సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

ఉద్ధవేశ్ బువా - మొదటి భాగం


సాయిభక్తుడు ఉద్ధవేశ్ బువా అలియాస్ శ్యామ్‌దాస్ బాబా, 1865 జూన్ 9న జన్మించాడు. అతని పూర్వీకులు మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలోని రత్నగిరి జిల్లా దేవ్‌గఢ్ గ్రామానికి చెందినవారు. తరువాత వాళ్ళు థానేకు వెళ్లారు. ఉద్ధవేశ్ బువా అక్కడే పెరిగాడు. అతడు చిన్నతనంనుండి సాధుస్వభావం కలిగి, తీర్థయాత్రలు చేయడాన్ని, సాధుసత్పురుషుల దర్శనాన్ని బాగా ఇష్టపడేవాడు. ఆ క్రమంలోనే అతడు మొట్టమొదటిసారి 1904లో శిరిడీ సందర్శించాడు. ఆ తొలి దర్శనంలోనే బాబా అతనిపై చాలా కృప చూపించారు.

ఒకప్పుడు ఉద్ధవేశ్ వార్ధా నుండి రామేశ్వర్ వరకు కాలినడకన విస్తృతమైన తీర్థయాత్రకు బయలుదేరాడు. మార్గంలో అతడు గజానన్ మహరాజ్ దర్శనం చేసుకున్నప్పుడు, ఆ సత్పురుషుడు "షేగాఁవ్‌కు దక్షిణంగా వెళ్ళు, అక్కడ నీవు నీ గురువును కలుసుకుంటావ"ని చెప్పాడు. తరువాత శివాలీకి చెందిన మరో సాధువు హరిహర్‌బాబాను కలుసుకున్నాడు. అతడు 'హరిహర్' అన్న ఒక్కమాట చెప్పి, "పశ్చిమదిశగా శివాలీ(అనగా శిలాధి) అన్న ప్రాసతో ఉన్న ప్రదేశంలో నీవు నీ మోక్ష గురువును కలుసుకుంటావ"ని ఉద్ధవేశ్‌కు సూచించాడు. శివాలీలో ఒక బృందం వాళ్ళు ఉద్ధవేశ్ చేస్తున్న ప్రయాణానికి ఉపయోగపడుతుందని ఒక అడవి గుఱ్ఱాన్ని కానుకగా ఇచ్చారు. ఆ గుఱ్ఱం చాలా వింతైన స్వభావం గలది. ఎవరైనా దాని ముందు నిలబడితే కొరికేది, వెనుక నిలబడితే తన్నేది. అటువంటి గుఱ్ఱాన్ని తీసుకుని ఉద్ధవేశ్ "సత్పురుషుల నేల"గా పిలువబడే అహ్మద్‌నగర్ జిల్లాకు వచ్చాడు. బేలాపూర్ వద్ద అతను కేశవ్ గోవింద్ గారి సమాధి దర్శనం చేసుకున్న తరువాత కోపర్గాఁవ్ చేరుకున్నాడు. అక్కడి పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించి, కొంత సమయం నామజపం చేసిన తరువాత ఎట్టకేలకు శిరిడీ చేరుకున్నాడు.

ఆ రోజుల్లో శిరిడీ ఒక కుగ్రామం. చుట్టూ తుమ్మచెట్ల పొదలతో చిట్టడవిలా ఉండేది. అక్కడ ఒక చెట్టుకు ఉద్ధవేశ్ తన గుఱ్ఱాన్ని కట్టాడు. అసలే అది రహదారి కావడంతో దారినపోయేవారికి ఆ పొగరుబోతు గుఱ్ఱం వలన ఏ హానీ కలగకూడదన్న ఉద్దేశ్యంతో దాని నోటికి ఒక తొడుగు కట్టి, దాని వెనుకకాళ్ళను మరొక చెట్టుకు కట్టి తగు జాగ్రత్త తీసుకున్నాడు. ఆ సమయంలోనే ఉద్ధవేశ్ చిరిగిన కఫ్నీ ధరించి, చేతిలో ఒక రేకు డబ్బా పట్టుకుని లక్ష్యమంటూ లేకుండా ఊరకే అటు ఇటు తిరుగుతున్న ఫకీరును చూశాడు. ఉద్ధవేశ్ ఆయన దగ్గరకు వెళ్లి, "శిరిడీలోని సాధువు ఎక్కడ ఉంటారు?" అని వినయంగా అడిగాడు. అందుకు ఆ ఫకీరు అతన్ని చాలా చెడ్డగా తిట్టాడు. ఈ సంఘటన అతనిని తీవ్రంగా బాధించింది. అతడు గ్రామంలోకి వెళ్తూ, "ఆ వృద్ధుడు చాలా చెడు స్వభావం గలవాడు. ఒక సాధారణ ప్రశ్నకు మర్యాదగా సమాధానం చెప్పే బదులు నన్ను, నా తల్లిని తిట్టాడు" అని అనుకున్నాడు. ఎలాగో మొత్తానికి అతడు గ్రామంలోకి వెళ్లి ద్వారకామాయి మసీదు వద్దకు చేరుకున్నాడు. మసీదుకు సమీపంలో ఒక గుడిసె ఉంది. అందులో ఒక వృద్ధమహిళ భాక్రీ, పితలాలను తయారుచేస్తోంది. అతడు ఆమె వద్దకు వెళ్లి, "ఈ గ్రామంలో ఒక సత్పురుషుడన్నాడని నేను విన్నాను. ఆయనెక్కడుంటారో చెబుతావా?" అని అడిగాడు. ఆ వృద్ధురాలు, "సాయిబాబా బయటకు వెళ్లారు. ఆయన ఎక్కడుంటారని చెప్పేది? ఆయనకు బుద్ధిపుట్టినపుడు ఆ చిట్టడవులలో తిరుగుతుంటారు, లేనప్పుడు మసీదులో ఉంటారు. ఆయన మసీదుకు తిరిగి వచ్చినప్పుడల్లా తినడానికి భాక్రీ సిద్ధంగా ఉంచుతాను" అని చెప్పింది. అప్పుడతడు, "ఊరి చివర నాకొక వృద్ధుడు కనిపించాడు. నేను అతనితో ఆ సత్పురుషుని గురించి విచారిస్తే, అతడు మొరటుగా సమాధానమిచ్చాడ"ని చెప్పాడు. అప్పుడామె ఆ సత్పురుషుడు ఎలా ఉంటాడో వర్ణిస్తూ, ఆయన చిరిగిన కఫ్నీని, శిరస్సుకు ఒక వస్త్రాన్ని ధరిస్తారని చాలా వివరంగా చెప్పింది. అది వినగానే అతడు తుమ్మతోపుల మధ్య తనకు కన్పించిన ఫకీరు ఆయనేనని గుర్తించాడు.

తరువాత ఉద్ధవేశ్ మసీదుకు వెళ్ళాడు. మసీదు ముంగిలి అంతా చెత్తాచెదారంతో నిండిపోయి ఉన్నప్పటికీ లోపల మాత్రం చాలా పరిశుభ్రంగా ఉంది. ఒక మూలలో నాలుగు దీపాలు వెలుగుతున్నాయి. ఆ ప్రక్కనే ఒక తిరగలి, కొన్ని వాడిపోయినవి, మరికొన్ని తాజా బంతిపూల దండలు ఉన్నాయి. స్తంభం ముందుగా ధుని వెలుగుతోంది. వాటన్నింటిని చూసి అతడు ఆశ్చర్యపోయాడు. బాబా కోసం ఎంతోసేపు వేచి చూశాడు. కానీ ఎంతసేపటికీ బాబా రాలేదు. ఇక లాభం లేదని తలచి, తిరిగి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యాడు. తన మనస్సులో మాత్రం, 'వృద్ధురాలు హిందువు, ఆమె వర్ణించిన సత్పురుషుడు ముస్లిం. పైగా మసీదులో అగ్ని ఎందుకు ఉంది?' వంటి పలురకాల ప్రశ్నలతో అతను గందరగోళానికి గురయ్యాడు. తరువాత అతను తన గుఱ్ఱం వద్దకు చేరుకుని చూస్తే, బాబా ఒక చేతిని గుఱ్ఱం నోటిలో ఉంచి, రెండో చేతితో దాని తల నిమురుతున్నారు. వెంటనే ఉద్ధవేశ్, "జాగ్రత్తగా ఉండండి మహరాజ్! ఇది అడవి గుఱ్ఱం. అది తన దుష్టబుద్దితో కరుస్తుంది" అని అన్నాడు. తరువాత అతడు వెళ్లి బాబా పాదాలపై తన శిరస్సునుంచాడు. మరుక్షణంలో అతని మనస్సు చాలా ప్రశాంతమైపోయింది. తరువాత అతను లేచి నిలబడి, "మహరాజ్! నా గురువును నేను ఎప్పుడు, ఎక్కడ కనుగొంటాను?" అని అడిగాడు. బాబా గుఱ్ఱాన్ని నిమురుతూ, "నువ్వు ఎక్కడి నుండి వచ్చావో భవిష్యత్తులో గ్రహిస్తావుగాని, నేను మాత్రం ఒక పిచ్చి ఫకీరును" (కల్లెల్ పుధే, తు కొతున్ ఆలాస్? మీ తార్ వేదా ఫకీర్ ఆహే) అని అన్నారు. తరువాత మళ్ళీ బాబా, "ఐదు సంవత్సరాల తరువాత ప్రతీది స్పష్టం అవుతుంది. సరే, నువ్వు తిరిగి వెళ్లిపోవచ్చు. ఈరోజే వెళ్ళిపో! ఉపవాసం చేయి(ఉపవాసం అనే సాధన చేయమని సూచించారు బాబా)" అని అన్నారు. తరువాత బాబా, ఉద్ధవేశ్‌లు ఇద్దరూ మసీదుకు తిరిగి వచ్చారు. అప్పటికి ఎవరో భక్తుడు కొబ్బరికాయను నైవేద్యంగా విడిచిపెట్టి వెళ్ళాడు. బాబా దాన్ని పగలగొట్టి సగం ఉద్ధవేశ్‌కిచ్చి, "అరే, మొత్తం భాకర్ ఒకేసారి కడుపులోకి ఎలా వెళ్ళగలదు? ఐదేళ్ళలో నీవు తెలుసుకుంటావు. అప్పుడు చూద్దాం" అని అన్నారు. తరువాత ఉద్ధవేశ్ బాబాకు నమస్కరించి వెళ్ళిపోయాడు. కోపర్గాఁవ్ వెళ్లి అక్కడ మిగిలిన యాత్రికుల బృందాన్ని కలుసుకుని తన తీర్థయాత్రను కొనసాగించాడు.

తరువాత 1906-1911 మధ్యకాలంలో అతడు తన అదృష్టంకొద్దీ బాబా భక్తులైన నానాసాహెబ్ చందోర్కర్, జనార్ధన్ గొడ్దేవ్ కండికర్, బాలాసాహెబ్ దేవ్ వంటి వారిని కలుసుకున్నాడు. వాళ్ళు  అతనికి సాయిబాబా లీలలనెన్నో వర్ణించి చెప్పారు. 

ఐదు సంవత్సరాల తరువాత అతను మళ్ళీ శిరిడీ వెళ్లి, బాబాను దర్శించాడు. అతన్ని చూస్తూనే బాబా, "శ్యామ్‌దాస్, రా! నువ్వు రావడం మంచిదైంది. గుఱ్ఱాలు, ఎద్దులు కొరుకుతాయి. కానీ అవి నావద్ద సాధుస్వభావంతో మృదువుగా, సున్నితంగా ప్రవర్తిస్తాయి(ఘోడా బాయిల్ చావ్క, అమసీ భెట్ తో పావ్క)అని అన్నారు. ఈ మాటలు బాబా యొక్క దైవత్వానికి సంకేతమని, నీచజన్మ ఎత్తిన గుఱ్ఱానికి కూడా అది అర్థమైందని అతడు గ్రహించాడు. అంతేకాదు, గతంలో హరిహర్‌బాబా తన మోక్ష గురువును శిరిడీలో కలుసుకుంటానని చెప్పింది కూడా నిజమైందని గ్రహించి ఆనందంలో మునిగిపోయాడు. ఇక అప్పటినుండి ఉద్ధవేశ్ తానెప్పుడు శిరిడీ దర్శించినా ఎక్కువకాలం అక్కడే ఉండేవాడు.

ఒకసారి ఉద్ధవేశ్ మసీదుకు(ద్వారకామాయి) వెళ్ళినప్పుడు బాబా గోధుమలు విసురుతూ ఉన్నారు. ఆ సమయానికి బాబా చాలా కొద్ది గోధుమపిండి మాత్రమే విసిరి ఉన్నారు. ఇంకా విసిరేందుకు మరికొన్ని గోధుమలు ఉన్నాయి. అతడు ఆ పవిత్ర మసీదులోకి వెళ్లి, అక్కడే కూర్చుని బాబాను గమనిస్తూ ఉన్నాడు. బాబా గోధుమలు విసురుతున్నంతసేపు, కొంచెంసేపు పాటలు పాడుతూ, కొంచెంసేపు వేదాంత ధోరణిలో మాట్లాడుతూ, మరికొంతసేపు ఎవరినో చెడ్డగా తిడుతూ ఉన్నారు. బాబా గోధుమలు విసిరే తీరు చూసి అతడు ఆకర్షితుడై, "బాబా! మసీదులో ఈ తిరగలి ఎందుకు ఉంచారు? మీరు గోధుమలు ఎందుకు విసురుతూ ఉంటారు?" అని బాబాను అడిగాడు. దానికి బాబా, “ఎవరైతే నా వద్దకు వస్తారో, వారి కోసం నేను ఇలా విసురుతూ ఉంటాను” అని అన్నారు. బాబా పలికిన పలుకులు అతని హృదయాంతరాళాన్ని స్పృశించాయి. బాబా చెప్పిన మాటలను బట్టి అతడు, “తన భక్తుల కష్టాలను, కర్మలను పారద్రోలటానికే బాబా తిరగలి విసురుతూ ఉంటారు” అని అర్థం చేసుకున్నాడు. "తన భక్తుల కోసం బాబా ఎంతటి కష్టాన్ని, ఇబ్బందిని అనుభవిస్తుంటారో" అని అనుకున్నాడు.

ఒకసారి ఉద్ధవేశ్ శిరిడీ వదిలి వెళ్ళటానికి బాబా అనుమతి కోసం వెళ్ళినప్పుడు, అతడు బాబాను, “బాబా, మీరెందుకు నన్ను తరచుగా శిరిడీ పిలిపించుకోవటం లేదు?” అని అడిగాడు. అప్పుడు బాబా బాలాగణపతి షింపీ వైపు తిరిగి అతనితో, “నేను అతడిని తరచుగా పిలవటం లేదని ఆక్షేపిస్తున్నాడు. అయినా ప్రతి పక్షంరోజులకు ఒకసారి పిలుస్తూనే ఉన్నాం కదా?” అని అన్నారు. ఉద్ధవేశ్ బువాకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఏకాదశి రోజున బాబాకు ఉత్తరం వ్రాసే అలవాటు ఉండేది. అతని ఉత్తరాలకు బాబా జవాబు వ్రాసి పంపుతూ ఉండేవారు. సాయిబాబా ఆ ఉత్తర ప్రత్యుత్తరాల గురించే బాలాషింపీతో అన్నారు. తరువాత తమ గుప్పెట నిండుగా ఊదీని ఉద్ధవేశ్‌కు ప్రసాదించి, ప్రేమ ఉట్టిపడే స్వరంతో, “అయితే వెళుతున్నావా? అరే శ్యామదాస్, నేను సర్వకాల సర్వావస్థలలోనూ నీతోనే ఉన్నాను. అల్లామాలిక్ నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు మంచి చేస్తాడు. భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు. మంచిది. వెళ్ళిరా!” అని ఆశీర్వదించారు.

ఒకసారి ఉద్ధవేశ్ కొంతమందితో కలిసి ద్వారక యాత్రకు బయలుదేరాడు. వాళ్లంతా ముంబాయి నుండి ద్వారకకు స్టీమరులో ప్రయాణం చేయాల్సి ఉంది. ప్రయాణానికి సంబంధించిన టిక్కెట్లు రెండు భాగాలుగా ఉన్నాయి. మొదటి భాగం టిక్కెట్లు తీరం నుండి షిప్పు వరకు తీసుకువెళ్లే ఫెర్రీ(పడవ)కి సంబంధించినవి, రెండవ భాగం టిక్కెట్లు షిప్పుకి సంబంధించినవి. మొత్తం తీర్థయాత్ర బృందానికి సంబంధించిన టిక్కెట్లన్నీ ఉద్ధవేశ్ వద్ద ఉన్నాయి. అతడు రెండు భాగాలను వేరు చేసి, ఫెర్రీ టిక్కెట్లను మాములుగా జేబులో, స్టీమర్ టిక్కెట్లను తన పర్సులో డబ్బుతోపాటు పెట్టుకున్నాడు. అతడు స్టీమర్ ఎక్కాక ఏదో కారణంగా తన పర్సును బయటకు తీయాల్సి వచ్చింది. ఆ సమయంలో అతడు రైలింగ్ పక్కన నిలబడి ఉన్నాడు. అనుకోకుండా పర్సు చేజారి అందులో ఉన్న డబ్బు, టిక్కెట్లు సముద్రంలో పడిపోయాయి. స్టీమర్ దిగేటప్పుడు టికెట్ కలెక్టర్‌కు టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంది. ఉద్ధవేశ్ జరిగినదంతా టికెట్ కలెక్టర్‌కు వివరించి, అందుకు సాక్ష్యంగా ఫెర్రీ టిక్కెట్లను చూపించాడు. అతను సంతృప్తి చెంది వాళ్ళను విడిచిపెట్టాడు. ఈ సమస్యనుండైతే గట్టెక్కారుగాని ద్వారకలో వారు గోమతిలో స్నానం చేయాలన్నా, దేవుని పాదాలను తాకి పూజించాలన్నా డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి. కానీ ఉద్ధవేశ్ డబ్బంతా పోగొట్టుకున్నాడు. ఎవరినైనా అడగటానికి అతనికి ఇష్టం లేదు. ఆ స్థితిలో తనకు సహాయం చేయడానికి బాబా ఉన్నారని తలచి అతడు వెంటనే శిరిడీకి ఒక లేఖ వ్రాశాడు. 

అదేరోజు రాత్రి దహనులో ఉన్న అతని కొడుకు గోపాల్ గిరిధర్‌కి ఒక కల వచ్చింది. కలలో ఒక ఫకీరు అతని పడకగదిలోకి వచ్చి, అతనిని నిద్రలేపి, "ద్వారకలో ఉన్న నీ తండ్రికి డబ్బులు పంపించు" అని చెప్పారు. గిరిధర్‌కి మెలకువ వచ్చి చుట్టూ చూశాడు. అతనికి ఎవరూ కనిపించలేదు. దాంతో అతడు మళ్ళీ నిద్రపోయాడు. మళ్ళీ కలలో ఆ ఫకీరు కనిపించి కోపంగా, "నేను నీ తండ్రికి డబ్బులు ఇవ్వమని చెప్పాను. అతడు అక్కడ ఇబ్బందిపడుతున్నాడు. నువ్విక్కడ నిద్రపోతున్నావు" అని అన్నారు. అతడు ఈసారి లేచి తలుపు వరకు వెళ్లి ఫకీరు కోసం చూశాడు. కానీ తలుపులు వేసే ఉన్నాయి. ఫకీరు జాడ ఎక్కడా కన్పించలేదు. అతను కూర్చుని కల గురించి ఆలోచించి, తన తండ్రి ద్వారకలో ఏదో సమస్యలో చిక్కుకుని ఉండి ఉంటారని గ్రహించాడు. ఆ మరుసటిరోజే ఇన్సూరెన్సు కంపెనీ నుండి అతనికి కొంత డబ్బు వచ్చింది. వెంటనే అతడు అందులోంచి కొంత డబ్బు తన తండ్రికి పంపాలని నిర్ణయించుకుని యాభై రూపాయలు మనియార్డర్ చేశాడు. ఆ డబ్బు అందుకున్న ఉద్దవేశ్ ఆనందాశ్చర్యాలకు లోనయ్యాడు. తరువాత అతను తన యాత్రను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేశాడు. ద్వారక నుండి ఇంటికి వచ్చి, తన కొడుకును సమయానికి డబ్బు ఎలా పంపించావని అడిగాడు. అందుకు గిరిధర్ జరిగిన లీలను వివరంగా వర్ణించి చెప్పాడు. సమయానికి డబ్బు అందేలా చేసిన బాబా కరుణకు ఉద్ధవేశ్ పరవశించిపోయాడు.

మరోసారి ఉద్ధవేశ్ కొంతమంది బృందంతో కలిసి దాదాపు మూడున్నర నెలల తీర్థయాత్రకు ప్రణాళిక వేసుకున్నాడు. ఆ యాత్రలో భాగంగా వాళ్ళు ద్వారక, పోరుబందర్, గిర్నార్, సోమనాథ్, మరికొన్ని ఇతర పవిత్ర స్థలాలను దర్శించాలని అనుకున్నారు. వాళ్ళు గిర్నార్ హిల్స్ వద్దకు చేరుకున్నాక ఉద్ధవేశ్ తనతోపాటు తీసుకెళ్లిన వ్యక్తిగత సేవకుడు అక్కడ ఆగిపోయాడు. మిగిలిన బృందమంతా కొండపైకి వెళ్లి దత్తాత్రేయ పాదుకలు, అంబాజీ టేక్డీ(కొండపై ఉన్న అంబాదేవి ఆలయం), గోరక్షక్‌నాథ్ ఆలయం దర్శించుకోవాలన్న మంచి తలంపుతో గురువారం కొండ ఎక్కాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా, దర్శనం చేసుకున్నాకే భోజనాలు చేయాలని వాళ్లంతా అనుకున్నారు. గురువారం ఉదయాన్నే వాళ్ళు కొండ ఎక్కడం ప్రారంభించినప్పటికీ పైకి చేరుకునేసరికి బాగా ఆలస్యం అయింది.

ఉద్ధవేశ్ కొండపైకి ఎక్కుతున్నప్పుడు, "నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను" అన్న బాబా మాటలు స్పష్టంగా విన్నాడు. దాంతో అతను సంతోషంగా ముందుకు సాగుతున్నాడు. మార్గంలో ముప్పై, నలభై మెట్లు చాలా నిటారుగానూ, ఎత్తుగానూ ఉన్నాయి. వాటిపై నడవడం చాలా కష్టం. పైగా ఎండ చాలా తీవ్రంగా ఉంది. సూర్యుడు తన తీవ్ర ప్రతాపాన్ని అతనిపై చూపుతున్నాడు. వాళ్ళతో తెచ్చుకున్న నీళ్ళు అయిపోయాయి. గమ్యాన్ని చేరుకోవడానికి ఇంకా రెండు, మూడువందల మెట్లు ఎక్కాల్సి ఉంది. అంతలో ఉద్ధవేశ్ బాగా అలసిపోయి మిగిలిన వారికంటే నాలుగైదు అడుగులు వెనకబడ్డాడు. గొంతు తడారిపోయి, మైకం కమ్ముకుని కొద్దిక్షణాల్లో అతడు స్పృహతప్పి క్రింద పడిపోయాడు. కొంతసేపటికి మిగతా బృందం వాళ్ళు అతని కోసం చూస్తే, అతడు మార్గానికి ఎడమవైపు పడిపోయి ఉన్నాడు. ఒకవేళ అతడు కుడివైపు పడివుంటే లోతైన లోయలో పడి అతని జాడే తెలిసేదికాదు. వెంటనే ఆ బృందంలోని తారాబాయి, మరికొంతమంది సభ్యులు అతని వద్దకు పరుగున వచ్చారు. అతడు అపస్మారకస్థితిలో ఉండటం, నోటి వద్ద నురుగు ఉండటాన్ని బట్టి అతనికి వడదెబ్బ తగిలిందని వాళ్ళు గ్రహించారు. తారాబాయి అతని ప్రక్కన కూర్చుని, అతని తలని తన ఒడిలో పెట్టుకుని, నోరు తుడిచి, అతనికి గాలి తగిలేలా గుడ్డముక్కతో విసరడం మొదలుపెట్టింది. మిగిలినవాళ్లంతా గాభరాపడుతూ ఏమి చేయాలా అని ఆలోచిస్తున్నారు. నీటి అవసరం చాలా ఉంది కానీ, పరిసరాల్లో నీళ్ళు దొరికే పరిస్థితి లేదు. అందువలన వాళ్లలో ఎవరైనా కొండ దిగువకు వెళ్లి నీళ్ళు తీసుకురావాలని అనుకుంటూ క్రిందకు వెళ్లే మార్గం వైపుకు చూసారు. ఒక గోసావి పెద్ద నీటి కుండను తీసుకుని తమవైపుకు రావడం కనిపించింది. ఆ గోసావి వాళ్ళ వద్దకు వచ్చి, తారాబాయితో, "తల్లీ, ఆ బిడ్డకు ఈ నీళ్ళివ్వండి. కొద్దిగా నీళ్ళను అతని తలపైన, ముఖంపైన చల్లండి. అతను స్పృహలోకి వస్తాడు" అని చెబుతూ నీటి కుండను వాళ్లకు అందించాడు. ఆ తరువాత, "ఈ నీళ్ళను అతని చేత త్రాగించండి. నాకు కొంత పని ఉంది. మీరు తిరిగి వచ్చేటప్పుడు నేను మిమ్మల్ని కలుస్తాను" అని చెప్పి ఆ గోసావి మెట్లెక్కి ముందుకి వెళ్ళాడు. అతడు చెప్పినట్లుగానే బృందం వాళ్ళు చేశారు. ఉద్ధవేశ్ నెమ్మదిగా స్పృహలోకి వస్తున్నాడు. ఆ స్థితిలో అతడు గోసావిని చూశాడు. మెట్లు ఎక్కుతున్న గోసావి అతను చూస్తుండగానే అదృశ్యమైపోయాడు.

ఉద్ధవేశ్ పూర్తిగా కోలుకోవడానికి ఒక గంట సమయం పట్టింది. తరువాత వాళ్లంతా ముందుకు సాగారు. అన్ని ఆలయాల్లో వారందరికి అద్భుతమైన దర్శనం లభించింది. ఈ సమయమంతా బృందంలోని వారంతా తమలో తాము, "ఆ గోసావి ఎవరు? అతడెందుకు వచ్చాడు? సమయానికి ఎలా ఉద్ధవేశ్ కోసం నీటిని తీసుకువచ్చాడు? అతని సూచనలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి" అని మాట్లాడుకుంటున్నారు. అయితే తన ప్రాణాన్ని గోసావి రూపంలో బాబానే కాపాడారని ఉద్ధవేశ్‌కు బాగా తెలుసు. ఇది జరగడానికి ముందు అతడు శిరిడీ వెళ్ళినప్పుడు అతనితో బాబా, "సర్వకాలాల్లోనూ సదా నేను నీ వెనుక, ముందు నిలబడి ఉంటాను" అని హామీ ఇచ్చారు. ఎక్కడ శిరిడీ? ఎక్కడ గిర్నార్? అయినప్పటికీ, గురువు తన బిడ్డలకు సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలియజేస్తుంది ఈ సంఘటన. వాళ్ళు తిరిగి గోసావి కనిపించిన ప్రదేశానికి వచ్చినప్పుడు, ఉద్ధవేశ్ ఆ గోసావి కోసం అక్కడే వేచి ఉండాలని అనుకున్నాడు. అలాగే అతడు గంట సమయం వేచి ఉన్నాడు. కానీ మిగతా బృందం వాళ్ళు, "ఆలస్యం అవుతోంది, ఇప్పటికే సాయంత్రం 5 గంటలైంది, త్వరలోనే సంధ్యాసమయం అవుతుంది. అందరూ అలసిపోయి ఆకలితో ఉన్నారు. కాబట్టి క్రిందకు పోదామ"ని అన్నారు. దాంతో అయిష్టంగానే ఉద్ధవేశ్ వాళ్లతో ముందుకుసాగాడు. 

కొంతసేపటికి వాళ్లంతా కొండ దిగువన ఉన్న జునాగఢ్‌ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ వాళ్లంతా భోజనాలు చేసి, ఆ రాత్రికి అక్కడే విశ్రమించారు. ఉద్ధవేశ్‌కు నిద్ర పట్టడంలేదు. ఆరోజు జరిగిన దానికి అతడు ఆనందంలో మునిగివున్నాడు. స్పృహతప్పి తాను కింద పడిపోయినప్పటికీ చిన్నగా గీరుకోవడం, మోకాలిపై చిన్న గాయం తప్ప పెద్ద గాయాలేవీ లేకుండా పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడు. అందుకు అతనికి సంతోషంగానే ఉన్నా, సహాయాన్ని అందించిన గోసావిని కలవలేకపోయానన్న ఆలోచనను మాత్రం తట్టుకోలేకపోతున్నాడు. ఇలా ఎందుకు జరిగిందని అతను రాత్రంతా కలవరపడుతూ ఉన్నాడు. ఈ ఆలోచనలతో అతడు నిద్రపోలేక ఏడ్చాడు కూడా. తెల్లవారుఝామున 4 గంటల సమయంలో అతనికొక దృష్టాంతం వచ్చింది. బాబా కనిపించి, "అరేయ్ శ్యామ్‌దాస్, ఇలా ఏడవకు. నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది. అది నీకు భవిష్యత్తులో తెలుస్తుంది. ఇప్పుడు లే!" అని అన్నారు. బాబాకు తనపట్ల ఉన్న ప్రేమను, శ్రద్ధను చూశాక అతడు సాంత్వన పొందాడు.

 తరువాయి భాగం కోసం బాబా పాదాలు తాకండి.

5 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Telugulo miru chestunna Saiseva koniyadadaginadi.Baba mimmu ellavelala asirvadinchunugaka.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo