దేవాలయానికి వెళ్లి ఆయన చూపిన దయకు, ప్రేమకు బాబాకు కృతజ్ఞతలు చెప్పుకొని నాకిష్టమైన టీ త్రాగాలని అనుకున్నాను. ఆరోజు శనివారం, చిన్న పాపకి ఆరోజు సెలవుదినం. పెద్ద పాపకు హాఫ్ డే స్కూల్ ఉంది. తను 12.30 గంటలకి ఇంటికి వస్తుంది. ఈలోపు నేను నా పనులతో బిజీగా ఉన్నాను. సడన్ గా టైం చూసేసరికి అప్పటికే 11 గంటలయింది. అప్పటికింకా నేను టిఫిన్ చేయలేదు. నేను "బాబా! నేను ఇప్పటివరకు ఆకలితో ఉన్నాను. ఇప్పుడు తినడానికి ఎక్కువ సమయం లేదు, పెద్దపాప వచ్చే లోపల నేను త్వరగా ఇంటికి తిరిగి రావాలి, కాబట్టి మీరు ఏదో విధంగా నాకు ఆహారం పెట్టండి" అని బాబాకు చెప్పుకున్నాను. నేను బాబాకోసం శీరా తయారు చేసి చిన్న పాపను తీసుకొని సాయిమందిరానికి వెళ్ళాను. బాబాకు పెట్టమని నేను తీసుకొని వెళ్లిన శీరా పూజారికి ఇచ్చాను. అతను బాబాకు పెట్టిన తరువాత శీరాతోపాటు పులిహార ప్యాకెట్ నాకు ఇచ్చారు. నేను ఇంతకుముందు ఎన్నోసార్లు ఆ ఆలయంలో బాబాకు ప్రసాదం ఇచ్చాను, కానీ ఎప్పుడూ ఇలా జరగలేదు. నేను అడిగినట్లుగా బాబా నా ఆకలి తీరుస్తున్నారని నాకు చాలా సంతోషంగా అనిపించింది. నా డార్లింగ్ సాయి నాపై చాలా ప్రేమను చూపారు. ఈప్రేమ చాలు బాబా. లవ్ యు సాయి. థాంక్యూ సాయి. కష్ట సమయంలో నా కూతురి కోసం మహామృత్యుంజయ మంత్రాన్ని జపించిన పింకీ గారికి చాలా చాలా ధన్యవాదాలు. నా సాయి స్నేహితులంతా నా బిడ్డకోసం ప్రార్ధించారు. బాబా వారినందరినీ చల్లగా చూడాలి.

ఇంత పెద్ద నా అనుభవాన్ని చదివినందుకు అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ బాబా ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాను.

ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి!!

తన బిడ్డలని తన దారిలోకి బాబా ఎలా లాక్కుంటారో ఎవరూహించగలరు?


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

నేను 1984వ సంవత్సరంలో లోధీ రోడ్డులోని దయాల్ సింగ్ కాలేజీలో బి.ఎస్.సి చేశాను. ఒకరోజు నేను పరిక్ష ఫలితాల కోసం కాలేజీకి వెళ్తే ఫలితాలు ఇంకా రాలేదని చెప్పారు. నిరాశతో నేను అక్కడి నుండి నా స్నేహితుడి ఇంటికి వెళ్తూ దారిలో మూడు మందిరాలు ఉంటే, వాటిలో మొదటి రెండు మందిరాలకు వెళ్ళి నమస్కారం పెట్టుకొని మూడో మందిరం మొదటి మెట్టెక్కుతూ నాకు పరీక్షలో 75% వస్తే ఈ మందిరానికి వస్తాననుకొని వెనక్కి వచ్చేశాను. ఆలా అనుకోవడమైతే అనుకున్నానుగాని నిజానికి నాకంత శాతం రాదని నాకు తెలుసు ఎందుకంటే నేనేమి అంత బాగా పరీక్షలు వ్రాయలేదు. మరుసటిరోజే ఫలితాలు వచ్చాయి. నా స్నేహితులు నీకు 75% వచ్చాయి కంగ్రాట్స్ అన్నారు. వాళ్ళేదో పరాచికమాడుతున్నారని వారి మాట నమ్మలేక స్వయంగా నేనే వెళ్ళి చూసుకుని సంతోషం పట్టలేకపోయాను. నిజంగానే నాకు 75% మార్కులొచ్చాయి. వెంటనే ఆ మందిరం గుర్తు వచ్చి అక్కడికి పరుగుపెట్టాను. అక్కడ ఆరతి జరుగుతూ ఉంది. ఆరోజు గురువారం కావడం వలన చాలా జనం వున్నారు. ఆ జనం మధ్యనుంచి అక్కడ ఉన్న తెల్లని పాలరాతి విగ్రహం చూశాక నా ఆనందానికి అవధుల్లేవు. అది శిరిడీ సాయిబాబా మందిరమని నాకస్సలు తెలియదు. అలా బాబా నాకు తెలియకుండానే తన వైపుకు నన్ను ఆకర్షించుకున్నారు. అందరూ ఆరతి పాడుతున్నారు, 'నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ' అన్న లైన్ దగ్గర మాత్రం నాకేదో తెలియని తన్మయత్వం కలిగి ఇకపై నేను తరచూ ఈ మందిరానికి వస్తానని అనుకున్నాను. ఆవిధంగా నాకు బాబా మీద భక్తి, విశ్వాసాలు మొదలయ్యాయి.  బి. ఎస్. సి తరువాత నాకు ఎం. ఎస్.సి చేయాలని ఉండేది. బాబా కృప వలన నాకు హిందూ కాలేజీలో సీట్  వచ్చింది. ఆ రోజుల్లోనే నాకు బాబా మీద భక్తి విశ్వాసాలు పెరుగుతూ వచ్చాయి. ప్రతి గురువారం మందిరానికి వెళ్ళడం నియమంగా పెట్టుకున్నాను. అప్పట్లో నాకు చదువు అయిపోయాక ఉద్యోగం వస్తే అక్కడికి 1 లేక 2 కిలోమీటర్ల దూరంలో బాబా మందిరం ఉంటే బాగుంటుందని ఎప్పుడూ అనిపిస్తూ ఉండేది. ఎం.ఎస్.సి ఫలితాలు రాకముందే బాబా నాకు DAB స్కూల్, పీతంపూర్ బ్రాంచ్ లో PGT ఉద్యోగం ఇప్పించారు. అక్కడికి దగ్గరలో రోహిణి సెక్టార్ - 7లో బాబా మందిర నిర్మాణం జరుగుతూ వుంది. నిజానికి ఆ మందిరాన్నిమొదట సెక్టార్ 3 లో కట్టాలనుకున్నారు. కానీ అక్కడ స్థలం దొరకనందువలన సెక్టార్ 7లో కడుతున్నారు. ప్రజలు ఇండ్లు కట్టడం మార్చుకుంటారు కానీ, భగవంతుడు తన (ఈ)భక్తుని కోసం మారడం ఇదే చరిత్రలో మొదటిసారేమో అనిపించింది నాకు. ఇది బాబా అద్భుతమైన లీలనే. ఆ రోజునుంచి నాకు బాబా సేవ చేసుకొనే అదృష్టం దొరికింది. ముందునుంచి నాకు భజన పాటలు పాడాలని వుండేదికాని పాడలేక పోయేవాడిని. కానీ బాబా దయవలన పాడటం మొదలుపెట్టాను. మెల్ల మెల్లగా బాబానే గంటన్నరపాటు ఆపకుండా పాడే శక్తి సామర్థ్యాలను ఇచ్చారు.

నాకింకా చదవాలని వుండేది. ఉద్యోగంతో పాటు బాబా నాకు బి.ఈడి చేసే అదృష్టాన్ని కూడా ఇచ్చారు. ఒక సంవత్సరం తరువాత బాబా నాకు ప్రేరణనిచ్చి ఎం.ఈడి కూడా చేయించారు. అది కూడా ఆయన దయవలన పూర్తి చేశాను. తరువాత పీహెచ్ డీ కూడా చేయాలనిపించింది. ఆసమయంలో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ నరేంద్రనాథ్ గారిని కలిసే అవకాశాన్ని బాబా కల్పించారు. అతనితో నేను నా పీ హెచ్ డీ చేయాలన్న ఆలోచన గురించి చెప్పగా అతను సరే నా దగ్గరే పీహెచ్ డీ చేయీ అన్నారు. మళ్ళీ అంతలోనే ఇంకో ప్రొఫెసర్ మదన్ మోహన్ బజాజ్ ని కలిసే అవకాశం బాబా ఇచ్చి "నీవు పీ హెచ్ డీ మదన్ మోహన్ బజాజ్ దగ్గరే చేయాలి" అని ఆదేశించారు. ఆ ఇద్దరు ప్రొఫెసర్లు ఒకే కాలేజీలో పనిచేస్తారు. పైగా వాళ్లిద్దరూ స్నేహితులే. నేను ఏ పరీక్ష రాయకుండానే మిస్టర్ బజాజ్ దగ్గర నా పీహెచ్ డీ మొదలుపెట్టాను. ఆక్కడ పెద్ద పెద్ద వాళ్ళతో మీటింగ్స్ ఉంటాయి. వాళ్ళ నుండి ప్రశంసా పత్రాలు తీసుకోవడం నాకు చాలా అవసరం. కానీ ప్రొఫెసర్ నరేంద్రనాథ్ గారు నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వరనుకున్నాను. ఎందుకంటే నేను నరేంద్ర గారికి ఒక మాటైనా చెప్పకుండా మిస్టర్ బజాజ్ గారి దగ్గర పీ హెచ్ డీ మొదలుపెట్టాను. కాని బాబా కృప ఏమిటంటే ఆయనే వచ్చి నాకు ప్రశంసా పత్రాలు తప్పకుండా ఇస్తాను అన్నారు. భగవాన్ ఏమి చేసిన మన మంచికే చేస్తాడు అన్నాడు. బాబా లీల చూడండి అతనే నాకు ప్రశంసాపత్రం ఇవ్వడమే కాకుండా నా గురించి చాలా బాగా రాశాడు. తరువాత నాకు పీ హెచ్ డీ లో అడ్మిషన్ అయింది. కాని దైవనిర్ణయం ఏమిటోగాని నాకు ఆ ప్రశంసా పత్రం ఇచ్చిన మూడో రోజే మిస్టర్ నరేంద్ర చనిపోయాడు. అందుకే బాబా నన్ను అయన దగ్గర చేరనీయలేదు. బాబాకు భూత, భవిషత్తు, వర్తమానాలు తెలుసు. తన భక్తులను రక్షించడానికి ఆయన అనేక రకాల లీలలు చేస్తారు. తరువాత బాబా ఆశీస్సులతో బజాజ్ గారి ఆధ్వర్యంలో నా పీ హెచ్ డీ పూర్తయింది.

నేను "సాయి శక్తి" అనే పుస్తకం కూడా రాశాను. దానిలో ద్వారకామాయి బాబా చిత్రపటానికి దోమ తెర కడతారు, దీపం వెలిగిస్తారు. చాలాసార్లు ఆ దీపం దానంతట అదే ఊగుతుంది, చూస్తే గాలి ఏమీ వుండదు. ఈ విషయం గురించి సంస్థానం వాళ్ళు వీడియో కూడా తీశారు. నేను కూడా ఒకసారి ఆ వీడియో సంపాదించాను. ఈ విధంగా సాయిబాబా నా జీవిత పర్యతం నాతోనే వున్నారు. తరువాత బాబా గురించి చాలా బుక్స్ కూడా చదివాను. చాలా పుస్తకాలు కూడా రాశాను.

రవీంద్రనాథ్ కాకరియా,

సోర్స్: సాయి లీల పత్రిక.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo