సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీరఘువీర్ భాస్కర్ పురందరే - రెండవ భాగం


పురందరే చేత ఇంటి నిర్మాణం చేయించిన బాబా

ఒకసారి పురందరేతో బాబా, "భావూ, ఒక స్థలాన్ని కొని, అందులో ఇల్లు కట్టుకో" అన్నారు. నెలకు కేవలం 35 రూపాయల జీతాన్ని సంపాదించే అతనికి భూమిని కొనడం, ఇంటిని నిర్మించడం వంటివి ఆలోచనకు కూడా అందని విషయాలు. అందువలన బాబా చెప్పిన దానికి అతను ఎటువంటి స్పందనా లేకుండా ఉండిపోయాడు. అప్పుడు బాబా తన ప్రక్కన కూర్చొని ఉన్న ఫకీర్‌బాబా(బడే బాబా) వైపు తిరిగి, "చూడు! నేను చెప్పేది ప్రజలు ఏమాత్రం పట్టించుకోరు. వారు తమ తమ చింతలలో లీనమై ఉంటారు. నువ్వు రాంభావు వద్దకు వెళ్లి, నేను చెప్పేదానికి అతనైనా ఒప్పుకొని, అలా చేయటానికి సిద్ధపడతాడేమో కనుక్కో" అన్నారు. ఫకీర్‌బాబా వెళ్లి రాంభావు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు కానీ ఆ పేరుతో ఎవరూ లేరు. అతను తిరిగి బాబా వద్దకు వచ్చి, "ఆ పేరుతో ఎవరూ లేర"ని చెప్పాడు. అప్పుడు బాబా, "రాంభావు లేకపోతే విశ్వనాథ్‌ను అడుగు" అన్నారు. ఫకీర్‌బాబా మళ్ళీ వెళ్లి విచారించి వచ్చి బాబాతో, "విశ్వనాథ్ అనే పేరుతో కూడా ఇక్కడ ఎవరూ లేరు" అని చెప్పాడు. అప్పుడు బాబా పురందరేను చూపిస్తూ, "ఈ బ్రాహ్మణుడిని అడుగు" అన్నారు. పురందరే బాబా పాదాలపై శిరస్సునుంచి, "క్షమించండి బాబా! కానీ మీరు చెప్పేది చేయడం నా సామర్థ్యానికి మించినది. నేను స్థలం కొనలేను, ఇల్లు నిర్మించలేను" అని అన్నాడు. బాబా అతనిని అనునయిస్తూ, "నీకు అసాధ్యమనిపించేది నేను సాధ్యం చేస్తాను. నేను దాన్ని పూర్తి చేస్తాను" అని భరోసా ఇచ్చారు. అయినా అతని మనసులో సందేహాలు అలానే ఉన్నాయి. ఆ విషయం తెలిసిన బాబా, "నేను నీ అవసరాలకు మించి చాలా డబ్బిస్తాను. దానినుండి నువ్వు కొంత దాచుకుంటావు కూడా. నేను నిన్ను సంతోషపరుస్తాను. ఇప్పటికే నేను నీ ఇంటికి అవసరమైన దూలాలను కొన్నాను. నువ్వు ఇప్పుడు కేవలం 'ఊ..' అని చెప్పు" అన్నారు బాబా. ఆ మాటలతో పురందరేకున్న అభ్యంతరాలన్నీ తొలగిపోయి, "బాబా! మీరుండగా, మీ ఆశీస్సులు నాతో ఉండగా నాకు భయంలేదు. మీకు అన్నీ తెలుసు. కాబట్టి మీరు మాత్రమే అది జరిగేలా చేయాలి" అన్నాడు. బాబా నవ్వి, "అల్లా మాలిక్ హై" అని బాధ్యత తీసుకున్నారు. తరువాత ఆయన తమ జేబులో చేయిపెట్టి పిడికిలి నిండా డబ్బులు తీసి అతనికిచ్చారు. అవి ఆరు అణాలు ఉన్నాయి.

తరువాత పురందరే తల్లి నాశిక్ వెళ్ళాలని అనుకుంది. ఆ విషయమే బాబాని అనుమతి అడిగితే, "తొందరెందుకు? మధ్యాహ్నం వెళ్ళు" అన్నారు. ఇలాగే చెప్తూ బాబా వాళ్ళ ప్రయాణాన్ని పదకొండురోజులు వాయిదా వేశారు. పన్నెండవరోజు సామానంతా బండిలో సర్దుకున్న తరువాత పురందరే బాబా అనుమతి తీసుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు బాబా, "ఖాళీ కడుపుతో ప్రయాణించవద్దు. భోజనం చేసి వెళ్ళండి" అని చెప్పి వాళ్ళ ప్రయాణాన్ని ఆపారు. దాంతో సామానంతా దించేసి ఆడవాళ్లు భోజనాల తయారీలో నిమగ్నమయ్యారు. ఆరతి ముగిసిన తరువాత పురందరే తల్లి బాబాతో, "బాబా! ఇతను(పురందరే) మీ బిడ్డ, తనని జాగ్రత్తగా చూసుకోండి" అని విన్నవించుకుంది. బాబా ఆమెతో, "అమ్మా, నువ్వెందుకు ఆందోళన చెందుతున్నావు? నా భావూ వేలమైళ్ల దూరంలో ఉన్నా నేనెప్పుడూ అతనిని మరచిపోను. అతను లేకుండా నేను ఎప్పుడూ ఏదీ తినను. భవిష్యత్తులో కూడా అలా చేయను. నువ్వు అతని తల్లివి. కానీ నువ్వే అతన్ని పెంచావా? కాదు; అల్లా అక్కడ ఉన్నాడు. నా చిన్ననాటినుండి నేను అతనితో, అతనికి దగ్గర్లోనే ఉన్నాను. తన గురించి నువ్వు అస్సలు చింతించకు. అల్లా అతని క్షేమాన్ని చూసుకుంటాడు. ఈ ఊదీ తీసుకొని నిశ్చింతగా వెళ్ళు" అని అన్నారు.

నెలరోజుల తరువాత పురందరే వద్దకు తన స్నేహితుడొకడు బాంద్రా శివార్లలో కొంత భూమి కొనుగోలు చేయమనే ప్రతిపాదనతో వచ్చాడు. భూమికోసం పెట్టుబడి పెట్టే స్థితిలో పురందరే లేడు. కానీ సాయి సమర్థుని లీల అనుహ్యమైనది. పురందరే ధనసహాయం కోసం ఒక స్నేహితుని వద్దకు వెళ్ళాడు. ఆశ్చర్యకరంగా ఆ స్నేహితుడు వెంటనే డబ్బు ఇవ్వడానికి అంగీకరించాడు. అంతేకాదు, పురందరేకు వీలైనప్పుడే ఆ డబ్బు తిరిగి ఇవ్వమని చెప్పి, ప్రామిసరీ నోటు వంటి కాగితాలేవీ లేకుండానే డబ్బు ఇచ్చాడు. తరువాత పురందరే మిగతా ప్రక్రియలన్నీ పూర్తిచేసి భూమిని స్వాధీనం చేసుకున్నాడు. కానీ డబ్బు లేని కారణంగా ఇంటి నిర్మాణం గురించి ఆలోచన కూడా చేయలేకపోయాడు.

ఆ తరువాత పురందరే ఎప్పుడు శిరిడీ వచ్చినా బాబా ఇంటి విషయం అడుగుతూ తొందర చేయసాగారు. తాము చెప్పినట్లు చేయడం లేదని తిట్టిపోస్తుండేవారు. ఒక్కోసారి సటకా పట్టుకొని అతని మీదకి వెళ్లేవారు. రాళ్ళు కూడా రువ్వేవారు. కానీ అతనేం చేయగలడు? ఓరిమితో సహించి ఊరుకొనేవాడు. 1912 డిసెంబరులో అతను బాబా దర్శనం కోసం శిరిడీ వెళ్ళినప్పుడు ఉదయం దర్బార్ జరుగుతోంది. భక్తులు చాలామంది ఉన్నారు. నానాసాహెబ్ చందోర్కర్, హరిసీతారాం దీక్షిత్ తదితరులు కూడా ఉన్నారు. బాబా వాళ్లతో, "ఈ భావూని చూడండి, నేను చెప్పిన మాట అసలు వినటం లేదు. మూర్ఖుడి మాటలను లక్ష్యపెట్టనట్టుగా నా మాటలను లక్ష్యపెట్టట్లేదు. నేనేమైనా మూర్ఖుడినా?" అని అన్నారు. తరువాత చందోర్కర్ పురందరేను, "బాబా మీతో ఏం చెప్పారు?" అని అడిగాడు. అందుకతను జరిగినదంతా చెప్పి, ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక స్థోమత తనకు లేదని కూడా సంకోచపడకుండా చెప్పాడు. విషయం తెలుసుకున్న చందోర్కర్ బాబాతో, "మీరు అనుమతిస్తే మేమంతా కలిసి అతనికోసం ఒక ఇంటిని కట్టించి ఇస్తామ"ని అన్నాడు. అప్పుడు బాబా కరుణతో, "నా భావూ అమాయకుడు, కల్లాకపటం లేనివాడు. ప్రజలు అతనిని ఇబ్బంది పెడుతున్నారు, వేధిస్తున్నారు. అయినా మంచి మనసున్న అతను ఎవరినీ నిందించకుండా, కనీసం ఒక్క మాటైనా మాట్లాడకుండా ఓర్పుగా అన్నీ భరిస్తున్నాడు. ఇవన్నీ నేను ఎంతకాలం చూడాలి? నా దగ్గర పుష్కలంగా డబ్బు ఉంది. నేను అతనికి ఇవ్వాలనుకుంటున్నాను. కానీ అతను నా మాట వినడానికి సిద్ధంగా లేడు. ఇతరులను అతడు డబ్బు ఎందుకు అడగాలి? నేనే అతనికి ఇస్తాను. కానీ అతనిప్పుడు నా మాట తప్పక వినాలి" అని అన్నారు. బాబా మాటలకు అందరూ నివ్వెరపోయారు.

తరువాత ఒకరోజు శిరిడీలో శ్రీరామనవమి పండుగ జరుగుతోంది. సుమారు 20 వేలమందితో శిరిడీ గ్రామం నిండిపోయింది. అందరూ బాబా దర్శనం కోసం ఆత్రుతపడుతున్నారు. పురందరే, న్యాయవాది గణపతిరావు నాందేడ్కర్ ద్వారకామాయి మెట్లపై కూర్చొని వాళ్ళందరినీ వరుసక్రమంలో బాబా దర్శనం కోసం లోపలికి పంపుతున్నారు. అకస్మాత్తుగా విపరీతమైన కోపంతో బాబా నేరుగా పురందరే వద్దకు వచ్చి, "నువ్వు నన్ను చంపాలని ఈ జనాన్ని నా మీదకు పంపుతున్నావు. మసీదులోనూ, చావడిలోనూ నన్ను ప్రశాంతంగా కుర్చోనివ్వడం లేదు నువ్వు" అని అతనిపై అరవడం మొదలుపెట్టారు. తరువాత అతని ముక్కు పట్టుకుని ఆ జనం మధ్యనుండి బయటకు నెట్టారు. ఆయన చేతిలో సటకా ఉంది. నిస్సహాయస్థితిలో పురందరే పరుగందుకున్నాడు. బాబా కూడా అతనిని వెంబడించారు. ఆయన రాళ్లను తీసుకొని అతనిమీదకు విసురుతున్నారు. ఆ రాళ్ళు కిరాణాకొట్టు తలుపులకు తగిలాయి. బాబా అతని వెంటపడుతూ, "నువ్వు ఎక్కడికి పోతావు? నువ్వు నా నుండి తప్పించుకోలేవు. నిన్ను వదిలిపెట్టను. నిన్ను పట్టుకుని మసీదులో పాతిపెడతాను" అని అరిచారు.

మరుసటిరోజు పురందరే అసలేమీ జరగనట్లు మశీదు మెట్ల వద్ద నిలబడి బాబా దర్శనం కోసం వస్తున్న భక్త సమూహాన్ని నియంత్రించాడు. ఆ సమయంలో బాబా చాలా ప్రసన్నంగా ఉన్నారు. కానీ సాయంత్రం వేళ మళ్ళీ అతన్ని తిట్టి లెండీబాగ్‌కి వెళ్లారు. అప్పుడు పురందరే, హెచ్.ఎ.పండిట్‌లు గంటను తగిలించటం కోసం మశీదు పైకప్పుకు ఒక హుక్కును బిగించే పనిలో నిమగ్నమయ్యారు. అంతలో బాబా లెండీ నుండి తిరిగి వచ్చారు. బాబాను చూడగానే, గంటకు కట్టిన తాడును పట్టుకొని ఉన్న భక్తులు ఆయన తమని ఖచ్చితంగా కొడతారని భావించి ఆ తాడును వదిలేసి అక్కడినుండి పరుగుతీశారు. కానీ ఎత్తులో ఉన్న పురందరే, పండిట్‌లిద్దరూ ఎటూ పరుగు తీయలేని స్థితిలో ఏమీ చేయలేక చూస్తున్నారు. పైగా భక్తులు తాడు వదలి పారిపోయినందువల్ల గంట బరువంతా వాళ్ళమీదే పడి కదలలేని పరిస్థితి. వాళ్లిద్దరూ తమ మనసులోనే బాబాను ప్రార్థిస్తున్నారు. బాబా దగ్గరగా వచ్చి, స్తంభానికి అనుకొని నిల్చుని కంగారుగా, "నా పిల్లలు చనిపోతున్నారు, వాళ్ళని కాపాడటానికి ఎవరూ రావడం లేదు" అన్నారు. అదేక్షణంలో వాళ్ళిద్దరూ గంటను సరైన స్థలంలో హుక్కుకు తగిలించి కట్టారు. దాంతో దాని బరువు నుండి ఉపశమనం లభించి తేలికపడ్డారు. బాబా అక్కడే నిలబడి వాళ్లనే చూస్తున్నారు. ఇద్దరూ నెమ్మదిగా క్రిందకు దిగి భయంభయంగా బాబా పాదాలకు నమస్కరించారు. ఉన్నట్టుండి బాబా వారిపై విరుచుకుపడ్డారు, కానీ మరుక్షణంలో ప్రేమగా, "పిచ్చివాళ్ళలా ప్రవర్తించకండి. మీరు ఎందుకంత ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటారు? ఒకవేళ మీరు చనిపోయివుంటే? మీరే చూశారు కదా, ప్రజలు ఎలా పారిపోయారో! మీరు ఆపదలో ఉన్న ప్రతిసారీ కాపాడటానికి నేనెలా రాగలను? మనలాంటి పేదవారిని చూసుకొనేది అల్లా మాత్రమే, వేరెవరూ లేరు. ఇక వెళ్ళండి. వాడాలో విశ్రాంతి తీసుకోండి. బయటకు వెళ్లవద్దు" అన్నారు.

ఆరోజు రాత్రి చావడిలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశం ముగిసిన తరువాత పురందరేకు తీవ్రమైన తలనొప్పి వచ్చింది. బాబా అక్కడున్న భక్తులకు ప్రసాదాన్ని పంచుతున్నారు. పురందరే కూడా బాబా కోసమని కొద్ది భాగాన్ని తీసుకున్నాడు. అంతలో బాబా మళ్ళీ పురందరేపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ తిట్టడం మొదలుపెట్టారు. అతను అవేమీ పట్టించుకోకుండా నిర్భయంగా వెళ్లి బాబా పడక ప్రక్కన ఆ ప్రసాదాన్ని ఉంచాడు. ఆయన అతనితో, "నువ్వు మరీ అహంకారిగా, భయం లేకుండా తయారయ్యావు. ద్వారకామాయిలో గానీ, చావడిలో గానీ నువ్వు నన్ను నిద్రపోనివ్వట్లేదు, కూర్చోనివ్వట్లేదు. నాతో సమానంగా అవడానికి నీకు నువ్వే ప్రయత్నిస్తున్నావు. ఈ ప్రసాదాన్ని ఇక్కడినుండి తీసేయ్, లేకపోతే నేను దాన్ని విసిరిపారేస్తాను" అన్నారు. పురందరే నెమ్మదిగా, "బాబా! దయచేసి ప్రసాదాన్ని స్వీకరించండి. మీరు తింటేనే భక్తులంతా తింటారు" అని అభ్యర్థించాడు. కానీ బాబా కోపంగా, "ఇంకా నన్ను ఇబ్బందిపెట్టకు. దాన్ని నువ్వు తిని, మిగతావాళ్ళని కూడా తినమని చెప్పు" అన్నారు. దానికతడు "బాబా, ఈ ప్రసాదాన్ని రేపు ఉదయం తింటారా?" అని వినయంగా అడిగాడు. దానికి బాబా, "నేను దానిని తీసివేయమని చెప్పాను. రేపటి గురించి నేనేమీ వాగ్దానం చేయను" అని బదులిచ్చారు. అయినా అతడు దాన్ని అలమరాలో ఉంచాడు. అతని తలనొప్పి ఇంకా తీవ్రమైంది.

మరుసటిరోజు ఉదయం ఫకీర్‌బాబా బాబాతో, "మాలిక్, పురందరే చాలా బాధపడుతున్నాడు. తలనొప్పి కారణంగా అతను రాత్రంతా నిద్రపోలేదు. అయినా కూడా అతనిప్పుడు తీవ్రమైన ఎండలో కష్టపడుతున్నాడు. దయచేసి అతనికోసం మీరు ఏదైనా చేయండి" అని అన్నాడు. అందుకు బాబా, "అతను అదనపు సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. నన్ను చావడిలో, మసీదులో కుర్చోనివ్వట్లేదు" అని ఊరుకున్నారు. ఫకీర్‌బాబా, "కానీ బాబా, అతను ఏమి చేసినా అది మీ కోసమే చేస్తాడు. రోజంతా అతను మీ సేవలోనే ఉంటున్నాడు. దయచేసి  కనీసం ఏదైనా ఔషధం అతనికి ఇవ్వండి" అని ప్రాధేయపడ్డాడు. "అల్లా అంతా సరిచేస్తాడు" అని అన్నారు బాబా. కానీ పురందరే తలనొప్పి కొంచెం కూడా తగ్గలేదు. అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ కూడా, "బాబా, దయచేసి పురందరేకు తలనొప్పి నుండి ఉపశమనం కలిగించండి. పగలు, రాత్రి అతను ఆ నొప్పితో విలపిస్తున్నాడు" అని బాబాను అభ్యర్థించి తిరిగి బసకు వచ్చాడు. ఆ సమయంలో భరించలేని తలనొప్పితో పురందరే పడుతున్న అవస్థను కళ్లారా చూసిన దీక్షిత్ అతనితో, "ఇప్పుడే మనం బాబా వద్దకు వెళ్దాం పద. ఆయన ఏదో ఒకటి చేస్తారు" అని అన్నాడు. వెంటనే మశీదుకు బయలుదేరారు. పురందరేతోపాటు బాపూసాహెబ్ జోగ్, ఫకీర్‌బాబాలు కూడా వెళ్లారు. కానీ బాబా పురందరేను కనీసం కూర్చోవడానికి కూడా అనుమతించలేదు. ఆయన ఒక చేతిలో సటకా పట్టుకొని తిట్టడం మొదలుపెట్టారు.

అతను నిరాశతో లేచి రాధాకృష్ణమాయ వద్దకు వెళ్ళాడు. ఆమె తడి బట్ట అతని నుదుటిమీద వేసి నొప్పి నుండి  ఉపశమనం కలిగించడానికి ప్రయత్నించింది కానీ, ఫలితం లేకపోయింది. అతను ఆరురోజులు ఏదోవిధంగా ఆ బాధను భరిస్తూ వచ్చాడు. ఆ తరువాతరోజు బాబా అతనికి ఊదీ ఇచ్చి, తమ అమృతహస్తాన్ని అతని తలపై ఉంచి, "అల్లా అచ్ఛా కరేగా" అని ఆశీర్వదించారు. తరువాత అతను బాబా అనుమతి తీసుకొని తన ఇంటికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అతను బయలుదేరేటప్పుడు బాబా అతనితో, "వీలైనంత త్వరగా ఇంటిని నిర్మించు. నేను అక్కడికి రావాలనుకుంటున్నాను" అని ఇంటి విషయం గుర్తు చేశారు.

ఇంటికి చేరుకున్న తరువాత కూడా పురందరేకు తలనొప్పి నుండి ఉపశమనం లేదు. బాబా చెప్పినట్లు ఇంటి నిర్మాణం మొదలుపెడితేనైనా తలనొప్పి తగ్గుతుందని తలచి ఆఫీసులో 500 రూపాయలు అప్పు తీసుకొని పని మొదలుపెట్టాడు. రెండునెలలు గడిచినా అతని తలనొప్పి అలానే ఉంది. అయినా అతను ఏ వైద్యుడినీ సంప్రదించలేదు. ఎందుకంటే బాబా మీద, ఆయన ఊదీ మీద అతనికి అంతటి దృఢమైన విశ్వాసం. "బాబా నా సంచితకర్మను పూర్తిగా తొలగించాలనుకుంటున్నారు. అందుకే ఆయన నాకు బాధలు ఇస్తున్నారు. అవి భరించడానికి కావాల్సినంత శక్తిని కూడా ఆయనే ఇస్తున్నారు. ఆయన ఏమి చేసినా నా మంచి కోసమే" అని అతను అనుకునేవాడు. ఆ భావంతోపాటు అతని మనసులో తీవ్రమైన నిరాశ కూడా ఉంది. ఒకరోజు అతను, "ఇక నేను ఈ బాధను భరించలేను. నాకు ఈ బాధ నుండి విముక్తి కలిగిస్తారో లేక నన్ను చావమంటారో బాబాని అడగండి. నేను అక్కడి(శిరిడీ)కే వచ్చి, ఆయన సేవ చేసుకుంటూ చావుకోసం ఎదురుచూస్తూ జీవితాన్ని గడిపేస్తాను" అని దీనంగా రాధాకృష్ణమాయీకి ఒక ఉత్తరం వ్రాశాడు. రాధాకృష్ణమాయి ఆ ఉత్తరం గురించి బాబాకు తెలియజేసింది.

బాబా ఊదీతోపాటు కొద్దిగా "భూకి" అనే ఔషధ చూర్ణాన్ని డాక్టరు పిళ్లైకు ఇచ్చి పురందరేకు పంపమని చెప్పారు. అంతేకాదు, బాబా ఒక ఎన్వలప్‌ను కూడా ఇచ్చి, "ఊదీ పెట్టుకొని, ఆ చూర్ణం పీల్చమ"నే సూచన కూడా వ్రాయమన్నారు. పిళ్లై అలాగే వ్రాసి, "చింతించవద్దు. నీకు నయమవుతుంది. నిన్ను చూసుకోవటానికి అల్లా ఉన్నాడు. అతను ఉండగా ఎందుకు భయపడాలి? భయపడటం స్త్రీ లక్షణం. స్త్రీలా ఏడవకు" అన్న బాబా ఆశీస్సులను కూడా తెలియజేశాడు.

బాబా సూచించినట్లే పురందరే ఊదీ ధరించి, ఔషధ చూర్ణాన్ని పీల్చాడు. వెంటనే అతనికి తుమ్ము వచ్చింది. ఆపై అతనికి మంచి నిద్రపట్టి, మరుసటిరోజు ఉదయం పదిగంటలకు లేచాడు. దాదాపు అతని తలనొప్పి నయమైంది. మిగిలిన కాస్త నొప్పి కూడా అంత పట్టించుకోదగ్గదేమీ కాదు. ఇంటి నిర్మాణం పూర్తయ్యేవరకు అది అలాగే కొనసాగింది. రేగడి నెలలో గట్టి పునాది లేకుండానే త్వరత్వరగా నిర్మాణం చేయడం వలన త్వరలోనే ఆ ఇంటిగోడలు బీటలు వారాయి. ఎలాగైతేనేమి, ఇంటి నిర్మాణం పూర్తిచేసి, ఆ విషయాన్ని బాబాకు తెలియజేస్తూ, ఎప్పుడు గృహప్రవేశం పెట్టుకోవాలో తెలియజేయమని ఒక ఉత్తరం వ్రాశాడు. అతను వర్షాకాలం రావడానికి ముందే ఆ కార్యక్రమం ఉంటే బాగుంటుందని అనుకున్నాడు. అతని జాబుకి బాబా, "రాబోయే గురువారంనాడు గృప్రవేశం పెట్టుకో. నేను మీతోపాటు ఉంటాను" అని జవాబు పంపించారు.

బాబా ఆదేశానుసారం గురువారంనాడే గృహప్రవేశం చేసుకోవాలని పురందరే నిశ్చయించుకున్నాడు. ఆరోజు ఉదయానికి కూడా అతనికి తలనొప్పి ఉంది. అదేమీ పట్టించుకోకుండా అతడు గురువారంనాటి తన అలవాటుప్రకారం బాబాకు పూజ, ఆరతి పూర్తి చేసాడు. బాబాకోసం 'నైవేద్యం' కూడా తయారుచేశాడు. పేదవాడైన కారణంగా అతను ఎటువంటి ఆచారాలూ పాటించలేదు. 'పూజ' తంతువంటివి కూడా ఏమీ పెట్టుకోలేదు. అతడు తన మనసులో, 'బాబా పటం, ఆయనకు నైవేద్యం ఉంటే చాలు. ప్రతిదీ చక్కగా సాగుతుంది' అని అనుకున్నాడు. తరువాత బాబా పటాన్ని అతడు తన చేతుల్లోకి తీసుకొని, దాన్ని తన గుండెలకు హత్తుకునేలా పట్టుకొని భజనలు పాడుకుంటూ క్రొత్త ఇంటికి బయలుదేరాడు. అతను ఆశ్చర్యపోయేలా దారిపొడుగునా బాబా తనతోపాటు నడుస్తున్నారు. అతని చేతిలో ఉన్న పటాన్ని క్రొత్త ఇంటిలో నిర్దేశించిన స్థలంలో ఉంచేంతవరకు బాబా ఉన్నారు. మరుక్షణంలో ఆయన అదృశ్యమయ్యారు. ఎంతోకాలంగా తనని వేధిస్తున్న తలనొప్పి నుండి అతనికి పూర్తి ఉపశమనం లభించింది. ఇదంతా బాబా దయ వల్లనే. బాబా అతను ఒక భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలని అనుకున్నారు. ఆయన తమ అనుగ్రహంతో అతనిచేత ఆ కార్యాన్ని పూర్తి చేయించారు.

ఆ ఇల్లు బాంద్రా శివార్లలో దూరంగా ఏకాంత ప్రదేశంలో ఉంది. పురందరే ఆఫీసుకు వెళ్ళినప్పుడు అతని భార్య, బిడ్డ మాత్రమే అక్కడుండేవారు. ఆ విషయమై బాబా, "ఏమీ భయపడకు, నేనెప్పుడూ ఆ ఇంటికి కాపలా కాస్తూ ఉన్నాను" అన్నారు. నిజంగానే ఆ కుటుంబానికెట్టి బాధా కలగలేదు.

Amrosia in Shirdi & Baba's Runaanubandh by vinny chittluri

  

 


ముందు భాగం

కోసం

బాబా పాదుకలు తాకండి.



 

నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 


తరువాయి భాగం కోసం

బాబా పాదాలు తాకండి.

 



3 comments:

  1. 🙏💐🙏ఓం సాయిరాం🙏💐🙏

    ReplyDelete
  2. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo