సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 302వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయి కరుణాసముద్రుడు
  2. కష్టకాలంలో బాబా సహాయం

సాయి కరుణాసముద్రుడు

సాయిభక్తురాలు శ్రీమతి సంధ్య తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం శ్రీ సాయినాథాయ నమః. ఆపద్బాంధవుడు, కరుణాసముద్రుడు, పిలిచిన వెంటనే పలికే దైవం నా సద్గురు సాయి దివ్యపాదాలకు నమస్కరిస్తూ సాయి  ప్రేమను పొందిన మరో అనుభవాన్ని సాటి సాయిబంధువులతో ఆనందంగా పంచుకుంటున్నాను. 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి మరియు సాటి సాయిబంధువులకి నా నమస్కారములు. నా పేరు సంధ్య. 3 సంవత్సరాల క్రితం నా భర్త ఆరోగ్యం దెబ్బతిన్నది. ఒకటి తర్వాత ఒకటిగా తలనొప్పి, శ్వాస సమస్య, చెవి నొప్పి, మందులు వాడడం వల్ల గొంతు పాడవడం, ఎముకలు అరిగిపోవటం, కాళ్ళు లాగడం, పైల్స్, మలద్వారం నుండి రక్తం రావడం వంటి ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాము. తనవాళ్ళనే దైవంగా భావించి, ఎల్లప్పుడూ తనకు తోడుగా ఉంటారని అనుకున్న బంధుబలగం మావారికి అవసరమనుకున్న సమయంలో తోడుగా రాలేదు. పిల్లలు చిన్నవాళ్లు. చదువు, ఆటలు తప్ప ఏమీ తెలియని పసితనం. నా భర్త పరిస్థితి చూచి ఏడవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయురాలిని నేను. "ఈశ్వరా! రక్షించండి తండ్రీ!" అని కన్నీళ్లతో నా ఇష్టదైవాన్ని ప్రార్థించాను. ఒకరోజు, "మీరు చిన్నప్పుడు ఏ గుడికైనా వెళ్ళేవారా?" అని నా భర్తను అడిగాను. "నేను సాయిబాబా గుడికి వెళ్ళేవాణ్ణి" అని చెప్పారు. ఆ తరువాత వచ్చిన గురువారంరోజున నిస్సహాయస్థితిలో వున్న నా భర్త, నేను సాయిమందిరానికి వెళ్ళి సాయిని దర్శించుకున్నాము. ఆరతికి  ఇంకా సమయం ఉన్నందున ఒక ప్రక్కన నిస్సహాయస్థితిలో నిలబడి బాబాను చూస్తూ, "సాయీ! నా భర్త ఆరోగ్యం బాగాలేదు. తనకి ఏమైందో నాకు అర్థం కావట్లేదు" అని మా సమస్యలన్నింటినీ దీనంగా బాబాకి విన్నవించుకుంటున్నాను. నా మనసును విన్న సాయి అద్భుతం చూపించారు. నా మనసులో ఉన్న బాధలని బాబాకి చెబుతుండగా బాబా తన శిరస్సును మెల్లగా ఊపుతూ, 'ఊఁ.. ఊఁ' అని వింటున్నట్లు దర్శనమిచ్చారు. ఆ సమయంలో నాకు ధ్యానస్థితి కలిగించి నా సమస్యలనింటినీ  శ్రద్ధగా విన్నారు. కొద్ది క్షణాలలో నేను నిజస్థితికి వచ్చాను. ఇప్పటికీ ఆ అనుభవం కళ్ళకు కట్టినట్లుగా ఉంది. అప్పటినుండి నా భర్త పూర్తిగా కోలుకున్నారు. "దయగల బాబా! మాటలకి అందని మీ ప్రేమ ఎంతని చెప్పను? అమాయక భక్తులకు అండగా నిలిచి, తల్లి, తండ్రి, బంధుబలగం, స్నేహితుడు, వైద్యుడు, సద్గురువుగా మానవరూపంలో వెలసిన ఈశ్వరా! సాయీశ్వరా! మీ పాదాలకు శరణు వేడుతున్నాను. ప్రేమస్వరూపా! ఆనందనిలయా! సాయీ! మీ దయ ఉంటే చాలు తండ్రీ. ఐ లవ్ యూ బాబా సాయీ!"

గురు కృపాహి కేవలం. సద్గురు చరణం భవ భయ హరణం. జై సాయిరాం!

కష్టకాలంలో బాబా సహాయం

USA నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

చాలా సంవత్సరాల క్రితం నా హాస్టల్ స్నేహితురాలు నాకు బాబాని పరిచయం చేసింది. అప్పటినుండి నేను సాయిబాబా భక్తురాలినయ్యాను. నేనిప్పుడు దాదాపు 8 నెలల కథను వీలైనంత చిన్నదిగా చెప్తాను.

ప్రస్తుతం మేము యు.ఎస్.ఏ లో నివసిస్తున్నాము. 2016 అక్టోబరు నుండి నా భర్త ఆరోగ్యం బాగాలేదు. 3 నెలల్లో ఆయన దాదాపు 12 కిలోల బరువు తగ్గిపోయారు. ఆయన తన ఎడమచేయి నొప్పిగా ఉందని, తిన్న ఆహారం అన్నవాహికలో ఉన్నట్లుగా అనిపిస్తూ వికారంగా ఉంటోందని, ఛాతీనొప్పి అని కూడా అంటుండేవారు. ఆయన చెపుతున్న లక్షణాలన్నీ దాదాపు గుండెపోటుకు సంబంధించినవే. మేము అత్యవసర పరిస్థితి కింద హాస్పిటల్‌కి వెళితే, అంతా నార్మల్‌గా ఉందని చెప్పారు. కానీ నవంబరు నెల చివరి నుండి జనవరి మధ్య వరకు ఒకటిన్నర సంవత్సరం వయసున్న మా పాపను పట్టుకుని అర్థరాత్రి వేళ దాదాపు 4-5 సార్లు ఎమర్జెన్సీగా హాస్పిటల్‌కి వెళ్ళాము. డాక్టర్లు ప్రతిసారీ ఇసిజి, ఎక్స్-రే, రక్తపరీక్ష మొదలైన పరీక్షలు చేయించేవారు. ఇవన్నీ యు.ఎస్ లో ఎంతో ఖర్చుతో కూడుకున్నవి. డబ్బులు ఖర్చు అవుతున్నా సమస్య ఏమిటన్నది మాత్రం తెలిసేది కాదు. డాక్టర్లు ప్రతిసారీ, "సమస్య ఏమీలేదు, అంతా నార్మల్ గా ఉంది" అని చెప్తూ, "బహుశా ఒత్తిడి వల్ల కావచ్చు" అని చెప్పేవారు. అయినా మేము సమస్య ఏమిటో తెలుసుకోవడానికి గ్యాస్ట్రో ఎంటరాలజీ, ఎండోస్కోపీ మొదలైన చేయగలిగిన అన్ని పరీక్షలు చేయించాం. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఆయన ఆహారం జీర్ణం కాలేదని గుండె పట్టుకుని రాత్రిళ్ళు నడుస్తూ ఉండటంతో మేము ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాము.

ఆ కష్టకాలంలో నేను ప్రతిరోజూ బాబా ముందు ఏడుస్తూ, మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. 2016, డిసెంబరు చివర్లో నేను నా భర్త ఆరోగ్యం కోసం 9 గురువారాలు ఉపవాసం ఉండాలని సంకల్పించాను. 8వ వారం ఉపవాసంలో ఉండగా బాబా ఆశీర్వాదం వలన భారతదేశంలో ఉన్న నా క్రైస్తవ మిత్రులలో ఒకరి ద్వారా సాయిబాబా భక్తురాలైన తన స్నేహితురాలికి ఒక సిద్ధవైద్యుడితో బాగా పరిచయం ఉందని తెలిసింది. నేను ఆమెకు అన్నీ వివరించి చెప్పాను. ఆమె నాకు ఆ సిద్ధవైద్యుని నెంబర్ ఇచ్చింది. మేము అతనిని ఫోన్లో సంప్రదిస్తే, మేము చెప్పిన లక్షణాలను బట్టి ఇంటిలోనే ఔషధాన్ని తయారుచేసుకునే చాలా చిట్కాలను చెప్పాడు. ఈలోగా బాబా దయవల్ల నేను నా 9 వారాల ఉపవాసం పూర్తి చేశాను. తరువాత మేము కొత్త పరిపాలన కారణంగా నాన్-ఇమ్మిగ్రెంట్స్ కు చాలా సమస్యలు ఉన్నప్పటికీ 2017 ఫిబ్రవరిలో భారతదేశానికి వెళ్ళాము.

మొదటి రెండు రోజుల్లో మేము వీసా స్టాంపింగ్ పనులు చూసుకుని మూడవరోజు బాబా సహాయం కోసం కుటుంబమంతా శిరిడీ వెళ్ళాము. శిరిడీలో బాబాను చూస్తూనే నేను కన్నీళ్లు ఆపుకోలేక బాగా ఏడ్చేశాను. తరువాత బాబా ఆశీస్సులతో మేము మా సొంత ఊరికి వెళ్ళాము. అక్కడ ఉన్న సిద్ధవైద్యుడిని కలిసాము. ఆ సిద్ధవైద్యుడు కూడా బాబాకు దృఢమైన భక్తుడని తెలిశాక నా బాబా నాకు సరైన మార్గాన్ని చూపిస్తున్నారని  అర్థమైంది. అతను బాగా పరీక్షించి, 'యాసిడ్ రిఫ్లెక్స్' ఈ సమస్యకు కారణమని చెప్పి విరోచనాల టాబ్లెట్లు ఇచ్చాడు. వాటితో మావారి ఆరోగ్యం రోజురోజుకూ మెరుగుపడసాగింది. ఒక నెల తరువాత మార్చిలో మేము తిరిగి యు.ఎస్ వచ్చాము. మావారు దాదాపు 80%  కోలుకున్నారు. "నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని కష్టకాలంలో మాకు సహాయం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా! మా కుటుంబమంతా ఎల్లప్పుడూ మీ దివ్యపాదాలనే ఆశ్రయించుకుని ఉంటాము. మీరు మా కుటుంబాన్ని ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉంటారని నేను నమ్ముతున్నాను బాబా!"

source: http://www.shirdisaibabaexperiences.org/2019/10/shirdi-sai-baba-miracles-part-2527.html


5 comments:

  1. సాయీశ్వరా! మీ పాదాలకు శరణు వేడుతున్నాను. ప్రేమస్వరూపా! ఆనందనిలయా! సాయీ! మీ దయ ఉంటే చాలు తండ్రీ. ఐ లవ్ యూ బాబా సాయీ!"

    ReplyDelete
  2. సాయి సర్వదా మకుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడే దేవుడు

    ReplyDelete
  3. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo