సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 239వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. శిరిడీలో బాబాకి విన్నవించుకున్నంతనే సమస్య పరిష్కారం
  2. ఉపవాసముండి మీ లోపల వసించే బాబాను పస్తుంచరాదు

శిరిడీలో బాబాకి విన్నవించుకున్నంతనే సమస్య పరిష్కారం

ఒక అజ్ఞాత సాయిభక్తుడు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

ముందుగా ‘సాయిమహరాజ్ సన్నిధి’ బ్లాగ్ మరియు వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారములు మరియు కృతజ్ఞతలు. ఆ సాయినాథుని దయవలన నాకు జరిగిన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నాకు కొంత వ్యవసాయభూమి వుంది. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత భూమికి సంబంధించి ప్రభుత్వం క్రొత్త పాసు పుస్తకాలు ఇచ్చింది. అవి అందరికీ వచ్చాయి కానీ నాకు మాత్రం రాలేదు. ఆ పాసు పుస్తకం కోసం  నేను సంవత్సరంపాటు ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయాను. తరువాత కొంతకాలానికి నేను నా కుటుంబంతో కలిసి శిరిడీ వెళ్ళాను. బాబాను దర్శించుకుని నా సమస్యను విన్నవించుకున్నాను. శిరిడీ నుండి రాగానే భూమికి సంబంధించిన ‘రైతుబంధు’ డబ్బులు వచ్చాయి. అలాగే, ఏ పాసు పుస్తకం గురించి మనోవేదన పడ్డానో ఆ పాసు పుస్తకం సాయిబాబా కృపవలన నా చేతికి వచ్చింది. ఎంతో సంతోషంతో నేను బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఆలస్యం జరిగినప్పటికీ సాయి నాకు ఎన్నో అద్భుతాలు చూపించారు. “చాలా చాలా ధన్యవాదాలు బాబా! మీరు లేకపోతే నా ఈ జీవితం లేదు”. బాబా ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. భగవాన్ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

ఉపవాసముండి మీ లోపల వసించే బాబాను పస్తుంచరాదు

సాయిభక్తుడు శివాంకిత్ గర్గ్ ఇటీవల తనకు జరిగిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:  

ఓం సాయిరామ్! 2019, అక్టోబరు 1న జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను సాధారణంగా సోమవారాలలో బాబా మందిరానికి వెళ్ళను. కానీ నేను చాలా కలత చెంది ఉన్నందున 2019, సెప్టెంబర్ 30 సోమవారంనాడు మందిరానికి వెళ్ళాలని నిర్ణయించుకుని కారులో బయలుదేరాను. గత కొన్ని వారాలుగా నేను గురువారంనాడు ఉపవాసం ఉంటున్నాను. ఆరోజు పాలు, పండ్లు మాత్రమే తీసుకొంటున్నాను. ప్రయాణంలో ఉండగా, "ఉపవాసం విషయంలో నేను సరైన పద్ధతిని అనుసరిస్తున్నానా, లేదా?" అని బాబాను అడిగాను. మళ్ళీ అంతలోనే 'ఈ విషయాన్ని బాబా ఎలా చెప్తారు?' అని అనుకుని నవ్వుకున్నాను. నేను గూగుల్‌లో ఆ విషయం తెలుసుకోవాలి అని అనుకున్నాను. అంతలో నేను మందిరానికి చేరుకున్నాను. నేను లోపలికి వెళ్లి శేజారతికి సమయం అవుతున్నందున క్రింద కూర్చున్నాను. అకస్మాత్తుగా, నా వెనుక ఉన్న ఒక మహిళ స్పృహతప్పి పడిపోయింది. వెంటనే నేను బయటకు వెళ్లి ఆమెకోసం కొంచెం నీళ్లు తీసుకుని వచ్చాను. ఆమె కుదుటపడటానికి 15 నిమిషాలు పట్టింది. అప్పుడు ఆ మందిరంలోని పూజారి ఆమెతో, "ఉపవాసం ఉండటమంటే రోజంతా ఏదీ తినకుండా ఉండటమని కాదు. ఏ మతగ్రంథం ఖాళీ కడుపుతో ఉండమని చెప్పదు. పాలు, పళ్ళు తీసుకోండి. మన అందరిలో శ్రీకృష్ణుడు(సాయిబాబా) ఉన్నాడు. మీరు ఆకలితో ఉండి, మీ లోపల వసించే భగవంతుడిని ఆకలితో ఉంచుతున్నారు" అని వివరించారు. ఆ వివరం నా ముఖంపై చిరునవ్వు తెచ్చిపెట్టింది. నా ప్రశ్నకు బాబా ఆవిధంగా సమాధానం ఇచ్చారని ఆనందంలో మునిగిపోయాను. తరువాత నేను తిరిగి ఇంటికి వెళ్తూ, యాదృచ్ఛికంగా సచ్చరిత్ర 20వ అధ్యాయాన్ని వినడం మొదలుపెట్టాను. అందులో లాలాలక్ష్మీచంద్ అనే భక్తుడు బాబా దర్శనానికి శిరిడీ వెళ్తారు. ఒకరోజు ఆ భక్తుడు తన మనసులో సాంజా కావాలని ఆశపడతారు. బాబా అతని ఆలోచనలను చదివి, నైవేద్యంలోకి సాంజా సిద్ధం చేయమని జోగ్‌కు చెప్తారు. అలాగే, బాబా అతనికి వెన్నునొప్పి ఉందని కూడా గ్రహిస్తారు. అదేవిధంగా, బాబా నా మనస్సు చదివి, ఈ లీల చేశారని నేను గ్రహించాను. అప్పుడు సోమవారంనాడు నేను మందిరానికి వెళ్లడం యాదృచ్ఛికంగా జరిగింది కాదని కూడా గ్రహించాను. బాబా సంకల్పానుసారం ఏదైనా జరుగుతుంది. బాహ్యానికి ఏదో యథాలాపంగా నేను మందిరానికి వెళ్లినా బాబా నాకు అద్భుతమైన అనుభవాన్ని ప్రసాదించారు. "థాంక్యూ సో మచ్ బాబా!" 

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo