సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 235వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయి అనుగ్రహంతో నయమైన ఆరోగ్య సమస్యలు.
  2. బాబా నా మనసుని వింటున్నారు

సాయి అనుగ్రహంతో నయమైన ఆరోగ్య సమస్యలు

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో ఇలా పంచుకుంటున్నారు:

2001లో, మా మనవరాలికి 7 నెలల వయసున్నప్పుడు తన గొంతులో సమస్య వచ్చి ఎక్కిళ్ళు ఒక గంటసేపు ఆగకుండా వస్తూనే ఉండేవి. ఆ సమయంలో పాప అవస్థ చూసి మేము తట్టుకోలేకపోయేవాళ్ళం. డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి, వయసు పెరిగే కొద్దీ అదే తగ్గుతుందన్నారు. అన్నిరోజులూ పాప ఇలా అవస్థపడుతూనే ఉండాలా అని బాధపడి మేమందరం పాప సమస్యను తీర్చమని బాబాకు, అందరి దేవుళ్ళకు మ్రొక్కుకున్నాము. మా చిన్నబ్బాయి(పాప తండ్రి) ఏ దేవుడినీ అంతగా ప్రార్థించేవాడు కాదు. కానీ కూతురి బాధ చూసి, ఒక్కరోజులో ‘సాయిసచ్చరిత్ర’ (కొంచెం తక్కువ పేజీలు వున్న పుస్తకం) పారాయణ పూర్తి చేశాడు. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అప్పటినుండి మా మనవరాలి ఎక్కిళ్ళ సమస్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఒక్కనెలలో ఆ సమస్య పూర్తిగా తగ్గిపోయి ఇప్పుడు తనెంతో ఆరోగ్యంగా ఉంది

ఇంకోసారి ఆ పాప కడుపునొప్పితో రెండేళ్ళు చాలా బాధపడింది. ఆ నొప్పివల్ల కాలేజీకి కూడా వెళ్ళలేక ఇంట్లోనే ఉండి చదువుకుంటూ, పరీక్షల సమయంలో మాత్రం కాలేజీకి వెళ్ళేది. 2017 దసరా రోజుల్లో మా చిన్నబ్బాయి శిరిడీ వెళ్ళి పాపకు ఆరోగ్యాన్ని ప్రసాదించమని బాబాను ప్రార్థించాడు. శిరిడీనుండి బాబా ఊదీ తీసుకొచ్చి పాప నుదుటన పెట్టాడు. ఊదీ పెట్టినప్పటినుండి కొంచెంకొంచెంగా కడుపునొప్పి తగ్గుతూ వచ్చింది. 6 నెలల్లో బాబా అనుగ్రహంతో నొప్పి పూర్తిగా తగ్గిపోయి తను ఇప్పడు సంపూర్ణ ఆరోగ్యంతో హాయిగా వుంది. చదువులో కూడా అభివృద్ధి సాధిస్తూ ఇప్పుడు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతూ సంతోషంగా ఉంది. అంతా బాబా అనుగ్రహంతోనే జరుగుతున్నదని మా అందరి నమ్మకం. “చాలా చాలా కృతజ్ఞతలు బాబా! మీ అనుగ్రహం మా అందరిపై ఎల్లప్పుడూ వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను”.

ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథాయ నమః.

బాబా నా మనసుని వింటున్నారు

యు.ఎస్.ఏ. నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిభక్తులందరికీ నా నమస్కారములు. బ్లాగులోని భక్తుల అనుభవాల ద్వారా బాబా ఎప్పుడూ నన్ను గమనిస్తూనే ఉన్నారని, నన్ను జాగ్రత్తగా చూసుకుంటారని నాకు విశ్వాసం ఏర్పడటంలో దోహదం చేస్తున్నాయి. నేను నా చిన్ననాటినుండి సాయిని ప్రార్థిస్తున్నప్పటికీ, ఆయనపై నా విశ్వాసం కొన్ని సంవత్సరాల క్రితమే బలపడింది. అప్పటినుండి నేనెప్పుడూ ఆయన బిడ్డనేనన్న విశ్వాసం నాలో దృఢపడింది. నా జీవితంలో జరిగిన అద్భుతాల వెనుక ఆయన ఉన్నారు. ఇది నా మొదటి అనుభవం.

నా చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి నేను ఎప్పుడూ స్పృహలో ఉంటాను. అందరిముందు నా అభిప్రాయాల గురించి నేను చెప్పుకోలేను. కారణం, వాళ్ళు ఏమనుకుంటారో, ఎక్కడ నన్ను తక్కువగా చూస్తారో అని నాకుంటుంది. 2019, జనవరిలో నేను సాయి సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టి, ఫిబ్రవరి చివరినాటికి పూర్తి చేశాను. నేను, నా తల్లిదండ్రులు ప్రతి గురువారం సాయంత్రం సాయిబాబా మందిరానికి వెళ్లి శేజ్ ఆరతిలో పాల్గొంటాం. ఆ మందిరంలో బాబాకు ఆరతి చేయడంలో, ప్రసాదం పంపిణీలో ఇద్దరి భక్తులకు అవకాశం ఇస్తారు. సచ్చరిత్ర పారాయణ ముగించిన ప్రతిసారీ నేను ఆ సేవ చేస్తూ ఉంటాను. కానీ ఈసారి ఎందుకో నాకు తెలియదుగాని, పరిసరాల గురించి మనసులో గందరగోళంగా అనిపించి సేవ చేయడానికి కాస్త ఇబ్బందిపడ్డాను. అంతలో మా అమ్మ కూడా బాబాకు ఆరతి చేయమని నన్ను బలవంతపెట్టింది. కానీ నేను, ఇతరులకు అవకాశం లభిస్తుందనే నెపంతో అందుకు నిరాకరించాను. 5, 6 నిమిషాలు గడిచిన తరువాత ఇద్దరు ఆరతి చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వాళ్ళు ఆరతి ప్రారంభించాక నాకు అవకాశం లభిస్తే బాగుంటుందని నాలో అలజడి మొదలైంది. కానీ అది సాధ్యంకాదని నాకు తెలుసు. ఎందుకంటే ఆరతి పూర్తయ్యేవరకు పూజారితోపాటు ఆ ఇద్దరికి మాత్రమే అవకాశముంటుంది. కానీ బాబా అద్భుతం చేసారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. ఆరతి మొదలైన 5 నిమిషాల తరువాత అకస్మాత్తుగా ఆలయానికి చెందిన ఒక వ్యక్తి వచ్చి, ఆరతి ఇస్తున్న ఆ ఇద్దరు స్వచ్ఛంద సేవకుల వద్దనుండి ఆరతి పళ్ళాన్ని తీసుకుని ఒక పెద్దాయన చేతికి ఇచ్చారు. తరువాత ఆలయంలోని ప్రతి ఒక్కరికీ ఆరతి చేయటానికి అవకాశం లభించింది. అందులో నాకు కూడా అవకాశం వచ్చింది. కొన్ని సెకన్లపాటే బాబాకు ఆరతి ఇచ్చినప్పటికీ బాహ్యస్పృహలో లేనంతగా బాబా ప్రేమలో లీనమైపోయాను. అంతకుముందు ఎన్నోసార్లు నేను హాజరైన ఆరతులన్నింటికంటే ఎంతో భిన్నంగా అనిపించింది ఆరోజు ఆరతి. బాబా నా మనసులోని ఆలోచనలు తెలుసుకుని నా కోరిక నెరవేర్చి నన్ను చాలా ఆశీర్వదించారు. నేను చాలా అదృష్టవంతురాలిని. ఆయన తాతలా నన్ను తన నీడలోకి తీసుకుని ఎల్లప్పుడూ నన్ను గమనిస్తూ, నా మనసుని వింటున్నారు. ఈరోజు నేను సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ బాబా నా వెన్నంటి ఉన్నారు. ఆయన నాకు ఏమీ చెడు జరగనివ్వరు. ఏది ఏమైనా ఆయన ఎల్లప్పుడూ మననుండి ఏమీ ఆశించకుండా మనల్ని ప్రేమిస్తూ, రక్షిస్తూ ఉంటారు. మనం చేయాల్సిందల్లా ఆయనపై విశ్వాసం ఉంచడమే. "బాబా! దయచేసి నా తప్పులన్నిటికీ నన్ను క్షమించి నన్ను, నా కుటుంబాన్ని మరియు ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించండి. దయచేసి నా కోరికలను తీర్చండి. నా లక్ష్యాలను సాధించడానికి అవసరమైన బలాన్ని నాకు ఇవ్వండి. నేను మీ దివ్య పాదకమలాలకు నా సమస్తాన్ని అప్పగిస్తున్నాను".

ఓం శ్రీ సాయినాథాయ నమః

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!


2 comments:

  1. Sri sadguru sainatharpana mastu subham Bhavat. om sairam

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః'🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo