1. బాబా దయతో కలిగిన సంతానం2. ఉద్యోగం ప్రసాదించి బాధను తీర్చిన బాబా
బాబా దయతో కలిగిన సంతానం
ఓం శ్రీ శిరిడీ సాయినాథాయ నమః!!! నా పేరు తిలోత్తమ్మ. నేను ప్రతిరోజు బ్లాగులో ప్రతిరితమయ్యే అనుభవాలు చదువుతుంటాను. తద్వారా నాకు బాబాపట్ల భక్తి, విశ్వాసాలు వృద్ధి చెందుతున్నాయి. నేనిప్పుడు బాబా నా జీవితంలో ప్రసాదించిన అద్భుతమైన వరం గురించి పంచుకోబోతున్నాను. నాకు వివాహమై కొన్ని సంవత్సరాలవుతున్నా సంతానం కలగలేదు. ఎన్నో హాస్పిటళ్లు, గుళ్లకు తిరిగాము. అయినా ఫలితం కనిపించలేదు. నేను చాలా బాధపడుతూ, "బాబా! మాకు వివాహమై ఇన్ని సంవత్సరాలవుతున్నా సంతానం లేదు. అందుకోసం మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము. మీ దయతో మాకు త్వరగా సంతానం కలిగేలా చూడండి" అని బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఇలా ఉండగా మందులు ఎక్కువగా వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో మందులు వాడటం ఆపేసాను. తర్వాత ఒకరోజు మా అమ్మ, "9 ఐదు రూపాయల నాణాలు ముడుపు కట్టి బాబా పాదాల వద్ద ఉంచి తొమ్మిది వారాల తర్వాత గుడిలో సమర్పించమ"ని చెప్పింది. నేను అలాగే చేశాను. తొమ్మిది వారాలు పూర్తయ్యాక సమయం దాటినా నాకు నెలసరి రాలేదు. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుందామంటే భయమేసింది. ఎందుకంటే, గతంలో నేను ఎప్పుడు ఆశగా ప్రెగ్నెన్సీ టెస్టు చేసుకున్న నెగిటివ్ మాత్రమే వచ్చేది. కాబట్టి ఈసారి బాబాని తలుచుకొని టెస్టు చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. నా సంతోషానికి అవధులు లేవు. నేను అప్పటికి ఒక్కసారి కూడా పారాయణ పూర్తి చేయలేదు. అయినా బాబా నా జీవితంలో నేను మర్చిపోలేని అద్భుతమైన వరాన్ని ప్రసాదించారు. ఆరో నెలలో డాక్టర్, "టిఫా స్కానింగ్ చేయించుకోమ"ని చెప్పారు. అప్పుడు నేను, "బాబా! రిపోర్టు నార్మల్ వచ్చేలా చూడండి." అని అనుకున్నాను. బాబా దయతో రిపోర్ట్ నార్మల్ వచ్చింది. ఇకపోతే, గర్భవతిగా ఉన్నప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా బాబాని తలుచుకున్నంతనే సమస్య పరిష్కారం అయ్యేది. అలా నెలలు నిండి తొమ్మిదో నెల వచ్చింది. డాక్టర్ దగ్గరకి వెళితే స్కాన్ చేయాలని చెప్పారు. స్కాన్ చేయిస్తే, "కడుపులో బిడ్డ ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ ఉందని, వెంటనే ఆపరేషన్ చేయాలి" అని అన్నారు. ఆ విషయం వినగానే మాకు చాలా భయమేసింది. నేను, "బాబా! ఆపరేషన్ అంతా బాగా జరిగేలా అనుగ్రహించండి" అని ప్రార్థించసాగాను. బాబా దయవల్ల 2023, జూలై 20, గురువారం నాడు మంచి ఆరోగ్యంతో పండంటి పాప మాకు పుట్టింది. ఈవిధంగా బాబా మా చిరకాల కోరికను నెరవేర్చారు. "ధన్యవాదాలు శిరిడీ సాయినాథా".
సర్వం శ్రీసాయినాథయ నమః!!!
ఉద్యోగం ప్రసాదించి బాధను తీర్చిన బాబా
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! సాయిభక్తులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇంటర్ వరకు తెలుగు మీడియంలో చదివాను. డిగ్రీ ఇంగ్లీషు మీడియంలో పూర్తి చేశాను. కానీ నాకు ఇంగ్లీషులో మాట్లాడడం సరిగ్గా రాదు. ఈ రోజుల్లో ఇంగ్లీషు వస్తేనే ఉద్యోగం ఇస్తున్నారు. అందువల్ల నేను 3 స్కూళ్ళలో ప్రయత్నించినప్పటికీ ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేనన్న కారణంగా నన్ను తిరస్కరించారు. నేను చాలా బాధపడ్డాను. నాకు ఇంకా ఉద్యోగం రాదు, నేను ఉద్యోగం చేయలేనని ఉద్యోగ ప్రయత్నాలు ఆపేసాను. కానీ రోజూ బాబా దగ్గర బాదపడుతూ, "నాకు ఒక ఉద్యోగం ప్రసాదించమ"ని అడుగుతుండేదాన్ని. బాబా దయవలన 2023, ఆగస్టు 14న నేను అదివరకు ప్రయత్నించిన ఒక స్కూలువాళ్ళు నన్ను బుధవారం నుండి రమ్మని చెప్పారు. అది విని నాకు చాలా సంతోషమేసి, "అలాగే వస్తాను" అని చెప్పాను. కానీ ఆ రోజు సాయంత్రం నుంచి మా బాబుకి దగ్గు, జలుబు మొదలయ్యాయి. ఆ రెండు వస్తే జ్వరం కూడా వస్తుందని నాకు ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే, అంతకుముందు జలుబు, దగ్గు వచ్చినా ప్రతిసారీ జ్వరం వచ్చింది. ఈసారి కూడా జ్వరం వస్తే మావారు ఎక్కడ, "నువ్వు ఉద్యోగం చేయకు. పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉండు అంటార"ని నాకు చాలా భయమేసి చాలా బాధపడ్డాను. బాబా ఊదీ పెడదామనుకుంటే ఆ సమయంలో మాకు అంటు ఉన్నందున దేవుని దగ్గరకు వెళ్లలేని పరిస్థితి. అందువల్ల, "బాబా! నేను ఏం చేయాలి? ఎటూ తేల్చుకోలేకున్నాను" అని చాలా బాధపడ్డాను. తర్వాత రోజు మా చిన్నోడికి కూడా జలుబు, దగ్గు మొదలైంది. ఇక నా బుర్ర పని చేయలేదు. "బాబా! వాళ్ళకి తగ్గిపోయేలా చూడండి" అని అనుకుంటూ పౌడర్ తీసుకొని, "ఇదే మీ ఊదీ అనుకోని పిల్లలకు పెడుతున్నాను. వాళ్ళకి జ్వరం రాకుండా దగ్గు, జలుబు తొందరగా తగ్గిపోయేలా చేసి నేను ఉద్యోగానికి వెళ్లేలా చూడు తండ్రీ" అని బాబాని వేడుకొని పిల్లలకి పెట్టాను. బాబా దయవల్ల వాళ్ళకి జ్వరం రాలేదు. స్కూలు మాన్పించాల్సిన పనిలేకుండా తొందరగానే జలుబు, దగ్గు కూడా తగ్గిపోయాయి. నేను సంతోషంగా ఉద్యోగానికి వెళ్ళాను. అయితే మేడం, "రెండురోజులు చూసాక రావాలో, వద్దో చెప్తాను" అని అన్నారు. నేను, "ఏంటి బాబా? ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి. అంతా నువ్వే చూసుకో. నాకు ఉద్యోగం వచ్చేలా చేయి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల మేడం, "సోమవారం నుండి కంటిన్యూగా రండి" అని చెప్పారు. ఆ క్షణం నేను ఎంత ఆనందపడ్డానో మాటల్లో చెప్పలేను. సాయి ప్రేమ, కృప అనంతం. నమ్ముకున్నవాళ్ళకి అండగా నిలిచే కరుణమూర్తి. ఆయన నాకు ఉద్యోగం ప్రసాదించి నా బాధ తీర్చారు. "కోటి కోటి కృతజ్ఞతలు బాబా".

