నా పేరు కరణ్. నాకు రెండు సంవత్సరాల వయసున్నప్పుడు హఠాత్తుగా నాకు రెండు ప్రాణాంతక వ్యాధులు ఉన్నాయని తెలిసింది. నాకు బ్రెయిన్ ట్యూమర్, కిడ్నీ ట్యూమర్ ఉన్నాయని డాక్టర్స్ నిర్ధారించి, నేను బ్రతికే అవకాశాలు తక్కువ ఉన్నాయని, మానసికంగా అన్నింటికీ సిద్ధంగా ఉండమని మా కుటుంబసభ్యులకు సూచించారు. అప్పటికి మా ఇంట్లో వాళ్ళకి గాని, మా బంధువులకి గాని సాయి గురించి, ఆయన లీలల గురించి ఏమీ తెలియదు.
ఢిల్లీలోని శ్రీ గంగారామ్ హాస్పిటల్లో 18 గంటలపాటు నాకు ఆపరేషన్ చేయాలని అందుకు కావల్సినవి అంతా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆపరేషన్‌కి ఇంకా సరిగ్గా నాలుగు గంటల సమయం ఉందనగా మా బాబాయి గారు మందులషాపుకి సంబంధించిన కాంటాక్ట్ డీటైల్స్ ఉన్న ఒక కార్డుని తెచ్చి మా అమ్మగారికి ఇచ్చారు. ఆ కార్డు వెనుక "సాయి రహమ్ నజర్ కర్నా బచ్చోంకా పాలన్ కర్నా" అని ముద్రించబడి ఉంది. ఎందుకో తెలియదుగానీ, అది చూస్తూనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా అమ్మ ఆ వాక్యాన్ని స్మరించడం మొదలుపెట్టింది. అదే సమయంలో మా నాన్నగారు హాస్పిటల్ ఎంట్రన్స్ లో ఉన్న ఆలయంలో భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నారు.
అక్కడ మా అమ్మగారు సుదీర్ఘంగా ఆ వాక్యాన్ని జపిస్తూ ఉండగా, అకస్మాత్తుగా ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యారు. ఆయన తన తలకి తెల్లని తలపాగా చుట్టుకొని, నల్లని చిన్న గడ్డంతో డాక్టర్ కోటు ధరించి ఉన్నారు. ఆయన అమ్మని, "ఆపరేషన్ కి చాలా తక్కువ సమయమే ఉంది, కాబట్టి బిడ్డని ఇలా ఇవ్వు" అని అడిగారు. నిజానికి ఆపరేషన్ కి ఇంకా 3 గంటల సమయం ఉంది, కానీ ముందుగానే ఆయన వచ్చి నన్ను తనకి అప్పగించమని అడుగుతున్నారు. మొదట అమ్మ ఆయనకి నన్ను ఇవ్వడానికి కొంచెం సంశయించారు. ఎందుకంటే, నేను బ్రతికే అవకాశాలు తక్కువ ఉన్నందున మా నాన్న వచ్చి నన్ను చివరిసారిగా చూసుకుంటారని ఆమె ఆశ. కానీ ఆయన పట్టుబట్టి పదే పదే నన్ను తనకి ఇవ్వమని అడుగుతుండడంతో అమ్మకు వేరే మార్గం లేక తప్పనిసరై నన్ను అతని చేతిలో పెట్టారు.
సరిగ్గా రెండు గంటల తరువాత, అంటే ముందుగా నిర్ణయించిన ఆపరేషన్ టైమ్ కి ఒక గంట సమయం ఉందనగా నా ఆపరేషన్ చేయాల్సిన అసలు డాక్టర్ వచ్చి, నన్ను తనకి ఇవ్వమని అడిగారు. మా అమ్మ, మా బంధువులు అంతా నిర్ఘాంతపోయి, "మీ సిబ్బందెవరో ఒకరు వచ్చి రెండు గంటల ముందే మా బాబుని తీసుకొనివెళ్లారు" అని చెప్పారు. అది విని ఆ డాక్టర్ అదెలా సాధ్యమని వాళ్ళు చెప్పినదాన్ని తీవ్రంగా ఖండించాడు. ఇంతలో ఆపరేషన్ థియేటర్ నుండి ఒక నర్స్ వచ్చి బాబు లోపలే ఉన్నాడని చెప్పింది.
నేను ఆపరేషన్ థియేటర్ లోకి ఎలా చేరుకున్నానో అన్న విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు గాని, 18 గంటల తరువాత డాక్టర్స్ ఆపరేషన్ విజయవంతమైనదని, ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. మా అమ్మ, నాన్న, ఇంకా మా బంధువులంతా సంతోషించారు. వెంటనే నాన్న నన్ను కాపాడినందుకు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్న టెంపుల్ కి బయలుదేరారు. వెళ్తూ తనతోపాటు అమ్మని, మా బంధువులని కూడా తీసుకెళ్ళారు. టెంపుల్ లోపలి అడుగుపెడుతూనే అమ్మ ఆశ్చర్యంతో బిగ్గరగా అరిచారు. దానితో అందరూ షాక్ అయ్యారు. అమ్మ బిగ్గరగా, “ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆయనే సర్జరీకి ముందు నా దగ్గరకి వచ్చి 'బిడ్డను ఇలా ఇవ్వు' అని అడిగి కరణ్ ను తనతో తీసుకొని వెళ్ళింది” అని చెప్పారు. ఆ ఫోటోలో ఉన్నది మరెవరో కాదు, మన అందరి గురువు, దైవం అయిన శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజే!
ఇప్పుడు నాకు 20 సంవత్సరాలు. ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నాను. నేను నా జీవితాన్ని శ్రీ సాయికి మరియు ఆయన సేవకే అంకితం చేశాను. బాబా! మీ దీవెనలు సదా అందరిపై ఉండాలి. సాయిపై పూర్ణ విశ్వాసం ఉంచండి, ఆయన మనల్ని మృత్యువు నుండి కూడా కాపాడగలరు.
అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!
🕉 sai Ram
ReplyDelete