సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 215వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • పుట్టినరోజునాడు సాయి ఇచ్చిన గొప్ప బహుమతి

యు.ఎ.ఇ. నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

కేరళకు చెందిన నేను ప్రస్తుతం యు.ఎ.ఇ. లోని షార్జాలో నివసిస్తున్నాను. ప్రతిరోజూ స్వామి(బాబా) నాకు అందమైన అనుభవాలను చూపిస్తున్నారు. వాటిలో ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.

మార్చి 10న నా పుట్టినరోజు. ఆరోజు స్వామి నాకు ఏ బహుమతి ఇస్తారోనని అనుకున్నాను. గత సంవత్సరమైతే మా కుటుంబమంతా సాయికి చాలా దగ్గరగా ఉన్నాము. కాబట్టి నేను చాలా అనుభవాలు పొందాను. కానీ ఈసారి ఎలా ఉంటుందో అనుకున్నాను. మార్చి 9న రాత్రి 10 గంటల సమయంలో నేను, నా సహోద్యోగి ఆఫీసు విషయాలు చర్చించుకుంటూ ఆఫీసు పనిమీద మరుసటిరోజు దుబాయిలోని ఒక సంస్థకు వెళ్లాలని నిర్ణయించుకున్నాము. నిజానికి మేము 11వ తేదీన అక్కడికి వెళ్ళాలి. కానీ పరీక్షల కారణంగా మా అబ్బాయికి 11వ తేదీ సెలవు ఉన్నందున మేము 10వ తేదీన వెళ్ళి వచ్చేద్దామని అనుకున్నాము. అయితే త్వరగా వెళ్లి మా అబ్బాయిని స్కూలు నుండి తిరిగి తీసుకుని రావాల్సిన సమయానికల్లా తిరిగి వచ్చేద్దామని మా ఆలోచన. ఆ ప్రణాళిక ప్రకారం మరుసటిరోజు ఉదయం నేను త్వరగా లంచ్ తయారుచేయడం మొదలుపట్టాను. నా పుట్టినరోజు సందర్భంగా మా అబ్బాయికి ఇష్టమైన పన్నీర్ బిర్యానీ తయారుచేస్తూ ఉన్నాను. ఏదైనా తయారుచేసినప్పుడు బాబాకు నైవేద్యంగా పెట్టడానికి కొంత వేరుగా తీసి పెట్టుకోవడం నాకలవాటు. వంట చేస్తున్నప్పుడు దీన్ని నేను దుబాయిలోని సాయిమందిరంలో బాబాకు నైవేద్యంగా ఇవ్వగలిగితే బాగుంటుందని అనుకున్నాను. అదే సమయంలో అకస్మాత్తుగా నాతో వస్తున్న సహోద్యోగి చాలాకాలం నుండి వివాహం కోసం చూస్తోందని నాకు గుర్తుకు వచ్చింది. తను స్వామిని ప్రార్థిస్తే త్వరలో తనకి వివాహమవుతుందని నాకనిపించింది. వెంటనే తనకి ఫోన్ చేసి, "దుబాయిలోని బాబా మందిరానికి వెళ్దామా?" అని అడిగాను. అందుకు ఆమె సరేనంది. అయితే, 'అక్కడి మందిరం వాళ్ళు నేను తీసుకుని వెళ్లిన నైవేద్యాన్ని తీసుకుంటారా, లేదా?' అని వంట చేస్తున్నంతసేపు ఆలోచిస్తూ, యథావిధిగా నైవేద్యాన్ని ఇంటిలోనే పెట్టేద్దామనుకున్నాను. వంటయ్యాక బాబాకు పన్నీర్ బిర్యానీ పెట్టాను. ఆ తరువాత నేను సాయిని హృదయపూర్వకంగా ప్రార్థించి నాతోపాటు బిర్యానీ తీసుకుని బాబా మందిరానికి వెళ్ళి నా అదృష్టాన్ని పరీక్షించుకుందామని అనుకున్నాను. కానీ, అప్పటికే బాబాకు పెట్టినదాన్ని మళ్ళీ మందిరానికి తీసుకెళ్లడం సరైనదా, కాదా అన్న అయోమయంలో పడ్డాను. అప్పుడు సాయిని ప్రార్థించి సాయిసచ్చరిత్ర తెరచి బాబా సందేశం కోసం చూద్దామని నాకనిపించింది. నాకు ఏ సందేహం వచ్చినా నేను అలాగే చేస్తుంటాను.

సచ్చరిత్ర తెరవగానే నాకు నోట మాట రాలేదు, కళ్ళనుండి కన్నీళ్లు వచ్చేశాయి. ఆ పేజీలో శ్రీమతి తర్ఖడ్ అప్పటికే బాబాకు నివేదించిన పేడాను స్వామికి పంపడం, దాన్ని స్వామి అడిగిమరీ ఎంతో ఇష్టంగా తినడానికి సంబంధించిన సన్నివేశం ఉంది. దాంతో నేను ఇచ్చే ఆహారాన్ని స్వామి తప్పక స్వీకరిస్తారని నాకు నిర్ధారణై బిర్యానీ ఒక బాక్సులో ప్యాక్ చేసుకుని నా బ్యాగులో పెట్టుకున్నాను. ఈలోగా నా స్నేహితురాలు రావడంతో ఇద్దరం ఆఫీస్ వెహికిల్ లో బయలుదేరాము. ముందుగా ఆఫీసు పనిచూసుకుని తరువాత మందిరానికి వెళ్ళాము. ఆ ప్రాంతంలో పార్కింగ్ పెద్ద సమస్య. ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ వెహికల్ పార్క్ చేయమని నా స్నేహితురాలు సూచించింది. కానీ మధ్యాహ్నం వేళ కాబట్టి ఎక్కువ దూరమైతే ఆ ఎండలో నడిచేసరికి నాకు తలనొప్పి వస్తుందని భయపడి నేను స్వామిని ప్రార్థించాను. వెంటనే ఆయన దయతో కేవలం 5 నిమిషాల నడక దూరంలో పార్కింగ్ చేయడానికి చోటు దొరికింది.

మందిరం లోపలికి వెళ్ళేసరికి 12.40 అయ్యింది. ఆరతి అయిపోయినందువల్ల అక్కడ ఎవరూ లేరు. ఆ మందిరంలో స్వామిని అంత దగ్గరగా చూడటం అదే మొదటిసారి. అక్కడ ఉన్న ఒకతనిని నేను, "నా దగ్గర ఉన్న నైవేద్యాన్ని బాబా దగ్గర పెట్టొచ్చా?" అని అడిగాను. అందుకతను వద్దని చెప్పాడు. అయినా నేనేమీ బాధపడలేదు. సాయి ముందే నిలబడివున్న నేను నా చేతిలోనే బాక్స్ ఉంచుకుని, దానిని తెరచి నా మనస్సులోనే బాబాకు సమర్పించుకున్నాను. అక్కడే అలాగే బాబాను చూస్తూ ఎంతసేపు నిలబడి ఉండిపోయానో నాకు తెలియదు. అంతసేపు బాబా ముందు నిలబడటం నాకిప్పటికీ నమ్మశక్యంగా లేదు. అంతలా అనుగ్రహించారు స్వామి. నా స్నేహితురాలికి కూడా అక్కడ మంచి అనుభవం అయ్యింది. తను చాలా చాలా సంతోషించింది. '10 నెలల్లో తనకి మంచి సంబంధం కుదరాల'ని నేను బాబాను ప్రార్థించాను. స్వామి దీనిని ఖచ్చితంగా నెరవేరుస్తారని నేను అనుకుంటున్నాను.

తరువాత మందిరంలో ప్రసాదం పంపిణీ చేస్తుంటే మేము కూడా తీసుకున్నాము. నిజానికి నేను హడావిడిలో ఉదయం టిఫిన్ చేయలేదు. నా పుట్టినరోజునాడు మొదట బాబా ప్రసాదమే తీసుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. సాయంత్రం నేను ఉదయం నుండి జరిగిన అన్ని సంఘటనలు ఆలోచిస్తూ బాబా ఆశీస్సులతో  గొప్ప పుట్టినరోజు బహుమతి పొందానని గ్రహించాను. ఎందుకంటే నాకు కారు లేనందున ఆరోజు సాయిమందిరానికి వెళ్లే అవకాశం లేదు. వేరే ఎవరైనా నన్ను తీసుకెళ్లడానికి అవకాశం లేదు. యు.ఏ.ఈ. లో ఉంటున్న 11 సంవత్సరాలలో నేను మూడుసార్లు మాత్రమే సాయి మందిరానికి వెళ్ళాను. స్వామి నా పుట్టినరోజును ఇలా ప్లాన్ చేయకపోతే నేను ఆయనను దర్శించగలిగేదాన్ని కాదు. ఆయనకు ఆహారాన్ని సమర్పించుకోగలిగేదాన్ని కాదు. పుట్టినరోజునాడు ఆయన ప్రసాదం నాకు లభించేది కాదు. అంత ఆనందకరమైన దర్శనాన్ని పొందలేకపోయేదాన్ని. నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే గొప్ప బహుమతి అది. "స్వామీ! మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీపై ఎల్లప్పుడూ దృఢమైన విశ్వాసం కలిగివుండేలా మమ్మల్ని ఆశీర్వదించండి. మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి".

source: http://www.shirdisaibabaexperiences.org/2019/08/shirdi-sai-baba-miracles-part-2454.html

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo