సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 299వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయి ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి?
  2. సాయి చేస్తున్న మార్గనిర్దేశం

సాయి ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి?

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

సాయిరామ్! నేను మీ అందరిలాగే బాబా భక్తురాలిని. నేను మహాపారాయణ (mp-18) గ్రూపులో సభ్యురాలిని  మరియు mp-575 గ్రూపు టీచరుని. ముందుగా సాయి మనందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే అనుభవం నాకు చాలా గొప్ప అనుభవం. కారణం, అది దాదాపు అసాధ్యమైనది. కేవలం బాబా కృపవలన సాధ్యమైంది. కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా నా చిన్నకొడుకు ఇంటర్మీడియెట్ పరీక్షలలో ఫెయిల్ అయ్యాడు. నిజానికి తను ఇంటర్మీడియట్ తర్వాత ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేయాలని ఎన్నో కలలుగన్నాడు. కానీ తన ఉపాధ్యాయుడి చెత్త రాజకీయాల కారణంగా తను చదువుపట్ల ఆసక్తిని కోల్పోయి చాలా మొండిగా తయారయ్యాడు. ఆ విధంగా ఆ పరిస్థితికి తనే బాధ్యుడు. ఏది ఏమైనా ఒక తల్లిగా ఆ రోజులు నాకు చాలా కష్టమైనవి. తన భవిష్యత్తు ఏమవుతుందోనన్న బాధతో చాలా ఆందోళనపడుతూ నిద్రలేని రాత్రులు గడిపాను. ఎప్పటిలాగే ఆ పరిస్థితిలో నాకున్న ఏకైక ఆశ్రయం నా సాయే! ఆయన నాకెందుకు ఈ పరిస్థితి ఇచ్చారో అందుకు కారణాన్ని ఖచ్చితంగా ఆయన తెలియజేస్తారని దృఢమైన విశ్వాసంతో ఆయననే పట్టుకున్నాను. కొన్నిరోజులకి ఆరోజు రానే వచ్చింది. బాబా నాకు సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో తన స్నేహితులందరూ ఇంజనీరింగ్ కాలేజీలలో సీటు కోసం దరఖాస్తు చేసుకుంటుంటే, నా కొడుకు 10వ తరగతి (సిబిఎస్‌ఇ) మార్కుల ఆధారంగా ఢిల్లీ స్టేట్ నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుకు దరఖాస్తు చేసేలా బాబా నన్ను ప్రోత్సహించారు. బాబా దయవలన నేను తన తరపున దరఖాస్తు చేసి పరీక్షకు హాజరవ్వమని నా కొడుకుని ఒప్పించగలిగాను. కానీ తాను ఆ పరీక్ష కోసం ఏమాత్రం ప్రిపేర్ కాలేదు. తరువాత పరీక్ష జరిగేరోజు తను పరీక్ష వ్రాయడానికి వెళ్లగా, నేను తన పరీక్షా కేంద్రానికి సమీపంలో ఉన్న బాబా మందిరంలో కూర్చుని, ఆ సమయమంతా స్తవనమంజరి చదువుతూ గడిపాను. అద్భుతం! ఏమాత్రం ప్రిపేర్ కాని నా కొడుకుకి బాబా ఆశీస్సుల వలన ఆ పరీక్షలో చాలా మంచి ర్యాంకు వచ్చింది. ఆ ఫలితాలు గురువారమే వచ్చేలా చేసి అది తమ అనుగ్రహమేనని బాబా స్పష్టంగా నాకు తెలియజేశారు. తను కాలేజీలో చేరాక మేము తన కాలేజీకి ఎదురుగా ఉన్న బాబా మందిరానికి వెళ్ళాము. నేను ఆ మందిరాన్ని దర్శించడం అదే మొదటిసారి. సింహాసనంపై కూర్చుని ఉన్న బాబా అందమైన చిరునవ్వుతో, “ఇప్పుడు నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికాయా?" అని నన్ను అడుగుతున్నట్లు అనుభూతి చెందాను. అది నాకు మరో అద్భుతమైన అనుభవం.

సంవత్సరకాలం వృధా కాకుండా బాబా కాపాడారు. ఇప్పుడు నా కొడుకు మొదటి సంవత్సరం కోర్సు పూర్తి చేయబోతున్నాడు. తను 3 సంవత్సరాల డిప్లొమా కోర్సు పూర్తిచేసిన తరువాత నేరుగా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశం పొందుతాడు. అతని స్నేహితులందరూ మంచి కళాశాలలో ప్రవేశం కోసం కష్టపడుతున్న సమయంలో ఇది నిజంగా నాకు గొప్ప అద్భుతం. వాళ్లంతా ఢిల్లీ బయట ఎక్కడో సీట్లు పొందుతారు. కానీ నా కొడుకు ఏ శ్రమా లేకుండా ఇంజనీరింగ్ కాలేజీలో సీటు పొందాడు. సాయి ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? తన భక్తుల నిజమైన కోరికలను నెరవేర్చడానికి ఆయన ఏదైనా చేస్తారని బాబా నిరూపించారు. నాకు, నా కొడుకుకు ప్రపంచం తలక్రిందులైనప్పుడు నా సాయి మాకు అండగా నిలబడి మంచి మార్గం చూపారు. ఆయన లీలలను వర్ణించడానికి ఏ పదాలూ సరిపోవు. "సాయీ! మీకు చాలా చాలా కృతజ్ఞతలు".

source:http://www.shirdisaibabaexperiences.org/2019/10/shirdi-sai-baba-miracles-part-2516.html

సాయి చేస్తున్న మార్గనిర్దేశం

హైదరాబాద్ నుండి సాయిభక్తురాలు శ్రీమతి మాధవిరెడ్డి తన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరామ్! సాయిభక్తులకు ఇంత చక్కని వేదికను అందిస్తున్న సాయికి చాలా ధన్యవాదాలు. నేను ప్రతి ఉదయం బ్లాగ్ నుండి బాబా సందేశాన్ని అందుకుంటున్నాను. అవి చదవడంతోనే నేను నా రోజును ప్రారంభించాలని అనుకుంటూ ఉంటాను. నా జీవితమంతా సాయి నాతోనే ఉన్నారు. ఆయన మార్గనిర్దేశం చేస్తూ ఇబ్బందులు, టెన్సన్స్ నుండి నాకు విముక్తినిస్తున్నారు. నా జీవితంలో బాబా ప్రసాదించిన అనుభవాలు చాలా ఉన్నాయి. నాకు గురువు, దైవం, మార్గదర్శకుడు, ఒకటేమిటి, అన్నీ బాబానే. 

2018లో నేను ఒక అపార్టుమెంటులో పెట్టుబడి పెడదామని అనుకున్నాను. అయితే డబ్బు సిద్ధంగా ఉన్నప్పటికీ నా భర్త దానికి అంగీకరించలేదు. ఆ స్థితిలో నేను, "నాకు మార్గనిర్దేశం చేయండి బాబా" అని బాబాను ప్రార్థించాను. వెంటనే బాబా అనుగ్రహించి నాకు మార్గనిర్దేశం చేశారు. నేను మంచి రేటుకి ఆ ఆస్తిని అమ్మేసి, నిర్మాణం పూర్తయిన వేరే అపార్టుమెంటులో పెట్టుబడి పెట్టగలిగాను. అది ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉండటం వలన ఆలస్యం లేకుండా అద్దె రూపంలో నాకు రాబడి కూడా మొదలైంది. నేను వదిలేసిన ఫ్లాట్ ప్రారంభం కావడానికి దాదాపు ఒకటిన్నర సంవత్సరం పట్టింది.

ఇటీవల 2019, నవంబరులో నేను చాలా ఆందోళనకు గురయ్యాను. దానివలన నేను రాత్రిళ్ళు నిద్రపోలేకపోయాను. నాకు సహాయాన్ని అందించి, మార్గనిర్దేశం చేయమని బాబాను ప్రార్థించాను. తరువాత బాబా దయతో వైద్యపరీక్షలు చేయించుకోవడానికి నా భర్తను ఒప్పించాను. వైద్యపరీక్షలు చేయించుకుంటే, నా భర్తకు గుండెకు సంబంధించిన ధమనుల్లో సమస్యలున్నాయని, శస్త్రచికిత్స చేయించుకోవాలని డాక్టర్ చెప్పారు. అంతేకాదు, వాళ్ళు మాతో, "ఎటువంటి సమస్యా లేకుండా పరీక్షలు చేయించుకోవడానికి రావడం గొప్ప విషయం. సమస్య రావడానికన్నా ముందే మమ్మల్ని సంప్రదించడం మీ అదృష్టం" అని అన్నారు. ఇదంతా బాబా ఆశీర్వాదమే. దయతో ఆయన మాకు మార్గనిర్దేశం చేశారు.

ఇవి కేవలం ఒకటి, రెండు సంఘటనలు మాత్రమే, కానీ నా జీవితమంతా బాబా ఆశీస్సులతో నిండి ఉంది. "బాబా! దయచేసి నాకు, నా భర్తకు, పిల్లలకు ఎల్లప్పుడూ అండగా ఉండండి. పిల్లల చదువుల్లో, వాళ్ళకు చక్కటి జీవితం ఏర్పడటంలో మీరు మార్గనిర్దేశం చేయండి బాబా".


4 comments:

  1. SAI NAAKU KUDA MANCHI ABAYAM IVVU
    DIKKU YEVARU LERU BABU
    NEEKU TAPPA EEVARIKI CHEPPUKOLENU
    PLS. SAI ALWAYS BE WITH ME

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo