సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీ లక్ష్మణరావు పోడార్


లక్ష్మణరావు పోడార్ జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలను అతని కుమారుడు వసంతరావు సాయిలీల పత్రికతో పంచుకున్నారు. అవి ఈవిధంగా ఉన్నాయి.

వసంతరావు 1903, డిసెంబర్ 4న ఎడ్వాన్ అనే గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి లక్ష్మణరావు బాబాపట్ల భక్తివిశ్వాసాలు కలిగి ఉండేవాడు. 1911వ సంవత్సరంలో అతనొక ఇంజనీరింగ్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తుండేవాడు. ఒకసారి ఒక వ్యాపార ప్రతిపాదన నిమిత్తం అతనికి, అతని యజమానికి మధ్య చర్చ జరిగింది. అది కంపెనీకి ప్రయోజనకరం కాదని అతను భావించాడు. కానీ ఆ ప్రతిపాదనకు అనుకూలంగా ఉన్న అతని యజమాని అతనిని తీవ్రంగా మందలించి, ఆ ప్రతిపాదనను అమలుపరచడంలో ముందుకు వెళ్ళాడు. లక్ష్మణరావు దానిని అవమానంగా భావించి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. బాగా సంపాదన వచ్చే ఉద్యోగానికి రాజీనామా చేశాక భార్య, ముగ్గురు చిన్న పిల్లల పోషణ గురించి ఆలోచనలో పడ్డాడు.

లక్ష్మణరావు ఇంటికి వెళ్లి బాబా పటం ముందు నిలబడి, "బాబా, దయచేసి నాకు ఏదైనా ఉద్యోగం ఇవ్వండి. శిరిడీ వచ్చి, మొదటి నెల జీతం మీ పాదాల వద్ద సమర్పించుకుంటానని మాట ఇస్తున్నాను" అని ప్రార్థించాడు. రెండురోజుల తరువాత పాత కంపెనీకి చెందిన కార్మికుడొకడు "యజమాని తన తప్పు తెలుసుకొని, లక్ష్మణరావుని తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారు" అన్న సందేశంతో తన ఇంటి ద్వారం వద్ద నిలిచాడు. దాంతో అతను తిరిగి తన మునుపటి ఉద్యోగంలో చేరాడు. మొదటి నెల జీతం రాగానే, తాను చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకోవాలని నిర్ణయించుకొని, తన చిన్నకొడుకు వసంతరావుని వెంటబెట్టుకొని శిరిడీ ప్రయాణమయ్యాడు.

వాళ్ళు రైలులో కోపర్గాఁవ్ వరకు వెళ్లి, అక్కడినుండి ఎడ్లబండిలో శిరిడీ చేరుకున్నారు. వెంటనే ద్వారకామాయికి వెళ్లారు. బాబా తమ ఆసనంపై కూర్చొని ఉన్నారు. అప్పుడే ఒక చిన్న గుర్రం బాబా వద్దకు వచ్చి, ప్రదక్షిణ చేసి, ఆయన ముందు సాష్టాంగపడి వెళ్లిపోయింది. సభామండపలో కూర్చొని ఉన్న భక్తులందరూ అది చూసి ఆశ్చర్యపోయారు. తరువాత బాబా భక్తసమూహం వైపు చూస్తూ, "అరే, లక్ష్మణా! నా జీతం నాకివ్వు" అన్నాడు. లక్ష్మణరావు ఆశ్చర్యపోతూ తన పేరుతో ఇంకెవరైనా ఉన్నారేమోనని చుట్టూ చూశాడు. కానీ ఎవరూ స్పందించలేదు. అప్పుడు బాబా అతని వైపు చూస్తూ, "అరే లక్ష్మణరావ్! నేను నిన్నే పిలుస్తున్నాను. వచ్చి, నా మొదటినెల జీతం ఇవ్వు" అన్నారు. 'మొదటినెల జీతం' అన్న మాట వినగానే బాబా తనతోనే మాట్లాడుతున్నారని అతను గ్రహించాడు. లక్ష్మణరావు, వసంతరావు ఇద్దరూ బాబా వద్దకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేశారు. లక్ష్మణరావు జీతం డబ్బులను బాబా చేతిలో ఉంచాడు. అప్పుడు బాబా ఒక పెద్దావిడ వైపు తిరిగి, "వీరికి భోజనం పెట్టు" అన్నారు.

లక్ష్మణరావు, అతని కుమారుడు సంతుష్టిగా భోజనం చేశాక ముంబాయి తిరిగి వెళ్లేందుకు బాబా అనుమతి తీసుకోవడానికి ద్వారకామాయికి వెళ్లారు. వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయగా, బాబా వాళ్ళని ఆశీర్వదించి, తిరిగి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. కోపర్‌గాఁవ్‌లో సాయంత్రం ఉన్న రైలును అందుకోవాలని ఇద్దరూ ఎడ్లబండిలో బయలుదేరి సమయానికి స్టేషన్ చేరుకున్నారు. అక్కడ లక్ష్మణరావు బండివానికి డబ్బులిస్తూ తన వద్ద డబ్బులు తక్కువగా ఉన్నాయని గ్రహించాడు. దాంతో రైలు టిక్కెట్లు ఎలా తీసుకోవాలా అని ఆందోళన చెందాడు. కోపర్‌గాఁవ్‌లో తనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేనందున అప్పు తీసుకొనే అవకాశం కూడా లేదు. అందువలన ఏమి చేయాలో తెలియక నిస్సహాయస్థితిలో ఉన్నాడు. అకస్మాత్తుగా ఎవరో తనను పిలుస్తున్నట్లు వినిపించి తలెత్తి చూశాడు. ఎదురుగా తన ప్రియమిత్రుని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ స్నేహితుడు అతనిని పలకరించి, "నేను కూడా టికెట్ కొనుక్కోవాలి, కాబట్టి మనందరికీ నేను టిక్కెట్లు తీసుకుంటాను" అని చెప్పి స్టేషన్లోకి వెళ్ళాడు. కొద్దిసేపటికి టిక్కెట్లతో వచ్చి, ఆ టిక్కెట్లను లక్ష్మణరావుకు ఇచ్చాడు. తరువాత వాళ్ళు స్టేషన్లోకి నడిచారు. స్టేషన్ లోపలికి వెళ్ళాక జనంలో అతని స్నేహితుడు అదృశ్యమయ్యాడు. లక్ష్మణ్ అతనికోసం అంతా వెతికాడు కానీ ఫలితం లేకపోయింది. చివరికి బాబాయే తన స్నేహితుని రూపంలో వచ్చారని అతనికి అర్థం అయ్యింది. బాబా చేసిన సహాయానికి కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఈ సంఘటనతో బాబాపై అతనికున్న విశ్వాసం వందరెట్లు అధికమైంది.

ద్వారంవద్ద కూర్చుని మరణాన్ని తరిమివేసిన బాబా.

ఒకప్పుడు మా నాన్నగారు తీవ్ర అనారోగ్యంతో మృత్యుముఖంలో ఉన్నారు. నాన్నను పరీక్షించిన డాక్టర్, "ఇంక ఆశలు లేవు. ఎవరైనా దగ్గర బంధువులను పిలిపించుకోవాలంటే పిలిపించుకోండి" అని చెప్పారు. మేము మా మామయ్య యశ్వంత్‌రావుగారిని పిలిపించాం. ఆ రాత్రి నాన్న పరిస్థితి మరింత క్షీణించింది. తను తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. రాత్రంతా నేను, మా అమ్మ, మామయ్య నాన్న మంచం ప్రక్కనే కూర్చొని ఉన్నాము. మధ్యరాత్రిలో నాన్న లేచి, తలుపువైపు చూస్తూ తన చేతులు జోడించి నమస్కరించారు. ఆ తరువాత తనెంతో ప్రశాంతంగా నిద్రపోయారు.

సుమారు తెల్లవారుఝామున 5 గంటల సమయంలో నాన్న నిద్రలేచి తనకు తినడానికి ఏదైనా కావాలని అమ్మని అడిగారు. అమ్మ అన్నం కలిపి ముద్దలు పెడితే తిన్నారు. తరువాత ఆయన, "మీరు నా మంచం ప్రక్కన ఎందుకున్నారు? నేను బాగున్నాను" అని అన్నారు. ఆ మాటలు చెప్తూనే తను తలుపువైపు చూస్తున్నారు. నాన్న ఎందుకు అటువైపు చూస్తున్నారా అని నేను కూడా అటువైపు చూశాను. అక్కడ తలుపు దగ్గర ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు. ఆయన రెండడుగుల వెండి సట్కాను తన చేతిలో పట్టుకొని ఉన్నారు. ఆయన ఆ సట్కాను ఊపుతూ, "నేను ఇక్కడ ఉండగా ఎవరు ఈ గది లోపలికి ప్రవేశిస్తారో చూస్తాను" అన్నారు. నేను వెంటనే ఆయనకు నమస్కరించాను. ఆ వృద్ధుడు అచ్చం నేను నా చిన్నవయస్సులో చూసిన సాయిబాబా లాగానే ఉన్నారు. యమదూతలను తరిమివేయడానికి ఆయన ద్వారంవద్దనే కూర్చొని ఉన్నారు. తన భక్తులపై ఆయన చూపే కరుణ ఎనలేనిది.

ఆ తరువాత తొందరలోనే నాన్న పూర్తిగా కోలుకున్నారు. మళ్లీ ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడలేదు. కారుణ్యంతో అంతలా నా తండ్రిని సంరక్షించిన బాబాకు మా కుటుంబమంతా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకున్నాం. ఈ సంఘటన బాబాపట్ల నాకు భక్తి విశ్వాసాలను పెంపొందింపజేసింది.

 సమాప్తం.

మూలం: శ్రీ సాయిలీలా మ్యాగజైన్, ఫిబ్రవరి 1985. (విన్నీ చిట్లూరి రచించిన 'డివైన్ సింఫనీ ఆఫ్ బాబా')

సాయిభక్తుల అనుభవమాలిక 305వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా మార్గాలు అంతుబట్టనివి
  2. సాయికృప ఎప్పుడూ అద్భుతమే!

బాబా మార్గాలు అంతుబట్టనివి

మలేషియాకు చెందిన ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

బ్లాగును క్రమంతప్పకుండా చదువుతున్న భక్తులందరికీ శుభదినం. ప్రతిదీ సరిగ్గా జరిగితే నా అనుభవాన్ని పంచుకుంటానని బాబాకు వాగ్దానం చేశాను. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నా వివాహం జరిగి 2 సంవత్సరాలైంది. మాకింకా సంతానం లేదు. నాకు, నా భర్తకు పిల్లలంటే చాలా ఇష్టం. కానీ పెళ్ళైన మొదట్లో సంతానం గురించి కొంతకాలం తరువాత ఆలోచిద్దామని అనుకున్నాం. మరోవైపు మా అమ్మ రెండు సంవత్సరాలైనా మాకు సంతానం లేదని బాబాని తీవ్రంగా ప్రార్థిస్తూ ఉండేది. మేము కూడా సమయం వచ్చినప్పుడు బాబా మాకు సంతానాన్ని ప్రసాదిస్తారని నమ్మకంతో ఉండేవాళ్ళం. ఇదిలా ఉంటే, కొంతకాలంగా నాకు నెలసరి సక్రమంగా రావడంలేదు. ఒకసారి నెల ఆలస్యమైతే, మరోసారి 2 నెలలు ఆలస్యం అయ్యేది. 2019 జనవరి, ఫిబ్రవరి నెలల్లో నెలసరి రాకుండా మార్చిలో వచ్చింది. తరువాత మళ్ళీ ఏప్రిల్, మే నెలల్లో రాలేదు. బహుశా జూన్‌లో వస్తుందేమో అని అనుకుంటూ, "బాబా! నాకు నెలసరి సక్రమంగా వచ్చేలా చేయండి" అని బాబాను ప్రార్థిస్తుండేదాన్ని. నా అండాశయాలలో, గర్భాశయంలో ఏదైనా సమస్య ఉందేమో, అందుకే నెలసరి క్రమంగా రావడం లేదేమో, ఒకవేళ అదే జరిగితే నాకు సంతానం కలిగే అవకాశం ఉండదేమో అని చాలా ఆందోళనగా ఉండేది. మరోవైపు కడుపు ఉబ్బరంతో బాధ. కొన్నిసార్లు ఏవైనా ఆహారపదార్థాలను చూస్తే నాకు వికారంగా అనిపించేది కానీ, వాంతి అయ్యేది కాదు. మూత్రవిసర్జన ఎక్కువగా జరుగుతుండేది. నేను పడుతున్న బాధను మావారితో చెప్పాను. ఆయన వాంతి అవ్వడానికి మందు తీసుకోమని చెప్పారు కానీ నేను అలా చేయలేదు. ప్రతిరాత్రి నేను నా  పొట్టమీద ఆయింట్‌మెంట్ తోపాటు బాబా ఊదీ రాసి, "ఉబ్బరాన్ని నయం చేయమ"ని బాబాను ప్రార్థిస్తుండేదాన్ని. ఇలా ఉండగా ఒకరోజు వాతావరణ మార్పు కోసం నేను మా పుట్టింటికి వెళ్ళాను. మా అమ్మ నన్ను చూస్తూనే ఆశ్చర్యంగా, "ఎందుకిలా ఉన్నావు? కడుపు ఎందుకు కాస్త పెద్దదిగా కనిపిస్తుంది?" అని అడిగింది. నేను, "నాకు 2 నెలలుగా నెలసరి రాలేదు, కడుపు ఉబ్బరంగా ఉంది. అందుకే నా కడుపు పెద్దదిగా కనిపిస్తుంది" అని చెప్పాను. అందుకామె, “బహుశా నువ్వు గర్భవతివి కావచ్చు” అంది. కానీ అలాంటిదేమీ లేదని నాకు తెలుసు. ఎందుకంటే గర్భవతినన్న సంకేతాలేవీ లేవు. ఆ విషయమే అమ్మతో చెప్పాను. అప్పుడు మా అమ్మ ఒకసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదించమని చెప్పింది. కానీ గైనకాలజిస్ట్‌ని సంప్రదిస్తే కడుపులో ఏదైనా తిత్తి పెరుగుతుందనో లేదా ఇంకా ఏమైనా ప్రతికూల విషయాలు వినాల్సి వస్తుందేమోనని నేను చాలా భయపడ్డాను. అయినప్పటికీ నేను, "దయచేసి నాకంతా మంచి జరిగేలా చూడమ"ని బాబాను ప్రార్థించి గైనకాలజిస్ట్‌ అపాయింట్‌మెంట్ తీసుకున్నాను. తరువాత నేను, నా భర్త గైనకాలజిస్ట్ వద్దకు వెళ్ళాము. ఆమె నన్ను అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడం కోసం పడుకోమని చెప్పింది. ఆమె నా గర్భాశయాన్ని స్కాన్ చేస్తూ నవ్వుతూ, “అభినందనలు, మీరు తల్లి కాబోతున్నారు!” అని చెప్పింది. ఎలా స్పందించాలో నాకు తెలియక అవాక్కైపోయాను. ఎందుకంటే ఆ వార్తను అంత త్వరగా వింటామని మేము అస్సలు ఊహించలేదు. మా ఆనందానికి అవధులులేవు. బాబా ఎప్పుడు ఎలా అనుగ్రహిస్తారో అస్సలు అర్థం చేసుకోలేము. "థాంక్యూ సో మచ్ బాబా!"

ప్రియమైన భక్తులారా! బాబాను, ఆయన టైమింగ్ ను నమ్మండి. ఆయన నాకోసం ఈ ప్రణాళికతో ఉన్నందునే నేను ఇంటర్వ్యూలో విజయవంతం కాలేకపోయాను, ఉద్యోగం పొందలేకపోయాను. నాకా విషయం అప్పుడు అర్థంకాక చాలా బాధపడ్డాను. కానీ బాబా ఏమి చేసినా మన మేలుకోసమే అని ఇప్పుడు అర్థం చేసుకున్నాను. సంతానం కోసం ఎదురుచూసే వాళ్ళు బాబాను ప్రార్థించి, ఆయనపై భారం వేయండి. ఆయన సృష్టికర్త. "బాబా! నన్ను, నా బిడ్డ క్షేమాన్ని చూసుకోండి. సులభంగా, సురక్షితంగా నార్మల్ డెలివరీ అయ్యేలా అనుగ్రహించండి".

సాయికృప ఎప్పుడూ అద్భుతమే!

సాయిభక్తురాలు శ్రీమతి ప్రీతీరావు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

ముందుగా, "నా అనుభవాన్ని ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి బాబా!" భక్తులందరికీ జై సాయిరాం! నేను సాయిభక్తురాలిని. బాబా ఆశీస్సులతో నేను చాలా అనుభవాలను పొందుతున్నాను. ఆయనకు వాగ్దానం చేసిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మేము హైదరాబాదులో నివాసముంటున్నాము. కొన్ని కారణాల వలన మేము ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాలని అనుకున్నాము. అయితే హైదరాబాదులో సరసమైన ధరలో అద్దెకు విశాలమైన ఫ్లాట్ దొరకడం చాలా కష్టం. అందువలన నేను ఈ సమస్యను పరిష్కరించమని బాబాని ప్రార్థించాను. ఆయన ఎంత గొప్పగా అనుగ్రహించారో మాటల్లో చెప్పలేను. మేము ఉంటున్న ఫ్లాట్‌ను ఖాళీ చేసే సమయానికి బాబా ఆశీస్సులతో అదే అపార్ట్‌మెంట్‌లో మరో ఫ్లాట్ ఖాళీ అయ్యింది. వేరే అపార్ట్‌మెంట్‌కు వెళ్లే అవసరం లేకుండా సరసమైన అద్దెతో మాకు మంచి ఫ్లాట్ లభించింది. అలా బాబా దయతో వేరే ఎక్కడికీ వెళ్ళకుండా కొత్త ఫ్లాట్‌లోకి మారాము.

బ్యాంక్ లావాదేవీలకి సంబంధించిన మరో సమస్యలో కూడా బాబా నాకు రావాల్సిన మొత్తాన్ని పొందడంలో సహాయం చేశారు.

"చాలా చాలా ధన్యవాదాలు బాబా! మీ చల్లని కృప ఎప్పుడూ మీ భక్తులపై ఇలాగే కురిపించండి".


సాయిభక్తుల అనుభవమాలిక 304వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా ఆశీస్సులతో నాకు, నా సోదరులకు ఉద్యోగాలొచ్చాయి
  2. బాబా అనుగ్రహంతో చేకూరిన ఆరోగ్యం

బాబా ఆశీస్సులతో నాకు, నా సోదరులకు ఉద్యోగాలొచ్చాయి

ఒరిస్సా నుండి సాయిభక్తురాలు భాగ్యశ్రీ తన అనుభవాలను ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! నా పేరు భాగ్యశ్రీ నాయక్. మా స్వస్థలం ఒరిస్సా. ప్రస్తుతం నేను బెంగళూరులో ఉంటున్నాను. నాకు ఇద్దరు అన్నయ్యలు. పెద్దన్నయ్య ప్రదీప్ ఇంజినీరింగ్ చేశాడు. చిన్నన్నయ్య దీపక్ ఎంబీఏ చేశాడు. నేను, ప్రదీప్ ఒకే కాలేజీలో ఇంజనీరింగ్ చేశాము. నేను మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు ప్రదీప్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కానీ నేను ఇంజనీరింగ్ పూర్తిచేసేవరకు, అంటే ఆ నాలుగేళ్లలో తనకి ఉద్యోగం రాక ఖాళీగానే ఉన్నాడు. ప్రతి ఒక్కరూ తన ఉద్యోగ విషయంలో ఆశను కోల్పోయారు. అబ్బాయిలకు ఉద్యోగం రాకపోతే చాలా కష్టంగా ఉంటుంది. బంధువులు, ఇరుగు పొరుగువారు, కుటుంబసభ్యులు తనని తీవ్రంగా ఎగతాళి చేస్తుండేవారు. ఆ సమయంలో నేను తన కోసం నవగురువార వ్రతం ప్రారంభించాను. మొదటివారం నేను ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయ పూజారి నాతో, “మీ అన్నయ్య స్వభావం తెలిసి కూడా అతని కోసం ఎందుకు ఈ పూజలు చేస్తున్నావు?” అని అన్నారు. అతను ఎందుకలా అన్నారంటే, ఆ సమయంలో అన్నయ్యపై సమాజంలో చెడు ముద్ర ఉంది. ఆ మాటలేమీ పట్టించుకోకుండా నేను శ్రద్ధగా పూజ చేస్తూ ఉండేదాన్ని. నాలుగవ వారం శేజారతి పూర్తయిన తరువాత నా మనసుకెందుకో అన్నయ్య మెయిల్స్ చెక్ చేసి చూడాలని బలంగా అనిపించింది. వెంటనే మెయిల్స్ చూసేసరికి, అన్నయ్యకి ఆఫర్ లెటర్ వచ్చి ఉండటం చూసి ఆశ్చర్యపోయాను. అంత త్వరగా బాబా చూపిన అనుగ్రహానికి నాకు కలిగిన అనుభూతిని మాటల్లో వ్యక్తపరచలేను.

ఇకపోతే రెండవ అన్నయ్య దీపక్ ఎంబీఏ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణకు హైదరాబాద్ వెళ్లాడు. అక్కడికి వెళ్ళాక తన ఎంబీఏ ఫలితాలు వెలువడ్డాయి. అయితే చివరి సంవత్సరంలో 6 సబ్జెక్టులు ఉంటే, ఏవో కారణాలచేత ఐదు సబ్జెక్టుల ఫలితాలు మాత్రమే వెలువడ్డాయి. రెండు నెలలు గడిచినా ఆ ఒక్క సబ్జెక్టు రిజల్ట్ రాలేదు. ఆ సమయంలో తనకి ఒక ఉద్యోగం వచ్చింది. కంపెనీ వాళ్ళు మార్క్‌లిస్ట్ చూపించమని అడగటంతో సమస్య మొదలైంది. శని, ఆదివారాలు కావడంతో రెండురోజులు సమయం ఉన్నా సోమవారం వాటిని తప్పక సమర్పించవలసి ఉంది. ఒకవేళ రిజల్ట్ వస్తుందేమో అని ఆశపడటానికి శని, ఆదివారాలు కాబట్టి అది కూడా లేదు. మేము చాలా టెన్షన్ పడ్డాము. నేను సాయిని ప్రార్థించాను. నా సాయి దయవల్ల శనివారమే రిజల్ట్ వెలువడింది. మా సంతోషానికి అవధులులేవు. ఇప్పుడు అన్నయ్య సంతోషంగా ఉద్యోగం చేసుకుంటున్నాడు.

ఇప్పుడు నా ఉద్యోగానికి సంబంధించిన అనుభవం చెప్తాను. 2016లో నేను ఇంజనీరింగ్ పూర్తిచేసి, పైకోర్సులు నేర్చుకోవడానికి హైదరాబాద్ వెళ్లాను. 2016 ఏప్రిల్‌లో తిరిగి మా ఇంటికి వచ్చేశాను. కొన్ని ఆర్థికసమస్యల కారణంగా అక్కడే నేను ఐదు నెలలపాటు ఉండిపోవాల్సి వచ్చింది. ఆ కారణంచేత నేను ఉద్యోగం కోసం వేరే ఎక్కడికీ వెళ్ళలేకపోయాను. చివరికి 2017 సెప్టెంబరులో నేను బెంగళూరు వెళ్ళాను. పెద్దన్నయ్య నన్ను ఒక ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ చేశాడు. నేను మంచి మార్కులతో ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణురాలినైనప్పటికీ సుమారు రెండు సంవత్సరాలు ఖాళీగా ఉన్నందున నాకు మంచి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చేవి కావు. అందువల్ల మా ఇన్‌స్టిట్యూట్‌ హెచ్ఆర్ నన్ను ఇంటర్వ్యూలకు పంపడం మొదలుపెట్టారు. నేను సుమారు 30కి పైగా ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. కొన్నిసార్లు నేను అన్ని రౌండ్లూ క్లియర్ చేసినప్పటికీ నాకు ఆఫర్ లెటర్ రాలేదు. ఇలా రోజులు గడిచిపోతుండేవి. రోజురోజుకూ నాలో విసుగు పెరిగిపోతుండేది. చివరకు నేను సమస్యను బాబాకు చెప్పుకుని, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి నవగురువారవ్రతం మొదలుపెట్టాను. 9 గురువారాల వ్రతం పూర్తయిన నెలరోజుల తరువాత బాబా కృపతో నాకు ఉద్యోగం వచ్చింది. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, రెండేళ్లు ఖాళీగా ఉన్న తరువాత కూడా నాకు ఫ్రెషర్‌గా ఉద్యోగం వచ్చింది. ఇక్కడ మరోవిషయం చెప్పాలి, కొన్ని నెలల ముందు నేను ఒక కంపెనీలో అన్ని రౌండ్ల ఇంటర్వ్యూ పూర్తి చేశాను. అదొక స్టార్టప్ కంపెనీ. వాళ్ళు కేవలం తొమ్మిదివేల రూపాయల జీతం ఇస్తానన్నా కూడా నేను ఆ ఉద్యోగంలో చేరాను. కానీ వాళ్ళు నాకు ఆఫర్ లెటర్ ఇచ్చేవారు కాదు. 4 నెలలు వేచి ఉన్నప్పటికీ ఆఫర్ లెటర్ రాలేదు. ప్రతిరోజూ నేను, "నాకు ఆఫర్ లెటర్ వచ్చేలా చూడమ"ని సాయిబాబాను అడుగుతుండేదాన్ని. బాబా అది నాకు ఇవ్వలేదుగానీ, ఆ కంపెనీ కంటే మంచి కంపెనీలో, మంచి జీతంతో ఉద్యోగాన్ని ఇచ్చారు. "ఓ నా సాయీ! మీరు మమ్మల్ని చాలా ఏడిపిస్తారు. కానీ చివరికి మీదైన ప్రత్యేక మార్గంలో మా ప్రతి సమస్యను పరిష్కరించి మమ్మల్ని అనుగ్రహిస్తారు. అందుకే మాకు సహనం చాలా అవసరమని మీరు బోధిస్తారు. నా ప్రతి ప్రార్థనను అనుగ్రహిస్తున్న మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

source: http://www.shirdisaibabaexperiences.org/2019/11/shirdi-sai-baba-miracles-part-2537.html

బాబా అనుగ్రహంతో చేకూరిన ఆరోగ్యం

నెల్లూరు నుండి శివ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

నా పేరు శివ. మాది నెల్లూరు. 10 రోజుల క్రితం మా మావయ్య ఆరోగ్యం దిగజారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వెంటనే ఆయన్ని అపోలో ఆస్పత్రిలో చేర్చాము. ఒకరోజంతా డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నప్పటికీ తన పరిస్థితిలో ఏ మార్పూ లేదు. అందువల్ల మేము తనని గుంటూరు తీసుకువెళ్దామని అనుకున్నాము. ఇలాంటి పరిస్థితిలో అంతదూరం ప్రయాణం చేయడం మంచిది కాదని డాక్టర్లు చెప్పారు. కానీ మేము మాత్రం తనని గుంటూరు తీసుకు వెళ్లాలనే నిర్ణయించుకున్నాము. నెల్లూరు నుండి గుంటూరుకు దాదాపు 250 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇంతదూరం ప్రయాణం చేసేటప్పుడు మార్గమధ్యంలో తనకేమైనా అయితే ఎలా అని మేమంతా భయపడ్డాము. అప్పుడు బాబాకి నా బాధని విన్నవించుకున్నాను. "బాబా! మావయ్యని గుంటూరు తీసుకువెళ్తున్నాము. దారిలో తనకేమీ కాకుండా చూసుకోండి. అంతేకాదు, తను ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావాలి బాబా!" అని ప్రార్థించాను. మేము గుంటూరు వెళ్తుండగా, మార్గమధ్యంలో అంతటి అనారోగ్యంతో ఉన్న మావయ్య బాబా అనుగ్రహంతో చక్కగా లేచి కూర్చున్నారు. తన ఆరోగ్యం ఇప్పుడు బాగా మెరుగుపడింది. "బాబా! కేవలం మీ అనుగ్రహంతోనే మావయ్య కోలుకున్నారు. చాలా చాలా ధన్యవాదాలు బాబా!".


సాయిభక్తుల అనుభవమాలిక 303వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. ఖాళీ కడుపుతో ఏ పని చేసినా అది సఫలం అవదు
  2. ప్రార్థించినంతనే ఇల్లు చూపించారు బాబా

ఖాళీ కడుపుతో ఏ పని చేసినా అది సఫలం అవదు

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

సాయిబంధువులందరికీ ఓం సాయిరాం! ఈ ఆధునిక సచ్చరిత్రను మాతో నిత్యపారాయణ చేయిస్తున్న బ్లాగ్ నిర్వాహకులకు కూడా ఓం సాయిరాం! 'నా సాయి తన బిడ్డలను ఎంత ప్రేమిస్తారో!' అనే నా భావాలను ఇంతకుముందు మీతో పంచుకున్నాను. ఎవరికైనా అది అర్థం కాలేదేమోనని ఇంకొంచెం వివరంగా ఈ అనుభవాన్ని చెబుతున్నాను. ఇది చదివితే ఖచ్చితంగా సాయి ప్రేమ అర్థమవుతుంది.

నేను ఇప్పుడు పంచుకోబోయే అనుభవం ఒక నెల క్రితం జరిగింది. "ఖాళీ కడుపుతో ఏ పని చేసినా అది సఫలం అవదు" అని సచ్చరిత్రలో బాబా చెప్పింది అందరికీ గుర్తుండే ఉంటుంది. "అది కేవలం పుస్తకంలో రాశారంతే, నిజంగా బాబా చెప్పారో లేదో" అనే ఆలోచన ఎవరికైనా (ఎవరూ ఉండరు) ఉంటే ఈ అనుభవాన్ని వారితో చదివించండి. సాయి మాట, సాయి సచ్చరిత్ర ఎంత సత్యమైనవి అనేది వారికి తెలుస్తుంది.

బాబా దయవల్ల 'సాయిమహరాజ్ సన్నిధి బ్లాగ్' నిర్వాహకులు పంపిన మెస్సేజ్‌తో ఆగస్టులో నేను మహాపారాయణలో భాగస్వామినయ్యాను. దానికి సంబంధించిన వివరాలను బాబా అనుగ్రహిస్తే ఇంకొక అనుభవం ద్వారా పంచుకోవటానికి ప్రయత్నిస్తాను. నేను మహాపారాయణలో చేరిన రెండున్నర నెలల్లోనే సాయి నన్ను మహాపారాయణకి క్లాస్ టీచర్ని చేశారు. అంటే, నేను 48మంది భక్తులతో పారాయణ చేయించాలి. అంతటి గొప్ప అనుగ్రహాన్ని పొందుతానని నేనసలు ఊహించలేదు. "ధన్యవాదాలు సాయినాథా!"

నెలరోజుల క్రితం ఒక గురువారంనాటి ఉదయాన నేను కేవలం పాలు మాత్రమే తీసుకొని, 'సభ్యులందరూ వారికి కేటాయించిన అధ్యాయాలు పారాయణ చేయడం పూర్తిచేస్తే, పారాయణ పూర్తయిందని రిపోర్ట్ పెట్టేసి అప్పుడు తినొచ్చు' అని అల్పాహారం తినకుండా ఉన్నాను. పారాయణ పూర్తయిందన్న సభ్యుల మెసేజ్ కోసం ఎదురుచూస్తూ చూస్తూనే లంచ్ టైమ్ కూడా అయింది. నేనింక ఏమీ తినకుండా అందరూ పారాయణ చేసేస్తే ఒకేసారి భోజనమే చేసేద్దామని ఎదురుచూస్తున్నాను. 47 మంది సభ్యుల పారాయణ పూర్తయింది. ఇంకొక్కరు మాత్రమే మిగిలారు. వారిది కూడా అయిపోతే రిపోర్టు పెట్టేసి భోజనం చేద్దామని చూస్తుంటే 2.30 అవుతున్నా ఆ సభ్యుని పారాయణ అవలేదు. మెస్సేజ్ పెట్టినా, ఫోన్ చేసినా పారాయణ చేస్తానని చెప్తున్నారేగానీ ఎంతకీ చేయటం లేదు. నిజానికి ఆ వ్యక్తి ఎప్పుడూ త్వరగానే పారాయణ చేస్తారు కానీ, ఏ కారణంచేతనో వారే ఆరోజు ఆలస్యం చేస్తున్నారు. కాసేపటికి ఆ వ్యక్తి తన పారాయణ పూర్తయ్యేసరికి సాయంత్రం 4గంటలు కావచ్చని కెప్టెన్‌తో చెప్పినట్లు తెలిసింది. ఇక చేసేది లేక భోజనం చేయడం మొదలుపెట్టాను. మీకు అర్థం అయిపోయింది కదా తరువాత ఏమి జరిగిందో? నేను భోజనం మొదలుపెట్టిన 5 నిమిషాల్లో, సాయంత్రం 4 గంటల వరకు పారాయణ పూర్తి కాదని చెప్పిన ఆ వ్యక్తి తన పారాయణ పూర్తి చేసి రిపోర్టు పెట్టిన మెస్సేజ్ వచ్చింది. అంటే, నేను ఏమీ తినకుండా ఉన్నానని నా సాయితండ్రి అలా చేశారు. 'నువ్వు తింటే కానీ పారాయణ పూర్తి కాదు' అని ఆయన నాకు తెలియజేశారు.

చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని అనేవారు కదా, 'నువ్వు హోంవర్క్ చేస్తేనే ఆడుకోనిస్తాను, అన్నం తింటేనే టీవీ చూడనిస్తాను' అని. అలాగే అనిపించింది సాయి చేసింది కూడా. ఇలాంటివి ఎన్నో అనుభవాలు జరిగాయి. వీలైనపుడు వాటిని మీ అందరితో పంచుకుంటాను.

అందరికీ నేను చెప్పేది ఒక్కటే! మనం అనుకున్నవి జరగలేదని బాబాకి మన మీద ప్రేమ లేదని అనుకోవద్దు. ప్రతిక్షణం ఆయన మన మీద ప్రేమ కురిపిస్తూనే ఉంటారు. ఒక తల్లిలా, ఒక తండ్రిలా నీకు ఏది మంచిదో అదే చేస్తారు.

ఓం సాయిరాం!

ప్రార్థించినంతనే ఇల్లు చూపించారు బాబా

న్యూజిలాండ్‌కు చెందిన ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! జీవితంలో అడుగడుగునా మనకు తోడుగా సాయిబాబా ఉన్నారని నా పూర్తి విశ్వాసం. ఈ కలియుగంలో కూడా ఆయన తన భక్తులకు ఎన్నో అద్భుతాలు చూపిస్తున్నారు. మేము గత సంవత్సరం నుండి ఒక అద్దె ఇంటి కోసం వెతుకుతున్నాము. మేము ఎంతగా ప్రయత్నిస్తున్నా మాకు తగిన ఇల్లు దొరకలేదు. ఒకవేళ మాకు ఇల్లు నచ్చినా ఇంటి ఓనర్స్ నుండి ఎటువంటి స్పందనా ఉండేదికాదు. మేము చాలా నిరాశచెందాము. కానీ చేసేదిలేక సమస్యను బాబాకు వదిలివేశాము. అదే సమయంలో భారతదేశంలో ఉన్న నా తల్లిదండ్రులు కూడా ఒక ఇంటికోసం వెతుకుతున్నారు్. మాకు, నా తల్లిదండ్రులకు ఇల్లు దొరికేలా అనుగ్రహించమని బాబాకు చెప్పుకుని నేను నవగురువార వ్రతం ప్రారంభించాను. ఒక వారం తరువాత మావారు తనకు తెలిసిన ఒక వ్యక్తిని కలిశారు. మాటల్లో మావారు అతనితో, మేము ఇంటికోసం వెతుకుతున్నామని, ఎక్కడైనా ఖాళీగా ఉన్న ఇల్లు గురించి తెలిసినట్లైతే మాకు తెలియజేయమని చెప్పారు. తరువాత కొద్దిరోజులలోనే అతను ఫోన్ చేసి తన ఫ్యామిలీ ఫ్రెండ్ ఇల్లు ఖాళీగా ఉందని, మాకు ఆసక్తి ఉంటే వెళ్లి ఇల్లు చూడమని చెప్పారు. వెంటనే మేము వెళ్లి ఇల్లు చూశాము. అది పాత ఇల్లు. కానీ ఓనర్స్ చాలా మంచివారు. అక్కడితో బాబా దయవలన మా సమస్య ముగిసింది. నా తల్లిదండ్రులకు కూడా బాబా కృపవలన మంచి ఇల్లు దొరికింది. "బాబా! ఇదంతా మీ ఆశీర్వాదం వల్లనే. మా పరిస్థితి మీకు తెలుసు, అన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకోండి. మీపై నాకు అపారమైన నమ్మకం ఉంది".


సాయిభక్తుల అనుభవమాలిక 302వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయి కరుణాసముద్రుడు
  2. కష్టకాలంలో బాబా సహాయం

సాయి కరుణాసముద్రుడు

సాయిభక్తురాలు శ్రీమతి సంధ్య తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం శ్రీ సాయినాథాయ నమః. ఆపద్బాంధవుడు, కరుణాసముద్రుడు, పిలిచిన వెంటనే పలికే దైవం నా సద్గురు సాయి దివ్యపాదాలకు నమస్కరిస్తూ సాయి  ప్రేమను పొందిన మరో అనుభవాన్ని సాటి సాయిబంధువులతో ఆనందంగా పంచుకుంటున్నాను. 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి మరియు సాటి సాయిబంధువులకి నా నమస్కారములు. నా పేరు సంధ్య. 3 సంవత్సరాల క్రితం నా భర్త ఆరోగ్యం దెబ్బతిన్నది. ఒకటి తర్వాత ఒకటిగా తలనొప్పి, శ్వాస సమస్య, చెవి నొప్పి, మందులు వాడడం వల్ల గొంతు పాడవడం, ఎముకలు అరిగిపోవటం, కాళ్ళు లాగడం, పైల్స్, మలద్వారం నుండి రక్తం రావడం వంటి ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాము. తనవాళ్ళనే దైవంగా భావించి, ఎల్లప్పుడూ తనకు తోడుగా ఉంటారని అనుకున్న బంధుబలగం మావారికి అవసరమనుకున్న సమయంలో తోడుగా రాలేదు. పిల్లలు చిన్నవాళ్లు. చదువు, ఆటలు తప్ప ఏమీ తెలియని పసితనం. నా భర్త పరిస్థితి చూచి ఏడవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయురాలిని నేను. "ఈశ్వరా! రక్షించండి తండ్రీ!" అని కన్నీళ్లతో నా ఇష్టదైవాన్ని ప్రార్థించాను. ఒకరోజు, "మీరు చిన్నప్పుడు ఏ గుడికైనా వెళ్ళేవారా?" అని నా భర్తను అడిగాను. "నేను సాయిబాబా గుడికి వెళ్ళేవాణ్ణి" అని చెప్పారు. ఆ తరువాత వచ్చిన గురువారంరోజున నిస్సహాయస్థితిలో వున్న నా భర్త, నేను సాయిమందిరానికి వెళ్ళి సాయిని దర్శించుకున్నాము. ఆరతికి  ఇంకా సమయం ఉన్నందున ఒక ప్రక్కన నిస్సహాయస్థితిలో నిలబడి బాబాను చూస్తూ, "సాయీ! నా భర్త ఆరోగ్యం బాగాలేదు. తనకి ఏమైందో నాకు అర్థం కావట్లేదు" అని మా సమస్యలన్నింటినీ దీనంగా బాబాకి విన్నవించుకుంటున్నాను. నా మనసును విన్న సాయి అద్భుతం చూపించారు. నా మనసులో ఉన్న బాధలని బాబాకి చెబుతుండగా బాబా తన శిరస్సును మెల్లగా ఊపుతూ, 'ఊఁ.. ఊఁ' అని వింటున్నట్లు దర్శనమిచ్చారు. ఆ సమయంలో నాకు ధ్యానస్థితి కలిగించి నా సమస్యలనింటినీ  శ్రద్ధగా విన్నారు. కొద్ది క్షణాలలో నేను నిజస్థితికి వచ్చాను. ఇప్పటికీ ఆ అనుభవం కళ్ళకు కట్టినట్లుగా ఉంది. అప్పటినుండి నా భర్త పూర్తిగా కోలుకున్నారు. "దయగల బాబా! మాటలకి అందని మీ ప్రేమ ఎంతని చెప్పను? అమాయక భక్తులకు అండగా నిలిచి, తల్లి, తండ్రి, బంధుబలగం, స్నేహితుడు, వైద్యుడు, సద్గురువుగా మానవరూపంలో వెలసిన ఈశ్వరా! సాయీశ్వరా! మీ పాదాలకు శరణు వేడుతున్నాను. ప్రేమస్వరూపా! ఆనందనిలయా! సాయీ! మీ దయ ఉంటే చాలు తండ్రీ. ఐ లవ్ యూ బాబా సాయీ!"

గురు కృపాహి కేవలం. సద్గురు చరణం భవ భయ హరణం. జై సాయిరాం!

కష్టకాలంలో బాబా సహాయం

USA నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

చాలా సంవత్సరాల క్రితం నా హాస్టల్ స్నేహితురాలు నాకు బాబాని పరిచయం చేసింది. అప్పటినుండి నేను సాయిబాబా భక్తురాలినయ్యాను. నేనిప్పుడు దాదాపు 8 నెలల కథను వీలైనంత చిన్నదిగా చెప్తాను.

ప్రస్తుతం మేము యు.ఎస్.ఏ లో నివసిస్తున్నాము. 2016 అక్టోబరు నుండి నా భర్త ఆరోగ్యం బాగాలేదు. 3 నెలల్లో ఆయన దాదాపు 12 కిలోల బరువు తగ్గిపోయారు. ఆయన తన ఎడమచేయి నొప్పిగా ఉందని, తిన్న ఆహారం అన్నవాహికలో ఉన్నట్లుగా అనిపిస్తూ వికారంగా ఉంటోందని, ఛాతీనొప్పి అని కూడా అంటుండేవారు. ఆయన చెపుతున్న లక్షణాలన్నీ దాదాపు గుండెపోటుకు సంబంధించినవే. మేము అత్యవసర పరిస్థితి కింద హాస్పిటల్‌కి వెళితే, అంతా నార్మల్‌గా ఉందని చెప్పారు. కానీ నవంబరు నెల చివరి నుండి జనవరి మధ్య వరకు ఒకటిన్నర సంవత్సరం వయసున్న మా పాపను పట్టుకుని అర్థరాత్రి వేళ దాదాపు 4-5 సార్లు ఎమర్జెన్సీగా హాస్పిటల్‌కి వెళ్ళాము. డాక్టర్లు ప్రతిసారీ ఇసిజి, ఎక్స్-రే, రక్తపరీక్ష మొదలైన పరీక్షలు చేయించేవారు. ఇవన్నీ యు.ఎస్ లో ఎంతో ఖర్చుతో కూడుకున్నవి. డబ్బులు ఖర్చు అవుతున్నా సమస్య ఏమిటన్నది మాత్రం తెలిసేది కాదు. డాక్టర్లు ప్రతిసారీ, "సమస్య ఏమీలేదు, అంతా నార్మల్ గా ఉంది" అని చెప్తూ, "బహుశా ఒత్తిడి వల్ల కావచ్చు" అని చెప్పేవారు. అయినా మేము సమస్య ఏమిటో తెలుసుకోవడానికి గ్యాస్ట్రో ఎంటరాలజీ, ఎండోస్కోపీ మొదలైన చేయగలిగిన అన్ని పరీక్షలు చేయించాం. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఆయన ఆహారం జీర్ణం కాలేదని గుండె పట్టుకుని రాత్రిళ్ళు నడుస్తూ ఉండటంతో మేము ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాము.

ఆ కష్టకాలంలో నేను ప్రతిరోజూ బాబా ముందు ఏడుస్తూ, మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. 2016, డిసెంబరు చివర్లో నేను నా భర్త ఆరోగ్యం కోసం 9 గురువారాలు ఉపవాసం ఉండాలని సంకల్పించాను. 8వ వారం ఉపవాసంలో ఉండగా బాబా ఆశీర్వాదం వలన భారతదేశంలో ఉన్న నా క్రైస్తవ మిత్రులలో ఒకరి ద్వారా సాయిబాబా భక్తురాలైన తన స్నేహితురాలికి ఒక సిద్ధవైద్యుడితో బాగా పరిచయం ఉందని తెలిసింది. నేను ఆమెకు అన్నీ వివరించి చెప్పాను. ఆమె నాకు ఆ సిద్ధవైద్యుని నెంబర్ ఇచ్చింది. మేము అతనిని ఫోన్లో సంప్రదిస్తే, మేము చెప్పిన లక్షణాలను బట్టి ఇంటిలోనే ఔషధాన్ని తయారుచేసుకునే చాలా చిట్కాలను చెప్పాడు. ఈలోగా బాబా దయవల్ల నేను నా 9 వారాల ఉపవాసం పూర్తి చేశాను. తరువాత మేము కొత్త పరిపాలన కారణంగా నాన్-ఇమ్మిగ్రెంట్స్ కు చాలా సమస్యలు ఉన్నప్పటికీ 2017 ఫిబ్రవరిలో భారతదేశానికి వెళ్ళాము.

మొదటి రెండు రోజుల్లో మేము వీసా స్టాంపింగ్ పనులు చూసుకుని మూడవరోజు బాబా సహాయం కోసం కుటుంబమంతా శిరిడీ వెళ్ళాము. శిరిడీలో బాబాను చూస్తూనే నేను కన్నీళ్లు ఆపుకోలేక బాగా ఏడ్చేశాను. తరువాత బాబా ఆశీస్సులతో మేము మా సొంత ఊరికి వెళ్ళాము. అక్కడ ఉన్న సిద్ధవైద్యుడిని కలిసాము. ఆ సిద్ధవైద్యుడు కూడా బాబాకు దృఢమైన భక్తుడని తెలిశాక నా బాబా నాకు సరైన మార్గాన్ని చూపిస్తున్నారని  అర్థమైంది. అతను బాగా పరీక్షించి, 'యాసిడ్ రిఫ్లెక్స్' ఈ సమస్యకు కారణమని చెప్పి విరోచనాల టాబ్లెట్లు ఇచ్చాడు. వాటితో మావారి ఆరోగ్యం రోజురోజుకూ మెరుగుపడసాగింది. ఒక నెల తరువాత మార్చిలో మేము తిరిగి యు.ఎస్ వచ్చాము. మావారు దాదాపు 80%  కోలుకున్నారు. "నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని కష్టకాలంలో మాకు సహాయం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా! మా కుటుంబమంతా ఎల్లప్పుడూ మీ దివ్యపాదాలనే ఆశ్రయించుకుని ఉంటాము. మీరు మా కుటుంబాన్ని ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉంటారని నేను నమ్ముతున్నాను బాబా!"

source: http://www.shirdisaibabaexperiences.org/2019/10/shirdi-sai-baba-miracles-part-2527.html


సాయిభక్తుల అనుభవమాలిక 301వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సద్గురు సాయీశ్వరా!
  2. బాబా నా సోదరికి తగిన సంబంధాన్ని పంపించారు

సద్గురు సాయీశ్వరా!

సాయిభక్తురాలు శ్రీమతి సంధ్య తనకు బాబా ప్రసాదించిన మరో అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

ఓం శ్రీ సాయీశ్వరాయ నమః.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సాయి దివ్యపాదాలకు నమస్కరిస్తూ సాయి ప్రేమను తోటి సాయిబంధువులతో పంచుకుంటున్నాను. 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి, సాయిబంధువులకి నా హృదయపూర్వక నమస్కారములు. నేను మొదటినుంచి శివుడిని తండ్రిలా, జగన్మాతను తల్లిలా ఆరాధిస్తాను. ఏ దేవాలయానికి వెళ్ళినా అంతా ఈశ్వర రూపాలు, ఈశ్వరుని అంశలే అనే భావంతో నమస్కరిస్తాను. దేవుడంటే శివుడేనని నా విశ్వాసం. సంతోషమైనా, దుఃఖమైనా ఈశ్వరుడే నాకు గుర్తుకొస్తారు. అలాంటి నాకు ఆ ఈశ్వరుడే శ్రీసాయినాథుడని తెలియజేసిన అనుభవం నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

ఒకప్పుడు మా అత్తమ్మ చాలా అనారోగ్యానికి గురైంది. ఆమె ఎప్పుడూ బాబాకు నమస్కరించేది. అందువలన నేను ఆమె ఆరోగ్యం కోసం బాబాకు మ్రొక్కుకున్నాను. ఆయన అనుగ్రహం వల్ల ఆమె త్వరలోనే కోలుకుంది. తరువాత ఒకరోజు నా మ్రొక్కు తీర్చుకుందామని మా అత్తమ్మతో కలసి నేను సాయిబాబా గుడికి వెళ్ళాను. దీపాలు వెలిగించి, బాబాకు శాలువా సమర్పించి, పులిహోరను నైవేద్యంగా సమర్పించాము. అంతలో మధ్యాహ్న ఆరతి సమయం కావడంతో మేము వరుసలో నిల్చున్నాము. నేను బాబా ఆరతి చూడడం అదే మొదటిసారి. నా అజ్ఞానం చూడండి, 'సాయి మానవులు కదా, మనిషిని పూజిస్తారా?' అనే సందేహం నా మనస్సులో తలెత్తింది. నా మనసు తెలిసిన సాయి మరుక్షణంలో అద్భుతాన్ని చూపించారు. సాయి పాదం కదులుతూ ఉంది. ఆ దివ్య పాదదర్శనంతో నన్ను నేను మరచి పరవశించిపోయాను. ఆ దర్శనంతో నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి, ఆ ఈశ్వరుడే మానవరూపంలో సద్గురుసాయిగా అవతరించారన్న విశ్వాసాన్ని కలిగించారు. 'కర్మ నశించనిదే గురుకృపను తెలుసుకోలేము' అన్నట్లు నా జీవితంలో సాయి పంచిన ప్రేమను, జరిగిన సాయి లీలలను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. "సద్గురు సాయిశ్వరా! మీ పాదాలకు శరణు వేడుతున్నాను. ఎల్లవేళలా మీ ప్రేమను పొందే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ప్రాపంచిక మాయలో ఉన్న మమ్మల్ని పారమార్థిక మార్గంలోకి నడిపించండి. గురుదేవా! సాయీ! మీ దివ్య పాదదర్శనంతో ధ్యానస్థితిని ప్రసాదించిన మీ ప్రేమను ఎంతని వర్ణించను? మిమ్మల్ని ప్రేమించటం తప్ప ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపుకోగలను? ఐ లవ్ యు బాబా! ఐ లవ్ యు!"
- సంధ్య.

బాబా నా సోదరికి తగిన సంబంధాన్ని పంపించారు

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఓం శ్రీ సాయినాథాయ నమః.

ముందుగా వేలాదిమంది భక్తులు తమ అనుభవాలను పంచుకోవడానికి ఒక వేదికను అందించిన ఈ బ్లాగ్ బృందానికి కృతజ్ఞతలు. తోటిభక్తుల అనుభవాల ద్వారా రోజురోజుకూ బాబాయందు విశ్వాసం మరింత బలపడుతోంది. నేను పుట్టినప్పటినుంచి బాబా దయ నాపై ఉంది. ఆయన నా పేరులో భాగమై ఉన్నారు. అయితే ఇటీవలే నేను ఆయన లీలలను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. అప్పటినుండి నా జీవితంలో అద్భుతాలు ఆగలేదు. నా సోదరి జీవితంలోకి సరైన వ్యక్తిని పంపినందుకు నేను బాబాకు చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఈ సంఘటనను నేను నిజమైన బాబా భక్తులతో తప్ప మరెవరితోనైనా పంచుకుంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కానీ బాబా యొక్క దృఢమైన భక్తులతో పంచుకుంటే, వాళ్ళు అంచనా వేయలేని బాబా శక్తిని అనుభూతి చెందటంతో పాటు, తమ భక్తిని కూడా దృఢపరుచుకుంటారు.

మేము మా సోదరి కోసం సంబంధాలు వెతుకుతున్నప్పుడు బాబాను హృదయపూర్వకంగా ప్రార్థించాము. ఆయన మా సోదరి జీవితంలోకి సరైన వ్యక్తిని పంపించారు. విచిత్రమేమిటంటే, మా సోదరి తనకు కాబోయే జీవితభాగస్వామి ఎలా అయితే ఉండాలని ఆశించిందో సరిగ్గా అతను అలాగే ఉన్నాడు. ఇంకో ఆశ్చర్యమేమిటంటే, అతను మా ఇంటికి రావడానికి ముందుగా తన ప్రణాళిక ప్రకారం శిరిడీ సందర్శించాడు. అక్కడనుండి అతను శిరిడీ ప్రసాదాన్ని, బాబా విగ్రహాలను తీసుకుని వచ్చాడు. మేము బాబా అనుగ్రహాన్ని అసలు నమ్మలేకపోయాము. నిజానికి మా నాన్నగారు అదే నెలలో శిరిడీ వెళ్లాలని అనుకున్నప్పటికీ సాధ్యపడలేదు. కానీ బాబా అంతా చక్కగా ప్రణాళిక చేశారు. ఈ మొత్తం సంఘటన మా బావగారిని బాబాకు దృఢమైన భక్తునిగా మార్చింది. అందులో మా సోదరి ప్రభావం కూడా ఉంది. ఈ అనుభవంతో 'స్వర్గంలో సంబంధాలు నిర్ణయించబడతాయ'ని నేను నమ్మడం ప్రారంభించాను. అవును, అది వాస్తవం! "చాలా చాలా ధన్యవాదాలు బాబా!" 

జీవితభాగస్వామి కోసం వెతుకుతున్న దశలో ఉన్న ప్రతి సాయిభక్తునికి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. పూర్తి విశ్వాసంతో బాబాకు శరణాగతి చెందండి. ఆయన మీకోసం ఉత్తమమైన సంబంధాన్ని అనుగ్రహిస్తారు.


source:http://www.shirdisaibabaexperiences.org/2019/11/shirdi-sai-baba-miracles-part-2541.html


సాయిభక్తుల అనుభవమాలిక 300వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • జీవితంలోకి బాబా ప్రవేశం - కురిపిస్తున్న అనుగ్రహం

కోల్‌కతాకు చెందిన ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

నేను క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీరుని. నా జీవిత ప్రయాణం చాలా కష్టంతో కూడుకున్నది. బాబా ఆశీస్సులతో ఇటీవల నా వివాహం జరిగింది. నిస్సహాయస్థితిలో ఉన్న నాకు మంచి జీవిత భాగస్వామిని చూపించడంలో బాబా ఎలా సహాయపడ్డారో నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

20 సంవత్సరాల నుండి మా అమ్మ దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతోంది. కానీ మాది సంతోషకరమైన కుటుంబం. బాల్యంనుండి దేవాలయాలు, ప్రార్థనలు, ధ్యానం మొదలైన ఆధ్యాత్మిక కార్యకలాపాలు నన్ను చాలా ఆకర్షిస్తుండేవి. అయితే నేను, నా కుటుంబం ఎప్పుడూ సాయిబాబాను పూజించలేదు. చెప్పాలంటే కోల్‌కతాలో సాయిబాబా ఆలయాలు చాలా తక్కువ. అందుకేనేమో ఆయన గురించి మాకు సరిగ్గా తెలియదు.

2016 జనవరిలో నాకు వివాహం అయ్యింది. నేను చాలా సంతోషంగా అత్తవారింట అడుగుపెట్టాను. ఆ ఆనందం కేవలం ఒక నెల మాత్రమే నిలిచింది. ఎందుకంటే నా భర్త ఒక మానసిక రోగి. ఆ విషయాన్ని దాచిపెట్టి మోసంతో మా వివాహాన్ని జరిపించారు. అతను, అతని తల్లి నన్ను చాలా హింసించేవారు. ప్రతిరోజూ నేను నరకయాతన ఎదుర్కోవలసి వచ్చింది. నెల ముగిసేసరికి ఆ హింసను భరించలేక నేను పుట్టింటికి తిరిగి వచ్చేసి, విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. నా ఈ పరిస్థితికి నా తల్లిదండ్రులు మానసికంగా కృంగిపోయారు. మేము తీవ్రమైన బాధను అనుభవించాము. ఆ కఠిన పరిస్థితి నుండి బయటపడటానికి నేను చాలా దేవాలయాలను సందర్శించి క్రొత్త జీవితం మొదలుపెట్టడానికి సహాయం చేయమని దేవుళ్ళను ప్రార్థించాను. నా తల్లిదండ్రులు నాకోసం మరో జీవితభాగస్వామిని వెతకడం ప్రారంభించారు. కానీ తగిన సంబంధం దొరకలేదు. జీవితంపై ఎటువంటి ఆశ లేకుండా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు నా జీవితంలోకి బాబా ప్రవేశించే శుభసమయం వచ్చింది.

ఒకరోజు నేను ఆఫీసులో కంప్యూటర్ ముందు కూర్చుని వర్క్ చేస్తున్నాను. నా మనస్సులో మాత్రం 'నా జీవితంలో ఎప్పుడైనా శుభవార్త అన్నది వస్తుందా? మంచి జీవితభాగస్వామి దొరుకుతాడా? అసలు సంతోషం వస్తుందా?' అని ఆలోచనలు నడుస్తున్నాయి. అకస్మాత్తుగా కంప్యూటరులో ఒక పేజీ తెరచుకుంది. ఆ పేజీలో 'శివ్‌పూర్ సాయిబాబా మందిరం' గురించి ఉంది. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. నేను దానిని చదవడం మొదలుపెట్టాను. శివ్‌పూర్ పశ్చిమబెంగాల్ లోని బేతుదహరి ప్రాంతంలో ఉన్న ఒక చిన్న గ్రామం. అక్కడొక శిరిడీ సాయిబాబా మందిరం ఉంది. ఆ మందిర వెబ్‌సైట్‌లో అద్భుత కథలున్నాయి. అవి చదివాక ఆ మందిరం మా ఇంటినుండి చాలా దూరంలో ఉన్నప్పటికీ, నాకు పూర్తిగా తెలియని ప్రదేశం అయినప్పటికీ ఆ వారంలో ఎలాగైనా అక్కడకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఆశ్చర్యంగా నా తల్లిదండ్రులు కూడా నేను ఒంటరిగా అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకున్నారు. నేను కూడా ఒంటరిగా వెళ్ళడానికి కాస్త ఆందోళనపడినప్పటికీ ఇంటినుండి బయలుదేరాను. తీరా నేను రైల్వేస్టేషనుకి వెళితే, ఆరోజు రైల్వే పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులో లేవు. నేను చాలా నిరాశకు గురై ప్లాట్‌ఫాం పైనున్న ఒక బెంచీ మీద కూర్చుని, "ఏవిధంగానైనా శివ్‌పూర్ చేరుకోవడానికి నాకు సహాయం చేయండి బాబా" అని బాబాను ప్రార్థించాను. బాబా కృపవలన నేను ఎక్కాల్సిన రైలు మాత్రమే సమయానికి వచ్చి, ఎటువంటి ఇబ్బందీ లేకుండా నేను మందిరానికి చేరుకున్నాను. బాబా దర్శనం చేసుకుని, "నాకు తగిన మంచి జీవితభాగస్వామిని చూపించండి బాబా!" అని ఆర్తిగా బాబాను ప్రార్థించాను. తరువాత తిరుగు ప్రయాణంలో కూడా రైలు సమయానికి రావడంతో ఆలస్యం కాకుండా క్షేమంగా ఇల్లు చేరుకున్నాను. ఇక అప్పటినుండి నేను సదా బాబా గురించి ఆలోచిస్తూ ఆయనను ఆరాధించడం మొదలుపెట్టాను. నేను 9 గురువారాల సాయి సత్యవ్రతాన్ని మొదలుపెట్టి,  సాయి సచ్చరిత్ర చదవడం కూడా ప్రారంభించాను. నా వ్రతం పూర్తవుతూనే బాబా అనుగ్రహంతో USA నుండి ఒక సంబంధం వచ్చింది. అన్నీ సజావుగా సాగి 2019 మే నెలలో నా వివాహం జరిగింది. నా భర్త నిజంగా చాలా మంచి వ్యక్తి, నన్ను చాలా ప్రేమిస్తాడు. నేను తనతో, తన కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో సాయిబాబా ఇచ్చిన గొప్ప బహుమతి నా భర్త.

మరో అనుభవం:

నేను శివ్‌పూర్ సాయిబాబా మందిరాన్ని దర్శించిన తరువాత మా ఇంటికి సమీపంలో ఉన్న ఒక చిన్న సాయిమందిరాన్ని తరచూ నా ఆఫీసు సమయం ముగిశాక దర్శిస్తుండేదాన్ని. ఒకసారి నేను సచ్చరిత్ర సప్తాహపారాయణ పూర్తిచేసి స్వీట్స్ తీసుకుని సాయంత్రం 7:30 సమయంలో మందిరానికి వెళ్ళాను. ఆ స్వీట్స్ బాబాకి నివేదించమని అక్కడ పూజారికి ఇస్తే, అతను, "సమయం దాటింది, ఇప్పుడు నివేదించము" అని చెప్పాడు. నేను నిరుత్సాహపడి మౌనంగా కూర్చుండిపోయాను. నా పూజను, స్వీట్స్‌ను స్వీకరించడానికి బాబా ఇష్టపడలేదని నాలో నేనే బాధపడ్డాను. తరువాత నేను మందిరం నుండి బయటకు వచ్చి, అక్కడున్న బిచ్చగాళ్లకు ఆ స్వీట్లు పంచేసి, పగిలిన హృదయంతో ఇంటికి తిరిగి వచ్చాను. ఆ తర్వాత నేను 3 నెలలపాటు ఆ మందిరాన్ని దర్శించలేదు.

తరువాత ఒకరోజు నేను అదే సమయంలో (రాత్రి 7:30 గంటలకు) మందిరానికి వెళ్ళాను. పూజ సమయం దాటిందని పూజారి ఎలాగూ నా పూజను అంగీకరించరని నాకు తెలుసు కాబట్టి, కేవలం బాబా కోసం కొన్ని పువ్వులు తీసుకుందామని అక్కడ ఉన్న దుకాణానికి వెళ్ళాను. ఆ షాపు యజమాని, "దీదీ(అక్కా)! పండిట్(పూజారి) ఆరోజు మీ పూజకు అభ్యంతరం చెప్పారు కదా, ఆరోజు పండిట్  మీ పూజను అంగీకరించకపోయేసరికి మీరు చాలా నిరాశకు గురై వెళ్లిపోయారు. మీరు వెళ్లిపోయిన తరువాత, 'బాబాకు పూజ, నివేదన సమర్పించకుండా ఏ భక్తుడూ నిరాశతో తిరిగి వెళ్లకూడద'ని యాజమాన్యం ఆదేశించింది. కాబట్టి ఏ సమయంలో అయినా సరే పండిట్ భక్తుల పూజకు అభ్యంతరం చెప్పరు" అని చెప్పాడు. అది విని నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, ఆ షాపు యజమాని నాకు తెలియదు. ఆరోజు నేను నా బాధను బాబాతో తప్ప మరెవరితోనూ పంచుకోలేదు. మరి అక్కడ జరిగిన విషయం అతనికి ఎలా తెలుస్తుంది? ఒకవేళ తెలిసినా అది జరిగిన 3 నెలల తర్వాత అతను గుర్తుపెట్టుకుని నాకెలా చెప్పగలడు? అంతేకాదు, ఒక సంఘటన ఆలయ నియమాన్నే మార్చింది. కాదు, ఈ భక్తురాలు పడిన మనోవేదనకు బాబా ఆలయ నియమాన్నే మార్చేలా చేసి, ఏ భక్తునికీ అటువంటి బాధ కలగకుండా చేశారు. ఇది బాబా నాకిచ్చిన గొప్ప అనుభవం.

ఈ కొద్దికాలంలోనే బాబాతో నాకు చాలా అనుభవాలున్నాయి. ఆయన దృష్టి ఎప్పుడూ నాపై ఉందని నేను అనుభూతి చెందుతున్నాను. నేను ప్రతి సమస్యను బాబాతో పంచుకుంటాను. జీవితంలో అడుగడుగునా నాకు తోడుగా ఉండమని నేను బాబాను ప్రార్థిస్తున్నాను. ఆయన భక్తుల ప్రార్థనలను ఖచ్చితంగా వింటారు. ప్రతిరోజూ సాయి సచ్చరిత్ర చదవమని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. అది మీకు అపారమైన మానసిక శాంతిని, మనోబలాన్ని ఇస్తుంది.

source:http://www.shirdisaibabaexperiences.org/2019/11/shirdi-sai-baba-miracles-part-2532.html


సాయిభక్తుల అనుభవమాలిక 299వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయి ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి?
  2. సాయి చేస్తున్న మార్గనిర్దేశం

సాయి ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి?

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

సాయిరామ్! నేను మీ అందరిలాగే బాబా భక్తురాలిని. నేను మహాపారాయణ (mp-18) గ్రూపులో సభ్యురాలిని  మరియు mp-575 గ్రూపు టీచరుని. ముందుగా సాయి మనందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే అనుభవం నాకు చాలా గొప్ప అనుభవం. కారణం, అది దాదాపు అసాధ్యమైనది. కేవలం బాబా కృపవలన సాధ్యమైంది. కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా నా చిన్నకొడుకు ఇంటర్మీడియెట్ పరీక్షలలో ఫెయిల్ అయ్యాడు. నిజానికి తను ఇంటర్మీడియట్ తర్వాత ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేయాలని ఎన్నో కలలుగన్నాడు. కానీ తన ఉపాధ్యాయుడి చెత్త రాజకీయాల కారణంగా తను చదువుపట్ల ఆసక్తిని కోల్పోయి చాలా మొండిగా తయారయ్యాడు. ఆ విధంగా ఆ పరిస్థితికి తనే బాధ్యుడు. ఏది ఏమైనా ఒక తల్లిగా ఆ రోజులు నాకు చాలా కష్టమైనవి. తన భవిష్యత్తు ఏమవుతుందోనన్న బాధతో చాలా ఆందోళనపడుతూ నిద్రలేని రాత్రులు గడిపాను. ఎప్పటిలాగే ఆ పరిస్థితిలో నాకున్న ఏకైక ఆశ్రయం నా సాయే! ఆయన నాకెందుకు ఈ పరిస్థితి ఇచ్చారో అందుకు కారణాన్ని ఖచ్చితంగా ఆయన తెలియజేస్తారని దృఢమైన విశ్వాసంతో ఆయననే పట్టుకున్నాను. కొన్నిరోజులకి ఆరోజు రానే వచ్చింది. బాబా నాకు సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో తన స్నేహితులందరూ ఇంజనీరింగ్ కాలేజీలలో సీటు కోసం దరఖాస్తు చేసుకుంటుంటే, నా కొడుకు 10వ తరగతి (సిబిఎస్‌ఇ) మార్కుల ఆధారంగా ఢిల్లీ స్టేట్ నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుకు దరఖాస్తు చేసేలా బాబా నన్ను ప్రోత్సహించారు. బాబా దయవలన నేను తన తరపున దరఖాస్తు చేసి పరీక్షకు హాజరవ్వమని నా కొడుకుని ఒప్పించగలిగాను. కానీ తాను ఆ పరీక్ష కోసం ఏమాత్రం ప్రిపేర్ కాలేదు. తరువాత పరీక్ష జరిగేరోజు తను పరీక్ష వ్రాయడానికి వెళ్లగా, నేను తన పరీక్షా కేంద్రానికి సమీపంలో ఉన్న బాబా మందిరంలో కూర్చుని, ఆ సమయమంతా స్తవనమంజరి చదువుతూ గడిపాను. అద్భుతం! ఏమాత్రం ప్రిపేర్ కాని నా కొడుకుకి బాబా ఆశీస్సుల వలన ఆ పరీక్షలో చాలా మంచి ర్యాంకు వచ్చింది. ఆ ఫలితాలు గురువారమే వచ్చేలా చేసి అది తమ అనుగ్రహమేనని బాబా స్పష్టంగా నాకు తెలియజేశారు. తను కాలేజీలో చేరాక మేము తన కాలేజీకి ఎదురుగా ఉన్న బాబా మందిరానికి వెళ్ళాము. నేను ఆ మందిరాన్ని దర్శించడం అదే మొదటిసారి. సింహాసనంపై కూర్చుని ఉన్న బాబా అందమైన చిరునవ్వుతో, “ఇప్పుడు నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికాయా?" అని నన్ను అడుగుతున్నట్లు అనుభూతి చెందాను. అది నాకు మరో అద్భుతమైన అనుభవం.

సంవత్సరకాలం వృధా కాకుండా బాబా కాపాడారు. ఇప్పుడు నా కొడుకు మొదటి సంవత్సరం కోర్సు పూర్తి చేయబోతున్నాడు. తను 3 సంవత్సరాల డిప్లొమా కోర్సు పూర్తిచేసిన తరువాత నేరుగా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశం పొందుతాడు. అతని స్నేహితులందరూ మంచి కళాశాలలో ప్రవేశం కోసం కష్టపడుతున్న సమయంలో ఇది నిజంగా నాకు గొప్ప అద్భుతం. వాళ్లంతా ఢిల్లీ బయట ఎక్కడో సీట్లు పొందుతారు. కానీ నా కొడుకు ఏ శ్రమా లేకుండా ఇంజనీరింగ్ కాలేజీలో సీటు పొందాడు. సాయి ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? తన భక్తుల నిజమైన కోరికలను నెరవేర్చడానికి ఆయన ఏదైనా చేస్తారని బాబా నిరూపించారు. నాకు, నా కొడుకుకు ప్రపంచం తలక్రిందులైనప్పుడు నా సాయి మాకు అండగా నిలబడి మంచి మార్గం చూపారు. ఆయన లీలలను వర్ణించడానికి ఏ పదాలూ సరిపోవు. "సాయీ! మీకు చాలా చాలా కృతజ్ఞతలు".

source:http://www.shirdisaibabaexperiences.org/2019/10/shirdi-sai-baba-miracles-part-2516.html

సాయి చేస్తున్న మార్గనిర్దేశం

హైదరాబాద్ నుండి సాయిభక్తురాలు శ్రీమతి మాధవిరెడ్డి తన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరామ్! సాయిభక్తులకు ఇంత చక్కని వేదికను అందిస్తున్న సాయికి చాలా ధన్యవాదాలు. నేను ప్రతి ఉదయం బ్లాగ్ నుండి బాబా సందేశాన్ని అందుకుంటున్నాను. అవి చదవడంతోనే నేను నా రోజును ప్రారంభించాలని అనుకుంటూ ఉంటాను. నా జీవితమంతా సాయి నాతోనే ఉన్నారు. ఆయన మార్గనిర్దేశం చేస్తూ ఇబ్బందులు, టెన్సన్స్ నుండి నాకు విముక్తినిస్తున్నారు. నా జీవితంలో బాబా ప్రసాదించిన అనుభవాలు చాలా ఉన్నాయి. నాకు గురువు, దైవం, మార్గదర్శకుడు, ఒకటేమిటి, అన్నీ బాబానే. 

2018లో నేను ఒక అపార్టుమెంటులో పెట్టుబడి పెడదామని అనుకున్నాను. అయితే డబ్బు సిద్ధంగా ఉన్నప్పటికీ నా భర్త దానికి అంగీకరించలేదు. ఆ స్థితిలో నేను, "నాకు మార్గనిర్దేశం చేయండి బాబా" అని బాబాను ప్రార్థించాను. వెంటనే బాబా అనుగ్రహించి నాకు మార్గనిర్దేశం చేశారు. నేను మంచి రేటుకి ఆ ఆస్తిని అమ్మేసి, నిర్మాణం పూర్తయిన వేరే అపార్టుమెంటులో పెట్టుబడి పెట్టగలిగాను. అది ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉండటం వలన ఆలస్యం లేకుండా అద్దె రూపంలో నాకు రాబడి కూడా మొదలైంది. నేను వదిలేసిన ఫ్లాట్ ప్రారంభం కావడానికి దాదాపు ఒకటిన్నర సంవత్సరం పట్టింది.

ఇటీవల 2019, నవంబరులో నేను చాలా ఆందోళనకు గురయ్యాను. దానివలన నేను రాత్రిళ్ళు నిద్రపోలేకపోయాను. నాకు సహాయాన్ని అందించి, మార్గనిర్దేశం చేయమని బాబాను ప్రార్థించాను. తరువాత బాబా దయతో వైద్యపరీక్షలు చేయించుకోవడానికి నా భర్తను ఒప్పించాను. వైద్యపరీక్షలు చేయించుకుంటే, నా భర్తకు గుండెకు సంబంధించిన ధమనుల్లో సమస్యలున్నాయని, శస్త్రచికిత్స చేయించుకోవాలని డాక్టర్ చెప్పారు. అంతేకాదు, వాళ్ళు మాతో, "ఎటువంటి సమస్యా లేకుండా పరీక్షలు చేయించుకోవడానికి రావడం గొప్ప విషయం. సమస్య రావడానికన్నా ముందే మమ్మల్ని సంప్రదించడం మీ అదృష్టం" అని అన్నారు. ఇదంతా బాబా ఆశీర్వాదమే. దయతో ఆయన మాకు మార్గనిర్దేశం చేశారు.

ఇవి కేవలం ఒకటి, రెండు సంఘటనలు మాత్రమే, కానీ నా జీవితమంతా బాబా ఆశీస్సులతో నిండి ఉంది. "బాబా! దయచేసి నాకు, నా భర్తకు, పిల్లలకు ఎల్లప్పుడూ అండగా ఉండండి. పిల్లల చదువుల్లో, వాళ్ళకు చక్కటి జీవితం ఏర్పడటంలో మీరు మార్గనిర్దేశం చేయండి బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 298వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా అత్యంత కరుణామయులు
  2. సాయే నా రక్షకుడు

బాబా అత్యంత కరుణామయులు

సాయిభక్తుడు ప్రేమ్‌చంద్ పట్నాయక్ తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి. 
ఈ సృష్టిని సృష్టించిన దైవస్వరూపం శ్రీ సాయినాథుడు. 
సాయిని నమ్మినచో సర్వకష్టాలు దూరం. 
సాయి నామస్మరణం సుఖశాంతికి మార్గం.
సాయి విభూతి భవరోగాలకు ఔషధం. 

"సాయిబాబా! మీ లీలలు ఎలా వర్ణించాలో నాకు అర్థం కావడం లేదు. మీరు దయామయులు. సాయిప్రభో! ఆపద సంభవించనున్న ప్రతి సందర్భంలో మీరు నన్ను కాపాడి కంటిరెప్పలా కాచుకుంటూ వస్తున్నారు. మీరు నాకు రక్షణనిచ్చిన ఒక సంఘటనను ఈ బ్లాగు ద్వారా సాయిభక్తులతో పంచుకోబోతున్నాను. ఇదే నేను మొదటిసారి మీరు ఇచ్చిన అనుభవాన్ని పంచుకోవడం. కాబట్టి నేను దీన్ని సరిగా వ్రాయగలిగేలా అనుగ్రహించండి".

ఈ సంఘటన విజయనగరంలో జరిగింది. 2019, అక్టోబరు 20, ఆదివారంనాడు నా సోదరిని ట్రైన్ ఎక్కించడానికి విజయనగరం రైల్వేస్టేషనుకు నేను, నా సోదరి బైకు మీద బయలుదేరాము. మేము స్టేషన్ చేరుకునేసరికి రైలు వెళ్లిపోవడంతో చేసేదిలేక తిరిగి మేము ఇంటికి బయలుదేరబోతుండగా ఒక వ్యక్తి బైకు మీద స్పీడుగా వచ్చి మా బైకును గుద్దేసాడు. బైకుపై వున్న నా సోదరి ఎగిరి నేలపై పడింది. బైక్ ఇంజనుకున్న షిఫ్ట్‌గార్డ్ రేకు నా ఎడమకాలి మడమ భాగంలో 5 అంగుళాల లోపలకి చొచ్చుకుపోయి ఆ ప్రాంతమంతా రక్తంతో తడిసిపోయింది. నా సోదరికి ఏమైందోనన్న కంగారులో నేను నా కాలికైన గాయాన్ని గమనించడంలేదు. ఆ విషయం క్రిందపడ్డ నా సోదరి చెప్పేంతవరకూ నాకు తెలియలేదు. వెంటనే నా స్నేహితులకు ఫోన్ చేశాను. వెంటనే నా స్నేహితులిద్దరు వచ్చారు. వాళ్లలో ఒకరు నా సోదరిని ఇంటికి తీసుకెళ్లి దించాడు. మరో స్నేహితుడు నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు. నేను బాధతో, భయంతో మార్గమంతా నా తండ్రి సాయినాథుని స్మరిస్తూ ఉన్నాను. ఆరోజు ఆదివారం కావడంవల్ల హాస్పిటల్లో డాక్టర్ లేరు. అయితే నా స్నేహితునికి ఆ డాక్టరు బాగా పరిచయస్తుడు కావడంతో తను వెంటనే డాక్టరుకి ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ డాక్టరు నా గాయాన్ని ఫోటో తీసి వాట్సాప్‌లో పంపమన్నారు. నా స్నేహితుడు అలాగే చేశాడు. డాక్టర్ అది చూసి ఎక్స్-రే తీయించమన్నారు. ఎక్స్-రే అనేసరికి నేను భయంతో మళ్ళీ సాయిని స్మరించడం మొదలుపెట్టి, ఎక్స్-రే తీసున్నంతసేపు స్మరిస్తూనే ఉన్నాను. అంతలో ఆ డాక్టరు రానే వచ్చారు. డాక్టర్ ఎక్స్-రే రిపోర్ట్ చూసి, "ఎముక విరగలేదు, కానీ ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించ"మన్నారు. ఇంతలో నా సహోద్యోగి కూడా అక్కడికి వచ్చారు. తనే నన్ను స్కానింగ్ చేయించడానికి తీసుకువెళ్లారు. అప్పుడు కూడా నేను నా సాయిని స్మరిస్తూ గడిపాను. స్కానింగులో కూడా కాలి మడమ ఎముకకేమీ కాలేదు, కండ మాత్రమే  కట్ అయింది అని చెప్పారు. బాబా దయవల్ల నేను సేఫ్ జోన్‌లో వున్నాను. ఆ తరువాత డాక్టర్ నా గాయానికి 7 కుట్లు వేసి, మూడు వారాలు ఎటూ కదలకుండా పూర్తి బెడ్ రెస్టు తీసుకోమని చెప్పారు. దాంతో నేను మందులు వాడుతూ ఎటూ కదలలేని పరిస్థితిలో ఉండేవాడిని. నాలుగున్నర ఏళ్ళ మా అబ్బాయి ప్రతిరోజూ రాత్రి నా కాలి కట్టుపై బాబా విభూతి అద్దుతుండేవాడు. అద్భుతం! డాక్టర్ చెప్పిన మూడు వారాలు పూర్తికాకముందే, గాయపడ్డ 15 రోజులకి నేను డ్రెస్సింగ్ చేయించుకోవడానికి వెళ్లేసరికి నా కాలి గాయం పూర్తిగా నయమైపోయింది. అది చూసి డాక్టరు ఆశ్చర్యపోయాడు. "ఈ ప్రాంతంలో అయిన గాయం నయం కావడం చాలా కష్టం, అలాంటిది మీ విషయంలో చాలా తొందరగా నయమైంది" అని అన్నారు. సాయిబాబా కృపవల్లనే నేను ఇంత తొందరగా కోలుకున్నాను. ఇదే విధంగా బాబా చాలాసార్లు నన్ను కాపాడారు. బాబా అత్యంత కరుణామయులు. "చాలా చాలా ధన్యవాదాలు సాయితండ్రీ. ఎల్లవేళలా ఇలాగే నాపై, నా కుటుంబంపై మీ చల్లని కృప చూపండి".

సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సాయే నా రక్షకుడు

ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నాడు:

పలికినప్పుడు ప్రశాంతంగా అనిపించే ఏకైక నామం - 'జై సాయిరామ్'. మనం సాయిని పిలిచినప్పుడల్లా ఆయన మనతో ఏదో ఒక రూపంలో ఉంటారు. "మీ పాదాల చెంతనున్న పువ్వులలో నన్ను ఒకడిగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు సాయీ!" ఇక నా అనుభవానికి వస్తే...

ఒకరోజు నేను వడదెబ్బకు గురయ్యాను. భరించలేని కడుపునొప్పితో శరీరం పూర్తిగా నిర్జలీకరణమైంది. నేను కొన్ని మందులు, లిక్విడ్స్ తీసుకున్నాను కానీ ఏమీ ప్రయోజనం కనపడక చాలా చాలా బాధ అనుభవించాను. కొంతసేపటికి నేను బాబా ఊదీ యొక్క అద్భుత లీలలను జ్ఞాపకం చేసుకున్నాను. వెంటనే నేను ఎనర్జీ డ్రింక్ (మన బాబా ఊదీ కలిపిన నీళ్లు) త్రాగి, "సమస్య నుండి ఉపశమనం కలిగించమ"ని బాబాను ప్రార్థించాను. గంటలోపల నాకు ఉపశమనం లభించి మంచి అనుభూతి కలిగింది. మన సమస్య పెద్దదైనా, చిన్నదైనా ఒకసారి సాయిని విశ్వాసంతో ప్రార్థిస్తే, మనల్ని రక్షించడానికి ఆయన ఎప్పుడూ ఉంటారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!".

source:http://www.shirdisaibabaexperiences.org/2019/10/shirdi-sai-baba-miracles-part-2503.html


సాయిభక్తుల అనుభవమాలిక 297వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు
  1. సాయితండ్రి చూపిన కరుణ
  2. బాబా తక్షణ సహాయం

సాయితండ్రి చూపిన కరుణ

ఓం సాయిరామ్! అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సాటి సాయిబంధువులందరికీ నా నమస్కారములు. నేను గత పది, పదిహేను సంవత్సరాలుగా సాయిభక్తుడిని. నా పేరు మల్లారెడ్డి. నేను హైదరాబాద్ నివాసిని. ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. ప్రతిరోజూ ఉదయాన్నే బ్లాగులోని అనుభవాలను చదవడం నాకు అలవాటు. ఇంత చక్కగా అనుభవాలను అనువదిస్తున్నందువలన మేము ఎన్నో సాయి లీలలను తెలుసుకోగలుగుతున్నాము. నేనిప్పుడు సాయి నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను మీతో పంచుకుంటాను.

మొదటి అనుభవం:

2019, సెప్టెంబరు 6వ తేదీ సాయంత్రం నేను వర్షంలో బైక్ మీద వెళ్తుండగా హఠాత్తుగా బైక్ స్లిప్ అయ్యి బండితో సహా క్రింద పడిపోయాను. నా కాలికి గాయమైంది. దాదాపు నేను నడవలేని స్థితిలో ఉన్నాను. చుట్టూ ఉన్నవాళ్లంతా నా కాలు విరిగుంటుందని అన్నారు. నేను భయంతో బాబానే తలచుకున్నాను. ఆయన నాకు సాయం చేశారు. ఎలా అంటే, నడవలేని స్థితిలో నాకు నడిచే శక్తి ఇచ్చారు. ఎలాగో మొత్తానికి ఒంటరిగా బండి మీద ఇంటికి బయలుదేరాను. దారిలో సాయిబాబా గుడి ఎదురుగా ఆగి, బండి మీదనుండే, "బాబా! నా కాలు విరగకుండా ఉండేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. తరువాత నెమ్మదిగా నేను ఇంటికైతే చేరుకున్నాను కానీ మెట్లెక్కి పైన ఉన్న మా ఇంటికి వెళ్ళలేకపోయాను. మా ఇంట్లో వాళ్ళు నా పరిస్థితి తెలుసుకొని నన్ను ఇంట్లోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టారు. నా కాలు పూర్తిగా ఒకవైపుకు ఒరిగిపోయింది. ఆ రాత్రి ఏ ఆసుపత్రికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయాను. మర్నాడు ఉదయం కట్టు కట్టించుకోవడానికని ఆసుపత్రికి వెళ్లాను. డాక్టర్ ఎక్స్-రే తీసి ఎముక ప్రక్కకు జరిగిందని చెప్పి రెండు కట్లు  కట్టారు. సరిగా మరో పదిరోజుల్లో (14వ తేదీన) మేమంతా, అంటే గ్రీన్ హిల్స్ కాలనీలోని సాయిబాబా సేవకులమంతా శిరిడీ వెళ్లాల్సి ఉంది. ఈ సమయంలో నాకిలా అయిందేమిటా అని బాధతో కుమిలిపోయాను. "బాబా! నేను ఎలాగైనా మీ దర్శనం చేసుకోవాలి" అని బాబాను వేడుకున్నాను. బాబా నా మొర విని, నన్ను విడిచిపెట్టకుండా తోటి భక్తుల సహాయంతో నన్ను శిరిడీకి రప్పించుకున్నారు. శిరిడీ చేరుకునేసరికి నా కాలు బాగా వాచిపోయింది. అయినా నేను వెనుకాడలేదు. 4 గంటలు క్యూ లైన్లో నిలబడి నా సాయి దర్శనం చేసుకున్నాను. నా సాయి ప్రేమతో నాకు తమ దర్శనభాగ్యాన్ని ప్రసాదించారు. తరువాత అక్కడున్న మందిరాలన్నీ చూశాను. అంతేకాదు, అంతకుముందెప్పుడూ చూడనటువంటి ప్రదేశాలను కూడా చూశాను. 15వ తేదీన తిరుగు ప్రయాణమై హైదరాబాదుకు వచ్చాము. అప్పటికి నొప్పులు తగ్గి నా కాలు నయమైంది. నా సాయితండ్రి చూపిన కరుణకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. సాయి మహిమ అనంతము, ఎంత చెప్పినా తక్కువే.

రెండవ అనుభవము:

ఇటీవల మా అన్నయ్యకు పక్షవాతం వచ్చి, దాని ప్రభావం కిడ్నీపై పడింది. డాక్టర్ పరీక్షించి కిడ్నీ బ్లాక్ అయిందని చెప్పారు. ఆరోజు ఆదివారం. ఉదయమంతా నేను ఏడ్చి ఏడ్చి, "బాబా, అన్నయ్యకు కిడ్నీ ఎఫెక్ట్ కాకుండా, తను తొందరగా కోలుకొని నార్మల్ అయ్యేటట్టుగా అనుగ్రహించండి" అని బాబాను వేడుకున్నాను. బాబా నా కోరిక మన్నించారు. నేను మళ్ళీ మంగళవారం హాస్పిటల్‌కి వెళ్లేసరికి అన్నయ్యకు కొంత ఉపశమనం లభించింది. తన కిడ్నీ సమస్య కొంతవరకు తగ్గింది. ఇప్పుడు తను కోలుకుంటున్నాడు. బాబా చేసిన సహాయానికి నేను కృతజ్ఞతలు తప్ప ఏమి చెప్పగలను? నా నోట మాటలు రావడం లేదు. సాయి ఎప్పుడూ మనతోనే ఉంటూ మనలను కంటిరెప్పలా కాపు కాస్తూ ఉంటారు. కాబట్టి, సాయిని ఎప్పుడూ మరవకండి. "ధన్యవాదాలు సాయీ! నీ ఈ పాదదాసుని కరుణించు తండ్రీ! నేను అనుకున్నది జరిగితే మరలా నా అనుభవాన్ని సాయిభక్తులతో పంచుకుంటాను".

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
జై సాయిరాం! జై జై సాయిరామ్!
జై సద్గురు! జై జై సద్గురు సాయినాథా!
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

బాబా తక్షణ సహాయం

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! నేను చిన్నప్పటినుండి బాబా భక్తురాలిని. నాకు ఆయన ఇచ్చిన అనుభవాలు చాలా ఉన్నాయి. ఇటీవల నేను వేసవి సెలవుల్లో మా పాపని తీసుకుని నా తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని అనుకున్నాను. కానీ టికెట్లు అందుబాటులో లేవు. నేను, నా భర్త తత్కాల్ టికెట్ బుక్ చేయడానికి చాలా ప్రయత్నించాము, కానీ దొరకలేదు. చివరికి నేను ముంబై మీదుగా వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నేను తెల్లవారుఝామున పూణే నుండి పన్వేల్ వెళ్లే రైలు ఎక్కాను. అది ఉదయం 9 గంటలకు పన్వేల్ చేరుకుంటుంది. అక్కడ నేను మళ్ళీ 1:30కి వేరే ట్రైన్ ఎక్కాలి. ట్రైన్ ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఔటర్‌లో దాదాపు అరగంట ఆగుతూ లోనావాలా చేరేసరికి 11.30 అయింది. ఆ సమయానికి దాదాపు కోచ్ అంతా ఖాళీగా ఉంది. మా పాప, నేను, ఒక అంకుల్, ఇద్దరు అటెండెంట్స్ మాత్రమే మిగిలాము. అంతలో ఒక అటెండెంట్ వచ్చి, ఏదో సాంకేతిక లోపం కారణంగా ట్రైన్ ఇక్కడినుండి ముందుకు కదలదని చెప్పాడు. పసిబిడ్డతో ఒంటరిగా ఆ నిర్మానుష్య ప్రదేశం నుండి ఎలా బయటపడగలనా అని నాకు చాలా భయమేసింది. వెంటనే సహాయం కోసం నేను సాయిని ప్రార్థించాను. కొద్దినిమిషాల్లో ట్రైన్ కదిలి పన్వేల్ చేరుకుంది. వెంటనే నేను, "బాబా! ట్రైన్ కదలకపోయుంటే నా పరిస్థితి అయోమయంగా ఉండేది. పిలిచిన వెంటనే నన్ను గమ్యం చేర్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా!" అని చెప్పుకున్నాను.

source: http://www.shirdisaibabaexperiences.org/2019/10/shirdi-sai-baba-miracles-part-2510.html?m=0


సాయిభక్తుల అనుభవమాలిక 296వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. ఊదీ మహిమలు
  2. సాయిబాబా ఇచ్చిన చక్కటి దర్శనం, అనుభవాలు

ఊదీ మహిమలు

నా పేరు లక్ష్మి. నేను బెంగుళూరు నివాసిని. ముందుగా శ్రీసాయినాథునికి నా నమోవాకములు. సాయిభక్తులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా వందనములు. ఇప్పుడు నేను చెప్పబోయే అనుభవాలు జరిగినప్పుడు ఇంత చిన్నవాటికి కూడ సాయిబాబా సహాయం చేస్తారా అనుకునేదాన్ని. కానీ ఆ తండ్రి ప్రేమకు అవధులు లేవని ఋజువు చేసారు.

నేను చాలాకాలం నుండి కీళ్ళనొప్పులతో బాధపడుతున్నాను. ఎన్ని మందులు వాడినా నొప్పులు తగ్గేవి కావు. అలాగే బాధపడుతూ ఉండేదాన్ని. బ్లాగులో సాయిభక్తులందరి అనుభవాలు చదివాక, నేను నా కీళ్ళనొప్పులకు బాబా ఊదీనే ఔషదమని నమ్మి, బాబాను ప్రార్థించి ఊదీ రాసుకున్నాను. బాబా ఊదీ ప్రభావంతో నా కీళ్ళనొప్పులు తగ్గిపోయాయి. ఇప్పుడు నేను హాయిగా పనిచేసుకోగలుగుతున్నాను. అంతా బాబా అనుగ్రహమే!

ఇంకొక అనుభవం: 

ఒకసారి మా చిన్నమనవడికి స్కిన్ ఎలర్జీ వచ్చింది. మేమంతా అది అమ్మవారు(చికెన్ పాక్స్) అనుకుని ఆ జాగ్రత్తలలో ఉన్నాము. కానీ ఎటువంటి ఉపశమనం కన్పించలేదు. దాంతో నేను బాబా ఊదీతోనే ఇది తగ్గుతుందని భావించి, బాబాను ప్రార్థించి, మా మనవడి ఒళ్ళంతా ఊదీ రాసి, కొద్దిగా ఊదీని నీళ్ళల్లో కలిపి త్రాగించాను. ఊదీ ప్రభావంతో రెండు రోజులలోనే ఆ ఎలర్జీ తగ్గిపోయింది. తర్వాత వాడు హాయిగా ఉన్నాడు. ఇదంతా సాయినాథుడి ఆశీర్వాదమే. "ధన్యవాదాలు బాబా! ఇలాగే ఎప్పుడూ మాకు అండగా ఉంటూ అన్ని విషయాలలోనూ మమ్మల్ని కాపాడాల"ని వేడుకుంటున్నాను. 

ఓం శ్రీ సాయినాథాయనమః.

సాయిబాబా ఇచ్చిన చక్కటి దర్శనం, అనుభవాలు

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

నేను బాబాకు చిన్న భక్తురాలిని. ఆయన నాకు చాలా అనుభవాలను ప్రసాదించి నన్ను ఆశీర్వదించారు. గత రెండు సంవత్సరాల నుండి నేను ప్రతి సంవత్సరం మే నెలలో శిరిడీ దర్శించడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ సంవత్సరం కూడా మే నెలలో వెళ్లేలా ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకున్నాను. ప్రయాణ తేదీ సమీపిస్తున్న తరుణంలో నా నెలసరి కూడా ఇంచుమించు అదే తేదీలో ఉన్నట్లు నేను గమనించాను. దాంతో బాబా దర్శనభాగ్యాన్ని కోల్పోతానేమోనని చాలా భయపడ్డాను. వాస్తవానికి నా భర్త తను లేకుండా నన్ను పంపడానికి ఇష్టపడరు. కానీ మొట్టమొదటిసారి నా సోదరితో కలిసి వెళ్ళడానికి ఒప్పుకున్నారు. అలాంటిది ఇప్పుడు నా ప్రయాణానికి అంతరాయం ఏర్పడితే మళ్ళీ నేను శిరిడీ ఎప్పుడు వెళ్ళగలుగుతానో ఏమిటో అని ఆందోళనపడి, 'ఎలాగైనా నా నెలసరి వాయిదాపడేలా చేయమ'ని మనస్సులోనే బాబాను ప్రార్థించాను. ఇక శిరిడీ ప్రయాణమయ్యేరోజు రానే వచ్చింది. మేము శిరిడీ చేరుకున్నాము. బాబా చక్కటి దర్శనాన్ని, ఆరతిని అనుగ్రహించారు. ఇంకో ముఖ్యవిషయం, బాబా నీలిరంగు దుస్తుల్లో దర్శనం ఇచ్చారు. ఇందులో ఏముంది అనుకుంటారేమో! ఆరోజు నేను అదే రంగు దుస్తులు ధరించాను. దర్శనానికి వెళ్లేముందు, 'బాబా కూడా ఇదే రంగు దుస్తులలో దర్శనమిస్తారా?' అని అనుకున్నాను. అలా బాబా నా కోరిక మన్నించి, నన్ను ఆశీర్వదించి నా మనసుకు చాలా ఆనందాన్నిచ్చారు.

ఇక మేము తిరుగు ప్రయాణమవ్వాల్సిన సమయం వచ్చింది. కానీ ఏదో లోపం కారణంగా మా ఫ్లైట్ రద్దయింది. బాబా దయవల్ల మరుసటిరోజు ప్రయాణమవడానికి విమానయాన సంస్థ తగిన ఏర్పాట్లు చేసింది. మేము విమానయాన సంస్థ ఏర్పాటు చేసిన హోటల్ గదికి వెళితే అక్కడ సాయిబాబా ఫోటో దర్శనమిచ్చింది. ఆరోజు కూడా మేము శిరిడీలో ఉండేలా బాబా చేసినందుకు మేము చాలా చాలా సంతోషించాము. సచ్చరిత్రలో పేర్కొన్నట్లు బాబా అనుమతి లేకుండా మనం శిరిడీకి వెళ్ళలేము, అదేవిధంగా ఆయన అనుమతి లేకుండా తిరిగి రాలేము. ఫ్లైట్ రద్దు కాకుండా ఉన్నట్లైతే మేము కనెక్టింగ్ ఫ్లైట్ కోసం మధ్యలో వేచి ఉండాల్సి వచ్చేది. కానీ ఆ అవసరం లేకుండా నేరుగా వెళ్లేలా బాబా ఏర్పాటు చేశారు. "ఏ సమస్యలు లేకుండా చక్కటి దర్శనాన్ని, మంచి అనుభవాలను ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా! నా బిడ్డని, భర్తని, మొత్తం నా కుటుంబాన్ని దయచేసి ఆశీర్వదించండి. మేము మా సమస్యలన్నింటినీ మీ పాదాల వద్ద సమర్పిస్తున్నాము. మాకు సరైన మార్గనిర్దేశం చేసి ముందుకు నడిపించండి బాబా!".


సాయిభక్తుల అనుభవమాలిక 295వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. పెద్దప్రమాదం నుండి కాపాడిన బాబా
  2. సాయి సందేశం - కలలో మార్గనిర్దేశం

పెద్దప్రమాదం నుండి కాపాడిన బాబా

అనంతపురం జిల్లా తాడిపత్రి నుండి సాయిభక్తుడు వెంకటరాముడు 2020, జనవరి 1న తనను, తనతోపాటు మరో వ్యక్తిని బాబా పెద్ద ప్రమాదం నుండి కాపాడిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

జనవరి 1వ తారీఖున మాకు తెలిసినవాళ్ళు శిరిడీ ప్రసాదాన్ని మాకిచ్చి, మా యింటి దగ్గరలో ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వమని చెప్పారు. క్రొత్త సంవత్సరం ఆరంభమవుతూనే బాబా ఆశీస్సులు ప్రసాదం రూపంలో మాకు లభించాయని మేము చాలా సంతోషించాము. నేను ఆ ప్రసాదాన్ని తీసుకొని బైక్ మీద బయలుదేరాను. నేను రోడ్డు దాటుతున్న సమయంలో వ్యతిరేకదిశలో ఒకతను మోటార్ సైకిల్ మీద సుమారు 65, 70 కిలోమీటర్ల వేగంలో వస్తూ సడన్‌గా నన్ను చూసి వేగాన్ని నియంత్రించుకోలేకపోయాడు. దాంతో పట్టుతప్పి బైక్ మీద నుంచి కిందపడిపోయాడు. బైక్ దాదాపు ఎనిమిది అడుగుల దూరం నుంచి జారుకుంటూ వచ్చి నేను కాలు పెట్టుకున్న ఫుట్‌రెస్ట్‌కు వచ్చి బలంగా గుద్దుకొని ఆగింది. అంత బలంగా గుద్దుకున్నప్పటికీ నా కాలికి చిన్న గీత కూడా కాలేదు. నిజంగా ఇది బాబా నాకు చేసిన పెద్ద సహాయం. ఒకవేళ ఆయన దయ చూపకుంటే నా పాదం విరిగిపోయి ఉండేది. బాబా నన్నే కాదు ఆ బైక్ పై ఉన్న అతనిని కూడా కాపాడారు. అతనికి పెద్ద అపాయమేమీ కాకుండా చిన్న ఫ్రాక్చర్ మాత్రమే అయింది. సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అవతలివాళ్ళు, చుట్టుపక్కలవాళ్ళు ప్రమాదానికి కారణమైనవాళ్ళని నానా మాటలంటారు. కానీ నా విషయంలో ప్రమాదానికి గురైన అతనుగాని, చుట్టుపక్కలవాళ్లుగాని ఒక్క మాట కూడా అనలేదు. ఇదంతా సాయికి నాపై ఉన్న ప్రేమ వలనే. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! మీ మేలు మరువలేనిది. ఎప్పటికీ మీ ప్రేమని ఇలాగే నాపై  చూపిస్తూ ఉండండి బాబా!"
   
జై సాయిరామ్! జై జై సాయిరామ్!!

సాయి సందేశం - కలలో మార్గనిర్దేశం

పేరు వెల్లడించని సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

సాయి ప్రేమను పంచుతున్న భక్తులకు మరియు బ్లాగ్ నిర్వహిస్తున్న వారికి నా ధన్యవాదాలు. "నేను నా అనుభవాన్ని ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి సాయీ!" 

నేను పొత్తికడుపులో సమస్యతో బాధపడుతున్నాను. ఆ విషయమై నేను సాయిని ప్రార్థించి క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్‌లో అడిగితే, "దానం చేయండి. మీ సమస్య త్వరగా పరిష్కరించబడుతుంది" అని వచ్చింది. నేను సాధారణంగా ప్రతి గురువారం సాయిమందిరానికి వెళ్ళినప్పుడు దానం చేస్తుంటాను, కాబట్టి దానికంటే అదనంగా దానం చేయాల్సిన అవసరం ఉందని నేను గ్రహించాను. అయితే, 'మందిరంలో దానం చేయాలా? లేక వేరే ఎక్కడైనా చేయాలా?' అన్న అయోమయంలో పడ్డాను. దాంతో 'నాకు మార్గనిర్దేశం చేయమ'ని సాయిని ప్రార్థించాను.

ఆ రాత్రి నాకొక కల వచ్చింది. కలలో కొంతమంది పిల్లలు ఉన్నారు, నేను వాళ్ళకి డబ్బులు దానం చేస్తున్నాను. కానీ సమస్య ఏమిటంటే, నేనెప్పుడూ సాయిమందిరం వద్ద పిల్లల్ని చూడలేదు. పిల్లలు డబ్బులు అడుగుతున్నట్లు నేను చూసిన ఏకైక ప్రదేశం మార్కెట్లో ఉన్న దుర్గగుడి. అదికూడా మంగళవారం సూర్యాస్తమయం తరువాత మాత్రమే వాళ్ళని అక్కడ చూశాను. మిగతా రోజుల్లో వాళ్ళు మార్కెట్లో అక్కడక్కడా కనిపిస్తుంటారు. కానీ కలలో పిల్లలంతా ఒకేచోట ఉండటం చూశాను. ఏదేమైనా నేను సూర్యాస్తమయానికన్నా ముందుగా సాయిమందిరానికే వెళ్ళాను. నేను ఆశ్చర్యపోయేలా మందిరం దగ్గర నాకు ఒక అద్భుతం ఎదురైంది. దాదాపు 5 సంవత్సరాలుగా నేను క్రమంతప్పకుండా ఆ మందిరానికి వెళ్తున్నాను. అంతకాలంలో ఒక్కసారి కూడా నేను డబ్బులు అడుగుతున్న పిల్లల్ని ఆ మందిరం వద్ద చూడలేదు. కానీ ఆరోజు ముగ్గురు పిల్లలు డబ్బులు అడుగుతుండటం నేను మొదటిసారి చూశాను. నేను వాళ్లకు డబ్బులు దానం చేశాను. ఆ సమయంలో నేను చెప్పిన మార్కెట్‌కు వెళ్లినా చాలా కష్టమయ్యేది. కానీ నా సాయి నాకు సహాయం చేశారు. శ్రమపడకుండా సాయి నా సమస్యను పరిష్కరించారు. ముఖ్యమైన విషయమేమిటంటే, సాయి నాకు సందేశాన్ని ఇవ్వడమే కాకుండా కలలో మార్గనిర్దేశం కూడా చేశారు. సాయి మనకు మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు, కానీ ఆ సంకేతాలను మనం అర్థం చేసుకోలేము. మనం స్వార్థపరులం, కానీ దయ కలిగి ఉన్నామని అనుకుంటాము. నిజంగా మనం సాయి ఆశీస్సులు పొందాలనుకుంటే మనల్ని మనం మార్చుకోవాలి. ఇతరులకు సహాయం చేయడానికి త్యాగం చేయవలసి వచ్చినా కూడా సహాయం చేయాలి. చెడు ఆలోచనలను, ప్రతికూల ఆలోచనలను వదిలిపెట్టి ప్రేమను వ్యాప్తి చేద్దాం.

ఓం సాయిరామ్!

source: http://www.shirdisaibabaexperiences.org/2019/10/shirdi-sai-baba-miracles-part-2520.html


సాయిభక్తుల అనుభవమాలిక 294వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సర్టిఫికేషన్ పూర్తి చేసేలా బాబా అనుగ్రహించారు
  2. నా భార్య ఉద్యోగ విషయంలో బాబా ఆశీస్సులు

సర్టిఫికేషన్ పూర్తి చేసేలా బాబా అనుగ్రహించారు

హైదరాబాదు నుండి బుసిరెడ్డి రఘునాథరెడ్డి గారు తమకు జరిగిన మరో అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

జై సాయిరాం! నా పేరు రఘునాథరెడ్డి. నేను సాయిభక్తుడ్ని. నేను మహాపారాయణ (MP-1589) గ్రూపులోని సభ్యుడిని. ముందుగా ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. ప్రతిరోజూ బ్లాగులోని సాయిభక్తుల అనుభవాలను చదవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సాయిభక్తులు తమ అనుభవాలను పంచుకునేందుకు ఇంత చక్కటి అవకాశం కల్పిస్తున్నందుకు మీకు అనేక ధన్యవాదాలు. సాయిదేవుని అసంఖ్యాక లీలల్ని మీ ద్వారా మేము తెలుసుకోగలుగుతున్నాము. ఇదివరకు ఈ బ్లాగు ద్వారా మీతో కొన్ని అనుభవాలను పంచుకున్నాను. నేనిప్పుడు ఇటీవల జరిగిన ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకుంటాను.

నేను ఉద్యోగరీత్యా ఒక ట్రైనింగ్‌కి అటెండ్ అయ్యాను. ఆ ట్రైనింగ్ విజయవంతంగా పూర్తిచేయాలంటే ఒక నెలలో సర్టిఫికేషన్ కూడా పూర్తి చేయాలి. అయితే ట్రైనింగ్ పూర్తైయ్యేసరికి నేను సంవత్సరాంతపు సెలవులలో ఉంటాను. అందువలన సర్టిఫికేషన్‌కి ఎలా ప్రిపేరవ్వాలని చాలా ఆందోళనపడి, "సర్టిఫికేషన్ పూర్తి చేసేలా అనుగ్రహించమ"ని బాబాను ప్రార్థించాను. అంతేకాకుండా "సర్టిఫికేషన్ పూర్తయితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు మ్రొక్కుకున్నాను. సెలవుల నుంచి వచ్చాక కేవలం రెండురోజుల్లో ప్రిపేరై బాబా మీద నమ్మకముంచి సర్టిఫికేషన్ పరీక్ష వ్రాసి, విజయవంతంగా సర్టిఫికేషన్ పూర్తి చేశాను. కేవలం రెండురోజుల ప్రిపరేషన్ తో నా సర్టిఫికేషన్ పూర్తయ్యేది కాదు. నా సాయి కృపవలనే ఇది సాధ్యమైంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీరు ఖచ్చితంగా మా కోరికలు నెరవేరుస్తారని, మాకున్న మిగిలిన సమస్యలను కూడా ఇలాగే తీరుస్తారని నా దృఢమైన నమ్మకం. ఎల్లవేళలా మా కుటుంబాన్ని ఇలాగే రక్షిస్తూ ఉండండి బాబా. మీ చల్లని చేతులు మా శిరస్సుపై ఉంచి మాకు మార్గనిర్దేశం చెయ్యండి. నా జీవితంలోని ప్రతి కదలికలో మీరు సదా నా వెన్నంటి ఉండాలని మనసారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీ నామస్మరణ మరచిపోకుండా ఉండేలా నాకు సహాయం చెయ్యండి. శతకోటి ప్రణామాలు బాబా!"

ఓం సాయిరామ్!

సర్వేజనాః సుఖినోభవంతు.

నా భార్య ఉద్యోగ విషయంలో బాబా ఆశీస్సులు

USA నుండి అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

నేను సాయిబాబా భక్తుడిని. నేను నా భార్యతో యు.ఎస్.ఏ లో నివసిస్తున్నాను. నా భార్యకి మొదట్లో హెచ్4 వీసా ఉండేది. తను ఇంట్లో ఖాళీగా ఉండటంతో విసుగుచెంది ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుని కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌ నేర్చుకోవడం మొదలుపెట్టింది. తనకి కంప్యూటర్ నేపథ్యం ఏమీ లేకపోయినప్పటికీ బాబా దయతో తను ఆ కోర్సు పూర్తిచేసి ఇంటర్వ్యూలకు హాజరవడం మొదలుపెట్టింది. బాబా ఆశీస్సులతో ఒక కాంట్రాక్టు ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూను విజయవంతంగా పూర్తి చేసింది కూడా. అయితే సమస్య ఏమిటంటే, ఉద్యోగం చేయాల్సింది వేరే స్టేట్ లో. తను వేరే రాష్ట్రానికి వెళ్లలేనని, ఇంటినుంచి పనిచేసే అవకాశం గురించి ఉద్యోగ నియామక అధికారితో చర్చించింది. వాళ్ళు తనని 3, 4 వారాలపాటు ఆఫీసుకొచ్చి పనిచేయమని, ఆ తరువాత ఇంటినుండి పనిచేసే వీలు గురించి చర్చించవచ్చని చెప్పారు.

నా భార్యకు ఐటి పరిశ్రమలో మొదటిసారి వచ్చిన ఉద్యోగ అవకాశం కాబట్టి మేము వదులుకోదలుచుకోలేదు. అందువలన మేము 3 వారాలపాటు వస్తాము, 3 వారాల తర్వాత ఇంటినుంచి పని చేస్తామని వాళ్లతో చెప్పాము. కానీ తనకిది మొదటి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కనుక కష్టంగా ఉంటుందని భావించాము. తను చేసే మొదటి 3 వారాలు తన పనితీరును బట్టి, మిగతావాళ్లంతా ఆన్‌సైట్‌లో చేసే విధంగా తను ఇంటినుంచి చేయగలదా, లేదా అని వారు నిర్ణయిస్తారు. దాన్నిబట్టి మేము కోరుకునే అవకాశం మాకు లభిస్తుంది. అందువలన నేను ఆందోళనపడుతూ, "బాబా! 3 వారాలు ఆన్‌సైట్‌లో పనిచేసిన తర్వాత నా భార్యకు ఇంటినుండి పనిచేసే అవకాశం వస్తే, సచ్చరిత్ర 7 రోజులు పారాయణ చేస్తాను. నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. కృపతో సాయిబాబా నా కోరికను నెరవేర్చారు. నా భార్యకు ఇంటినుండి పనిచేసే అవకాశం వచ్చింది.

"సాయిబాబా! దయచేసి ఆమెను ఆశీర్వదించండి. మీ ఆశీస్సులుంటే ఆమె తన ఉద్యోగంలో బాగా రాణిస్తుంది. తద్వారా ఆమె కాంట్రాక్టు పొడిగించబడుతుంది. చాలా చాలా ధన్యవాదాలు సాయిబాబా! దయచేసి మా అందరినీ ఆశీర్వదించండి".

ఓంసాయి నమో నమః
శ్రీసాయి నమో నమః
జయజయ సాయి నమో నమః
సద్గురు సాయి నమో నమః

source: http://www.shirdisaibabaexperiences.org/2019/10/shirdi-sai-baba-miracles-part-2517.html


శ్రీరఘువీర్ భాస్కర్ పురందరే - ఐదవ భాగం


పురందరే ఎప్పుడు శిరిడీ వెళ్లినా బాబా అతని కుటుంబసభ్యులందరి గురించి ఆరా తీసేవారు. తరువాత బాబా అతనిని ప్రత్యేకంగా దక్షిణ అడిగేవారు. అంతేకాక‌, "నాకోసం తినడానికి ఏం తెచ్చావు?" అని కూడా అడుగుతుండేవారు. ఎందుకంటే, పురందరే భార్య ఎప్పుడూ బాబాకు నివేదించడం కోసం ఏదో ఒకటి పంపుతుండేది. పురందరే ఇంటికి తిరిగి వెళ్లాలనుకున్నప్పుడు బాబా అతనితో ఇలా అనేవారు: "భావూ! రెండు మూడురోజుల తరువాత తిరిగి ఇక్కడికి రా! కొద్దిసేపు నాతో మాట్లాడి, తర్వాత వెళ్ళు. నువ్వు ఇక్కడే ఉన్నా నాకేం అభ్యంతరం లేదు. వెళ్ళు, భయపడవద్దు. అల్లా మాలిక్ హై! నేను నీతోనే ఉన్నాను" అని అనేవారు. కానీ పురందరే బయలుదేరే చివరిక్షణంలో "వెళ్లవద్ద"ని అనేవారు. అతను తన సామానంతా గుర్రపుబండిలో సర్దుకొని కూడా బాబా నుండి పూర్తి అనుమతి వచ్చేవరకు వేచి చూసేవాడు.

ఒకరోజు పురందరే బాబా వద్ద కూర్చుని ఆయన పాదాలు ఒత్తుతూ ఉన్నాడు. బాబా పురందరేను దక్షిణ ఇమ్మని అడిగారు. "నా వద్ద డబ్బేమీ లేదు బాబా!" అని బదులిచ్చాడు పురందరే. ఆ సమయంలో అక్కడే ఉన్న పురందరే భార్య వెంటనే వాడాకు వెళ్లి, అంతకుమునుపు లక్ష్మీపూజలో వచ్చిన డబ్బంతా తీసుకొచ్చి బాబా పాదాల వద్ద ఉంచింది. అప్పుడు బాబా సరదాగా, "డబ్బంతా నాకు ఇచ్చేశావు. ఇతను(పురందరే) నిన్నిప్పుడు కొడతాడులే" అన్నారు. దానికామె, "లేదు బాబా! ఆయన ఎన్నటికీ అలా చేయరు. ఈ డబ్బును నేను ఇంకెవరికైనా ఇచ్చినా సరే ఆయనకు కోపం రాదు. పైగా నేను డబ్బు ఇచ్చింది మీకు. ఇంత మంచిపని చేసినందుకు ఆయన చాలా సంతోషిస్తారు" అని బదులిచ్చింది. అప్పుడు బాబా సంతోషంగా, "సరే, సరే, అల్లా చూసుకుంటారు. ఇలాంటి భర్త లభించినందుకు నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. నా మాటలు గుర్తుంచుకో! ఇతనిని ఎప్పుడూ నొప్పించవద్దు. ఇతను నావాడు" అన్నారు. వెంటనే, "మరి నేను బాబా?" అని అడిగింది పురందరే భార్య. అప్పుడు బాబా, "నువ్వు కూడా నా బిడ్డవే. నీకు ఏ లోటూ లేకుండా నేను చూసుకుంటాను. నీకు దేనికీ కొరత ఉండదు. ఎప్పుడూ ఉదారస్వభావంతో ఉండు. అప్పుడు అల్లా సంతోషిస్తాడు. అల్లాయే రక్షకుడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన కంటే మిన్న ఏదీ లేదు" అన్నారు. తర్వాత బాబా వారిద్దరికీ ఊదీ ఇచ్చి ఆశీర్వదించి, ఇంటికి వెళ్ళడానికి అనుమతినిచ్చారు.

ఒకసారి పురందరే భార్య ప్రసవానికి ముందు అనారోగ్యానికి గురైంది. అప్పుడు ఆమెకు కలలో బాబా దర్శనమిచ్చి ఊదీ రాశారు. తరువాత ఆమెకు ఆరోగ్యం చేకూరింది. ఆ విధంగా ఆమెకు ఎన్నోసార్లు బాబా దర్శనమిచ్చేవారు.

ఒకసారి బాబా పురందరేతో అతని వద్ద ఉన్న పాత రాగినాణాలన్నీ తమకు ఇవ్వమన్నారు. వెంటనే అతను తన వద్ద ఉన్నవన్నీ తెచ్చి ఆయనకిచ్చాడు. వాటిని బాబా ఏమి చేశారో అతడు గమనించలేదు. కానీ బాబా తమ వద్ద ఉన్న నాణాలన్నీ శబ్దం చేయకుండా ఒక గుడ్డలో చక్కగా కట్టి తమ పక్కజేబులో ఉంచుకొనేవారు. ఒకసారి బాబా పురందరేను దక్షిణ ఇవ్వమని అడిగారు. వెంటనే అతడు తన వద్ద ఉన్నదంతా ఆయనకు ఇచ్చాడు. అతడు ఇక తనవద్ద డబ్బులు లేవని అనుకోగానే బాబా, "నీ జేబులో ఇంకా రెండు అణాలు ఉన్నాయి, చూడు!" అన్నారు. చూస్తే, నిజంగానే అతని జేబులో రెండు  అణాలున్నాయి. వాటిని అతడు బాబాకు సమర్పించాడు.

పురందరే రైల్వే వర్క్‌షాపులో పనిచేస్తుండేవాడు. ఒకసారి అతను శిరిడీ వెళ్లాలని నిర్ణయించుకొని రైల్వే పాసులు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆ సమయంలో వర్క్‌షాపులో కొన్ని అల్లర్లు జరిగే అవకాశం ఉన్నందున అతని పైఅధికారి అతన్ని వెళ్లవద్దని చెప్పి, ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే తాజాగా మళ్ళీ పాసులు ఇస్తానని మాట ఇచ్చాడు. అయితే పురందరే బాబాని చూడాలని చాలా ఆతృతగా ఉన్నాడు. అందువలన తాను అనుకున్నట్లు శిరిడీ వెళ్ళడానికే నిర్ణయించుకొని ఆ రాత్రి నిద్రపోయాడు. తెల్లవారుఝామున అతనికొక కల వచ్చింది. కలలో బాబా చేతిలో సటకా పట్టుకొని కోపంగా అతని మీదకు పరుగెత్తుకుంటూ వచ్చి సటకాను చూపిస్తూ, "బుద్ధిగా ఉండు! నువ్వు రావద్దు. వచ్చావో కొడతాను జాగ్రత్త! మాటిమాటికీ ఎందుకిక్కడికి వస్తావు? నీవెక్కడున్నా నేనెప్పుడూ నీతోనే ఉన్నాను. నేను ఎప్పటికీ నీ నుండి దూరంగా వెళ్ళను. మూర్ఖుడిలా ఉండకు, అర్థం చేసుకో" అని అన్నారు. దాంతో అతను తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాడు.


మరుసటిరోజు రైల్వే వర్క్‌షాపులో సమ్మెకు పిలుపునిచ్చారు. ముందు అనుకున్నట్లుగా అతను శిరిడీ వెళ్ళివుంటే, సమ్మెలో అతనికి కూడా భాగముందని అధికారులు అనుమానించి అతనిపై చర్య తీసుకొనే అవకాశముండేది. అటువంటిదేమీ జరగకుండా బాబా రక్షించారు. ఆ సమ్మె కారణంగా పురందరే నెలరోజుల వరకు శిరిడీ వెళ్ళలేకపోయాడు. ఆ తరువాత అతను శిరిడీ వెళ్ళినప్పుడు బాబా అతనితో, "భావూ, ఇక్కడకు రావడానికి ఎందుకంత ఆరాటపడతావు? మనకు చాలా పనులున్నాయి. నీవు ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉంటూ నా నామాన్ని స్మరించు. నేను నీ దగ్గరే ఉంటాను. సరే! నీతో ఇంకెవరు వచ్చారు?" అని అన్నారు. "ఎవరూ లేరు బాబా, నేను ఒక్కడినే వచ్చాను" అని అతను బదులిచ్చాడు. అప్పుడు బాబా, "మరి ఎన్ని రోజులుంటావు?" అని అడిగారు. అందుకతను, "మీరు అనుమతించేవరకు నేను ఇక్కడే ఉంటాను" అని అన్నాడు. ఇలా నాలుగు రోజులు గడిచాక ఐదవరోజు బాబా అతను వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. అతను బాబా పాదాలపై పడి కన్నీళ్లు పెట్టుకున్నాడు. బాబా, "అరే భావూ, ఎందుకు భయపడుతున్నావు? నువ్వు రెండుచోట్లా ఉండాలి. ఇక్కడా, అక్కడ నీ ఉద్యోగంలో కూడా. చింతించకు, నీ పని నువ్వు చెయ్యి. అల్లా నిన్ను చూసుకుంటాడు" అని అతనిని ఓదార్చారు. బాబా మాటలతో ఊరట చెంది, తను చేస్తున్న సేవను కొనసాగించాడు పురందరే.

ఒకసారి ముంబాయి వెళ్ళడానికి బాబాను అనుమతి కోరాడు పురందరే. కోపర్గాఁవ్ నుండి మన్మాడుకు చివరి రైలు సాయంత్రం 6.30 గంటలకు ఉంది. కానీ సాయంత్రం 4.30 దాటినా బాబా అనుమతి ఇవ్వలేదు. తరువాత అతనికి అనుమతినిస్తూ రేగేను తోడుగా పంపారు. ఇద్దరూ ఎండ్లబండిలో బయలుదేరారు. వాళ్ళు గోదావరి నది వద్దకు చేరుకునేసరికి 6.45 అయింది. అక్కడినుండి కోపర్గాఁవ్ స్టేషన్ చేరేసరికి 7.45 అయింది. అప్పటికే రైలు వెళ్లిపోయి ఉండటంతో 'ఆ రైలు అందదని తెలిసి కూడా బాబా మమ్మల్ని ఎందుకు ప్రయాణం చేయించారో' అనుకున్నారు. కానీ నాటి రాత్రి ప్రత్యేక రైలు ఉంది. అది 8.15 కి కోపర్గాఁవ్ వచ్చింది. ఆ రైలెక్కి మన్మాడ్ చేరుకుని‌, అక్కడినుండి వేరే రైలెక్కి ఇద్దరూ తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. ఆ రోజుల్లో సాయంత్రం 6.30 తరువాత కోపర్గాఁవ్ నుండి మన్మాడుకు రైళ్లు ఉండేవి కావు. కానీ బాబా ఆశీస్సుల వలన వారికి ప్రత్యేక రైలు దొరికి, క్షేమంగా వారి వారి ఇళ్లకు చేరుకున్నారు.

బాబా తమ భక్తులను ధనం, బంగారం వంటి విషయాలలో ఆకర్షింపబడతారో లేదోనని పరీక్షించేవారు. ఒకసారి బాబా పురందరేను తమతోపాటు లెండీబాగ్‌కి తీసుకొని వెళ్లారు. ప్రక్కనే ఉన్న లెండీ వాగు వద్దకు వెళ్ళాక, బాబా ఆ వాగులో ఉన్న మూడు బంగారు పలకలను అతనికి చూపించి, వాటిని తీసుకోమని చెప్పారు. పేదవాడైనప్పటికీ, పురందరే వాటిపై పెద్దగా ఆసక్తి చూపలేదు, చూడటానికి కూడా కూడా ఇష్టపడలేదు. అంతేకాదు, అసలు ఏమాత్రం చలించలేదు. అందుకే అతను ఆధ్యాత్మికంగా వృద్ధి చెందాడు.

బాబా లీలావిశేషంతో ఆహారం అందరికీ సరిపోగా ఇంకా చాలా మిగిలింది.

ఒకసారి గుడ్ ఫ్రైడే సెలవులలో పురందరే తన కుటుంబంతో శిరిడీ వెళ్ళాడు. ఒకరోజు బాబా పురందరేతో, "భావూ, నేను ఈరోజు భోజనానికి మీ ఇంటికి వస్తాను" అన్నారు. ఆ సమయంలో అతని కూతురు బాబీ అనారోగ్యంతో బాధపడుతోంది. "ఇంకెవరినైనా ఆహ్వానించమంటారా బాబా?" అని అడిగాడు పురందరే. అందుకు బాబా, "నీ కూతురి ఆరోగ్యం బాగాలేదు కదా, అందువల్ల ఎక్కువమంది వద్దులే! మనిద్దరితోపాటు ఇద్దరు ముగ్గురు ఫకీర్లను మాత్రమే పిలువు" అన్నారు. అందుకతను, "సరే బాబా, మరి భోజనానికి ఏమి సిద్ధం చేయించమంటారు?" అని అడిగాడు. అందుకు బాబా, "ఖిచిడీ, రవ్వ కేసరి, అన్నం, ఒక కూర చాలు!" అన్నారు. బాబా మాట ప్రకారమే అతడు తన భార్యను వంటలు తయారుచేయమని  చెప్పాడు. బాబా స్వయంగా తమ ఇంటికి భోజనానికి వస్తున్నందుకు ఆమె చాలా సంతోషించింది. వంట మొదలుపెట్టడానికి ముందు అనారోగ్యంతో ఉన్న తన కూతురు బాబీని తీసుకొని బాబా దర్శనానికి వెళ్ళింది. బాబా ఆమెకు ఊదీ ఇచ్చి ఆశీర్వదించి పంపారు. 

ఆమె బసకు వచ్చి ముందుగా అనుకున్నంతమందికి సరిపడా వంట వండింది. పురందరే ఆ వంటకాలను భోజనాలు వడ్డించే చోట సిద్ధంగా పెట్టాడు. అప్పుడే ఐదారుగురు ఫకీర్లు వచ్చారు. వాళ్ళకు భోజనం వడ్డించాడు పురందరే. వాళ్ళంతా భోంచేసి వెళ్తూ, "ఇంకా చాలామంది వస్తున్నారు. బాబా మా అందరినీ మీ ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించారు" అని చెప్పారు. అది విన్న పురందరే వండిన పదార్థాలు అందరికీ సరిపోవేమోనని కంగారుపడ్డాడు. వాళ్ళు చెప్పినట్లుగానే కాసేపట్లో ఇరవై మంది ఫకీర్లు వచ్చారు. వాళ్ళందరికీ పురందరే భోజనం వడ్డించాడు. వాళ్ళు భోంచేసి వెళ్ళాక మరో పదిమంది ఫకీర్లు వచ్చి భోంచేశారు. అంతమంది వచ్చినప్పటికీ బాబా అనుగ్రహం వల్ల వండిన ఆహారపదార్థాలు అందరికీ సరిపోవటమే కాక ఇంకా మిగిలిపోయాయి కూడా. తరువాత పురందరే మశీదుకు వెళ్ళాడు. బాబా ఆ సమయంలో ఫకీర్‌బాబాతో మాట్లాడుతూ ఉన్నారు. పురందరే బాబాకి నమస్కరించి భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. బాబా నవ్వి, "నేను కడుపునిండా తృప్తిగా భోంచేశాను. నువ్వు ఇంటికి వెళ్లి బాలాషింపీతో కలిసి భోంజనం చెయ్యి" అన్నారు. పురందరే బాబాకు దక్షిణ, తాంబూలం సమర్పించి ఇంటికి వెళ్లి, బాలాషింపీ (పురందరే ఎప్పుడు శిరిడీ వెళ్లినా బాలాషింపీ ఇంటిలో బస చేసేవాడు.) కుటుంబసభ్యులతోను, తన కుటుంబసభ్యులతోను కలిసి భోజనం చేశాడు. వాళ్లంతా తిన్న తరువాత కూడా ఆహారపదార్థాలు మిగిలే ఉన్నాయి. తరువాత బాలాషింపీ ద్వారకామాయికి వెళ్ళాడు. బాబా అతనితో, "ఏం బాలా? వచ్చిన వారందరికీ ఆహారం సరిపోయిందా?" అని అడిగారు. అప్పుడతను, "బాబా! మాలాంటి పేదవారిని మీరెందుకు పరీక్షిస్తారు? మీరు ఇద్దరు ముగ్గురు ఫకీర్లు వస్తారని చెప్పారు. కానీ వచ్చినవాళ్ళు ముప్ఫైమందికి పైగానే ఉన్నారు. కానీ అపారమైన మీ లీలావిశేషంతో ఆహారం మా అందరికీ సరిపోయింది. ఇంకా చాలా మిగిలిపోయింది కూడా" అని అన్నాడు. అప్పుడు బాబా నవ్వుతూ, "అల్లా అందరినీ చూసుకుంటాడు. చూడు! భావూ నా భక్తుడు. అతను అంతటి భారాన్ని మోయలేడని నాకు తెలుసు. మరి అతన్నెందుకు పరీక్షిస్తాను? నేను అతనికి సహాయం చేశాను. ఇది పరీక్ష కాదు. నా భక్తుడి ఆనందం కోసమే నేనిలా చేశాను" అని అన్నారు. బాబా చూపిన ప్రేమకి మాటలురాక మూగబోయాడు బాలాషింపీ. ఆ తరువాత పురందరే మరో మూడురోజులు శిరిడీలో ఉన్నాడు. ఆ మూడురోజుల పాటు ఆ ఆహారపదార్థాలు తిన్నప్పటికీ అవి ఇంకా మిగిలే ఉన్నాయి. వాళ్లంతా మిగిలిన ఆ ఆహారపదార్థాలను తీసుకొని సంతోషంగా ముంబాయికి తిరుగు ప్రయాణమయ్యారు. పురందరే ఆ ఆహారాన్ని తన స్నేహితులకు, బంధువులకు బాబా ప్రసాదంగా పంచి, బాబా చూపిన ఈ అద్భుతమైన లీలను అందరితో ఆనందంగా పంచుకున్నాడు.

బాబా తాము మహాసమాధి చెందడానికి పన్నెండు, పదిహేను రోజుల ముందు పురందరే, దీక్షిత్‌లతో, “నేను ముందు వెళ్తాను. మీరు నన్ను అనుసరిస్తారు. నా సమాధి మాట్లాడుతుంది. నా నామం పలుకుతుంది. నా మట్టి సమాధానమిస్తుంది” అని చెప్పి, వారిని ముంబాయి వెళ్లిపొమ్మని ఆదేశించారు బాబా. బాబా ఆదేశానుసారం వాళ్ళిద్దరూ ఎడ్లబండిలో బయలుదేరి వెళ్లిపోయారు. అంతకుమునుపు కూడా బాబా అవే మాటలు చెప్పారు, అందువలన బాబా మాటలలోని ఆంతర్యం వాళ్లకు బోధపడలేదు. పైగా అప్పటికి బాబాలో ఎలాంటి అనారోగ్య సూచనలు లేనందున బాబా దేహత్యాగం చేస్తారని వాళ్ళు ఊహించలేకపోయారు.

1918లో బాబా సమాధి చెందిన తరువాత, భక్తులు ఆధ్యాత్మిక విషయాలలో గాని, వ్యక్తిగత సమస్యలకు గాని నేరుగా బాబా సలహాను పొందే అవకాశాన్ని కోల్పోయారు. అయితే బాబాకు ప్రముఖ భక్తులైన కాకాసాహెబ్ దీక్షిత్, భావూసాహెబ్ ధుమాల్, పురందరే మొదలైన వారు క్లిష్టసమస్యలు ఎదురైనప్పుడు బాబా సలహాను పొందేందుకు ఆసక్తికరమైన పద్ధతిని ఉపయోగించారు. వాళ్ళు బాబా పటం ముందు రెండు చీటీలను (ఒకదాంట్లో అనుసరించమని, రెండవ దానిలో అనుసరించవద్దని వ్రాసేవారు.) ఉంచి ఒక చిన్నపిల్లవాడి చేతి ఆ చీటీల నుండి ఒకదాన్ని తీయించేవారు. అందులో వచ్చిన దాన్ని బాబా సలహాగా భావించి అందులో వచ్చినట్లు నడచుకునేవారు. అలా నడచుకున్నందువల్ల ఎల్లప్పుడూ మంచే జరిగేది, చాలాసార్లు ప్రమాదాల నుండి రక్షింపబడినట్లు ఋజువయ్యేది.

1920లో పురందరే భార్య ఇన్‌ఫ్లూయంజాతో తీవ్ర అనారోగ్యానికి గురై ప్రమాదస్థితికి చేరుకొంది. ఆమె రాబోయే ఉరుసు-రామనవమి ఉత్సవాలకు శిరిడీ వెళ్ళలేకపోతున్నందుకు బాధపడింది. ఆ రాత్రి ఆమెకు కలలో బాబా కనబడి, “బాధపడకు, నేను నిన్ను ఉరుసు ఉత్సవానికి తప్పక తీసుకెళతాను” అని హామీ ఇచ్చారు. మరునాటి ఉదయం ఆమె కొద్దిగా కోలుకొని, ఆ కల విషయం  పురందరేతో  చెప్పింది. కానీ ఆమె అనారోగ్యం అలాగే కొనసాగుతూ వచ్చింది. చివరకి శ్రీరామనవమినాడు ఆమె "బాబా, బాబా” అంటూ తుదిశ్వాస విడిచింది.

తాము సమాధి చెందిన తరువాత కూడా బాబా పురందరేకి కలలో దర్శనం ఇస్తుండేవారు. అలా ఒకసారి దర్శనం ఇచ్చినప్పుడు, "శిరిడీ వెళ్లి సంస్థాన్‌కు సంబంధించిన విధులలో పాలుపంచుకో"మని చెప్పారు బాబా. బాబా ఆదేశంతో అతను శిరిడీ చేరుకొని సాయిబాబా సంస్థాన్ సంయుక్త కోశాధికారిగా పనిచేస్తూ బాబా సేవలో నిమగ్నమయ్యాడు. ఆవిధంగా బాబా అతని రోజువారీ కార్యకలాపాలపై పూర్తి నియంత్రణ తీసుకున్నారు. కాకాసాహెబ్ దీక్షిత్‌కి సహకరించమని పురందరేను ఆదేశించారు, అదేవిధంగా పురందరేకు సహకరించమని కాకాసాహెబ్ దీక్షిత్‌ను ఆదేశించారు బాబా. బాబా ఆదేశానుసారం ఆ ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటూ మంచి సమన్వయంతో పనిచేస్తూ సంస్థాన్ కార్యకలాపాలను బాధ్యతాయుతంగా నిర్వర్తించారు.

1932లో పురందరే సయాటికా(నడుమునొప్పి), రుమాటిజం(వాతరోగం)లతో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతున్నాడు. యమదూతలు తనని సమీపిస్తున్న సమయంలో బాబా వచ్చి, అతని మంచంపై కూర్చొని, అతని చేతిని తమ మోకాలిపై ఉంచుకున్నారు. ఆ తరువాత అతడిని గాని, అతను పడుకున్న మంచాన్ని గాని యమదూతలు తాకనివ్వకుండా నిరోధించి అతన్ని రక్షించారు బాబా.

బాబా పురందరేకు చెప్పిన కొన్ని హిత వాక్యాలు

“ఎవరైతే ఈ మసీదులో అడుగిడతారో వాళ్ళు గమ్యాన్ని చేరుకుంటారు(జో కోయీ యే మజిద్ మే ఆవే, జికా మజిద్ మే పాయ్ లగా, ఉసాకా బేడా పార్ హాయ్), ఎవరి మంచితనం యెట్లా ఉంటే వారి అభివృద్ధి కూడా అట్లాగే ఉంటుంది (జైసీ జిస్ కీ నియత్, వైసీ ఉస్ కూ బర్కత్)" అనేవారు బాబా.

బాబా అప్పుడప్పుడు పురందరేతోను, ఇతర భక్తులతోను, “నావాడు వెయ్యిమైళ్ళ అవతల ఉన్నప్పటికీ (మరణించినప్పటికీ), పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు లాగి అతనిని నా వద్దకు చేర్చుకుంటాను” అని చెప్పేవారు. ఇంకా, "నావాడిని నా నుండి దూరంగా వెళ్ళడానికి అనుమతించను” అని కూడా చెప్పేవారు.

పురందరేకు కోపం ఎక్కువ, త్వరగా ఆవేశానికి లోనయ్యేవాడు. బాబా తరచూ అతనితో, "నిన్నెవరైనా దూషించినా, దండించినా వారితో గొడవకు దిగవద్దు. సహించలేకపోతే ఒకటి రెండు మాటలతో సమాధానమివ్వు, లేదంటే ఆ చోటు వీడి వెళ్ళిపో, అంతేగానీ వారితో పోట్లాడవద్దు(కిసీసే వాదావాదీ (బరోబరీ) కర్ నా నహీ). నువ్వు ఎవరితోనైనా తగవు పెట్టుకుంటే నాకు అసహ్యము, బాధ కలుగుతుంది" అని చెప్పేవారు. ఈ హితవాక్యాలు బాబా పురందరేతోనే కాక ఇతర భక్తులతోనూ అనేకసార్లు చెప్పేవారు.

పురందరే స్వయంగా చెప్పిన కొన్ని విషయాలు:

నేను కష్టాల్లో ఉన్నప్పుడు బాబా పటం ముందు కూర్చొని ఏడ్చేవాడిని. బాబా వెంటనే నా ముందు ప్రత్యక్షమై నన్ను ఓదార్చేవారు.

బాబా చాలామంది భక్తుల దగ్గరున్న డబ్బంతా తీసేసుకునేవారు. వారలా ఎందుకు చేసేవారో నాకు తెలియదు. కానీ కొందరు భక్తులు బాబాను అంత డబ్బు ఎందుకు తీసుకుంటారని అడిగినపుడు ఆయన, "నేనందరినీ అడగను. ఆ ఫకీరు(దేవుడు) ఎవరిని చూపిస్తారో వాళ్లనే అడుగుతాను. కానీ బదులుగా వాళ్ళకి నేను తీసుకున్న దానికి పదింతలు ఇవ్వవలసి ఉంటుంది. నేను నా స్వంతానికి ఏమీ తీసుకోను. నాకు ఏ సంసారమూ లేదు" అని బదులిచ్చేవారు. 

అద్వైతము మొదలైన వాటి గురించి బాబా మాట్లాడగా నేను ఎప్పుడూ వినలేదు. ఎల్లప్పుడూ “అల్లా రక్షిస్తాడు", "పేదలకు పెన్నిధి భగవంతుడు (గరీబ్ కో అల్లా వలీ హై, అల్లా అచ్ఛా కరేగా)” అని పలికేవారు. అన్ని జీవులలో తామున్నట్లు బాబా నాకెప్పుడూ చెప్పలేదు. కానీ వారు తరచుగా దైవంతో తాదాత్మ్యాన్ని చెంది ఉండేవారు. ప్రాణాయామం, కుండలిని మొదలైన సాధనల గూర్చి కూడా వారెప్పుడూ మాట్లాడలేదు. నేను కూడా వాటిని గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు.

బాబా ధ్యానం గురించి ఎప్పుడూ నాతో చెప్పలేదు. తమనే ప్రార్థించమని ఆయన ఎవ్వరితోనూ చెప్పలేదు. అందుకు బదులుగా, "అలవాటు ప్రకారం మీ మీ ఇష్టదేవతలని ఆరాధించండి" అని చెప్పేవారు. భక్తుడు ఏ దేవతలను ఆరాధించినా బాబా ఆయా రూపాలలో భక్తులకు దర్శనం ఇచ్చేవారు.

నా సమక్షంలో బాబా ఎప్పుడూ జీవితలక్ష్యం, ముక్తి, మోక్షం, కైలాసం, వైకుంఠం, స్వర్గం వంటి వాటి గురించి మాట్లాడలేదు. కానీ, ఒకసారి బాబా ఇలా అన్నారు: "నేను నా కాకాను విమానంలో తీసుకుపోతాను" అని. విమానంలో తీసుకెళ్ళడమంటే సద్గతినివ్వడమని. అట్లాగే 1926లో ఒక ఏకాదశినాడు బాబా గురించి మాట్లాడుతూ ప్రశాంతంగా ప్రాణాలు విడిచాడు దీక్షిత్. నాకు తెలిసి కొందరు ఏకాదశినాడు శిరిడీలో మరణించారు. వారు తప్పక స్వర్గానికి చేరి ఉంటారని నా అభిప్రాయం.

బాబా ఒకటి రెండుసార్లు పాటలు పాడగా నేను విన్నాను. భక్తులు పాటలు పాడినప్పుడు బాబా ప్రసన్నంగా వినేవారు. సాయిబాబా చెవులు కుట్టబడి ఉండటం నేను చూశాను. ఆయన నగ్నంగా స్నానం చేసేటప్పుడు నేను గమనించాను, ఆయనకు సున్తీ చేయబడి లేదు. బాబా మాంసాహారాన్ని తినడం నేను చూడలేదు. ముస్లింలు నివేదన తెచ్చినప్పుడు బాబా ఫకీర్లను "ఫత్యా"(ప్రార్థన) చదవమని చెప్పేవారు.

బాబా ప్రతిదినం వేకువఝామున ధుని దగ్గర దక్షిణాభిముఖంగా స్తంభాన్ని ఆనుకొని కూర్చొని ఏదో చేస్తూ ఉండేవారు. ఆయన ఏం చేసేవారో నాకు తెలియదు. ఆ సమయంలో ఎవరినీ వారి వద్దకు రానిచ్చేవారు కాదు. భక్తులు వారికి 50 అడుగుల దూరంలో ఉండేవారు. సేవకులు మాత్రం చిమ్మడం, శుభ్రం చేయడం, ధునిలో కట్టెలు వేయడం మొదలైన పనులు చేస్తూ ఉండేవారు. బాబా ఆ సమయంలో "యాదేహక్" వంటి పదాలను ఉచ్ఛరిస్తూ ఉండేవారు. కానీ అవి దూరంగా ఉన్న మాకు అరుదుగా వినపడేవి. వారు తరచుగా "భగవంతుడే యజమాని, రక్షించేవాడు (అల్లామాలిక్, అల్లావలీ హై") అనేవారు.

మేఘుడు మరణించడానికి రెండు మూడు రోజుల ముందు అనారోగ్యంతో ఉన్నప్పుడు బాబా అతనికి ఊదీ ఇచ్చారు. అతను మరణించినప్పుడు బాబా చూడటానికి వెళ్లారు. అతని శవాన్ని పూలతో కప్పి కన్నీరు కార్చారు. అంతేకాదు, శవాన్ని దహనం చేసినప్పుడు స్మశానానికి కూడా వెళ్లారు.

ఇక శిరిడీలో శ్రీరామనవమి ఉత్సవాలు ఎలా జరుగుతాయో వివరిస్తాను. ఉదయం 10 గంటలకు జెండాలను గ్రామమంతా ఊరేగించి మసీదుపైన కడతారు. తరువాత 12 గంటలకు హిందీలో 'రామజన్మ' కీర్తన పాడడం మొదలవుతుంది. మహమ్మదీయులు కూడా ఖురాను చదవడం మొదలుపెట్టి చందనాన్ని గ్రామమంతా ఊరేగింపుగా తీసుకువెళతారు. చందనోత్సవంలో హిందువులు, హిందువులు చేసే జెండా ఉత్సవంలో మహమ్మదీయులు పాల్గొనేవారు. అందుకే "హిందూ ముస్లింల మధ్య విభేదాలు తొలగించి సోదరభావం నెలకొల్పేటందుకే బాబా జన్మించారు" అని బాబాకు పాడే ఆరతి గీతాలలో కీర్తిస్తారు. (యవనస్వరూపీ ఏక్యా దర్శన త్వాధిదలే|| సంశయ నిరసునియా తద్వైతా ఘాలవిలే|| గోపీచందా మందా త్వాంచీ ఉద్ధరిలే|| మోమిన వంశీ జనుని లోకా తారియలే!)

బాబా అప్పుడప్పుడు భవిష్యత్తును గురించి చెప్పేవారు. కానీ నేనెప్పుడూ నా భవిష్యత్తు గురించి వారిని అడగలేదు. 1914-16 మధ్యలో ఒకామె బాబా దగ్గరకొచ్చి "నాకు ఎప్పుడు మంచి జన్మ లభిస్తుంది?" అనడిగింది. బాబా "నీ మరుజన్మలో" (దూస్‌రే జనమ్ మే) అని సమాధానమిచ్చారు. ఆ మరుసటిరోజు ఆమె తన ప్రస్తుత జన్మను అంతం చేసుకోదలచి వెళ్లి బావిలో దూకేసింది. కానీ ఆమెనెవరో రక్షించారు.

మేము సాఠేవాడాలో బాపూసాహెబ్ జోగ్ నిర్వహిస్తున్న ఏకనాథ భాగవత పారాయణకు హాజరయ్యేవాళ్ళం. అద్భుతమైన విషయమేమంటే, జోగ్ పారాయణ చేసే భాగంలో అంతకుముందు మసీదులో బాబా మాతో మాట్లాడిన మాటలు ఉండేవి. మేమంతా ఆశ్చర్యపోయేవాళ్ళం. అలాంటి అనుభవం చాలాసార్లు జరిగింది. కానీ నాకు ఆ వివరాలు ఒక్కటి కూడా గుర్తులేవు.

బాబా సశరీరులుగా ఉన్న సమయంలో ఒకసారి సగుణమేరు నాయక్‌తో, "అన్నం మీద కొంచెం నెయ్యివేసి, ధునికి కొంత సమర్పించి, మిగిలినది నాకు తీసుకొని రా" అన్నారు. అతడు ఆరోజు నుండి అలాగే చేయడం మొదలుపెట్టాడు. (అంతకుముందు అతను తెచ్చే నివేదనలో నెయ్యి ఉండేది కాదు.) బాబా ఆ నివేదనను స్వీకరించారు. ప్రతిరోజూ నివేదన అతని ఇంటినుండి వచ్చేది. ఆ పద్ధతి బాబా సమాధి అనంతరం కూడా కొనసాగింది.

బాబా ఛాయాచిత్రం:- 

బాబా తమ భక్తులకు చాలా ధనాన్ని ఇచ్చారు. కొంతమందికి తమ ఫోటోలను ఇచ్చారు. కొంతమందికి గ్రంథాలనిచ్చి చదివి, మననం చేయమని చెప్పారు. అలాగే బాబా పురందరేకు తమ ఫోటోను ఇచ్చారు. అతను ఆ ఫోటోను ప్రతిరోజూ పూజించేవాడు. అతనికి ఏ కష్టం వచ్చినా ఆ ఫోటో ముందు కూర్చుని హృదయపూర్వకంగా బాబాను ప్రార్థించేవాడు. వెంటనే బాబా ప్రత్యక్షమై అతనిని ఓదార్చేవారు.


బాబా వెండి విగ్రహం:-

తరచూ బాబా పురందరేకు వెండి నాణేలను ఇస్తుండేవారు. అతడు ఆ నాణేలను జాగ్రత్తగా పూజలో భద్రపరుస్తుండేవాడు. వాటి విషయంలో అతని కొడుకు కూడా అంతే శ్రద్ధ వహించేవాడు. అయితే భవిష్యత్ తరాలకు వాటి విలువ తెలియవచ్చు, తెలియకపోవచ్చు అని పురందరే మనుమడికి అనిపించింది. దాంతో అతను ఆ వెండి నాణేలను ఒక స్వర్ణకారుడి వద్దకు తీసుకెళ్లి, వాటితో ఒక వెండి బాబా విగ్రహాన్ని తయారుచేయించాడు. ఇప్పుడు ఆ వెండి విగ్రహాన్ని పురందరే కుటుంబీకులు నిత్యం పూజించుకుంటున్నారు.
ఈవిధంగా సాయిబాబాకు తన జీవితాన్ని అంకితం చేసిన రఘువీర్ భాస్కర్ పురందరే 1948వ సంవత్సరంలో ప్రశాంతంగా కన్నుమూశాడు. అతని వారసులు ఇప్పటికీ బాబా ఆదేశానుసారం పురందరే బాంద్రాలో నిర్మించిన ఇంట్లో నివాసముంటున్నారు.

 సమాప్తం
Amrosia in Shirdi & Baba's Runaanubandh by vinny chittluri.

 


ముందు భాగం 

కోసం

బాబా పాదుకలు తాకండి.




 నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo