సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 275వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. తలచిన వెంటనే బాబా రక్షణనిస్తారు
  2. ఊదీ రూపంలో లభించిన బాబా ఆశీర్వాదాలు

తలచిన వెంటనే బాబా రక్షణనిస్తారు

సాయిబంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. మా ఇంట్లో అందరం బాబా భక్తులమే. ఇప్పుడు నేను చెప్పబోయేది మా పాపకు సంబంధించిన అనుభవం. మా పాప తనకు తెలియకుండానే పెద్ద సమస్యలో ఇరుక్కుంది. ఏ ఆడపిల్లకూ రాకూడని సమస్య అది. ఈ సంగతి ఈమధ్యనే మాకు తెలిసి నేను, మావారు చాలా బాధపడ్డాము, ఏడ్చాము. బాబా ఉన్నారని మాకు మేమే ధైర్యం చెప్పుకొని, "మా పాపని ఈ సమస్య నుండి తప్పించమ"ని బాబాను దీనంగా వేడుకున్నాము. బాబా ఎంతటి కరుణామయుడంటే, తెల్లవారేసరికల్లా సమస్య తీరిపోయింది. మా సంతోషం అంతా ఇంతా కాదు. చెప్పలేని ఆనందంతో మనసారా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాము. ఆయన చేసిన మేలుకు కృతజ్ఞతగా మా పాపతో సాయి చరిత్ర చదివిస్తున్నాము. నేను కూడా మహాపారాయణ గ్రూపులో చేరాను, నవగురువార వ్రతం కూడా చేశాను. మా బాబు తన పరీక్షలో ఉత్తీర్ణుడవ్వాలని ప్రతిరోజూ మేము బాబాను వేడుకుంటున్నాము. బాబా ఖచ్చితంగా మా కోరికలు నెరవేరుస్తారని, మాకున్న మిగిలిన సమస్యలు కూడా ఇలాగే తీరుస్తారని మా దృఢ నమ్మకం. ఎల్లవేళలా బాబా మా కుటుంబాన్ని ఇలాగే రక్షిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

అందరికీ నేను చెప్పేది ఏమిటంటే, ఏ సమస్య వచ్చినా బాబా ఉన్నారని మర్చిపోవద్దు. జాతి, మతం, కులాలతో సంబంధం లేకుండా తలచిన వెంటనే ఆయన రక్షణనిస్తారు. ఇది సత్యం, సత్యం, సత్యం.

ఊదీ రూపంలో లభించిన బాబా ఆశీర్వాదాలు

నేను ఒక సాయిభక్తురాలిని. నేను యుకే నివాసిని. ముందుగా నా అనుభవాన్ని పంచుకోవడంలో నాకు సహాయం చేయమని బాబాను ప్రార్థిస్తున్నాను. బాబా దయవల్ల నేను బర్మింగ్‌హామ్ లోని ఒక సాయిమందిరంలో సేవ చేస్తున్నాను. మందిరంలోని ధుని కోసం ప్రతినెలా విరాళం పంపుతూ ఉంటాను. అందుకు ప్రతిగా వాళ్ళు నాకు రసీదుతోపాటు ఊదీ ప్రసాదం పంపుతూ ఉంటారు. ప్రతినెలా ఊదీ ప్రసాదం కోసం నేనెంతో ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటాను. ఒకచోట నేను ఊదీ ప్యాకెట్‌ అందుకుని సురక్షితంగా ఒకచోట ఉంచి మర్చిపోయాను. 2 రోజుల తరువాత నేను ఆ ఊదీ ప్యాకెట్‌ కోసం వెతికాను, కానీ దొరకలేదు. ప్రపంచంలోని అత్యంత విలువైన వస్తువును పోగొట్టుకున్నానని నేను చాలా కలతచెందాను. మనస్సులో బాబాకు క్షమాపణ చెప్పుకుని, "బాబా! దయచేసి ఆ ఊదీ ప్యాకెట్ దొరికేలా సహాయం చెయ్యండి" అని ప్రార్థించాను. అంతలో నా లోపలనుండి "అన్నీ చేసేవాడిని నేనే" అని ఒక స్వరం వినిపించింది. నాకేమీ అర్థం కాలేదు. చిన్న ప్యాకెట్ కావడంతో ఎవరైనా పొరపాటున డస్ట్‌బిన్‌లో పడేశారేమో అని భయపడ్డాను. అమూల్యమైన ఊదీని చెత్తడబ్బాలో పడేయటం చాలా ఘోరంగా తోచింది. వెంటనే నేను వెళ్లి ఆ డబ్బాలో వెతకడం మొదలుపెట్టాను. అంతలో మళ్ళీ "ఇక్కడ లేదు" అని స్వరం వినిపించింది. దాంతో వెతకడం ఆపేశాను. ఆ తర్వాత నేను మళ్ళీ డబ్బులు కడితే ఊదీ ప్యాకెట్ వస్తుందని అలోచించి మందిరానికి ఫోన్ చేసి విరాళం పంపాను. తరువాత నేను వంటగదిలోకి వెళ్ళినప్పుడు ఒక పుస్తకంలో చిన్న ఊదీ ప్యాకెట్ ఉందని గుర్తొచ్చి పుస్తకం తెరచి చూశాను. అందులో ఊదీ ప్యాకెట్ ఉంది. పోగొట్టుకున్న ఊదీ అదేనని గ్రహించి పట్టలేని ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. రెండోసారి విరాళం కట్టేలా చేయడంలో ఇదొక బాబా పద్ధతి అని అనుకున్నాను. ఆవిధంగా నన్ను ఆయన ఆశీర్వదించారని సంతోషించాను.

కొన్నిరోజుల తరువాత మందిరం నుండి రశీదు, ఊదీతో ఉన్న కవరు వచ్చింది. నేను ఆ రెండింటిని బయటకు తీశాక కూడా కవరులో ఇంకా ఏదో ఉన్నట్లు గుర్తించాను. ఆశ్చర్యం! చూస్తే లోపల మరో ఊదీ ప్యాకెట్ ఉంది. దానిపైనున్న లేబుల్ చూసి నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. అది శిరిడీ సంస్థాన్ ఊదీ! ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుని చిందులేశాను. అనూహ్యరీతిన శిరిడీ నుండి బాబా తమ ఆశీర్వాదాలను నాకు పంపారు. సాధారణంగా నాకు ఒక ప్యాకెట్ మాత్రమే లభిస్తుంది. కానీ ఈసారి బాబా నన్ను 2 ఊదీ ప్యాకెట్లతో ఆశీర్వదించారు. అది కూడా ఒక ప్యాకెట్ శిరిడీ నుండి వచ్చింది. ఇది బాబా చేసిన అద్భుతం. శిరిడీ ఊదీని నేను అస్సలు ఊహించలేదు. బాబా అత్యంత దయాళువు. తన బిడ్డలను ఎలా సంతోషపెట్టాలో ఆయనకు మాత్రమే తెలుసు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! మీపై నాకున్న ప్రేమను మాటల్లో చెప్పలేను".

source : http://www.shirdisaibabaexperiences.org/2019/09/shirdi-sai-baba-miracles-part-2486.html

3 comments:

  1. నీవు భయపడవలసిన అవసరంలేదు. మీకు శుభం కలుగుతుంది" baba gave this message for new year thank you sai im eagerly waiting for u blessings, when i get ur blessings im success in my life

    ReplyDelete
  2. Akilandakoti brahmandanayaka rajadiraja yogiraja parahbramha Sri sachchidananda sadguru sainath maharajuki jai. happy new year sai. Always help devotees sai.

    ReplyDelete
  3. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo