సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 522వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. మరచిపోయిన మ్రొక్కును గుర్తుచేసిన నా సాయితండ్రి
  2. అనుక్షణం మాతోనే ఉంటూ మమ్మల్ని పరిరక్షిస్తున్న సాయినాథుడు

మరచిపోయిన మ్రొక్కును గుర్తుచేసిన నా సాయితండ్రి

సాయిభక్తుడు నాగార్జున తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం శ్రీ సాయిరాం! నా తల్లి, తండ్రి, గురువు, దైవం అయిన సాయినాథునికి నా నమస్కారములు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న ఆ సద్గురురూపమైన సాయికి కృతజ్ఞతలతో శుభాశీస్సులు. బాబా ఎంతోమందిని ఎన్నో కష్టాలనుండి కాపాడుతున్నారు. బాబా ప్రసాదించిన ఆ అనుభవాలను సాటి సాయిభక్తులందరికీ తెలియజేయాలని సంకల్పించిన ఈ బ్లాగు నిర్వాహకులకు బాబా ఆశీస్సులు ఉండాలని సాయిభక్తులందరం ఆనందంగా కోరుకుంటూ...

నా పేరు నాగార్జున. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను మీ అందరితో పంచుకున్నాను. బాబా సీమోల్లంఘనం రోజున (అక్టోబరు 15) నా జన్మదినం కావడం నా అదృష్టం. నా జననంలో బాబా నాకు తెలియకుండానే వారి అనుగ్రహాన్ని కురిపించారు. ఇక నా అనుభవంలోకి వెళితే... 

మా తల్లిదండ్రులు కంటికి నిద్రలేకుండా, తాము తినకుండా మాకు పెట్టి, ఎన్నో కష్టాలు పడి మమ్మల్ని పెంచి పెద్దచేశారు. (ఈ కష్టాల కథ మరో అనుభవంలో పూర్తిగా చెప్తాను) కానీ ఎవరి దృష్టిలోనూ మేము అలా కనబడకుండా బాబానే చూసుకున్నారు. మేము ఎంతో కష్టపడి స్వంతిల్లు కొనుక్కున్నాము. మెల్లగా కాలం గడుస్తోంది. నేను బాబా మహాసమాధి శతాబ్ది సంవత్సరంలో మొదటిసారి బాబా మాల ధరించి శిరిడీ వెళ్ళాను. నేను శిరిడీ చేరినరోజు మా ఇంటికి మార్పులు చేయదలచి మా తల్లిదండ్రులు ఇంటి పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు. కానీ నాకు ఆ విషయం శిరిడీ చేరేవరకు తెలియదు. శిరిడీ నుండి తిరిగివచ్చిన తరువాత మా తల్లిదండ్రులను వివరాలు అడిగితే, బిల్డింగ్ కాంట్రాక్టర్ అయిన మా మామయ్య  (మా అమ్మ తమ్ముడు) నేను శిరిడీ వెళ్ళినరోజే మా ఇంటికి వచ్చి, ఆరోజే ఇంటి పునర్నిర్మాణ పనులు ప్రారంభిద్దామని చెప్పి, కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారని చెప్పారు. ఇది నిజంగా బాబా కరుణే. ఎందుకంటే, నేను శిరిడీలో బాబా సన్నిధిలో ఉన్నప్పుడే మా మామయ్య మా ఇంటికి రావటం, పని ప్రారంభించడమంటే అది బాబా చేసిన అద్భుతమే కదా! నేను శిరిడీ నుండి తిరిగి వచ్చిన తరువాత జరుగుతున్న నిర్మాణ పనులు చూసి ఆనందంగా అనిపించింది. ఆ పనుల వల్ల నేను శిరిడీ నుండి తెచ్చిన బాబా ఫోటోను ఎక్కడ పెట్టాలో తెలియక మనసులోనే బాబాకు నమస్కరించుకొని, “బాబా! ఇల్లు పూర్తయిన తరువాత నేను నవ గురువార వ్రతం చేసుకుంటాను తండ్రీ!” అని బాబాకు మ్రొక్కుకొన్నాను. ఆరోజు గుడికి వెళ్ళి బాబా దర్శనం చేసుకుని, మా ఇంటి పునర్నిర్మాణ పనులలో సహాయపడ్డాను. కొద్దిరోజులకు ఇంటి పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఆ దేవుడి కృపతో మళ్ళీ గృహప్రవేశం చేసుకుని, సత్యనారాయణవ్రతం, లక్ష్మీహోమం ఆనందంగా జరుపుకున్నాము. ఇలా రోజులు గడుస్తున్నాయి. 

గృహప్రవేశం జరిగి 18 నెలలు పూర్తయింది. అది ఆషాఢమాసం. ఒకరోజు నేను నిద్రపోయేముందు, “ఏ దేవుడికైనా ఏమైనా మ్రొక్కులు ఉన్నాయా?” అని ఆలోచిస్తూ పడుకున్నాను. ఈ ఆలోచన బాబా ప్రేరణే. అదేరోజు రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక సాధువు మా ఇంటి గేటు వద్దకు వచ్చి ‘భవతి భిక్షాందేహి’ అని అన్నారు. నేను మామూలుగా భిక్ష వేయడానికి బియ్యం తీసుకుని వెళ్ళాను. “నాకు ఇవి వద్దు, నాకు తొమ్మిది రూపాయలు కావాలి” అని అడిగారు ఆ సాధువు. నేను మళ్ళీ లోపలికి వచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళేలోపు ఆ సాధువు అక్కడ లేరు. ఎక్కడికి వెళ్ళారా అని ఆలోచిస్తుండగానే నిద్రలో నుండి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాను. లేచి చుట్టూ చూసేసరికి ఎవ్వరూ లేరు. అప్పటినుండి ఆలోచిస్తూ ఉండగా ఆ మరుసటిరోజు పూజ చేస్తుండగా ఆ కలకు అర్థం స్ఫురించింది. నేను మా ఇంటి గృహప్రవేశం సమయంలో నవగురువార వ్రతం చేస్తానని బాబాకు మ్రొక్కుకున్నాను కదా, ఆ సంగతి నేను పూర్తిగా మర్చిపోయాను. ‘మళ్ళీ నాకు ఇలా గుర్తు చేశావా తండ్రీ’ అని అనుకుని, నా తప్పును క్షమించమని ఆ సాయినాథుని వేడుకున్నాను. ఆ మరుసటి గురువారం శ్రావణమాసం మొదటి గురువారం, మంచిరోజని భావించి, కలలో సాధువు రూపంలో బాబా అడిగిన తొమ్మిది రూపాయలను ముడుపుకట్టి పూజ ప్రారంభించాను. బాబా ఎవ్వరినీ ఏమీ ఇవ్వమని అడగరు. కానీ, ఎవరైనా ఏమైనా ఇస్తానని మ్రొక్కుకుంటే అవి తనకు చేరేలా (మనం అనుకోకుండా మర్చిపోయినా) ఆయన ఏదో ఒక రూపంలో తెలియజేసి వాటిని స్వీకరిస్తారు. “బాబా! ఈ నవగురువార వ్రతం ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా పూర్తి చేయించి ఉద్యాపన చేయించు తండ్రీ! కుటుంబంలో ఉన్న సమస్యలు మీకు తెలుసు. ఈ నవగురువార వ్రతం పూర్తయ్యేనాటికి వాటిని తీర్చి నా తల్లిదండ్రులను ఆనందంగా, ఆరోగ్యంగా ఉంచండి. నాకు ఎప్పుడు ఏమి కావాలో వాటిని సరైన సమయానికి నీవే ఇస్తావు తండ్రీ!”

అనుక్షణం మాతోనే ఉంటూ మమ్మల్ని పరిరక్షిస్తున్న సాయినాథుడు

విజయనగరం నుండి సాయిభక్తుడు రాంబాబు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! సద్గురు శ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ కీ జై!

అనుక్షణం మాతోనే ఉంటూ మమ్మల్ని పరిరక్షిస్తున్న సాయినాథునికి శతకోటి నమస్కారాలతో ఈ అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. నా పేరు రాంబాబు. నేను విజయనగరంలో నివసిస్తున్నాను. నేను ఒక ప్రముఖ ఫార్మా కంపెనీలో పని చేస్తున్నాను. మేము తయారుచేస్తున్న ఒక ఫార్మా ప్రొడక్ట్‌కు సంబంధించి ఒక బ్యాచ్ అవుట్‌పుట్‌లో ఇన్‌ప్యూరిటీ రావటం వల్ల ఆ బ్యాచ్‌ని రీ-ప్రాసెస్ చేయించాను. దీనికి నేను అనుసరించిన విధానాన్ని నా పైఅధికారులు తప్పుపట్టారు. వారికున్న పరిజ్ఞానం మరియు ఆధారాలతో ఆ బ్యాచ్ నూరుశాతం మళ్లీ ఫెయిల్ అవుతుందని నాపై వాదించారు. నేను ఈ విషయంపై ఎంతో మనస్తాపం చెంది, ‘ఎట్టి పరిస్థితిలోనూ ఈ బ్యాచ్ ఫెయిల్ అవకూడదు’ అని బాబాను ఆర్తిగా వేడుకున్నాను. కానీ ఆ బ్యాచ్ రిజల్ట్ ఫెయిల్ అయింది. నేను మాత్రం నమ్మకాన్ని వదులుకోక తిరిగి ఎనాలసిస్ చేయించాను. దానిలో ఆ బ్యాచ్ 'పాస్' అని రిజల్ట్ వచ్చింది. ఈ సంఘటన మా మేనేజ్‌మెంటుని ఎంతో ఆశ్చర్యానికి, ఎన్నో అనుమానాలకు గురిచేసింది. దాంతో మేనేజ్‌మెంట్ ఇన్వెస్టిగేషన్‌కి సిద్ధమైంది. అదే బ్యాచ్‌ని అణువణువూ పరిశీలించే నిమిత్తం 50 శాంపిల్స్‌ని ఎనాలసిస్ చేయించింది. అన్ని శాంపిల్స్‌కీ అద్భుతంగా మంచి పాస్ రిజల్ట్స్ వచ్చాయి. ఇది నూటికి నూరుశాతం బాబా లీలే కానీ మరేమీ కాదు. వెంటనే కృతజ్ఞత నిండిన మనసుతో బాబా పాదాలకు, గురువుగారి పాదాలకు నమస్కరించుకున్నాను. ఈ విధంగా బాబా, గురువుగారి అనుగ్రహం మాపై ఎల్లవేళలా ఉండటం మా పూర్వజన్మ సుకృతం.


6 comments:

  1. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. Saieswara పాహిమాం పాహిమాం శరణు శరణు

    ReplyDelete
  4. Om sai ram kapadu thandri

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo