సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుడు - బడేమియా


ఒకప్పుడు బడేమియాకు రాత్రంతా నిద్రపట్టలేదు. ద్వారకమాయిలో జరిగిన సంఘటనే అతనికి మరీ మరీ గుర్తుకువస్తూంది. అసలు విషయంలోకి వెళ్దాం..

బడేమియా కూతురు పెళ్ళీడుకొచ్చింది. త్వరలో ఆమె వివాహం జరిపించాల్సి ఉంది. అందుకోసం అతనికి కనీసం ఒక వెయ్యి రూపాయలు కావాల్సి ఉంది. పేదవాడైన తనకు అంత డబ్బు ఎలా సమకూరుతుందని అతనికి చింతపట్టుకుంది. ఆ సమయంలో పాటిల్‌కి సహాయపడినట్లే తనకి కూడా బాబా సహాయం చేస్తారేమోనని తలచి మరునాడే శిరిడీ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే శిరిడీ వెళ్ళాడు.

తెల్లవారుఝామునే బాబా దర్శనం కోసం ద్వారకామాయికి వెళ్ళాడు. బాబా ముందు సాష్టాంగపడి, ఆయన పాదాలచెంత ఒక రూపాయి వుంచాడు. తరువాత అతడు, "బాబా! నా కూతురు పెళ్లీడుకొచ్చింది. పెళ్లి ఖర్చుల నిమిత్తం వెయ్యి రూపాయలు కావాలి" అని బాబాతో విన్నవించుకున్నాడు. అప్పుడు బాబా, "అది నిజమేనా?" అని అడిగారు. తరువాత తమ కఫ్నీ జేబులో చేయిపెట్టి, పిడికిలినిండా నాణేలు బయటకు తీసి, "కండువా పట్టు" అని అతనితో అన్నారు. అతడు అలాగే చేయగా, ఆయన ఆ నాణేలను అందులో పోశారు. కండువాలో పడుతున్న నాణేల గలగల అతడు విన్నాడు. అప్పుడు బాబా అతనితో, "ఇక ఇంటికి వెళ్ళు. ఇల్లు చేరాక ఈ నాణేలను లెక్కపెట్టుకో!" అని ఆదేశించారు. వెంటనే అతడు తిరుగు ప్రయాణమయ్యాడు. ఇల్లు చేరిన వెంటనే అతడు ఆతృతగా బాబా ఇచ్చిన నాణేలను నేలపై వేసి లెక్కపెట్టడం మొదలుపెట్టాడు. అయితే అవి అరవైఎనిమిది రాగి నాణేలున్నాయి. బాబా తనతో పరాచికమాడారని అతడు అనుకొని వెంటనే శిరిడీకి పరుగుపెట్టాడు.

ద్వారకమాయిలో ఉన్న బాబా వద్దకు వెళ్ళి, “పాటిల్ గొప్పవాడు. కాబట్టి అతను నీకు మూడురూపాయలు దక్షిణ ఇచ్చాడు. కానీ నేను బీదవాడను. ఎంతో దూరంలో ఉన్న మరఠ్వాఢా నుండి కేవలం వెయ్యి రూపాయలు అవసరమై మీ దగ్గరకు వచ్చాను. అది కూడా నా కూతురి పెళ్ళిఖర్చుల కోసం. కానీ నేను ఒక రూపాయి దక్షిణ సమర్పించుకున్న తర్వాత నాకు నీ నుండి లభించింది అరవై ఎనిమిది పైసలే. నా పేదరికాన్ని మీరిలా అపహాస్యం చేశారు” అని బాబాను నిందించాడు. బాబా నవ్వుతూ, “నువ్వు నా పాదాల చెంత ఒక్క రూపాయి దక్షిణ పెట్టినప్పుడే, నువ్వు నా నుండి వెయ్యిరూపాయలు ఆశిస్తున్నావని నాకు తెలుసు" అన్నారు. అప్పుడు అతడు, "నా కూతురికి త్వరలో వివాహం చెయ్యాలి" అన్నాడు. బాబా, “అరె! నీ కూతురి పెళ్ళి వచ్చే సంవత్సరం జరుగుతుంది. ఇప్పటినుండే కంగారుపడతావెందుకు? పెళ్ళి నిశ్చయమైనప్పుడు నీకు డబ్బు అందేలా చూస్తాను” అని హామీ ఇచ్చారు. దాంతో అతడు తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు.

బాబా ఆశీస్సులతో ఆ సంవత్సరం నాలుగైదు రెట్లు అధికంగా పంట దిగుబడి వచ్చింది. ఆ విధంగా లభించిన ధనంతో ఎవరిముందూ చెయ్యిచాపకుండా, ఎవరి దగ్గరా అప్పుచేయకుండా తన కూతురి పెళ్లి ఘనంగా జరిపించాడు.

భగవంతునికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో తెలుసు. ఆయన చిత్తాన్ననుసరించి ప్రతిదీ జరుగుతుంది.

సమాప్తం.

(Ref: Sai Sagar Magazine; 2009; Deepavali issue)
A Divine Journey with Baba – compiled by Vinny Chitluri, Sterlings.

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo