సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 231వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయియందు సంపూర్ణ విశ్వాసం కష్టాలను తరిమేస్తుంది
  2. నాన్న క్రొత్త జాకెట్ కొనుక్కునేలా చేశారు బాబా

సాయియందు సంపూర్ణ విశ్వాసం కష్టాలను తరిమేస్తుంది

ఖతార్ నుండి సాయిభక్తుడు దిలీబన్ తన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

"బాబా మనపై తమ ఆశీస్సులు కురిపించేముందు మననుండి అన్నీ తీసేసుకుని, మన నమ్మకాన్ని, ఓపికని పరీక్షిస్తారని, ఆ తరువాత తీసుకున్న దానికంటే ఎన్నోరెట్లు అధికంగా తిరిగి ఇస్తార"ని నేను విన్నాను. నేను ఏదైతే విన్నానో అదే నా జీవితంలో జరిగింది. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

2017, అక్టోబరులో నేను సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టాను. ఎప్పుడైతే పారాయణ మొదలుపెట్టానో అప్పటినుండి నాకు సమస్యలు ప్రారంభమయ్యాయి. అవి రోజురోజుకీ పెరిగి ఆర్థికపరమైన ఒడిదుడుకులు చాలా వచ్చాయి. అంతలా సమస్యలు అధికమవుతున్నప్పటికీ ప్రతిరోజూ సచ్చరిత్ర పారాయణ చేయడం మాత్రం నేను ఆపలేదు. 2018, సెప్టెంబరు నెల వచ్చేసరికి నేను నా ఉద్యోగాన్ని కోల్పోయాను. ఎంతగా ప్రయత్నించినా 2019, ఫిబ్రవరి వరకు నాకు ఉద్యోగం రాలేదు. ఉద్యోగం లేని కారణంగా ఎన్నో కష్టాలు పడ్డాను. ఇండియాలో ఉన్న ఇంటి లోన్ కట్టలేకపోయేవాడిని. సమస్యలకు తాళలేక ఇండియాలో ఉన్న రెండు ఫ్లాట్స్‌ని అమ్మేశాను. నా భార్య, కూతురి నగలను అమ్మేశాను. ఒకానొక సమయంలో నా భార్య మెడలో మంగళసూత్రం తప్ప ఇంకేమీ మిగలలేదు. చివరికి దాన్ని కూడా అమ్మివేయమని నా భార్య నా చేతికిచ్చింది. నేను చేసేదేమీ లేక అది కూడా అమ్మేశాను. కనీసం పిల్లల స్కూల్ ఫీజులు కూడా కట్టలేని హీనస్థితికి చేరుకున్నాను. నేను 1993 నుండి సంపాదించినదంతా కోల్పోయి జీరో స్థాయిలో నిలబడ్డాను. అంతటి క్లిష్టపరిస్థితులలో కూడా నేను నా భార్యతో ఒక్కటే చెప్పాను, “బాబా మననుండి అన్నీ తీసుకున్నారు. కానీ ఖచ్చితంగా తీసుకున్న దానికి బదులుగా పదిరెట్లు అధికంగా మనకి ఇస్తారు” అని.

ఒకవైపు నా పరిస్థితి ఇలా ఉంటే నేను ఫ్లాట్స్ అమ్మేశాక మా బంధువులు, స్నేహితులు నన్ను ఒక భిక్షగాడిలా చూడడం ప్రారంభించారు. నేను వాళ్ళను ఆర్థికసహాయం అడిగితే మొహం చాటేసేవారు. ఆఖరికి నా తోడబుట్టినవాళ్ళు కూడా 'విదేశాలలో పనిచేస్తూ కూడా డబ్బులేద'ని నన్ను దారుణంగా అవమానించారు. వాళ్ళు నా ముందే, "విదేశాలలో పనిచేస్తూ ఆర్థిక సమస్యల కారణంగా ఫ్లాట్స్ అమ్ముకుంటున్నాడు" అనేవారు. అయినా నాకు వాళ్లపై కోపం రాలేదు. కానీ ఈరోజు ఎవరైతే నన్ను అవమానించారో వాళ్లంతా ఖచ్చితంగా ఏదో ఒకరోజు నా స్నేహాన్ని, బంధుత్వాన్ని ఆశించి వస్తారని నా మనసుకి సర్దిచెప్పుకున్నాను. రెండేళ్ళపాటు నేను నా తోబుట్టువులతో మాట్లాడలేదు. పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నప్పటికీ బాబాపై ఉన్న నా దృఢవిశ్వాసాన్ని, నమ్మకాన్ని నేనెప్పుడూ కోల్పోలేదు. నేను సంపూర్ణంగా ఆయనను విశ్వసించాను. ఆ కాలంలో ప్రతి గురువారం నేను సాయిచాలీసా, స్తవనమంజరి వింటుండేవాడిని, ఇప్పటికీ వింటున్నాను. చివరికి 2019, ఫిబ్రవరి 24న బాబా దయవలన నాకొక ఉద్యోగం వచ్చింది. అయినా జీతం సరైన సమయానికి అందక నా కష్టాలు కొనసాగుతూనే వచ్చాయి. కేవలం బాబా కృపవలన మాత్రమే ఖతార్ లాంటి ప్రదేశంలో నేను నా కుటుంబాన్ని నెట్టుకురాగలిగాను.

2019, ఆగష్టు వచ్చేసరికి నాపై బాబా అనుగ్రహ వర్షం కురవడం మొదలైంది. నేను నా స్నేహితుడితో కలిసి సొంత వ్యాపారాన్ని మొదలుపెట్టాను. వెంటనే బాబా అనుగ్రహంతో మాకు సంవత్సరంపాటు నడిచే ఒక పెద్ద ప్రాజెక్టు వచ్చింది. ఏవైతే కోల్పోయానో వాటన్నింటిని తిరిగి పొందగలనని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే బాబా నానుండి తీసుకున్నవాటికి బదులుగా నాకివ్వడం మొదలుపెట్టారు. నా వ్యాపారాన్ని చక్కగా కొనసాగేలా బాబా చేస్తారు. ఆయన ఆశీస్సులతో మేము ప్రాజెక్టుని విజయవంతంగా పూర్తిచేస్తాము, మరిన్ని  ప్రాజెక్టులను పొందుతాము కూడా. నేను ఎక్కడికి వెళ్ళినా బాబా నాముందే ఉంటారు. నేను సదా అదే భావంతో ఉంటాను. నేను మొదటినెల రాబడి అందుకున్నప్పటి నుండి ఆహారం, చదువు, ఉద్యోగం లేక ఇబ్బందిపడుతున్నవారికి సహాయం చెయ్యాలని ప్రణాళిక వేసుకున్నాను. నేనెంత కష్టాన్ని అనుభవించినా, బాబా నాతో ఉన్నారనే నమ్మకం ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తినిచ్చింది. ఆయనపై నాకున్న అపారమైన నమ్మకం చివరకు సాయి అనుగ్రహవర్షమై కురిసింది. నాకు ఎదురైన పరిస్థితుల ద్వారా బాబా నాకెన్నో నేర్పించారు. స్నేహితులుగా, బంధువులుగా నా చుట్టూ ఉంటూ, ప్రేమను నటించేవారిని బాబా నాకు చూపించి నిజమైన ఆప్తులెవరో, స్నేహితులెవరో గుర్తించేలా చేశారు. "థాంక్యూ! థాంక్యూ సో మచ్ బాబా! నా చేయి ఎప్పుడూ విడిచిపెట్టకండి".

నాన్న క్రొత్త జాకెట్ కొనుక్కునేలా చేశారు బాబా

రాజస్థాన్ నుండి ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను సాయిబాబాకు చాలా సాధారణ భక్తుడిని. నేను ఇప్పుడు చెప్పబోయే అనుభవం మా నాన్నకు సంబంధించినది. ఒకసారి ఆయన మా కుటుంబంలోని ఒకరి వివాహానికి వెళుతున్న సందర్భంలో నేను నాన్నని తనకోసం ఒక క్రొత్త జాకెట్ తీసుకోమని పట్టుబట్టాను. కానీ నేను ఎంత చెప్పినా ఆయన అంగీకరించలేదు. అప్పుడు నేను, "బాబా! నేను చెపితే నాన్న వినటంలేదు గాని, మీరే ఆయన క్రొత్త జాకెట్ కొనుక్కునేలా చేయండి" అని బాబాను ప్రార్థించాను. బాబా అద్భుతం చేసారు. కొన్ని కారణాలవల్ల మార్కెట్టుకు వెళ్లిన నాన్న తనకోసం ఒక క్రొత్త జాకెట్ కొనుక్కున్నారు. అది సాయిబాబా వల్లనే సాధ్యమైంది. "ధన్యవాదాలు బాబా! దయచేసి మాకు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించండి". 

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo