సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

వంశపారంపర్యంగా చిన్ననాటి నుండి వేధిస్తున్న సమస్య బాబా ఊదీతో మాయం ....


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

అద్భుతాలలోకే అద్భుతమైన సాయి లీల ఒకటి నా జీవితంలో ఇటీవల జరిగింది. మా కుటుంబంలో వంశపారంపర్యంగా ఎడమచేయి వణికే జబ్బు ఒకటి ఉంది. మా కుటుంబసభ్యులలో చాలామంది ఈ సమస్యతో బాధపడ్డారు. అందులో నేనూ ఒకదాన్ని. ఆ సమస్య వలన నా ఎడమచేయి ఎప్పుడూ కొద్దిగా వణుకుతూ ఉంటుంది. అందువల్ల నేను నా ఎడమచేతితో గ్లాసునిండా నీళ్లుగాని, కప్పునిండా కాఫీగాని పట్టుకోలేను. ఏది పట్టుకున్నా కూడా విపరీతమయిన వణుకు వచ్చి అది నా చేతినుండి జారిపోయి క్రింద ఒలికిపోతుంది. కనీసం నేను నా ఎడమచేతితో ఒక స్పూన్ చక్కెర లేదా ఉప్పు కూడా పట్టుకోలేను. ఈ సమస్య వల్ల ఆఫీసులో, ఆఫీసు వాళ్ళతో బయటకి లంచ్ కి వెళ్ళాల్సి వచ్చినా నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. అందరూ నాకు నెర్వస్ ప్రాబ్లమ్ వుంది అనుకునేవారు.

ప్రతిరోజు పారాయణ గ్రూపులో నాకు కేటాయించిన ఒక అధ్యాయం పారాయణ చేస్తూ ఉంటాను. ఒక గురువారం నాటికి సచ్చరిత్ర పారాయణ పూర్తి అవడంతో బాబాకు ఆరతి ఇచ్చి నైవేద్యం పెట్టాను. తరువాత అన్నదానం కూడా చేసాను. తరువాత పారాయణ గ్రూపులో మళ్ళీ పారాయణ మొదలుపెట్టాము. ఆరోజు నాకు రెండవ అధ్యాయం కేటాయించారు. నేను పారాయణ పూర్తి చేసేసరికి చాలా దాహంగా అనిపించి కుడిచేతితో పెద్ద గ్లాసునిండా నీటిని పట్టుకొని మా ఇంటిలో ఉన్న పెద్ద బాబా ఫోటో ముందు నిలబడి బాబాని చూస్తూ,  “చూడండి బాబా! నేను ఇది కుడిచేతితో పట్టుకున్నాను. నా చిన్నతనం నుండి ఎడమచేతితో ఏదీ పట్టుకోలేను. ఇది నా జీవితంలో చాలా అవమానకరమైన విషయం" అని బాబాతో చెప్పుకుంటూ చాలా బాధపడ్డాను. అప్పుడే బాబాతో మాట్లాడుతుండగా నా మదిలో ఒక ఆలోచన వచ్చింది, "ఊదీని నీళ్ళలో కలుపుకొని నా ఎడమచేతితో త్రాగితే?!" అని. ఆ ఆలోచన ప్రకారమే నా ఎడమచేతితో గ్లాసు పట్టుకొని నీళ్లు త్రాగాను. ఆశ్చర్యం! మునుపటిలా చేయి వణుకుతూ నీళ్లు క్రింద పడిపోలేదు, కనీసం ఒక బొట్టు నీరు కూడా క్రింద పడలేదు. మళ్ళీ నిర్ధారించుకోవడానికి మరలా ఇంకో గ్లాసు నీళ్లు కూడా త్రాగాను. అప్పుడు కూడా నీళ్లు తొణకలేదు. తరువాత ఒక స్పూన్ తో ఉప్పు పట్టుకున్నా కూడా ఎటువంటి సమస్య లేదు. మనం శ్రద్ధ - సబూరి కలిగి ఉంటే చాలు, ఎటువంటి సమస్యకైనా బాబాయే పరిష్కారం చూపుతారు. వంశపారంపర్యంగా చిన్ననాటి నుండి నన్ను వేధిస్తున్న ఇంతపెద్ద సమస్యని బాబా తన ఊదీతో ఇట్టే పరిష్కరించేసారు. నా ఆనందానికి అవధులు లేవు. బాబా మనపై చూపే ప్రేమ అద్భుతం, అమోఘం. నా ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలి అనిపించి నా ఈ అనుభవాన్ని వ్రాస్తున్నాను. ఇప్పుడు కూడా నేను బాబా ఫోటో ముందు కూర్చొని నా ఎడమచేతితో ఫోన్ పట్టుకొని కుడిచేతితో టైపు చేస్తున్నాను.

ఓం సాయిరామ్.

5 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo