సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 230వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  1. శ్రీసాయి కరుణామయుడు

శ్రీసాయి కరుణామయుడు

ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిభక్తులకు నా నమస్కారం. మీ అందరిలాగే నేను కూడా సాయి పాదకమలాల వద్ద ఒక చిన్న భక్తుడిని. మన ప్రియమైన బాబా మహిమలు వర్ణించడానికి పదాలు సరిపోవు. ఆయన దయతో నేను ఒక పెద్ద సమస్యను అధిగమించాను. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

ఇటీవలి కాలంలో నాకు కోల్‌కత్తా నుండి ముంబాయికి బదిలీ అయ్యింది. నా కుటుంబమంతా కోల్‌కత్తాలోనే నివసిస్తుండగా నేను ఒక్కడినే ముంబాయిలో ఉంటూ అప్పుడప్పుడు ఇంటికి వెళ్లి వస్తున్నాను. ఒక శనివారంనాడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే, దాదాపు నెలరోజుల విరామం తరువాత ఆరోజు సాయంత్రం ఫ్లైట్ కి నేను కోల్‌కత్తా వెళ్ళబోతున్నాను. కుటుంబంతో కలిసి హోలీ పండుగ జరుపుకోబోతున్నందుకు, నా కొడుకు పరీక్షల సమయంలో తనకి అండగా ఉండబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంది. రోజూలాగే ఆరోజు ఉదయం కూడా వాకింగ్, వ్యాయామం చేసుకోవడానికి పార్కుకు వెళ్ళాను. కాకడ ఆరతి, రామరక్షాస్తోత్రం వింటూ నేను నా నడక, వ్యాయామం కొనసాగించాను. 8 గంటల సమయంలో నేను మెషిన్ మీద వ్యాయామం చేస్తున్నప్పుడు ఏమి జరిగిందో నాకు సరిగ్గా తెలియదుగాని, స్పృహలోకి వచ్చేసరికి నేను పార్కులో ఉన్న బెంచీ మీద ఉన్నాను. నాకు ఏమి జరిగిందో, నేను ఎక్కడ ఉన్నానో గుర్తించలేకపోయాను. బి.పి తక్కువైన కారణంగా నేను క్రింద పడిపోయానని ఎవరో చెప్పి వెళ్లిపోయారు. నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకోవడానికి నా కుటుంబానికి ఫోన్ చేసి అడిగాను. వాళ్ళు చెప్పినదాన్నిబట్టి నేను ముంబాయిలోనే ఉన్నానని గ్రహించి వెంటనే నా ఫ్లాట్‌కు చేరుకున్నాను. తరువాత నేను నా రూమ్‌మేట్‌ని తోడుగా తీసుకుని డాక్టర్ దగ్గరకు వెళ్లాను. అతను పరీక్షించి, "మీ బి.పి తక్కువగా ఉంది, కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోండి" అని చెప్పి మందులిచ్చి పంపారు.

బాహ్యానికి నా తలకుగాని, శరీరానికిగాని ఏమీ జరిగినట్లు కనిపించనప్పటికీ నాకు విపరీతమైన తలనొప్పిగా ఉంది. నేను పెయిన్ కిల్లర్స్ వేసుకుని, బామ్ కూడా వ్రాసుకున్నాను, కానీ అవేవీ పనిచేయలేదు. కోల్‌కత్తాలో ఉన్న నా కుటుంబసభ్యులందరూ నాకేమి జరుగుతోందో అర్థంకాక భయంతో ఆందోళనపడుతుంటే, నేను వారితో, "భయపడకండి. నేను సాయంత్రం అక్కడికి వస్తున్నాను. అక్కడి వైద్యుడిని సంప్రదిస్తాను" అని చెప్పి ఓదార్చాను. రాత్రికి కోల్‌కత్తా చేరుకున్నాను. అప్పటికీ తలనొప్పి అలానే ఉంది. మరుసటిరోజు ఉదయం నేను డాక్టరుని సంప్రదించాను. డాక్టర్ చాలా పరీక్షలు వ్రాసి, ఎక్స్-రే కూడా తీయించమని సూచించారు. అప్పటివరకు నేను ప్రశాంతంగానే ఉన్నాను, కానీ ఆ క్షణంనుండి డాక్టర్ ఏమి చెప్తారోనని భయం పట్టుకుంది. నా భార్య కూడా చాలా భయపడిపోయింది. నేను, "రిపోర్ట్స్ నార్మల్ గా వచ్చేలా చూడండి బాబా" అని ప్రతిక్షణం బాబాను ప్రార్థిస్తూ గడిపాను. మరుసటిరోజు రిపోర్ట్స్ రానే వచ్చాయి. రిపోర్ట్స్ చూశాక నాకు నోట మాట రాలేదు. ఎందుకంటే రిపోర్ట్ నా మెదడు ఎడమ భాగంలో ఏదో అనుమానాస్పద విషయాన్ని సూచిస్తోంది. ఆ రిపోర్ట్ చూసిన నా భార్యకు కన్నీళ్ళు ఆగలేదు. వెంటనే మేము డాక్టర్ వద్దకు వెళ్లి రిపోర్ట్స్ చూపించాము. సి.టి స్కాన్‌లో ప్రతికూలతను చూసిన డాక్టర్ మరింత స్పష్టత కోసం ఎంఆర్‌ఐ చేయించమని సూచించారు.

ఈ సమయమంతా నేను తలనొప్పిని అనుభవిస్తూనే ఉన్నాను. ఎన్ని రకాల మందులు తీసుకుంటున్నా అది మాత్రం తగ్గడం లేదు. నేను, నా కుటుంబమంతా బాబాను హృదయపూర్వకంగా ప్రార్థించాము. పరీక్షకి వెళ్లేముందు మళ్ళీ నేను బాబాను ప్రార్థించి, "రిపోర్టులో ఏ సమస్యా లేదని వస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. భయభ్రాంతుల నడుమ సాయంత్రం వరకు నేను బిక్కుబిక్కుమంటూ గడిపి, "సహాయం చేయండి బాబా" అని ప్రార్థించుకుంటూ రిపోర్ట్ తీసుకోవడానికి వెళ్ళాను. సర్వశక్తిమంతుడు, కరుణామయుడైన బాబా నా ప్రార్థన విన్నారు. చాలా మంచి రిపోర్ట్ వచ్చింది. అంతా సాధారణంగా ఉంది. అది నా అంచనాలకు మించింది. నాకు సహాయం చేసినందుకు బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఆయన దయలేకుండా అంత మంచి రిపోర్ట్ వచ్చేది కాదు. తరువాత మేము డాక్టరును కలిశాము. డాక్టర్ రిపోర్ట్స్ చూసి సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇప్పుడు నా తలనొప్పి చాలావరకు తగ్గిపోయింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! మీరు నన్ను, నా కుటుంబాన్ని రక్షించారు. మీ చల్లని కృప అందరి మీద ఉంచి ప్రతి ఒక్కరి దుఃఖాన్ని నిర్మూలించండి".

శ్రీసాయినాథ్ మహారాజ్ కీ జై!! 

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo