సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాపూసాహెబ్ బూటీ




నాగపూర్‌ నివాసి, కోటీశ్వరుడు అయిన శ్రీ గోపాలరావ్ ముకుంద్ అలియాస్ బాపూసాహెబ్ బూటీ సాయిబాబాకు గొప్ప భక్తుడు. అతనొక న్యాయవాది మరియు వ్యాపారవేత్త. అతని వ్యాపారానికి సంబంధించిన శాఖలు పలుచోట్ల ఉన్నాయి. బాబా అతన్ని ప్రేమగా “బూటయ్యా!” అని పిలిచేవారు. చాలామంది భక్తులు బాబాతో మాట్లాడేవారు, వాదించేవారు. కానీ బూటీ, నూల్కర్ మరియు ఖపర్డేలు ముగ్గురు మాత్రం బాబా సమక్షంలో ఎప్పుడూ మౌనంగా ఉండేవారు. వాళ్ళ లక్ష్యమొక్కటే - బాబా చెప్పినట్లు నడుచుకోవడం. 

కోటీశ్వరుడైనప్పటికీ బూటీ సాధుసత్పురుషుల సేవను ఎంతో ఇష్టపడేవాడు. అతను బెరార్‌కి చెందిన సత్పురుషుడు గజానన్ మహరాజ్‌ను గురువుగా భావిస్తూ సంవత్సరంలో ఎక్కువ సమయం వారి సేవలో గడపాలని తలచేవాడు. ఒకసారి బూటీ హజరత్ తాజుద్దీన్‌బాబాను దర్శించాడు. ఆయన, "నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావ్? నీ గురువు శిరిడీలో నీకోసం వేచి ఉన్నారు, త్వరగా అక్కడికి వెళ్ళు!" అని అన్నారు. ఆయన మాటలు బూటీకేమీ అర్థం కాలేదు. ఆ తరువాత 1910వ సంవత్సరంలో శ్రీ ఎస్.బి.ధుమాళ్ అతన్ని మొట్టమొదటిసారి సాయిబాబా దర్శనానికి తీసుకుని వెళ్ళాడు. ఒకప్పుడు గజానన్ మహరాజ్ సేవలో ఎక్కువ సమయం గడపాలనుకున్న బూటీ, బాబా దర్శనంతో ఎంతో తృప్తి చెంది, కుటుంబంతో సహా తరచూ శిరిడీ వెళ్లి బాబా సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతుండేవాడు. క్రమంగా అతను శిరిడీనే తన శాశ్వత నివాసం చేసుకోవాలని ఆరాటపడసాగాడు. అందుకోసం శిరిడీలో ఒక భవన నిర్మాణం చేయాలని తరచూ అనుకుంటుండేవాడు. ప్రతిరోజూ మధ్యాహ్న ఆరతి తరువాత, బాబాకు ఎడమవైపున కూర్చుని బూటీ భోజనం చేసేవాడు. బాబా రోజూ లెండీకి వెళ్లిరావడం ఒక ఉత్సవంగా మారినప్పటినుండి అతను బాబాకు ఎడమవైపున నడిచేవాడు. 

ఒకసారి కడుపులో శీతలం కారణంగా ఎడతెరిపిలేని వాంతులు, విరేచనాలతో బూటీ ఎంతో బాధపడ్డాడు. అతని వద్ద అన్నిరకాల ఔషధాలు ఉన్నప్పటికీ, వాటిలో ఏవీ అతని అనారోగ్యాన్ని నయంచేయడంలో ప్రభావాన్ని చూపలేదు. అతను తనకేమవుతుందోనన్న భయంతో ఆందోళన చెందసాగాడు. వాంతులు, విరోచనాలతో పూర్తిగా నీరసించిపోయినందున తన అలవాటు ప్రకారం బాబా దర్శనం కోసం మసీదుకు కూడా వెళ్ళలేకపోయాడు. బూటీ పరిస్థితి తెలిసిన బాబా, "అతనిని తీసుకుని రమ్మ"ని ఒక వ్యక్తిని పంపించారు. అతికష్టంమీద బూటీ మసీదుకు రాగా, బాబా అతన్ని తమ ముందు కూర్చుండబెట్టుకుని, "జాగ్రత్త! ఇక మీదట విరోచనం కాకూడదు! వాంతులు కూడా ఆగిపోవాలి!" అని అన్నారు. మళ్ళీ బాబా తమ చూపుడువేలు చూపిస్తూ అవే మాటలు అన్నారు. ఒక వైపు శారీరక నిస్సహాయత, మరొక వైపు తన గురువు ఆజ్ఞ. గురువు చెప్పినట్లు చేయకపోవటం పాపం. ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో పడిపోయాడు బూటీ. కానీ బాబా మాటలు చాలా శక్తివంతమైనవి. అంతటితో బూటీని బాధిస్తున్న రెండు సమస్యలూ సమసిపోయాయి. ఆ వ్యాధి నుండి అతనికి పూర్తిగా ఉపశమనం లభించింది.

మరోసారి బూటీ కలరాతో బాధపడ్డాడు. దాహంతో అతని గొంతు ఎండిపోయింది, కడుపులో ఒకటే బాధ. డాక్టర్ పిళ్ళై అన్నిరకాల నివారణోపాయాలు ప్రయత్నించాడు, కానీ ఫలితం లేకపోయింది. ఇక చేసేదిలేక పిళ్ళై బాబాను ఆశ్రయించి నివారణోపాయం చెప్పమని అడిగాడు. అప్పుడు బాబా, "మరుగుతున్న పాలలో బాదం, పిస్తా, అక్రోటు వేసి ఉడికించి, పంచదారతో కలిపి సేవిస్తే వెంటనే అతనికి నయమవుతుంద"ని చెప్పారు. బాబా మాటలకు బూటీ, పిళ్ళై ఇద్దరూ ఆశ్చర్యపోయారు. సాధారణంగా అటువంటి పదార్థాలు అనారోగ్యాన్ని పెంచుతాయని ఏ వైద్యుడైనా చెప్తాడు. కానీ బూటీ సాధారణ భక్తుడు కాదు. అతనికి బాబాపై అపారమైన నమ్మకం. అతను బాబా ఆదేశాన్ని తు.చ తప్పకుండా పాటించాడు. చిత్రంగా అతని అనారోగ్యం వెంటనే ఉపశమించింది.

ఒకసారి నానాసాహెబ్ డేంగ్లే అను గొప్ప జ్యోతిష్కుడు బూటీతో, "ఈరోజు మీకు అత్యంత అశుభమైన రోజు. ఈరోజు మీకు ప్రాణగండం ఉంది. మనసులో ధైర్యాన్ని కూడగట్టుకుని అప్రమత్తంగా ఉండండి" అని చెప్పాడు. అది విని బూటీ మనసు ఆందోళనకు గురైంది. ప్రతిక్షణం దాని గురించే చింతించసాగాడు. తరువాత తన అలవాటు ప్రకారం నానాసాహెబ్ తదితర భక్తులతో కలిసి మసీదుకు వెళ్లి బాబా వద్ద కూర్చున్నాడు. బాబా అతనిని చూస్తూనే, "ఈ నానా ఏమంటున్నాడు? ఈరోజు నీ జాతకం బాగాలేదని, నీకు మరణం సంభవిస్తుందని చెప్తున్నాడా? సరే, నీవు భయపడనక్కరలేదు. ‘మృత్యువు ఎలా చంపుతుందో చూద్దాం’ అని అతనితో ధైర్యంగా చెప్పు" అని అన్నారు. ఆ సాయంత్రం బూటీ మరుగుదొడ్డికి వెళ్ళినప్పుడు అక్కడొక పాము కనిపించింది. అతను భయంతో బయటకు పరిగెత్తుకు వచ్చాడు. అతని సేవకుడైన లహను ఒక రాయిని తీసుకుని ఆ పామును చంపబోయాడు. బూటీ అతనిని వారించి, "వెళ్లి కర్ర తీసుకుని రమ్మ"ని పంపించాడు. లహను కర్ర తీసుకుని వచ్చేలోపు పాము గోడపైకి ప్రాకుతూ అదుపుతప్పి క్రిందపడి ఒక రంధ్రం గుండా బయటకు వెళ్ళిపోయింది. ఆ ఉదయం బాబా తనతో అన్న మాటలను జ్ఞాపకం చేసుకుని, తనకు, పాముకు ఏ హానీ జరగకుండా బాబా కాపాడిన విధానానికి బూటీ ఆశ్చర్యపోయాడు.

1916లో బూటీ రెండవ వివాహం శిరిడీలో జరిగింది. ఆ పెళ్ళికి ఎమ్.డబ్ల్యు.ప్రధాన్ మొదలైన భక్తులు హాజరయ్యారు. ఒకసారి ఒక భక్తుడు బాబా చేతిలో ఒక జ్యోతిష్య శాస్త్ర గ్రంథాన్ని పెట్టి, తిరిగి దాన్ని వారి ప్రసాదంగా తీసుకోదలిచాడు. అలా తీసుకోవడం వల్ల తనకా శాస్త్రంలో ప్రావీణ్యం సిద్ధిస్తుందని, తద్వారా తన దశ మారుతుందని అతని ఆలోచన. కానీ బాబా ఆ పుస్తకాన్ని అతనికి ఇవ్వకుండా దగ్గరలో కూర్చుని ఉన్న బూటీ చేతికిచ్చి, "దీన్ని తీసుకో!" అన్నారు.  బూటీకి ఆ పుస్తకాన్ని చదవాలన్న ఆసక్తి లేకపోయినప్పటికీ బాబా ప్రసాదించారని కష్టపడి ఒకసారి చదివాడు. ఒక్కసారే చదివినప్పటికీ అతనికి ఆ శాస్త్రంలో ప్రావీణ్యం కలిగి, నైపుణ్యం కలిగిన జ్యోతిష్కుడిలా పరిస్థితులను ఖచ్చితంగా అంచనా వేయగలిగేవాడు. ఒకసారి ఎన్నికలు ఏ సమయంలో జరిగితే దీక్షిత్ గెలుస్తాడో బూటీ చెప్పాడు. బూటీ చెప్పినట్లుగానే ఎన్నికలు ఆ సమయంలోనే జరిగి దీక్షిత్ గెలిచాడు.

ఒకరాత్రి బూటీ, శ్యామాలు దీక్షిత్‌వాడా పైఅంతస్తులో నిద్రపోతున్నారు. కొంతసేపటికి బూటీకి ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా అతనికి దర్శనమిచ్చి, "మందిరంతో సహా ఒక వాడాను నిర్మించు” అని ఆదేశించారు. వెంటనే అతనికి మెలకువ వచ్చి, కలను గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంతలో ప్రక్కనే పడుకుని ఉన్న శ్యామా ఏడుస్తున్న శబ్దం అతనికి వినిపించింది. బూటీ అతనిని మేల్కొలిపి, "మీరెందుకు ఏడుస్తున్నార”ని అడిగాడు. అందుకు శ్యామా, "నాకొక స్వప్నదర్శనమైంది. అందులో బాబా కనిపించి, “మందిరంతో సహా ఒక వాడాను నిర్మించండి! నేనక్కడ ఉండి అందరి కోరికలు తీరుస్తాను” అని చెప్పారు. మధురమైన వారి ప్రేమ పలుకులు విని నాకు భావోద్రేకం కలిగి, ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఆ పారవశ్యంలో నా కళ్ళనుండి కన్నీళ్లు పొంగిపొర్లుతున్నాయి" అని చెప్పాడు. శ్యామా మాటలు విన్న బూటీ తనకు కూడా అదే కల వచ్చిందని చెప్పాడు. ఇద్దరికీ ఒకే కల వచ్చినందుకు శ్యామా, బూటీలు ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు. ఆ కల ద్వారా శిరిడీలో స్వంత భవనం నిర్మించుకోవాలన్న తన కోరికకు బలం చేకూరి, ఆలస్యం చేయక మందిరంతో సహా ఒక వాడాను నిర్మించాలని బూటీ సంకల్పించాడు. వెంటనే శ్యామా, బూటీలిరువురూ కూర్చుని వాడా రూపురేఖల నమూనాను తయారుచేశారు. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని పరిశీలించి ఆమోదించాడు. మరుసటిరోజు ఉదయం ముగ్గురూ బాబా వద్దకు వెళ్లారు. శ్యామా తనకి, బూటీకి గతరాత్రి వచ్చిన కల గురించి సాయిబాబాతో చెప్పాడు. వెంటనే బాబా వాడా నిర్మాణానికి తమ అనుమతిని ప్రసాదించారు.

బూటీవాడా నిర్మాణం 1915, డిసెంబర్ 30న ప్రారంభమైంది (ఖఫర్డే డైరీ, పేజి 123). వాడా నిర్మాణం 1915లో ప్రారంభమైనప్పటికీ, 1913 లోనే బూటీ అల్లుడైన నార్కేతో బాబా, "నీ మామ ఇక్కడొక మందిరం నిర్మిస్తాడు. నువ్వు దానికి ధర్మకర్తవవుతావు" అని ఈ నిర్మాణం గురించి ప్రస్తావించడం బాబా యొక్క సర్వజ్ఞతకు నిదర్శనం. బూటీవాడా నిర్మాణ పనులను శ్యామా దగ్గరుండి పర్యవేక్షిస్తుండేవాడు. ముందుగా బావి త్రవ్వి, పునాది నిర్మించారు. లెండీకి వెళ్లివచ్చేటప్పుడు బాబా ఆ నిర్మాణపు పనులను పరిశీలించి, "ఇక్కడ ఒక తలుపు, అక్కడ ఒక కిటికీ ఉంచండి. ఇక్కడ తూర్పుగా ఒక గ్యాలరీ ఏర్పాటు చేయండి. అది వాడా అందాన్ని మరింత పెంచుతుంది" అంటూ సూచనలిస్తుండేవారు. కొంత నిర్మాణం జరిగాక పర్యవేక్షణ బాధ్యతలను బాపూసాహెబు జోగ్‍కి అప్పగించారు బాబా. పనులు చకచకా సాగుతుండగా భవనం మధ్యలో మందిరం కోసం ఒక వేదిక ఏర్పాటు చేసి, దానిపై మురళీధరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని బూటీకి ఆలోచన వచ్చింది. కానీ అతను బాబాను సంప్రదించకుండా ఏ పనీ ప్రారంభించడు. అందుచేత తనకొచ్చిన ఆలోచనను శ్యామాతో చెప్పి, బాబా అనుమతి తీసుకోమని చెప్పాడు. తమ దినచర్యలో భాగంగా బాబా లెండీ నుండి తిరిగి వస్తూ బూటీవాడా వద్దకు చేరుకోగానే, శ్యామా వారికి నమస్కరించి బూటీ ఆలోచనను చెప్పి, "మీరు అనుమతిస్తే మందిర నిర్మాణం త్వరగా పూర్తవుతుంద"ని చెప్పాడు. బాబా సంతోషంగా తమ అనుమతినిస్తూ, "సరే, అలాగే కానివ్వండి. మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత, మేము అక్కడికి వచ్చి ఉంటాము" అని వాడా వైపు చూస్తూ, "వాడా నిర్మాణం పూర్తయ్యాక దానిని మనమే ఉపయోగించుకుందాం. మనమందరమూ అక్కడే ఆడుకుంటూ, ఆలింగనం చేసుకుంటూ ఆనందంగా సమయాన్ని గడుపుదాం" అని అన్నారు. అప్పుడు శ్యామా, "దేవా! ఇది మీ ఖచ్చితమైన అనుమతే అయితే, మీ అనుమతినే శుభముహుర్తంగా భావించి మందిర నిర్మాణం ప్రారంభించడానికి కొబ్బరికాయ తెచ్చి పగలగొట్టనా?" అని బాబాను అడిగాడు. అందుకు బాబా "ఆఁ.. కొట్టు, కొట్టు!" అన్నారు. బాబా ఆదేశానుసారం శ్యామా వెంటనే వెళ్లి కొబ్బరికాయ తెచ్చి పగలగొట్టాడు. 

మందిర నిర్మాణం, మురళీధరుని విగ్రహ ప్రతిష్ఠకు వేదిక నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. మురళీధరుని విగ్రహాన్ని తయారుచేయమని శిల్పులని నియమించారు. ఇంతలో హఠాత్తుగా బాబా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వారికి అంతిమ ఘడియలు సమీపించినట్లుగా అందరికీ తోచింది. భక్తులందరూ ఎంతో ఆందోళన చెందారు. బాబా పాదస్పర్శ సోకనిచో లక్షలు ఖర్చు చేసి నిర్మిస్తున్న తన వాడా పరిస్థితి ఏమిటన్న దిగులుతో బూటీ పూర్తిగా నిరాశకు గురయ్యాడు. కానీ బాబా తమ చివరిక్షణాలలో, “నాకిక్కడ ఏమీ బాగాలేదు. నన్ను ఆ రాతివాడాకు తీసుకుపోండి. నాకక్కడ సుఖంగా ఉంటుంది. ఈ శరీరాన్ని వాడాలో ఉంచండి” అని చెప్పారు. ఆ మాటలు బూటీకి ఎంతో ఓదార్పునిచ్చాయి.

బాబా దేహత్యాగం చేసిన తరువాత, వారి కోరిక ప్రకారం బాబా పవిత్ర దేహాన్ని మురళీధరుని కోసం నిర్మించిన వేదిక క్రింద సమాధి చేశారు. బాబాయే మురళీధరుడయ్యారు. 'బూటీవాడా' సాయిబాబా సమాధిమందిరం అయింది. రాతి భవనాన్ని నిర్మించి, దానిని బాబాకు అంకితం చేసి బూటీ విశేషమైన సేవ చేశాడు. (అధ్యాయం 39, శ్రీసాయిసచ్చరిత్ర)

తరువాత సాయిబాబా సమాధి యొక్క పూజా కార్యక్రమాలు మరియు సమాధి మందిర నిర్వహణకు శ్రీమాన్ బాపాసాహెబ్ బూటీ చైర్మన్‌గా 15 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం శిరిడీలో చావడి ముందు వేడుకలు, నాటక ప్రదర్శనలు జరిగేవి. చుట్టుప్రక్కల గ్రామాల నుండి ఎంతోమంది ప్రజలు ఆ వేడుకలకు హాజరయ్యేవారు. ఆ కార్యక్రమాల ఖర్చుల నిమిత్తం బూటీ ఏటా 500 రూపాయల పెద్ద మొత్తాన్ని విరాళంగా ఇస్తూండేవాడు. గురుపూర్ణిమ వేడుకలను కూడా బూటీ ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహిస్తుండేవాడు. బూటీ మరణానంతరం అతని కుమారులు 1940 వరకు ఈ పండుగలను నిర్వహించారు. 1941 నుండి సంస్థాన్ ఈ పండుగను నిర్వహిస్తోంది. ఆ ఖర్చుల నిమిత్తం బూటీ కుమారులు 100 రూపాయలు ఇస్తుండేవారు.

1921లో బాపూసాహెబ్ బూటీకి అంతిమ ఘడియలు సమీపించాయి. ఆ సమయంలో శ్యామా అక్కడే ఉన్నాడు. బూటీ శ్యామాను దగ్గరకు పిలిచి, "మాధవరావ్! నేను ఈ బాధను భరించలేకపోతున్నాను. బాబా నన్ను తమ పాదాల చెంతకు చేర్చుకుంటే బాగుంటుంది. నాకు మీ గురించి బాగా తెలుసు. మీరు దగ్గర ఉంటే, నాకు బాబా పాదాల వద్ద ఉన్నట్లే అనిపిస్తుంది" అని చెప్తూ, భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుని, శ్యామా పాదాలనే బాబా పాదాలుగా భావించి శ్యామా పాదాలపై తన శిరస్సునుంచాడు. ఆ తరువాత బూటీ సంతోషంగా కన్నుమూశాడు.

సమాప్తం.....

Source:http://saiamrithadhara.com/mahabhakthas/gopalrao_bapusaheb_buti.html
http://bonjanrao.blogspot.com/2012/08/b-p-u-s-h-e-b-b-o-o-t-y.html
http://babasdevotee.blogspot.com/2012/03/shama-or-madhavrao-deshpande-final.html

11 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై🙏🌺🙏

    ReplyDelete
  3. 💐🌷Om Sairam 🌷💐🙏🙏🙏

    ReplyDelete
  4. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  5. Om srisairam Om srisairam Om srisairam thankyou sister

    ReplyDelete
  6. Kothakonda SrinivasJune 9, 2021 at 1:23 PM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  7. 🙏 ఓం సాయిరామ్ 🙏

    ReplyDelete
  8. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😀❤🌺😊🌹🌼🌸

    ReplyDelete
  9. ఓమ్ సాయిరాం ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి

    ReplyDelete
  10. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo