మామిడిపండ్లతో పురందరేను అనుగ్రహించిన బాబా
అప్పుడు సమయం మధ్యాహ్నం 1:30 అయ్యింది. ఎండ చాలా తీవ్రంగా ఉంది. జోగ్ పురందరే వద్దకు వెళ్లి, "రూ.150/- తీసుకొని నాతోపాటు రా. నువ్వు నాతోపాటు వస్తేగానీ నేను ద్వారకామాయికి తిరిగి వెళ్ళన"ని ఖచ్చితంగా చెప్పాడు. అంతేగాక, "ఇంత ఎండలో నువ్వు పనిచేయడం బాబాకు ఇష్టం లేదు. అందుకే ఆయన పట్టుబడుతున్నారు. ఇంకో విషయమేమిటంటే, ఆ మామిడిపండ్ల పార్సెల్ నీ పేరు మీద వచ్చింది" అని పురందరేను ఒప్పించే ప్రయత్నం చేశాడు. ఇంత తెలుసుకున్న తరువాత కూడా తాను చేస్తున్న పనిని పూర్తిచేశాకే జోగ్‌తో కలిసి వెళ్ళాడు పురందరే. వాళ్ళు ద్వారకామాయికి చేరుకున్నాక జోగ్‌తో బాబా, "బాపూ, భావూ ఏమన్నాడు?" అని అడిగారు. అందుకు జోగ్, "అతను ఇక్కడే ఉన్నాడు. మీరు అతన్నే అడగండి" అని బదులిచ్చాడు. అప్పుడు బాబా, "బాపూ, భావూ పిచ్చివాడైపోయాడు. అతడు రాత్రుళ్ళు పడుకోడు, పగటిపూట విశ్రాంతి తీసుకోడు. ఏం చేయాలి? నేను అతన్ని రక్షించాలి. అతను నా బిడ్డ" అని అంటూ పురందరేను, "నువ్వు భోజనం చేశావా?" అని అడిగారు. పురందరే చేశానని బదులిచ్చాడు. బాబా, "అయితే ప్రశాంతంగా, నిశ్శబ్దంగా కూర్చో. ఎండలో బయటికి వెళ్ళకు. ఇవిగో, కాసిని మామిడిపండ్లు తిను" అన్నారు. అందుకతను ఒప్పుకోకుండా, "బాబా! ఈ మామిడిపండ్లు నాకోసం కాదు. నాకోసం ఎవరూ పంపించరు. పార్సిల్ నా పేరు మీద ఎలా వచ్చిందో నాకు తెలియదు. అవి ఖచ్చితంగా వేరే వారి కోసమై ఉండాలి" అని అన్నాడు. బాబా, "నేనేం చెడ్డవాణ్ణి కాదు. నాది కానిదాన్ని నేను అస్సలు స్వీకరించలేను. నేను చెప్తున్నాను, ఈ మామిడిపండ్లు నీవే. రా, వచ్చి వీటిని ఇప్పుడే తిను" అని అన్నారు. ఇంకా బాబా మాటలను వినిపించుకోకపోతే, ఆయన కోపగించుకుంటారని భావించి, పార్శిల్ తెరిచాడు పురందరే. అందులోనుండి రెండు మామిడిపండ్లు తీసి బాబాకు అందించాడు. అప్పుడు బాబా, "ముందు నువ్వు తిను. ఫకీర్‌బాబాకు కూడా ఇవ్వు" అని అన్నారు. అయితే మామిడిపండ్లను తినడానికి ఇంకా సిద్ధంగా లేని పురందరే, "బాబా, మీరు తినకపోతే నేనూ తినను. మీరు తిననంటే నన్ను నా పని చేసుకోవడానికి వెళ్ళనివ్వండి. నేను పనిని అర్ధాంతరంగా వదిలేసి వచ్చాను. మా ఇంట్లో ఎవరూ లేరు. మరి అలాంటప్పుడు వీటిని నాకోసం ఎవరు పంపుతారు? ఇందంతా నాకేమీ అర్థం కావడం లేదు" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. బాబా అతనిని ఓదారుస్తూ, "భావూ! ఎందుకేడుస్తున్నావు? ఊరుకో! నన్ను నమ్ము, ఈ మామిడిపండ్లు నీ కోసమే!" అని అన్నారు. ఇలా చెప్పి స్వయంగా తమ చేతులతో రెండు మామిడిపండ్లను నొక్కి, ఒకదాన్ని ఫకీర్‌బాబాకు ఇచ్చి, రెండవదాన్ని తాము రుచి చూసి పురందరేకు ఇచ్చారు బాబా. పురందరే ఆ పండును బాబా ఉచ్ఛిష్టంగా భావించి ఆనందంగా ఆరగించాడు.
తరువాత బాబా అతనితో ఆ మామిడిపండ్ల బుట్టను రాధాకృష్ణమాయి ఇంటికి తీసుకెళ్లమని చెప్పారు. వెంటనే అతను బాబా ఆదేశానుసారం మామిడిపండ్ల బుట్టను రాధాకృష్ణమాయికి అందజేసి తిరిగి ద్వారకామాయికి వచ్చాడు. బాబా అతనిని పనికి వెళ్లకుండా నిర్బంధించినందువల్ల అతను సాయంత్రం ఐదుగంటల వరకు బాబా సమక్షంలోనే కూర్చొని ఉన్నాడు. హానికరమైన ఎండలో అతను పనిచేయడం బాబాకు ఇష్టం లేదు. కొంతసేపటికి పురందరే రాధాకృష్ణమాయి ఇంటికి వెళ్లేందుకు బాబాను అనుమతి కోరాడు. బాబా ముందు వద్దని, మళ్ళీ "ఆయీ ఇంటికి వెళ్లి, తినడానికి ఏదైనా తీసుకొని రా" అని చెప్పారు. పురందరే బాబా చెప్పినట్లే చేశాడు. ఆ తర్వాత బాబా అతన్ని ఇంకెక్కడికీ వెళ్ళడానికి అనుమతించలేదు.
మరుసటిరోజు ఉదయం పురందరే బాబా దర్శనం కోసం బయలుదేరాడు. అయితే అప్పటికే బాబా లెండీబాగ్‌కి వెళ్లారు. అక్కడ భక్తులు బాబాను దర్శించుకొని సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. బాబా ఎంతో ప్రసన్నంగా ఉన్నారు. కానీ పురందరేను చూసిన మరుక్షణం కోపంతో మండిపడి, కొడతానని బెదిరిస్తూ అతని వైపు పరుగుతీసి, "అక్కడే ఆగు! నా దగ్గరికి రావద్దు. నువ్వు నన్ను ద్వారకమాయిలోనూ, చావడిలోనూ కుదురుగా ఉండనివ్వట్లేదు. నువ్వు నన్ను చాలా వేధిస్తున్నావు. నీ చూపు చాలా చెడ్డది" అని అరిచారు. అంతటితో ఆగక కాకాసాహెబ్ దీక్షిత్ వైపు తిరిగి చిరాకుగా, "కాకా, ఒక కత్తి తీసుకొని రా! నేను వీడి కళ్లను పీకిపారేసి, ఇక్కణ్ణించి తరిమేస్తాను. వీడు నన్ను చాలా విసిగిస్తున్నాడు" అని అన్నారు. బాబాను ఇటువంటి భిన్నమైన కోణంలో దర్శించిన పురందరేను దీక్షిత్ సముదాయిస్తూ, "బాబా మాటలకు కోపం తెచ్చుకోకు" అని చెప్పి అల్పాహారానికి ఆహ్వానించాడు. అయితే పురందరే బాబా మాటలకు కోపగించుకోవడానికి బదులు తనలో తాను నవ్వుకున్నాడు. ఎందుకో అది అతనికి మాత్రమే తెలుసు!
శిరిడీలో మొదటి పల్లకి ఉత్సవం
బాబాపై ఎనలేని భక్తిప్రేమలున్న పురందరే ఒకరోజు ఎలాగైనా పల్లకీని పెట్టెనుండి బయటకు తీసి, బాబాను అందులో ఆసీనులను చేసి చావడికి తీసుకెళ్ళాలని సంకల్పించుకున్నాడు. “బాబా, నేనీ పల్లకిని బయటకు తీసి చక్కగా పువ్వులతో అందంగా అలంకరిస్తాను. మీరందులో కూర్చుని చావడికి రావాలి. ఉత్సవం అప్పుడెంతో కన్నులపండుగ్గా వుంటుంది కదూ?" అని అడిగాడు నవ్వుతూ, సాయి అంగీకారాన్ని తానే తీసేసుకుంటూ. బాబాకు ఆడంబరాలు సుతరామూ గిట్టవు. ప్రపంచాన్నంతా తన పాదాలముందు సాగిలపడేలా చేసుకోగలిగినా ఫకీరు ధర్మాలను ఖచ్చితంగా పాటించే శ్రీసాయినాథుడు ఎప్పుడూ పాదచారిగానే సంచరించారు. ఏనాడూ ఏ వాహనాన్నీ అధిరోహించలేదు. అందుకే పల్లకీ ఎక్కడానికి తల అడ్డంగా తిప్పారు.
“బాబా! పల్లకీ ఎలాగూ వచ్చేసింది. ఇప్పుడు కుదరదు అంటే ఏం ప్రయోజనం చెప్పండి” అన్నాడు పురందరే నచ్చచెప్పే ధోరణిలో. కానీ శ్రీసాయి నుండి సానుకూలతే లేదు. “బాబా, మీరు పల్లకీ ఎక్కవలసిందే!” అంటూ బాబా పాదాలకు నమస్కరించి లేచాడు పురందరే. బాబానెలాగైనా ఒప్పించగలంలే అనుకుంటూ పల్లకీని సమీపించి, చెక్కపెట్టెలోనుంచి దానిని బయటకు తీసే ప్రయత్నంలో నిమగ్నమయ్యాడు. బాబా అడ్డుపడబోయారు. “దాన్ని విప్పొద్దు. ఆగు, వద్దంటున్నానా? అరె భావూ, వద్దంటే వినవేం?” అని సాయి వారించారు, కోప్పడ్డారు, తిట్టారు. పురందరే ఆ తిట్లన్నీ ఆశీస్సులుగా భావించుకుంటూ నింపాదిగా తన పని తాను చేసుకుపోతున్నాడు. “చెపుతుంటే వినిపించటంలేదుట్రా, వెళ్ళిక్కడ్నుంచి” ఈసారి బాబా పురందరే మీదకి ఆగ్రహావేశాలతో సటకా పట్టుకుని వచ్చారు. చుట్టూవున్న భక్తులు బాబా కోపం చూసి భయపడి పారిపోయారు. పురందరే మాత్రం వంచిన తల ఎత్తకుండా, ఏ మాత్రం భయపడకుండా తన పని సాగిస్తూ పల్లకీని బయటకుతీసి బిగించాడు.
చల్లని మేఘం జల్లై కురుస్తుందే కానీ నిప్పులు చెరగదనీ, పచ్చని పైరు పంటలనిస్తుందే కానీ మంటై మండదనీ, సాయీశుని కోపమూ దీవెనే కానీ దండన కాదనీ నమ్మిన భక్తుడతడు. బాబా ఇక చేసేది లేక ఆగిపోయారు. అవును మరి, అహంకారాన్నో, ద్వేషాన్నో దండించగలరు కానీ ప్రేమనెవరు దండించగలరు? దైవం విశ్వాధినేతయే అయినా ప్రేమసూత్రానికి బందీయే. భగవంతుడు, భక్తికి కట్టుబడిపోవలసిందే కదా!
పురందరే పువ్వులు తెచ్చి పల్లకీని అందంగా అలంకరించాడు. “బాబా, పువ్వులతో అలంకరించివున్న యీ పల్లకీ మీరు కూర్చుంటే ఇంకెంత అందంగా వుంటుందో కదా!” ముచ్చటగా వున్న పల్లకీని చూసి మురిసిపోతూ అడిగాడు పురందరే. “చేసిన నిర్వాకం చాలు. ముందిక్కడ్నుంచి వెళ్ళవతలకి!” అని గద్దించారు బాబా. “వెళుతున్నాలే బాబా. కానీ ఉత్సవంలో మాత్రం మీరీ పల్లకీ ఎక్కాలి. మేము మోయాలి! అంతే!” అంటూ పురందరే బాబా పాదాలకు నమస్కరించుకొని అప్పటికి వెళ్ళిపోయాడు.
ఆ రాత్రి చావడి ఉత్సవంలో పల్లకీ కూడా ఉండబోతుందన్న వార్త శిరిడీ అంతా ప్రాకిపోయింది. భక్తులు ఆ వేడుక చూసేందుకని రోజూకన్నా ఎక్కువ సంఖ్యలో మసీదుకు చేరిపోయారు. నానాసాహెబ్ చందోర్కర్, బూటీ, జోగ్ మొదలగు భక్తులంతా ఉత్సవానికి సమాయత్తమయ్యారు. భక్తులందరూ ఎంతో ఆనందంగానూ, బాబా పల్లకీ ఎక్కుతారో లేదోనన్న ఆతురతతోనూ ఎదురుచూస్తున్నారు. “జోగ్, నువ్వు ఈరోజేమీ తొందర చేయవద్దు. పల్లకీ లేకుండా చావడి ఉత్సవం చేసేది లేదు” అన్నాడు పురందరే. “ఈరోజు ఉదయం నీకు జరిగింది సరిపోలేదా? నువ్వు ఏం చేసుకుంటావో నీ ఇష్టం, నన్ను మాత్రం ఇరుకున పెట్టవద్దు” అన్నాడు బాబా కోపం గురించి బాగా తెలిసిన జోగ్.
అంతలోనే నానాసాహెబ్ చందోర్కర్ కల్పించుకుంటూ “బాబాకు, పురందరేకు సరిపోతుంది. వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోనీ, నువ్వు మాత్రం ఈరోజేం కల్పించుకోకు” అని జోగ్‌తో అన్నాడు. చందోర్కర్ సలహాతో మౌనంగా వుండిపోయాడు జోగ్. పురందరే వచ్చి బాబాను బ్రతిమాలుతూ పల్లకీ ఎక్కమన్నాడు. ససేమిరా వీల్లేదంటే వీల్లేదనేశారు సాయి. బాబా పల్లకీ ఎక్కకుంటే తాను ఉత్సవంలో పాల్గొనననీ, ఎలాగైనా పల్లకీ బాబాతోనే ముందుకు కదలాలనీ పంతం వేసుక్కూర్చున్నాడు పురందరే.
పురందరేకీ, బాబాకీ నడుమ తిరుగుతూ సర్దిచెపుతున్నారే కానీ అక్కడున్న భక్తులందరిలో కూడా బాబానెలాగైనా పల్లకీలో ఊరేగించాలనే కోరిక బలంగా ఉంది. అందరి భక్తుల కోరికను భక్తవత్సలుడైన బాబా ఎలా కాదనగలరు? అలా అని తన నియమాలనూ మార్చుకోలేరు కదా! చివరికెలాగో పల్లకీలో వూరేగించటానికి తన పాదుకలనిచ్చేందుకు అంగీకరించారు బాబా.
బాబా స్వయంగా పల్లకీ ఎక్కనందుకు అసంతృప్తిగా ఉన్నా, పాదుకలు ఇచ్చి పల్లకీ ఊరేగింపుకు అనుమతినిచ్చారు కదా అని యిక సర్దుకుపోక తప్పలేదు పురందరేకూ, మిగిలిన భక్తులకూ. “బాబా, నేనూ పల్లకీని మోయవచ్చా?” అడిగాడు పురందరే ఉత్సవ ప్రారంభంలో ఉత్సాహంగా. “వద్దు! 125 దివిటీలు వెలిగించి ఆ తర్వాత పల్లకీని ఎత్తండి” అన్నారు బాబా. బాబా ఆజ్ఞప్రకారం 125 దివ్వెల వెలుగులో మహెూత్సాహంతో సాగిన ఆనాటి ఉత్సవం పల్లకీతో శోభాయమానంగా చావడి చేరింది.
సద్గురునాథుని పాదుకలు మోసిన పల్లకీ ధన్యురాలై మురిసిపోయింది. బాబానెలాగైనా ఒప్పించి తనకా భాగ్యాన్ని కలుగజేసిన పురందరేకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంది. చావడి ఉత్సవం తరువాత బాబా అనుమతి తీసుకుని ముంబాయి తిరిగి వెళ్ళాడు పురందరే. మరునాటి ఉదయం యథాప్రకారం సాయి మసీదుకు చేరారు. కానీ పల్లకీని వెంట తెచ్చేందుకు మాత్రం అంగీకరించలేదు. రెండు మూడు రోజులు పల్లకీ చావడిలోనే వుండిపోయింది. ఆ సమయంలోనే పల్లకీకున్న వెండి కలశాన్ని, మిగిలిన అలంకార వస్తువుల్ని ఎవరో దొంగిలించారు. ఆ విషయం విన్న బాబా “అసలా పల్లకీనే పట్టుకెళితే ఇంకా బాగుండేది” అని పకపకా నవ్వారు. భక్తులు మాత్రం బాధపడ్డారు.
పల్లకీ కోసం రేకుల షెడ్ నిర్మాణం
మరుసటిరోజు బాబా లెండీబాగ్‌కి వెళ్లిన సమయంలో రేకుల షెడ్డు పని ప్రారంభించాడు పురందరే. అతనికి సహాయంగా దీక్షిత్ సేవకుడు ఫకీర నిలిచాడు. ముందుగా నేలను చదునుచేసే పని చేస్తుండగా చాలా తేళ్లు కనపడ్డాయి. అదృష్టవశాత్తూ ఇద్దరికీ ఏ హానీ జరగలేదు. తరువాత నారాయణతేలి ఇంటిగోడలకు రంధ్రాలు కొట్టి, మశీదు గోడలకు కొట్టబోతున్నంతలో బాబా లెండీ నుండి రానేవచ్చారు. అప్పుడు సమయం సుమారు పదిగంటలయింది. బాబా రావడం చూసి ఆ కార్యక్రమంలో సహాయపడుతున్న భక్తులు, కార్యక్రమాన్ని తిలకిస్తున్న వారందరూ పరుగందుకున్నారు. ఫకీర, పురందరే మాత్రం అక్కడ మిగిలారు. ఒకప్రక్క ఫకీర పందిరి కర్రలను పట్టుకొని నారాయణతేలి ఇంటిమీద ఉన్నాడు, పురందరే మసీదు గోడలకు రంధ్రం కొడుతూ వున్నాడు. అందువల్ల ఇద్దరూ బాబాకు సులభంగా దొరికిపోయారు. బాబా పురందరే మెడపట్టుకొని కోపంగా “ఏరా, ఏం చేస్తున్నారు?” అని హుంకరించారు. “బాబా, మీ పల్లకీకి గది నిర్మిస్తున్నాను” అని పురందరే సమాధానమిచ్చాడు.
అది విని బాబా కోపంతో, “ఇదివరకు వచ్చి నా మశీదును తవ్వి మొత్తం డబ్బులన్నీ తీసుకుపోయారు. నింబారును కూడా తీశారు. ఇప్పుడు గోడకు కన్నాలు వెయ్యడానికి తయారయ్యారా?” అని కేకలేస్తూ పురందరేని తలుపు దగ్గరకు నెట్టుకుంటూ వెళ్ళి, “ఇక్కడ నుంచి వెళ్ళు, లేకపోతే తన్నులు తింటావు గుర్తుంచుకో” అని ఒక ఇటుకరాయిని చేతిలోకి తీసుకున్నారు. “బాబా! నన్ను కొట్టండి, లేదూ మీ ఇష్టమొచ్చినట్లు చేయండి. పల్లకీకి గది నిర్మించందే మాత్రం నేను ఇక్కడ నుండి కదలేది లేదు” అని పురందరే మొండిగా సమాధానమిచ్చాడు. బాబా కోపంతో తిడుతూ పురందరేను ఒక్కతోపు త్రోసి, కాళ్ళు కడుక్కొని మశీదులోకి వెళ్ళిపోయారు. కానీ తిట్ల వర్షం మాత్రం ఆపలేదు. పురందరే ఏమాత్రం చలించనే లేదు. “ఏడువందల సంవత్సరాలుగా నువ్వు నాకు తెలుసు. నువ్వెంత దూరానవున్నా సరే, నిన్ను కాపాడే బాధ్యత నాదే” అని వరమిచ్చిన అభయప్రదాత, ప్రేమమూర్తి తననేమీ చేయరనే విశ్వాసం పురందరేది. అందుకే బాబా కోపాన్నేమీ అతను పట్టించుకోలేదు.
కొద్దిసేపయిన తరువాత బాబా “వాడిని ఇక్కడకు తీసుకురండి” అని కబురుపంపారు. పురందరే మశీదులోకి వెళ్ళి మౌనంగా చేపట్టుకు వెలుపల నిల్చున్నాడు. బాబా కొంచెం కోపం, కొంచెం విసుగు సమ్మిళితమైన స్వరంతో “చెప్పిన మాట వినవా? మసీదు గోడలు పగలకొట్టాలనుకుంటున్నావా?” అన్నారు. “లేదు బాబా, అవి భద్రంగానే వుంటాయి” అని వినమ్రంగా సమాధానమిచ్చాడు పురందరే. బాబా ఏమనుకున్నారో ఏమో శాంతంగా, “సరే వెళ్ళు! నీ ఇష్టం, కానీ అనుకున్న పని మాత్రం శ్రద్ధగా చేయి!” అని అన్నారు.
మధ్యాహ్నమయింది. బాబాకు ఆరతిచ్చి భక్తులంతా భోజనాలకని వెళ్ళిపోయారు. భోజనాలు కానిచ్చుకున్న భక్తులు కొద్దిసేపటికి తిరిగి మసీదుకు చేరుకోసాగారు. పురందరే మాత్రం భోజనం మాటే మరచి పనిలో పూర్తిగా నిమగ్నమైపోయాడు. బాబా అతనితో “నువ్వూ వెళ్ళి భోంచేసిరా!” అని అన్నారు. కొద్దిసేపుండి మళ్ళీ ఆయనే చెప్పారు, "ఆకలేయట్లేదూ, వెళ్ళి అన్నం తినిరా” అని. పురందరే కదల్లేదు. అతనికి తిండిధ్యాసే లేనట్లున్నా బాబా మాత్రం అసహనంగా అటూ ఇటూ తిరగసాగారు. కొద్దిసేపటికి అక్కడే ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్‌తో ఫిర్యాదులా చెప్పారు: “చూశావా ఈ మూర్ఖుడ్ని? అన్నం తినొచ్చి పని చేసుకోవచ్చు కదా. నేనెంత చెపుతున్నా వినడేం? వాడి ఆకలి కూడా వాడికి తెలియకపోతే ఎలా?” మళ్ళీ అయిదు నిమిషాలాగి ఆయనే అన్నారు, “ఇంత మొండివానితో నేనెలా వేగేది? కడుపులో పేగులు అరుస్తున్నాయి”.
“బాబా, అతనికి శలవు పూర్తికావస్తోంది. కాబట్టి తొందరగా పని పూర్తిచెయ్యాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లున్నాడు, అతనిని భోజనానికి పంపించమంటారా!” అని అడిగాడు దీక్షిత్. అందుకు బాబా పెదవి విరుస్తూ, “నా మాటే వాడు వినటంలేదు, నీ మాటేం వింటాడు? భాగోజీ, నువ్వెళ్ళి వాడిని పిలుచుకునిరా” అని భాగోజీ షిండేని పంపారు. పనిచేసుకుంటూనే బాబా మాటలన్నీ వింటూన్న పురందరే యిక ఆగలేనట్లు పరుగున వచ్చి ఆయన పాదాలపై వాలిపోయి భోరున ఏడ్చేశాడు. “ఎందుకురా భావూ? ఏమయిందిప్పుడు?” లాలనగా అతని తలపై చేయివేసి అడిగారు బాబా. “బాబా, మా పంతమే నెగ్గించుకుని మీకిష్టంలేని పని చేస్తున్న మాపై మీకెందుకింత ప్రేమ? పొద్దున్న నన్ను తిట్టారు, కొట్టబోయారు, చంపేస్తాననీ బెదిరించారు. అయినా ఇప్పుడు నేను అన్నం తినలేదని ఇంత బాధపడుతున్నారే? ఒక్క పూటకి ఏమవుతుందిలే అనుకోకుండా నా కన్నతల్లిని మించి, ఇంత ప్రేమని నాపై మీరు తప్ప ఇంకెవరు చూపగలరు? బాబా! నా తల్లీ, తండ్రీ, గురువూ దైవమూ, సర్వస్వమూ మీరే. నాకింకేమీ వద్దు. అనుక్షణం మీ పాదాలకు సేవ చేసుకునే అదృష్టమివ్వండి చాలు!” అన్నాడు పురందరే కన్నీళ్ళ మధ్య. "సర్లే, వెళ్ళి భోంచేసిరా ముందు” అని తల్లిలా ప్రేమగా కసిరారు బాబా. కళ్ళు తుడుచుకుని లేచాడు పురందరే. మసీదు దాటబోయి మళ్ళీ అనుమానం వచ్చి బాబా దగ్గరకొచ్చి అడిగాడు, "బాబా, నేనటు వెళ్ళగానే నా పని అంతా తలక్రిందులు చేసి అన్నీ బయట పడేయరు కదా?” అని. పసిపిల్లవాడ్ని చూసినట్లు పురందరేను చూసి చల్లగా నవ్వారు బాబా. “పిచ్చివాడా, నేనలా ఎందుకు చేస్తాను? ఏమీ చేయను. వెళ్ళి భోంచేసిరా” అని మాట యిచ్చారు. తర్వాత దీక్షిత్ వైపు తిరిగి “ఏం చేస్తాం, బిడ్డ కాలిపై మలవిసర్జన చేస్తే బిడ్డను నరుకుతామా, కాలిని నరుకుతామా? సహించవలసిందే కదా!” అన్నారు.
పురందరే నిశ్చింతగా వెళ్ళి భోంచేసి వచ్చి మళ్ళీ పని ప్రారంభించాడు. సాయంత్రానికి షెడ్డు నిర్మాణం అయిపోయింది. రెండు తలుపులు పెడదామనుకుంటే, అప్పటికి ఒక్క తలుపు మాత్రం బిగించటం అయింది. మరునాడు పురందరే ఊరికి తిరిగి వెళ్ళిపోవలసి ఉంది. ఆ ఒక్క తలుపు పని తాత్యాకి అప్పగిద్దాములే అనుకొని బాబా దగ్గరకు వచ్చి చెప్పాడు, “బాబా, దాదాపు పనంతా అయినట్లే, ఇంకొక్క తలుపు బిగించాలంతే. కానీ రేపటితో సెలవయిపోతుంది నాకు. మీరు అభ్యంతరం చెప్పకుండా వుంటే ఆ కాస్త పని తాత్యా చేస్తాడు” అని. “అది తర్వాత చూసుకుందాంలే. ముందెళ్ళి విశ్రాంతి తీసుకో! పొద్దున్నుంచి కష్టపడుతూనే వున్నావు” అన్నారు బాబా ఊదీ ఇస్తూ. పురందరే బాబాకు నమస్కరించి ఊదీ తీసుకుని వెళ్ళిపోయాడు. పురందరే వెళ్ళగానే బాబా కాకాసాహెబ్‌తో "కాకా, ఎవరి మంచితనం ఎట్లావుంటే, వారి అభివృద్ధి కూడా అట్లాగే వుంటుంది” అని అన్నారు. మరునాటి ఉదయం కాకడ ఆరతి అయ్యాక ఊరికి వెళ్ళేందుకని బాబాను సెలవు అడిగాడు పురందరే. “భావూ, చేద్దామని పూనుకున్న పని పూర్తిగా చేసే తీరాలి. సగంలో వదిలేసి ఇంకొకరికి అప్పగించకూడదు. ఈ పనీ మనదే, ఆ పనీ మనదే! నీ పని పూర్తిచేసి, ఊరికి రేపు వెళ్ళు” అని ఆప్యాయంగా చెప్పారు బాబా.
ఈ పని తలపెట్టినపుడు బాబా ఎంత వారించారు, కోప్పడ్డారు! కానీ ఇపుడదంతా మన్నించి ప్రేమనే కురిపిస్తున్నారు. “తండ్రీ, నేనెన్ని జన్మలెత్తినా నీ బిడ్డగానే ఉండాలి" కన్నుల్లో తిరగబోతున్న నీటినాపుకుని ఆ కృపాసాగరునికి మనసులోనే సాష్టాంగపడుతూ, “సరే బాబా!” అంటూ ముందటిరోజు వదలిపెట్టిన పని పూర్తిచేయడానికి పూనుకున్నాడు పురందరే. అనుకున్న పనంతా అయ్యాక షెడ్డులోపల, తలుపుల వెనుక భద్రంగావున్న పల్లకీని ఓసారి నిశ్చింతగా చూసుకుని, అప్పుడు బాబా దగ్గర ప్రణమిల్లి సెలవడిగాడు పురందరే. “వెళ్ళిరా. కానీ తరచూ శిరిడీ వస్తూండు” అని ఊదీ ఇస్తూ ఆశీర్వదించారు బాబా. “అలాగే బాబా! కానీ మీరు సంకల్పిస్తేనే రాగలం" ఊదీ కళ్ళకద్దుకుంటూ అన్నాడు పురందరే. అప్పుడు బాబా, "నేను శిరిడీకి అందరినీ పిలుస్తాను. కానీ రావడానికందరూ సిద్ధంగా ఉండరు" అని అన్నారు.
“వెళ్ళిరా పురందరే. శాశ్వతంగా సాయి పాదాలవద్ద నాకూ యింత చోటు కల్పించావు. నీ మేలు ఎన్నటికీ మరువను. సదా నీకు శుభమగుగాక!” అంటూ పల్లకీ కూడా నిండు మనసుతో పురందరేను దీవించింది.
Amrosia in Shirdi & Baba's Runaanubandh by vinny chittluri.
Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏
ReplyDeleteOm sai ram, amma nannalani kshamam ga chusukondi tandri vaalla badyata meede, vaallaki manchi arogyanni prasadinchandi tandri pls, ofce lo WFH gurinchi emi adagakunda chudandi tandri e two days please tandri, naaku manchi arogyanni prasadinchandi.
ReplyDelete