సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీనానాసాహెబ్ చందోర్కర్ - ఏడవభాగం



బాబా ప్రేమ, శ్రద్ధ(పర్యవేక్షణ) మానవ స్థాయి కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లే వారి శక్తులు మానవుని యొక్క స్థాయి, పరిమితి కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. మనలో ఎవరూ ఒకేసారి డజను మందిపై ఆసక్తి చూపడం, వారి వ్యవహారాలను చూసుకోవడం చేయలేరు. అయితే, బాబా కోట్లాది మంది భక్తులు ఏ ఏ (దూర)ప్రాంతాల్లో ఉన్న ఎల్లవేళలా వాళ్లపై తమ దృష్టినుంచి వాళ్ళ అవసరాలను చూసుకుంటున్నారు. బాబా ఒక సందర్భంలో "నేను 4000 మందితో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఒక అంటువ్యాధి చెలరేగింది. భయపడుతున్న ఆ 4000 మందితో నేను, 'మిమ్మల్ని చావనిచ్చే కంటే నేను చనిపోతాను. మిమ్మల్ని మాత్రం చావనివ్వను' అని హామీ ఇచ్చాను" అని అన్నారు. ఈ విధమైన సర్వమూ తెలుసుకునే శక్తిని, రక్షించే శక్తిని మాత్రమే దైవమని(సర్వశక్తి, సర్వజ్ఞత మరియు సర్వవ్యాపకత) అంటారు. వేరే ఏ ఇతర పదం అందుకు సరిపోదు. ఒకే సమయంలో ప్రాపంచిక, పారమార్థిక సహాయాన్ని పొందుతున్న నానా, 'బాబా దైవం తప్ప మరొకటి కాదని, ఉపనిషత్తులలో చెప్పబడ్డ ఆ దైవం(బ్రహ్మం) అస్పష్టంగా ఉండి, మూర్తి రూపాలలో ఆరాధించినప్పటికీ ప్రజలకు నిజంగా అందుబాటులో ఉండదని, దైవం సాయిబాబా వంటి సద్గురు రూపాన్ని తీసుకోనంతవరకు దైవమొక గుర్తించలేని సుదూర లేదా అనుభవంలో అనుభూతి చెందలేని విషయం(వస్తువు)' అన్న చాలా బలమైన అభిప్రాయాన్ని పొందాడు. అంతేకాదు, తన పూర్వ పుణ్యమే తనకు తాను అత్యంత శక్తిశాలి, పరమ ప్రేమమూర్తి అయినా సాయిబాబాగా వ్యక్తమైందని భావించాడు. సరే ఇక అందరినీ ప్రేమిస్తూ, జాగ్రత్తగా చూసుకొనే బాబా ఎలా, ఏ ఇతర మార్గాల్లో నానా ప్రాపంచిక, ఆధ్యాత్మిక సంక్షేమాన్ని చూసుకున్నారో తెలుసుకొనేందుకు మనం మరింత పరిశీలన చేద్దాం.

ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ తన కుటుంబంతో శిరిడీలో ఉన్నప్పుడు సూర్యగ్రహణం సంభవించింది. వాళ్ళు బాబా అనుమతి తీసుకొని గ్రహణకాలంలో పవిత్ర గోదావరిలో స్నానం ఆచరించడానికి శిరిడీ నుండి కోపర్గాఁవ్ వెళ్ళారు. గ్రహణం ప్రారంభవుతూనే ఒక మహర్(మహారాష్ట్ర, మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో నివసించే షెడ్యూల్ కులస్తులు), "గ్రహణం విడిపోయేలోపు దానం చేయండి(దే ధాన్ సుటే గ్రహణ) అని అరుస్తూ వచ్చాడు. నానాసాహెబ్ అతనికి నాలుగు అణాలు(రెండు అణాల నాణేలు రెండు) ఇచ్చాడు. అదే సమయంలో మసీదులో బాబా తమ పక్కన కూర్చుని ఉన్న భక్తుడు నందూరామ్ మార్వాడికి రెండు అణాల నాణేలు రెండు చూపుతూ, "చూడు! ఈ నాలుగు అణాలు నానా నాకిచ్చాడు" అని అన్నారు. తర్వాత నానాసాహెబ్ కోపర్గాఁవ్ నుండి శిరిడీకి తిరిగి వచ్చినప్పుడు నందూరామ్ మార్వాడి అతనిని, "గ్రహణ సమయంలో మీరు ఎంత దానం చేశారు?" అని అడిగాడు. నానా, "నేను ఒక మహర్‌కి నాలుగు అణాలు ఇచ్చాను" అని బదులిచ్చాడు. అప్పుడు నందూరామ్ మార్వాడి ఆశ్చర్యంతో ఆ నాణేలు బాబా ఇక్కడ నాకు చూపించారు అని చెప్పాడు. అది విని నానా కూడా ఆశ్చర్యపోయాడు. ఈ సంఘటన ద్వారా నానాసాహెబ్‌‌కు, ఇంకా ఇతర భక్తులకు శిరిడీ మసీదులో కూర్చొని ఉన్న బాబా తమ భక్తుల సంక్షేమం కోసం వివిధ రూపాలు ధరించి పలు ప్రాంతాలకు ఎలా ప్రయాణిస్తారో అర్థమైంది.

1906లో నానాసాహెబ్ చందోర్కర్‌కి పండరిపురంకి బదిలీ అయింది. నందుర్‌బార్‌‌లో ఉత్తర్వులందుకున్న వెంటనే నానా అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. అందుచేత అతను నందుర్‌బార్ వదిలి పండరిపురం వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. అయితే, 'భూ వైకుంఠంగా పిలవబడే పండరిపురంలో ఉంటూ విఠలుని దర్శించుకోకుండా ఎలా ఉండాలి? కానీ, అలా విఠలుని దర్శించుకుంటూ ఉంటే బాబా పట్ల భక్తిని కోల్పోతానేమో!' అనే సందేహం అతనిని సంఘర్షణకు గురిచేసింది. ఏదేమైనా శిరిడీయే అతని ప్రథమ పండరీపురం కనుక, కుటుంబంతో ముందు శిరిడీ వెళ్ళి బాబాను దర్శించి, ప్రణామాలర్పించి, వారి ఆశీస్సులు తీసుకొని పండరిపురం వెళ్లాలనుకొని సామానంతా సర్దుకొని త్వరగా బండిలో కూర్చున్నాడు. అతను శిరిడీ వస్తున్నట్టు ఎవరికీ ఉత్తరం వ్రాయలేదు, కబురు కూడా పంపలేదు. అందువల్ల అతను వస్తున్నట్లు శిరిడీలో ఎవరికీ తెలియదు. కానీ సాయికి సర్వం తెలుసు. వారి కళ్ళు సర్వత్రా ఉన్నాయి. నానా నీంగావ్ గ్రామ శివారుకు వచ్చేసరికి శిరిడీలోని మశీదులో బాబా తమ వద్ద కూర్చొని ఉన్న మహాల్సాపతి, అప్పాశిండె, కాశీరాం మొదలగు భక్తులతో "పండరీపురం ద్వారాలు తెరుచుకున్నాయి. మనందరం కలిసి ఆనందంగా భజన చేద్దాం" అని


పండర్ పుర్లా జాయాచే జాయాచే| 

తే తిథేంచ్ మజలా రాహ్యాచే॥

తిథేంచ్ మజలా రాహ్యాచే|

ఘర్ తే మాఝ్యా రాయాచే॥


'పండరిపురానికి వెళ్ళాలి. నేను అక్కడ ఉండాలి. నేను అక్కడే ఉండాలి. అది నా ప్రభువు ధామం' అన్న భజన గీతాన్ని బాబా స్వయంగా పాడుతుంటే అక్కడ కూర్చున్న భక్తులు వారిని అనుకరిస్తూ అంతా పండరినాథుని ప్రేమలో లీనమైపోయారు. అంతలో నానాసాహెబ్ తన కుటుంబ సమేతంగా శిరిడీ చేరుకొని బాబా పాదాలకి సాష్టాంగ నమస్కారం చేసి, "పండరీపురం వచ్చి ఉండమ"ని విన్నవించుకున్నాడు. అతను అలా అడిగే అవసరం లేకుండానే బాబా అప్పటికే పండరిపుర ప్రయాణానికి ఉత్సాహంగా భజన చేస్తున్నారని భక్తులు నానాకు తెలియజేశారు. అది విని తన మదిలోని సందిగ్ధతకు సంతృప్తికరమైన పరిష్కారాన్ని చూపే భజన గీతాన్నే బాబా ఆలపించారని నానా ఆశ్చర్య చకితుడయ్యాడు. ఆనందంతో గద్గదుడై బాబా చరణాలపై శిరసు ఉంచాడు. బాబా ఆశీర్వాదాన్ని, ఊదీ ప్రసాదాన్ని తీసుకొని  పండరిపురం వెళ్ళాడు. 

1906లో నానాసాహెబ్ తన భార్యతో కలిసి పండరీపురం నుండి శిరిడీ వెళ్ళాడు. అప్పుడొకరోజు నానాసాహెబ్ భార్య బాబా దర్శనానికి వెళ్లినప్పుడు బాబా, "రా ఆజీబాయి(అమ్మమ్మ)" అని ఆమెని స్వాగతించారు. బాబా మామూలుగా ఆమెను  'ఆయీ'(అమ్మ) అని పిలిచేవారు. ఆరోజు మాత్రమే అలా ప్రత్యేకించి పిలిచారు. ఆ కొత్త పిలుపుకు ఆమె మురిసిపోయింది. ఆమె తిరిగి తన బసకు వెళ్ళినప్పుడు ఆ విషయాన్ని తన భర్త నానాసాహెబ్‌తో చెప్పింది. వెంటనే అతను బాబా మాటలలోని ప్రాముఖ్యతను గ్రహించి, "ఖచ్చితంగా మన అమ్మాయి ద్వారక బిడ్డకి జన్మనిచ్చి ఉంటుంది" అని అన్నాడు. అదే నిజమని మరుసటిరోజే ఆ దంపతులకు ఒక ఉత్తరం వచ్చింది. బాబా నానాసాహెబ్ భార్యను 'ఆజీబాయి' అని పిలిచిన అదే సమయంలో పండరీపురంలో ఉన్న నానాసాహెబ్ కూతురు ద్వారక ఒక బిడ్డకు జన్మనిచ్చింది.

నానాసాహెబ్ సలహామేరకు అతని భార్య నియమబద్ధంగా నామజపం చేస్తుండేది. ఒకరోజు ఆమె బాబా వద్ద కూర్చొని ఉన్నప్పుడు బాబా ఆమెతో, "అమ్మా! నువ్వు చాలా ధాన్యాన్ని విసురుతున్నావు, కానీ, దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు" అని అన్నారు. ఆమెకు బాబా మాటలలోని అంతరార్ధమేమిటో అర్థం కాలేదు. ఆమె తిరిగి తన బసకు వెళ్ళినప్పుడు ఆ విషయాన్ని తన భర్త నానాసాహెబ్‌తో చెప్పింది. అప్పుడు అతను, "బాబా చెప్పింది నిజమే. నువ్వు చాలా జపం చేస్తున్నావు కానీ, నీ మనసు వందలాది విషయాల వైపు మళ్ళుతుంది. జపంతోపాటు స్వరూపానుసంధానం కూడా అవసరం. బాబా ఈ సలహా కేవలం నీకు మాత్రమే కాదు, మనందరికీ వర్తిస్తుంది" అని వివరించాడు.

1906లో ఒక భక్తుడు బాబా పాదాలకు నమస్కరిస్తుండగా అతని కంటి అద్దాలు కింద పడిపోయాయి. ఇది చూసిన ఒక భక్తుడు, “క్రిందపడిన అద్దాలు బాబాకే కానుకగా సమర్పిస్తే బాగుంటుంది” అని అన్నాడు. అప్పుడు బాబా, "నాకు అద్దాలు అక్కరలేదు. నా అద్దాల విలువ నలభై రూపాయలు" అన్నారు. బాబా మాటల్లోని అంతరార్థాన్ని నానాసాహెబ్ తన కుమార్తె మైనతాయితో ఇలా వివరించారు: “ ‘అద్దం’ అంటే ‘ఆత్మసాక్షాత్కారము’ అని, ‘నలభై రూపాయలు’ అంటే ‘నలభై సంవత్సరాలు’ అని. అంటే ‘బాబాకు నలభై సంవత్సరాల క్రితం ఆత్మసాక్షాత్కారమైంది’ ”.


అన్ని జీవులలో నేను ఉన్నానని గుర్తుంచుకో


సద్గురువు నుండి నేర్చుకోవలసిన అత్యున్నత పాఠం ఏమిటంటే, ప్రత్యేకించి ఒక వ్యక్తిలో లేదా వస్తువులో భగవంతుడున్నాడని, ఆపై భగవంతుడు అన్నింటిలో ఉన్నాడని గ్రహించడం. అంటే మొదట తన స్వభావాన్ని, భగవంతుని స్వభావాన్ని తెలుసుకోవడం; పువ్వులతో పూజించే రూపాలు మాత్రమే భగవంతుడు కాకూడదు. ఒక సమయంలో ఒక చోట మాత్రమే ఉన్నాడని భావించేది దైవం కాకూడదు. 'ఈశ్వరుడిని సరిగ్గా అర్థం చేసుకున్న వ్యక్తి ప్రతిదానిలో(అంతటా) ఈశ్వరుని సన్నిధిని అనుభూతి చెంది భయభక్తులు, పరమానందాన్ని అనుభవించాలి' అని భగవద్గీత చెబుతుంది. ఈ సత్యాన్ని గురుదేవులైన బాబా తమ ప్రియ భక్తులకు బోధించి అన్నిటా భగవంతుని సాక్షాత్కరింపజేసి భయభక్తులు, ప్రేమ మొదలైనవి కలిగి ఉండేలా చేయాలి. అయితే మానవ స్వభావాన్ని లోబరుచుకోవడం(జయించడం) చాలా కష్టం. బాబా భక్తులలో ఆధ్యాత్మికంగా నానా చాలా ముందున్నప్పటికీ బాబాతో తనకున్న సాన్నిహిత్యం వల్ల సహజంగానే అతనిలో దాస్యభక్తి కంటే సఖ్యభక్తి అభివృద్ధి చెందింది. చనువు అలక్ష్యం చేయకపోయినా కనీసం స్వాతంత్రానికి దారి తీస్తుంది. బాబా స్వభావాన్ని పరిశీలించిన మీదట అతని వినమ్రత, అణుకువ, భక్తి బలహీనపడటం ప్రారంభించాయి. బాబా అద్భుత శక్తులు, జ్ఞానం కారణంగా ఇతరులంతా ఆయనను భగవంతునిగా పరిగణించి ఆయనపట్ల భయభక్తులు కలిగి ఉండేవారు. పూజ, ఆరతి చేసే సమయాలలో అవి నిర్వహించే బాపూసాహెబ్ జోగ్‌, తర్వాత కాలంలో సద్గురువుగా ఎంతోమందితో కొలవబడ్డ ఉపాసని మహారాజ్‌లతో సహా వందలాది మంది మగవాళ్ళు, ఆడవాళ్ళు వాళ్ళ స్థాయి ఏదైనప్పటికీ లేచి నిలబడేవారు, ఎవరూ కూర్చుని ఉండేవారు కాదు. కానీ నానా మాత్రం ఆరతి జరిగేటప్పుడు కూడా బాబా పక్కన కూర్చుని ఉండేవాడు. పూజ పూర్తయ్యే సమయానికి మంచినీటి పాత్రను బాబా పెదవుల దగ్గర ఉంచి, ఆ నీటిని అందరికీ తీర్థంగా పంచేవారు, అందరూ త్రాగేవారు. కానీ నానా, దాసగణులు మాత్రం తీసుకునేవారు కాదు. సాన్నిహిత్యం వల్ల ఇటువంటి అనార్థాలున్నాయి. చనువు దాని ప్రతికూల ప్రభావాన్ని ఖచ్చితంగా చూపుతుంది. నానా విషయంలో జరిగిందదే. తీర్థం తీసుకోకపోవడం చిన్న విషయం. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, బాబా సన్నిధి, అది అయస్కాంత క్షేత్రం. పదేపదే బాబాను కలవడం వల్ల ఏర్పడిన సాన్నిహిత్యం నానాను ఆ అయస్కాంత క్షేత్ర ప్రభావాన్ని చాలావరకు కోల్పోయేలా చేసింది. అతను బాబాను నిరంతరం మసీదులో లేదా ప్రత్యేక ప్రదేశాలలో చూడటం వల్ల బాబాతో ప్రత్యేకించి మానవీయ బంధంతో లేదా స్నేహభావంతో ఉండాలని, విశ్వవ్యాప్తం చేయకూడదని నిర్బంధించుకున్నాడు. ఈ పరిస్థితిని అధిగమించడానికి బాబా ముందుగా తమలోని దైవత్వ అనుభూతి అతనికి మరింత ఎక్కువగా కలిగించి, తర్వాత తమ దైవత్వం తమ శరీరానికి మాత్రమే పరిమితం కాకుండా అన్ని ప్రాణులలో అంతర్యామి లేదా ఆత్మగా విస్తరించి ఉందని తెలియజేయాల్సి వచ్చింది. ఆయన పలు సందర్భాల్లో, "నేను శిరిడీలో మాత్రమే లేను. చీములు మొదలైన అన్ని జీవులలో నేను ఉన్నాను" అని చెప్పారు. ఆ విషయం నానా బుద్ధికి అర్థమైనా హృదయస్తం కాలేదు. ఆధ్యాత్మిక పురోగతికి అది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి, బాబా నానా దానిని మరింత స్పష్టంగా అవగాహన చేసుకోవాలని తలచారు.

1908లో నానాసాహెబ్ పండరిపురంలో పని చేస్తున్నప్పుడు తన కొడుకు బాపూరావ్‌ని తీసుకొని ఒకరోజు మధ్యాహ్నం 12-12.30 గంటల సమయంలో శిరిడీ చేరుకున్నాడు. అతను బాబా దర్శనానికి మశీదుకు వెళ్ళినప్పుడు బాబా అతని యోగక్షేమాలు విచారించిన మీదట, "నానా! ఈరోజు నాకు పూరన్ పోళీలు తినాలనుంది. 8 పూరణ్ పోళీలు తయారుచేయించి, నాకు నివేదించి ఆపై నువ్వు తిను" అని అన్నారు. అందుకు నానా, "బాబా! ఇప్పుడు సమయం మధ్యాహ్నం 12 గంటలు దాటింది. పూరన్ పోళీలు సిద్ధం చేయడానికి బాగా ఆలస్యమైంది. అదీకాక నా కుటుంబంలోని స్త్రీలెవరూ లేరు. మరి నేను ఎవరిని పోళీలు సిద్ధం చేయమని అడగగలను? ఈ గ్రామంలో వంటచేసే ఆడమనిషిగాని, మగమనిషిగాని నాకు ఎక్కడ దొరుకుతారు?" అని అన్నాడు. బాబా, "వాటిని తయారు చేయడానికి అవసరమయ్యే సమయం గురించి నేను పట్టించుకోను. కానీ నువ్వు నాకు పూరన్ పోళీలు అందేలా చూడు" అని అన్నారు. నానా “కాస్త కనికరించమ”ని పదేపదే బాబాని వేడుకొని, "రేపు నైవేద్యానికి పూర్ణ పోళీలు తెస్తాన"ని హామీ ఇచ్చాడు. కానీ, బాబా తమ మనసు మార్చుకోవడానికి ఇష్టపడక "నాకిప్పుడే పూరన్ పోళీలు కావాలి" అని పట్టుబట్టారు. ఇక అప్పుడు నిస్సహాయస్థితిలో నానా, "సరే, నేను ఇప్పుడు వంటవాణ్ణి వెతకడానికి వెళ్తాను. ఎవరైనా దొరికితే కావాల్సిన సరుకులు కొంటాను. కానీ పోళీలు తయారు చేయడానికి సుమారు మూడు గంటల సమయం పడుతుందనుకుంటున్నాను. అంటే, దాదాపు 4 గంటలవుతుంది. అలాంటి వేళకాని వేళ మీరు వాటిని ఎలా తింటారు?" అని అన్నాడు. బాబా, "ఏ సమయమైనా అవి నాకు కావాలి" అన్నారు. అప్పుడు నానా మసీదు నుండి బయటకు వచ్చి పూరన్ పోళీలు తయారు చేసే మనిషికోసం వెతికాడు. చివరికి ఒక స్త్రీ పోళీలు చేయడానికి ఒప్పుకోవడంతో నానా ఆమెతో, "ఒక పూరన్ పోళీకి ఒక రూపాయి చొప్పున ఇస్తాను. వెంటనే వాటిని తయారుచేసి ఇవ్వమ"ని చెప్పాడు. ఆమె వెంటనే పోళీలు తయారుచేసింది. నానా బాబా ఆదేశానుసారం ఎనిమిది పూరన్ పోళీలు ఒక పళ్లెంలో పెట్టి, మసీదుకి తీసుకెళ్ళి బాబా ముందుంచి, "ఆరగించండి బాబా" అని వేడుకున్నాడు. అతను ఆశ్చర్యపోయేలా బాబా, “మంచిది! నా వాటా పూరన్ పోళీ నేను తిన్నాను. ఇప్పుడు ఈ పళ్లెం తీసుకెళ్లి నువ్వు తిను" అని అన్నారు. అప్పుడు నానా, “బాబా! మీకోసం నేను అన్ని కష్టాలు పడి వంటకం సిద్ధం చేయించాను. మీరు కనీసం పళ్లెం కూడా ముట్టుకోకుండా, బదులుగా నన్ను తినమని అంటున్నారా? నన్ను అన్ని బాధలుపడేలా చేయడంలో ప్రయోజనం ఏమిటి? మీరు కనీసం చిన్న ముక్కైనా తినే వరకు నేను రవంత కూడా ముట్టుకోను” అని అన్నాడు. కానీ బాబా, "ఈ పళ్లెం తీసుకెళ్లి నువ్వు తిను" అని అన్నారు. అతను ఆయన తిననందున అక్కడినుండి పళ్లెం తీయడానికి నిరాకరించి, "కొంచెమైన తినండి బాబా" అని పట్టుబట్టాడు. బాబా, "నేను తిన్నాను. నువ్వు తిను" అని అన్నారు. అందుకు నానా, "ఎప్పుడు బాబా? తెచ్చిన ఎనిమిది పోళీలు అలాగే ఉన్నాయి" అని అడిగాడు. బాబా, "కొంతసేపటి క్రితమే తిన్నాను" అని బదులిచ్చారు. నానా విసుగు చెంది కోపంతో చావడికి వెళ్లిపోయాడు. కానీ వెళ్లేముందు షామాతో, "మీరు బాబా వద్ద ఉండండి. ఆయన పళ్లెంలోని పోళీలు కొంచమైనా తింటే నాకు తెలియజేయండి. అప్పుడే నేను తింటాను" అని చెప్పి మరీ వెళ్ళిపోయాడు. అతను చెప్పినట్లే షామా బాబా దగ్గర కూర్చున్నాడు.

తన బిడ్డ కోపంతో ఏమీ తినకపోతే సాయితల్లి హృదయం చలించకుండా ఉంటుందా? కాసేపటి తర్వాత బాబా, "నానా భోజనం చేశాడా" అని అడిగారు. దానికి షామా, "లేదు బాబా. మీరు అతను నివేదించిన పోళీలు కొంచమైనా తింటేనే అతను తింటాడు" అని అన్నాడు. బాబా నవ్వుతూ, "అరే షామా! అతను నాకోసం పళ్లెం సిద్ధం చేస్తున్నప్పుడే నేను ఈగ రూపంలో అతని నైవేద్యాన్ని స్వీకరించాను" అని అన్నారు. తర్వాత నానాను పిలిపించి, “నేను పోళీ తిన్నాను. ఇప్పుడు నువ్వు మొండిగా ఉండక మంచి పిల్లాడిలా ఆహారం తీసుకో" అని అన్నారు. అతను ఒప్పుకోక మరోసారి చావడికి వెళ్ళిపోయాడు. బాబా అతన్ని మళ్ళీ పిలిపించి, "తిను" అని చెప్పారు. అతను, "మీరు తింటే తప్ప నేను తినను" అని అన్నాడు. అప్పుడు బాబా అతనితో, "నానా! నాతో గడిపిన ఇన్ని సంవత్సరాల్లో నువ్వేమీ తెలుసుకోలేదా? నువ్వు చూసే ఈ నశ్వరమైన శరీరమేనా నేను? నేను ఈగ, చీమ లేదా మరేదైనా రూపంలో నాకు కావాల్సింది తింటాను" అని అన్నారు. "అది నాకు తెలుసుకానీ, ప్రత్యేక్ష అనుభవం లేదు. మీరు ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేసినట్లైతే, ఈ పోళీలను ప్రసాదంగా తీసుకుని తింటాన"ని నానా అన్నాడు. అప్పుడు బాబా తమ చేయి పైకెత్తి ఒక సైగ చేశారు. తద్వారా నానా హృదయంలో చాలా లోతుగా దాచుకున్న రహస్యాన్ని ఆయన బయటపెట్టారు. దాంతో నానా తన హృదయాంతరాలలో ఉన్న రహస్యం బాబాకి ఎలా తెలిసిందని అనుకున్నాడు. దానికి సమాధానం: 'బాబా అంతర్యామి' లేదా 'అతని హృదయంలో కొలువువై ఉన్న అంతరాత్మ' అని మాత్రమే. బాబా అతని అంతర్యామి అయితే, ఆయన ఈగలు, చీమల అంతర్యామి కూడా అయుండాలి. ఆ విషయాన్ని అర్థం చేసుకున్న నానా సంతృప్తి చెంది పూర్ణ పోళీలు ప్రసాదంగా తీసుకోవడానికి అంగీకరించాడు. అప్పుడు బాబా అతనితో, "నేను చేసిన సంజ్ఞను నువ్వు చూసావు. నేను అన్ని జీవులలో ఉన్నానని నువ్వు తప్పకుండా గుర్తుంచుకోవాలి" అని చెప్పారు. ఆ విధంగా బాబా అతనికి చాలా విలువైన పాఠాన్ని నేర్పించి ఆధ్యాత్మిక నిచ్చెన యొక్క చాలా ముఖ్యమైన మెట్టు పైకి తీసుకువెళ్లారు. అంటే భగవంతుని ఇంట్లో, గుడిలో పూజించే విగ్రహానికే పరిమితం చేయకుండా ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని రూపాల్లో ఉన్నాడని గ్రహించడం.

తరువాయి భాగం త్వరలో..


source: లైఫ్ ఆఫ్ సాయిబాబా(రచన: శ్రీబి.వి.నరసింహస్వామి)
 సాయిలీల మ్యాగజైన్స్  - 1986 మరియు 2009.
సాయిబాబా(రచన: శ్రీసాయి శరణానంద)

బాబాస్ వాణి, బాబాస్ అనురాగ్(రచన: విన్నీ చిట్లురి).


 

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 

నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 


సాయిభక్తుల అనుభవమాలిక 1666వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కంటికి రెప్పలా కాపాడే బాబా
2. సాయిని వేడుకున్న కాసేపటికి ఆగిన నీళ్ల విరోచనాలు

కంటికి రెప్పలా కాపాడే బాబా

సాయిభక్తులకు నా నమస్కారాలు. నా పేరు రేవతిలక్ష్మి.  నాకు చిన్నప్పటినుంచి బాబా అంటే చాలా ఇష్టం. చిన్న, పెద్ద ఏ కష్టమైనా, సమస్య అయినా నేను బాబాకే చెప్పుకుంటాను. 2022లో మావారి ఆఫీసులో కొన్ని సమస్యల వలన జీతాలు ఇవ్వడం మానేశారు. మాకు చాలా ఇబ్బంది అయింది. ఎవరిని సహాయం అడుగుదామన్నా మా అక్క,  చెల్లెలు అందరూ మా స్థాయిలో ఉన్నవాళ్లే. అందుకే ఎవరినీ అడగకుండా తప్పనిసరి పరిస్థితుల్లో లోన్ తీసుకుని ఆ డబ్బులతో రోజులు గడిపాము. ఆ లోన్ డబ్బులు కూడా అయిపోవస్తున్న సమయంలో భవిష్యత్తు గురించి నాకు చాలా భయమేసింది. అప్పుడు బాబాని, "మీరే మా కష్టాలు తీర్చాలి. మావారికి ఏదైనా మంచి ఉద్యోగం మీరే ఇప్పించాలి" అని వేడుకున్నాను. అయితే మావారు ఇంటర్వ్యూలకి వెళ్తున్నప్పటికీ,  అంతా సరిగా జరిగినప్పటికీ ఆఖరి నిమిషంలో ఉద్యోగం మాత్రం వచ్చేది కాదు. దాంతో నాకు అన్ని దారులు మూసుకుపోయినట్టు అనిపించింది. ఆ సమయంలో నాకు దాసగణు మహారాజ్ రచించిన 'సాయినాథ స్తవనమంజరి' గుర్తుకు వచ్చింది. అది చదివిన వారి ఏ కోరికైనా బాబా తీరుస్తారు. కానీ ఆ పుస్తకం నాకు అందుబాటులో లేదు. అందుకని విన్నా కూడా అదే ఫలితం ఉంటుందనిపించి టీవీలో పెట్టుకుని ఎంతో భక్తిశ్రద్ధలతో వినికి, "మావారికి ఉద్యోగం రావాల"ని నా కోరిక బాబాకి చెప్పుకున్నాను. అంతే, అనుకోకుండా ఒక ఆవిడ ఫోన్ చేసి మా వారిని ఇంటర్వ్యూకి రమ్మనడం, మావారు వెళ్లడం, ఆ ఉద్యోగం రావడం, మా కష్టాలు తీరడం జరిగిపోయాయి. విషయం ఏమిటంటే, ఎవరో మా ఆయనకి తెలిసినవాళ్ళు మావారి బయోడేటా ఆవిడకి పంపించారట. ఆ విషయం ఆవిడే చెప్పింది. అంతా చేసింది బాబా దయే అని నా నమ్మకం. ఈ అనుభవం నేను ఎప్పటికీ మర్చిపోలేనిది.

మేము ఐదుగురు అక్కచెల్లలం. గత కొంతకాలంగా చిన్న చిన్న అపార్ధాల వల్ల మాలో కొంతమంది మధ్య మనస్పర్థలు వచ్చాయి. అవి పెద్ద గొడవలుగా మారి అందరూ విడిపోతారేమో అని నాకు చాలా భయం పట్టుకుంది. అందువల్ల నేను దిగులుగా ఉంటూ "అలా జరుగుకూడద"ని బాబాను సదా కోరుకుంటూ ఉండేదాన్ని. 2023, సెప్టెంబర్‌లో మా నాన్నగారి సంవత్సరికం జరిగింది. ఆ కార్యక్రమానికి కొన్ని కారణాల వలన నేను వెళ్ళలేకపోయినా మిగతా వాళ్ళు వెళ్లారు. అప్పుడు నేను అక్కడ ఏం గొడవలు జరుగుతాయో అని కంగారుపడి, "బాబా! గొడవలు జరగకుండా మా నాన్నగారి సంవత్సరికం మంచిగా జరగాలి. మీదే భారం. అంతా ప్రశాంతంగా జరిగితే నా అనుభవాలను తోటి భక్తులతో పంచుకుంటాన"ని అనుకున్నాను. బాబా దయవల్ల ఏ గొడవలు లేకుండా కార్యక్రమం చక్కగా జరిగింది. బాబా భక్తులందరికీ తల్లి, తండ్రి, గురువు, దైవం. అందరినీ ఆయన కంటికి రెప్పలా కాపాడుతారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


సాయిని వేడుకున్న కాసేపటికి ఆగిన నీళ్ల విరోచనాలు

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! నేను ఒక సాయిభక్తురాలిని.  మా నాన్నకి 70 సంవత్సరాల వయసు. ఆయనకి 2023, సెప్టెంబరు 12, మంగళవారం రాత్రి హఠాత్తుగా నీళ్ల విరోచనాలు మొదల్యయ్యాయి. మరుసటిరోజు ఉదయం డాక్టర్ వచ్చి మందులు ఇచ్చారు. కానీ విరోచనాలు ఆగలేదు. మధ్యాహ్నం వరకు దాదాపు 30 సార్లు అయ్యాయి. నేను అదే ఊరిలో ఉన్నప్పటికీ వెళ్లి చూడలేని పరిస్థితి. అమ్మకి ఫోన్ చేస్తే, "మీ నాన్న చాలా భయపడుతున్నారు" అని చెప్పింది. అప్పుడు నేను అమ్మతో, "'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని జపించమ"ని చెప్పాను. నేను కూడా ఆ నామాన్ని జపిస్తూ, "బాబా! నాన్న త్వరగా కొలుకుంటే, మీ అనుగ్రహాన్ని తోటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని సాయితండ్రిని ప్రార్థించి కొద్దిగా ఊదీ నా నుదుటన పెట్టుకొని, నాన్నని తలుచుకుంటూ మరికొంత ఊదీ నోట్లో వేసుకున్నాను. కాసేపటికి సాయంత్రం 4 గంటలప్పుడు నాన్నకి వాంతి అయింది. సరిగ్గా అదే సమయానికి డాక్టర్ మళ్ళీ వచ్చి, వేరే టాబ్లెట్లు ఇచ్చి, "తగ్గకపోతే మళ్లీ వస్తాన"ని చెప్పి వెళ్ళారు. కానీ డాక్టరు మళ్ళీ రావాల్సిన అవసరం రాలేదు. సాయి దయవల్ల నాన్నకి వాంతి అయినప్పటి నుండి విరోచనాలు తగ్గాయి, మళ్లీ కాలేదు. "చాలా చాలా ధన్యవాదాలు సాయి. ఇదంతా మీ దయవల్లే తండ్రీ. అందరూ బాగుండేలా చూడండి సాయి".



సాయిభక్తుల అనుభవమాలిక 1665వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శ్రీసాయి అనుగ్రహ లీలలు - 30వ భాగం

నా పేరు సాయిబాబు. 2022, మార్చి 1వ తేదీ, శివరాత్రి మహా పర్వదినం. గుంటూరు-తెనాలి మార్గం మధ్యలో ఉన్న క్వారీ శివాలయం చాలా మహిమ గలది. అక్కడ శివరాత్రి చాలా చాలా ఘనంగా జరుపుతారు. ఆ రోజున చాలామంది భక్తులు వచ్చి శివయ్యను దర్శించుకుంటారు. మేము కూడా అక్కడికి వెళ్లాలనుకున్నాము కానీ, ‘భక్తుల రద్దీ చాలా ఉంటుంది. కనీసం మూడు గంటలసేపు క్యూలో నిలబడాలి’ అని నాకనిపించింది. అందువల్ల ముందురోజు రాత్రే నేను, నా భార్య ఆ శివాలయానికి వెళ్ళాము. అప్పుడు చాలా తక్కువమంది భక్తులున్నారు. వెంట వెంటనే మూడుసార్లు దర్శనం చేసుకున్నాం. మూడోసారి దర్శనానంతరం ఒక అడుగు బయటకు వేసిన నా భార్య ఎందుకో అనుమానమొచ్చి పూజారి దగ్గరకు వెళ్లి, “ఇది బ్రహ్మసూత్రం ఉన్న శివలింగమా?” అని అడిగింది. అందుకు ఆ పూజారి “అవున”ని బదులిచ్చారు. అది విన్న నా భార్య ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే, బ్రహ్మసూత్రమున్నశివలింగాన్ని దర్శించడం అదృష్టం పండితేనే జరుగుతుందని తెలిసి మేము ఐదు, ఆరు నెలల నుండి గూగుల్‌లో వెతుకుతుంటే అలాంటి శివలింగం ఉన్న దేవాలయాలు మాకు చాలా దూరంలో ఉన్నాయని తెలిసి 'ఎప్పుడు బ్రహ్మసూత్రమున్న శివలింగాన్ని దర్శించుకుంటామో!’ అని అనుకుంటున్నాము. అలాంటిది బాబా అంత దూరం వెళ్లాల్సిన పని లేకుండా మా ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలోనే బ్రహ్మసూత్రమున్న శివలింగ దర్శనం చేయించారు. ఎన్నో సంవత్సరాలుగా ఆ శివాలయాన్ని ఎన్నోసార్లు దర్శించుకుంటున్నప్పటికీ అది బ్రహ్మసూత్రమున్న శివలింగమని మాకు అప్పటివరకు తెలీదు. బాబా దయవల్లనే అన్ని సంవత్సరాలుగా తెలియని విషయం తెలిసింది. లేదంటే, ప్రతిసారీలాగానే అప్పుడు కూడా మామూలుగా దర్శనం చేసుకుని వచ్చేసే వాళ్ళము. ఐదు నిమిషాల తర్వాత నేను ఆ పూజారిని మాకు బాగా పరిచయమున్న ఆ ఆలయ అధికారి ఉన్నారా? అని అడిగాను. "లేరండీ. వాళ్లు మారిపోయి ఇంకొకరు వచ్చారు” అని జవాబు ఇచ్చారు పూజారి. నేను మనసులో, "వారు కనుక ఉండుంటే రేపు శివరాత్రి పర్వదినాన ఈ బ్రహ్మసూత్రమున్న శివలింగాన్ని మరింత దగ్గరగా దర్శించుకునేవాళ్ళం కదా బాబా. ఎంతో పుణ్యం వచ్చేది. కానీ శివరాత్రి రోజున వేలల్లో భక్తులు వస్తారు, శివలింగాన్ని దూరం నుండే దర్శించుకోవాలి. సరిగా దర్శనం అవ్వదు” అని అనుకున్నాను. మరునాడు శివరాత్రి రోజున యధావిధిగా మా గృహంలో పూజ చేసుకున్నాం. నా భార్య బ్రహ్మసూత్రమున్న ఆ శివాలయానికి వెళదామని అంది. నేను, “చాలా రద్దీగా ఉంటుంది. అంతసేపూ లైన్లో నిలబడలేము” అని అన్నాను. కానీ చివరికి తప్పనిసరై సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి వెళ్లాం. అక్కడికి వెళ్ళాక ఒకింత ఆశ్చర్యమేసింది. ఎందుకంటే, భక్తులు పెద్దగా లేరు(కొద్దిసేపటి క్రితం వరకు చాలా జనం ఉన్నారట). పది నిమిషాల్లో మాకు దర్శనమైంది. అయితే దూరం నుండే. కానీ బాబా ఉన్నారు కదా! మేము గుడి ద్వారం నుండి కాలు బయటపెట్టగానే ఒకరు కనిపించారు. వారే మాకు బాగా పరిచయమున్న ఆ ఆలయ పాత అధికారి. వారు మమ్మల్ని చూసి కుశల ప్రశ్నలు వేసి మళ్ళీ అదే ద్వారం గుండా లోపలికి పంపి శివలింగాన్ని దగ్గరగా దర్శింపజేసి స్వయంగా మా చేతులతో పూలు సమర్పించుకొని అవకాశం ఇచ్చారు. ఈ భాగ్యం కలిగించింది ఆలయ అధికారే అయినా ఆయన రూపంలో చేయించింది మాత్రం ఆ బాబానే.

2022లో ఒకరోజు మేము పొన్నూరు ఆంజనేయస్వామిని, సహస్రలింగాన్ని దర్శించి చీరాల వెళ్ళాం. అంతలో చీకటి పడింది. అయినా ఇంతదూరం వచ్చి సముద్ర దర్శనం చేసుకోకుంటే ఎలా అని ఓడరేవుకు వెళ్ళాము. లైట్‌హౌస్ కాంతి, పైన చంద్రకాంతి, వెన్నెల్లో సముద్రపు అలలు, చల్లగాలి, ఆకాశంలో చుక్కలు ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది మా మనసులకు. పగలు ఎన్నోసార్లు సముద్ర స్నానానికి వెళ్ళాం కానీ చీకటిపడ్డాక వెళ్ళడం అంత అద్భుతంగా ఉంటుందని మేము ఊహించలేదు. కొంతసేపైన తర్వాత సముద్రానికి, చంద్రునికి దీపాలు పెట్టాలనుకుని కారు హెడ్లైట్ల వెలుగులో ఇసుకలో చిన్న గుంట తీశాము. కానీ వెంటనే ఒక అల రావడంతో గుంట పూడుకుపోయింది. గాలి కూడా ఉదృతంగా ఉంది. ఇలా అయితే ఎలా అని, "ఇక్కడ మాతో దీపాలు పెట్టించి, వాటిని సముద్రుడు స్వీకరించేలా చేయండి బాబా" అని వేడుకొని చిన్న గుంట తీశాము. అప్పటివరకు అక్కడివరకు వచ్చిన అలలు ఈసారి రాలేదు. గాలి కూడా ఇబ్బంది పెట్టలేదు. మేము ఏ ఆటంకం లేకుండా దీపాలు పెట్టి, పూజ చేసి సముద్రుణ్ణి స్వీకరించమనగానే ఒక అల వచ్చి దీపాలను తనతో తీసుకువెళ్లింది. అప్పుడు రాత్రి ఎనిమిది గంటలైంది. కొంతసేపైనా తర్వాత తిరుగు ప్రయాణమయ్యాము. అలా దీపావళి రోజుల్లో కడలికి దీపోత్సవం చేయించారు బాబా. బాబాని ప్రార్థిస్తే అంతా సవ్యంగా జరుగుతుంది.

ఒకప్పుడు ఒక పిచ్చుకల జంట మా ఇంటి ఆవరణలోకి వచ్చి పూలచెట్ల మీద, ప్రహరీగోడ మీద వాలి ఒక గంట అలా ఉండి వెళ్ళిపోతుండేవి. మేము కొంచెం కడిగిన బియ్యం పెడితే తిని, పక్కనే గిన్నెలో ఉంచిన నీళ్లు త్రాగేవి. కొన్నాళ్ల తర్వాత అవి రావడం మానేశాయి. చాలా సంవత్సరాల తర్వాత ఒకరోజు మేము, “ఆ పిచ్చుకల జంటను చూసి చాలా రోజులైంది. కాదు కాదు చాలా సంవత్సరాలైంది. వరిపైర్లకు వేసే కెమికల్స్ వల్ల ఆ గింజలు తిని అవి కనుమరుగైపోయాయేమో’ అనుకున్నాము. అలా అనుకున్న తర్వాత అవి రావడంతో చాలా సంవత్సరాల తర్వాత వాటిని చూసి మాకు చాలా ఆనందంగా కలిగింది. అవి వరుసగా 15 రోజులు వచ్చి 16వ రోజు రాలేదు. అరగంట వేచి చూసినా రాకపోయేసరికి ఎందుకో కొంచెం బాధగా అనిపించి మనసులో, "ఆ పిచ్చుకల జంట ఏమైంది బాబా" అని అనుకున్నాను. ఒక్క నిమిషం గడక ముందే ఆడపిచ్చుక నా ఎదుట ప్రత్యక్షమైంది. అది ఎగురుకుంటూ వచ్చి నా ఎదురుగా ఉన్న గోడమీద వాలింది. నాకు చాలా ఆనందమేసి కొంచెం బియ్యం పెడితే తిని వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆ పిచ్చుకలు ఎప్పుడూ రాలేదు. ఏమయ్యాయో, ఎక్కడున్నాయో బాబాకే ఎరుక. కానీ మనసులో అనుకోగానే బాబా చూపించారు, అది చాలు. "ధన్యవాదాలు బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1664వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయతో తిరుమలలో స్వామివారి దర్శనం
2. సరుకులన్నీ అమ్ముడుపోయేలా అనుగ్రహించిన బాబా

బాబా దయతో తిరుమలలో స్వామివారి దర్శనం

అందరికీ నమస్తే. నా పేరు ఝాన్సీ. మా అమ్మ, అమ్మమ్మ సాయిబాబా భక్తులు. కానీ నేను చిన్న వయసు నుంచి వేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తుండేదాన్ని. నేను M.Sc చదువుతున్నప్పుడు ఒక ల్యాబ్ పరీక్ష విషయంలో నాకు చాలా కష్టంగా అనిపించి చాలా ఆందోళన చెందాను. ఆ సమయంలో ఎవరో పిలిచినట్లనిపించి బాబా ఫోటో వైపు చూస్తే, ఆయన కళ్ళతో "నన్ను అడుగు తల్లీ. నీకు నేను సహాయం చేస్తాను" అని అన్నట్లు అనిపించింది. అప్పుడు నేను, "బాబా! నాకు పరీక్షలో ఏటువంటి ఇబ్బంది లేకుండా చూడు" అనే అనుకున్నాను. అత్యంత అద్భుతం! ఆ రోజు పరీక్ష చాలా తేలికగా జరిగింది. మార్కులు బాగా వేసారు. నేను చాలా సంతోషించాను. ఆ రోజు నుంచి నేను ఎంత పెద్ద కష్టమైనా, చిన్న కష్టమైనా బాబాతో చెప్పుకోవడం మొదలుపెట్టాను. నాకు ఏదో రూపంలో ఆ సమస్యకు పరిష్కారం దొరికేలా బాబా అనుగ్రహిస్తున్నారు.

ఇప్పుడు నా జీవితంలో మర్చిపోలేని ఒక అద్భుతమైన సంఘటన గురించి చెప్తాను. నాకు దూరంగా ఉండేవి కనిపించవు. అందువల్ల నేను కళ్ళజోడు వాడతాను. ఒకసారి తిరుమల వెళ్ళినప్పుడు క్యూలైన్లో నేను తప్పిపోయాను. నా కళ్లద్దాలు మా అమ్మ దగ్గర ఉండిపోయాయి. అందువల్ల కళ్ళద్దాలు లేకుండా నేను క్యూలైన్లో లోపలి వరకు వెళ్ళిపోయాను. కళ్లద్దాలు లేనందున దూరం నుండి స్వామివారిని దర్శించుకోలేక నాకు దుఃఖం ఆగక కళ్ళ నిండా నీళ్లతో బయటకు వచ్చాను. ఆ బాధలో బాబాను, "నా స్వామి దర్శనమయ్యేలా చూడండి బాబా" అని గట్టిగా ప్రార్థించాను. ఈలోగా మా అమ్మ వస్తే, కళ్ళద్దాలు తీసుకుని దైవ సహాయం కన్నా ముందు నా వంతు మానవ ప్రయత్నం చేయాలని అక్కడున్న సెక్యూరిటీతో, "ఇదివరకు నా దగ్గర నా కళ్లద్దాలు లేనందున నాకు స్వామి దర్శనం కాలేదు. ఇప్పుడు నా దగ్గర కళ్లద్దాలు ఉన్నాయి. ఇప్పుడు నన్ను ఒకసారి లోపలికి వెళ్ళడానికి అనుమతించండి" అని అభ్యర్థించాను. కానీ తను ఒప్పుకోలేదు. అయినా నేను ఆగకుండా చొరవ తీసుకొని బయటకు వచ్చే మార్గం గుండా లోపలికి వెళ్ళిపోయాను. లోపల సేవ చేస్తున్నవాళ్ళు నన్ను ఏమీ అనలేదు, పైగా దర్శనం చేసుకో అని ఒక పక్కగా నిలబెట్టారు. నేను స్వామిని బాగా దర్శించుకొని మనసు నిండా ఆనందంతో, కళ్ళ నిండా ఆనందబాష్పాలతో బయటకు వచ్చి బాబాకు చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకున్నాను. థాంక్స్ అనేది చిన్న మాటే కానీ, ప్రేమగా నమ్మకంతో చెప్తే, బాబా ప్రేమగా స్వీకరిస్తారు.


సరుకులన్నీ అమ్ముడుపోయేలా అనుగ్రహించిన బాబా

సాయిబంధువులకు నమస్కారాలు. పిలవగానే పలికే మన సాయితండ్రికి శతకోటి వందనాలు. నేను ఒక సాయి భక్తురాలిని. వినాయకచవితి పండగ సందర్భంగా మావారు అమ్మకం కోసం కొన్ని సరుకులు తీసుకొచ్చి పండగ ముందురోజు వాటిని అమ్మకానికి పెట్టారు. అయితే ఆరోజు మావద్ద ఎవరూ ఏమీ తీసుకోలేదు. చుట్టుపక్కల ఉన్నవాళ్ళందరికీ వ్యాపారం బాగా జరుగుతున్నప్పటికీ మాకు ఏమాత్రమూ వ్యాపారం జరగలేదు. దాంతో మావారు చాలా దిగులుగా అయిపోయారు. తనని చూస్తే నాకు బాధగా అనిపించి, "అందరిలాగే మాకు కూడా వ్యాపారం చక్కగా జరిగితే బాగుండు బాబా" అని బాబాతో చెప్పుకున్నాను. తర్వాత, "బాధపడకండి ఏమీ కాదు. ఇంకోరోజు ఉంది కదా! అన్నీ సరుకులు అమ్ముడైపోతాయేమో లెండి. మీరు బాధపడకండి" అని మావారికి కూడా కాస్త ధైర్యం చెప్పాను. నా మనసులో, "బాబా! మాక్కూడా వ్యాపారం జరిగేలా చూడు తండ్రీ" అని బాబాకి అనుక్షణం దణ్ణం పెట్టుకుంటూ గడిపాను. బాబా నా మోర విన్నారు. పండగరోజు సాయంత్రం కల్లా తెచ్చిన సరుకులన్ని అమ్ముడైపోయాయి. బాబా దయకు మాకు చాలా సంతోషంగా అనిపించింది. మనసులోనే బాబాకు చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. "మీరు చూపిన ప్రేమకు చాలా కృతజ్ఞతలు బాబా. ఎల్లప్పుడూ మీ ప్రేమ మీ బిడ్డలపై చూపు తండ్రీ".

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1663వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. 'నేను నీతోనే, నీ వెంటే ఉన్నాన'ని ఆశీర్వదించిన బాబా
2. బాబా ఊదీ వాడడం వల్ల తగ్గిన బాధ

'నేను నీతోనే, నీ వెంటే ఉన్నాన'ని ఆశీర్వదించిన బాబా

సాయిభక్తులకు నా నమస్కారాలు. నా పేరు త్రివేణి. 5 సంవత్సరాలుగా నేను గర్భవతినన్న వార్తకోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. అందుకోసం నేను IVF చికిత్స చేయించుకుంటున్నాను. అందులో భాగంగా జరిగిన ఎంబ్రియో ట్రాన్స్ఫర్ గురించి 2023, సెప్టెంబర్ 22న ప్రచురితమైన అనుభవమాలిక 1632వ భాగంలో పంచుకున్నాను. అందులో నేను చివరిన బాబాను, "FET ప్రక్రియ విజయవంతమై నేను గర్భవతినయ్యేలా చూడమ"ని వేడుకున్నాను. బాబా దయవల్ల ఆ ప్రక్రియ విజయవంతమై నేను గర్భవతినయ్యాను. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఐదేళ్లగా ఎదురుచూస్తున్న కోరిక బాబా దయవల్ల నేరవేరింది. డాక్టర్ 2023, సెప్టెంబర్ 22న కడుపులోని బిడ్డ హార్ట్ బీట్ తెలుసుకోవటానికి స్కాన్ చేద్దామని చెప్పారు. ఆరోజు నాకు చాలా టెన్షన్‌‌గా అనిపించింది. నాకు రోజూ ఈ బ్లాగులో బాబా సందేశం చదవడం అలవాటు. ఆరోజు కూడా హాస్పిటల్‌‌కి వెళ్తున్నప్పుడు దారిలో బ్లాగ్ ఓపెన్ చేసి "బుద్ధి, మనసు ఏకం చెయ్యి" అన్న బాబా సందేశం మొదట చదివాను. ఆ సందేశం నాకోసమే అనిపించింది. తర్వాత అక్కుడున్న అనుభవాలు చదువుతుంటే అక్కడ రెండ అనుభవం నాదే. అది చూడగానే నాకు ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు వచ్చేశాయి. ఎందుకంటే, అప్పటికి ఎన్నో రోజుల నుండి బాబాని, "నా అనుభవం పబ్లిష్ అయ్యేలా చేయమ"ని అడుగుతున్నాను. కానీ ఆరోజు వరకు పబ్లిష్ కాలేదు. అలాంటిది ఆరోజే పబ్లిష్ అయ్యేలా అనుగ్రహించి తద్వారా స్కాన్‌‌కి వెళ్తున్న నన్ను, 'నేను నీతోనే, నీ వెంటే ఉన్నాన'ని బాబా ఆశీర్వదించారు. తర్వాత ఇంకో అద్భుతం కూడా జరిగింది. నా అనుభవం చదివాక బాబాని ఒకసారి చూడాలనిపించింది. అయితే మేము వెళ్ళే దారిలో ఒక్క బాబా గుడి కూడా లేదు. అందువల్ల నేను బాబా కనిపించరనుకున్నాను. కానీ మనం మనస్ఫూర్తిగా బాబాని ఏదైనా కోరుకుంటే జరగకుండా ఉంటుందా? ఆయన ఏం చేసారో తెలుసా? హాస్పిటల్‌‌కి దగ్గర్లో ఒక సిగ్నల్ దగ్గర మా క్యాబ్ ఆగింది. అదివరకే నాకు వాంతి అయి నీరసంగా పడుకుని ఉన్న నేను అనుకోకుండా ఒక ఆటోలో కొంచెం పెద్ద సౌండ్‌‌తో పాటలు వినిపిస్తే అటు చూసాను. ఆ ఆటో లోపల ఫోటో రూపంలో బాబా నాకు దర్శనం ఇచ్చారు. నాకు చాలా సంతోషమేసింది. తర్వాత హాస్పిటల్‌‌కి వెళ్లి స్కాన్ చేయించుకున్నాక డాక్టరు, “బేబీ హర్ట్ బీట్ వినిపిస్తుంది” అని చెప్పారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. నాకు ఒక కోరిక ఉంది, అది నెరవేరేలా చూడు బాబా. అలాగే చెల్లికి మంచి సంబంధం కుదిరి త్వరగా పెళ్లి అయ్యేలా చూడు బాబా. ఇప్పటికే తన పెళ్లికి ఆలస్యమైంది. ఇంకా ఆలస్యం చేయకు బాబా".


బాబా ఊదీ వాడడం వల్ల తగ్గిన బాధ

ఓం సాయినాథాయ నమః!!! అందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. 2023, మే నెలలో ఎండ తగిలితే నాకు దద్దుర్లు రావడం మొదలుపెట్టాయి. అలా చాలా రోజులు నేను ఇబ్బందిపడ్డాక చివరికి ఇంట్లో ఉన్న కూడా దద్దుర్లు రాసాగాయి. ఎంతోమంది వైద్యుల్ని సంప్రదించాను. కానీ, నా బాధ తీరులేదు సరికదా ఆ బాధ తీవ్రత మరింత పెరుగుతుండేది. అలా సుమారు నాలుగు నెలలపాటు నేను చాలా ఇబ్బందిపడ్డాను. చివరిగా నేను, "సాయీ! మీరే నాకు దిక్కు. నాకు గనక నయమైతే మీ అనుగ్రహాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని సాయిబాబాను వేడుకున్నాను. రెండు, మూడు రోజుల్లో 'కాఫీ తాగడం వల్ల అలా దద్దుర్లు వస్తున్నాయ'ని బాబా సూచనప్రాయంగా నాకు తెలియజేశారు. అంతేకాదు, నా స్నేహితురాలి ద్వారా "బాబా ఊదీ వాడు" అని సలహా ఇచ్చారు. దాంతో నేను కాఫీ తాగడం మానేసి బాబా ఊదీ వాడటం మొదలుపెట్టాను. దాంతో బాబా దయవల్ల దద్దుర్లు తగ్గిపోయి నా ఆరోగ్యం చాలా బాగుంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1662వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. జీవితంలో ప్రతి కష్టంలో తోడుగా నిలిచినా సాయిబాబా
2. మనందరి రక్షకుడు అయిన బాబా

జీవితంలో ప్రతి కష్టంలో తోడుగా నిలిచినా సాయిబాబా

సాయిభక్తులందరికీ నమస్కారం. నేను ఒక బాబా భక్తురాలిని. ఆయన దయతో నేను, నా బాబు చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాము. అందుకు నేను బాబాకి కృతజ్ఞతలు చెప్పని రోజు లేదు. సాయి నా జీవితంలోకి 2011లో వచ్చారు. ఆ సమయంలో నేను డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను. అయితే ప్రతి ప్రయత్నంలో వైఫల్యం ఎదురై బాగా ఆందోళనకి గురయ్యాను. అలా 4 ఏళ్ళు గడిచాయి. నా స్నేహితులందరికీ ఏదో ఒక ఉద్యోగం వచ్చి స్థిరపడుతున్నా నేను మాత్రం అలాగే ఉండిపోయాను. పరిస్థితి అలా ఉన్నా నాకు దేవుని మీద నమ్మకం పోలేదు. ఆ సమయంలో మా ఇంటి పక్కన ఉండే ఒక అక్క, "పారాయణ చేయమ"ని సాయి సచ్చరిత్ర పుస్తకం ఇచ్చింది. నేను సరేనని పారాయణ మొదలుపెట్టాను. అంతలో నాకు పెళ్లి కుదిరింది. అంతా బాబా దయ అనుకొని పెళ్లి చేసుకున్నాను. కానీ రోజూ, "బాబా! నాకు ఉద్యోగం చేయాలని, తర్వాత పెళ్లి చేసుకోవాలని వుండేది. కానీ ఇలా అయింది" అని బాబాతో చెప్పుకుంటూ ఉండేదాన్ని.

నా వైవాహిక జీవితం అస్సలు బాగుండేది కాదు. అందువల్ల నాకు భయమేసి, "ఏంటి, ఈ జీవితం? నా వల్ల కావట్లేదు బాబా. నాకు ఒక ఉద్యోగం ఉంటే, కాస్తైనా నా జీవితం ప్రశాంతంగా ఉంటుంద"ని అని బాబాతో చెప్పుకున్నాను. 2015లో ఒక జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. నేను ముందు దరఖాస్తు చేయాలని అనుకోకపోయినప్పటికీ ఇదే చివరి ప్రయత్నమని దరఖాస్తు చేసి పరీక్ష వ్రాసాను. బాబా నాకు తోడుగా ఉండి నన్ను ఫైనల్ స్టేజ్ వరకు తీసుకెళ్లారు. 2016, ఏప్రిల్ 1న వచ్చిన ఫలితాలు చూసినప్పుడు ఇది నా రిజల్ట్‌యేనా అనిపించింది. ఎందుకంటే, ఒకేసారి నాకు రెండు బ్యాంకు ఉద్యోగాలు వచ్చాయి. నాకు చాలా సంతోషంగా అనిపించింది. బాబా దయవల్ల నా జీవితంలో నేను సాధించిన విజయం అది. బాబా లేకుంటే అది సాధ్యమని నేను ఈరోజుకీ ఊహించలేను.

మొదటి జీతం తీసుకుని శిరిడీ వెళ్ళాలని అనుకున్నట్లే, జీతం రాగానే శిరిడీ వెళ్లి నా మొక్కు తీర్చుకున్నాను. బాబా దర్శనం బాగా జరిగింది. బాబా మీద నమ్మకంతో, ఆయన పూజలతో రోజులు గడిచిపోయాయి. ఆయన దయతో నేను గర్భవతినయ్యాను. ఆ సమయంలో నేను సచ్చరిత్ర చదువుతూ, "బాబా! నాకు సుఖ ప్రసవమయ్యేలా దయ చూపమ"ని బాబాను ప్రార్ధించాను. కాన్పు విషయంలో అందరూ భయపడ్డారు కానీ, బాబా వెన్నంటే ఉండి అంతా తానే నడిపించారు.  2017లో నాకు నార్మల్ డెలివరీ అయి బాబు పుట్టాడు.

ఇటీవల మేము బాబా దర్శనానికి శిరిడీ వెళ్లాలనుకొని ట్రైన్ టికెట్ల కోసం ప్రయత్నిస్తే, ఏ ట్రైన్‌కీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నట్లు చూపలేదు. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ మేము శిరిడీ వెళ్లాలన్న రోజుకి 3రోజుల ముందు అకస్మాత్తుగా స్పెషల్ ట్రైన్ నోటిఫికేషన్ వచ్చింది. వెంటనే మొబైల్లో చూస్తే, చాలా టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే తిరుగు ప్రయాణానికి కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది నిజంగా బాబా చేసిన అద్భుతం. ఆయన మమ్మల్ని శిరిడీకి రమ్మంటున్న సంకేతంగా భావించి టికెట్లు బుక్ చేసుకొని శిరిడీ వెళ్ళాము. బాబా దయతో దర్శనం బాగా జరిగింది. "ధన్యవాదాలు బాబా. అందరినీ సదా రక్షిస్తూ ఉండు తండ్రీ".


మనందరి రక్షకుడు అయిన బాబా

సాయిబిడ్డలందరికీ నమస్కారం. నా పేరు ఉపేంద్ర. 2023, సెప్టెంబరు 13, రాత్రి మా అమ్మాయికి 102 డిగ్రీలకు పైగా జ్వరం వచ్చింది. గతంలో ఇలా వచ్చినప్పుడు తనకి టాబ్లెట్ వేసినా జ్వరం తగ్గలేదు. అందువల్ల ఈ రాత్రివేళ ఇబ్బంది అవుతుందని నాకు భయమేసింది. వెంటనే మనందరి రక్షకుడు అయిన బాబాను, "అమ్మాయికి జ్వరం తగ్గిపోవాల"ని కోరుకొని టాబ్లెట్ వేశాను. తెల్లారేసరికి అమ్మాయికి జ్వరం తగ్గింది. "థాంక్యూ బాబా".  

ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః!!!


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo