సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబా నన్ను బలంగా ముందుకు త్రోసి పెద్ద ప్రమాదం నుండి కాపాడారు.....


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి


సాయిబంధువులందరికీ నమస్కారం.

ఈమధ్యకాలంలో నేను చాలా ఒత్తిడికి లోను అవటంతో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ బాబానే నన్ను చాలా సులభంగా ఆ సమస్యల నుండి బయటపడేశారు. 2018 అక్టోబర్ 25వ తేదీ గురువారంనాడు మహాపారాయణంలో నాకిచ్చిన 4, 5 అధ్యాయాలు పారాయణం చేశాక, మా నాన్నగారితో, "నవ గురువార వ్రతం చేసుకోవాలని ఉంద"ని చెప్తూ ఉండగా బాబా ఫోటోకి పెట్టిన రోజా పువ్వు క్రింద పడింది. నిజానికి పువ్వు క్రిందపడే అవకాశమే లేదు. ఆ సమయంలో ఎటువంటి గాలి కూడా లేదు. అంటే బాబా నా పారాయణం స్వీకరించడంతో పాటు నవ గురువార వ్రతం చేయడానికి సమ్మతించి నన్ను ఆశీర్వదించారని అనుకున్నాను.

తరువాత అక్టోబర్ 27వ తేదీన నన్ను చాలా పెద్ద ప్రమాదం నుండి బాబా రక్షించారు. ఆ రోజు స్కూల్ ఆటో అతను రాకపోవడంతో మా బాబుని స్కూలు నుండి తీసుకుని వస్తానని మా మరిది వెళ్ళాడు. ఆ స్కూలు రూల్స్ ప్రకారం పిల్లల తల్లితండ్రులైనా వెళ్ళాలి, లేదా ఫోన్ అయినా చేసి చెప్పాలి. అందువలన బాబుని మా మరిదితో పంపడానికి వాళ్ళు అనుమతించలేదు. మా మరిది అక్కడ నుండి ఫోన్ చేస్తే నా ఫోన్ వాల్యూం తగ్గించి ఉండడంచేత నాకు వినపడలేదు. నేను రామకోటి వ్రాస్తూ వాల్యూం తగ్గించిన విషయం మర్చిపోయాను. మా వారికి ఫోన్ చేస్తే ఆయన కూడా లిఫ్ట్ చెయ్యలేదు. దానితో మా మరిది  కోపంగా నన్ను తీసుకుని వెళ్ళడానికి మరలా ఇంటికి వచ్చాడు. నేను ఇంటి నుండి ఎప్పుడు బయటకు వెళ్లినా మా వీధిలో ఉండే చిన్న సాయి మందిరంలో బాబాకి నమస్కరించుకుని వెళ్ళడం నాకలవాటు. అలాగే ఆరోజు కూడా బాబాకి బైక్ పై నుండే నమస్కారం పెట్టుకొని మా మరిదితో వెళ్ళాను. బాబు స్కూలులో ఏడుస్తున్నాడని తను వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు. తను నెల్లూరుకి దూరంగా ఉంటాడు. అందువలన తనకి రోడ్డుపై గుంతలు ఎక్కడ వున్నాయో అంతగా అవగాహన లేదు. వేగంగా వెళ్తూ ఉండగా, 50  మీటర్ల దూరంలో బాబా మందిరం ఉందనగా దారిలో ఒక గుంత వచ్చింది. స్పీడ్‌గా వెళ్తున్న బండి చక్రం ఆ గుంతలో దిగడంతో వచ్చిన కుదుపుకి వెనుక సీటుపై కూర్చున్న నేను అమాంతంగా పైకి ఎగిరాను. ఏమి జరుగుతుందో అర్ధం కాని స్థితి. నిజానికి బండి ఉన్న స్పీడ్‌కి బండి ముందుకుపోయి నేను క్రిందపడి పెద్ద ప్రమాదం జరగాల్సింది. కానీ, తన భక్తులపట్ల అప్రమత్తంగా ఉండే మన బాబా నన్ను కాపాడారు. నేను సీటుపై నుండి పైకి ఎగిరిన క్షణంలో నన్ను ఎవరో బలంగా ముందుకు త్రోసినట్లు అయ్యింది. ఏమి జరిగిందో అర్థమయ్యేలోపలే ఏదో మాయలాగా నేను మా మరిది చేయి గట్టిగా పట్టుకొని లాగబడుతూ బండితోపాటు పరుగు పెడుతున్నాను. ఆ తరువాత బండి నెమ్మదిగా పక్కకు తీసి ఆపాడు మా మరిది. ఆ షాక్ నుండి బయటకు వచ్చేసరికి  క్రింద పడాల్సిన నేను ఎలా నిలబడగలిగానో అర్థం కాలేదు. ఎంతో పెద్ద ప్రమాదానికి గురైనా కూడా అక్కడక్కడ గీసుకున్న చిన్న గాయాలు, కాలిపై ఒత్తిడి పడడం వలన కొద్దిగా కాలు నొప్పి తప్ప పెద్దగా ఏమీ జరగలేదు. అంతా చాలా కొద్ది క్షణాలలో జరిగిపోయింది. నేను పైకి ఎగిరినప్పుడు ఎవరో నన్ను బలంగా తోశారని చెప్పాను కదా! ఆ స్పర్శ నాకెంతో స్పష్టంగా తెలిసింది. రెప్పపాటు కాలంలో అలా చేయగలిగే శక్తి ఎవరికి ఉంది, మన సాయికి తప్ప. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా! మీరు నన్ను కాపాడకుంటే నా పరిస్థితి ఏమిటో నేను ఊహించగలను. మీరు ఇలా ఎప్పటికీ నాతోనే ఉండండి సాయీ! మీరు ఇచ్చిన నామం కూడా నాకు ఎప్పటికీ కొండంత అండ".

ఓం సాయిరాం!!!

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo