సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శివాజీనగర్‌ శ్రీ సద్గురు సాయినాథ్ మందిరంలో జరిగిన మరికొన్ని బాబా లీలలు


శివాజీ నగర్ బాబా టెంపుల్

పూణేలోని శివాజీనగర్‌లో రస్నేచాల్ వద్దనున్న పురాతనమైన బాబా మందిరం గురించి నిన్న తెలుసుకున్నాము. ఆ మందిరంలో బాబా దంతం బాబా పాదుకల క్రింద స్థాపించబడి ఉండటంతో మంచి ఆధ్యాత్మికశక్తితో ఈ ఆలయం అలరారుతూ ఉంది. అక్కడ చాలామంది భక్తులు అనేక అనుభవాలు కలిగి ఉన్నారు. వాటిలో కొన్నిటిని దిగువ ఇస్తున్నాము.
బాబా దంతం ఉన్నది ఈ పాదుకల క్రిందనే

వ్యసనపరులను బాబా క్షమించరు.

మొదటి లీల:

ఒక మద్యపాన వ్యసనపరుడు తాగినమత్తులో తూలుతూ తరచూ ఈ మందిరానికి వస్తూ ఉండేవాడు. ఇతర భక్తులు అతనిని ఆ స్థితిలో మందిరానికి రావద్దని, ఎక్కువకాలం బాబా సహించకపోవచ్చని తరచూ హెచ్చరిస్తూ ఉండేవారు. కానీ వారి హెచ్చరికలను అతడు పట్టించుకునేవాడుకాదు. ఒకరోజు అతను మత్తులో అటూయిటూ తూలిపోతూ ఆలయంలోకి వచ్చి, బాబా పాదుకలపై శిరస్సు ఉంచాడు. ఆ మరుక్షణంలో అతను నేలపై పడి మూడుసార్లు దొర్లాడు. భక్తులు అతన్ని పైకి లేపి ఏమి జరిగిందని ప్రశ్నించగా, షాక్‌లోనే అతను, "నేను బాబా పాదుకలపై శిరస్సు ఉంచిన సమయంలో బాబా చాలా బలంగా నన్ను చాచి తన్నారు. దానితో నేను క్రింద పడిపోయాను" అని చెప్తూనే కంగారుగా బయటకు పరుగుతీసాడు. తరువాత మరెప్పుడూ తిరిగి రాలేదు.

రెండవ లీల:

ఒకప్పుడు ఒక యువకుడు ఉద్యోగం కోసం ఆలయానికి వచ్చాడు. అతను కాషాయరంగు వస్త్రాలు ధరించి, పొడవాటి జుట్టు, పొడవైన గడ్డం మరియు ఒత్తైన మీసాలు కలిగి ఒక సాధువువలె కనిపిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆలయంలో పూజారి అవసరం ఉండటంతో మందిర కమిటీ వాళ్ళు అతను ఆలయానికి మంచి సేవలను ఇస్తాడని భావించి అతనిని పూజారిగా నియమించి, అతను ఉండడానికి ఆలయ ప్రాంగణంలో ఒక గదిని కూడా ఇచ్చారు.

కొన్నిరోజుల తరువాత ఆలయానికి వచ్చే కొందరు భక్తులు అతడు ఆలయం వెలుపల కూర్చుని గంజాయి సేవించడం గమనించి, ఆ అలవాటు మానుకోమని, లేకుంటే బాబా కోపాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అతడు వారి హెచ్చరికలను పట్టించుకోకుండా అలానే ప్రవర్తిస్తుండేవాడు. ఆ తరువాత ఒకరోజు ఉదయం భక్తులు కాకడ ఆరతికి వచ్చి చూస్తే ఆలయం మూసి ఉంది; పూజారి లోపలే ఉన్నాడు. ఆరతికి  సమయం అవుతూ ఉండటంతో తలుపులు బాదారు. కొంతసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. పూజారి పరిస్థితి చిందరవందరగా ఉంది. భక్తులు అతనిని, "మీకు ఏమి జరిగింద"ని అడిగారు. అతను చేతులు ముడుచుకుని, "సర్! నేను ఇకపై ఇక్కడ పనిచేయను. నిన్న రాత్రి నేను గంజాయి పొగత్రాగి నిద్రపోయాను. మీరు ఆరతికోసం వచ్చేటప్పటికి గాఢనిద్రలో ఉన్నాను. అప్పుడు ఎవరో నా జుట్టు పట్టుకొని జాడించి, తీవ్రంగా అటుఇటు ఊపుతూ నన్ను మేల్కొలిపారు. నన్ను క్షమించండి! నేను వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఉండాలంటే నాకు భయంగా ఉంది" అని చెప్పి వెళ్ళిపోయాడు. 

సోర్స్: శ్రీ సాయి సాగర్ మ్యాగజైన్, దీపావళి సంచిక 2001.

మూడవ లీల:

ఈ మందిరానికి సంబంధించిన మరో అద్భుతమైన అనుభవాన్ని భువనేశ్వర్ మాధవిగారు ఇలా తెలియజేస్తున్నారు:

మొన్న విజయదశమికి నేను భువనేశ్వర్ నుండి శిరిడీ వెళ్లి వచ్చేటప్పుడు ఈ మందిరాన్ని దర్శించాను. అప్పుడు అక్కడ ఎన్నో ఏళ్లుగా కమిటీ మెంబర్ గా ఉన్న తివారిగారు మాటలలో ఒక ఆసక్తికరమైన బాబా లీలను ఇలా చెప్పారు: "రెండు మూడేళ్ళ క్రితం, అంటే బహుశా 2015లో అనుకుంటా, మేమంతా పల్లకి యాత్ర చేసుకుంటూ శిరిడీ వెళ్ళాము. బాబా దర్శనం చేసుకొని నడుచుకుంటూ తిరిగి పూనా చేరుకున్నాము. అప్పటికి బాగా రాత్రి అయింది. పల్లకిని మందిరంలో ఉంచాలని మందిరం వద్దకు చేరుకొని చూస్తే, మూసి ఉన్న రెండు చెక్కతలుపుల మధ్యలో రెండు దీపాలు వెలుగుతున్నట్లుగా కనిపించాయి. చెక్కతలుపులకు మంటలు అంటుకున్నాయేమోనని కంగారుగా వెళ్లి తాళాలు తీసి తలుపులు తెరిచేసరికి మేము చూస్తుండగానే ఆ రెండు జ్యోతులు నేరుగా వెళ్లి బాబా కళ్ళలో కలిసి పోయాయి. మేమంతా బాబా మహిమకు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాము. ఇప్పటికీ ఇక్కడ చాలామందికి బాబా దివ్యదర్శనం జరుగుతుంది".

  ముందు భాగం కోసం బాబా పాదుకలు తాకండి. 

శ్రీ సాయి సచ్చరిత్రము - 26వ అధ్యాయం ఆడియో


 శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి






వాయిస్: జీవని

పరమపావనుని దంత - ఉదంతం(శ్రీ సద్గురు సాయినాథ్ మందిరం, శివాజీనగర్, పూనా.)


  
శ్రీసాయిబాబా మహాసమాధి చెంది ఎంతోకాలం కాకుండానే భారతీయ ఆధ్యాత్మిక జీవన స్రవంతిలో ఒక భాగమయ్యారు. ఈనాడు దేశం మొత్తం మీద పెద్ద నగరాలలోనూ, పట్టణాలలోనే కాకుండా పల్లెపల్లెలా, వాడవాడలా సాయిమందిరాలు వెలిసాయి. ఇంకా ఎన్నో వెలుస్తున్నాయి. వాటి గురించిన వివరాలను, వాటి ప్రాముఖ్యతను పాఠకులకు అందించాలనే సంకల్పంతో 'మందిర పథం' శీర్షికన 'సాయిపథం' పబ్లికేషన్స్‌లో ప్రచురించారు. అందులోనుండి పూనాలోని 'శివాజీనగర్ మందిరా'నికి సంబంధించిన ఈ అద్భుతమైన సమాచారాన్ని ఈరోజు మీ ముందు ఉంచుతున్నాము. ఈ సమాచారాన్ని 'సాయిపథం' ప్రథమ సంపుటం నుండి సేకరించడమైనది. బాబా, పూజ్యశ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ ఆశీస్సులు అందరిపైనా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... ఆ సాయిమందిర వివరాల్లోకి వెళదాము...

ప్రస్తుతం పూనాలో ఉన్న ఎన్నో సాయిబాబా మందిరాలలో ఒక ప్రత్యేక చరిత్ర ఉన్న "శివాజీనగర్ మందిరం" గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం! ఈ మందిరం శివాజీనగర్ చివరనున్న 'ముతానది' ఒడ్డున 'రస్నేచాల్' సమీపంలో ఉంది. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో నది నీరు మందిరం వరకు వస్తూ ఉండటంతో, అడ్డుగా గోడనొకదాన్ని కట్టి రోడ్డు నిర్మించారు. ఈ మందిరానికి వచ్చే భక్తులు బాబా దర్శనంతో అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతున్నారు.

శ్రీ దామోదర్‌పంత్ రస్నే బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారిని దర్శించి వారి ఆశీర్వాదం పొందిన ధన్యజీవి. 1945లో దామోదర్‌పంత్ కుమారుడు నానాసాహెబ్ రస్నే తన గృహ సముదాయం (రస్నేచాల్)లోని రెండు గదులను బాబా మందిరంగా రూపొందించి నిత్య నైవేద్యాలతో పూజలు క్రమం తప్పకుండా జరిపించేవాడు. ఉదయం ఆరతి, సాయంత్రం ఆరతి నిర్వహించడం మొదలైన తరువాత అధికసంఖ్యలో భక్తులు వచ్చి బాబా దర్శనం చేసుకోవడం ప్రారంభించారు.

ఖేడ్ కు చెందిన శ్రీనికమ్ పోలీసు శాఖలో జమేదారుగా పని చేసేవాడు. ఇతను ఆధ్యాత్మిక చింతన గలవాడు. శ్రీ నానాసాహెబ్ రస్నే పిలుపునందుకొని తన ఉద్యోగానికి స్వస్తి చెప్పి తన జీవితాన్ని మందిరసేవకే అంకితం చేశాడు. ఇతను మందిర కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనడమేకాక, అతని దగ్గరున్న 'బాబా పవిత్రదంతాన్ని' మందిరానికి బహుకరించాడు. దీనితో ఈ మందిరం యొక్క చరిత్రే మారిపోయింది. దేశం నలుమూలల నుండి అసంఖ్యాకంగా భక్తులు రాసాగారు. ఈ పవిత్రదంతం నికమ్‌కు ఎలా లభ్యమైందో తెలిపే ఉదంతం అత్యంత ఆసక్తికరమైనది.

పరమపావనుని  దంత-ఉదంతం
ఆద్యంతం ఆసక్తిదాయకం

శిరిడీకి చెందిన కాశీబాయికి నీఫాడ్ గ్రామానికి చెందిన యువకునితో వివాహమయ్యింది. దురదృష్టవశాత్తు వివాహమైన కొద్దిమాసాలకే ఆమె భర్త మరణించాడు. భర్త మరణించేనాటికి ఆమె గర్భవతిగా ఉండటంతో ఆ తర్వాత ఆమె ఒక మగపిల్లవాడిని ప్రసవించింది. ఆ పిల్లవాడికి 'మాధవ్' అని పేరు పెట్టింది. మాధవ్‌కు సంవత్సరం వయసు ఉన్నప్పుడు నీఫాడ్ నుండి శిరిడీ వచ్చి తన తండ్రి వద్ద నివసించసాగింది. వ్యవసాయకూలీగా తన జీవనం సాగించేది. ఉదయం నుండి సాయంత్రం వరకు పొలాలలో పని చేయవలసి రావడంతో మాధవ్ ఆలన పాలన పెద్ద సమస్యగా తయారైంది. చివరికి ఆమెకు ఒక పరిష్కారం దొరికింది. ఉదయమే మాధవ్‌ని తీసుకెళ్లి బాబా మసీదు (ద్వారకామాయి)లో వదిలి పొలానికి వెళ్ళిపోయేది. తిరిగి సాయంత్రం పని అయిన తరువాత మసీదుకు వెళ్ళి పిల్లవాడిని తీసుకొని ఇంటికి వెళ్లేది. ప్రతిదినం ఇంటికి వెళ్లే ముందు బాబాకు నమస్కరించడం మాత్రం మరిచిపోయేది కాదు. ఇలా నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. మాధవ్‌కు ఐదు సంవత్సరాల వయస్సు నుండి, బాబా వాడికి ప్రతిదినం ఒక రూపాయి ఇస్తుండేవారు. మాధవ్ బాబాకు ఏవో చిన్న చిన్న పనులు చేస్తుండేవాడు.

ఇలా గడుస్తుండగా ఒకరోజు కాశీబాయి మసీదుకొచ్చి బాబాతో, "బాబా! మీరు అందరికీ రోజూ రూ. 50, 30, 15 వంతున డబ్బు ఇస్తుంటారు. మీకు చిన్న చిన్న పనులు చేసే మాధవ్‌కు మాత్రం ఒక్క రూపాయే ఇస్తారెందుకని?" అడిగింది. బాబా, "కాశీబాయీ, నీ కొడుక్కి తక్కువ ఇస్తున్నానని నాకు తెలుసు. కానీ కొంతకాలం తరువాత తక్కిన వారికి మానివేసినా, నీ కొడుక్కి మాత్రం ఇవ్వడం మానను. నీలాంటి ఆధారంలేని వారందరికీ నేనే దిక్కు, నేనే యజమానిని!" అన్నారు. కాశీబాయికి బాబా మాటలు అర్థం కాలేదు. "నా యజమాని నా భర్త కదా? ఆయనెప్పుడో చనిపోయాడు!" అని అంది. దీనితో బాబా కోపించి పెద్దగా అరవడం ప్రారంభించారు. కాశీబాయి భయపడి మసీదు నుండి పారిపోయింది. ఆ తర్వాత మసీదుకి రావడం మానుకుంది. రెండు మూడు రోజుల తర్వాత కాశీబాయిని బాబా పిలవనంపారు. ఆమె మాధవ్‌ను తీసుకొని మసీదుకు వచ్చింది. బాబాతో మాట్లాడటానికి భయపడి మౌనంగా నిలబడింది. బాబా ఆమెను ప్రేమగా పలకరించారు. బాబాకు కొంతకాలంగా పన్ను ఒకటి కదులుతూ ఉండేది. బాబా ఆ పంటిని తీసి ఒక గుడ్డముక్కలో ఉంచి దానిపై ఊదీ వేసి మూటకట్టి కాశీబాయికిచ్చి, "ఈ తాయెత్తు నీదగ్గర ఉంచుకో, నీకు మంచి జరుగుతుంది!" అని చెప్పారు. కాశీబాయి సంతోషంగా దాన్ని తీసుకుని వెళ్ళిపోయింది.

మాధవ్ పెరిగి పెద్దవాడయ్యాడు. బాబా తాయెత్తు వారింటికి వచ్చినప్పటి నుండి బాగా కలిసివచ్చి వారికి ఏలోటూ లేకుండా పోయింది. మాధవ్‌ను అందరూ మాధవరావ్ అని పిలవసాగారు. మాధవరావు తాయెత్తు తన చేతికి కట్టుకొని పవిత్రంగా చూసుకునేవాడు. కాశీబాయి చనిపోయిన తర్వాత నీఫాడ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. ఒకసారి మాధవరావు తీవ్ర అనారోగ్యానికి గురయినప్పుడు బాబా కలలో కనిపించి, "ఈరోజు మీ ఇంటికి వచ్చే నికమ్ అనువానికి నీ చేతికి కట్టుకున్న తాయెత్తును ఇవ్వు!" అని ఆదేశించారు. నికమ్‌కు కూడా బాబా కలలో కనిపించి, "మాధవరావు దగ్గరనున్న తాయెత్తు తీసుకో"మని చెప్పారు. నికమ్ మాధవరావు ఇంటికొచ్చి తాయెత్తు తీసుకున్నాడు. ఆ తాయెత్తు అతని దగ్గర ఎన్నో సంవత్సరాలు ఉన్నది. ఆ తర్వాత అది శివాజీనగర్ మందిరానికి చేరింది. ఈ విధంగా బాబా పవిత్ర దంతం కాశీబాయి నుండి ఆమె కొడుకు మాధవరావుకు, మాధవరావు నుండి నికమ్‌కు, నికమ్ నుండి శివాజీనగర్ మందిరానికి వచ్చింది. అంటే తిరిగి తిరిగి అది బాబా చెంతకే వచ్చిందన్నమాట. మందిర నిర్వాహకులు ఆ పవిత్రదంతాన్ని బాబా విగ్రహం ముందున్న పాదుకల క్రింద భద్రపరిచారు. బాబా శరీరంలోని ఒక భాగమైన ఆ దంతం ఈ మందిరంలో ఉండటం వలన సాయిభక్తులకిది బాబా ప్రత్యక్ష సన్నిధితో సమానం.

ఈ గోల్డెన్ పాదాల క్రిందనే బాబా దంతం ఉన్నది. 

ఈ మందిరాన్ని సందర్శించే వారిలో, బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారిని దర్శించి వారి ఆశీర్వాదాలు పొందిన  భక్తుడు 'శ్రీ నానాసాహెబ్ అవస్థే' ఒకరు. 1950లో ఈ మందిర అభివృద్ధి కోసం 'శ్రీ సాయిదాస మండలి' అను సంస్థ స్థాపించబడింది. మండలి సభ్యులు మందిరానికి మరమ్మతులు చేసి, మందిరం ముందు ఒక  800 చదరపు అడుగుల విశాలమైన హాలు నిర్మించారు. ఇక్కడ గురుపూర్ణిమ, శ్రీరామనవమి, బాబా పుణ్యతిథి(విజయదశమి) పండుగలు వైభవంగా జరుగుతాయి.

వరదాయి సాయిని, వరదనీరంటునా?

ఇక్కడ ఈ మందిరానికి సంబంధించిన అద్భుతమైన లీల ఒకటి అవశ్యం చెప్పి తీరాలి. తేదీ12.07.1961న పాన్షర్ డాము క్రుంగి దానిలోని నీరు వెలుపలకు ప్రవహించి పూనా నగరాన్ని ముంచివేసింది. అక్కడున్న ఇళ్ళు చాలావరకు కూలిపోయి అపార నష్టం సంభవించింది. శ్రీ సాయి మందిరమున్న శివాజీనగర్ లోతట్టు ప్రాంతమైనందున మందిర గోపురం పైన 20, 25 అడుగుల ఎత్తు వరకు నీరు నిలిచింది. తరువాత కొన్నిరోజులకు వరద వెనకకు తీసిన తర్వాత పునరుద్ధరణ కార్యక్రమాలు మొదలయ్యాయి. సాయిమందిరం మొత్తం మట్టిలో కూరుకొని పోయింది. ఈ మట్టిని తొలగించి మందిరాన్ని పూర్వస్థితికి తెచ్చే కార్యక్రమం అతి వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. అయినా మండలి సభ్యులు, సాయిభక్తులు అమితోత్సాహంతో పనిచేసి నాలుగైదు రోజులలో పని పూర్తిచేశారు. అప్పుడు వారికి అగుపడిన దృశ్యం అద్భుతం!! "నిత్య పూజలందుకుంటున్న బాబా రంగుల చిత్రపటం చెక్కుచెదరక, పూర్వంవలే జీవకళ ఉట్టిపడుతోంది". ఈ పటం ఎన్నోరోజులు వరద నీటిలో మునిగి ఉన్నదంటే ఎవరూ నమ్మలేరు. మందిరం ప్రక్కనున్న ఔదుంబర వృక్షం కూడా కళకళలాడుతూ కనిపించింది. అది కనీసం ప్రక్కకు కూడా ఒరగలేదు. ఈ అద్భుతలీలతో బాబా సంపూర్ణ అనుగ్రహం ఈ మందిరంపై ఉన్నదని అందరూ విశ్వసించారు. తర్వాత మండలి సభ్యులు అందమైన బాబా పాలరాతి విగ్రహాన్ని తయారుచేయించి మందిరంలో ప్రతిష్ఠింపచేశారు. వరదకు తట్టుకొని నిలిచిన బాబా రంగులపటం కూడా నిత్యపూజలు అందుకుంటున్నది.
ఈ ఫొటోలో లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఫోటోనే వరదలో
చెక్కుచెదరకుండా ఉండినది. 


ఈ మందిరానికి సంబందించిన వీడియో

Source: సాయిపథం మ్యాగజైన్

 

తరువాయి భాగం కోసం బాబా పాదాలు తాకండి.

శ్రీ సాయి సచ్చరిత్రము - 25వ అధ్యాయం ఆడియో


 శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి






వాయిస్: జీవని

కలలో డాక్టరుగా బాబా - అనారోగ్యానికి చేసిన వైద్యం


నేను ఒక సాయి భక్తురాలిని. మాది కాకినాడ. బాబా నామీద కురిపించిన కరుణారసవర్షాన్ని మీతో పంచుకునే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను చాలా సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాను. నేను తిరగని ఆస్పత్రి లేదు, చేయని ప్రయత్నము లేదు. కానీ డాక్టర్లందరూ నా వ్యాధి నయం కావడానికి సమయం పడుతుందనే చెప్పేవారు. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయాను.

ఇలాంటి పరిస్థితిలో ఒకరోజు మా పక్కింటి వాళ్ళు 'సాయి' ఛానల్‌లో ప్రసారమవుతున్న 'అర్పణం' కార్యక్రమంలో పాల్గొని, బాబాకు గోధుమలు అర్పణం చేయడానికి వెళ్తూ, "మీరు కూడా వస్తారా?" అని నన్ను అడిగారు. "ఏమో! ఏం జరుగుతుందో చూద్దామ"ని అర్పణం కార్యక్రమానికి వెళ్లి  గోధుమలను అర్పణంచేసి, "బాబా! నా ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. నేనెప్పుడూ మీకు మ్రొక్కలేదు, ఇదే మొదటిసారి. అన్నిరకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయాను బాబా! చాలామంది మీ గురించి, మీ లీలల గురించి చాలా అద్భుతంగా చెప్తున్నారు. మీరు నా ఈ ఆరోగ్యాన్ని బాగుచేయగలరా? బాబా! ఇక్కడంతా మీరు మంచి వైద్యుడని అంటున్నారు. నామీద కాస్త దయ ఉంచు తండ్రీ!" అని బాబాకి నా బాధని  చెప్పుకుని ఇంటికి వచ్చాను.

ఆరోజు రాత్రి నిద్రలో నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా తెల్లని వస్త్రాలను ధరించి నా మంచం ప్రక్కనే నిలబడి నాతో, "నీ కడుపులో సమస్య ఉంది. అది ఇప్పటితో తీరిపోతుంది. ఇక నువ్వు దిగులుపడాల్సిన పనేమీ లేదు. అంతా నేను చూసుకుంటాను, నీవు నిశ్చింతగా ఉండు" అని చెప్పారు. తరువాత నేను బాబాని తదేకంగా చూస్తూ ఉన్నాను. బాబా తమ చేతులు నా కడుపులో పెట్టి ఏదో చేస్తున్నారు. తన చేయంతా రక్తసిక్తమై ఉంది. కానీ నేను మాత్రం ఎలాంటి నొప్పి లేకుండా బాబానే చూస్తూ, తను మాట్లాడుతున్నటువంటి మాటలు వింటూ ఉన్నాను. "నేను అంతా సరిచేశాను. నువ్వు దిగులుపడకు. ఇప్పటినుండి నీకు ఆరోగ్య సమస్యలు రావు. నీవు నా నామాన్ని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండు" అని చెప్పారు. కొన్ని సెకండ్ల వ్యవధి తర్వాత చూస్తే బాబా కనిపించలేదు. నాకు కొంచెం కొంచెంగా మెలకువ వచ్చి లేద్దామంటే పడుకున్న చోటునుంచి కాస్తంత కూడా లేవలేకపోయాను. అప్పటివరకూ జరిగినదంతా కలా! నిజమా! అని తేల్చుకోలేకపోయాను. కానీ, నా ఆరోగ్యం కుదుటపడిందని అనిపించింది. తర్వాత రోజు మామూలుగా నేను  చెకప్ కోసం వెళ్లాల్సి ఉండి, హాస్పిటల్‌కి వెళ్ళాను. డాక్టర్లు చూసి, "ఎలాంటి ఆరోగ్య సమస్యా లేదు, నీవు పూర్తి ఆరోగ్యంగా ఉన్నావు" అని చెప్పారు. ఆ మాట విని నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు నాకు అర్ధమయ్యింది, నిజంగానే రాత్రి నా కలలో బాబా డాక్టరుగా వచ్చి ఆపరేషన్ చేసి నా అనారోగ్యాన్ని దూరం చేశారని. తరువాత మాఇంట్లో వాళ్లందరికీ కల గురించి చెప్పాను. అందరూ ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు. నేను అందరిలాగా పూజలు, వ్రతాలు, హారతులు ఏవీ చేయలేదు. కేవలం ఒక్కసారి నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించమని అడిగాను, అంతే! దానికే కలలో ఒక డాక్టరులా వచ్చి, తన కర్తవ్యాన్ని తాను నిర్వహించి డాక్టరుగా, దేవుడిగా నా మనసులో పూర్తి భక్తివిశ్వాసాలను నింపి వెళ్లారు బాబా. "బాబా! మీ గురించి ఎంత మాట్లాడినా, ఎంత చెప్పినా తక్కువే. మీరు నామీద కురిపించిన కరుణారసవర్షానికి ఉబ్బితబ్బిబ్బవుతున్నాను. సదా మీ కృపాదృష్టి నామీద ఇలాగే ఉంచండి!"


శ్రీ సాయి సచ్చరిత్రము - 24వ అధ్యాయం ఆడియో


 శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి






వాయిస్: జీవని

నా ఉద్యోగం విషయంలో అడుగడుగునా బాబా చూపిన కృప


 శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

ఓం సాయిరామ్. నా పేరు అర్చన. నేను హైదరాబాదు నివాసిని. మన జీవనప్రయాణంలో బాబా ఎప్పుడూ మనకు తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం కష్టాలలో ఉన్నపుడు ఆయన మనకి ఏదో ఒక రూపంలో సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. వాటిని అర్ధం చేసుకుని నమ్మకంతో నిబ్బరంగా ఉండగలిగితే ఎంతో బాగుంటుంది. కానీ, మనం ఆ కష్టసమయంలో నమ్మకంతో ఉండలేక ఆందోళనపడుతూ ఉంటాం. ఇక నా విషయానికి వస్తే, నేను ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. నాకు పాప పుట్టాక తనని వదిలి ఆఫీసుకి వెళ్ళటం కష్టంగా వుండేది. "ఏదో ఒక సహాయం చేయండి బాబా" అని చెప్పుకున్నాను. కొన్నిరోజులకి బాబా దయవల్ల ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్టుకి సంబంధించిన మేనేజర్, టీమ్ అందరూ బెంగుళూరులో ఉండటం వలన నేను ఆఫీసుకి వెళ్లినా, వెళ్లకపోయినా పట్టించుకునేవాళ్లు కాదు. అలా పరిస్థితి నాకు అనుకూలంగా ఉండేలా బాబా ఏర్పాటు చేసారు. కానీ వేరే టీమ్‌లో ఉన్నవాళ్లు నేను ఆఫీసుకి రావటం లేదని మా మేనేజర్ కి ఫిర్యాదు చేసారు. పైగా నేను కూడా పిల్లల్ని, ఇంటిపనులను చూసుకుంటూ ఆఫీసు వర్క్ ఎక్కువగా చేయలేకపోయేదాన్ని. ఈ రెండు కారణాల దృష్ట్యా నాకు రేటింగ్(-అంటే మన పెర్ఫార్మన్స్ బట్టి మనకిచ్ఛే ర్యాంకింగ్), శాలరీలో హైక్, ఇన్సెంటివ్ మూడు సంవత్సరాలనించి ఇవ్వటంలేదు. నిజానికి రేటింగ్ సరిగా లేకపోతే కంపెనీనించి తొలగించేస్తారు. కానీ బాబా దయవల్ల ఉద్యోగం ఉంది.

మధ్యలో ఒకసారి, మా టీమ్‌లో నాతోపాటు వేరే బెంగుళూరు అతను ఒకరు వర్క్ చేస్తూ ఉండేవాడు. అతను ఉండబట్టి రెండో వాళ్లు అంటే, నేను అవసరం లేదు అన్నారు. నేను కొత్త ప్రాజెక్ట్ కోసం ప్రయత్నం చేసినా కానీ హైదరాబాద్ ప్రాజెక్ట్ అంటే చాలా కష్టం. హైదరాబాద్ ప్రాజెక్ట్ అయితే మేనేజర్ ఇక్కడే ఉంటారు కనుక తప్పకుండా ఆఫీసుకి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పటికి మా పాప స్కూల్ లో జాయిన్ కాలేదు. అందువలన నేను తప్పక ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి. "ఎలా బాబా?" అని టెన్షన్ పడుతూ, "ఈ ప్రాజెక్ట్ మార్చవద్దు బాబా!" అని చెప్పుకునేదాన్ని. బాబా కృప వలన ఆ సమయంలో వేరే ప్రాజెక్ట్ డెవలపర్ రాజీనామా చేసాడు. దానితో మా టీమ్‌లో ఉన్న అతను ఆ రాజీనామా చేసిన ప్రాజెక్ట్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. అందువలన మా మేనేజర్ నాకు ఫోన్ చేసి, "ఈ ప్రాజెక్ట్ మొత్తం నువ్వే చూసుకో" అని చెప్పారు. అలా బాబా దయతో ఆ ప్రాజెక్టులో నేను కొనసాగాను.

తరువాత కూడా 2, 3 సార్లు మా మేనేజర్ గారు, "టీమ్‌లో మీరు ఒక్కరే హైదరాబాదులో ఉన్నారు, మిగతా అందరూ బెంగుళూరులో ఉన్నారు. కనుక మీరు ఏదైనా హైదరాబాద్ ప్రాజెక్ట్ చూసుకోండి" అని చెప్పారు. అలా అతను చెప్పేవారు కానీ, బాబా దయవలన పెద్దగా ఒత్తిడి చేసేవారుకాదు. పైగా అన్నిరకాల అవకాశాలు ఇచ్చేవారు. మా డైరెక్టర్‌కి సాధారణంగా ఇంటినుండి పనిచేయడం ఇష్టం ఉండదు. అలాంటిది నన్ను ఒత్తిడి చేయకుండా 2 సంవత్సరాలు ప్రాజెక్ట్‌లో ఉంచారు.

కానీ నెలక్రితం హఠాత్తుగా ఆన్‌సైట్ వాళ్లు, "మన ప్రోడక్ట్ వేరే కంపెనీ కొనుక్కుంది. అందువల్ల మీరింక వేరే ప్రాజెక్ట్ చూసుకోండి" అన్నారు. అప్పటివరకు కొత్త టెక్నాలజీలు నేర్చుకోని కారణంగా, కొత్త ప్రాజెక్ట్ చూసుకుంటే అక్కడ వర్క్ ఎలా ఉంటుందో, ఎలా చేయాలో అని నాకు టెన్షన్ మొదలైంది. టెస్టింగ్ సైడ్ కానీ, టీచింగ్ సైడ్ కానీ మారదామని ఎప్పుడు అనుకున్నా, సాయి ప్రశ్నావళిలో, "తప్పుడు నిర్ణయాలు తీసుకోకు" అని వచ్చేది. ఇంకా తెలిసిన వాళ్లు కూడా 'మారవద్దు' అనే చెప్పేవారు. ఈ టెన్షన్స్ మా వారికి చెప్తే, "ఉద్యోగం మానేసి రెస్ట్ తీసుకో" అన్నారు. ప్రస్తుత కంపెనీలో నా చివరి రేటింగ్ అస్సలు బాగాలేదు కాబట్టి ఎవరూ తీసుకోరని ఒక నెలపాటు విపరీతమైన టెన్షన్ పడ్డాను. పోనీ కొత్త టెక్నాలజీస్ నేర్చుకుందామన్న ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఈ పరిస్థితిలో ప్రశ్నావళిలో బాబాని అడిగితే, "నీ భారమంతా గురువు మీద వేసి నిష్టగా ఉండు. నీకు కావలిసిన కూడు, గుడ్డ ఇస్తారు. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. ఉద్యోగంలో ఉన్నత పదవులు వస్తాయి" అని వచ్చింది. నేను అడిగిన ప్రతిసారీ ఇలాంటి మెసేజెసే వచ్చేవి. ఆ మెసేజ్‌తో ధైర్యం వచ్చినా, బెంచ్ మీద రోజులు గడిచేకొద్దీ టెన్షన్ మళ్ళీ మొదలైపోయేది. అప్పుడు, "నీకు బాబా మీద నమ్మకం లేదు. అందుకే నీ పని అవ్వటం లేదు. నమ్మకం పెట్టి చూడు" అని మెసేజ్ వచ్ఛేది. అయినా నిబ్బరంగా ఉండలేకపోయేదాన్ని. రోజూ బాబాని ప్రాజెక్ట్ గురించే వేడుకుంటూ ఉండేదాన్ని.

ఇలా ఉండగా 2018 నవంబర్ 16న ఒక టెస్టింగ్ మేనేజర్, ఒక డెవలప్‌మెంట్ మేనేజర్ నన్ను కలవమన్నారు. మొదట టెస్టింగ్ మేనేజర్‌ని కలిసాను గానీ, "అతను చాలా స్ట్రిక్ట్, పని అవకపోతే ఊరుకోరు, అరుస్తారు" అని కాస్త ఆందోళనపడ్డాను. అయితే అతను రిక్వైర్‌మెంట్ చెప్పి, తరువాత మళ్ళీ అతనే, "మీరు డెవలపర్ కదా! ఈ వర్క్ మీకు కష్టం లెండి, వద్దు" అన్నారు. కొంచెం నిరాశపడ్డాను. కానీ, అంతలో డెవలప్‌మెంట్ మేనేజర్ ఫోన్ చేసి చాలా బాగా మాట్లాడారు. "ఖాళీగా ఉండేకన్నా 3 నెలలు నా దగ్గర వర్క్ చేయండి, తరువాత చూద్దాం" అన్నారు. సబ్జెక్టుకి సంబంధించి ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. నా చివరి రేటింగ్ గురించి అడిగితే, నేను తక్కువ అని చెప్పాను. అందుకతను, "పర్వాలేదులెండి. ఒక్కోసారి అలా జరుగుతాయి" అన్నారు. తరువాత ఇంకా ఏవో ప్రశ్నలు అడుగుతుంటే "మా మేనేజర్‌ని అడగండి" అని చెప్పాను. అతను సరేనని మా మేనేజర్‌తో మాట్లాడారు. కానీ, తరువాత నాకు ఏ వివరాలూ చెప్పలేదు. నేను చాలా బాధపడ్డాను. తరువాత ఇంటికి వస్తూ నిల్చొని ఉన్న బాబా విగ్రహం ఉందేమో చూద్దామని ఒక షాపుకి వెళ్ళాను. అక్కడ ఒక చక్కటి బాబా విగ్రహం ఉంది. తీసుకుందామనుకుంటూ, "బాబా! మీరు ఏదైనా మిరాకిల్ చేస్తే ఈ విగ్రహం రూపంలో మీరు వచ్చిన వేళావిశేషం అనుకుంటాను" అని అనుకున్నాను. కానీ, షాపులో బేరం కుదరక విగ్రహం తీసుకోకుండానే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చాక లాగిన్ అయ్యి చూసుకుంటే వచ్చిన మొదటి మెయిల్ డెవలప్‌మెంట్ మేనేజర్ నుండే! అందులో, "సోమవారం నుంచి ప్రాజెక్టులో జాయిన్ అవ్వండ"ని ఉంది. ఇంక నా ఆనందానికి అవధులు లేవు. వెంటనే మా బాబుని తీసుకుని షాపుకి వెళ్లి ఆ బాబా విగ్రహాన్ని తెచ్చుకున్నాను. 

తరువాత నవంబర్ 19 సోమవారంనాడు ఆఫీసుకు వెళితే, మేనేజర్, "మా స్టాఫ్ ఒకరు ఇంటర్వ్యూ చేస్తారు, అతను వచ్చేవరకు మీరు అక్కడ వేచి ఉండండి" అని ఒక చోటు చూపించారు. ఇక మళ్ళీ నాకు టెన్షన్ మొదలైంది. టెన్షన్ పడుతూనే ఆ చోటుకి వెళ్లి, అక్కడ బాబాని చూసి ఆశ్చర్యపోయాను. బాబాని చూడగానే కాస్త ధైర్యం వచ్చి, "బాబా! వర్క్ అంటే కష్టపడైనా చేస్తాను గాని, ఇంటర్వ్యూ అంటే నాకు భయంగా ఉంది. మీరే ఏదో ఒకటి చేయండి" అని చెప్పుకున్నాను. మధ్యాహ్నం 3 అవుతున్నా ఇంటర్వ్యూ చేయాల్సిన అతను రాలేదు. మేనేజర్ "సరే, మీరు రండి" అని నన్ను ఒక కేబిన్‌కు తీసుకొని వెళ్లారు. ఆశ్చర్యం! అక్కడ కూడా బాబా ఉన్నారు. సాధారణంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలలో దేవుడి ఫోటోలు అలాంటివి కనపడవు. అలాంటిది నా బాబా నాకు తోడుగా ఉన్నానన్నట్లు అడుగడుగునా దర్శనం ఇస్తూ నాకు ధైర్యాన్ని కలిగిస్తున్నారనిపించింది. తరువాత మేనేజర్, "మీరు వర్క్ హేండిల్ చేసుకోగలరు కదా?" అని అడిగారు. నేను "ఎస్" అన్నాను. అతను వెంటనే, "సరే, మీరు ప్రాజెక్టులో జాయిన్ అయిపోండి" అని అన్నారు. ఇంటర్వ్యూ లేకుండా నన్ను కన్ఫర్మ్ చేసేసారు. ఇలా అడుగడుగునా బాబా నాకు తోడుగా ఉండి నాకు రేటింగ్ సరిగా లేకపోయినా సరే, అది ఒక సమస్య కాదన్నట్లు నాకు ప్రాజెక్ట్ ఇచ్చారు. మన కష్టాలు చూస్తూ బాబా ఊరుకోలేరు. ఏదో రూపంలో జవాబు ఇస్తారు. మనల్ని కాపాడతారు. మూడు నెలల ఈ ప్రాజెక్ట్ అయిన తరువాత కూడా బాబా ఇలాగే నన్ను కాపాడతారని నా నమ్మకం.

జై సాయిరామ్! జై జై సాయిరామ్!!

శ్రీ సాయి సచ్చరిత్రము - 23వ అధ్యాయం ఆడియో


 శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి






వాయిస్: జీవని

సాక్షాత్ సాయి దర్శనం.


 శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

కొప్పోలు బాబా మందిరం
నా పేరు శ్రీకాంత్. మా ఊరు ప్రకాశంజిల్లాలోని కొప్పోలు. నేను మా ఊరిలోని బాబా మందిరంలో నాలుగు సంవత్సరాలుగా వాలంటీర్‌గా ఉంటున్నాను. నాకు బాబాతో చాలా అనుబంధం వుంది. నన్ను దగ్గరకి లాక్కున్నది కూడా ఆయనే. ఒకరోజు స్వప్నంలో బాబా దర్శనమిచ్చారు. ఆ కలలో బాబా నా వద్దకు వచ్చి, నన్ను తనకి స్నానం చేయించమన్నారు. అప్పటినుంచి మొదలుపెట్టి ఇప్పటికీ ప్రతిరోజూ బాబాకి అభిషేకం చేస్తున్నాను. అలా ఇప్పటికి నాలుగు సంవత్సరాలు పూర్తయింది. నేనే రోజూ బాబాకి స్నానం, అలంకారం చేస్తాను. అక్కడి పంతులుగారు నన్నే చేయమంటారు. అలా రోజూ చేస్తూ ఉండగా, ఒకరోజు మందిరంలో ఎవరూ లేరు. బాబా, నేను మాత్రమే వున్నాము. అప్పుడు "ఏమిటిరా, ఎలా ఉన్నావు?" అని మాటలు వినిపించాయి. ముందు నాకు అర్థంకాక వాయిస్ ఎక్కడనుంచి వస్తోందని అటు ఇటు చుట్టూ చూస్తూ, బాబా వైపు చూసి భయపడిపోయాను. ఆయన డైరెక్ట్‌గా నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కాళ్ళు కదిలిస్తూ ఉన్నారు. ఆయన ముఖంలోని తేజస్సు చూడలేకపోయాను. నిజంగా దేవుడు మనకి ఎదురుపడితే చూడలేము కదా! అప్పడు నేను బాబాతో, "నాకు భయం వేస్తోంది తాతా" అని అంటే, బాబా "మళ్ళీ మళ్ళీ నీకిలా కనిపించలేను" అని అన్నారు. అయినా కూడా నా వల్ల కాలేదు బాబాని చూడటం. ఆ తరువాత చాలా అనుభవాలు కలిగాయి. నేనేది కావాలని అడిగినా నాకు చేసేవారు.

ఒకసారి నా ఫ్రెండ్ స్వరూప్ తను బాబా సమాధిని తాకానని చెప్పాడు. నేను 3 సార్లు శిరిడీ వెళ్లినా సమాధిని తాకనివ్వలేదు. ఆ విషయమై, "బాబా! నేనేం తప్పు చేశాను, నన్ను నీ సమాధి తాకనివ్వలేద"ని పడుకునే ముందు బాబాని అడిగాను. అంతే! హఠాత్తుగా నా కళ్ళ ఎదుట దృశ్యం మారిపోయి నేను శిరిడీలో బాబా పాదాల చెంత వున్నాను. అప్పుడు బాబా, "నీ స్థానం ఇది, నా పాదాల దగ్గర. ఇప్పుడు నీకు ఇష్టం వచ్చినంతసేపు సమాధిని తాకు, నీకెవరూ అడ్డు చెప్పరు" అన్నారు. నేను సంతోషంతో ఏడుస్తూ ఉన్నాను. అది కల అనుకుందామంటే కల కాదు. ఎందుకంటే, నేనప్పటికింకా పడుకోలేదు. బాబాని ప్రార్థిస్తూ ఉండగానే ఆ దర్శనం జరిగింది. కనులు తెరిచేసరికి ఆ దర్శనానందంలో ఏడుస్తూనే ఉన్నాను. అప్పటి నా పరిస్థితి చూడండి, అడిగీ అడగంగానే నన్ను ఆయన పాదాల దగ్గర ఉంచారు. ఏమని చెప్పను నా భాగ్యాన్ని! అసలు ఆ సన్నివేశాన్ని ఎలా వర్ణించాలో నాకు తెలియడం లేదు. ఆయన నాపై అంత కరుణ చూపారు. సమస్త భువనాలను పాలించే సాయికి శిరస్సువంచి నమస్కరించడం తప్ప నేనేం చేయగలను?

శ్రీ సాయి సచ్చరిత్రము - 22వ అధ్యాయం ఆడియో


 శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి






వాయిస్: జీవని

కులకర్ణిగారి అబ్బాయి ఉపనాయనానికి విచ్చేసిన బాబా!


 శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

యస్. విష్ణు కులకర్ణి బాబాపట్ల భక్తిశ్రద్ధలు కల నిర్మలమైన భక్తుడు. తన పెద్దకొడుకు అనిల్ ఉపనయనానికి ముందు శిరిడీ వెళ్ళి, ఉపనయనానికి రమ్మని బాబాను ప్రేమతో ఆహ్వానించాడు. ద్వారకామాయి ఫొటోలోని బాబా చరణాలవద్ద ఆహ్వానపత్రికను ఉంచి, స్వయంగా వచ్చి తమని అనుగ్రహించమని వినయంగా బాబాను వేడుకొన్నాడు. 
        
ఉపనయన వేడుక చాలా గొప్పగా జరిగింది. విందుకు ప్లేట్లు సిద్ధం చేసారు. అతిథులు కూర్చోబోతున్న సమయంలో కులకర్ణి భార్య తలుపు దగ్గర ఒక ఫకీరు ఉండటం గమనించింది. ఆ ఫకీరు, బాబా వేషధారణలో అచ్చం బాబాలానే ఉన్నారు. వెంటనే కులకర్ణి వెళ్ళి బాబా చేయి పట్టుకొని సగౌరవంగా తీసుకొనివచ్చి విందులో కూర్చోబెట్టారు. అతను, అతని భార్య స్వయంగా బాబాతో పాటు అందరికీ వడ్డించారు. కులకర్ణి ఒక పాన్ బీడాను తెచ్చి బాబా స్వీకరించాలన్న బలమైన కోరికతో బాబా తింటున్న ప్లేటు ప్రక్కన పెట్టాడు. బాబా వడ్డించిన పదార్థాలన్నీ తిన్నారు. చివరికి 'బూందీ లడ్డు' మాత్రమే బాబా ప్లేటులో మిగిలివుంది. అప్పుడు బాబా కులకర్ణి భార్య వైపు తిరిగి, "అమ్మా! ఈ లడ్డూ నేను తినలేను. కానీ, మీ ఇంట్లో స్టీలుడబ్బాలో ఉన్న 'రవ్వలడ్డు' మాత్రం ఖచ్చితంగా తింటాను" అని అన్నారు. ఆమె వాటిని తీసుకొని రావడానికి వెళ్తూ, "ఇంట్లో రవ్వలడ్డూలు ఉన్నాయని ఆయనకెలా తెలుసు?" అని ఆశ్చర్యపోయింది. ఆమె రవ్వలడ్డూలను తెచ్చి భక్తి ప్రేమలతో బాబాకు వడ్డించింది. భోజనానంతరం చేతులు కడుక్కోవటానికి బాబాని బాత్‌రూముకు తీసుకొని వెళ్ళారు. బాబా లోపలికి వెళ్లగా, కులకర్ణి తన చేతులో పాన్ బీడా పట్టుకొని, మరోవైపు అతని భార్య టవల్ పట్టుకొని నిలుచున్నారు. బాబా లోపల గడియపెట్టుకొని, ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో, కొంతసేపటి తరువాత కులకర్ణి తలుపులు బలవంతంగా నెట్టాడు. కానీ బాత్‌రూమ్ లోపల బాబా లేరు! బాత్‌రూమ్ నుంచి బయటకుపోవడానికి ఇంకో మార్గం కూడా లేదు. వారి ఆశ్చర్యానికి అవధులు లేవు. తమ ఆహ్వానాన్ని మన్నించి స్వయంగా బాబా వచ్చి తమని ఆశీర్వదించారని చాలా సంతోషించారు. కానీ బాబా పాన్ బీడా తీసుకోలేదని కులకర్ణి నిరాశపడి, ఉపనయనం పూర్తైన వెంటనే శిరిడీ వెళ్లి, ఈసారైనా బాబా స్వీకరించాలన్న కోరికతో బాబా సమాధి మీద ఒక 'పాన్ బీడా' ఉంచి, ఇంటికి తిరిగి వచ్చేసాడు. తరువాత ఒకరోజు వేకువఝామున బాబా కలలో కనిపించి, "నీవు నన్ను ఉపనయనానికి ఆహ్వానించావు. నేను అక్కడకు వచ్చి నా వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాను" అని చెప్పారు. కులకర్ణి చేతులు కట్టుకొని, "బాబా! మీరు భోజనం చేసారు కాని, 'పాన్ బీడా' తీసుకోలేదు" అని అన్నాడు. అప్పుడు బాబా నవ్వి, "నీవు గౌరవముతో నన్ను భోజనం చెయ్యమన్నావు, అందుకని మనస్ఫూర్తిగా భోజనం చేసాను. కానీ 'పాన్ బీడా' ని ఊరకే ప్రక్కన పెట్టావు. నన్ను తీసుకోమని ఎప్పుడు అడిగావు? దాన్ని సమర్పించడానికి మళ్ళీ అంతదూరం ప్రయాణంచేసి శిరిడీకి రావడం అవసరమా? నాకు ఎలాంటి బీడా అవసరం లేదు. నువ్వెప్పుడూ ప్రేమించే విధంగా హృదయపూర్వకంగా ప్రేమిస్తూ ఉండు. అది నాకు చాలు!" అని చెప్పారు. అంతటితో కల పూర్తయింది.

సోర్స్: శ్రీసాయి సాగర్ మ్యాగజైన్ దీపావళి సంచిక 1998.

శ్రీ సాయి సచ్చరిత్రము - 21వ అధ్యాయం ఆడియో


 శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి






వాయిస్: జీవని

'నాకు, నా రూపానికి భేదం లేదు' అని ఋజువు చేసిన బాబా


సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు మాడిశెట్టి మధుసూదన్. నేను సౌదీ అరేబియాలో నివాసం ఉంటున్నాను. బాబా వారి ముఖాన్ని రోజుకి కొన్నిసార్లు చూడటం నాకు అలవాటు. అయితే అట్లా చూస్తున్న సమయంలో ఆయన ముఖం రకరకాలుగా కనబడుతుంది నాకు. బహుశా ఆయన దివ్య ప్రేమభావం ఉండటం వల్ల ఇది సాధ్యమయింది అని అనుకుంటాను.

పూజ చేసే సమయంలో ఫోటో వద్దకి వెళితే చాలు, ఒక్కోసారి ఆయన ముఖంలో భయంకరమైన కోపం కనపడేది. ఆరోజు ఎక్కడైనా నాకు గొడవ జరుగుతుండటం తారసపడేది.

నవ్వుతుంటే - ఎవరి ద్వారానైనా సంతోషకరమైన వార్త వినేవాణ్ణి.

జాలిగా ఉంటే - ఏదో ఒక కీడు జరిగేది.

ఒకరోజు నేను మోర్తాడ్‌లో వున్న బాబా గుడికి వెళ్ళాను. దర్శనం చేసుకుంటున్న సమయంలో బాబా బాగానే నవ్వుతూ నిశ్చలంగా ఉన్నారు. కానీ తరువాత ధూప్ హారతి సమయంలో ఆయన జాలిగా మొహం పెట్టుకొని ఉండటం నేను గమనించాను. ఈరోజు ఎవరికో కీడు జరగనుందని నాకనిపించి దిగులుగా కూర్చున్నాను. ఒక స్నేహితుడు వచ్చి, "ఎందుకు అట్లా కూర్చున్నావు మధూ?" అని అడిగితే, పరిస్థితి వివరించాను. అది జరిగిన కొద్దిసేపటికి ఏదో ప్రమాదం జరిగినట్లు, ఎవరో నాకు తెలిసినవారు ఆ ప్రమాదానికి గురైనట్లు నా కళ్ళకు కట్టినట్లు కనపడింది. తెల్లవారుఝామున నాకు మా ఊరి నుండి ఫోన్ వచ్చింది, 'కారు ప్రమాదానికి గురైందని, అందులో నా మిత్రుడు చనిపోయాడు' అని. 

ఇప్పుడు 2017వ సంవత్సరం ఆగష్టు నెలలో సౌదీ అరేబియాలో నా డబ్బులు పోయిన అనుభవం చెప్తాను. అమెరికాలో 'గ్రీన్ కార్డ్' ఎట్లాగో, ఇక్కడ సౌదీలో 'ఇకామా' అట్లాగ. ఒకరోజు 'ఇకామా' రెన్యూవల్ కోసం 2400 రూపాయలు తీసుకొని కపిల్(బ్రోకర్)ని కలవడానికి వెళ్తున్నాను. వెళ్తున్న దారిలో బాబా, "నీ డబ్బులు పోతాయ"ని సంకేతం ఇవ్వసాగారు. కానీ నా డబ్బులు దొంగ చేతికి చిక్కేదాకా నాకు మతిస్థిమితం లేదు. బాబా సంకేతాలు ఏవిధంగా ఇచ్చారంటే, వెళ్తున్న దారిలో పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ల బోర్డుల మీద 'హరామీ' అని కనపడుతుంది. 'హరామీ' అంటే 'దొంగ' అని అరబ్‌లో అర్ధం. నేను 'ఇట్లా ఎందుకు కనపడుతుంది?' అని అనుకుని బస్టాండ్‌లో దిగి మా బావ రూముకి వెళ్ళడానికి కారులో బయలుదేరాను. ఆ కారు డ్రైవరే దొంగ. నా డబ్బులు తీసుకొని నన్ను సురక్షితంగా దించేసాడు. అలా డబ్బులు పోయినా బాబా దయవల్ల ప్రాణాలతో బయటపడ్డాను.

శ్రీ సాయి సచ్చరిత్రము - 20వ అధ్యాయం ఆడియో


 శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి






వాయిస్: జీవని

ప్రత్యక్ష సాయిభక్తుడు శ్రీకుశాల్‌చంద్ కుటుంబసభ్యులతో "సాయిపథం" ఇంటర్వ్యూ..


 శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

శ్రీసాయిసచ్చరిత్రకి సంబంధించి మరుగునపడివున్న ఎన్నో అమూల్యమైన విషయాలను వెలికితీసి సాయిచరిత్రను సమగ్రంగా రూపొందించాలన్న బృహత్ ప్రణాళికతో, పూజ్యశ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ 'సాయిపథం' పత్రికను 1988లో ప్రారంభించారు. దానిలో భాగంగా బాబాను ప్రత్యక్షంగా దర్శించిన ఎందరో సాయిభక్తులను, వారి కుటుంబసభ్యులను కలిసి వారి అనుభవాలను, స్మృతులను 'సాయిపథం' సేకరించింది. ఆ సాయిసేవాకార్యక్రమంలో భాగంగా ప్రత్యక్ష సాయిభక్తులు శ్రీచంద్రభాన్‌సేఠ్, శ్రీకుశాల్‌చంద్(రహతా) కుటుంబసభ్యులను ది. 6-1-2001 న సాయిపథం బృందం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. శ్రీచంద్రభాన్‌సేఠ్ మనుమడు శ్రీజయచంద్‌సేఠ్, మునిమనుమడు శ్రీసురేందర్‌సేఠ్‌లు ఈ ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. మరాఠి, ఇంగ్లీషులలో సాగిన ఆ ఇంటర్వ్యూ పూర్తి వివరాలను తెలుగులోకి అనువదించి సాయిపథం మ్యాగజైన్‌లో ప్రచురించారు. ఆ ఆహ్లాదకరమైన ఇంటర్వ్యూని సాయిపథం ప్రథమ సంపుటం 2001 నుండి స్వీకరించి మీ ముందు ఉంచుతున్నాము.      

శ్రీచంద్రభాన్‌సేఠ్
శ్రీజయచంద్‌సేఠ్
సాయిపథం: మేము 'సాయిపథం' పత్రిక తరపున వచ్చాము. శ్రీసాయిబాబా తరచుగా తమ పాదస్పర్శతో పునీతం చేసిన మీ ఇంటిని చూసి, ఆనాటి ఆ వివరాలను మీ నుంచి స్వయంగా తెలుసుకోవాలని వచ్చాము. దయచేసి మాకా వివరాలు చెప్పండి.

జయచంద్ సాండ్: అలాగా! చాలా సంతోషం! మాకు తెలిసినంతవరకు చెప్తాము. శ్రీ సాయిసచ్చరిత్రలో అంత విశదంగా రాని అప్పటి సంగతులన్నీ ఉన్నవి ఉన్నట్లుగా వెలుగులోకి రావటం, ప్రచురింపబడటం మాకు సంతోషమే కదా!

సాయిపథం: బాబా శిరిడీ వదిలి ఎప్పుడూ, ఎక్కడికీ వెళ్లేవారు కాదని, ఎప్పుడైనా వెళితే పక్కనే ఉన్న రెండు గ్రామాలకు అంటే నీమ్‌గావ్‌లో శ్రీడేంగ్లేగారింటికి, రహతాలోని శ్రీకుశాల్‌చంద్ గారింటికి మాత్రమే వెళ్లేవారని బాబా చరిత్రలో ఉంది. బాబా రహతాకు వచ్చినప్పుడు ఈ ఇంటికే వచ్చేవారా?

జయచంద్ సాండ్: అవును. ఆరోజు నుండి ఈరోజు వరకు ఈ ఇంటికి మార్పులేమీ చేయలేదు. కాకపోతే రంగులు వేయించి, ఎలక్ట్రికల్ వర్క్ చేయించాము అంతే!

సాయిపథం: బాబా ఇక్కడకు మొత్తం ఎన్నిసార్లు వచ్చారన్నది మీరు ఏమైనా చెప్పగలరా?

జయచంద్ సాండ్: బాబా ఇక్కడకు ఆయన సమాధి చెందేంతవరకు చాలా తరచుగా వస్తుండేవారు.( ఓ హమేషా ఆతే థె!) ఒక వారంపాటు కుశాల్‌చంద్ శిరిడీకి రాకపోయినట్లయితే "కుశాల్‌చంద్ రాలేదే, తాత్యా! టాంగా ఏర్పాటు చేయి, వెళ్లి కుశాల్‌చందుని చూసి రావాలి" అనేవారు. తాత్యా టాంగా ఏర్పాటు చేస్తే అందులో వచ్చేవారు. ఒక్కోసారి టాంగా కోసం చూసుకోకుండా నడుచుకుంటూ అయినా వచ్చేసేవారు. ఆ రోజుల్లో ఈ ఊరి పొలిమేరలవరకు మా తోటలు ఉండేవి. బాబా వస్తున్న కబురు మా చౌఖీదార్ తీసుకొని వచ్చేవాడు. అప్పుడు మా తాతగారు వాళ్ళు ఊరి పొలిమేరలలో ఎదురెళ్లి మేళతాళాలతో సాదరంగా బాబాను ఇంటికి తీసుకువచ్చేవారు.
కుశాల్‌చంద్
సాయిపథం: ఎప్పుడూ ఎవరింటికీ వెళ్ళని బాబా మీ ఇంటికి రావడం, మీ కుటుంబసభ్యులపట్ల అంత అపారమైన ప్రేమను చూపడం చూస్తే, ఆయనకు మీ కుటుంబానికి ఏదో గొప్ప ఋణానుబంధం ఉందనిపిస్తుంది. దానికి మీరేమంటారు?

జయచంద్ సాండ్: ఆ మాట అక్షర సత్యం! ఆయనతో మాకేదో గొప్ప ఋణానుబంధం ఖచ్చితంగా ఉండివుండాలి. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని మాత్రం చెప్పగలం. కానీ ఎటువంటి ఋణానుబంధమో, ఎందువల్ల ఏర్పడిందో మాకైతే తెలియదు. మా నాన్నగారు అమోలోక్‌చంద్ సాండ్‌గారు చెప్పిన ప్రకారం, అహ్మద్‌నగర్‌లోని మా ఎస్టేట్ (వాడియా పార్క్) లో జవహర్ అలీ అనే ఓ ఔలియా ఉండేవారు. ఆయనకోసం బాబా నగర్, అక్కడనుండి రహతాకు వచ్చి, తర్వాత శిరిడీ వెళ్లారు.


సాయిపథం: అంటే, బాబా మొదట నగర్, రహతా వచ్చి తర్వాత శిరిడీ వచ్చారన్నది వాస్తవమే అంటారా?

జయచంద్ సాండ్: మా నాన్నగారన్న మాటను బట్టి నేను చెబుతున్నానే కానీ, అది ఎంతవరకు వాస్తవమో నాకు తెలియదు. బాబా ఆ జవహర్ అలీతో కలిసి అహ్మద్‌నగర్‌లో ఉండటం మా సోదరుడు(కజిన్) దౌలత్‌రామ్ చూశాడని మా నాన్నగారు చెప్పారు.

సాయిపథం: అహ్మద్‌నగర్‌లోని మీ రహటేకర్‌వాడాలో జవహర్‌అలీ ఫోటో ఉందని విన్నాము, అది నిజమేనా?

జయచంద్ సాండ్: నిజమే! అక్కడ ఒక స్పిన్నింగ్ మిల్లు ఉండేది. ఇప్పుడు అది మా ఆధీనంలో లేదు. దాన్ని చాలాకాలంక్రితం అమ్మేసాము. కానీ జవహర్‌అలీ ఫోటో మాత్రం మా దగ్గరే ఉండేది. కానీ, తర్వాత ఒక సాయిభక్తుడు మా దగ్గరనుండి ఆ ఫోటోను, కాపీ తీసుకుని మరలా ఇస్తామని చెప్పి ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. మేము దానికోసమే ప్రయత్నిస్తున్నాము.

సాయిపథం: శ్రీసాయిశరణానంద తన ఆత్మకథలో, "ఒకసారి బాబాతో కలిసి తాను బాపూసాహెబు జోగ్, కాకాసాహెబు దీక్షిత్, శ్రీమతి జోగ్ మొదలగు వారందరూ మీ ఇంటికి వచ్చార"ని వ్రాసారు.

జయచంద్ సాండ్: అవును! బాబా ఇక్కడకు వచ్చే రోజుల్లో ఆయనతోపాటు ఎందరో ప్రముఖభక్తులు మా ఇంటికి వచ్చేవాళ్లు. బాబాకు కుశాల్‌చందుకు ఉన్న అనుబంధం ఎంత గొప్పదంటే, బాబా ఒకసారి కుశల్‌చంద్‌తో "కుశాల్, నాకు ఇక్కడ ఉండడానికి స్థలం ఏర్పాటు చెయ్యి. నేను  ఇక్కడే స్థిరపడిపోతాను" అని అన్నారట. దానికి కుశాల్‌చంద్ ఎంతో సంతోషంగా స్థలం ఇవ్వడానికి వెంటనే సంసిద్ధులయ్యారు. కానీ ఎందుకో మరలా బాబా శిరిడీలోనే ఉండిపోయారు.

సాయిపథం: సాయిశరణానంద, దీక్షిత్, జోగ్‌లతో కలిసి బాబా మీ ఇంటికి వచ్చినప్పుడు బాబా రాకలోని ముఖ్యకారణం నార్వేకర్ అనే భక్తుని కోసం అప్పు అడగడానికి అని సాయిశరణానంద వ్రాసారు. అంటే దానిని బట్టి బాబా మీ తాతగారి దగ్గర డబ్బులు అప్పు అడిగి తీసుకునే వారని అర్థమవుతుంది. అది నిజమేనా? మీ తాతగారు బాబాకు అప్పు ఇచ్చేవారా?

జయచంద్ సాండ్: నార్వేకర్ విషయం మాకు తెలియదు. బహుశా నిజం అయివుండవచ్చు. ఒకసారి బాబా కుశాల్‌చంద్‌ని పిలిచి, "కాకాసాహెబు దీక్షిత్‌కు 500 రూపాయలు ఇవ్వు" అని చెప్పారు. మా తాతగారు బాబా ఆజ్ఞప్రకారం అలానే  చేశారు. ఈ విషయం దీక్షిత్ మనవరాలు మాకు చెప్పింది. ఆమె బొంబాయిలోని జుహూలో నివసిస్తుంది. మా పెద్దవాళ్ళు మాకు చెప్పిన ప్రకారం బాబా తనకోసం తాను ఏదీ అడగలేదు. అయినా ఆయనకు ఆ అవసరం మాత్రం ఏముంది? మా ఇంటికి వచ్చినప్పుడైనా, ఇంట్లోనే ఆడవాళ్లు ఎంతో బ్రతిమాలితే, "అచ్ఛామా! తోడా దూద్ రోటి లావ్"( సరే అమ్మా, కొంచెం రొట్టె పాలు ఇవ్వండి) అనేవారు. అదీ ఎంతో బ్రతిమాలితే కొద్దిగా తినేవారు. అంతే! మా ఇంట్లో అన్నీ సమృద్ధిగా ఉండేవి. ఆయన ఏం కావాలంటే అవి తీసుకుని ఉండవచ్చు. కానీ ఆయన తీసుకునేది మాత్రం ఆ కొద్దిగా పాలు, రొట్టె మాత్రమే!

సాయిపథం: బాబా మీ ఇంటికి వచ్చినప్పుడు ఇంటి లోపలికి వచ్చేవారా? లేదా వరండాలోనే కూర్చునేవారా?

జయచంద్ సాండ్: లోపలికి వచ్చేవారు! అదిగో, ఆ ద్వారంగుండానే లోపలికి వచ్చేవారు.

సాయిపథం: మీ కుటుంబానికి బాబాతో గల అనుభవాలు కొన్ని చెబుతారా?

జయచంద్ సాండ్: బాబాతో మా కుటుంబానికి గల అనుభవాలు ఎన్నని చెప్పగలము! మా తాతగారైన చంద్రభాన్‌సేఠ్‌గారికి మూడు వివాహాలు అయ్యాయి. ఆయన ముగ్గురు భార్యలకు చాలామంది పిల్లలు పుట్టి చనిపోయారు. ఆ తర్వాత మా తాతగారికి మా నాన్నగారు 21వ బిడ్డగా పుట్టారు. చంద్రభాన్‌సేఠ్‌కి పిల్లవాడు పుట్టాడని కబురు అందడంతో బాబా ఇక్కడికి వచ్చారు. వచ్చి నేరుగా పిల్లవాడిని తన చేతిలోకి తీసుకుని "ఈ బిడ్డ నా ప్రసాదం" అని అన్నారు. తర్వాత ఆ బిడ్డకు ఏ అనారోగ్యం కలుగలేదు. ఆ విధంగా మా వంశం బాబా దయవలనే నిలబడింది. ఈరోజుకి కూడా బాబా దయ మా మీద అపారంగా వర్షిస్తూనే ఉంది. బాబా ఒకసారి కుశాల్‌చంద్‌తో, "చూడు కుశాల్, నేను పోయిన తరువాత ప్రజలు నా ఎముకలను పూజిస్తారు" అని అన్నారు. ఆ మాటే నిజమైంది.
చంద్రభాన్‌సేఠ్‌
సురేందర్ సాండ్: బాబా ఇక్కడకు వచ్చే రోజుల్లో ఊరి పొలిమేరవరకు మాకు తోటలు ఉండేవి. తరువాత కొన్నాళ్లకు నీటి సదుపాయం లేకపోవడంతో ఆ తోటలన్నీ పూర్తిగా ఎండిపోయాయి. 1990 వరకు కూడా నీరు లేకపోవడంతో అక్కడ ఏ తోటలు లేవు. 90లో మేము బోరు వేయించాలని అనుకొని బోర్ వేయడం ప్రారంభించాము. పని ఉదయం మొదలుపెడితే సాయంత్రంవరకు నీళ్లు పడలేదు. నేను సాయంత్రం శిరిడీ వెళ్లి సమాధి మందిరంలో దర్శనం చేసుకుని, "బాబా! బోరింగ్ లో  నీళ్లు పడి, నువ్వు వచ్చేటప్పుడు తోటలు ఎలా ఉండేవో ఇప్పుడు పచ్చగా, అలాగే ఉండేలా చేయి" అని ప్రార్థించాను. అంతే ఐదు నిమిషాలలో బోరింగ్ లో మంచినీళ్ళు పడ్డాయి. దానితో తోటలు బాగా వృద్ధి చెందాయి. అంతా బాబా దయ!

సాయిపథం: బాబా అందరి దగ్గర దక్షిణ అడిగి తీసుకునేవారు కదా! అలాగే మీ తాతగారు కూడా బాబాకు దక్షిణ ఇచ్చేవారా ?

జయచంద్ సాండ్: కుశాల్‌చంద్ శిరిడీకి వెళ్లినప్పుడు ఏమైనా ఇచ్చేవారేమో మాకు తెలియదు. కానీ మా ఇంటికి వచ్చినప్పుడు మాత్రం, "గురువు ఇంటికి వచ్చారు ఖాళీ చేతులతో ఊరకే పంపకూడదు" అని ఏదయినా ఇచ్చేవారు. అంతేకాదు, బాబా ఎవరైనా సహాయం చేయమంటే వారికి కుశాల్‌చంద్ సహాయం చేసేవారు. అంతేగానీ‌, బాబా మాత్రం ఎప్పుడూ తనకోసమంటూ ఏమీ తీసుకోలేదని మా పెద్దవారు చెప్పేవారు.

సాయిపథం: బాబా ఇక్కడకు వచ్చినప్పుడు ఏం ఏర్పాట్లు చేసేవారు? ఊరిలో అందరూ వచ్చి దర్శనం చేసుకునేవారా? బాబా వస్తున్నట్లు మీకు ముందుగానే కబురు వచ్చేదా?

జయచంద్ సాండ్: బాబా వస్తున్నప్పుడు ఊరి పొలిమేరల దగ్గర ఉన్న మా తోటల వద్దకు రాగానే, అక్కడ పనిచేసే లక్ష్మణ్ ఉరఫ్ "లక్ష" అనే బ్రాహ్మణ కుర్రవాడు పరిగెత్తుకుంటూ వచ్చి "బాబా వస్తున్నారు, బాబా వస్తున్నార"ని చెప్పేవాడు. వెంటనే కుశాల్‌చంద్ మేళతాళాలతో ఎదురెళ్లి బాబాకు స్వాగతం చెప్పి ఇంటికి తీసుకు వచ్చేవారు. బాబాతో పాటుగా కొందరు భక్తులు వచ్చేవారు. బాబా మా ఇంటికి తప్ప ఇంకెవరి  ఇంటిలో అడుగు పెట్టలేదు. ప్రజలలో మా కుటుంబం పట్ల ఎంతో భయభక్తులు ఉండేవి. అందువలన ఎవరూ ధైర్యంగా మా ఇంటికి వచ్చేవారు కాదు. బాబా తన వెంట వచ్చిన భక్తులతో మరియు మా కుటుంబసభ్యులతో కొంతసమయం గడిపి వెళ్లేవారు. బాబా మా ఇంటికి వచ్చినప్పుడు ఆయనకు సేవ చేసుకున్న లక్ష అనే కుర్రవాడే తర్వాత కాలంలో బల్సాద్ ప్రాంతంలో 'లక్ష్మీబాబా'గా ప్రసిద్ధుడయ్యాడు.

సాయిపథం: బాబా మహాసమాధి చెందినప్పుడు బాబాను కబరిస్తాన్(స్మశానం)లో సమాధి చేయాలని వాదించిన వారిలో కుశాల్‌చంద్ కూడా ఉన్నారని సచ్చరిత్రలో వ్రాసి ఉంది. అది నిజమేనా?

జయచంద్ సాండ్: దాని గురించి మాకు తెలియదు. బాబా మహాసమాధి చెందిన తర్వాత ఉపాసనీబాబా మా తోటలో ఒకసారి నామసప్తాహం నిర్వహించారు. అప్పట్లో ఆయన మా తోటలోనే ఉండేవారు. దానికి కావలసిన ఏర్పాట్లు మా సోదరుడు దౌలత్‌రామ్ చేసాడు. తరువాత బాబా మహాసమాధి చెందిన సరిగ్గా నెల రోజులకు 1918 నవంబర్ 15వ తారీఖున శ్రీ కుశాల్‌చంద్ దివంగతులయ్యారు.

సోర్స్: సాయిపథం, ప్రథమ సంపుటము, 2001.

శ్రీ సాయి సచ్చరిత్రము - 18, 19 అధ్యాయముల ఆడియో


 శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి






వాయిస్: జీవని గారు

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo