ఈ భాగంలో అనుభవం:
- సాయి దివ్యపూజ సమయంలో బాబా ప్రసాదించిన అనుభవాలు - రెండవ భాగం
నిన్నటి తరువాయి భాగం....
సాయిభక్తురాలు శ్రీమతి సంధ్య తనకి బాబా ప్రసాదించిన మరికొన్ని అనుభవాలను మనతో పంచుకుంటున్నారు:
మూడవ అనుభవం:
మార్చి నెల మొదటివారంలో కరోనా వైరస్ వార్తలు నన్ను భయాందోళనలకు గురిచేశాయి. 5 వారాలు దివ్యపూజను సంకల్పించుకున్న నేను మార్చిలోనే ఉద్యాపన చేయాల్సి ఉంది. ఆ కారణంగా భక్తులకు శక్తికొలదీ భోజనం కూడా పెట్టాలనుకున్నాను. అంతలోనే మేము ఉంటున్న ఏరియా అవతల కరోనా కారణంగా రెడ్‌జోన్‌గా ప్రకటించారు. వాతావరణమంతా భయాందోళనగా ఉంది. దాంతో సాయిబాబాకు నమస్కారం చేసుకుని, “గురుదేవా, సాయీ! ఈ కరోనాను శాంతింపజేసి, కరోనాకు మందు ప్రసాదించు. దయతో భక్తకోటిని, జీవకోటిని రక్షించు” అని ప్రార్థించి మరికొన్ని వారాలు దివ్యపూజ పొడిగించాను. బాబా దయవలన 5 గురువారాలు దివ్యపూజ చేయాలని సంకల్పించుకున్న నేను పది గురువారాలు దివ్యపూజ చక్కగా చేసుకున్నాను. పదకొండవ గురువారం, ‘ఉద్యాపన చేయాలా? పూజ కొనసాగించాలా?’ అని బాబాను చీటీల ద్వారా అడిగాను. ‘ఉద్యాపన చేయమ'ని బాబా బదులిచ్చారు. కానీ కరోనా సమయంలో ‘ఎవరిని ఉద్యాపనకు పిలవాలి?’ అని సందిగ్ధంలో పడ్డాను. అప్పుడు బాబాను ప్రార్థించి, “ఐదుగురు భక్తులను ఆహ్వానించి, భోజనాలు వడ్డించి, వారికి ‘కిచిడీ పారాయణ పుస్తకం’ ప్రసాదంగా ఇచ్చి ఉద్యాపన పూర్తిచేసే శక్తి నాకు ఇవ్వండి బాబా!” అని వేడుకున్నాను. బాబా దయ చూడండి!
మే 21వ తేదీ, మాసశివరాత్రి నాడు ఉద్యాపన పెట్టుకున్నాను. కానీ, నేను చాలా నీరసంగా ఉన్నందున బాబాను ముందుగా ప్రార్థించి, ఉద్యాపన చక్కగా జరిగేలా ఆశీర్వదించమని వేడుకుని, కిచిడీతో పాటు మరికొన్నిరకాల వంటలు చేశాను. పూజ పూర్తవుతుండగా భక్తులు వచ్చారు. నేను ఉద్యాపనకు ఐదుగురినే ఆహ్వానించినప్పటికీ ఎనిమిదిమంది వచ్చారు. నేను ఆహ్వానించిన ఐదుగురిలో ఒకరికి ముగ్గురు కొడుకులు (చిన్నపిల్లలు) ఉన్నారు. ఆమె వాళ్ళను కూడా ఉద్యాపనకు తీసుకొని వచ్చింది. బాబానే బ్రహ్మవిష్ణుమహేశ్వరులుగా ఆ పిల్లల రూపంలో వచ్చారని చాలా సంతోషించాను. నిజానికి పిల్లల్ని పిలవాలని నాకు ఉన్నప్పటికీ కరోనా వలన పిలవలేకపోయాను. కానీ నా మనసెరిగిన బాబా పదకొండుమందికి భోజన సదుపాయం చేసేలా అనుగ్రహించారు. నా ఆనందానికి హద్దులు లేవు. వారిని ఆహ్వానించి భోజనాలు వడ్డించాను. భోజనం రుచిగా ఉందని, సాయిబాబా గుడిలో తిన్నట్లుగా కడుపు నిండిపోయిందని భక్తులు అంటూ ఉంటే, మనసులోనే బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ‘అంతా బాబా దయ’ అని బదులిచ్చాను. సమయానికి భక్తులను ఆహ్వానించి, వారిని సాయిస్వరూపులుగా భావించి, వారికి ఏ లోటూ రాకుండా చూసుకునే శక్తిని నాకు బాబానే ప్రసాదించారు. లేకపోతే అంతటి శక్తి నాకు ఎక్కడిది? బాబా ఎంతటి దయార్ద్రహృదయులో కదా! అలా నా సాయి దివ్యపూజ ఉద్యాపన పిల్లలు, పెద్దలతో చాలా చక్కగా జరిగింది.
నాలుగవ అనుభవం:
సాయి దివ్యపూజ ఉద్యాపనకు ఆహ్వానించినవారిలో ఒకరు సాయిబాబా భక్తురాలు. ఆమె తనకు బాబా ప్రసాదించిన అద్భుతలీలను నాతో పంచుకొని నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఆ లీలను ఆమె మాటల్లోనే మీ ముందుంచుతున్నాను.
“నేను సాయిభక్తురాలిని. 'ఏ విధంగా పూజ చేసినా తాను స్వీకరిస్తాన'ని బాబా నాకు తెలియజేశారు. ఒక గురువారం నేను చపాతీలు చేసి, సాబుదానా ఖీర్ (స్వీట్) చేస్తూ ఉన్నాను. పని హడావిడిలో చూసుకునేలోపే ఆ ఖీర్ అడుగంటి కొద్దిగా మాడిపోయింది. ‘మాడిపోయిన ఖీర్‌ని దేవుడికి ఎలా పెట్టాలి?’ అనుకుని ఖీర్‌ని బాబాకు నైవేద్యం పెట్టలేదు. ఆ తరువాత స్కూలుకి వెళ్ళిన పిల్లలకు లంచ్ బాక్స్ ఇచ్చి ఇంటికి వచ్చాను. భోజనం చేద్దామనుకుంటుండగా బయటనుంచి ఎవరో ‘అమ్మా!’ అని పిలిచారు. నేను చపాతీలు, మాడిపోయిన ఖీర్ తీసుకెళ్లి అతనికి పెట్టి లోపలికి వచ్చాను. అంతలోనే, “నేను భిక్ష ఎవరికి పెట్టాను? వచ్చింది మరెవరో కాదు, బాబానే!” అని అనిపించి పరుగెత్తుకొని బయటకు వెళ్లాను. అక్కడ చూస్తే, ఆ వ్యక్తి కనిపించలేదు. అలాంటి వ్యక్తిని నేను అంతకుముందెప్పుడూ చూడలేదు. అతను తలపాగా, కఫినీ ధరించి, నల్లగా ఉన్నారు. నేను చపాతీ, ఖీర్ పెట్టినప్పుడు చాలా దయతో చూస్తూ, చిన్నగా నవ్వి తల ఊపారు. ‘వచ్చింది సాయిబాబా’ అని తెలుసుకునేలోపలే అదృశ్యమయ్యారు. అప్పటినుండి మేము ఎలాంటి లోటులేకుండా, మంచి ఉద్యోగం, చక్కని ఇల్లుతో చాలా సంతోషంగా ఉన్నాము. అంతా బాబా దయ.
మాడిపోయిన ఖీర్‌ని స్వీకరించి ఆ భక్తురాలికి ప్రేమతో బాబా ఎంతటి అద్భుతలీలను ప్రసాదించారు! బాబాను సాకారరూపంలో దర్శించుకున్న భాగ్యశాలి ఆమె. మాడిపోయిన కారణంగా ఖీర్‌ను తనకు నైవేద్యంగా పెట్టకపోయినా, భక్తురాలు ప్రేమతో చేసినందున బాబానే స్వయంగా సాకారరూపంలో వచ్చి ఆ నైవేద్యాన్ని స్వీకరించారు. ప్రేమతో ఏది పెట్టినా తాను స్వీకరిస్తానని బాబా మరోసారి నిరూపించారు. ఆ భక్తురాలు ఆ సాయిలీలను చెబుతుంటే 2007లో బాబా నాకు సాకారరూపంలో దర్శనమిచ్చి, నా దగ్గర బియ్యం, ఒక రూపాయి దక్షిణగా స్వీకరించి, నా చెడుకర్మలను తొలగించి నాకు పునర్జన్మను ప్రసాదించిన బాబా లీలను మననం చేసుకుని ఎంతో ఆనందించాను. ఆ అనుభవం ఇంతకుముందు ఈ బ్లాగ్ ద్వారా "సాకారరూపంలో దర్శనమిచ్చిన సాయి (https://saimaharajsannidhi.blogspot.com/2020/04/388.html)"గా మీ అందరితో పంచుకున్నాను. "సాయి దివ్యపూజ ఉద్యాపన" రోజున చక్కటి ‘సాయిలీల’ అనే ప్రసాదాన్ని నాకు ప్రసాదించారు బాబా.
ఐదవ అనుభవం:
సాయి దివ్యపూజ పూర్తి చేశాను కానీ, బాబాకు దక్షిణ సమర్పించడం మర్చిపోయాను. వచ్చిన భక్తులకు పుస్తకాలు ఇవ్వాలన్న సంగతి కూడా మర్చిపోయాను. కానీ, బాబా దయ చూడండి! వచ్చిన భక్తులలో ఒకరు బాబాకు 11 రూపాయలు దక్షిణ సమర్పించి, ఆ దక్షిణను ధూపానికిగానీ, హుండీలోగానీ వేయమని చెప్పి, తాను సాయి దివ్యపూజ కథను వినలేదని అన్నారు. వెంటనే సాయి దివ్యపూజ పుస్తకాలు భక్తులకు ఇవ్వలేదని గుర్తుకువచ్చి, బాబాకు దక్షిణ సమర్పించి, వచ్చిన భక్తులకు తాంబూలంతో పాటు, సాయి దివ్యపూజ పుస్తకాలు పంచాను. నేను మరచిన దక్షిణను, పుస్తకాలను భక్తురాలి రూపంలో గుర్తుచేశారు బాబా.
కరోనా సమయంలో, అందులోనూ లాక్‌డౌన్ సమయంలో బాబా గుడికి వెళ్లే అవకాశం లేనందున, నవగురువారవ్రతం చేసే నా చేత సాయి దివ్యపూజ చేయించుకున్నారు బాబా. ఇంట్లోనే సాయి దివ్యపూజ చేసి, ఉద్యాపన కూడా ఇంట్లోనే చక్కగా చేసేలా బాబా అనుగ్రహించారు. నవగురువారవ్రతం చేస్తే బాబా గుడికి చివరివారమైనా తప్పక వెళ్లాలి. కరోనా పరిస్థితుల వలన గుడికి వెళ్లే అవకాశం లేదని సర్వజ్ఞుడైన బాబాకు తెలుసు. అందుకే ఈవిధంగా ఇంట్లోనే సాయి దివ్యపూజ అనే వ్రతం నాచేత చేయించుకున్నారు బాబా. ఇది బాబా అద్భుత లీల. బాబా ప్రణాళికలు వేరుగా ఉంటాయి. అనుభవపూర్వకంగా అర్థమయ్యేవరకు తెలియవు ఆయన లీలలు.
ఇక నేను బాబాను కోరిన కోరికలు - ఆరోగ్యం, పిల్లల చదువులు, ఆర్థికంగా ఏ లోటు లేకుండా ఉంచమని. బాబా అనుగ్రహంతో మా పిల్లలలో ఒకరు ఇంటర్మీడియట్ పూర్తి చేసి మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. మరొకరు పరీక్షలు రాయకుండానే ఊహించని మార్కులతో పదవ తరగతి ఉత్తీర్ణులయ్యారు.
"బాబా! గురుదేవా! సద్గురు సాయీశ్వరా! మీరు కరోనా సమయంలో ధన్వంతరి భగవానుడుగా దర్శనమిచ్చి మాకు ధైర్యాన్ని ఇచ్చారు. దయగల తండ్రీ, సాయినాథా! మీ పాదాలకు సర్వస్యశరణాగతి పొందాను. కరోనాను శాంతింపజేసి, జీవకోటిని, భక్తకోటిని, మానవాళిని రక్షించండి. మానవ మనుగడ ప్రశాంతంగా సాగేలా కరుణించండి తండ్రీ! శిరిడీ దర్శనభాగ్యం కల్పించండి తండ్రీ! మీరు మా హృదయంలో గుడికట్టుకుని ఉన్నా, మీరు నడయాడిన ప్రదేశం శిరిడీని దర్శించాలని ఉంది. సాయి దివ్యపూజ ముడుపును శిరిడీలో సమర్పించుకుంటానని సంకల్పించుకున్నాను. శిరిడీ దర్శనభాగ్యం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నాను తండ్రీ. మీరు లేని చోటంటూ లేదు, మీరు అంతటా వ్యాపించి ఉన్నారు. మీరు నిరాకారులు, పరబ్రహ్మం. అందుకే కరోనా సమయంలో మీరు మీ భక్తుల గృహాలలో ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. మీ భక్తుల హృదయాలనే మందిరాలుగా చేసుకొని ప్రతినిత్యం మీ దర్శనభాగ్యాన్ని కల్పిస్తున్నారు. కరుణాసాగరా! మీ పాదాలకు మరొకసారి వందనం చేస్తున్నాను గురుదేవ సాయీ!”
మరో చిన్న అనుభవాన్ని రేపటి భాగంలో పంచుకుంటాను.
🙏🌺🙏ఓం సాయిరాం🙏🌺🙏
ReplyDeleteom sai ram nice experiences.this devotee is very lucky to have sais darshan some devotees are there who experiened babas darshna are punya jeeviulu
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Jai sai ram ...meeru kastha short and crispy ga rasthey inka baguntundhi...just a suggestion
ReplyDeleteJai sai ram ...meeru kastha short and crispy ga rasthey inka baguntundhi...just a suggestion
ReplyDeleteBaba me chalani chupu na pyna chupava thandri ���������� anugrahinchu sainatha
ReplyDeleteBaba kapadu thandri
ReplyDeleteOm sai ram
ReplyDelete