సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుడు - ముకుందశాస్త్రి లేలే


ముకుందశాస్త్రి లేలే కొంకణ బ్రాహ్మణుడు. అతడు పూణేలోని శనివార్‌పేట్‌లో నివాసముండేవాడు. శ్రీసాయిబాబాతో తనకున్న అనుభవాలను 1936 జూన్ 17న దివంగత శ్రీబి.వి.నరసింహస్వామిగారికి అతడు ఈక్రింది విధంగా తెలియజేశాడు:

నేను 1912వ సంవత్సరంలో తరచుగా శిరిడీ వెళ్లి బాబాను దర్శించేవాడిని. ఒకసారి నేను నానాసాహెబ్ చందోర్కర్‌తో కలిసి టాంగాలో ప్రయాణించాను. దారిలో గుర్రం వెనుక కాళ్లపై లేచినందువల్ల టాంగా ప్రక్కకి పడిపోయింది. కానీ బాబా దయవలన గాయాలపాలు కాకుండా మేమిద్దరం క్షేమంగా బయటపడ్డాము. అదేసమయంలో ద్వారకామాయిలో ఉన్న బాబా తమ చేతులు శంఖంలా కలిపి ఊదుతూ, "నానా చావనున్నాడు. కానీ నేనతన్ని చావనిస్తానా?" (నానా ఆతా మారత్  హోతే, మీ మరూన్ దేయిన్ కాయ్?) అని అన్నారు. ఇది జరిగిన ఎనిమిది రోజుల తర్వాత మేము శిరిడీ వెళ్ళాము. బాపూసాహెబు జోగ్ నాతో ఎనిమిది రోజుల ముందు బాబా పైవిధంగా అన్నారని చెబుతూ, "అది నిజమేనా?" అని అడిగాడు. నేను అవునని చెప్పి, జరిగినదంతా వివరించాను.

1914లో నా భార్య ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్నప్పుడు నేను శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాను. ఆయన నాకు రెండు బర్ఫీ ముక్కలు ఇచ్చి, "వెళ్ళు" అన్నారు. వెంటనే నేను ఇంటికి వెళ్ళాను. నా భార్యకు సుఖప్రసవమయింది. ఇప్పుడు నాకు నలుగురు పిల్లలు.

నేను మసీదులో సాయిబాబాను పూజించేటప్పుడు ఆయన నాతో, "నారాయణోపనిషత్తు (తైత్తిరీయ ఉపనిషత్తు) పఠించమ"ని చెప్పారు. వారు ఆదేశించినట్లుగానే నేను వారి సన్నిధిలో పదిరోజులు ఆ ఉపనిషత్తు పఠించాను. నేను ఆ  ఉపనిషత్తును కాకాసాహెబ్ దీక్షిత్‌కు కూడా బోధించాను. బాబా అప్పుడప్పుడు నా ముందు భగవద్గీతలోని (అపిచేత్ సుదరాచార్) శ్లోకాలను, మరికొన్ని ఇతర సంస్కృత పద్యాలను పఠించారు. ఆయనకు సంస్కృతం బాగా తెలుసు.

సమాప్తం

Source: Devotees' Experiences of Shri Sai Baba, Part III by Late Shri.B.V.Narasimha Swamiji.

సాయిభక్తుల అనుభవమాలిక 243వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. ఊదీ లీలలు
  2. పోగొట్టుకున్న బ్యాగు తిరిగి దొరికేలా చేశారు బాబా

ఊదీ లీలలు

బహ్రెయిన్‌ నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిసోదరులందరికీ నా నమస్కారములు. నేను బాబాకు సాధారణ భక్తురాలిని. ముందుగా నేను చాలాకాలం తరువాత ఈ అనుభవాన్ని పంచుకుంటున్నందుకు బాబాకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం నా భర్త తీవ్రమైన బి.పి.పి.వి(Benign paroxysmal positional vertigo)తో చాలా బాధపడ్డారు. బాబా దయతో కొన్ని సంవత్సరాలకి ఆ సమస్య నుండి ఆయన బయటపడ్డారు. కానీ ఇప్పటికీ అప్పుడప్పుడు ఆయన తీవ్రమైన తలభారంతో బాధపడుతుంటారు. ఆయనకి తలనొప్పి వచ్చిన ప్రతిసారీ నేను భయంతో అల్లాడిపోతాను.

కొన్ని నెలల క్రితం ఒకసారి మావారు ఆఫీసులో ఉండగా హఠాత్తుగా తీవ్రమైన తలనొప్పి వచ్చింది. ఆయన పెయిన్ కిల్లర్స్ తీసుకున్నాగాని ప్రయోజనం లేకపోయింది. ఆయన ఇంటికి వచ్చాక నేను ఆయన పరిస్థితి తెలుసుకుని, "బాబా! అరగంటలోగా నా భర్తకు తలనొప్పి నుండి ఉపశమనం కలిగేలా చేయండి" అని బాబాను ప్రార్థించి ఊదీని నీళ్లలో కలిపి నా భర్తకిచ్చాను. ఊదీ అద్భుత మహిమ వలన అరగంటలో ఆయనకు తలనొప్పి తగ్గిపోయింది. 

ఇంకో సందర్భంలో నా భర్త కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చింది. అప్పుడు కూడా నేను బాబా ఊదీని నీళ్లలో కలిపి ఆయనకిచ్చాను. దానితో ఆయనకి నయమైంది.

మరో అనుభవం: మావారు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఉద్యోగం చేస్తున్నారు. ఒకసారి ఆఫీసులో కొన్నిరోజులపాటు పని ఒత్తిడి చాలా ఎక్కువైంది. అప్పుడు ఉన్నట్టుండి ఆయనకి బి.పి ఎక్కువై తల వెనుకభాగంలో తీవ్రమైన నొప్పి మొదలైంది. తనకి చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆఫీసు నుండి త్వరగా వచ్చే వీలులేకపోయింది. పోనీ సిక్ లీవ్ తీసుకుందామంటే నెలాఖరులోగా ఆయన మేనేజ్‌మెంట్‌కు నివేదిక సమర్పించాల్సివుంది. ఆఫీసు నుండి చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాక ఆయన నాతో తన తలనొప్పి గురించి చెప్పారు. నేను డాక్టర్ దగ్గరకు వెళ్దామని అన్నాను. కానీ ఆయన చాలా అలసిపోయి ఉన్నందున వెళ్ళడానికి సిద్ధంగా లేరు. ఇక చేసేది లేక నేను, "బాబా! ఉదయానికల్లా నా భర్త తలనొప్పి తగ్గిపోతే, ఈ అనుభవంతోపాటు మునుపటి అనుభవాలను కూడా బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించి మావారికి బాబా ఊదీని నీళ్లలో కలిపి ఇచ్చాను. బాబా దయవల్ల ఉదయానికి నా భర్త తలనొప్పి తగ్గిపోయి, బి.పి కూడా సాధారణ స్థాయికి వచ్చింది. "బాబా! చాలా చాలా కృతజ్ఞతలు. అజ్ఞానంతో తెలిసీ తెలియక చేసిన మా తప్పులను దయచేసి క్షమించి మీ ప్రేమను మాపై కురిపించండి".

పోగొట్టుకున్న బ్యాగు తిరిగి దొరికేలా చేశారు బాబా

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

దాదాపు 10 సంవత్సరాల నుండి నేను సాయిబాబాకు భక్తురాలిని. ఆయనలేని జీవితాన్ని నేను ఊహించలేను. నా జీవితంలో బాబా ఇచ్చిన అనుభవాలు లెక్కలేనన్ని ఉన్నాయి. వాటిలో ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. 


ఇటీవల మేము శిరిడీ నుండి తిరుగు ప్రయాణమవుతున్నప్పుడు పూణేలో ఉన్న గణపతి ఆలయం, గురుద్వారా, మరికొన్ని ఇతర ప్రదేశాలను సందర్శించాలని అనుకున్నాము. ముందుగా గణపతి ఆలయాన్ని దర్శించిన తరువాత క్యాబ్‌ అందుబాటులో లేకపోవడంతో ఆటోలో గురుద్వారాకు వెళ్ళాము. ఆటో దిగే సమయంలో మా అత్తగారు తన బ్యాగును ఆటోలో మరచిపోయారు. అందులో డబ్బు, డైమండ్ చెవిరింగులు ఉన్నాయి. ముఖ్యంగా శిరిడీ ప్రసాదం, ఊదీ కూడా ఆ బ్యాగులోనే ఉండటంతో నేను చాలా కలతచెందాను. ఆటోడ్రైవరును సంప్రదించడానికి ఫోన్ నెంబర్ కూడా మావద్ద లేదు. కాబట్టి ఏమి చేయాలో అర్థం కాలేదు. శిరిడీ పర్యటనలో అలా జరగడం నేను అపశకునంగా భావించాను. బాబా తన భక్తులకు ఏ చెడూ జరగనివ్వరని తెలిసినా కూడా నేను బాధపడకుండా ఉండలేకపోయాను. మళ్ళీ మా బ్యాగు దొరుకుతుందనే ఆశ లేకపోయినప్పటికీ మేము గురుద్వారా వద్దే ఎక్కువ సమయం వేచివుందామని నిర్ణయించుకున్నాము. ఆ సమయమంతా నేను బాబాను ప్రార్థిస్తూనే ఉన్నాను. కొంతసేపటికి ఆయన అద్భుతం చేసారు. ఆటోడ్రైవర్ మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మా బ్యాగ్ మాకు తిరిగి ఇచ్చాడు. నేను అస్సలు ఊహించనిది నా కళ్ళముందు జరిగేసరికి బాబా చూపిన దయకు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నా శరీరమంతా రోమాంచితమైంది. ఈ అద్భుతమైన అనుభవాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను. "బాబా! నాతోనే ఉంటూ నా నమ్మకాన్ని నిలబెట్టినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. దయచేసి మీ ఆశీస్సులు సదా నాపై ఉంచండి". 

సాయిభక్తుడు - గణేష్ రఘునాథ్ తేలి


గణేష్ రఘునాథ్ తేలి గౌరవ మేజిస్ట్రేట్. అతడు థానాలోని బొంబాయి రోడ్డులో నివాసముండేవాడు. అతడు శ్రీసాయిబాబాతో తనకున్న అనుభవాలను 1936 డిసెంబర్ 13న దివంగత శ్రీబి.వి.నరసింహస్వామిగారికి ఈక్రింది విధంగా తెలియజేశాడు:

నేను 1914 లేదా 1915వ సంవత్సరంలో సాయిబాబా దర్శనానికి వెళ్లాను. బాబా, "ఒక రూపాయి రెండు అణాల ఆరు పైసల దక్షిణ ఇవ్వు" అని నన్ను అడిగారు. అప్పుడు నా జేబులో సరిగ్గా వారడిగినంత పైకమే వుంది. అదే మొత్తాన్ని ఆయన అడగడం వారి సర్వజ్ఞతకు నిదర్శనం. వెంటనే నేను ఆ మొత్తాన్ని బాబాకు సమర్పించాను. ఆ సమయంలో నాతోపాటు చంద్రాబాయి అనే నర్సు ఉంది. బాబా ఆమెను "ఆరు రూపాయల ఏడు అణాలు" దక్షిణ అడిగారు. ఆశ్చర్యంగా ఆమె వద్దనున్న మొత్తం కూడా అదే. ఆమె కూడా ఆ మొత్తాన్ని బాబాకు దక్షిణగా ఇచ్చింది. తరువాత మేము అదేరోజు శిరిడీ నుండి తిరుగు ప్రయాణమవ్వడానికి బాబాను అనుమతి కోరాము. బాబా ఆమెతో, "కొన్నిరోజులు ఉండకూడదా?" అన్నారు. అందుకామె వేరేచోట ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలకు వెళ్ళవలసి ఉందని విన్నవించుకుంది. ఆ రాత్రే మేము శిరిడీ నుండి బయలుదేరాము. అదే రాత్రి ఆమె ఇంట దొంగలుపడి 500 రూపాయల విలువగల ఆస్తిని దోచుకోవడమేకాక, ఇంటిలోని వస్తువులను కూడా ధ్వంసం చేశారు. నాకు బాబాతో  పంచుకోవడానికి వేరే అనుభవాలు లేవు. నేను కేవలం సాయిబాబా దర్శనం కోసమే శిరిడీ వెళ్ళాను. ఆయన దర్శనంతో ఆయనపై నాకున్న నమ్మకం పెరిగింది. అది నాకు చాలు. శిరిడీ నుండి వచ్చిన తరువాత సంవత్సరంలోపే నాకు కొడుకు పుట్టాడు. వాడి పేరు నానూ.

సమాప్తం.

Source: Devotees' Experiences of Shri Sai Baba, Part III by Late Shri.B.V.Narasimha Swamiji.

సాయిభక్తుల అనుభవమాలిక 242వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  1. అందమైన శిరిడీయాత్రతో ఆశీర్వదించిన బాబా
  2. దొరికిన ఉంగరం - పెరిగిన నమ్మకం

అందమైన శిరిడీయాత్రతో ఆశీర్వదించిన బాబా

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:


నేనొక సాధారణ సాయిభక్తురాలిని. నేను ప్రాపంచిక విషయాల కోసం సాయిని చికాకు పరుస్తున్నా, పదేపదే తప్పులు చేస్తున్నా, ప్రతికూలమైన ఆలోచనలు చేస్తున్నా నా సాయి ఎంతో దయతో నన్ను తమ నీడలో ఉంచుకుని చల్లగా ఆశీర్వదిస్తున్నారు. సాయి చెప్పినట్లుగా నేను కూడా ఏదో ఒకరోజు ఈ ప్రాపంచిక వ్యవహారాల గురించి కాకుండా ఆయన ఇవ్వదలుచుకున్న దానిని కోరుకుంటానని ఆశిస్తున్నాను. నేనిప్పుడు ఇటీవల మా శిరిడీయాత్రకు సంబంధించిన అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

మార్చి(2019)లో నేను నా పిల్లల పరీక్షలు అయిపోయిన వెంటనే శిరిడీ వెళ్లాలని అనుకున్నాను. ఎందుకంటే అవి అనుకూలమైన రోజులని నేను భావించాను. వెంటనే ఆలస్యం చేయకుండా నేను ఫ్లైట్ టిక్కెట్ల కోసం వేట ప్రారంభించాను. అయితే ఫ్లైట్ టిక్కెట్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక నెల తరువాత అయితే తక్కువ రేట్లు ఉన్నాయి. తేదీలన్నీ పరిశీలించి, చాలాసార్లు చీటీలు వేసి మరీ తేదీలు నిర్ణయించుకుని టిక్కెట్లు బుక్ చేసుకున్నాను. సాయి దయతో టిక్కెట్ల బుకింగులో కొద్దిగా డిస్కౌంట్ వచ్చేలా చేశారు. ఆయన కృపతో ఆరతి కోసం కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోగలిగాను. తీరా అన్నీ నిశ్చయమయ్యాక హఠాత్తుగా ఒక వార్త తెలిసింది. మేము శిరిడీ పర్యటన పెట్టుకున్న తేదీలలో మా పిల్లల స్కూలు వాళ్ళు ఒక ముఖ్యమైన సమావేశం షెడ్యూలు చేశారు. దానికి పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంది. ఏమి చేయాలో తెలియక పలురకాల ఆలోచనలతో నేను బాగా కలతచెందాను. మా నాన్నగారు, నా పిల్లల్లో ఒకరు గొప్ప సాయిభక్తులు. వాళ్లిద్దరూ, "బాబా జాగ్రత్త తీసుకుంటార"ని నాకు ధైర్యం చెప్పారు. దానితో నేను బాబా మీద భారంవేసి, శిరిడీ ప్రయాణానికి అనుమతి అడిగేందుకు ప్రిన్సిపాల్‌ని కలిశాను. ఆమె నేను చెప్పింది విని, వేరేవాళ్ళు వ్యతిరేకిస్తున్నప్పటికీ కేవలం మాకోసం అతి తేలికగా సమావేశాన్ని వాయిదా వేసింది. 'అంత తేలికగా సమస్యను బాబా ఎలా పరిష్కరించారు?' అని నేను ఆశ్చర్యపోయాను.

తరువాత మేము సంతోషంగా మా యాత్రను ప్రారంభించాము. ఒకటి తరువాత ఒకటిగా ద్వారకామాయి, సమాధిమందిరాలలో బాబా దర్శనాలతో రెండురోజులు సంతోషంగా గడిచాయి. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న ఒక ఆరతి దర్శనం కూడా అయ్యింది. మహాపారాయణలో నాకు కేటాయించిన అధ్యాయాలను, స్తవనమంజరిని వేదిక మీద కూర్చుని పారాయణ చేసుకున్నాను. అయితే ఒకసారే ఆరతి అయినందున కాకడ ఆరతి టిక్కెట్ల కోసం ప్రయత్నించాము. తెలిసినవాళ్ళ ద్వారా ఆ టిక్కెట్లు దొరకడంతో నేను చాలా సంతోషించాను. కానీ అకస్మాత్తుగా మా పాప అనారోగ్యానికి గురైంది. ఆ కారణంగా మేము కాకడ ఆరతికి వెళ్లలేకపోయాము. నేను దురదృష్టంగా భావించి చాలా బాధపడ్డాను. అయితే బాబా ప్రణాళికలు వేరుగా ఉన్నాయి. పాప పూర్తి విశ్రాంతి తీసుకున్నాక సాయంత్రానికల్లా కోలుకుంది. అప్పుడు ఉచితంగా(నార్మల్ క్యూ లైన్ ద్వారా) ధూప్ ఆరతికి హాజరయ్యే అవకాశాన్ని మాకిచ్చారు బాబా. వాస్తవానికి అప్పటివరకు అలా ఉచితంగా ఆరతికి వెళ్లే అవకాశం ఉంటుందని మాకస్సలు తెలియదు. మూమూలుగా మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు నేను దాని గురించి విన్నాను. అంత రద్దీలో కూడా బాబా ముఖాన్ని స్పష్టంగా చూడగలిగే చోట కూర్చునే అవకాశం మాకు దక్కింది. మేము ఆనందంతో పరవశించిపోయాము.

రాత్రి శేజారతి అనంతరం చాలా సమయం తరువాత(అర్థరాత్రి) ద్వారకామాయిలో ప్రశాంతమైన సమయాన్ని మేము ఆస్వాదించాము. మరుసటిరోజు గురువారం మేము తిరుగుప్రయాణం అవ్వాల్సిన రోజు. మా ప్రయాణాన్ని ప్రారంభించేముందు ఒకసారి బాబా దర్శనం చేసుకోవాలని నేను అనుకున్నాను. దర్శనానికి వెళ్తూ నా ప్రియమైన సాయికి సమర్పించడానికి కొన్ని ద్రాక్షపళ్ళను తీసుకున్నాను. గురువారం కావడంతో బాగా రద్దీగా ఉంది. అంత రద్దీలో నేను సమర్పించేది సాయి స్వీకరిస్తారని అస్సలు ఊహించనప్పటికీ, అక్కడ పూజారి నా కవరు నుండి ఒక ద్రాక్షగుత్తిని తీసుకుని సమాధిపై ఉంచారు. తరువాత నేనిచ్చిన కవరుతోపాటు ఒక గులాబీపువ్వును కూడా జతచేసి నాకు తిరిగిచ్చారు. నేను ఆనందాశ్చర్యాలలో మునిగిపోయాను. సాధారణంగా రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు (ముఖ్యంగా గురువారాల్లో లక్షలాదిమంది ప్రజలు సాయి దర్శనానికి వస్తారు.) పూజారులుగాని, పరిచారకులుగాని వాళ్ళ హడావిడిలో మనమిచ్చే వాటిని అక్కడి సమాధికి తాకించి వెంటనే తిరిగి ఇచ్చేస్తుంటారు. (అది సర్వసాధారణమైన విషయం. దానికి మనం నొచ్చుకోవడంగాని, ఫిర్యాదు చేయడంగాని చేయలేము.) అలాంటిది నేను సమర్పించిన నైవేద్యాన్ని బాబా ఎంతో దయతో స్వీకరించడం నాకు చాలా గొప్ప అనుభవం. ఆవిధంగా మా శిరిడీయాత్రను అందంగా మలిచారు బాబా. మళ్లీ మళ్లీ శిరిడీ దర్శించే అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! ఎప్పుడూ మీ దివ్యపాదాల చెంత నన్ను కట్టిపడేయండి".

దొరికిన ఉంగరం - పెరిగిన నమ్మకం

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు బాబా తనకు ప్రసాదించిన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

బాబా ప్రేమతో తన వద్దకు లాక్కున్న పిచ్చుకలలో (భక్తులలో) నేను కూడా ఒక చిన్న పిచ్చుకను. ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి సాయిరాం! ప్రతిరోజూ ఈ బ్లాగులో వస్తున్న భక్తుల అనుభవాలను చదివి బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఎల్లవేళలా అందరినీ ఇలాగే కాపాడుతూ ఉండమని బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంటాను. అనుభవాలను చదువుతున్నంతసేపు నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఇవన్నీ నా కళ్ళెదుటే జరిగినట్లు అనుభూతి చెందుతాను. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను మీతో పంచుకోవడానికి అనుమతించమని బాబాను వేడుకున్నాను, బాబా కరుణించారు.

నేను ఒక స్కూల్లో టీచరుగా పనిచేస్తున్నాను. ఒక సంవత్సరం క్రితం నా వేలికి ఉన్న వజ్రపు ఉంగరం స్కూల్లో ఎక్కడో పడిపోయింది. ఆ విషయం నేను గమనించలేదు. ఇంటికి వచ్చాక చూసుకుంటే వేలికి ఉంగరం లేదు. నాకు చాలా భయమేసింది. ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. నేను బాబానే శరణువేడి, "నా ఉంగరం నాకు దొరికేలా చేయండి బాబా" అని బాబాను మనస్ఫూర్తిగా వేడుకున్నాను. మరుసటిరోజు స్కూలుకి వెళ్ళిన తర్వాత, "ఎవరికైనా నా ఉంగరం దొరికిందా?" అని నా కొలీగ్స్‌ని అడిగాను. కొందరు దొరకలేదని చెప్పారు. ఒకామె మాత్రం నవ్వుతూ వున్నారు. ఇంక నాకు ఏడుపు ఆగలేదు. ఆమెను పట్టుకొని పెద్దగా ఏడ్చేశాను. ఆమె నన్ను ఓదార్చి, ఉంగరం తనకు దొరికిందని చెప్పి ఉంగరాన్ని నా చేతికిచ్చింది. ఆ సమయంలో గట్టిగా అరవాలనిపించింది, కానీ నా భావాలను లోపలే అణుచుకున్నాను. అవధులులేని ఆనందంతో బాబాకు శతకోటి వందనాలు తెలుపుకున్నాను. సాయంత్రం ఇంటికి వచ్చే సమయంలో బాబా గుడికి వెళ్లి ఆయన పాదాలపై పడి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అప్పటినుండి బాబాపై నమ్మకం ఇంకా బలపడింది. నా ఉంగరాన్ని జాగ్రత్తగా నాకు ఇచ్చిన నా కొలీగ్‌కి మంచి బహుమతి ఇచ్చాను. స్కూల్లో అందరికీ బాబా ప్రసాదంగా స్వీట్స్ పంచాను. ఈ విధంగా బాబా మా ఇంట్లో ఒకరయ్యారు. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని కూడా మీతో పంచుకోవడానికి ఎదురుచూస్తూ ఉంటాను. 

సాయిభక్తుల అనుభవమాలిక 241వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • భక్తుల మనసులో బాబా కొలువైవుంటూ పిలిచినంతనే పలుకుతారు

నిర్మల్ నుండి సాయిభక్తురాలు సుచిత్ర తమ జీవితంలోకి బాబా రాకతో కలిగిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు:

సాయిరామ్!

బాబా మా జీవితంలోకి వచ్చాక కొన్ని మిరాకిల్స్ జరిగాయి. వాటిని సాయి కుటుంబసభ్యులతో పంచుకోవాలని అనుకుంటున్నాను.

2019, ఫిబ్రవరి 1న సాయిసచ్చరిత్ర పారాయణ చేశాను. అప్పటినుంచి బాబానే నా సర్వస్వం అనుకున్నాను. రెండునెలల తర్వాత నేను, "బాబా! ఏమి చేస్తావో ఏమో నాకు తెలీదు. కానీ, నా భర్తకున్న త్రాగుడు అలవాటు మాన్పించి, తనలో మార్పు తీసుకురా తండ్రీ!" అని బాబాను వేడుకున్నాను. అంతలో మావారికి తీవ్రమైన జ్వరమొచ్చి హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లాల్సి వచ్చింది. పరీక్షలు చేశాక టైఫాయిడ్, జాండిస్, లివర్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళితే, "ఒక వారంరోజులపాటు మందులు వాడి రండి, లివర్ ఇన్ఫెక్షన్‌ని నీడిల్‌తో తీస్తాము" అన్నారు. వారంరోజుల తరువాత వెళితే, డాక్టర్ మళ్ళీ స్కానింగ్ చేసి, "మందులతో ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది, నీడిల్ ఉపయోగించాల్సిన అవసరంలేదు. కానీ జీవితాంతం త్రాగవద్దు" అని చెప్పారు. అడిగినంతనే అనుగ్రహించిన బాబా పాదాలకు ఆరోజు నుంచి నేను బానిసనైపోయాను. భక్తుల మనసులో బాబా కొలువై ఉంటారని, పిలిచినంతనే పలుకుతారని చెప్పడానికి నిదర్శనమే నా ఈ అనుభవం.

మరో అనుభవం:

ఇప్పుడు బాబా మా కులదైవాన్ని పరిచయం చేసిన అనుభవాన్ని మీతో పంచుకుంటాను. మా పెళ్లి జరిగి 14 సంవత్సరాలవుతోంది. కులం వేరన్న భావంతో మా అత్తగారు మా కులదైవానికి నన్ను దూరంగా పెట్టారు. 2008లో మేము ఒక స్టూడియో పెట్టుకున్నాము. దానిలో అంతగా లాభాలు లేకపోయినప్పటికీ అలాగే కొనసాగిస్తూ వచ్చాము. 2015లో డి.జె.బిజినెస్ (వేడుకలు, పండుగల సమయాలలో పాటలు పాడించే ఏర్పాటు చేయడం) మొదలుపెట్టాము. అందులో కూడా నష్టపోయాము. అదలా ఉంటే, బాబా మా జీవితంలోకి వచ్చాక వీలున్నప్పుడల్లా గురువారంనాడు కుటుంబమంతా కలిసి బాబా మందిరానికి వెళ్తుండేవాళ్ళము. అలా వెళ్ళినప్పుడు ఒకరోజు అనుకోకుండా అక్కడి పూజారితో, "మేము ఏ బిజినెస్ మొదలుపెట్టినా నష్టపోతున్నాము. చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాము" అని చెప్పాము. దానికతను, "నేనొక జ్యోతిష్కుని అడ్రస్ ఇస్తాను. అక్కడికి వెళ్ళండి. అక్కడ మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది" అన్నారు. మేము ఆ అడ్రస్ తీసుకొని అక్కడికి వెళ్ళాము. ఆ జ్యోతిష్కుడు మమ్మల్ని చూస్తూనే, "మీ కులదైవానికి ఖుషీ పండగ చేయండి" అని చెప్పారు. ఆ మాట వింటూనే ఒక్కసారిగా నేను నిర్ఘాంతపోయాను. తరువాత మేము మా ఇంట్లో పెద్దలకు ఆ విషయం చెప్పి ఒప్పించగలిగాము. అలా చివరికి ఈరోజు, అనగా 2019, నవంబరు 17న మేము మా కులదైవానికి పండుగ చేశాము. నా మనసుకు చెప్పలేనంత సంతోషం కలిగింది. ఇదంతా సాయిబాబా వలనే సాధ్యమైంది. ఆయన మా జీవితంలోకి రాకుంటే జీవితాంతం మా కులదైవానికి దూరంగానే ఉండేవాళ్ళము. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు".

ఇంకో అనుభవం:

పై అనుభవం జరగడానికి ముందు, అంటే వినాయకచవితి ఒక వారముందనగా మేము గణేష్ నిమజ్జనానికి డి.జె. ఏర్పాటు చేయాలని అనుకున్నాను. అప్పటికి డి.జె. ఆపరేటర్స్ అందరూ బుక్ అయిపోయినందున మాకు ఎవరూ దొరకలేదు. ఆపరేటర్స్ దొరకకపోవడంతో కస్టమర్స్ నిరాశ చెందారు. ఒక ప్రోగ్రాం ఐతే రద్దు కూడా అయిపోయింది. ఏమీ తోచని పరిస్థితిలో సచ్చరిత్ర పుస్తకాన్ని పట్టుకొని ఏడుస్తూ, "బాబా! మాకెందుకిలా జరుగుతోంది? దయచేసి మాకోసం మంచి డి.జె. ఆపరేటర్‌ని పంపించండి" అని వేడుకున్నాను. తరువాత సాయి తండ్రికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుని, ఆయనపై భారంవేసి చేతిలోకి సెల్‌ఫోన్ తీసుకొని దాదాపు రెండుగంటలు వెతికాను. చివరికి బాబా దయవలన ప్రక్కగ్రామానికి చెందిన ఒకతను వస్తానని చెప్పాడు. కానీ, అతని మాటల్లో నాకు నమ్మకం కనిపించక మళ్ళీ నేను బాబాని తలచుకొని, "ఎలాగైనాసరే అతన్ని పంపించండి" అని వేడుకున్నాను. మరుసటిరోజు ఉదయం నిద్రలేవగానే అతనికి ఫోన్ చేసి, "వస్తున్నారా?" అని అడిగితే, "మేడం, నేను బస్సులో ఉన్నాను" అని అతను చెప్పేసరికి నా సంతోషానికి అవధుల్లేవు. కేవలం ఒక్కరోజు ప్రోగ్రాం కోసం వచ్చిన అతను సీజన్ మొత్తం పూర్తయ్యేవరకు ఉండి, కార్యక్రమాలను విజయవంతం చేశాడు. పైగా అతను అమౌంట్ విషయంలో వాదులాడకుండా మా పరిస్థితిని అర్థం చేసుకొని ఇచ్చినంత తీసుకొని వెళ్లారు. ఆ క్షణాన 'అతని రూపంలో వచ్చింది సాయిబాబానే' అనిపించింది. లేకపోతే ఈరోజుల్లో ముక్కు ముఖం తెలియనివాళ్ళ గురించి ఎవరైనా ఎందుకు ఆలోచిస్తారు? ఇంతలా రక్షణనిచ్చే బాబా గురించి ఊహ తెలిసినప్పటినుంచి నాకు తెలియనందున ఆయనను చాలా మిస్ అయ్యానని నాకనిపిస్తుంది. ఎన్ని కష్టాలు ఎదురైనాసరే బాబా పాదాలు వదలను. చివరిశ్వాసవరకు ఆయన నా మనసులో ఉంటారు. ఏ పనిలో ఉన్నా ఆయన నామస్మరణలోనే ఉంటాను. "బాబా! మీ ప్రేమ ఎప్పుడూ ఇలాగే మాపై కురిపిస్తూ మమ్ము అనుగ్రహిస్తూ ఉండండి".

సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు! 

సాయిభక్తుడు ఎం.జి. ప్రధాన్


సాయిభక్తుడు శ్రీ ఎం.జి. ప్రధాన్ ముంబైలోని శాండ్రస్ట్ రోడ్డుకు సమీపంలో ఉన్న చాల్ ప్రాంతంలో వెంకటేశ్వర ప్రెస్ వద్ద నివాసముండేవాడు. అతడు కలెక్టరు కార్యాలయంలో రెవెన్యూ శాఖలో గుమస్తాగా పనిచేశాడు. ఒకప్పుడు అతని ఏడేళ్ల కొడుకు దత్తాత్రేయ అకస్మాత్తుగా చనిపోవడంతో అతడు దిగులుతో చాలా కృంగిపోయాడు. ఆ స్థితిలో అప్పటికే సాయిబాబా గురించి విని ఉన్న అతనికి శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోవాలని అనిపించింది. తరువాత ఒకరోజు రాత్రి అతనికి ఒక కల వచ్చింది. కలలో ఐదుగురు సాధువులు కూర్చొని ఉండటం చూశాడు. వాళ్లను అతడు, "మీలో సాయిబాబా ఎవరు?" అని అడిగాడు. వాళ్ళు ఒక సాధువును చూపించి, "ఆయనే సాయిబాబా!" అని చెప్పారు. అంతటితో ఆ కల ముగిసింది. తరువాత తన శిరిడీ పర్యటనకు అవసరమైన సెలవు మంజూరు కావడం, తగిన నిధులు చేకూరడం వంటివి మొదటిసారి అతనికి సాయిబాబాపై నమ్మకం కలగడానికి దోహదమయ్యాయి. ఇక అతడు జంజీరాలో ఉన్న తన సొంత తోటలలోని సీతాఫలాలు, రామాఫలాలు తీసుకొని శిరిడీకి ప్రయాణమయ్యాడు. అతడు ద్వారకామాయిలో సాయిబాబాను దర్శించుకొని, తనతో తీసుకువెళ్లిన ఫలాలను వారికి సమర్పించి, వారి ముందు కూర్చున్నాడు. సాయిబాబా అచ్చం కలలో తాను చూసిన సాధువులానే కనిపించడంతో అతడు ఆశ్చర్యపోయాడు. అంతలో సాయిబాబా అతనిని చాలా చెడ్డగా తిడుతూ, "ఎందుకీ తెలివితక్కువవాడు కొడుకు చనిపోయినందుకు బాధపడుతున్నాడు? చనిపోవడమంటే భూమిలో కలిసిపోవడమే! శరీరం ఎప్పటికైనా మట్టిలో కలిసిపోవాల్సిందే! దానికి దుఃఖించడం ఎందుకు?" అని అన్నారు. తర్వాత అతని వైపు చూస్తూ, "నీ రామాఫలాలను అంతటా వెదజల్లు!" అన్నారు. బాబా అన్న మాటలను 'సంపాదించిన జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టు' అని అతను అర్థం చేసుకున్నాడు. తరువాత బాబా అక్కడున్న భక్తులతో ప్రధాన్ ఇళ్ళు, తోటల గురించి చెప్తూ ఆ తోటలోని  సీతాఫలాల చెట్లు, రామాఫలాల చెట్లు, ఇంకా ఇతర చెట్ల గురించి ఖచ్చితమైన సంఖ్యతో సహా వర్ణించారు. ఆయన అంత ఖచ్చితంగా వర్ణిస్తుంటే, ఆయన తన ప్రక్కనే ఉంటూ వాటిని తరచూ చూస్తున్నట్లుగా అతనికి అనిపించింది. అంతేకాదు, అతని కొడుకు పదిహేను రోజుల క్రితం చనిపోయాడని, దానికోసం అతడు వృధాగా విలపిస్తున్నాడని కూడా బాబా భక్తులకు చెప్పారు. ఆ విధంగా బాబా అతని దుఃఖాన్ని తొలగిస్తూనే, అతని గురించేకాక తమను దర్శించే ప్రతి వ్యక్తి గురించి తమకు క్షుణ్ణంగా తెలుసునని తెలియజేయడం ద్వారా వారిపై అతనికున్న భక్తివిశ్వాసాలను దృఢపరిచారు. అతడు నాలుగు రోజులు శిరిడీలో ఉన్నాడు. ఆ నాలుగు రోజుల్లో అతడు గమనించిన దాని గురించి ఇలా చెప్పాడు: "బాబా ఏదీ పట్టనట్లు ఉదాసీనంగా ఉంటూ చాలా తక్కువగా మాట్లాడేవారు. ఆయన సదా అంతర్ముఖులై ఉండి, నిశ్చలంగా మత్తులో ఉన్నవానివలె లేదా పిచ్చివానివలె కనిపించేవారు. ఆయన దర్శనానికి చాలామంది వచ్చారు. ఆయన వారిలో ప్రతి ఒక్కరికీ సంబంధించిన విషయాలను ఉన్నది ఉన్నట్లు చెప్పారు. దీనినిబట్టి బాబాకు సర్వమూ తెలుసునని, వారివద్ద ఏదీ దాచలేమని స్పష్టమవుతుంది".

బాబా సమాధి చెందిన చాలా సంవత్సరాల తరువాత జరిగిన ఒక అపూర్వ సంఘటన గురించి తప్పక చెప్పి తీరాలి. 1932లో ప్రధాన్ చిన్నకొడుకుకి తీవ్రంగా జ్వరం వచ్చింది. పిల్లవాడు మూడు, నాలుగురోజులు జ్వరంతో బాధపడ్డాక, పరిస్థితి మరింత దిగజారి నాడి అందలేదు. ప్రధాన్ పరుగున తన మిత్రుడైన వైద్యుని వద్దకు వెళ్లి, అతనిని తీసుకొచ్చాడు. వైద్యుడు నాడి పరీక్షించి, "పిల్లవాడు అప్పటికే చనిపోయాడ"ని చెప్పాడు. అది విని రోదిస్తున్న ప్రధాన్ భార్యను ఓదార్చడం మొదలుపెట్టాడు వైద్యుడు. అయితే పిల్లవాడు మరణించాడంటే ప్రధాన్ నమ్మలేకపోయాడు. వెంటనే అతడు కొంచెం బాబా ఊదీ తీసుకొని పిల్లవాడి ముఖంపై పూశాడు. తరువాత పిల్లవాడి దగ్గర ఒక సాయిబాబా ఫోటో ఉంచి, ఆర్తిగా బాబాను ప్రార్థించసాగాడు. అది చూసిన వైద్యుడు, 'ఇదంతా మీ వెర్రితనం' అని అన్నాడు. అందుకు ప్రధాన్, "సాయిబాబా భగవంతుడు. వారు నా బిడ్డని ఖచ్చితంగా బ్రతికిస్తారు" అని బదులిచ్చాడు. తరువాత 45 నిమిషాలు గడిచేసరికి పిల్లవాడు ఆశ్చర్యకరంగా తిరిగి స్పృహలోకి వచ్చాడు. తరువాత మంచం మీద నుండి లేచి ఆడుకోవడం ప్రారంభించాడు. ఈ సంఘటన తరువాత ప్రధాన్‌కి సాయిబాబాపై విశ్వాసం ఇంకా ఇంకా దృఢపడింది. అది అతని ప్రాపంచిక, ఆధ్యాత్మిక ఉన్నతికి ఎంతో దోహదం చేసింది. ఈ సంఘటన తరువాత అతడు 1935 వరకు శిరిడీ వెళ్ళలేదు. కానీ అతనికి ఏ కష్టం వచ్చినా భక్తి విశ్వాసాలతో బాబాను ప్రార్థించేవాడు. బాబా అతనికి స్వప్నంలో దర్శనమిచ్చి సహాయం చేస్తుండేవారు.

సమాప్తం.

(Ref: Sai Sagar Magazine; 2009; Deepavali issue)
A Divine Journey with Baba – compiled by Vinny Chitluri, Sterlings.

సాయిభక్తుల అనుభవమాలిక 240వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. శ్రీసాయి చేసేది మన మేలుకోసమే
  2. ఆనందం దక్కదనుకున్న సమయాన బాబా నాపై కురిపించిన ఆశీస్సులు

శ్రీసాయి చేసేది మన మేలుకోసమే

సింగపూర్‌ నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను సాయిబాబా భక్తురాలిని. నేను భక్తుల అనుభవాలను చాలా ఆసక్తిగా చదువుతాను. అవి జీవితంపై ఆశను, ధైర్యాన్ని ఇస్తాయి. ఇక నా అనుభవానికి వస్తే..

నేను చదువుకునే రోజులనుండి ఒక పత్రికను నిర్వహిస్తున్నాను. అయితే బహుశా ఇదే మొదటిసారి, నేను నా ఆలోచనలను ఒక పబ్లిక్ ఫోరమ్‌లో వ్రాస్తున్నాను. నేను మొదటినుండి మతపరమైన వ్యక్తిని కాబట్టి కాలేజీరోజుల్లో వారానికి ఒకసారి నేను మందిరాన్ని దర్శిస్తుండేదాన్ని. అది ఏ సంవత్సరం, ఏ రోజు అన్నది నాకు గుర్తులేదు కానీ, ఒకరోజు నేను మందిరానికి వెళ్ళినప్పుడు మందిరం మూసివుంది. సమీపంలో ఉన్న సాయిబాబా మందిరం తెరచివుండటం చూసి మొదటిసారి నేను ఆయన ఆశీస్సుల కోసం మందిరం లోపలికి వెళ్ళాను. తెల్లని పాలరాతి విగ్రహరూపంలో చాలా ఆకర్షణీయంగా బాబా, శుభ్రమైన ప్రాంగణం, నిశ్శబ్దమైన వాతావరణంతో చాలా అద్భుతంగా ఉంది. బాబాను చూస్తూ నిలబడివున్న నాలో ఎటువంటి భావోద్వేగాలు లేవు. మనస్సు చాలా ప్రశాంతంగా అయిపోయింది. మధురమైన అనుభూతి. కాలం గడిచిపోయింది, నేను ఆ అనుభవాన్ని మరచిపోయాను. దశాబ్దాల తరువాత నేను ఆ అనుభవాన్ని వ్రాస్తుంటే, 'ఇంతకాలంగా నేనెలా అర్థం చేసుకోలేకపోయాన'ని ఆలోచిస్తున్నాను. మార్గాలన్నీ మూసివేసిన సమయంలో బాబా నా రక్షకుడిగా, మార్గదర్శకుడిగా నా జీవితంలోకి ప్రవేశించారని నాకిప్పుడు అర్థమవుతోంది. నాకప్పుడు అర్థం కాకపోయినా ఈరోజు నేను ప్రతిదానికీ ఆయనపై ఆధారపడుతున్నాను. అయితే ప్రతి సంబంధంలో హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి. ఒకానొక సమయంలో నేను బాబాను అనుమానించాను. ఆయన నాకు గొప్ప పాఠం నేర్పారు.

చాలాకాలం క్రితం నా కుటుంబసభ్యులలో ఒకరు ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో తనకి చాలా సమస్యలు ఎదురయ్యాయి. పుట్టబోయే బిడ్డకు రక్షణనివ్వమని నేను రాత్రి పగలు తేడా లేకుండా ప్రతిరోజూ బాబాను ప్రార్థిస్తుండేదాన్ని. ఆయన బిడ్డను 100% కాపాడుతారని నేను నమ్మకంగా ఉండేదాన్ని. అయితే తను ఆ బిడ్డను కోల్పోయింది. దానితో నేను బాబా ముందు నిలబడి నమస్కరించడం కూడా మానేశాను. ఆ సంఘటనకు ముందు కూడా మాకు కొన్ని వరుస దురదృష్ట సంఘటనలున్నాయి. నా మనసులో చాలా సందేహాలు, అపోహలు చోటుచేసుకుని ప్రతికూల భావాలు నా మనస్సులో నిండిపోయాయి. ఇదిలా ఉంటే, కొంతకాలానికి మా కుటుంబసభ్యురాలు మళ్ళీ గర్భందాల్చి ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చింది. మనం తార్కికంగా ఆలోచిస్తామని అనుకుంటాము, కానీ బాబా మనకన్నా ఎక్కువ తార్కికంగా ఆలోచించి ప్రతి విషయాన్నీ నడిపిస్తారు. కడుపులో బిడ్డ పిండంగా ఉన్నప్పుడే కోల్పోవడం నిజంగా బాబా మాపై కురిపించిన ఆశీర్వాదం. ఎందుకంటే, ఆ బిడ్డ ఆరోగ్యంగా లేదు. ఆ బిడ్డ జన్మించివుంటే జీవితాంతం బాధపడేది. జీవితకాలం మేము దుఃఖాన్ని అనుభవించకుండా ఆయన మమ్మల్ని రక్షించారు. ఇప్పుడు ఈ బిడ్డ జననంతో అంతా మారిపోయింది. అదంతా ఆయన లీల. ఆ లీల నా జీవితాన్ని మలుపు తిప్పింది. నేను బాబాకు చాలా దగ్గరయ్యాను.

ఆయన నా జీవితంలో చేసిన సహాయాలకు లెక్కలేదు. నేనెన్ని తప్పులు చేసినా ఆయన వాటిని సరిచేసి సాధారణ స్థితికి తెచ్చి సరైన దారిలో పెట్టిన రీతి నమ్మశక్యం కానిది. "బాబా! నన్ను, నా కుటుంబాన్ని రక్షిస్తూ మీ ఆశీస్సులను కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. శ్రద్ధ, సబూరీలతో నేను మిమ్మల్ని ఆశ్రయించుకుని ఉన్నాను. దయచేసి మీ ఆశీస్సులు ప్రతి ఒక్కరికీ ఇవ్వండి".

ఆనందం దక్కదనుకున్న సమయాన బాబా నాపై కురిపించిన ఆశీస్సులు

సాయిభక్తురాలు జయశ్రీ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిరామ్! నా పేరు జయశ్రీ. సాయిబాబా నాపై కురిపించిన ఆశీస్సులను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా చిన్నకూతురికి సరైన సంబంధం దొరకకపోవడం, నా పెద్దకూతురికి వీసా రాకపోవడం వంటి సమస్యల వల్ల నేను చాలా నిరాశకు గురయ్యాను. నేను నామజపం, పారాయణ చేస్తున్నప్పటికీ రోజురోజుకూ సమస్య భారంగా తయారయింది. కాబట్టి శివరాత్రి ఉదయం జపం చేశాక మహాపారాయణ ఆపుచేయాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే, నా కుటుంబంలో మంచి విషయాలు జరిగేలా నేను ఎప్పటికీ ఆశీస్సులు పొందలేను అనుకున్నాను. నేను బాధతో, "బాబా! మీకు నచ్చినట్లు చేయండి. మీరు నా కుటుంబాన్ని ఆశీర్వదించలేరని నాకు తెలుసు. మీరు మా జీవితాలను ఆనందంగా మార్చలేరు. అది మా కర్మ” అని బాబాతో చెప్పుకున్నాను. అదేరోజు రాత్రి బాబా తన అద్భుతాన్ని చూపించారు. నా పెద్దకూతురికి వీసా వచ్చింది, చిన్నకూతురికి తన సహోద్యోగి 'తనని ఇష్టపడుతున్నట్లు, వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు' ప్రతిపాదన తీసుకొచ్చాడు. బాబా ఆశీస్సులతో రెండు సమస్యలు పరిష్కారమయ్యాయి. నేను ఇంటికి వచ్చి ముందుగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుని, తరువాత మమ్మల్ని ఆశీర్వదించట్లేదని నిరాశ చెందినందుకు క్షమాపణలు కూడా చెప్పుకున్నాను. బాబా ఇచ్చిన ఈ గొప్ప అనుభవంతో 'నా చివరి శ్వాస వరకు పారాయణ చేస్తాను' అని నిర్ణయించుకున్నాను.

ఓం సాయిరామ్!

జయశ్రీ. 


సాయిభక్తుడు - బడేమియా


ఒకప్పుడు బడేమియాకు రాత్రంతా నిద్రపట్టలేదు. ద్వారకమాయిలో జరిగిన సంఘటనే అతనికి మరీ మరీ గుర్తుకువస్తూంది. అసలు విషయంలోకి వెళ్దాం..

బడేమియా కూతురు పెళ్ళీడుకొచ్చింది. త్వరలో ఆమె వివాహం జరిపించాల్సి ఉంది. అందుకోసం అతనికి కనీసం ఒక వెయ్యి రూపాయలు కావాల్సి ఉంది. పేదవాడైన తనకు అంత డబ్బు ఎలా సమకూరుతుందని అతనికి చింతపట్టుకుంది. ఆ సమయంలో పాటిల్‌కి సహాయపడినట్లే తనకి కూడా బాబా సహాయం చేస్తారేమోనని తలచి మరునాడే శిరిడీ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే శిరిడీ వెళ్ళాడు.

తెల్లవారుఝామునే బాబా దర్శనం కోసం ద్వారకామాయికి వెళ్ళాడు. బాబా ముందు సాష్టాంగపడి, ఆయన పాదాలచెంత ఒక రూపాయి వుంచాడు. తరువాత అతడు, "బాబా! నా కూతురు పెళ్లీడుకొచ్చింది. పెళ్లి ఖర్చుల నిమిత్తం వెయ్యి రూపాయలు కావాలి" అని బాబాతో విన్నవించుకున్నాడు. అప్పుడు బాబా, "అది నిజమేనా?" అని అడిగారు. తరువాత తమ కఫ్నీ జేబులో చేయిపెట్టి, పిడికిలినిండా నాణేలు బయటకు తీసి, "కండువా పట్టు" అని అతనితో అన్నారు. అతడు అలాగే చేయగా, ఆయన ఆ నాణేలను అందులో పోశారు. కండువాలో పడుతున్న నాణేల గలగల అతడు విన్నాడు. అప్పుడు బాబా అతనితో, "ఇక ఇంటికి వెళ్ళు. ఇల్లు చేరాక ఈ నాణేలను లెక్కపెట్టుకో!" అని ఆదేశించారు. వెంటనే అతడు తిరుగు ప్రయాణమయ్యాడు. ఇల్లు చేరిన వెంటనే అతడు ఆతృతగా బాబా ఇచ్చిన నాణేలను నేలపై వేసి లెక్కపెట్టడం మొదలుపెట్టాడు. అయితే అవి అరవైఎనిమిది రాగి నాణేలున్నాయి. బాబా తనతో పరాచికమాడారని అతడు అనుకొని వెంటనే శిరిడీకి పరుగుపెట్టాడు.

ద్వారకమాయిలో ఉన్న బాబా వద్దకు వెళ్ళి, “పాటిల్ గొప్పవాడు. కాబట్టి అతను నీకు మూడురూపాయలు దక్షిణ ఇచ్చాడు. కానీ నేను బీదవాడను. ఎంతో దూరంలో ఉన్న మరఠ్వాఢా నుండి కేవలం వెయ్యి రూపాయలు అవసరమై మీ దగ్గరకు వచ్చాను. అది కూడా నా కూతురి పెళ్ళిఖర్చుల కోసం. కానీ నేను ఒక రూపాయి దక్షిణ సమర్పించుకున్న తర్వాత నాకు నీ నుండి లభించింది అరవై ఎనిమిది పైసలే. నా పేదరికాన్ని మీరిలా అపహాస్యం చేశారు” అని బాబాను నిందించాడు. బాబా నవ్వుతూ, “నువ్వు నా పాదాల చెంత ఒక్క రూపాయి దక్షిణ పెట్టినప్పుడే, నువ్వు నా నుండి వెయ్యిరూపాయలు ఆశిస్తున్నావని నాకు తెలుసు" అన్నారు. అప్పుడు అతడు, "నా కూతురికి త్వరలో వివాహం చెయ్యాలి" అన్నాడు. బాబా, “అరె! నీ కూతురి పెళ్ళి వచ్చే సంవత్సరం జరుగుతుంది. ఇప్పటినుండే కంగారుపడతావెందుకు? పెళ్ళి నిశ్చయమైనప్పుడు నీకు డబ్బు అందేలా చూస్తాను” అని హామీ ఇచ్చారు. దాంతో అతడు తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు.

బాబా ఆశీస్సులతో ఆ సంవత్సరం నాలుగైదు రెట్లు అధికంగా పంట దిగుబడి వచ్చింది. ఆ విధంగా లభించిన ధనంతో ఎవరిముందూ చెయ్యిచాపకుండా, ఎవరి దగ్గరా అప్పుచేయకుండా తన కూతురి పెళ్లి ఘనంగా జరిపించాడు.

భగవంతునికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో తెలుసు. ఆయన చిత్తాన్ననుసరించి ప్రతిదీ జరుగుతుంది.

సమాప్తం.

(Ref: Sai Sagar Magazine; 2009; Deepavali issue)
A Divine Journey with Baba – compiled by Vinny Chitluri, Sterlings.

శ్యామ్‌రావ్ రావూజీ శ్రోత్రి, శ్రీ దినకరరావ్ జయకర్, తుకారాం బర్కు


ఈ భాగంలో:
  1. శ్యామ్‌రావ్ రావూజీ శ్రోత్రి.
  2. శ్రీ దినకరరావ్ జయకర్.
  3. తుకారాం బర్కు.


శ్యామ్‌రావ్ రావూజీ శ్రోత్రి

సాయిభక్తుడు శ్యామ్‌రావ్ రావూజీ శ్రోత్రి కాయస్థ ప్రభు కులానికి చెందినవాడు. అతడు థానా జిల్లాకోర్టులో రికార్డు గుమాస్తాగా పనిచేశాడు. అతడు సాయిబాబా సశరీరులుగా ఉన్నప్పుడు ఒకే ఒక్కసారి అంటే, 1909వ సంవత్సరంలో శిరిడీ వెళ్ళాడు. ఆ సమయంలో అతడు ద్వారకామాయికి వెళ్లి బాబా దర్శనం చేసుకొని, ఆయనకు నమస్కరించి వారి సన్నిధిలో కూర్చున్నాడు. అంతలో అతని మనస్సులో ఒక ప్రశ్న తలెత్తింది. అతని మనసెరిగిన బాబా వెంటనే అతనిని ఆలయంలో పురాణం చదువుతున్న బాయి వద్దకు వెళ్ళమని ఆదేశించారు. బాబా ఆదేశానుసారం అతడు వెంటనే ఆలయానికి వెళ్ళాడు. అక్కడ యాభై సంవత్సరాల వయస్సున్న ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీ పురాణ పఠనం చేస్తోంది. శ్యామ్‌రావ్ అక్కడ కూర్చుని, ఓపికగా ఆమె చదువుతున్న పురాణాన్ని వినసాగాడు. ఆశ్చర్యకరంగా ఆమె చదువుతున్న భాగమే కొద్దిసేపటి క్రితం బాబా సమక్షంలో ఉన్నప్పుడు తన మనస్సులో మెదిలిన ప్రశ్నకు సమాధానమైంది. అది భక్తుల మనసెరిగి సమాధానమిచ్చే బాబా విశిష్ట పద్ధతి.


శ్రీ దినకరరావ్ జయకర్.

ప్రముఖ సాయిభక్తుడైన శ్రీశ్యామరావ్ జయకర్ కుమారుడే శ్రీదినకరరావ్ జయకర్. అతను ముంబైలోని విలేపార్లేలో నివాసముండేవాడు. అతడు సాయిబాబాను దర్శించి, ఆయన వద్ద కొంతకాలమున్న అదృష్టవంతుడు. అతడు తన స్మృతులలో ఇలా అన్నాడు: "ఒకసారి నేను ద్వారకామాయిలో సాయి సమక్షంలో ఉండగా పెద్ద తుఫాను వచ్చింది. పెనుగాలులు వీస్తూ, కుండపోతగా వర్షం కురవసాగింది. కొన్ని నిమిషాల తరువాత సాయిబాబా మసీదు అంచున నిలబడి, మరాఠీలో బిగ్గరగా, "జరా థావ్! (కొంచెం ఆగు)" అని కేకవేశారు. వెంటనే తుఫాను నిలిచిపోయింది. ఈ సంఘటన సాయిబాబా అష్టసిద్ధులు కలిగివున్నారని, ప్రకృతిపై ఆయనకు పూర్తి నియంత్రణ ఉందని స్పష్టంగా తెలియజేసింది".


తుకారాం బర్కు 

సాయిభక్తుడు తుకారాం బర్కు ఒక భూస్వామి. 1912వ సంవత్సరంలో మొదటిసారి గోదావరి కాలువల్లోకి నీటిని వదిలినప్పుడు అతడు ఉపాధి కోసం శిరిడీ నుండి 20 మైళ్ళ దూరంలో ఉన్న కరంజీగాఁవ్ అనే గ్రామం వెళ్లేందుకు బయలుదేరాడు. అతడు కోపర్‌గాఁవ్ రోడ్డులో ఉన్నప్పుడు బాబా లెండీకి వెళ్తూనో, వస్తూనో అతనికి కనిపించారు. ఆయన అతని భుజంపై తమ చేయి వేసి, "వెళ్ళవద్దు!" అన్నారు. కానీ అతడు ఆయన సలహాను పట్టించుకోకుండా కరంజీగాఁవ్ వెళ్ళాడు. అక్కడికి చేరిన మరుసటిరోజు అతనికి జ్వరం వచ్చి, చాలాకాలంపాటు బాధపడ్డాడు. ఆ స్థితిలో జీవనోపాధి మాట అటుంచి, సహాయం కోసం ఆ గ్రామంలోని దూరపు బంధువుల దయపై అతడు ఆధారపడాల్సి వచ్చింది. అక్కడ జ్వరంతో 15 రోజులు బాధపడ్డాక తిరిగి శిరిడీ వెళ్లిపోవాలని అతనికి బలంగా అనిపించింది. శిరిడీ చేరుకున్నాక కూడా అతడు జ్వరంతో 45 రోజులు బాధపడ్డాడు. అప్పుడొకరోజు అతడు తన తల్లితో, బాబా వద్దకు వెళ్లి ఊదీ తీసుకొని రమ్మని చెప్పాడు. ఆమె బాబా వద్దనుండి ఊదీ తీసుకొచ్చి కొడుకుకి పెట్టింది. మరుసటిరోజు నుండి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది.

సమాప్తం.

Source: Devotees' Experiences of Shri Sai Baba, Part  II , III by Late Shri.B.V.Narasimha Swamiji.

సాయిభక్తుల అనుభవమాలిక 239వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. శిరిడీలో బాబాకి విన్నవించుకున్నంతనే సమస్య పరిష్కారం
  2. ఉపవాసముండి మీ లోపల వసించే బాబాను పస్తుంచరాదు

శిరిడీలో బాబాకి విన్నవించుకున్నంతనే సమస్య పరిష్కారం

ఒక అజ్ఞాత సాయిభక్తుడు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

ముందుగా ‘సాయిమహరాజ్ సన్నిధి’ బ్లాగ్ మరియు వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారములు మరియు కృతజ్ఞతలు. ఆ సాయినాథుని దయవలన నాకు జరిగిన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నాకు కొంత వ్యవసాయభూమి వుంది. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత భూమికి సంబంధించి ప్రభుత్వం క్రొత్త పాసు పుస్తకాలు ఇచ్చింది. అవి అందరికీ వచ్చాయి కానీ నాకు మాత్రం రాలేదు. ఆ పాసు పుస్తకం కోసం  నేను సంవత్సరంపాటు ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయాను. తరువాత కొంతకాలానికి నేను నా కుటుంబంతో కలిసి శిరిడీ వెళ్ళాను. బాబాను దర్శించుకుని నా సమస్యను విన్నవించుకున్నాను. శిరిడీ నుండి రాగానే భూమికి సంబంధించిన ‘రైతుబంధు’ డబ్బులు వచ్చాయి. అలాగే, ఏ పాసు పుస్తకం గురించి మనోవేదన పడ్డానో ఆ పాసు పుస్తకం సాయిబాబా కృపవలన నా చేతికి వచ్చింది. ఎంతో సంతోషంతో నేను బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఆలస్యం జరిగినప్పటికీ సాయి నాకు ఎన్నో అద్భుతాలు చూపించారు. “చాలా చాలా ధన్యవాదాలు బాబా! మీరు లేకపోతే నా ఈ జీవితం లేదు”. బాబా ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. భగవాన్ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

ఉపవాసముండి మీ లోపల వసించే బాబాను పస్తుంచరాదు

సాయిభక్తుడు శివాంకిత్ గర్గ్ ఇటీవల తనకు జరిగిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:  

ఓం సాయిరామ్! 2019, అక్టోబరు 1న జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను సాధారణంగా సోమవారాలలో బాబా మందిరానికి వెళ్ళను. కానీ నేను చాలా కలత చెంది ఉన్నందున 2019, సెప్టెంబర్ 30 సోమవారంనాడు మందిరానికి వెళ్ళాలని నిర్ణయించుకుని కారులో బయలుదేరాను. గత కొన్ని వారాలుగా నేను గురువారంనాడు ఉపవాసం ఉంటున్నాను. ఆరోజు పాలు, పండ్లు మాత్రమే తీసుకొంటున్నాను. ప్రయాణంలో ఉండగా, "ఉపవాసం విషయంలో నేను సరైన పద్ధతిని అనుసరిస్తున్నానా, లేదా?" అని బాబాను అడిగాను. మళ్ళీ అంతలోనే 'ఈ విషయాన్ని బాబా ఎలా చెప్తారు?' అని అనుకుని నవ్వుకున్నాను. నేను గూగుల్‌లో ఆ విషయం తెలుసుకోవాలి అని అనుకున్నాను. అంతలో నేను మందిరానికి చేరుకున్నాను. నేను లోపలికి వెళ్లి శేజారతికి సమయం అవుతున్నందున క్రింద కూర్చున్నాను. అకస్మాత్తుగా, నా వెనుక ఉన్న ఒక మహిళ స్పృహతప్పి పడిపోయింది. వెంటనే నేను బయటకు వెళ్లి ఆమెకోసం కొంచెం నీళ్లు తీసుకుని వచ్చాను. ఆమె కుదుటపడటానికి 15 నిమిషాలు పట్టింది. అప్పుడు ఆ మందిరంలోని పూజారి ఆమెతో, "ఉపవాసం ఉండటమంటే రోజంతా ఏదీ తినకుండా ఉండటమని కాదు. ఏ మతగ్రంథం ఖాళీ కడుపుతో ఉండమని చెప్పదు. పాలు, పళ్ళు తీసుకోండి. మన అందరిలో శ్రీకృష్ణుడు(సాయిబాబా) ఉన్నాడు. మీరు ఆకలితో ఉండి, మీ లోపల వసించే భగవంతుడిని ఆకలితో ఉంచుతున్నారు" అని వివరించారు. ఆ వివరం నా ముఖంపై చిరునవ్వు తెచ్చిపెట్టింది. నా ప్రశ్నకు బాబా ఆవిధంగా సమాధానం ఇచ్చారని ఆనందంలో మునిగిపోయాను. తరువాత నేను తిరిగి ఇంటికి వెళ్తూ, యాదృచ్ఛికంగా సచ్చరిత్ర 20వ అధ్యాయాన్ని వినడం మొదలుపెట్టాను. అందులో లాలాలక్ష్మీచంద్ అనే భక్తుడు బాబా దర్శనానికి శిరిడీ వెళ్తారు. ఒకరోజు ఆ భక్తుడు తన మనసులో సాంజా కావాలని ఆశపడతారు. బాబా అతని ఆలోచనలను చదివి, నైవేద్యంలోకి సాంజా సిద్ధం చేయమని జోగ్‌కు చెప్తారు. అలాగే, బాబా అతనికి వెన్నునొప్పి ఉందని కూడా గ్రహిస్తారు. అదేవిధంగా, బాబా నా మనస్సు చదివి, ఈ లీల చేశారని నేను గ్రహించాను. అప్పుడు సోమవారంనాడు నేను మందిరానికి వెళ్లడం యాదృచ్ఛికంగా జరిగింది కాదని కూడా గ్రహించాను. బాబా సంకల్పానుసారం ఏదైనా జరుగుతుంది. బాహ్యానికి ఏదో యథాలాపంగా నేను మందిరానికి వెళ్లినా బాబా నాకు అద్భుతమైన అనుభవాన్ని ప్రసాదించారు. "థాంక్యూ సో మచ్ బాబా!" 

సాయిభక్తుల అనుభవమాలిక 238వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా ఎప్పుడూ తల్లి తాబేలులా తమ దృష్టి మనపై ఉంచుతారు
  2. అందమైన ఇంటిని అనుగ్రహించిన బాబా

బాబా ఎప్పుడూ తల్లి తాబేలులా తమ దృష్టి మనపై ఉంచుతారు

ఓం సాయిరామ్! నా పేరు అర్చన. నేను హైదరాబాదు నివాసిని. ఇదివరకు నేను చాలా అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు 2019, నవంబరు 14న బాబా నా మీద కురిపించిన ప్రేమామృతాన్ని మీతో పంచుకుంటాను.

నేను సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. బాబా దయవల్ల ఇటీవల నాకు ఒక ప్రాజెక్టు వచ్చింది. పని ఎక్కువగా ఉంటున్నప్పటికీ బాబా ఆశీస్సులతో పూర్తిచేయగలుగుతున్నాను. ఒకరోజు మా మేనేజరు, "డిసెంబరు లోపు ఒక కోర్సు పూర్తి చేసి, పరీక్ష వ్రాసి, అందులో పాసవ్వాలి" అని చెప్పారు. ఆ పరీక్షను 2019, నవంబరు 7న షెడ్యూల్ చేశారు. ఆ పరీక్ష వ్రాసేందుకు కొంత సహాయం కావాలి. కానీ సరిగ్గా ఆరోజు వచ్చేసరికి నా ప్రాజెక్టులో ఉన్న అతను సెలవులో ఉన్నాడు. దాంతో ఎలా అనుకుంటూ ఉండగా, ఏదో టెక్నికల్ సమస్య వచ్చి ఆరోజు పరీక్షను రద్దు చేసి నవంబరు 14న షెడ్యూల్ చేశారు. ఇదివరకు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే బాగా టెన్షన్ పడేదాన్ని. కానీ బాబా ప్రేమను చవిచూశాక అంతా ఆయనే చూసుకుంటారు అన్న భరోసాతో ఉంటున్నాను. నవంబరు 14న నేను మహాపారాయణ పూర్తిచేసి బాబా గుడికి వెళ్ళాను. అక్కడ బాబా దుస్తులు వేలం వేస్తున్నారు. నాకు ఒక శాలువా తీసుకోవాలని అనిపించింది. ఆ గుడిలో ఎవరో పెట్టిన బాబా విగ్రహాలు చాలా ఉంటాయి. మనము అడిగితే ఉచితంగానే ఇస్తారు. అదివరకు నేను ఒక విగ్రహం తెచ్చుకొని రోజూ ఆఫీసుకి తీసుకెళ్తూ ఉండేదాన్ని. ఆ బాబా విగ్రహం వచ్చాక నా ఉద్యోగంలో చాలా మంచి మార్పులు జరిగాయి. ఆరోజు నేను కాసేపు కూర్చొని సాయిలీలామృతంలోని ఒక అధ్యాయం పారాయణ చేసి, వందరూపాయలు పెట్టి ఒక శాలువా తీసుకున్నాను. తరువాత ఒక బాబా విగ్రహం కూడా తీసుకున్నాను. (నిజానికి కొన్ని రోజుల ముందే ఆ విగ్రహం బాగా నచ్చి, తీసుకుందామని అనుకోని కూడా, 'నా దగ్గర బాబా విగ్రహాలు ఉన్నాయి కదా! మళ్ళీ ఇంకోటి తీసుకోవడం ఎందుకులే' అని ఊరుకున్నాను.) విగ్రహం చేతిలోకి తీసుకొని చూస్తే, ఆశ్చర్యం! రాగి, ఇత్తడి కలిపి తయారు చేయబడిన ఉంగరం ఒకటి బాబా మెడలో ఉంది. ఆ ఉంగరం సరిగ్గా నా వేలికి సరిపోవడంతో నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. తరువాత కొద్దిసేపట్లో మా చెల్లి వద్దనుండి ఒక బాబా వీడియో వచ్చింది. ఆ వీడియోలో బాబాకి ఊదీతో అభిషేకం చేసినట్లుగా ఉంది. ఇన్ని శుభసంకేతాలతో 'ఏదో మంచి జరుగబోతోంది' అని నాకనిపించింది. తరువాత నేను ఆఫీసుకు వెళ్తుంటే చాలా చోట్ల వివిధరూపాల్లో బాబా దర్శనమిచ్చారు. ఆఫీసుకు వెళ్ళాక నా సహోద్యోగి సహాయంతో నేను పరీక్ష విజయవంతంగా పూర్తిచేశాను.

మరో విషయం, నేను మా 10ఏళ్ల బాబుతో సచ్చరిత్ర పారాయణ చేయించాలని అనుకుంటుండేదాన్ని. అయితే తనకి ఇంగ్లీష్ తప్ప తెలుగు చదవడం రాదు. అందువలన ఇంగ్లీషు సాయిసచ్చరిత్ర దొరికితే బాగుంటుంది అనుకున్నాను. ఆరోజు బాబా గుడిలో ఇంగ్లీషు సాయిసచ్చరిత్ర కనిపించింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. బాబా ప్రేమ ఎప్పుడూ మనపై కురుస్తూనే ఉంటుంది. ఆయన మన ప్రతి అవసరాన్నీ తీరుస్తూనే ఉంటారు. బాబా ఎప్పుడూ తల్లి తాబేలులా తమ దృష్టి నాపై ఉంచి సదా నన్ను కాపాడుతూనే ఉన్నారు. "థాంక్యూ! థాంక్యూ సో మచ్ బాబా!"

అందమైన ఇంటిని అనుగ్రహించిన బాబా 

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు ఇటీవల తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. 

నేను సాయిభక్తురాలిని. కేవలం బాబా అనుగ్రహంతో మా బడ్జెట్లో, చక్కని లొకేషన్లో, అందమైన ఇల్లు మాకు ఎలా లభించిందో తెలిపే అనుభవం ఇది. సాయిభక్తులు తమకు బాబా ప్రసాదించిన అనుభవాలను పంచుకునేందుకు చక్కని వేదికను అందిస్తున్న బ్లాగ్ నిర్వాహకులకు నా కృతజ్ఞతలు.

గత రెండు సంవత్సరాలుగా మేము స్వంత ఇల్లు కొనుక్కోవాలని ప్రయత్నిస్తున్నాము. కానీ, ప్రతిసారీ ఇంటి ధర మా బడ్జెట్ కంటే  మించడం వల్లనో లేదా ఇల్లు నచ్చకో లేదా పరిసరాలు నచ్చకో ఇల్లు కొనడంలో విఫలమవుతూనే ఉన్నాము. అప్పుడు నేను 'నవ గురువార వ్రతం' ప్రారంభించాను. వ్రతం ఆఖరిరోజున బాబా అనుగ్రహంతో చక్కని ఇల్లు కొన్నాము. ఇక్కడ నేను మీతో ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నాను. ఇంటిని కొనుగోలు చేసే ప్రయత్నంలో, మేము ఆ ఇంటి గురించి మాట్లాడటానికి వెళ్ళేముందు నేను, "ప్లీజ్ బాబా! ఈ డీల్ జరిగేటప్పుడు మీరు మాతో ఉండండి" అని బాబాను ప్రార్థించాను. నా జీవితంలోని అన్ని విషయాలూ ఆయన అనుగ్రహంతోనే జరిగాయి. అందుకే ఇప్పుడు కూడా బాబా మాతో ఉండాలని కోరుకున్నాను. మేము ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఎదురుగా గోడకు వ్రేలాడుతున్న పెద్ద బాబా ఫోటో కనిపించింది. బాబా మాతోనే ఉన్నారని ఎంతో సంతోషించాను. తర్వాత రిజిస్ట్రేషన్ సమయంలో కూడా బాబాను మాతో ఉండమని ప్రార్థించాను. ఆశ్చర్యకరంగా రిజిస్ట్రేషన్ పేపర్లు తయారుచేస్తున్న వ్యక్తి ఆఫీసు పేరు 'శ్రీసాయి అసోసియేట్స్'. వాళ్ల పూజామందిరంలో సాయిబాబా ఫోటో ఉంది. ఇంటిని కొనుగోలు చేసే ప్రక్రియలో అంతటా బాబా మాతోనే ఉండడం గొప్ప అనుభవం. అంతేకాదు, ఆ ఇల్లు దొరకడం అంత సులభమేమీ కాదు, కానీ బాబా అనుగ్రహం వల్ల చివరికి మేము ఆ ఇంటిని కొనుగోలు చేయగలిగాము. "మాపై ఇంతటి ప్రేమను కురిపిస్తున్నందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు బాబా! ఎల్లప్పుడూ మీరు మాతో ఉండండి బాబా!". 

సాయిభక్తుడు - గంగాధర్ విష్ణు క్షీరసాగర్


నేవాసా గ్రామానికి  చెందిన గంగాధర్ విష్ణు క్షీరసాగర్ బ్రాహ్మణ కులస్థుడు. అతడు కోపర్‌గాఁవ్ సమీపంలోని సోనావాడి వద్ద నీటిపారుదల విభాగంలో టెలిగ్రాఫ్ హెడ్ సిగ్నలర్‌గా పనిచేశాడు.

గంగాధర్‌కి 5 సంవత్సరాల వయస్సప్పుడు తండ్రిని కోల్పోయాడు. తండ్రి మరణంతో అతడు, అతని తల్లి మేనమామ దగ్గర ఉండేవాళ్ళు. ఆ కుటుంబానికి కొన్ని ఎకరాల భూమి ఉంది. కొంత భూమిని సాయిబాబా భక్తుడైన బాలాజీ పాటిల్ నేవాస్కర్‌కు (జయగుడి) కౌలుకిచ్చారు. హఠాత్తుగా ఒకరోజు బాలాజీ ఆ భూమికి తానే హక్కుదారునని ప్రకటించుకున్నాడు. దాంతో గంగాధర్ కుటుంబ సంరక్షకుడిగా వ్యవహరిస్తున్న అతని మేనమామ బాలాజీను నిలదీశాడు. ఆ భూవివాదాన్ని శ్రీసాయిబాబా సమక్షంలో  పరిష్కరించుకునేందుకు వాళ్ళను తనతోపాటు శిరిడీ రమ్మన్నాడు బాలాజీ పాటిల్ నేవాస్కర్. అందువల్ల గంగాధర్ మేనమామ, గంగాధర్ తల్లి బాలాజీ పాటిల్‌తో కలిసి శిరిడీ వెళ్ళారు.

గంగాధర్ మేనమామ, గంగాధర్ తల్లి అంతకుముందెన్నడూ బాబాను దర్శించలేదు. వాళ్ళు మసీదుకి వెళ్లి బాబాకు నమస్కరించేలోపు ఆయన బాలాజీ పాటిల్ నేవాస్కర్‌తో,  "ఎందుకు నా బిడ్డలను అవస్థపెడతావు? ఆ భూమిని వాళ్ళ స్వాధీనం చెయ్యి!" అని చెప్పారు. తరువాత వాళ్లంతా నేవాసాకు తిరిగి వెళ్లిపోయారు. కానీ బాలాజీ నేవాస్కర్ వాళ్ళ భూమి వాళ్ళ స్వాధీనం చేయడానికి నిరాకరించాడు. దాంతో వాళ్ళు కోర్టు ద్వారా ఆ భూమిని తమ స్వాధీనం చేసుకోవలసి వచ్చింది. ఈ సంఘటన తరువాత, బాలాజీ పాటిల్ నేవాస్కర్  పిచ్చివాడై ఎక్కడికో వెళ్లిపోయాడు. అతడు మళ్ళీ ఎప్పుడూ శిరిడీ రాలేదు. 

ఇదంతా 1901వ సంవత్సరంలో జరిగింది. అప్పటికి గంగాధర్ వయస్సు 16 సంవత్సరాలు. బాబా సశరీరులుగా ఉండగా అతడెప్పుడూ బాబాను దర్శించలేదు. అతని తల్లి, మేనమామ మాత్రం అప్పుడప్పుడు శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుంటుండేవారు.

1934లో గంగాధర్ విష్ణు క్షీరసాగర్‌కి కోపర్‌గాఁవ్ సమీపాన గల సోనావాడికి బదిలీ అయ్యింది. అప్పటినుండి అతడు క్రమంతప్పకుండా శిరిడీ వెళ్తుండేవాడు. అతడు శిరిడీ వెళ్ళినప్పుడల్లా సమాధి మందిరంలోని సాయిబాబా ముందు భజనలు పాడుతుండేవాడు.

1935, జూన్ 27న అతనికొక కల వచ్చింది. కలలో, సాయిబాబా అతని ముందు నిలుచొని,  "ఇంకా ఎందుకు నిద్రపోతున్నావు? ఈరోజు మీ ఇల్లు, మీకు స్వంతం చేస్తూ కోర్టు ఉత్తర్వు వచ్చింది. శిరిడీలో జాతర జరుగుతుంది. వచ్చి భోజనం చెయ్యి!" అంటూ భోజనాల గదికి తీసుకెళ్లారు. అతను భోజనం చేసి వారికి నమస్కరించాడు. అంతటితో కల ముగిసి అతడు మేల్కొన్నాడు. నాలుగురోజుల తరువాత అతనికి తన సోదరుని వద్దనుండి ఒక లేఖ వచ్చింది. అందులో అహ్మద్‌నగర్ జిల్లాకోర్టులో వారి ఇంటికి సంబంధించిన కేసు విషయంలో తేదీ. 1935, జూన్ 27న తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు వ్రాసి ఉంది. అంటే అతనికి కల వచ్చిన తేదీ, కోర్టు తీర్పు ఇచ్చిన తేదీ రెండూ ఒకటే అన్నమాట. ఈ సంఘటనతో అతనికి సాయిబాబాపై ఉన్న నమ్మకం మరింత బలపడింది. అప్పటినుండి అతడు సాయిబాబాకు అంకిత భక్తుడయ్యాడు.

సమాప్తం.

Source: Devotees' Experiences of Shri Sai Baba, Part  II  by Late Shri.B.V.Narasimha Swamiji.

శ్రీభాస్కర్ సదాశివ్ సాతమ్


బాబాను సశరీరులుగా ఉన్న సమయంలో దర్శించుకోలేనప్పటికీ, ఆయన అనుగ్రహానికి పాత్రుడైన శ్రీభాస్కర్ సదాశివ్ సాతమ్ 1911వ సంవత్సరంలో ఒక సాధారణ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి క్రమేణా సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయికి ఎదిగాడు. సుమారు 1930 ప్రాంతంలో అతను సాయిభక్తుడైన శ్రీనాగేష్ ఆత్మారామ్ సామంత్‌ను కలుసుకున్నాడు. సామంత్ అతనితో శ్రీసాయిబాబా గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఆ సమయంలో శ్రీభాస్కర్ శిరిడీ వెళతానని సామంత్ తో చెప్పాడు. కానీ, చాలా సంవత్సరాల వరకు అతను శిరిడీ వెళ్ళలేదు.

1940లో భాస్కర్ సదాశివ్ సాతమ్, నాగేష్ ఆత్మారామ్ సామంత్ లు కలిసి నార్గాఁవ్ ట్రైనింగ్ స్కూల్లో కలిసి పనిచేశారు. దురదృష్టవశాత్తు, కొన్ని అవాంఛనీయ సంఘటనల కారణంగా 1940, ఫిబ్రవరి 16న భాస్కర్‌ ఉద్యోగం నుండి సస్పెండ్ చేయబడ్డాడు. ఆ సమయంలో అతను హృదయపూర్వకంగా బాబాను ప్రార్థించాడు. అతను శిరిడీ నుండి ఊదీ, ప్రసాదం పంపమని కోరగా శ్రీసగుణమేరు నాయక్ వాటిని పంపాడు. కానీ  ప్రసాదం మాత్రమే అతనికి అందింది. తరువాత 1940, ఫిబ్రవరి 28న అతన్ని ఉద్యోగం నుండి తొలగించినట్లు ఉత్తర్వులు వచ్చాయి. అప్పుడు సామంత్ జోక్యం చేసుకుని, ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా శిరిడీ వెళ్ళమని భాస్కర్‌తో చెప్పాడు. దాంతో భాస్కర్ సదాశివ్ సాతమ్ తన కుమారుడిని వెంటబెట్టుకుని 1940 సంవత్సరం రామనవమి పండుగ సమయంలో శిరిడీ సందర్శించి బాబా దర్శనం చేసుకున్నాడు. అక్కడ రెండు రోజులు ఉండి ఆర్తిగా బాబాను ప్రార్థించాడు. మూడవరోజు బొంబాయికి తిరిగి వస్తుండగా దారిలో దాదర్ వద్ద ఒక కానిస్టేబుల్‌ అతన్ని కలిసి, అతన్ని తిరిగి ఉద్యోగంలోకి తీసుకుని లామింగ్టన్ రోడ్ పోలీసుస్టేషన్లో నియమించినట్లు చెప్పాడు. కానీ అలాంటి ఉత్తర్వులు అప్పటికి జారీ అయ్యే అవకాశమే లేదు. తరువాత భాస్కర్ సదాశివ్ సాతమ్ 1940, ఏప్రిల్ 28న మునుపటి ఉత్తర్వులకు వ్యతిరేకంగా అప్పీల్ చేశాడు. తరువాత 1940, మే 14న, అతన్ని తిరిగి ఉద్యోగంలోకి తీసుకుని లామింగ్టన్ రోడ్ పోలీసుస్టేషన్లో నియమించినట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంటే అధికారికంగా ఉత్తర్వులు రావడానికి ముందే బాబా నిర్ణయం కానిస్టేబుల్ నోటి ద్వారా వచ్చింది!

శ్రీ భాస్కర్ సదాశివ్ సాతమ్ తీర్చవలసిన కొన్ని బాకీలు ఉండేవి. ఆ విషయంలో అతడు బాబాను ప్రార్థించాడు. కృపతో బాబా అతనికి డబ్బులు అందేలా చేయడంతో అతడు ఆ అప్పుల నుండి విముక్తిపొందడమే కాకుండా కావలసినవన్నీ సమకూర్చుకున్నాడు. అలాంటి  సుఖసంతోషాలు ఎల్లప్పుడూ ప్రసాదించమని అతడు బాబాను ప్రార్థించాడు.

సమాప్తం

Source: Devotees' Experiences of Shri Sai Baba, Part III by Late Shri.B.V.Narasimha Swamiji.

సాయిభక్తుల అనుభవమాలిక 237వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • సద్గురువుపై అచంచల విశ్వాసం - సమస్యకు చూపును పరిష్కారం

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

అందరికీ ఓం సాయిరాం!

2009 నుండి నేను సాయిబాబా భక్తురాలిని. పరిస్థితులు ఎలాంటివైనా బాబా తమ భక్తులకు సదా అండగా ఉంటారు. నా జీవితం చక్కబడితే నా అనుభవాన్ని సాయిబంధువులతో పంచుకుంటానని బాబాకు మాట ఇచ్చాను. అందుకే ఈరోజు మీ ముందుకు వచ్చాను. నేను ఈ అనుభవాన్ని వ్రాస్తున్నానంటే అందుకు సాయిబాబా ఆశీస్సులే కారణం.

2017 నవంబరులో నేను భరించలేని బాధను అనుభవించాను. నా జీవితంలో నేనెప్పుడూ అంతటి బాధను అనుభవించలేదు. హఠాత్తుగా ఒక గురువారంనాడు నా భర్త, అతని సిస్టర్స్ కలిసి నన్ను, ఏడాది వయసున్న నా బిడ్డను నిష్కారణంగా నా పుట్టింట విడిచిపెట్టారు. నన్ను వాళ్ళతో తీసుకెళ్లమని మా నాన్న వాళ్ళని ఎంతగానో అభ్యర్థించారు. కానీ మితిమీరిన అహంకారంతో వాళ్ళు మా మాటలు ఏమీ వినకుండా వెళ్లిపోయారు. సమయం గడుస్తోంది, నేను నా బిడ్డతో పుట్టింట్లో ఉన్నాను. చుట్టూ ఉన్న సమాజంలోని ప్రజలు, "ఏమి జరిగింది? మీ అల్లుడు ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు?" అని అడుగుతుంటే సమాధానం చెప్పలేక నేను, నా తల్లిదండ్రులు ఎంతో వేదనను అనుభవించాము.

సాయిబాబా భక్తురాలినైన నేను వివాహమయ్యాక ఆయనను మరచిపోయాను. బహుశా కొత్తగా జీవితంలో వచ్చిన మార్పు కారణం కావచ్చు. మెల్లగా నా వైవాహిక జీవితంలో చాలా సమస్యలు చోటుచేసుకున్నాయి. చివరికి గురువారంనాడే నా భర్త నన్ను నా ఇంటి వద్ద వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సాయి ఆశీస్సులవలనే నా జీవితంలో ప్రతిదీ లభించింది. అసలు సాయిలేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. అలాంటిది ఆయననే మరచిపోయాను. ఎంతో పెద్ద తప్పు జరిగింది. అందుకే నాకీ దుస్థితి ఏర్పడిందని గ్రహించాను. నేను నా సద్గురువు నుండి చాలా దూరం వెళ్ళి పొరపాటు చేశానని అర్థం చేసుకుని ఎంతో బాధపడ్డాను. 'ఆయనను ఎందుకు మర్చిపోయాన'ని నేను ఎల్లప్పుడూ ఏడుస్తూ ఉండేదాన్ని. ప్రేమమూర్తి అయిన నా సద్గురువు ఈ బిడ్డ వ్యధ చూడలేక కరిగిపోయారు, నా చేతిని మళ్ళీ పట్టుకున్నారు. నిదానంగా నేను ఆయనతో పూర్తిగా అనుసంధానమయ్యాను. నా జీవితం మళ్ళీ ఆయన పర్యవేక్షణలోకి వచ్చింది. నేను నా సమస్య గురించి ప్రశ్నలు - సమాధానాల వెబ్‌సైటులో బాబాను అడుగుతుండేదాన్ని. బాబా నుండి సానుకూలమైన సమాధానాలు వస్తుండేవి. తదనుగుణంగా పరిస్థితులు మెరుగుపడటం కూడా ప్రారంభించాయి. నేను పూర్తిగా బాబానే నమ్ముకున్నాను. అందువలన నేనుగాని, నా తల్లిదండ్రులుగాని నా భర్తను, అత్తమామలను అస్సలు సంప్రదించలేదు. ఎందుకంటే నా తప్పు ఏమీలేదని వాళ్ళకి కూడా తెలుసు. ఒక నెల తరువాత నా అత్తమామలు మమ్మల్ని సంప్రదించడం ప్రారంభించారు. వాళ్ళు నన్ను నా భర్త ఇంట్లో దించమని నా తండ్రిని కోరారు. కానీ నేను నా తండ్రితో, "బాబా నుండి నాకు, "ఎవరూ తక్కువ కాదు. పని సహజంగా పూర్తి అవుతుంది" అని సందేశం వచ్చింది. కాబట్టి నన్ను తీసుకుని వెళ్ళడానికి ఖచ్చితంగా వాళ్లే వస్తారు" అని చెప్పి అక్కడికి వెళ్ళడానికి తిరస్కరించాను. దాంతో నా తండ్రి నా అత్తమామలను సంప్రదించలేదు. నాలుగురోజుల తరువాత మళ్ళీ నా అత్తమామలు నా తండ్రిని సంప్రదించి అదే మాట చెప్పారు. ఈసారి మా నాన్న వాళ్ళనే స్వయంగా వచ్చి సమస్యను పరిష్కరించుకోమని చెప్పారు.

2018, జనవరిలో భోగి పండుగ సందర్భంగా మళ్ళీ నా అత్తమామలు నా తండ్రికి ఫోన్ చేసి, "మా కోడలు, మనవడితో భోగి పండుగ జరుపుకోవాలని ఎదురుచూస్తున్నామ"ని చెప్పారు. వాళ్లతో మా నాన్న శాంతంగా, "ఎటువంటి తప్పూ లేకుండా మీరు నా కూతురిని, మనవడిని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టారు. మీరు ఎప్పుడైనా వచ్చి వాళ్ళని మీతో తీసుకెళ్లవచ్చు" అని సమాధానం చెప్పారు. సమయం గడుస్తూ ఉంది. నాకు నా బాబాపై అచంచలమైన విశ్వాసం ఏర్పడింది. నేను బాబాని అడిగినప్పుడల్లా నాకు సానుకూల సమాధానం వచ్చేది. సుమారు రెండు నెలలు గడిచాక నా అత్తమామలు నా తండ్రికి, నాకు ఫోన్ చేసి, "మిమ్మల్ని తీసుకెళ్లడానికి వస్తున్నాం, సిద్ధంగా ఉండండి. నీ భర్తకు కొంత పనిభారం ఉన్నందున తను రావడం లేదు" అని చెప్పారు. నా భర్త కాస్త మొండివాడు కాబట్టి తను రావడానికి సంకోచిస్తాడని నాకు తెలుసు. నాన్న సరేనని అంగీకరించారు. చివరికి నన్ను పూర్తి గౌరవంతో తిరిగి తీసుకెళ్లడానికి నా అత్తమామలు వచ్చారు. ఇదంతా నా బాబా వల్ల మాత్రమే జరిగింది. లేకపోతే నా వైవాహిక జీవితం పరిస్థితులకు అనుగుణంగా ముగిసిపోయేది. "ఐ లవ్ యు సాయిబాబా!" తరువాత బాబా ఆశీస్సులతో నేను మళ్ళీ మగబిడ్డకు తల్లినయ్యాను. "ధన్యవాదాలు బాబా! నా జీవితంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని మీకు తెలుసు, అవి కూడా మీ ఆశీస్సులతో సమసిపోతాయని నాకు తెలుసు. ఈ అనుభవాన్ని పంచుకోవడంలో నేను ఆలస్యం చేసినందుకు, ఏదైనా రాయడం మర్చిపోయివుంటే అందుకు దయచేసి నన్ను క్షమించండి బాబా. మీరే నా సర్వస్వం. దయచేసి ఎప్పుడూ నాతో ఉండండి". 

అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై! 

సాయిభక్తుడు - చక్రనారాయణ


బాబాపై భక్తివిశ్వాసాలు కలిగివున్న అతికొద్దిమంది క్రైస్తవులలో చక్రనారాయణ ఒకరు. ఇతడు పోలీస్ ఫౌజ్‌దారుగా కోపర్‌గాఁవ్‌లో పనిచేస్తుండేవాడు. మొదట్లో అతను బాబాను విశ్వసించేవాడు కాదు. ఆ రోజులలో భక్తులు బాబాకు దక్షిణ సమర్పిస్తూ ఉండేవారు. దక్షిణ రూపంలో వచ్చిన ఆ ధనాన్ని బాబా అందరికీ పంచేస్తూ సాయంత్రమయ్యేసరికి పేదఫకీరుగానే ఉండేవారు. అలా ఆయన పంచే ధనం 500 రూపాయలకు పైనే ఉండటంతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం పన్ను వేయదలిచింది. ఆ లెక్కలు వ్రాయడానికి హిందువునో, ముస్లిమునో నియమిస్తే పక్షపాతం చూపుతారని క్రైస్తవుడైన చక్రనారాయణను నియమించింది.

అతడు ప్రతిరోజూ బాబా వద్దకి ఎవరెవరు వచ్చి పోతున్నారు, ఎంతెంత దక్షిణ ఇస్తున్నారు అని పరిశీలిస్తూ ఆ వివరాలని ఒక డైరీలో వ్రాసుకుంటుండేవాడు. అలా అతను బాబాను అప్రమత్తంగా గమనిస్తూ ఆయన వ్యక్తిత్వంపట్ల, ఆయనలోని గొప్ప లక్షణాలపట్ల ఆకర్షితుడయ్యాడు. క్రమంగా ఆయనపట్ల గౌరవభావం ఏర్పడి, అతడు కూడా బాబా భక్తుడయ్యాడు.

అతడు 1936లో బి.వి.నరసింహస్వామిగారితో ఇలా చెప్పాడు:

"కాంతా-కనకాల విషయంలో బాబా ఏమాత్రం చలించేవారుకాదు. ఎందరో స్త్రీలు బాబా వద్దకు వచ్చి, తమ శిరస్సులను బాబా పాదాలపై ఉంచి నమస్కరించి వారి సన్నిధిలోనే  కూర్చునేవారు. బాబా ఏమాత్రమూ చలించేవారు కాదు. వారి వంక  ప్రశంసాపూర్వకంగా కానీ, మోహంతో కానీ చూసేవారుకాదు. వారు బంధాలకు అతీతులు".

"డబ్భు విషయంలో బాబాను క్షుణ్ణంగా పరిశీలించాము. వారికి డబ్బంటే గడ్డిపోచతో సమానం. భక్తులు స్వచ్ఛందంగా ఆయనకు దక్షిణలు సమర్పించేవారు. ఎవరైనా దక్షిణ ఇవ్వకపోయినా ఆయన వారిని ద్వేషించడం, నిందించడం, నిరాదరించడం జరిగేది కాదు. దక్షిణ రూపంలో ఎంత ధనం వచ్చినా సరే, ఆ ధనాన్ని ఉదారంగా భక్తులకు పంచేస్తుండేవారు. విరివిగా అన్నదానం చేస్తుండేవారు. అద్భుతమైన విషయం ఏమిటంటే, ఒక్కొక్కసారి దక్షిణ రూపంలో వచ్చిన మొత్తం కంటే ఎక్కువ మొత్తంలో ఆయన భక్తులకు పంచేస్తుండేవారు. ఆ అదనపు మొత్తం ఎక్కడినుండి వచ్చేదో అర్థమయ్యేది కాదు. దీనిని బట్టి వారికి దివ్యశక్తులున్నాయని నేను గ్రహించాను. బాబా సమాధి చెందిన తరువాత వారి వద్దనున్న ధనాన్ని మేము స్వాధీనం చేసుకున్నాం. అది కేవలం రూ.16/- మాత్రమే".

"ఇక భిక్ష విషయంలో కూడా అంతే. బాబా జోలె పట్టుకుని భిక్షకు వెళ్లేవారు. భిక్షగా వచ్చే ఘనపదార్థాలను జోలెలో, ద్రవపదార్థాలను రేకుడబ్బాలో వేయించుకొనేవారు. ఎవరేది పెట్టినా కాదనకుండా స్వీకరించేవారు. మసీదు చేరుకున్నాక ఆ పదార్థాలన్నింటినీ కలిపి, అందరికీ ప్రసాదంగా పంచేసేవారు".

"అన్ని మతాలపట్ల బాబా ప్రవర్తన చాలా గొప్పగా ఉండేది. ఆయనకు కుల మత వర్గ విచక్షణ, పేద, ధనిక భేదభావాలు లేవు. అందరినీ సమానంగా చూసేవారు. ఎవరినీ చులకనగా చూసేవారు కాదు. నేను మొదట శిరిడీ వెళ్ళినప్పుడు ఒక భక్తుడు, "ఈ ఫౌజ్‌దార్ ఒక క్రైస్తవుడ"ని బాబాతో చెప్పాడు. అప్పుడు బాబా, "అయితేనేం? అతను నా సోదరుడు" అని అన్నారు. బాబాకు అద్భుతమైన శక్తులున్నాయి. ఆయన ఊదీ అనారోగ్యంతో బాధపడుతున్న ఎంతోమందికి స్వస్థత చేకూర్చింది".

"ఒకసారి ఒక పోలీసు అధికారి వచ్చి బాబాను దర్శించాడు. బాబా అతనిని దక్షిణ అడిగారు. అతడు "తన వద్ద డబ్బు లేద"ని బదులిచ్చాడు. అప్పుడు బాబా, "నీ పర్సులో చూడు. అందులో యాభై రూపాయల నోటు ఉంది" అన్నారు. అతడు పర్సు తీసి ఆ డబ్బును బాబాకు సమర్పించాడు. బాబా దానినుండి కొద్దిమొత్తాన్ని మాత్రమే తీసుకొని, మిగతాది అతనికే ఇస్తూ, "ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. త్వరలోనే దీని అవసరం నీకు వస్తుంది" అన్నారు. అతడు వెళ్ళిపోయాడు. త్వరలోనే అతడికి ఒక సమస్య వచ్చింది. దానినుండి బయటపడటానికి అతడు ఆ డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఆ సమస్యనుండి బయటపడ్డాక అతడు కృతజ్ఞతతో ఆ మొత్తాన్ని బాబాకు పంపాడు".

"బాబా సమాధి చెందినప్పుడు జప్తు చేయబడిన ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో నేను సంస్థాన్‌కు సహాయం చేశాను. బాబా ఆస్తుల పంపకం విషయంలో నేను ప్రజాభిప్రాయాలను సేకరించాను. వాటి ఆధారంగా మేజిస్ట్రేట్ పంపకానికి సంబంధించిన ఉత్తర్వులు మామల్తదారు జారీ చేశారు. దీనివలన సంస్థాన్‌కు ఎన్నో ఇబ్బందులు తప్పాయి."

సమాప్తం

Source: Devotees' Experiences of Shri Sai Baba, Part I by Late Shri.B.V.Narasimha Swamiji.

సాయిభక్తుల అనుభవమాలిక 236వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా ఖచ్చితంగా మన అవసరాలన్నీ నెరవేరుస్తారు
  2. కోరుకున్న ప్రాజెక్టులో అవకాశాన్నిచ్చారు బాబా

బాబా ఖచ్చితంగా మన అవసరాలన్నీ నెరవేరుస్తారు

ఒక అజ్ఞాత సాయిభక్తుడు 2019, నవంబరు 12న బాబా తనకు ప్రసాదించిన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

జై సాయిరామ్! సర్వవ్యాపకుడైన శ్రీ సాయినాథునికి నా ప్రణామములు. నేను మహాపారాయణలో సభ్యుడిని. కొన్ని కారణాల వలన నా పేరును తెలియజేయాలని అనుకోవడంలేదు. ఇటీవల మా అబ్బాయి విషయంలో బాబా ఇచ్చిన అనుభవాన్ని నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.

మా అబ్బాయి ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. తను గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాక క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా తనకి ఆ ఉద్యోగం వచ్చింది. అకస్మాత్తుగా నవంబరు నెలలో తనకి జీతం రాలేదు. సాధారణంగా నెలలో చివరి పనిదినంనాడు వచ్చేసే జీతం ఈ నెల 10వ తేదీ వచ్చినా రాలేదు. దాంతో తను చాలా ఆందోళనచెందుతూ ఉండేవాడు. దానికితోడు ప్రతిరోజూ తన మిత్రులు ఏవేవో కారణాలు చెప్తుంటే తను చాలా నిరాశగా ఇంటికి వస్తుండేవాడు. తన మనోభావాలు వింటుంటే నాకు కూడా అదోరకంగా అనిపించేది. కానీ, బాబా తనకి సహాయం చేస్తారని, తనకి జీతం వస్తుందని నా మనస్సాక్షి చెప్తుండేది. 11వ తేదీన నేను తెలుగులో శిరిడీ సాయిబాబా భక్తుల అనుభవాలు చదువుతున్నప్పుడు, "ఈరోజుగానీ లేదా రేపుగానీ మా అబ్బాయికి జీతం వస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. తరువాత నేను మా అబ్బాయితో, "ఈరోజు రాత్రికిగానీ లేదా రేపుగానీ నీ జీతం నీకు వస్తుంది" అని చెప్పాను. అప్పుడు తను, "ఏమిటి గ్యారంటీ? సరే చూద్దాం" అన్నాడు. మరుసటిరోజు మధ్యాహ్నం తను నాకు ఫోన్ చేసి, "డాడ్! నా జీతం నా అకౌంటులో జమ అయ్యింది" అని చెప్పాడు. నాకు సంతోషంగా అనిపించి బాబాకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. మనం హృదయపూర్వకంగా బాబాను ప్రార్థిస్తే ఆయన ఖచ్చితంగా మన అవసరాలన్నీ నెరవేరుస్తారు.

ఓం శ్రీ సాయినాథాయ నమః

కోరుకున్న ప్రాజెక్టులో అవకాశాన్నిచ్చారు బాబా

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నాకు పెళ్ళై, ఒక బాబు ఉన్నాడు. నాకు ఐటి రంగంలో 10 సంవత్సరాల అనుభవం ఉంది. నా అనుభవమంతా పాత సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ప్రాజెక్టులపైనే ఉంది. అయితే నేటి మార్కెట్లో మా ఉద్యోగాలు సురక్షితంగా ఉండాలంటే, మేము నిరంతరం మా నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి. అంటే క్రొత్త సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ప్రాజెక్టుపై పని చేస్తుండాలి. అందువల్ల నా అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఎవరైనా క్రొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న ప్రాజెక్టులో అవకాశం ఇవ్వాలని ఆశపడ్డాను.

నేను కోరుకున్నట్లుగానే బాబా దయవల్ల, క్రొత్త టెక్నాలజీతో కూడుకున్న ప్రాజెక్టులో అవకాశం వచ్చింది. అయితే క్లయింట్ USA కి చెంది ఉన్నందున అర్థరాత్రి ఫోన్ కాల్స్ మాట్లాడాల్సి వచ్చేది. ఒకవైపు ఇంటిపనులు, మరోవైపు బాబుని చూసుకుంటూ అర్థరాత్రి వరకు పనిచేయాలంటే నాకు చాలా కష్టంగా ఉండేది. అందువల్ల ఆ ప్రాజెక్టు నుండి బయటపడాలనుకున్నాను. అటువంటి ఇబ్బందులు ఏవీ లేకుండా అనుకూలంగా ఉండే  ప్రాజెక్టుని చూపించమని సాయిని ప్రార్థించాను. క్రొత్త టెక్నాలజీ నేర్చుకుంటూ ఇంటర్వ్యూలకు సన్నద్ధమయ్యాను. కానీ నాకు అంత నమ్మకం ఉండేది కాదు. ఒకరోజు ఆసియా క్లయింటుకి సంబంధించిన ఒక ప్రాజెక్టు కోసం ఇంటర్వ్యూలో పాల్గొనే అవకాశం నాకొచ్చింది. అది నా పరిస్థితులకు చక్కగా సరిపోతుంది కాబట్టి అందులో నాకు అవకాశం రావాలని చాలా ఆరాటపడ్డాను. అదే విషయం బాబాకు చెప్పుకుని ఆయన నామం తలచుకుని ఇంటర్వ్యూకి హాజరయ్యాను. ఇంటర్వ్యూ సుమారు ఒక గంటపాటు కొనసాగింది. అందులో చాలా ప్రశ్నలకు నేను సరిగా స్పందించలేకపోయాను. అందువల్ల నాకు ఆ ప్రాజెక్టులో అవకాశం వస్తుందో, రాదో అర్థంకాక నేను చాలా ఆందోళనపడ్డాను. “బాబా! నాపై దయ చూపండి. ఆ ప్రాజెక్టులో నాకు అవకాశమివ్వండి” అని బాబాను వేడుకున్నాను. ఇంటర్వ్యూ పూర్తయిన తరువాత నా మేనేజరును కలిసి, ఇంటర్వ్యూ అంత బాగా జరగలేదని, నేను ఎంపిక అవుతానో లేదో తెలియడంలేదని చెప్పాను. అతను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడారు. సాయి దయవల్ల ఆ ప్రాజెక్టులో నాకు అవకాశం దక్కింది. నా ఆనందానికి అవధులులేవు. హృదయపూర్వకంగా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

సాయిభక్తుల అనుభవమాలిక 235వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయి అనుగ్రహంతో నయమైన ఆరోగ్య సమస్యలు.
  2. బాబా నా మనసుని వింటున్నారు

సాయి అనుగ్రహంతో నయమైన ఆరోగ్య సమస్యలు

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో ఇలా పంచుకుంటున్నారు:

2001లో, మా మనవరాలికి 7 నెలల వయసున్నప్పుడు తన గొంతులో సమస్య వచ్చి ఎక్కిళ్ళు ఒక గంటసేపు ఆగకుండా వస్తూనే ఉండేవి. ఆ సమయంలో పాప అవస్థ చూసి మేము తట్టుకోలేకపోయేవాళ్ళం. డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి, వయసు పెరిగే కొద్దీ అదే తగ్గుతుందన్నారు. అన్నిరోజులూ పాప ఇలా అవస్థపడుతూనే ఉండాలా అని బాధపడి మేమందరం పాప సమస్యను తీర్చమని బాబాకు, అందరి దేవుళ్ళకు మ్రొక్కుకున్నాము. మా చిన్నబ్బాయి(పాప తండ్రి) ఏ దేవుడినీ అంతగా ప్రార్థించేవాడు కాదు. కానీ కూతురి బాధ చూసి, ఒక్కరోజులో ‘సాయిసచ్చరిత్ర’ (కొంచెం తక్కువ పేజీలు వున్న పుస్తకం) పారాయణ పూర్తి చేశాడు. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అప్పటినుండి మా మనవరాలి ఎక్కిళ్ళ సమస్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఒక్కనెలలో ఆ సమస్య పూర్తిగా తగ్గిపోయి ఇప్పుడు తనెంతో ఆరోగ్యంగా ఉంది

ఇంకోసారి ఆ పాప కడుపునొప్పితో రెండేళ్ళు చాలా బాధపడింది. ఆ నొప్పివల్ల కాలేజీకి కూడా వెళ్ళలేక ఇంట్లోనే ఉండి చదువుకుంటూ, పరీక్షల సమయంలో మాత్రం కాలేజీకి వెళ్ళేది. 2017 దసరా రోజుల్లో మా చిన్నబ్బాయి శిరిడీ వెళ్ళి పాపకు ఆరోగ్యాన్ని ప్రసాదించమని బాబాను ప్రార్థించాడు. శిరిడీనుండి బాబా ఊదీ తీసుకొచ్చి పాప నుదుటన పెట్టాడు. ఊదీ పెట్టినప్పటినుండి కొంచెంకొంచెంగా కడుపునొప్పి తగ్గుతూ వచ్చింది. 6 నెలల్లో బాబా అనుగ్రహంతో నొప్పి పూర్తిగా తగ్గిపోయి తను ఇప్పడు సంపూర్ణ ఆరోగ్యంతో హాయిగా వుంది. చదువులో కూడా అభివృద్ధి సాధిస్తూ ఇప్పుడు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతూ సంతోషంగా ఉంది. అంతా బాబా అనుగ్రహంతోనే జరుగుతున్నదని మా అందరి నమ్మకం. “చాలా చాలా కృతజ్ఞతలు బాబా! మీ అనుగ్రహం మా అందరిపై ఎల్లప్పుడూ వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను”.

ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథాయ నమః.

బాబా నా మనసుని వింటున్నారు

యు.ఎస్.ఏ. నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిభక్తులందరికీ నా నమస్కారములు. బ్లాగులోని భక్తుల అనుభవాల ద్వారా బాబా ఎప్పుడూ నన్ను గమనిస్తూనే ఉన్నారని, నన్ను జాగ్రత్తగా చూసుకుంటారని నాకు విశ్వాసం ఏర్పడటంలో దోహదం చేస్తున్నాయి. నేను నా చిన్ననాటినుండి సాయిని ప్రార్థిస్తున్నప్పటికీ, ఆయనపై నా విశ్వాసం కొన్ని సంవత్సరాల క్రితమే బలపడింది. అప్పటినుండి నేనెప్పుడూ ఆయన బిడ్డనేనన్న విశ్వాసం నాలో దృఢపడింది. నా జీవితంలో జరిగిన అద్భుతాల వెనుక ఆయన ఉన్నారు. ఇది నా మొదటి అనుభవం.

నా చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి నేను ఎప్పుడూ స్పృహలో ఉంటాను. అందరిముందు నా అభిప్రాయాల గురించి నేను చెప్పుకోలేను. కారణం, వాళ్ళు ఏమనుకుంటారో, ఎక్కడ నన్ను తక్కువగా చూస్తారో అని నాకుంటుంది. 2019, జనవరిలో నేను సాయి సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టి, ఫిబ్రవరి చివరినాటికి పూర్తి చేశాను. నేను, నా తల్లిదండ్రులు ప్రతి గురువారం సాయంత్రం సాయిబాబా మందిరానికి వెళ్లి శేజ్ ఆరతిలో పాల్గొంటాం. ఆ మందిరంలో బాబాకు ఆరతి చేయడంలో, ప్రసాదం పంపిణీలో ఇద్దరి భక్తులకు అవకాశం ఇస్తారు. సచ్చరిత్ర పారాయణ ముగించిన ప్రతిసారీ నేను ఆ సేవ చేస్తూ ఉంటాను. కానీ ఈసారి ఎందుకో నాకు తెలియదుగాని, పరిసరాల గురించి మనసులో గందరగోళంగా అనిపించి సేవ చేయడానికి కాస్త ఇబ్బందిపడ్డాను. అంతలో మా అమ్మ కూడా బాబాకు ఆరతి చేయమని నన్ను బలవంతపెట్టింది. కానీ నేను, ఇతరులకు అవకాశం లభిస్తుందనే నెపంతో అందుకు నిరాకరించాను. 5, 6 నిమిషాలు గడిచిన తరువాత ఇద్దరు ఆరతి చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వాళ్ళు ఆరతి ప్రారంభించాక నాకు అవకాశం లభిస్తే బాగుంటుందని నాలో అలజడి మొదలైంది. కానీ అది సాధ్యంకాదని నాకు తెలుసు. ఎందుకంటే ఆరతి పూర్తయ్యేవరకు పూజారితోపాటు ఆ ఇద్దరికి మాత్రమే అవకాశముంటుంది. కానీ బాబా అద్భుతం చేసారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. ఆరతి మొదలైన 5 నిమిషాల తరువాత అకస్మాత్తుగా ఆలయానికి చెందిన ఒక వ్యక్తి వచ్చి, ఆరతి ఇస్తున్న ఆ ఇద్దరు స్వచ్ఛంద సేవకుల వద్దనుండి ఆరతి పళ్ళాన్ని తీసుకుని ఒక పెద్దాయన చేతికి ఇచ్చారు. తరువాత ఆలయంలోని ప్రతి ఒక్కరికీ ఆరతి చేయటానికి అవకాశం లభించింది. అందులో నాకు కూడా అవకాశం వచ్చింది. కొన్ని సెకన్లపాటే బాబాకు ఆరతి ఇచ్చినప్పటికీ బాహ్యస్పృహలో లేనంతగా బాబా ప్రేమలో లీనమైపోయాను. అంతకుముందు ఎన్నోసార్లు నేను హాజరైన ఆరతులన్నింటికంటే ఎంతో భిన్నంగా అనిపించింది ఆరోజు ఆరతి. బాబా నా మనసులోని ఆలోచనలు తెలుసుకుని నా కోరిక నెరవేర్చి నన్ను చాలా ఆశీర్వదించారు. నేను చాలా అదృష్టవంతురాలిని. ఆయన తాతలా నన్ను తన నీడలోకి తీసుకుని ఎల్లప్పుడూ నన్ను గమనిస్తూ, నా మనసుని వింటున్నారు. ఈరోజు నేను సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ బాబా నా వెన్నంటి ఉన్నారు. ఆయన నాకు ఏమీ చెడు జరగనివ్వరు. ఏది ఏమైనా ఆయన ఎల్లప్పుడూ మననుండి ఏమీ ఆశించకుండా మనల్ని ప్రేమిస్తూ, రక్షిస్తూ ఉంటారు. మనం చేయాల్సిందల్లా ఆయనపై విశ్వాసం ఉంచడమే. "బాబా! దయచేసి నా తప్పులన్నిటికీ నన్ను క్షమించి నన్ను, నా కుటుంబాన్ని మరియు ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించండి. దయచేసి నా కోరికలను తీర్చండి. నా లక్ష్యాలను సాధించడానికి అవసరమైన బలాన్ని నాకు ఇవ్వండి. నేను మీ దివ్య పాదకమలాలకు నా సమస్తాన్ని అప్పగిస్తున్నాను".

ఓం శ్రీ సాయినాథాయ నమః

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!


దేవ్‌బాబా


ప్రముఖ సాయిభక్తుడు హేమాడ్‌పంత్ మనుమడైన దేవ్‌బాబా అలియాస్ అనంత్ ప్రభు వాల్వేకర్, శ్రీసాయిబాబాల మధ్య ఋణానుబంధం చాలా లోతైనది, అర్థం చేసుకో శక్యం కానిది. ఇతని తండ్రి రాజారామ్ కాకా. అతను విఠలునిపట్ల అంకితభావంతో వార్కరీ సంప్రదాయాన్ని అనుసరిస్తుండేవాడు. అతను సింధుదుర్గా జిల్లాలోని వలవాల్ ప్రాంతానికి చెందినవాడు. అందువల్ల వారిని "వలవాల్కర్"లని పిలిచేవారు. వారు సత్‌కుల్ కుదర్ దేశ్‌కర్ వంశీకులు. ఆ కుటుంబీకులు భక్తి తత్పరులు, ధర్మ పరాయణులు.

1916వ సంవత్సరంలో హేమాడ్‌పంత్ కుమార్తె అయిన కృష్ణాబాయి అలియాస్ సీతాబాయితో రాజారామ్ కాకాకు వివాహమైంది. వివాహానంతరం ఆ దంపతులు బొంబాయిలోని గిర్గాఁవ్‌కు వెళ్లారు. అక్కడ రాజారామ్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో పనిచేసేవాడు. గిర్గాఁవ్ మారుమూల శివారు ప్రాంతమైనందున వాళ్ళు తరువాత దాదర్‌కు మారారు. తరువాత సీతాబాయి మొదటి కాన్పు కోసం బాంద్రాలోని తన పుట్టింటికి వెళ్ళింది. ఆమె ఆ గర్భధారణ సమయంలో ధనుర్వాతంతో అనారోగ్యానికి గురై చాలా బాధపడింది. కన్నబిడ్డ పడుతున్న అవస్థను దభోల్కర్ చూడలేక చాలా ఆందోళనచెంది శిరిడీకి పరుగుతీశాడు. అతడు తన గురువు, దైవమైన సాయిబాబాను దర్శించి, తన కూతురి పరిస్థితి గురించి వివరించాడు. అప్పుడు బాబా, "సుఖప్రసవం అవుతుంది. ఆమె మగబిడ్డకు జన్మనిస్తుంది" అని అన్నారు. బాబా ఇచ్చిన హామీతో దభోల్కర్ తిరిగి వచ్చి, రోజూ సహాయం కోసం బాబాను ప్రార్థిస్తుండేవాడు. మరోవైపు రాజారామ్ విఠలుని, "సంత్ జ్ఞానేశ్వర్ వంటి బిడ్డని ప్రసాదించమ"ని ప్రార్థిస్తుండేవాడు.

అద్భుత లీల

చివరికి 1918, ఏప్రిల్ 13, చైత్రశుద్ధ విదియనాడు ఆమెకు కాన్పు ఘడియలు సమీపించాయి. రాజారామ్, దభోల్కర్ ఇరువురూ ఆత్రుతగా వెలుపల వేచి ఉన్నారు. కొంతసేపటికి కృత్తికా నక్షత్రం, మొదటిపాదంలో సీతాబాయి బాబా చెప్పినట్లే మగబిడ్డకు జన్మనిచ్చింది. తరువాత దభోల్కర్ తన కుమార్తెను, అప్పుడే జన్మించిన బిడ్డని చూడడానికి గది లోపలికి వెళ్లి నిర్ఘాంతపోయాడు. తన కళ్ళముందు ఉన్న దృశ్యాన్ని చూచి తనని తాను నమ్మలేకపోయాడు. తల్లి బిడ్డను దగ్గరకు తీసుకోకుండా దూరంగా ఆ గదిలో ఒక మూలకు విసిరేసింది. బిడ్డ హాయిగా ఆ మూలాన నిద్రపోతున్నాడు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, బిడ్డ తలభాగం చుట్టూ తేజస్సుతో కూడిన కాంతివలయం ఉంది. కేవలం తలభాగమే కాదు, శరీరం చుట్టూ ప్రకాశవంతంగా ఉంది. తల్లి బిడ్డని తాకేందుకు భయపడింది. ఎంతో ఆవశ్యకమైన తల్లి ప్రేమను, పోషణను బిడ్డకందించడానికి నిరాకరించింది. తన కూతురి వింత ప్రవర్తన దభోల్కర్‌కి చాలా ఆందోళన కలిగించింది. వెంటనే అతను బిడ్డను ఎత్తుకొని ఆలస్యం చేయకుండా శిరిడీకి ప్రయాణమయ్యాడు. శిరిడీ చేరుకున్నాక అతడు నేరుగా ద్వారకామాయికి వెళ్లి, సాయిబాబా పాదాల చెంత బిడ్డని పెట్టాడు. తరువాత అతను బాబాతో తన కూతురి ప్రవర్తన గురించి, జరిగిన సంఘటన గురించి అన్నీ వివరంగా చెప్పాడు. ఇంతలో సాయిబాబా బిడ్డని ఎత్తుకొని తన ఒడిలో పెట్టుకొని మృదువుగా తమ చేతులతో తట్టారు. తర్వాత ఆయన తమ చేతి బొటనవ్రేలును బిడ్డ నోటిలో పెట్టారు. బిడ్డ ఆయన వేలిని చప్పరిస్తుంటే, ఆశ్చర్యంగా ఆయన బొటనవ్రేలునుండి పాలు రాసాగాయి. అత్యంత అద్భుతమైన ఆ దృశ్యం చూసి భక్తులంతా ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు బాబా గంగ, యమునా జలాలను తమ పాదాల నుండి ప్రవహింపజేశారు. ఇప్పుడు తమ బొటనవ్రేలుతో చిన్నబిడ్డకు పాలు పట్టారు. బాబా చర్యలు అద్భుతం! అమోఘం!

బాబా అనుగ్రహం దేవ్‌పై ఎప్పుడూ ఉండేది. అతని ప్రాథమిక విద్యాభ్యాసం మరాఠీ భాషలో సాగింది. తరువాత అతను విల్సన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చేరాడు. అయితే అతడు పాఠశాలకు నిత్యం హాజరయ్యేవాడు కాదు. అతడు సమీపంలోవున్న స్వామి సమర్థ మఠానికి వెళ్లి ఎక్కువ సమయం ధ్యానంలో గడిపేవాడు. స్వామి సమర్థ అనుగ్రహం కూడా అతనిపై ఉండేది.

దేవ్‌బాబాకి యుక్తవయస్సు వచ్చాక, కుర్లా మున్సిపల్ కిర్డే కేంద్రంలో శారీరక విద్యాబోధకునిగా చేరాడు. అతడు తన విద్యార్థులను ఎంతగానో ఇష్టపడేవాడు. అందరినీ ప్రేమతో చూసుకునేవాడు. కానీ విద్యార్థులు రెండు కులాలకు చెందినవారు. వాళ్లలో ఒక కులంవారు దేవ్‌బాబా మరో కులం వారిపట్ల అభిమానంతో ఉంటున్నారని భావించేవారు. దాంతో వాళ్ళు వెళ్లి ఇతర టీచర్ల వద్ద దేవ్‌బాబాకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. వాళ్లలో ఒక అధ్యాపకుడు అదే అవకాశంగా తీసుకొని దేవ్‌బాబాకు సరైన బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. ఈ విషయం గురించి కొందరు శ్రేయోభిలాషులైన ఉపాధ్యాయులు దేవ్‌బాబాతో చెప్పి, కాస్త జాగ్రత్త తీసుకోమని చెప్పారు. దేవ్‌బాబా, "ఓహో అలాగా! కానీ అతను రేపు పాఠశాలకు రాడు" అన్నాడు. అదేరోజు సాయంత్రం ఆ ఉపాధ్యాయుడు ఈతకొట్టడానికి వెళ్లి, నీట మునిగిపోయి చనిపోయాడు. ఈ సంఘటనతో సాయిబాబా తనకు సిద్ధులను ఒసగారని దేవ్‌బాబా గ్రహించాడు. అంతేకాదు, ఆ సంఘటన అతని మనస్సుపై తీవ్రప్రభావాన్ని చూపింది. అతడు ఇకపై ఎవరికోసమో పనిచేస్తూ సమయాన్ని వృధా చేసుకోకుండా తన పూర్తి జీవితాన్ని భగవంతుని సేవ చేయడానికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక అప్పటినుండి అతడు అనేక తీర్థయాత్రలు చేసి, కొంతకాలం హిమాలయాలలో నివాసమున్నాడు. అక్కడే హఠయోగం నేర్చుకొని ఆధ్యాత్మిక ప్రగతి సాధించాడు.

సచ్చరిత్ర పూర్తిచేసిన దేవ్‌బాబాకు శ్రీసాయిబాబా ఆశీస్సులు

దేవ్‌బాబా తరచూ శ్రీసాయి సచ్చరిత్ర పారాయణ చేయడానికి భివ్‌పురి సాయిమందిరానికి వెళ్తుండేవాడు. ఒకసారి అతను మధ్యాహ్న ఆరతి సమయానికి ముందు సచ్చరిత్ర పారాయణ పూర్తి చేశాడు. ఆ సందర్భంగా ఆరతి తరువాత గొప్ప విందు ఏర్పాటు చేశారు. ఆరోజు అతని పారాయణ పూర్తవుతుందని, విందు ఉందని గ్రామస్తులకు తెలుసు. అందుకే విందులో పాల్గొని సాయి ప్రసాదం స్వీకరించడానికి అందరూ ఆరతి సమయానికి మందిరం వద్ద సమావేశమయ్యారు. మధ్యాహ్నం 12 గంటలు కాగానే ఆరతి ప్రారంభమైంది. భక్తులందరూ భక్తిపారవశ్యంతో ఆరతి పాడుతూ తన్మయులై ఉన్నారు. ఆ సమయంలో దేవ్‌బాబాకు చాలా శక్తివంతమైన ఆధ్యాత్మిక ఉనికి అనుభూతమై కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. గొర్రెల కాపరి వలె కనిపించే ఒక పొడవాటి వ్యక్తి అతని ప్రక్కన నిలబడి ఉన్నాడు. అతను గ్రామస్తులందరికంటే చాలా భిన్నంగా కనిపిస్తున్నాడు. అతనిలో ఏదో తెలియని దైవిక తేజస్సు వ్యక్తమవుతోంది. అంతలో మంత్రపుష్పం పూర్తయింది. అందరూ తమకు ఇవ్వబడిన పువ్వులను బాబాకు అర్పించడానికి ముందుకు వెళ్లారు. ఆ గొర్రెల కాపరి మాత్రం తానున్న చోటనే నిలబడి, నెమ్మదిగా పువ్వులను తన పాదాల మీద వేసుకున్నాడు. దేవ్‌బాబా అది చూసి, ‘తన పారాయణ పూర్తయిన రోజున సాక్షాత్తూ బాబానే ఆరతిలో పాల్గొని తనని ఆశీర్వదించార’ని భావించి, భక్తితో ఆయన ముందు సాష్టాంగపడి నమస్కారం చేశాడు. బాబా మన గొర్రెల కాపరి, మనం ఆయన గొర్రెలం. జీవితమనే పచ్చటి పచ్చికబయళ్ళలో మనల్ని నడిపిస్తూ మన బాగోగులు చూసుకుంటారాయన.

1945వ సంవత్సరంలో అతని తల్లి తీవ్ర అనారోగ్యానికి గురైంది. త్వరలోనే ఆమె మరణించనుందని అతనికి తెలిసి తల్లిని చూడటానికి వచ్చి, చివరిరోజులలో జపం చేస్తూ ఉండమని తన తల్లికి ఒక మంత్రాన్ని చెప్పాడు. తరువాత అతడు శిరిడీ వెళ్లి సమాధిమందిరంలో కూర్చొని శ్రీసాయిసచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టాడు. పారాయణ మధ్యలో ఉండగా తన తల్లి పరిస్థితి విషమించిందని టెలిగ్రామ్ వచ్చింది. అతను, 'ఆమెను చూడటానికి వెళ్ళాలా, వద్దా?' అని బాబాను అడిగాడు. బాబా నుండి 'వెళ్ళమ'ని జవాబు వచ్చింది. అయితే, "సమయం చాలా తక్కువగా ఉండి, దూరం ఎక్కువగా ఉన్నప్పుడు, తన తల్లిని సందర్శించమని బాబా ఎందుకు చెప్పారు?" అని అతను ఆలోచనలోపడ్డాడు. మరుక్షణంలో బాబా అతని ముందు నిలబడి ధైర్యాన్నిచ్చారు. సూక్ష్మరూపాన ఆయన తనతోపాటు ఒక గుర్రాన్ని తెచ్చి, అతనిని ఎక్కించుకొని ప్రయాణమయ్యారు. క్షణాలలో వారిద్దరూ దాదరులోని తన ఇంటికి చేరుకున్నారు. అతడు తన తల్లిని చూసి ఆమెతో, "నీకు ప్రశాంతమైన మరణం లభిస్తుంది. సాయిబాబా స్వయంగా నిన్ను గమ్యం చేర్చేందుకు ఇక్కడ ఉన్నారు" అని ధైర్యాన్ని చేకూర్చాడు. తరువాత ఆమె ప్రశాంతమైన మరణాన్ని పొందింది. తరువాత అతడు తిరిగి శిరిడీ వచ్చి తన పారాయణ పూర్తి చేశాడు. అతను తన తల్లి మరణించిందని, ఆ చివరి క్షణాల్లో తాను ఆమె ప్రక్కనే ఉన్నానని చెప్పినప్పుడు భక్తులంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, ఆ సమయంలో అతను ఎక్కడికీ కదలకుండా పారాయణ చేస్తూ ఉండటం వాళ్లంతా చూశారు.

1952లో దేవ్‌బాబా కిషోరీబాయిని వివాహం చేసుకున్నాడు. ఇరువురూ సాయిబాబాని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ ఉండేవారు. కొద్దిరోజుల తరువాత ఆ దంపతులు వారి పూర్వీకుల నివాసమైన అంబర్‌నాథ్‌కి వెళ్లి అక్కడే నివాసముండసాగారు. 1967లో మొదటి అంతస్తులో ఒక మందిరము నిర్మించి, సప్తలోహాలతో తయారుచేసిన సాయిబాబా విగ్రహాన్ని స్థాపించి, ప్రాణప్రతిష్ఠ చేశారు.

దేవ్‌బాబా వైపు చాలామంది ఆకర్షింపబడ్డారు. వారందరినీ అతడు తన ఇష్టదైవమైన సాయిబాబా మార్గంలో నడిపించాడు. అతడు ముందుగానే తన బంధువులతో 'తాను సమాధి చెందాక మతపరమైన ఆచారాలు, వేడుకలు నిర్వహించవద్ద'ని చెప్పి, 1994, మే 25, గురువారం, వైశాఖ ఏకాదశిరోజున సమాధి చెందాడు. ప్రస్తుతం దేవ్‌బాబా కుమారుడు డాక్టర్ భానుదాస్ ముంబైలో నివసిస్తూ తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

సాయిభక్తుల కోసం దేవ్‌బాబా గారి అంబర్‌నాథ్ సాయిమందిరం యొక్క వివరాలను క్రింద ఇస్తున్నాము:


Shri Sai Baba Mandir,
C/o.Shri Sai Seva Sansthan (R)
451/452, Sai Section, Suryodaya Society,
Ambernath East-421 501,
Thane District,
Maharashtra,
India.

సమాప్తం

భివ్‌పురిలోని ప్రప్రథమ సాయిమందిరం గురించి చదవాలనుకునేవారికోసం క్రింద లింక్స్ ఇస్తున్నాను, గమనించగలరు.


Source: Shri Sai Satcharitra, Chapter 4, Dev Babanche Charitra Published on 26th may, 1996 and Baba’s Rinanubandh by Vinny Chitluri. Photo Courtesy: Smt.Shreya Nagaraj, Pune)
రెఫ్: డాక్టర్ సాయినాథ్ గవాంకర్.
source: Baba’s Divine Symphany by Vinny Chitluri.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo