సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 305వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా మార్గాలు అంతుబట్టనివి
  2. సాయికృప ఎప్పుడూ అద్భుతమే!

బాబా మార్గాలు అంతుబట్టనివి

మలేషియాకు చెందిన ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

బ్లాగును క్రమంతప్పకుండా చదువుతున్న భక్తులందరికీ శుభదినం. ప్రతిదీ సరిగ్గా జరిగితే నా అనుభవాన్ని పంచుకుంటానని బాబాకు వాగ్దానం చేశాను. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నా వివాహం జరిగి 2 సంవత్సరాలైంది. మాకింకా సంతానం లేదు. నాకు, నా భర్తకు పిల్లలంటే చాలా ఇష్టం. కానీ పెళ్ళైన మొదట్లో సంతానం గురించి కొంతకాలం తరువాత ఆలోచిద్దామని అనుకున్నాం. మరోవైపు మా అమ్మ రెండు సంవత్సరాలైనా మాకు సంతానం లేదని బాబాని తీవ్రంగా ప్రార్థిస్తూ ఉండేది. మేము కూడా సమయం వచ్చినప్పుడు బాబా మాకు సంతానాన్ని ప్రసాదిస్తారని నమ్మకంతో ఉండేవాళ్ళం. ఇదిలా ఉంటే, కొంతకాలంగా నాకు నెలసరి సక్రమంగా రావడంలేదు. ఒకసారి నెల ఆలస్యమైతే, మరోసారి 2 నెలలు ఆలస్యం అయ్యేది. 2019 జనవరి, ఫిబ్రవరి నెలల్లో నెలసరి రాకుండా మార్చిలో వచ్చింది. తరువాత మళ్ళీ ఏప్రిల్, మే నెలల్లో రాలేదు. బహుశా జూన్‌లో వస్తుందేమో అని అనుకుంటూ, "బాబా! నాకు నెలసరి సక్రమంగా వచ్చేలా చేయండి" అని బాబాను ప్రార్థిస్తుండేదాన్ని. నా అండాశయాలలో, గర్భాశయంలో ఏదైనా సమస్య ఉందేమో, అందుకే నెలసరి క్రమంగా రావడం లేదేమో, ఒకవేళ అదే జరిగితే నాకు సంతానం కలిగే అవకాశం ఉండదేమో అని చాలా ఆందోళనగా ఉండేది. మరోవైపు కడుపు ఉబ్బరంతో బాధ. కొన్నిసార్లు ఏవైనా ఆహారపదార్థాలను చూస్తే నాకు వికారంగా అనిపించేది కానీ, వాంతి అయ్యేది కాదు. మూత్రవిసర్జన ఎక్కువగా జరుగుతుండేది. నేను పడుతున్న బాధను మావారితో చెప్పాను. ఆయన వాంతి అవ్వడానికి మందు తీసుకోమని చెప్పారు కానీ నేను అలా చేయలేదు. ప్రతిరాత్రి నేను నా  పొట్టమీద ఆయింట్‌మెంట్ తోపాటు బాబా ఊదీ రాసి, "ఉబ్బరాన్ని నయం చేయమ"ని బాబాను ప్రార్థిస్తుండేదాన్ని. ఇలా ఉండగా ఒకరోజు వాతావరణ మార్పు కోసం నేను మా పుట్టింటికి వెళ్ళాను. మా అమ్మ నన్ను చూస్తూనే ఆశ్చర్యంగా, "ఎందుకిలా ఉన్నావు? కడుపు ఎందుకు కాస్త పెద్దదిగా కనిపిస్తుంది?" అని అడిగింది. నేను, "నాకు 2 నెలలుగా నెలసరి రాలేదు, కడుపు ఉబ్బరంగా ఉంది. అందుకే నా కడుపు పెద్దదిగా కనిపిస్తుంది" అని చెప్పాను. అందుకామె, “బహుశా నువ్వు గర్భవతివి కావచ్చు” అంది. కానీ అలాంటిదేమీ లేదని నాకు తెలుసు. ఎందుకంటే గర్భవతినన్న సంకేతాలేవీ లేవు. ఆ విషయమే అమ్మతో చెప్పాను. అప్పుడు మా అమ్మ ఒకసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదించమని చెప్పింది. కానీ గైనకాలజిస్ట్‌ని సంప్రదిస్తే కడుపులో ఏదైనా తిత్తి పెరుగుతుందనో లేదా ఇంకా ఏమైనా ప్రతికూల విషయాలు వినాల్సి వస్తుందేమోనని నేను చాలా భయపడ్డాను. అయినప్పటికీ నేను, "దయచేసి నాకంతా మంచి జరిగేలా చూడమ"ని బాబాను ప్రార్థించి గైనకాలజిస్ట్‌ అపాయింట్‌మెంట్ తీసుకున్నాను. తరువాత నేను, నా భర్త గైనకాలజిస్ట్ వద్దకు వెళ్ళాము. ఆమె నన్ను అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడం కోసం పడుకోమని చెప్పింది. ఆమె నా గర్భాశయాన్ని స్కాన్ చేస్తూ నవ్వుతూ, “అభినందనలు, మీరు తల్లి కాబోతున్నారు!” అని చెప్పింది. ఎలా స్పందించాలో నాకు తెలియక అవాక్కైపోయాను. ఎందుకంటే ఆ వార్తను అంత త్వరగా వింటామని మేము అస్సలు ఊహించలేదు. మా ఆనందానికి అవధులులేవు. బాబా ఎప్పుడు ఎలా అనుగ్రహిస్తారో అస్సలు అర్థం చేసుకోలేము. "థాంక్యూ సో మచ్ బాబా!"

ప్రియమైన భక్తులారా! బాబాను, ఆయన టైమింగ్ ను నమ్మండి. ఆయన నాకోసం ఈ ప్రణాళికతో ఉన్నందునే నేను ఇంటర్వ్యూలో విజయవంతం కాలేకపోయాను, ఉద్యోగం పొందలేకపోయాను. నాకా విషయం అప్పుడు అర్థంకాక చాలా బాధపడ్డాను. కానీ బాబా ఏమి చేసినా మన మేలుకోసమే అని ఇప్పుడు అర్థం చేసుకున్నాను. సంతానం కోసం ఎదురుచూసే వాళ్ళు బాబాను ప్రార్థించి, ఆయనపై భారం వేయండి. ఆయన సృష్టికర్త. "బాబా! నన్ను, నా బిడ్డ క్షేమాన్ని చూసుకోండి. సులభంగా, సురక్షితంగా నార్మల్ డెలివరీ అయ్యేలా అనుగ్రహించండి".

సాయికృప ఎప్పుడూ అద్భుతమే!

సాయిభక్తురాలు శ్రీమతి ప్రీతీరావు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

ముందుగా, "నా అనుభవాన్ని ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి బాబా!" భక్తులందరికీ జై సాయిరాం! నేను సాయిభక్తురాలిని. బాబా ఆశీస్సులతో నేను చాలా అనుభవాలను పొందుతున్నాను. ఆయనకు వాగ్దానం చేసిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మేము హైదరాబాదులో నివాసముంటున్నాము. కొన్ని కారణాల వలన మేము ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాలని అనుకున్నాము. అయితే హైదరాబాదులో సరసమైన ధరలో అద్దెకు విశాలమైన ఫ్లాట్ దొరకడం చాలా కష్టం. అందువలన నేను ఈ సమస్యను పరిష్కరించమని బాబాని ప్రార్థించాను. ఆయన ఎంత గొప్పగా అనుగ్రహించారో మాటల్లో చెప్పలేను. మేము ఉంటున్న ఫ్లాట్‌ను ఖాళీ చేసే సమయానికి బాబా ఆశీస్సులతో అదే అపార్ట్‌మెంట్‌లో మరో ఫ్లాట్ ఖాళీ అయ్యింది. వేరే అపార్ట్‌మెంట్‌కు వెళ్లే అవసరం లేకుండా సరసమైన అద్దెతో మాకు మంచి ఫ్లాట్ లభించింది. అలా బాబా దయతో వేరే ఎక్కడికీ వెళ్ళకుండా కొత్త ఫ్లాట్‌లోకి మారాము.

బ్యాంక్ లావాదేవీలకి సంబంధించిన మరో సమస్యలో కూడా బాబా నాకు రావాల్సిన మొత్తాన్ని పొందడంలో సహాయం చేశారు.

"చాలా చాలా ధన్యవాదాలు బాబా! మీ చల్లని కృప ఎప్పుడూ మీ భక్తులపై ఇలాగే కురిపించండి".


3 comments:

  1. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo