సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తి సాధన రహస్యం - ‘ఊర’కుండుట తెలుపు ఉత్తమయోగం!




‘ఊర’కుండుట తెలుపు ఉత్తమయోగం!

“గురువుకు పగ్గాలు అప్పగించి నిశ్చింతగా ఊరక కూర్చుంటే చాలు! చేయవలసినదంతా నేను చేసి, మిమ్ములను చివరికంటా గమ్యం చేరుస్తాను!”  - అన్న శ్రీసాయి ఉపదేశం ఆయన బోధనసారమని చెప్పొచ్చు! పైకి చూచేందుకు అది ఎంతో తేలికైన సాధనగా కనిపించవచ్చు; ‘ఇంతేనా’ అని అనిపించనూ వచ్చు! లోతుగా యోచిస్తేగానీ అగాధమైన శ్రీసాయిలీలాప్రబోధాలలోని అమూల్య అంతరార్థాలు మనకవగతం కావు. ఎందుకంటే, బాబా చెప్పినట్లు ఆయనకు పూర్తిగా ‘పగ్గాలప్పజెప్పి నిశ్చింతగా ఊరక కూర్చొనడం’ అంత తేలికైన పనేమీ కాదు! మనలోని వివిధ మనోచాపల్యాలు మనలనలా ‘ఊరక’ కూర్చొననివ్వవు. ఈ దృష్ట్యా బాబా బోధించిన ఆధ్యాత్మిక సాధనకు మనోనిగ్రహము, సంయమనము – పరోక్షంగా ఆవశ్యకాలే అవుతున్నాయి. “ఊరకుండుట దెలియ ఉత్తమయోగంబు! మానసంపు కలిమి మధ్యమంబు” అని వేమన యోగీంద్రుడన్నదందుకే. బాబా బోధించిన ‘ఊరక కూర్చొనడమనే ఉత్తమ యోగ’ సిద్ధికి యెటువంటి చాపల్యాలు లేని మానసంపు కలిమి బలిమి మాధ్యమికమైన సాధన మార్గాలు. మన మనోరథాలీడేరాలంటే, మన మనస్సనే రథం యొక్క పగ్గాలు పూర్తిగా బాబాకు అప్పగించాలి. అలా అప్పగించాలంటే, మన మనసు యొక్క పగ్గాలు ముందు మన చేతిలోకి రావాలి కదా? అలా మన మనసు యొక్క పగ్గాలు మనకు స్వాధీనం కావడానికి బాబా బోధించిన అనేక ఉపాయాలలో ఆహార నియమము, నైవేద్య నియమము ముఖ్యమైనవి. అదెలాగో ఇంకొంచెం వివరంగా తెలుసుకొందాం!

మనోనిగ్రహాన్ని నిర్వీర్యం చేసే చాపల్యాలలో కామాన్ని ధనవ్యామోహాన్ని (-శ్రీరామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలంటే "కామినీ కాంచనాల" ను) జయించడం కష్టమని అందరూ అనుకోవడం కద్దు. ఒకవిధంగా ఇది యదార్థం కూడా. ఈ అవరోధాలను అధిగమించేందుకు మహాత్ములు ఎన్నో ఉపాయాలను, సుళువులను బోధించారు. వాటిలో సాత్త్వికాహారం ఒకటి. అయితే, మహాత్ములు బోధించిన మిగిలిన సాధనోపాయాలన్నింటికంటే ఈ సాత్త్విక ‘ఆహార’ నియమానికి ఎక్కువ ప్రజాకర్షణ, ఆదరణ లభించింది. దాంతో, మనలో సత్త్వగుణాన్ని పెంపొందించే సాత్త్విక పదార్థాలేమిటి? ఏయే పదార్థాలు రజోగుణాన్ని పెంచుతాయి? ఏయే తామస పదార్థాల వలన మనలో తమోగుణం పెరుగుతుంది? సాధకుడు ఏయే పదార్థాలు తినాలి? ఏవి తినవచ్చు? ఏవి తినకూడదు? ఎవరు పెడితే తినవచ్చు? ఎవరితో తినకూడదు? ఎప్పుడు ఎలా తినాలి? ఎప్పుడెప్పుడు తినకూడదు? దైవానికి ఏయే పదార్థాలు నైవేద్యంగా పెట్టాలి? ఏవి పెట్టరాదు? - వగైరా విచికిత్స విచారణ పెరిగాయి. ఈ సాత్త్వికాహార జిజ్ఞాస వామనపాదంలా పెరిగిపెరిగి క్రమంగా బ్రహ్మజిజ్ఞాసను బలికొంది. తత్ఫలితంగా యీ ఆహార విషయ విచికిత్స కాలాంతరంలో ఏ చికిత్సకు అలవికాని మడి మైల వంటి మూఢాచారాలకు, అస్పృశ్యత వంటి దురాచారాలకు, ‘ఉపవాసతపవాసాది’ వ్యర్థాచారాలకు దారితీసింది. ఈ దుస్థితికి ఆవేదన చెంది ఆహారనియమాల పేర అంటుజాడ్యంలా ప్రబలిన అవివేకపు ఆచారాలను తూర్పారబట్టాడు శ్రీవివేకానందస్వామి. “ఆహార పారిశుద్ధ్య నియమంలోని మూలభావం నశించింది. దాని అక్షరాలు మాత్రం పాటింపబడుతున్నాయి. ఆహార శబ్దానికి ‘ఇంద్రియ విషయములు’ అని శ్రీఆదిశంకరాచార్యులు, ‘అన్నము’ అని శ్రీరామానుజులు అర్థం చెప్పారు. ఈ రెండు దృక్పథాలకు సామరస్యం కల్పించే అర్థాన్ని తీసుకోవాలని నా అభిప్రాయం. ఆహారాన్ని గూర్చిన పరిశుద్ధతాపరిశుద్ధతల విచారంలోనే జీవితకాలమంతా వ్యర్థంగా గడిచిపోతున్నది. ఇంద్రియనిగ్రహమే (ఆహార నియమం యొక్క) ముఖ్యోద్దేశ్యము... మతాన్ని వంట ఇంట్లో బంధించకండి!” ఇది శ్రీవివేకానందుల వివేకవాణి.

ఆత్మోద్ధరణకు వివేకాభ్యాసాలు రెండూ అవసరం. వివేకశూన్యమైన అభ్యాసం క్రమంగా దురభ్యాసంగా మారక తప్పదు. మరైతే, ఏది వివేకం? ఈ అంశాన్ని గూర్చి మరి కొంచెం యోచిద్దాం! ఏది సాత్త్వికాహారం అనే విషయంలో మహాత్ములలోను వివిధ యోగశాస్త్రగ్రంథాల మధ్య ఏకాభిప్రాయం లేదు! సాత్త్వికాహారం ఏది అన్న నిర్ణయం విషయంలో భిన్నాభిప్రాయాలున్నా, సాధనలో సాత్త్వికాహారం అవసరమన్న విషయాన్ని మాత్రం అందరూ అంగీకరించారు. మరి ఆధ్యాత్మిక సాధనలో సాత్త్వికాహారం అవసరమన్న విషయం ఎఱిగివుండి కూడా సాధకులు సాత్త్వికాహారాన్నే ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఎందరో సాధకులు సాత్త్వికాహార నియమం పాటించదలచుకొన్నా అట్టే కాలం ఆ అభ్యాసాన్ని కొనసాగించలేకపోవడానికి కారణమేమిటి? వారిలో సత్త్వగుణం లోపించడం వల్లనేనని శాస్త్రం చెప్పే సమాధానం. ఉదాహరణకు సత్త్వగుణప్రధానులు సాత్త్వికమైన ఆహారాన్ని, రాజసులు రజోగుణ ప్రధానమైన ఆహారాన్ని, తమోగుణ ప్రధానులు తామసపదార్థాలను ఇష్టపడతారని భగవద్గీత. అంటే, సత్వగుణం పెంపొందాలంటే సాత్త్వికాహారం తీసుకోవాలి. సాత్త్వికాహారాన్ని ప్రీతితో తీసుకోవాలంటే సత్త్వగుణముండాలి! చూచేందుకీ సమస్య 'పెళ్ళైతే కాని పిచ్చి కుదరదు; పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు!' అన్నట్లుంది కదూ! ప్రారంభంలో సాధకునికి సాత్త్వికాహారం మీద ప్రీతి వుండదు; ఇష్టం లేకపోయినా, సాత్త్వికాహారాన్నే నియమంగా తీసుకుంటుంటే, కొంతకాలానికి అతనిలో సత్వగుణం పెరిగి, ఆ తరువాత ఆ సాత్త్వికాహారాన్నే ఇష్టపడతాడు - అని అందామా? సరి! ఇష్టంలేక కష్టంతో ఒక నియమాన్ని పాటించడం తామసమైన సాధనని పెద్దల ఉవాచ. అదీగాక, సంతోషము ప్రీతి తృప్తి కలిగించని ఆహారం అసాత్త్వికమే అవుతుంది!

మనం తీసుకొనే ఆహారం సాత్త్వికమైనా అసాత్త్వికమైనా, మన ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉన్నంతవరకు అది జిహ్వాచాపల్యం క్రిందనే జమవుతుంది. ఒకవేళ సాత్త్వికాహారం పట్ల ‘ఇష్టం’ అనేది జిహ్వాచాపల్య లక్షణం కాదని ఎవరైనా అనవచ్చు! మంచిదే! కానీ, రాజసిక తామసిక పదార్థాల పట్ల మనకుండే చాపల్యమే, అసలైన సాత్వికాహారాన్ని ఇష్టంతో తిననీయకుండా చేస్తుందనేది మాత్రం నిర్వివాదమైన అంశం కదా? అందువల్ల, జిహ్వాచాపల్యాన్ని జయించడం వల్లనే సత్త్వగుణమొచ్చి, ఆ సత్త్వగుణం యొక్క ఒకానొక లక్షణంగా సాత్త్వికాహారాన్ని సహజ ప్రీతితో భుజించగలుగుతాడు. ఇంతకూ ఏతావాతా తేలిందేమంటే, - సంపూర్ణ శరణాగతి భావనను సుగమం చేసే మనో సంయమన సాధనకు ‘సాత్త్వికహారం’ ఉత్తమోత్తమమైన ఉపాయం అని చెప్పడానికి వీలులేదని తేలుతున్నది. మరి ఏది దారి? 

శ్రీసాయిలీలాప్రబోధాలను సునిశితంగా పరిశీలిస్తే అతి సుగమమైన ‘దారి’ మనకు ఇట్టే గోచరిస్తుంది. స్థూలదృష్టికి, బాబా చర్యలు భక్తులకు తమపై ‘నమ్మకం’ కుదిర్చే ‘చమత్కారాలు’ గాను, ఆయన ఉపదేశాలు సామాన్య నీతిబోధకాలైన ‘సూక్తులు’ గానూ కనిపిస్తాయి. “నేనెప్పుడూ చమత్కారాలు చెయ్యను!” అని చెప్పిన శ్రీసాయి, “నా చర్యలు అగాధాలు! ... ఎవరైతే నా లీలలను మననం చేస్తూ అందులోనే మునిగిపోతారో వారికి జ్ఞానరత్నాలు లభిస్తాయి!” అని కూడా అన్నారు. శ్రీసాయిలీలాప్రబోధాలను శ్రద్ధతో మననం చేస్తూ పోతే, బాబా మహత్తరగాథలు వేదోపబృంహణాలైన (వేదార్థాలను వివరించే) ఆఖ్యానాల్లా, ఆయన సూక్తులు రహస్యార్థ ప్రతిబోధకాలైన యోగసూత్రాల్లా మనకు గోచరిస్తాయి. అటువంటి తత్త్వజిజ్ఞాసతో కూడిన సాయిలీలాప్రబోధాల మననం మనలో సద్వివేకాన్ని, బాబా పట్ల భక్తిశ్రద్ధలను దృఢం చేసి, నిష్టాసబూరీలతో సాయిపథంలో సూటిగా సాగిపోయేలా చేస్తాయిసరి! ఇక, శ్రీసాయిబాబా ఆహారనియమం విషయకంగా ఏం చెప్పారో, ఆయన ఉపదేశాచరణ మనలో సంయమనాన్ని కలుగజేసి క్రమంగా ‘నిశ్చింతగా ఊరక కూర్చొనడమ’నే ఉత్తమయోగాన్ని ఎలా సిద్ధింపజేయగలదో చూద్దాం!

ఆహారనిద్రాభయ మైథునాలు – జీవులకు సహజధర్మాలని ముందే చెప్పుకున్నాం. ఈ నాలుగింటిలో ఆహారము మైథునము బాహ్య పదార్థాలతో వ్యక్తులతో సంబంధం కలిగినవి. అంటే వ్యక్తి యొక్క బాహ్యప్రవృత్తికి సంబంధించినవి. నిద్రాభయాలు మౌళికంగా మనోవృత్తులకు, అంటే, వ్యక్తి యొక్క అంతఃప్రవృత్తితో ముడిపడినవి. మైథునం జీవోత్పత్తికి కారణమైతే, ఆహారం జీవపోషణకు ఆధారం. జీవోత్పత్తికి మూలమైన వీర్యం ఆహారం నుండే ఉత్పన్నమవుతుంది. అందువల్ల మైథునం కంటే ఆహారమే జీవులకు ప్రాథమికావసరమని చెప్పొచ్చు. అంటే, అస్ఖలిత బ్రహ్మచర్యం పాటిస్తూ జీవితాంతం ఉండటం సాధ్యమవుతుంది కానీ, ఆహారం లేకుండా కొంతకాలం కూడా జీవించడం అసాధ్యం.

రసన మంటే నాలుక. జిహ్వ రసనేంద్రియము. ‘రస’మనే పదానికి ద్రవము, రుచి, సారము అనే అర్థాలున్నాయి. మనోదేహాలను పోషించడం ఆహారం యొక్క ప్రధాన ప్రయోజనం. వివిధ భక్ష్యభోజ్యాలను భుజించేటప్పుడు వాటి రుచిని ఆస్వాదిస్తూ మనసు పొందే సుఖానుభూతిని ఆహారం యొక్క అవాంతర ప్రయోజనమనవచ్చు. ప్రాణాధారమైన ఆహారం పట్ల మనసుకు ఆకర్షణను కలుగజేస్తుంది రుచి. ఉదాహరణకు, జీవోత్పత్తి అనే సహజ జీవధర్మానికి సాధనం మైథునము. అందము అలంకరణలు మొదలైనవి దానిని ఆకర్షణీయం చేసే ఉపాయాలు. అంటే, ఆకలి -భోజనం చేయటం అనేవి కామప్రవృత్తి-మైథునక్రియల వంటివైతే, వివిధ రుచులు-వంటకాలు లైంగిక ఆకర్షణను పెంచే సౌందర్య సాధనాలవంటివన్న మాట! మైథునం యొక్క మౌళిక ప్రయోజనాన్ని మరచి, దాని ద్వారా కలిగే సుఖానుభూతి పట్ల మోజు పెరిగితే సహజకామ ప్రవృత్తి కాముకత్వంగా మారుతుంది. అలాగే, ప్రాణాధారమైన ‘ఆహారసేవనాన్ని సుఖవంతం చేసేది రుచి’ - అనే ప్రకృతి ధర్మాన్ని మరచిపోతే, అది రుచులకోసం తినటమనే వికృతిగా పరిణమిస్తుంది. రుచిగా లేకపోతే శరీరానికి అవసరమైనా తినకపోవడం, రుచిగా వుంటే ఆకలి-అవసరం లేకపోయినా అతిగా తినడం, ఒక రుచితో తృప్తిపడలేక,  ఎప్పుడూ నానారుచులకోసం ప్రాకులాడటం జరుగుతుంది. ఈ విపరీత పరిణామమే జిహ్వాచాపల్యం. ఈ చాపల్యాన్ని దూరం చేసుకోవడమే, "రుచులకోసం ప్రాకులాడొద్దు!" అన్న బాబా ఉపదేశంలోని సారాంశము!

బుద్ధుడు చెప్పిన ‘పాఠం’!

“భోజనంలో మితం పాటించు! అవసరమైనంతవరకే మనఃస్ఫూర్తిగా తిను! సరదాకోసం, వ్యసనంకొద్దీ, చాపల్యంకొద్దీ తినొద్దు! దేహసౌందర్యం కోసం తినొద్దు! శరీర సమతుల్యతకు, దేహం ఆరోగ్యంగా స్థిరంగా వుండడానికి, శరీరం వ్యాధిగ్రస్తమవకుండా కాపాడుకోవడానికి, ధర్మబద్ధమైన జీవితం గడపడానికి అవసరమైనంత ఆహారం గ్రహించు! ఇంతకు మునుపే నీలో చోటుచేసుకొనివున్న (జిహ్వ) చాపల్యాలను అదుపులో వుంచు! క్రొత్త రుచులకు మనసులో చోటివ్వకు! ఇలా చేస్తే నీకు సుఖమయ జీవితం లభిస్తుంది. ఇది ఆహార విషయంగా నేను చెప్పే పాఠం!”

Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo